కలలకే కలవరింతలు,రాగాలకే పులకింతలు!

Ramesh+Naidu+1292932446

“మురళీధరుడైన రాముడు, కోదండధరుడైన కృష్ణుడు, చక్రధరుడైన శివుడు, చంద్రధరుడైన విష్ణువు, బుధ్ధుడి సౌందర్య లహరి, ఆదిశంకరుడి ధర్మపథం, ఈక్వేటర్ లో హిమాలయాలు, ఉత్తర ధృవంలో హిందూ మహాసముద్రం – ఇవి కలుసుకొనే తీరాలు. కలలకే స్వప్నాలు – ఒక్క ముక్కలో చెప్పాలంటే అదృశ్యాలు, అసాధ్యాలు, కల్పనా బలం కొ్ద్దీ తలపెట్టే అఘాయిత్యాలు.

అయినా ఇవి సాధ్యాలే. కల్పనలు కూడా సత్యాలే. అటువంటి అభూతకల్పన అక్షరసత్యంగా మారిన అపురూప సంఘటన పేరే రమేష్ నాయుడు. ”

ఇవి రమేష్ నాయుడు  గురించి, వేటూరి తను రచించిన ” కొమ్మకొమ్మకో సన్నాయి ” పుస్తకంలో రాసిన పరిచయవాక్యాలు. ఇంతకు మించిన అతిశయోక్తులతో రమేష్ నాయుడు గారిని పొగడటం అసాధ్యమేనేమో!

వేటూరి తన పుస్తకంలో ఎవ్వరికీ ఇవ్వనంత గౌరవం రమేష్ గారికి ఇస్తూ రెండు అధ్యాయాలు ఆయనకి కేటాయించారు. కానీ నాకు మాత్రం, రమేష్ నాయుడు, అనంగానే గబుక్కున గుర్తుకొచ్చే కవి, డా.సి.నారాయణ రెడ్డి గారే.

రమేష్ నాయుడు యాభైల్లో, అరవైల్లో అడపా దడపా తెలుగు సినిమాలకి సంగీతం సమకూర్చినా, డెభ్భై రెండులో, “అమ్మ మాట”, “తాతా మనవడు” చిత్రాలకి సంగీతం అందించటం ద్వారా పునఃప్రవేశం చేశారు.

“అమ్మ మాట” లో, “మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు” అని సినారె మొదలెడితే, “లగ్గమెప్పుడ్రా మావా అంటే మాఘ మాసం  ఎళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే” అంటూ రమేష్ గారు పూర్తి చేసారని భోగట్టా. యల్.ఆర్. ఈశ్వరి గొంతులో ఈ ‘ఐటం సాంగు’ గత నలభై ఏళ్లుగా ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంది. ఈ బాణీని, ఈ పాటలోని కొన్ని పంక్తులనీ యధాతధంగా ‘దేవదాసు’ (2005) లో మళ్ళీ వాడుకున్నారు.

రమేష్ నాయుడు అనంగానే, సి.నా.రె గుర్తుకు రావటానికి ఈ పాట కారణం అనుకొనేరు. వారివురి కలయిక దీనితో ప్రారంభమైనా, ఆ తరువాత వీరు మన తెలుగు సినీ కవిత్వంలో కలకాలం గుర్తుండిపోయే సాహితీ సృష్టి జరిపారు.

“జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహినీ జానకీ

వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణీ

రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా”

అంటూ ఒప్పెనలా పొంగుతున్న మోహావేశాన్ని ఒక ప్రియుడు తన నాయిక కోసం వ్యక్తపరచినా

“ఏ ఫలమాశించి మత్త కోకిల ఎలుగెత్తి పాడును
ఏ వెల ఆశించి పూసే పువ్వు తావి విరజిమ్మును
అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్ధం

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేను”

అంటూ ఒక కళాపిపాసి లలితకళలకు నివాళులర్పించినా

“సరళ తరళ నీహార యవనికల .. మెరిసే సూర్య కళికా

మృదుల మృదుల నవ పవన వీచికల … కదిలే మదన లతికా

నీ లలిత చరణ పల్లవ చుంబనమున  పులకించును వసుధ జయసుధా…
ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో .. ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో

ప్రణయ గగనమున ప్రథమ రేఖవో … రేఖవో శశిరేఖవో సుధవో జయసుధవో”

అంటూ తన ప్రేయసికి తాను చెప్పేది అర్థం అవుతోందా లేదా అన్న ధ్యాస లేకుండా ఓ ప్రియుడు తన చెలిని వర్ణించినా,

