ఎంత నేర్చినా…?

SAM_0344

ఆవేళ బుధవారం -పాత బట్టల మూట ముందేసుకుని కూర్చున్నారు అత్తగారు .

అప్పటికి అయిదారుసార్లు తిరగేసి మరగేసి చూసారు అందులో చీరల్ని . ఒక్కోటీ విప్పతీసి చూడటం మళ్ళీ మడతేసి పెట్టడం .ఎప్పటికో రెండు చీరలు తీసి ఒళ్ళో వేసుకున్నారు . అదా ఇదా అని కాసేపు ఆలోచించి చివరికి ఎటూ తేల్చుకోలేక రెండిటినీ మూటలో వేసేసి తలపట్టుకు కూర్చున్నారు . మా అత్తగారి అవస్థ చూసి నేను గట్టిగా నిట్టూర్చాను ఎప్పట్లానే .

“కొత్త చీరలు కొనుక్కునేప్పుడు ఆలోచించాం – హైరానా పడ్డాం అంటే అర్ధం వుంది కానీ , మాయదారి పాత చీరల సెలక్షనుకి కూడా ఇన్ని పుర్రాకులు పడాలా . కళ్ళుమూసుకుని మూటమొత్తంగా తీసుకెళ్ళి పారేస్తే పోయేదానికి” అన్నాను అత్తగారితో . అంతటితో ఊరుకున్నానా …..”దానధర్మాలు చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలటండీ దేవుడు మనకా అవకాశం ఇచ్చాడు కాబట్టి ఉదారంగా ఇచ్చిపారేయడమే . మన ఇంట్లోంచీ ఒక రూపాయి దానంగా వెళితే రెండు రూపాయలు మనింట్లోకొచ్చే దారి చూపెడతాడటండీ ఆ భగవంతుడు . అంటే ….ఇప్పుడు మనం ఒక పాత చీర ఇస్తే రెండు కొత్త చీరలు కొనుక్కునే అవకాశం మనకి దొరుకుతుందన్నమాట” అని ఎక్కడో విన్నవి టీకా తాత్పర్య సహితంగా అనుమానం లేకుండా అప్పచెప్పేసాను.

అయిందా ఉపన్యాసం అన్నట్టు ఆవిడ నాకేసి శాంతంగా చూసి, “ఇలావచ్చి కూచోవే …నీకో కథ చెపుతాను” అనేసరికి గానీ నే చేసిన తప్పు బోధ పడలేదు . దాన ధర్మాల గురించి నేనిలా తేలిగ్గా మాట్లాడినప్పుడల్లా ఆవిడ ఒకానొక బరువయిన కథ చెప్పటం , నేను కళ్ళొత్తుకుంటూ ఆ కథ వినేయడం పరిపాటయిపోయింది .

“వరాల్రాజుగారి కథేనా …..తెలుసుగా “ అన్నాను నింపాదిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ.

“ ఊరికే తలాడిస్తూ వినేస్తే సరిపోయిందా దేన్నుంచయినా నేర్చుకోవాల్సింది నేర్చుకోవద్దూ . అత్తయినా చెప్పిందికాదమ్మా అని అందరూ నన్నంటారు ఇలా వచ్చి కూచొని మళ్ళీ ఒక్కసారి చెప్పించుకోవే “ అని బ్రతిమాలేస్తుంటే ….బ్రోచేవారెవరురా అని నేను దిక్కులు చూడ్డం మొదలుపెట్టాను.

వాకిట్లోంచీ ” అయ్యగారండో ….అయ్యగారండమ్మా …” అన్న పిలుపు వినపడగానే …. బ్రతికానురా భగవంతుడా అనుకొని ఒక్క ఉరుకులో అక్కడినుంచీ బయటపడ్డాను .

చాకలి పోలమ్మ . పాపం పెద్దయ్యగారు ఇస్తానని ఆశపెట్టిన పాత చీరకోసం కాళ్ళరిగిపోయేలా తిరుగుతుంది . మంగళవారం పొద్దొచ్చేసిందనీ, శుక్రవారం పొద్దు ఇంకా దాటలేదనీ , ఈవాళ ఇంట్లో చుట్టాలున్నారనీ, రేపు మాకు పనుందనీ, ఇంకా అదనీ ఇదనీ ఎన్నాళ్ళబట్టి తిప్పుతున్నారో దాన్ని . ఈవాళయినా దాని ఆశ తీరుతుందో లేదో….ఏ చీరను వదిలించుకోవాలి అనే విషయం మీద అత్తగారు ఇంకా ఒక నిర్ణయానికొచ్చినట్టులేదు .

