Unfinished Painting

DRUSHYA DRUSHYAM PHOTO

ఆది అంతమూ లేని జీవనాడి ఒకోసారి ‘చిత్ర’మై ఘనీభవించి, మళ్లీ కాలవాహికలో దొర్లుతూనే ఉంటుంది, అక్షరమై………….

*
ఒకానొక ఉదయం మధ్నాహ్నమైంది.

ఒక చిత్రకారుడి ఇంటిలోకి ప్రవేశించగానే అక్కడ అనుకున్నదేమీ లేదు. శాంతి లేదు. స్వప్నమూ కానరాలేదు. సమాధిలో ఉంది జీవితం. లేదంటే ఒకానొక పురాతన ఆవాసంలో సరికొత్తదేమీ లేనంత నిర్లిప్తత తాండవిస్తున్నది. ఆయనింకా లేవనూ లేదు. ఇల్లంతా నిర్విరామ నిశ్శబ్దపు అలికిడికి ఉల్లాసం హరించుకుపోగా విసుగు పెరుగుతున్నది. పావుగంట తర్వాత మెత్తటి అడుగులతో, ఒకానొక అందమైన ఒడిషా పల్లెపడచు లయాత్మక ప్రవేశం.

చిత్రం. ఆమె చిత్రకారిణి కాదు. కాదుగానీ అప్పటిదాకా లేని కళ ఏదో అకస్మాత్తుగా తెచ్చింది. ప్రేమగా పాలు, బిస్కట్లు ఇచ్చింది. ఎక్కడి వస్తువులు అక్కడే గప్‌చుప్‌గా ఉండగా, పేరుకున్న దుమ్ము మాత్రమే చిర్నవ్వులు చిందిస్తుండగా ఆమె నిదానంగా నడుం వంచి ఊడ్చింది. అప్పుడు అక్కడ సోఫాలోంచి లేచి నిలబడటం.. ఆ పరిసరాలు ఊడ్చినాక కూచోవడం, ఎవరింట్లోనైనా అంతే అన్నంత మామూలు తర్వాత ఆమె అదృశ్యమై అతడు ప్రత్యక్షమయ్యాడు, నిద్రకళ్లతో…

చిత్రాతిచిత్రం. అతడు కన్ను తెరిచి మూయగానే, ఒక్కపరి వేల పక్షుల రెక్కల చప్పుడు, కువకువలు మళ్లీ సద్దుమణిగిన సవ్వడి అతడి విశ్వసనీయమైన కరచాలనంతో…

మళ్లీ వెళ్లిపోతున్నాడు ఆ ఇల్లేమో ఒక నిర్వ్యాపారమై ఒక బద్దకించిన స్త్రీలా బరువైన కురులతో, నిండు చనులతో మెల్లగా మళ్లీ వైరాగ్య మండపంలా మారపోతుండగా మళ్లీ ఆ ఇల్లు బావురుమన్నది.

మళ్లీ పనిమనిషి కనిపించగానే మళ్లీ ఆ ఇల్లు ఉయ్యాలలా ఊగుతోంది. మెల్లగా శిశువు ఏడ్పు పసిప్రాయం ఎక్కడా దరిదాపుల్లో లేదు. తల్లీ కానరాలేదు. అంతా అలికిడిలేని విరాగమే.

‘ఇక్కడికి కాదు, స్టూడియోకి వెళ్లాల్సింది’  ఆ పనిమనిషి ఓదార్పు వచనం.

‘తెలియక వచ్చాను’  నా జవాబు.

అరగంట తర్వాత మళ్లీ ఆయన వచ్చాడు. ఈసారి చెట్టు కదులుతున్నట్టు వడివడిగా ఆలీవ్ గ్రీన్ దుస్తులతో తయారై వచ్చి సడెన్‌గా జీపు స్టార్ట్ చేసి నన్ను కూచోబెట్టుకుని వెళ్లసాగాడు.