ఆ ఘనత, కవి గారితో పాటు రమేష్ నాయుడు గారికి కూడా చెందుతుంది. అంత చిక్కని సాహిత్యం పది మందికీ చేరిందీ అంటే, రాసిన ఆ క్లిష్ఠతరమైన పంక్తులకు ఒక సులువైన బాణీ కట్టటం నుంచీ, వాయిద్యపు హోరు ఆ పదధ్వనులను కప్పేయకుండా చూసుకోవటం, దానికి తోడు, శాస్త్రీయ సంగీత రాగాలలోనే నిబద్ధతతో స్వరపరచటం వరకూ, రమేష్ నాయుడు చూపించిన అసమాన ప్రతిభే కారణం.

అదే సి.నా.రె కవిత్వం, “ఆడవే మయూరి” పాటలో ఆ కట్టిన బాణీ (‘మామ’కి క్షమాపణలతో) వల్లనో, లేక ఆది పాడిన విధానం వల్లనో, అంతగా ఆస్వాదించలేమనిపిస్తుంది.

శాస్త్రీయ రాగాలు, వాయిద్యాల మాట వచ్చింది కాబట్టి ఇక్కడ రమేష్ నాయుడి గారి బాల్యకౌమార్యాల గురించి కొంత ప్రస్తావించుకోవాలి. 1933లో కృష్ణా జిల్లా కొండపల్లిలో జన్మించిన రమేష్ నాయుడు చిన్న వయసు లోనే బొంబాయి కి పారిపోయి అక్కడ ఒక వాయిద్యాలు అమ్మే దుకాణంలో ఎన్నో సంవత్సరాలు పని చేసి, యుక్త వయసులోనే బెంగాలీ, మరాఠీ, హిందీ భాషలలో సినిమాలకి సంగీతాన్ని అందించారు.
ఆ వాయిద్యాల దుకాణంలో పని చేసిన అనుభవం వల్లనే నేమో, వాటిని ఎంతో సంయమనంతో, చాలా పొదుపుగా వాడేవారు, తన పాటల్లో. అలాగే, శాస్త్రీయ సంగీతం ఏ గురువు దగ్గరా నేర్చుకోకపోవటంవల్ల, ఆ రాగాలు వాడినప్పుడు ఎక్కువ ప్రయోగాలు చెయ్యకుండా, ఎంతో నిబద్ధతతో బాణీలు కట్టేవారు.  “ఎక్ తారా” ని ముఖ్య వాయిద్యంగా  ఉపయోగించి, కల్యాణి లో కట్టిన “జోరు మీదున్నావు తుమ్మెదా” పాట అజరామరం.

ఆయనకి కల్యాణి చాలా ఇష్టమైన రాగాల్లో ఒకటనుకుంటాను. పైన చెప్పుకున్న సినారె పాటల్లో “లలిత కళారాధనలో”, “ప్రణయ కావ్యమున”, ఈ రాగంలో కట్టినవే.

వేటూరితో చేసిన పాటల దగ్గర కొచ్చేసరికి ఒక చిన్న పక్క దోవ పట్టి నా అనుభవం ఒకటి చెప్పుకోవాలి. నాగార్జున సాగర్ లో, ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజులవి. శనివారం రాత్రి టి.వి. లో వచ్చే తెలుగు సినిమా కోసం చాలా మంది వేచి చూసే వాళ్ళం. ఓ శనివారం “సువర్ణ సుందరి” అని సినిమా మొదలయ్యింది. చంద్రమోహన్ హీరో. కలలో ఎవరో సుందరి కనపడుతుంది. హీరో కవిత్వం చెప్పేస్తూ ఉంటాడు. హాలు మొత్తం ఖాళీ! నేను, నా మిత్రుడు ఒక్కడు మాత్రమే మిగిలాం. ఆ వయస్సుకి, ఆ కథా, కవి అయిన ఆ హీరో చెప్పే కవిత్వం అద్భుతంగా అనిపించాయి. ఇద్దరం సినిమా పూర్తయ్యే దాకా అస్సలు కదలలేదు.

ఆ తరువాత ఎన్నో ఏళ్ళకి గానీ  అది హిందీ సినిమా “నవరంగ్” కి రీమేక్, ఆ సినిమాలో మా ఇద్దరినీ కట్టి పడేసిన కవిత్వం వేటూరిదీ, సంగీతం రమేష్ నాయుడిదీ, అని తెలిసిరాలేదు. ఎక్కువగా ప్రాచుర్యం పొందక పోయినా కానీ, ఆ సినిమా పాటలు అలా గుర్తుండి పోయాయి.