మా అత్తగారి పద్ధతేవిటో నాకు అర్ధం కావటంలేదు . తనంత తాను ఇవ్వాల్సివస్తే ఒకటికి రెండిస్తారు . అడిగింది ఇవ్వడానికి మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు . ఎంత వీలయితే అంత వెనక్కి తీస్తారు . ఆ అడిగినవాడు ఎందుకడిగాన్రా బాబోయ్ అని ఏడ్చేంతగా తిప్పిస్తారు . ప్రతీ ఏటా దీపావళికి ప్రమిదలు తీసుకొచ్చి ఇచ్చే కుమ్మరోళ్ళ పిల్లకి పురుడొచ్చిందని తెలిసి , మెత్తని నూలు చీరలన్నీ ఏరేరి మరీ పంపించారు అబ్బులుగాడితో . ఏనాడో మా ఇంట్లో పనిచేసిన నాగలక్ష్మి నడుం వంగి పనిలోకి వెళ్ళలేకపోతుందని విని బియ్యం బస్తా పడేయించారు దాని పాకలో . “అయ్యగారూ మంచి జరీ ఉన్న పాత కోక ఇప్పించండి బాబూ తవరి పేరు సెప్పుకుని కట్టుకుంటాను ” అని ఆ మధ్య ఎప్పుడో నోరు తెరిచి అడిగింది పాపం పోలమ్మ . ఇదిగో ఇప్పటిదాకా తిప్పుతున్నారు. హేవిటో ఈవిడ వరస అంతా తికమక- మకతిక అనుకుంటుండగా వచ్చారు అత్తగారు .

“ఊ..ఇదిగోనే పోలమ్మా . ….చీర చీరని చంపుతున్నావని ఇస్తున్నా అంచయినా మాయలేదు. జాగ్రత్తగా కట్టుకుంటే పదేళ్ళయినా మన్నుతుంది “ అంటూ ఆవిడ పోలమ్మ చేతుల్లో పడేసిన పాత చీర చూసి నోరెళ్ళబెట్టిన పోలమ్మని చూస్తే నాకు నవ్వాగలేదు . ఆ చీరకసలు అంచేలేదు. రంగయినా ఇదని చెప్పటానికి వీల్లేనిది . విప్పతీస్తే ఇంకా లోపల ఏవేం విచిత్రాలు దర్శనమిస్తాయో .

ఆవుదం తాగినట్టూ మొహం పెట్టి అంతలోనే సర్దుకుంది పోలమ్మ . “సూసేరాండీ సిన్నయ్యగారూ మీ అత్తయ్యగారి పరాచికాలు ” అంటూ నవ్వేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే….మా అత్తగారు బుగ్గలు నొక్కుకుని ” ఇందులో పరాచికమేవుందేవ్ ! నువ్వడిగింది పాత చీరేగా” అనేసారు తేలిగ్గా.

“ ఆ…..మీరు భలేవోరు అయ్యగారు . పాతకోకని అడగాపోతే తవరు కట్టుకునీ పట్టుకోకలిమ్మని అడుగుతావాండీ … మారాజులు మీరే అర్దం సేసుకోవాల . తవరిచ్చిన కోక కట్టుకుని మా మెండపేట తమ్ముడింటిని ఎలదారనీ , మా అయ్యగారు ఎంత నాణవయిన కోకలు కడతారో అక్కడ మాఓల్లందరికీ సూపిద్దారనీ ఎంత సంబరపడ్డానో తెలుసాండీ” అంటూ….చూసుకోండి మరి ఈ చీర కట్టుకెళితే పోయేది మీ పరువే అన్న అర్ధం ద్వనించేలా కళ్ళూ ఒళ్ళూ విచిత్రంగా తిప్పేసింది పోలమ్మ .