పావుగంటలో స్టూడియో. అక్కడకు చేరుకుంటూనే ఆయన ఇంట్లోంచి వీధిలోకి ప్రవేశించినంత ఆత్రంగా, ఆనందంగా దిగాడు. చకచకా మెట్లెక్కసాగాడు. ఉత్సాహంగా కనిపించసాగాడు. ఇక స్టూడియో. అందులోకి ప్రవేశించగానే అతడి గొంతు మార్దవమైంది. మాటలు కలిపాడు. ఊట బావి గుర్తుకు వచ్చింది. దప్పిక తీర్చే తీయటి నీళ్ల జలజల క్రమక్రమంగా దోసిలి పట్టాను. కానీ తీరదే దాహం?

అతడు, తన చిత్రాలు, పుస్తకాలు, చిత్రకళతో పాటు తాను సేకరించే విసన కర్రలు, మన రుమాలు కాదు, దొరటోపీలు-హ్యాట్స్-వాటి కలెక్షన్-అలాగే తన స్టాఫ్, మూడు నాలుగు అంతస్థుల్లో తాను గీసిన చిత్రాలు, రూపొందించిన మ్యూరల్స్, కొన్ని శిల్పాలూ, కవితా చరణాలూ, వీటన్నిటి గురించి చెప్పగా క్షణాలు గడిచిపోతున్నాయ్. నా మనసంతా ఇంటిమీదే. అక్కడ ఆ స్త్రీ బాగున్నది. ప్రేమగా, శాంతంగా, కళలా…

కానీ ఇతడు మాటలు మాటలు.. వాటితో ఇతడు. ఉక్కిరిబిక్కిరవుతూ నేను, నా చూపులు. ఒక్క పరి నా కన్నులు అసంపూర్ణమైన ఈ చిత్రంపై పడ్డాయి. అప్పటిదాకా సుషుప్తిలో జోగుతున్న నా త్రినేత్రం టక్కున మేలుకున్నది. ఇదిగో, ఇక్కడే కన్నులు, నా కెమెరా కన్నూ ‘ఫినిష్’ – ఒక్కటైంది, క్లిక్ మని!

ఎందుకనో, ఏమిటో, ఎంతగానో అంతదాకా ఏదీ ఫొటో తీయబుద్దవలేదు. కానీ, దీంతో ప్రారంభం. ఇక ఎన్ని ఫొటోలో!

బహుశా ఇదీ అతడు. ఈ చిత్రమే అతడు. అతడెవరో తెలిపే చిత్రమే ఇది.

ఇల్లూ వాకిలీ స్టూడియో ఇవేవీ కాదు, కాన్వాసు. అదే అతడి వినువీధి, వాహ్యాళి. అదే అతడి చిత్తరువు.

అది దేహమా ఆత్మా, ఆడదా మగాడా అన్నది కాదు. ఆడమ్ అండ్ ఈవ్ తిన్న ఆపిల్ పండంత హృదయమే అతడిది. కానీ, తనది అసాధారణమైన శాక్తేయం. స్థలమూ, కాలమూ లేని పురాగానమో ఆధునికానంతర పునర్నివాసమో గానీ కాన్వాసుపై అతడు స్త్రీపురుషుడు. వట్టి మనిషి. సంయుక్తం కాని వ్యక్తిత్వం. పూర్ణం కానీ కాయం. తృప్తినివ్వని గాయం.

అతడి చిత్తమూ చిత్రమే అన్నట్టు అక్కడ ఆయన.

క్షణాలు, నిహిషాలు, ఘడియలూ దాటి ఒక పూటంతా వెచ్చించిన తర్వాత, అటు తర్వాత రెండేళ్లకు మళ్లీ ఈ బొమ్మ, తిలక్ అన్నట్టు, ‘చిమ్మ చీకటి కరేల్మని కదిలింది’, ఇలా…

బహుశా, అసంపూర్ణమే సంపూర్ణం.
ఇంకా ఎన్నో ఉన్నా ఇదే సంపూర్ణం, అసంపూర్ణం.

ప్రసిద్ధ చిత్రకారులు జతిన్‌దాస్‌కు, ముఖ్యంగా మీతో పంచుకుంటున్న తన ‘Unfinished paintingకు ధన్యవాదాలు.

~కందుకూరి రమేష్ బాబు

మీ మాటలు

*