“ఇది నా జీవితాలాపనా…ప్రియదేవతాన్వేషణా
ఏమైనదో? ఎట దాగున్నదో! ఎన్నాళ్ళు ఈ వేదనా…?”

“ఊహవో ఊపిరివో..నా జీవన రసమాధురివో

వివర్ణమైన ఆశల ముంగిట..సువర్ణసుందరివో”

“మధువనాంతముల  మరు  వసంతములు  చిరు లతాంతములు వెదజల్లగా

దశ దిశాంతముల జత శకుంతములు గల  మరందములు ఎద జల్లగా”

వేటూరి ముందరే సమకూర్చిన స్టాకు బాణీల్లో పదాలు ఇరికించే కష్టం లేకుండా స్వేచ్చగా తన కలాన్ని కదిపితే ఎలా పాటలు వ్రాయగలరో ఈ సినిమాలోని పాటలే ఒక నిదర్శనం. ఇవి వినదలుచుకున్న వాళ్ళు ఈ క్రింది లింకులో ఆ పాటలు వినచ్చు.
http://www.allbestsongs.com/telugu_songs/Search-Telugu-Movie-Songs.php?st=suvarna+sundari&sa=Go%21

డెభ్భైల తరవాత వచ్చిన సంగీత దర్శకులలో, కవి పాటను వ్రాసిన తరవాతే బాణీలు కట్టిన సంగీత దర్శకుడు, బహుశా రమేష్ నాయుడు ఒక్కళ్ళేనేమో! వేటూరికి అందువల్లనే రమేష్ నాయుడు అంత ప్రీతిపాత్రుడయ్యాడని నా అనుమానం.

“నవమి నాటి వెన్నెల నేను ..దశమి నాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతి రేయి.. కార్తీక పున్నమి రేయి..”

“మెరుపులా మెరిశావు… వలపులా కలిసావు

కనులు మూసి తెరిచేలోగా..నిన్నలలో నిలిచావూ… నిన్నలలో నిలిచావూ”

“సిగ్గూ పూబంతీ యిసిరే సీతా మాలచ్చీ
మొగ్గ సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ”

లాంటి మరవలేని పాటలెన్నో రమేష్ నాయుడు, వేటూరి కాంబినేషన్ లో వచ్చాయి.

రమేష్ నాయుడు సంగీతం సమకూర్చిన మొత్తం తెలుగు సినిమాలు వందకి మించవు. దానికి ఆయన పనిచేసిన విధానం ఒక కారణమేమో. రోజుకి అయిదారు పాటలు అవలీలగా “కొట్టి పారేసే” దిగద్దర్శకులున్నప్పుడు, వాళ్ళు కొట్టిన బాణీలకి అర్థం పర్థం లేకపోయినా, అర్థమేదో ఉన్నట్టుగానే ఉంది, అనిపించేటటువంటి కొత్త కొత్త  పద ప్రయోగాలు చేసి అంతే స్పీడులో పాట రాసి పారేసేందుకు సిద్ధమైన కవికోవుదులున్న వాతావరణంలో, రమేష్ నాయుడు చాదస్తం మనిషే!

రమేష్ నాయుడు బాణీ కట్టాలంటే ఆయనకి ఆ పాట సందర్భం, పాత్రల స్వభావం లాంటి వివరాలే కాకుండా, ఆ పాట పంక్తులు కూడా అతడికి స్పూర్తి నిచ్చేవి లాగా ఉండాలి. ఇన్ని సమకూరితే కానీ ఆయన బాణీ కట్టడానికి కూర్చోనే వాడు కాడట.

ఆయన ఆచారాలకి అలవాటు పడ్డ దర్శకులు మటుకూ ఆయనతోనే తమ సినిమాలకు సంగీతం చేయించేవారు. దాసరి నారాయణరావు గారు, తన తొలి చిత్రం “తాతా మనవడు” సినిమాతో మొదలైన రమేష్ నాయుడి సంగీత సాంగత్యాన్ని, తను నిర్మించిన దాదాపు అన్ని సినిమాలలోనూ కొనసాగించారు.

“అనుబంధం ఆత్మీయత అంటా ఒక బూటకం..

ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం”

ఈ సినిమాలోని ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న పాట. దీని తరువాత వరుసగా “సంసారం సాగరం”, “బంట్రోతు భార్య”, “తూర్పు పడమర”, “రాధమ్మ పెళ్లి”,  “జయసుధ”, “శివరంజని”, “చిల్లరకొట్టు చిట్టెమ్మ”, “సుజాత” వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి.