పోలమ్మ వంటిమీద జీరాడుతున్న నిమ్మపండు రంగు గద్వాల చీరను పరీక్షగా చూస్తూ “చాల్లే వే చెప్పొచ్చేవ్ …..నీ సంగతి నాకు తెలీకనా !! నీకు చీరలకి కరువేంటే , రేవులో పడ్డ జరీ చీరలన్నీ ఓ తిప్పు తిప్పికానీ ఇళ్ళకు చేర్చవు కదా . ఇక మాలాంటివాళ్ళిచ్చిన పాత కోకలు చుట్టుకుని చుట్టాలింటికి వెళాల్సిన ఖర్మం నీకేవిటీ” అని అత్తగారు సుతారంగా అంటించేసరికి , ఉడుక్కున్నట్టూ మొఖం ముడుచుకుంది . “మనసులో ఏదో పెట్టుకుని మాట్టాడతన్నారు పెద్దయ్యగారు “అంటూ గారం పోయింది .
దాన్నలా చూస్తే నాకు జాలేసిపోయింది. నిజం చెప్పాలంటే కొంచెం భయం కూడా వేసింది. ఇస్త్రీ కోసం ఇచ్చిన నా పెళ్ళి పట్టు చీర దాని దగ్గరేవుంది. కోపంలో కాల్చి పారేస్తేనో ? మంగలి కత్తి మెడమీద పెట్టినపుడు – చాకలింట మన కొత్తకోక ఉన్నప్పుడు ఎవరయినా ఎంత జాగ్రత్తగా వాళ్ళపట్ల ఎంత మర్యాదగా వుండాలి . అయినా అత్తగారూ …. ఇదేం అమాయకత్వం అని నేను గొణుగుతూనే వున్నాను .

అదేం పట్టించుకోకుండా ఆవిడ అతి సీరియస్ గా మొఖం పెట్టి “ పోయిన పండక్కి పాలేర్లందరితోపాటూ నీకూ కొత్త బట్టలు పెట్టానా ….మా కోడలు తొలిమాటు సారెతో ఇంటి చాకలని నీకో కొత్త చీర తెచ్చిందా …..అవి కాక మా పెద్దొదినగారు దీపావళికి పంపించిన మూరతక్కువ చీర నీకు పనికట్టుకుని కబురంపి మరీ ఇచ్చానా ….అవన్నీ ఏం చేసావ్ …పోనీ ఒక్కమాటు సరదాగా కట్టుకొనొచ్చి అయ్యగారికి కనపడదాం అననుకున్నావా …పైగా రంగు నప్పలేదు, బట్ట బాగోలేదు అని నీ అరుగుమీద కూర్చుని వచ్చేపోయేవాళ్ళకి పేరంటం పెడతావా !….మళ్ళీ ఇప్పుడు ఏం ఎరగనట్టూ అయ్యగారూ పాతకోక అంటూ వచ్చి నిలబడితే నాకేం తెలీదనుకున్నావా …..పోన్లేపాపం ఇంట్లో కట్టుకుంటావని నేనో పాత చీర పడేస్తే అది ఇంటింటికీ కట్టుకెళ్ళి మరీ చూపించొస్తావా ..హమ్మా!! “ అంటూ పాయింటు మీద పాయింటు లాగుతూ చింత నిప్పులా చిటపటలాడిపోతున్న అత్తగార్ని చూస్తూ గాభరాగా గుటకలు మింగుతూ నిలబడిపోయింది పోలమ్మ . నేను మాత్రం గబగబా వంటింట్లోకి పరిగెత్తి గ్లాసు నీళ్ళు తాగొచ్చాను .

అంతటితో వదలకుండా దాన్ని ఎప్పటినుంచో అడగాలనుకున్న నాలుగు ప్రశ్నలూ అడిగేసి, కడిగేసి శాంతించిన అత్తగారు అరుగు చివర కాలుమీద కాలేసుకుని, మూతిమీద వేలుంచుకుని అలిగినట్టూ ఎటో చూస్తూ కూర్చున్నారు.

ఇటువంటి సీరియస్ సీనుల్లో ఎటువంటి డైలాగులుంటాయో తెలీక పాఠం మర్చిపోయిన స్టుడెంట్ లా చేతులు నలుపుకుంటూ పోలమ్మనీ అత్తగార్నీ మార్చి మార్చి చూస్తూ ఉండిపోయాను .

ముందుగా తేరుకున్న పోలమ్మ చెంగున అరుగు మీదికెక్కి చూర్లో దోపిన విసనకర్ర అందుకుని ఆవిడ ఎటు తిరిగితే అటు తిరిగి అత్తగారికి గాట్టిగా విసరరటం మొదలుపెట్టింది.

