అర్ధాంతరంగా….

venu1

నిలువెత్తు మనిషి ఎదుట నిలబడితే

నువ్వేనా, ఆ నాటి నువ్వేనా

నవ్వేనా అప్పటి పారిజాత పువ్వేనా అని

ఆపాదమస్తకం శోధించే చూపులు

ఒక్క కుదుపుకు పూలు జలజలా రాలినట్టు

వేనవేల జ్ఞాపకాల పరిమళాలు

కట్ట తెగి ఒక్కుమ్మడిగా వెల్లువెత్తిన వరదలా

లెక్కలేనన్ని ఉద్వేగాల హోరు

అరమూసిన కళ్లలో సగం ఆరిన వెలుగు

చెంపల మీద జారిపోయిన యవ్వనం

జీవన క్రీడ రెండో సగంలో ప్రవేశించిన జాడ

అక్కడక్కడ వెండితీగలు మెరిసే తల

తెచ్చిపెట్టుకున్నది కాదు, నిజంగానే మీదబడిన పెద్దరికం

ఆత్మీయ మైత్రిని

చాటేదా దాచేదా

ఈ అపరిచిత కౌగిలింత?

mandira1

మాటలు మరచిపోయినట్టు

స్వరం కొత్తగా విప్పుకుంటున్నట్టు

దశాబ్దాల కిందటి పురాస్మృతి

హృదయాంతరాళంలో పోట్లెత్తి

కేరుమనాలా వద్దా అని తడబడుతుంది

కన్నీటి పొత్తిళ్లలో మాట

‘అబ్బ ఎంత మారిపోయావు’ అని ఒక పలకరింపు

‘అప్పట్లా లేవు’ అని ఒక జవాబు

‘బాగున్నావా’ అని ఇద్దరి నోట ఒకే మాటకు

గాలిలో అద్వైతసిద్ధి

కలిసి నడిచిన అడుగులు

పంచుకున్న సంభాషణలు

ఎన్నటికీ మరవని స్నేహం

గుర్తు చేయలేని సంకోచం….

అన్నీ అర్థాంతరంగానే…

(ముప్పై ఏళ్ల తర్వాత కలిసిన సహాధ్యాయులు రమకూ శబరికీ)

ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 28, 2013

painting: Mandira Bhaduri

మీ మాటలు

  1. bhasker koorapati says:

    డియర్ వేణు గారూ..!
    చాలా మంచి కవిత. ఆర్ద్రంగా ఉంది.
    ‘ సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ ….’!
    ఎంత నిజం. మీలోని కవితాత్మ సరేసరి! ఎన్ని ఉపమానాలు!!
    మాకూ ఇట్లా మా బాల్య మిత్రులు తారసపడితే ఎంత బావుణ్ణు!
    మీ మిత్రుడు
    –భాస్కర్ కూరపాటి.

  2. దశాబ్దాల కిందటి పురాస్మృతి

    హృదయాంతరాళంలో పోట్లెత్తి

    కేరుమనాలా వద్దా అని తడబడుతుంది

    కన్నీటి పొత్తిళ్లలో మాట.. హత్తుకున్నాయి సార్..

  3. ఎన్ వేణుగోపాల్ says:

    అఫ్సర,

    భాస్కర్ గారూ,

    వర్మా,

    కృతజ్ఞతలు.

    వి.

  4. వేణుగోపాల్ గారూ,

    ఒక అరుదైన అనుభవాన్ని చాలా చక్కగా మాటల్లో రికార్డు చేశారు.

    అభినందనలు.

    • ఎన్ వేణుగోపాల్ says:

      ఎన్ ఎస్ మూర్తి గారూ,

      ధన్యవాదాలు…

  5. కన్నీటి పొత్తిళ్ళలో మాట.. నాకు చాల నచ్చిన వాక్యం.
    నిజమే, పొగిలి పోతుంది గొంతులో!
    కవిత్వీకరణ మనసుని హత్తుకునే లా వుంది.
    అభినందనలతో..