Megha_Sandesham

“మేఘసందేశం” సినిమాతో తో వీరిద్దరూ తమ తమ కేరియర్స్ లోని శిఖరాగ్రాలకి చేరుకొన్నారు. ఇద్దరూ జాతీయ అవార్డులను అందుకొన్నారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఈ రోజుకి కూడా జాతీయ అవార్డును గెలుచుకొన్న ఏకైక తెలుగు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు (మామ, రాజాలకు తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చినా, వారు తెలుగు వారు కారు).

దేవులపల్లి భావకవిత్వ ప్రేరణతో రమేష్ నాయుడు కట్టిన ఈ బాణీ కొన్ని శతాబ్దాలు నిలుస్తుందనటం అతిశయోక్తి కాదు.

“తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల… చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా దాహమా చింతలా వంతలా… ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా..

ఆకులో ఆకునై, పూవులో పూవునై… కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా”

http://www.youtube.com/watch?v=xBh2z9CWhkM

 

జయదేవుని అష్టపదులు “ప్రియే చారుశీలే”, “రాధికా, కృష్ణా రాధికా”, వేటూరి, “నిన్నటి దాకా శిలనైనా”, “పాడనా వాణి కల్యాణిగా”, ఇక దేవులపల్లి పద్యాలూ, పాటలూ, వెరసి, తెలుగు సినీ సంగీతంలో ఒక మైలురాయి, ఈ సినిమా సంగీతం!

రమేష్ నాయుడి చెయ్యి విడువక నడచిన దర్శకులలో దాసరి తరవాత చెప్పుకోవలసిన వారు విజయనిర్మల. వారి కాంబినేషన్ లో కూడా ఎన్నో సినిమాలు, గుర్తుండి పోయే పాటలు.
నాకు అన్నిటి లోకి ఇష్టమైన పాట “మీనా” చిత్రంలోని “శ్రీరామ నామాలు శత కోటి, ఒక్కొక్క పేరూ, బహుతీపి”. ఆ నామాల్లోని తియ్యదనం రామభక్తులకే అనుభవసాధ్యమేమో కానీ, ఆ పాటలోని రమేష్ నాయుడు గారు జొప్పించిన తియ్యదనం, నిస్సందేహంగా అందరూ ఆస్వాదించవచ్చు.  “మల్లె తీగ వంటిది మగువ జీవితం..”, “పెళ్ళంటే నూరేళ్ళ పంట” అదే సినిమాలో  ఆ రోజుల్లో బహుళ ప్రాచుర్యం పొందిన పాటలు.

వీరిరువురి కాంబినేషన్ లో “ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ…” (దేవుడే గెలిచాడు), “అరవైలో ఇరవై వచ్చిందీ..” (భోగిమంటలు), “ఏ ఊరు, ఏ వాడ అందగాడా, మా ఊరు వచ్చావు సందకాడ” (హేమాహేమీలు) లాంటి కొన్ని గుర్తుపెట్టుకోదగ్గ పాటలతో బాటు,  కొన్ని మర్చిపోదగ్గ ఫక్తు కమర్షియల్ బీట్ పాటలూ ఉన్నాయి.

ఆయన ఘన విజయాలతో పాటు కొన్ని అపజయాల గురించి కూడా చెప్పుకోవాలి. విజయనిర్మల, రమేష్ నాయుడు కాంబినేషన్ లో వచ్చిన “స్పెక్టాక్యులర్ ఫైల్యూర్”, “దేవదాసు”. నిజానికి “సుబ్బరామన్-ఘంటసాల-సముద్రాల” పాత దేవదాసు పాటలు మన మనస్సులో ఎంతగానో అల్లుకుపోయిన నేపథ్యంలో, మళ్ళీ ఆ సినిమా రీమేక్ చేయ్యలనుకోవటం, దానికి రమేష్ నాయుడు సంగీతం అందించటం, ఒక పెద్ద దుస్సాహసం.

ఓ “పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో..” పాటని ఎంత “మేఘాల మీద సాగాలి” అనిపించినా అందుకోవటం సాధ్యమా! ఈ సినిమా పాటల పైన ఇంకా అంత కంటే పునరావలోకనం అనవసరం.

విజయనిర్మల తరవాత, జంధ్యాల రమేష్ నాయుడు గారితో కలిసి పనిచేసి మరి కొన్ని ఆణిముత్యాలు అందించారు.