“అమ్మ…దీని తెలివో !? “ అని ఆశ్చర్యపోయాను .

అదే స్పీడులో నావైపు తిరిగి “అలా సూత్తనిలబడిపోయారేంటండీ …ఎల్లి అత్తయ్యగారికి సల్లగా మజ్జిగిదాహం అట్టుకు రండీ “ అని ఆర్డరేసి పారేసింది .అమ్మమ్మో…ఏం లౌక్యం !!! అని ఈసారి ఇంకాస్త ఎక్కువ ఆశ్చర్యపోతూ లోపలికి పరిగెత్తాను .

అత్తగారు అస్తమానూ చెప్పే వరాల్రాజు అనబడే ఆ వరహాల్రాజు గారి కథ ఆ సమయంలో వద్దన్నా గుర్తొచ్చేసింది .

అనగనగా ఓ వరాల్రాజుగారట . ఆయనదసలు మాఊరు కాదట భీవారం సైడునించీ వచ్చేరట . మా ఊర్లో పాతికెకరాలు కౌలుకి తీసుకుని పొగాకు వ్యవసాయం మొదలు పెట్టారట.అంతకుముందు చేపల చెరువులు, రొయ్యల చెరువులూ చేసి లాసయిపోయేరట .రొయ్యలు పండించిన చేతుల్తో బియ్యం పండించలేక ఇటుసైడు వచ్చేసేరట .”ఊరుకోండి మీరు మరీ సెపుతారు…ఊ కులాసాలకి పోకుండా కుదురుంగా యవసాయం సేసుకుంటే లాసెందుకవుతారు . పావలా పెట్టేకాడ రూపాయెడితే ఇలాగే మిగులుతారు” అని ఆయన్ని గతంలో ఎరిగున్నవాళ్ళు అనేవారట. అయినా అయన అదేం పట్టించుకోకుండా తన కులాసాలు దర్జాలు భేషుగ్గా కొనసాగిస్తూ వచ్చారట .
శ్రీరామనవమి చందాలని వెళితే ఊర్లో అందరూ ఇచ్చినదానిమీద ఓ రూపాయి ఎక్కువ రాసుకోండి అనేవారట . ఆవునో దూడనో కొనాల్సి వచ్చినపుడు అమ్మే ఆసామీ చెప్పిన రేటుకి ఒక రూపాయి ఎక్కువే తీసుకో అనేవారట.

పెళ్ళికీ పేరంటానికీ వెళితే చదివింపుల్లోకూడా తనదే పైచేయి అనిపించుకునేవాడట . దాంతో ఎక్కడెక్కడివారూ ఆయన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఆహ్వానాలు అందించి , ఆయనందిచిన చందనతాంబూలాది సత్కారాలు పొంది వెళ్ళేవారట. ఆస్తి ఉన్నవాడు అందరికీ బంధువే అన్నట్టు మాఊర్లోనేకాక చుట్టుపక్కల ఊర్లలో కూడా అట్టహాసంగా జరిగే ప్రతీ కార్యక్రమానికీ ఆయన్నే ముఖ్య అతిధిగానూ, గౌరవాధ్యక్షుడిగానూ నిలబెట్టి కూర్చోబెట్టేవారట. అడగటవే ఆలశ్యం అన్నట్టుండేదట ఆయనతో పని . మనూర్లోనూ ఉన్నారు రాజులు ఎందుకూ ఊ..మీసాలు తిప్పుకుంటూ తిరగడానికీ మనమీద రంకెలెయ్యడానికీ తప్ప రాజంటే వరాల్రాజు గారే అని మిగతా రాజుల్ని పబ్లిక్ గానే ఆక్షేపించేస్తున్నారట తినమరిగిన జనం .

ముచ్చటగా మూడేళ్ళు గడిచేసరికి ‘మీ చందా ఇంతా’ అని ఎవరన్నాసరే దబాయించి తీసుకునేంత అలుసయిపోయేరట వరాల్రాజుగారు .ఊళ్ళో తీర్థాలకి లైటింగు ఖర్చయినా , శివరాత్రి సంబరాల్లో సినిమా ఖర్చయినా ఆయన ఖాతాకే వెళ్ళిపోయేదట . వరాల్రాజుగారి అయ్యగారు ఊర్లో దిగేప్పుడు పెట్టుకొచ్చిన మొహరీల మొలతాడు కానీ, రూపులపేరు కానీ అయిదేళ్ళ తరవాత ఆవిడ వంటిమీద కనపడలేదట . ఊర్లో దిగిన కొత్తలోనే ఆయన బుల్లెట్టు నడపటానికో మనిషిని పెట్టుకున్నారట .వాడి జీతం కూడా ఊర్లో పాలేర్లందరికంటే ఓ రూపాయెక్కువే అని మాట్లాడుకున్నారట . కొన్నేళ్ళకి ఆ బండిమీద వాడొక్కడే సొంతదారులాగా దర్జాగా తిరుగుతూ కనిపించేవాడు వెనక వరాల్రాజుగారు లేకుండా.