  6. నారాయణస్వామి says:

    ప్రియమైన వేణూ – చాలా ఆర్ద్రంగా ఉంది పద్యం! అయితే, నీకు చెప్పేటంత వాణ్ణి కాదు కానీ,

    ఆత్మీయ మైత్రిని

    చాటేదా దాచేదా

    ఈ అపరిచిత కౌగిలింత?

    ఇక్కడికే పద్యం ఆగిపోతే బాగుండేమో అనిపించింది. తర్వాతదంతా పాఠకులు ఊహకు వదిలేస్తే?

    పై వాక్యాలు అద్భుతంగా ఉన్నయి! ఆత్మీయ మైత్రి – అపరిచిత కౌగిలింత – వైరుధ్యాల ఐక్యత!

    • ఎన్ వేణుగోపాల్ says:

      స్వామీ….

      నీకు నచ్చడం నాకెంత సంతోషమో నీకు తెలుసు. కృతజ్ఞతలు చెప్పలేను.

      నేను కవిని కానని నాకు గట్టి నమ్మకం. అందుకు అవసరమైన తడి ఏదో నాలో లేదని. కాని ముప్పై ఏళ్ల తర్వాత వాళ్లను కలిసి ఒక గంట గడపగలిగినందుకు చాల ఉద్వేగపడ్డాను. నిజానికి వాళ్లలో ఒకరి కోసం ముప్పై ఏళ్లుగా వెతుకుతున్నాను. ఆ ఉద్వేగంలో రాసిన వాక్యాలు అవి. నిజమేనేమో, నువ్వన్నట్టు అక్కడ ఆపవలసిందేమో. కాని అన్నాళ్ల ఎడబాటు తర్వాత కలిసినప్పుడు మాటలు రాని తనం కూడ ఉండింది. వచ్చిన మాటలు కన్నీటిలో నానిపోయాయి. ఆ ఉద్వేగం కూడ చెప్పాలనిపించింది….

  7. డియర్ వేణు, కవిత ఆర్ద్రంగా, మనసుకు తాకేలా , బాగున్నది. ఇంత బాగా రాస్తూ

    ఎప్పుడూ ఎందుకలా కవినా కాదా అని అంటావు. మరెప్పుడు అలా అనకు.

    విమల

  8. కోడూరి విజయకుమార్ says:

    వేణూ !
    గత కొద్ది రోజులుగా హైదరాబాద్ కు దూరంగా వుండిపోయి, కొంచెం ఆలస్యంగా మీ కవిత చదివాను –
    చాలా కాలం తరువాత మీ కవిత … చాలా బాగుంది …
    “అరమూసిన కళ్లలో సగం ఆరిన వెలుగు
    చెంపల మీద జారిపోయిన యవ్వనం
    జీవన క్రీడ రెండో సగంలో ప్రవేశించిన జాడ
    అక్కడక్కడ వెండితీగలు మెరిసే తల”
    నది వయసులోకి ప్రవేశించిన జీవితాన్ని చాలా కవితాత్మకంగా చెప్పారు …
    ‘పావురం’ (యూనికోడ్ లో ఇంతే రాయగలిగాను మరి!) సంకలనం తరువాత నా లాంటి మిత్రులు మీ నుండి మరొక కవితా సంకలనం కోసం ఎదురు చూస్తున్నారు

    • ఎన్ వేణుగోపాల్ says:

      విజయ్

      కృతజ్ఞతలు. నిజమే, పావురం తర్వాత పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి. నిజానికి ఓ రెండు సంపుటాలు వేయగలన్ని కవితలు రాసి ఉంటాను గాని ఏదో సంకోచం… పావురం కన్న పదిహేనేళ్లు ముందునుంచీ తెలుగులోకి అనువాదం చేసిన దేశదేశాల కవిత్వం చాలా ఉంది. బహుశా ఓ రెండు వందల కవితలున్నాయేమో. అవి ఒక పుస్తకం వేయమని ఈ మధ్య శివారెడ్డి గారు, సిధారెడ్డి, శంకరం కూడ అన్నారు… చూడాలి….

మీ మాటలు

*