Mudha-Mandharam

“ముద్దుకే ముద్దొచ్చే మందారం ముద్ద మందారం…” అంటూ 1981 లో మొదలైన వీరి సాహచర్యం, రమేష్ నాయడు 1987లో తుది శ్వాస తీసుకొనే వరకూ కొనసాగింది.  “అలివేణీ ఆణిముత్యమా..”, “నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి” పాటలు కూడా వారి తొలి చిత్రం (కాంబినేషన్ లో)  “ముద్దమందారం” లోనివే.

“మల్లెపందిరి” కింద  “ఓ సతీ నా గతీ.. ఓహో నా శ్రీమతీ ఆహా సౌభాగ్యవతీ” అంటూ, “రెండు జళ్ళ సీత” తో  “కొబ్బరి నీళ్ళ జలకాలాడి”, “తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు..” అంటూ “శ్రీవారికి ప్రేమ లేఖ”  వ్రాసి, కొన్ని మధుర జ్ఞాపకాలు మిగిల్చారు.

“మనసా త్రుళ్ళి పడకే..అతిగా ఆశ పడకే

అతడికి నీవు నచ్చావో లేదో..ఆ శుభ ఘడియ వచ్చెనో రాదో

తొందర పడితే అలుసే తెలుసా.. మనసా త్రుళ్ళి పడకే”

పెళ్లి చూపుల తరువాత, రిజల్టు కోసం ఎదురు చూసే ఆ కన్నె మనసుని వేటూరి ఎంత అందంగా వర్ణించారో, అంత సున్నితంగానూ, రమేష్ నాయుడు దానికి బాణీ కట్టారు. పూర్తి తెలుగుదనం ఉట్టి పడే పాట ఇది.
http://www.youtube.com/watch?v=7_YMMsNXNl4

Srivariki Premalekha

 

“మేఘసందేశానికి” తన  సంగీతాన్ని జతచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్న రమేష్ నాయుడు ఆనందభైరవి తో తన స్థానాన్ని అక్కడే పదిలం చేసుకున్నాడు.

అమృతవర్షిణి రాగంలో కట్టిన “చైత్రము కుసుమాంజలి” పాట, నాకు ఆ సినిమా పాటలన్నిటిలోకీ ఇష్టమైన పాట. ఆ పాట సాహిత్యం వేటూరి రాగ జ్ఞానానికి కూడా ఒక ప్రతీక. ఆ రాగంలోని స్వరాలనే పాట సాహిత్యంలో జొప్పించి చక్కటి ప్రయోగం చేశారు.

“పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం..”,  “బ్రహ్మాంజలీ..”, “కొలువైతివా రంగశాయి” లాంటి పాటల సృష్టీ ఈ సినిమాలోనే జరిగింది. కానీ 1983 తెలుగు సినీసంగీతంలో ఒక స్వర్ణ సంవత్సరం. “సాగర సంగమం”, “మేఘసందేశం” కూడా అదే సంవత్సరం లో విడుదల అవ్వటంతో, ఈ సినిమా పాటలకి దక్కాల్సిన అవార్డులు దక్కలేదేమోననిపిస్తుంది.

రమేష్ నాయుడు గారి ఆఖరి సినిమా, “స్వయంకృషి”. ఆ సినిమా విడుదల ఒక్క రోజు ముందు ఆయన దివంగతులయ్యారు. అందులోని ప్రతి పాటా బాగుంటుంది. “పారా హుషార్”, “హల్లో హల్లో డార్లింగ్…” లాంటి సరదా పాటలతో పాటు ““సిన్నీ సిన్నీ కోరికలడగ” వంటి కలకాలం నిలిచిపోయే పాటలూ ఉన్నాయి.

రమేష్ నాయుడు, “కల్యాణి” రాగం చాలా విరివిగా వాడారని ముందర చెప్పుకున్నాం. పైన ప్రస్తావించిన చాలా పాటలు ఈ రాగం లోనివే. అయితే “శివరంజని”లో కూడా చాలా చక్కని పాటలు కట్టారు. “శివరంజనీ, నవరాగిణీ”, అని “తూర్పు పడమర” చిత్రం లో కడితే, “అభినవ తారవో.. నా అభిమాన తారవో” అంటూ “శివరంజని” సినిమాలో ఆ రాగాన్ని వాడారు.