ఆయేడు శ్రీరామ నవమికి చందాలిచ్చినవారి పేర్లు మైకులో చదువుతూ చివరాకర్లో వరాల్రాజు గారి పేరు కూడా ఒక్కరూపాయెక్కువేసి చదివేసి, మర్నాడు పొద్దున్నే ఆయనింటికెళ్ళి చూస్తే తాళం పెట్టుందట . గడపమీద ఆయేటి చందా వందలకట్టతో పాటు ఓ రూపాయి బిళ్ళ ఒత్తెట్టి కనిపించిందట . కొన్నాళ్ళకి రామిండ్రీ నుంచీ , అనపర్తినుంచీ అప్పులోళ్ళొచ్చి తాళం పగలకొట్టి విలువయినవి అనుకున్న సామానులన్నీ పంచుకు పోయారట. అప్పటివరకూ ఆహా అన్నవాళ్ళే అంతా స్వయంకృతం తేల్చేసారట . మాటలేవన్నా కొనితేవాలా? నాలుక మడతేసి ఎటు కావాలంటే అటు ఆడించడమేకదా !రాజంటే వరాల్రాజే అన్నవాళ్ళెవరూ ఆయన గురించి బెంగిల్లిపోలేదు , మనకింత చేసిన మారాజు ఏవయిపోయేడో అని ఆరా తీయలేదు. ఎందరో వరాల్రాజుల్నీ బంగార్రాజుల్నీ మర్చిపోయినట్టే మర్చిపోయి ఊరుకున్నారట . అంతెందుకూ …వరాల్రాజుగారు చేయించి వేసిన ముత్యాల హారాలు, వెండి కిరీటాలు ధరించిన సీతారాములే ప్రతిఏటా ఆ పాడుబడ్డ ఇంటిముందునించీ ఏవీ తెలీనట్టు చిరునవ్వుతో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఇంక మనుషుల్ని అనుకోటానికేవుందని అత్తగారు తరచూ బాధ పడేవారు .

ఈ కథ ఇంతవరకే ఊళ్ళోవాళ్ళకి తెలుసట .

కొన్నేళ్ళ క్రితం తిరపతి బస్టాండులో ” టికెట్టుకి డబ్బులు తక్కువయ్యాయి ఒక్క రూపాయిప్పించండమ్మా ” అని చేయి చాచిన వ్యక్తిని పరీక్షగా చూస్తుంటే , అనుమానంతో కళ్ళు చిట్లించిన అతను, గబుక్కున చేయి వెనక్కి లాక్కొని మరు నిమిషంలో మాయమయిపోయాడట.

“ఆయన మనూర్నించీ వెళ్ళిపోయిన వరాల్రాజు గారిలా ఉన్నారండీ “ అని అత్తగారు కళ్ళనీళ్ళు తిప్పుకుని మా మాంగారితో అంటే “ చ.చ…అయ్యుండదు” అనేసారట మాంగారు మొఖంలో బాధని దాచేస్తూ .

ఏట్లో పోసినా ఎంచిపోయాలి అనీ , అపాత్ర దానం కూడదనీ, ఇంకా ఎన్నెన్నో సామెతలతో ఈ కథ మా అత్తగారు నాకు మొదటిసారి చెప్పినప్పుడు మనసుకదోలా అయిపోయి కళ్ళనీళ్ళు తిరిగిపోయాయంటే నమ్మండి .