అదే రాగానికి, జేసుదాసు గాత్రం, వేటూరి సాహిత్యం కలిసినప్పుడు, రమేష్ నాయుడు కట్టిన బాణీకి, ఆయనకూ, జేసుదాసుకూ కూడా నేషనల్ అవార్డులొచ్చాయి. ఆ “ఆకాశ దేశాన మెరిసేటి మేఘం” పసుపులేటి రమేష్ నాయుడు నేడు మన మధ్య లేకపోయినా, ఆయన కట్టిన స్వరహారాలు, స్వయంప్రకాశంతో ఎప్పటికీ మెరుస్తూనే ఉంటాయి!

http://www.youtube.com/watch?v=59h1_ZDnfcA

వేటూరి పరిచయవాక్యాలతో ప్రారంభించిన ఈ వ్యాసాన్ని,  ఆయన రమేష్ నాయుడుకి నివాళులర్పిస్తూ రాసిన చివరి మాటలతోనే ముగిస్తాను.

“నేను ఆర్జించుకున్న ఆప్తమిత్రుడు ఆయన. ఆయన భౌతికంగా దురమయ్యాక నేను ఆయనకు రాసిన పడవ పాటలోని ఈ చరణం ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది.

ఏటి పాప శాపమ్మ ఎగసి.. తాను సూసింది
ఏడి నావోడంటే ఏటిలోన మునిగింది

శాప మునిగిన కాడ శతకోటి సున్నాలు

శాపమైన గుండెలోని సెప్పలేని సుడిగుండాలు

ఏరెల్లిపోతున్నా నీరుండి పోనాది
నీటిమీద రాతరాసి నావెల్లిపోనాది”

 

(కృతజ్ఞతలు: ఉమా ఏలూరి. అడగంగానే, అర్థరాత్రి, “కొమ్మ కొమ్మకో సన్నాయి” పుస్తకం లోని, రమేష్ నాయుడి అధ్యాయాలని, ఓపిగ్గా తన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసి పంపించినందుకు.)

Siva_336x190_scaled_cropp –యాజి

 

మీ మాటలు

 1. 2004 లో స్వరాభిషేకం సినిమా కి విద్యా సాగర్ కి కూడా ఉత్తమ సంగీత దర్శకుడి గా జాతీయ అవార్డ్ వచ్చింది.విద్యా సాగర్ కూడా తెలుగు వారే..

  • Yes, my bad! When I looked up Vidyasagar, only Tamil films showed up. Thank you for catching that glaring error.

   • అన్నమయ్య కి కీరవాణి గారు కూడా జాతీయ అవార్డు గెలుచుకున్నారు !

 2. రమేష్ నాయుడి గారి పాటలు నాకు చాలా ఇష్టం. అంటే కాకుండా అవి నాకు కొన్ని సందర్భాల్లో చాలా పనికి వచ్చాయి కూడా;-) Today is going to be Ramesh Day.

 3. *అంతే

 4. you forgot the film kalyani in the combo of dasari/veturi/ramesh naidu to mention … u mentioned it in cnare/ramesh naidu though … also u forgot to mention about that he is also a singer and he got the award for the song talli godarike atupotunte (chillara kottu chittemma ) chandana lo songs kooda chala pedda hit … cirmalel chettu kinda ramulammo raamulammo … another big project which he did is Annamayya with Jandhyala… he recorded songs with Ashaji, latha ji and almost all telugu singers in the field at that time…

 5. చాలా బావుంది శివ. సాధారణంగా సినిమా సంగీతాన్ని పట్టించుకోని నేను కూడా ఈ వ్యాసంలో ఉదహరించిన చాలా పాటల్ని చదువుతూనే ఆ ట్యూను మనసులో మెదిలి, అవును, ఇది బావుంటుంది అనుకున్నాను.
  సిగ్గూ పూబంతీ పాట సీతారామశాస్త్రి కాదు??
  కృష్ణ దేవదాసుకి సంగీత సారధ్యం రమేష్ నాయుడు గారా? అందులో కూడా కొన్ని పాటలు నాకు బాగుంటాయి .. మేఘాల మీద సాగాలి, కల చెదిరింది కథ మారింది,

  • ధన్యవాదాలు నారాయణస్వామి గారూ. “సిగ్గూ పూబంతి” సీతారామశాస్త్రి గారిదే. నేనే పొరబడ్డాను.

 6. చాల బావుందండి వ్యాసం … రమేష్ నాయుడు గారు చేసినదే (వేటూరి గారి సాహిత్యం ) ముద్ద మందారం లో “నీలాలు కారేనా కాలాలూ మారేనా” కూడా చాలా చక్కని పాట !