నేను మజ్జిగ దాహంతో తిరిగొచ్చేసరికి పోలమ్మ చెపుతున్న కబుర్లు వింటూ ప్రసన్న వదనంతో కనిపించారు అత్తగారు. ఇంతలో ఏం మాయ చేసేసిందబ్బా అని నేను ఆశ్చర్యపోతుంటే…. “ ఏమేవ్ ….ఆ గుడ్డలమూటిలా పట్రా . పోలమ్మకి నచ్చిన చీరలు తీసుకుంటుంది . అలాగే మొన్న చేసిన మురిపీలు రెండు పుంజీలు పొట్లం కట్టి పట్టుకురా పిల్లలకి పట్టుకెళుతుంది ” అని నాకు పురమాయించి, “ కోళ్ళ గూడు కింద బొగ్గుల మూటుంది వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళవే పోలమ్మా “ అంటూ దర్జాగా వరాలొకపోస్తున్న అత్తగారిని పక్కకి పిల్చి వరాల్రాజుగారి కథ నాకు చెప్పీ చెప్పీ మీరేం నేర్చుకోలేదా ? అని అడిగేద్దామనిపించింది. పొగడ్త పన్నీరు వంటిది పీల్చి వదిలేయాలి కానీ తాగి పడిపోకూడదు అని క్లాసు చెప్పేద్దామా అనికూడా అనిపించింది .

ఏవిటో….!! అనుకుంటా కానండీ …ఒకరి అనుభవం మరొకరికి గుణపాఠం అవుతుందా చెప్పండి ?

–లలిత దాట్ల

మీ మాటలు

  1. “పొగడ్త పన్నీరు వంటిది. పీల్చి వదిలేయాలి కానీ తాగి పడిపోకూడదు”
    చాలా నచ్చిందండీ ఈ వాక్యం లలితగారూ!

    • లలిత says:

      అంత నచ్చితే అట్టేపెట్టుకోండి తృష్ణ గారు . నిజానికి నేనూ ఎక్కడినుంచో ఎత్తుకొచ్చిందే :)

  2. హాస్యానికి మించినవుంటున్నాయి మీ కథల్లో… బావుందండీ.

  3. “అంతెందుకూ …వరాల్రాజుగారు చేయించి వేసిన ముత్యాల హారాలు, వెండి కిరీటాలు ధరించిన సీతారాములే ప్రతిఏటా ఆ పాడుబడ్డ ఇంటిముందునించీ ఏవీ తెలీనట్టు చిరునవ్వుతో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఇంక మనుషుల్ని అనుకోటానికేవుందని….”

    అసలు హాస్యం రాయడమే కష్టం – అందునా .. కరుణరసం అంతర్లీనం గా పొంగే హాస్య రసం పండించడం – కత్తి మీద సాము . రాజులకి కత్తి సాములంటే మా చెడ్డ సరదా కదా… సిన్నయ్య గోరూ !!

    • లలిత says:

      రామ్ గారు మీ మాటల గారడీ ముందు మా విద్యలు ఏ పాటిలెండి !
      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు :)

  4. చాలా బాగుంది లలితగారు. మీ స్టైల్ నచ్చింది.

  5. లలిత గారూ,
    ఏమిటండీ అత్తగారి ద్వారా జీవిత సత్యాలు కూడా నేర్చేసుకుంటున్నారు? మరీ అంత తొందరైతే ఎలా?

    • లలిత says:

      రాధ గారు ….మరీ తొందరపడ్డానంటారా !
      అయినా , ఏ నిమిషానికి ఏమి జరుగునో …..ఆలస్యం అమృతం విషం అన్నారు కదండీ !

  6. ఎప్పుడూ నవ్వించే చిన్నయ్యగారు ఈరోజు ఏడిపించారు కదా తిరుపతయన వరల్రాజు గారు కాకూడదు

    • లలిత says:

      అవునండీ పద్మజ గారు …అలా ఎప్పటికీ కాకూడదు

  7. భలేగా చెప్తున్నారు కథ.

  8. సత్యభామ says:

    చిన్నయ్యగారూ, దండి అన్నాట్ట కరుణ ఒక్క్కటే రసం అని. అదీవాళ అనుభవంలోకొచ్చింది. కందుకూరి గారి రాజశేఖరుడి లాంటివాడే మీ వరాల్రాజు గారు. మీరన్నట్టు, వాళ్ళ అనుభవాలు మనకి గుణపాఠాలు ఐతే బానే ఉంటుంది గానీ అవ్వవే, అదే చిక్కు. పొగడ్తకి లొంగని నరమానవుడెక్కడున్నాడు?

Leave a Reply to రామ్ Cancel reply

*