 7. Thank you Ismail, Sri and Nagalakshmi garu for your feedback and additional references.

 8. P.S.Narayana says:

  చాలా బాగా రాసారు. వేటూరి గారి తర్వాత అంత చక్కగా, చిక్కగా రమేష్ నాయుడు గారి బాణీలని మనఃస్పూర్తిగా ఆస్వాదించి రాసారు. నేను సహాయ దర్శకునిగా, సహకార దర్శకునిగా, సహ దర్శకునిగా చాలా సినిమాలకి శ్రీ. రమేష్ నాయుడు గారితో పనిచేసాను. మీ వ్యాసం చదివిన తర్వాత రెండు సంఘటనలు ఇక్కడ రాయాలనిపించింది. 1973 లో నేను “చందన” సినిమాకి సహాయ దర్శకునిగా పనిచేస్తున్నప్పుడు ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కి రమేష్ నాయుడు గారు బాణీ కట్టారు. మరునాడు రికార్డింగ్ అంటే ముందు రోజు గాయనీ గాయకులతో ఆయన ప్రాక్టిస్ చేయించే వారు. ఆ సమయంలో బాలు, రామకృష్ణలు మంచి ఊపు మీదున్నారు. ‘ఈ పాటని రామ కృష్ణతో పాడిద్దాం’ అన్నారు నిర్మాత-దర్శకులు బండారు గిరిబాబు గారు. “ఈ పాటని మాష్టారు పాడితేనే ఆ సన్నివేశానికి బలం వస్తుంది, మీరు స్వయంగా మాష్టారికి ఫోన్ చేసి, ప్రాక్టిస్ కి ఎప్పుడు వస్తారో కనుక్కుని, మీరే వెళ్లి కారులో ఎక్కించుకుని రండి” అని రమేష్ నాయుడు చెప్పారు. (మాస్టారు అంటే ఘంటసాల గారు). ఘంటసాల గారికి గిరిబాబు గారు ఫోన్ చేస్తే, ఆ రోజు రాత్రి 8 గంటలకి వస్తామని చెప్పారు. గిరిబాబు గారు స్వయంగా వెళ్లి తీసుకుని వచ్చారు. సి. నారాయణ రెడ్డి గారు రాసిన పాటని, నేను కాపీ చేసి ఘంటసాల గారికిచ్చాను. పాట వచ్చే సన్నివేశాన్ని గిరిబాబు గారు వివరించిన తర్వాత, రమేష్ నాయుడు గారు పాడి వినిపించారు. ఆ ట్యూన్ వినగానే ఘంటసాల గారు ఆనందంగా “ట్యూన్ చాలా బావుంది నాయుడు గారూ.నా ఖాతాలో మరో హిట్టు పడింది” అన్నారు. మరునాడు జెమినీ స్టుడియోలో రికార్డింగ్. ఆర్కేష్ట్రాతో రిహార్సిల్స్ అయిన తర్వాత ఘంటసాల గారికి ఫోన్ చేస్తే, “ఆయనకి ఆరోగ్యం బావుండక విజయ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు” చెప్పారు. ఆపద్దర్మంగా రమేష్ నాయుడు గారు ఆ పాటని పాడారు, ఘంటసాల గారు కోలుకున్న తర్వాత మరల వారితో పాడిద్దామని! రమేష్ నాయుడు గారు పాడిన పాటతోనే 1974 జనవరిలో తిరుపతి దగ్గర షూటింగ్ చేసాము. అయితే ఘంటసాల గారు మరల కోలుకోక పోవడంతో చంద్ర శేఖర్ అనే సింగర్ తో పాడిద్దామని రమేష్ నాయుడు గారన్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు ‘రమేష్ నాయుడు గారి గళం బావుందని, వెరైటీగా ఉందనీ, వారు పాడిన పాటనే ఉంచెయ్యమని’ ఒత్తిడి చెయ్యడంతో రమేష్సి నాయుడు గారు సిగ్గుపడుతూ, మొహమాటంతో ఒప్పుకున్నారు. ఆ పాటే “ఓ రామ చక్కని బంగారు బొమ్మా! నీ రాత రంపపు కోత ఆయనా…”. దాంట్లో వాయిద్యాలని కూడా చాలా వినూత్నంగా వాడారు. ఆ సినిమాలో పాటలన్నీ హిట్ అయ్యాయి. కానీ సినిమా దారుణమైన ఫ్లాప్ అవడంతో రావలసినంత ఆదరణ పొందలేదు.
  మరొక సంఘటన. 1980 సం.లో శ్రీ. కె.ఎస్. ప్రకాశ రావు గారు “కొత్తనీరు” అనే సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించారు. దీని మాతృక “పర సంగద గండె తిమ్మ” అనే పేరుతో కన్నడలో నిర్మించిన సినిమా. 1947 సం.లో కర్ణాటకలో, ఒక మారుమూల పల్లెలో జరిగిన వాస్తవ సంఘటనని ఆధారంగా తీసుకుని “పర సంగద గండె తిమ్మ” నిర్మించారు ఆ సినిమా మొత్తం పల్లెటూరి వాతావరణం, కట్టు, బొట్టు, సాంప్రదాయాల మధ్య జరుగుతుంది. దానికి రాజన్ నాగేంద్ర ద్వయం సంగీతం సమకూర్చారు. అది మంచి హిట్టయ్యింది. అదే సినిమాని ” రోజా పూ రావికైక్కారి” అనే పేరుతో తమిళ్ లో పునర్నిర్మించారు. దానికి ఇళైయరాజా సంగీతం. ఇదికూడా హిట్టయ్యింది. ఈ రెండు ఆడియో కేసెట్లు తీసుకొచ్చి రమేష్ నాయుడు గారికిచ్చి, “ఒకసారి విను రమేష్” అన్నారు ప్రకాశ రావు గారు. ” ఆ పాటలు విని చేసేటట్లయితే నేనెందుకు. వాటి ఒరిజినల్ ట్రాక్స్ ఉపయోగిస్తే మీకు ఖర్చు కూడా తగ్గుతుంది” అని హార్మోనియం పెట్టె మూసేశారు. రమేష్ నాయుడుతో ప్రకాశ రావు గారికి 1950 దశకం నుంచి అనుభంధం ఉండటం, ఆయన స్వభావం తెలిసి ఉండటంతో, ప్రకాశ రావు గారు నవ్వుతూ, ” నిన్ను వినమన్నాను గానీ, అలా చెయ్యమనలేదుగా” అన్నారు. “వాళ్ళు మంచి మెలోడి మేకర్స్. ఆ పాటలు వింటే తప్పకుండా, ఆ ప్రభావం మన మీద పడుతుంది. అలా నేను చెయ్యలేను” అన్నారు నిర్మొహమాటంగా. “నీ పద్దతి అసలు మార్చుకోవుగా” అంటూ వెళ్లి పొయ్యారు. అందులో రమేష్ నాయుడు గారు స్వర పరచిన “ఊగిసలాడకే మనసా- ఉబలాట పడకే మనసా” అనే పాట మధురాతి మధురంగా ఉంటుంది. ఆయన కథనీ, కథలోని పాత్రలనీ, వాటి స్వభావాలనీ, పాట వచ్చే సందర్భాన్నీ పూర్తిగా దర్శకుని దగ్గర విని, దానికి తగినట్లుగా బాణీలు కూర్చేవారు. అందుకే కొన్ని పాటలు వినగానే ఆకట్టుకోకపోయినా, సినిమా చూసిన తర్వాత జనాదరణ పొందేవి. మీరు ఉదహరించినట్లు జాతీయ పురస్కారం అందుకున్న మొట్ట మొదటి తెలుగు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు.

 9. satish bhaskarla says:

  అన్నింటిని మించి జంధ్యాల సారధ్యం లో శాండిల్య – సీత పద్మరాజు గార్లు ” హరికీర్తనాచార్య అన్నమయ్య ”
  సినిమా మొదలు పెట్టారు….దాదాపు 40 పైగా పాటలు మంగళంపల్లి, జేసుదాస్ వంటి విద్వాంసులు, ఆశాభోంస్లే
  బాలు, సుశీల, జానకి పాడగా…అన్నమయ్య సాహిత్యానికి తక్కువ కాకుండా…కమర్షియల్ వాసన లేకుండా పరిపూర్ణమైన భక్తిభావం ఉప్పొందేలా రూపొందాయి…ఎందువల్లనో సినిమా
  మొదలు లోనే ఆగిపోయింది…అది కూడా పూర్తి అయి వుంటే….రమేష్ నాయుడు గారి స్వరకీర్తి కిరీటం లో
  మరొక ఆణిముత్యం చేరేది……ఇంకొక మాట…తెలుగు లో మొట్ట మొదటి నేషనల్ అవార్డు ” మేఘసందేశం ” సినిమాకి రావటం…రమేష్ నాయుడు సంగీత దర్సకత్వం లో…మనకి గర్వ కారణం…

మీ మాటలు

*