బాపూరమణల బళ్ళో ఓ బుడుగు కథ ..!

ఎమ్వీ రాంప్రసాద్

ఎమ్వీ రాంప్రసాద్

 

 

 

 

 

 

 

అనగా అనగా అనగా…..

అనగా నా చిన్నపుడు నానారు నన్ను బళ్ళో పడేదాం అనుకున్నారు.

“బడులు కాని బడులు

తెలుగు పలుకుబడులు రా

విశ్వదాభిరామ వినురవేమ”

అని నమ్మిన కారణాన, నన్ను తీసికెళ్ళి తెలుగు పలుకుబళ్ళో పడేశారు. నాకు మొదట తెలిసిన తెలుగు పలుకుబడి అంటే – నవోదయ బుక్ హౌస్. విజయవాడ. మరి బుడుగూ, సీగానపెసూనాంబ, అప్పారావూ, వీళ్లందరినీ కలిసింది మొదటిసారి అక్కడే!

175-248_muthyala-telugu-m

 

నా ఐదో ఏట – మా నానారిని ఎంకరేజీ చేదామనీ- “పోనీ ముత్యాలముగ్గు సినిమా తీయరాదురా అండీ” అనేశా మా నానారితో . అంతే వెంఠనే బ్భయప్పడిపోయి, తన ఉజ్యోగానికి సెలీవ్ పెట్టి, నిఝం జట్కా మీద మెడ్రాస్ పరిగేఠుకెళ్ళీపోయి సిన్మా మొదలెట్టేశారు.

అన్నట్టు, ఎంకరేజీ అంటే మనకి లాబం వచ్చే పని చెయ్యమని పక్కవాళ్ళని ముందుకు తోయడం ట! మా బాబాయి చెప్పాడు.

ఏం, నానారు మెడ్రాస్ వెళ్తూంటే, ఓ సారో ప్ఫదిసార్లో మేమూ నానారి  చొక్కా పట్టుకుని మెడ్రాసెళ్ళిపోయేవాళ్ళం సెలవుల్లో.

“ఇంతమంది ఉన్నపుడు ఎంచక్కా రైల్లో వెళ్ళాలమ్మా బుడుగూ, జట్కా అయితే, ముప్ఫయ్యో, డెబ్భయ్యో రోలు పడుతుందీ” అన్నారు కదాని. “పోన్లే రైలోనే వెళ్దాం” అని రష్చించేశాను.

కానీ మరి మా నూజివీడుకి మా ఊరి రైలు స్టేషను  చాలా దూరంగ ఉంది కదా! ఎలాగా! (ఎందుకూ అంటే పట్టాలకి దగ్గిరగా ఉండాలనిట .. ఖద విను)

ఏం, అయినా అక్కడ అన్ని రైళ్ళూ ఆగవుట!

” ఓ రెండు జళ్ళ సీతని నించోపెడితే సరి. అన్ని రైళ్ళూ ఈలేసుకుంటూ అవే ఆగుతాయి.” అని నేను అవుడియా చెప్పాను. ఎవరూ విన్లేదు.

హు! వీళ్లకి అవుడియాలు రావు. మనం చెప్తే కాదులేమ్మా బుడుగూ అంటారు.

కాదులే అంటే వాళ్లకి అర్ధం కాలేదనీ, ఆ మాట ఒప్పుకోమూ, అని అర్ధం ట, బాబాయి చెప్పాడు. వాడింకా బోల్డు చెప్తాడ్లే!

ఏం అంచాత మేం విజయవాడ వెళ్ళి అక్కడ రైలెక్కాలన్నమాట. అలా విజయవాడ వెళ్ళినపుడల్లా నవోదయ’లో మాకిష్టమయిన మజిలీ కాసేపు. ‘నవోదయ’లో ఎంచక్కా ఓ రాక్ నిండా బుడుగూ, ఇంకో దాన్లో టామ్ సాయర్లూ, ఇంకోదాన్లో హక్‌లూ వాడి హక్కులూ.. ఇంకా బోళ్ళూ పుస్తకాలన్నమాట. కళ్లు చెదిరిపోయేవి. కొత్త పుస్తకాల గుబాళింపు గమ్మత్తుగ ఉంటుంది లే..

‘బుడుగు’ తీసుకుని బొమ్మలు ఫీడు గా చదివేస్తుంటే, అక్క చూసి జాలిపడి కథ చదివి వినిపించేది. (ఆనక నేనూ చదవడం నేర్చుకున్నాలే ప్పది రోలకో, డెబ్భై రోలకో)

555392_500712493357918_147827536_n

ఏం, ఇంతలో నవోదయ రామ్మోహన్రావ్‌గారు నవ్వుతూ _

“దామ్మా బుడుగూ ఇంద నారాయణ కొట్లో పకోడీలు తినూ” అని ఆయన ఆఫీసు్‌లోకి పిలిచేవారు.

ఎలాగా ఇపుడు?

ఓ పక్క బుక్సూ _

ఇంకో పక్క పకోడీసూ _

బోల్డు సేపు ఆలోచించి, పకోడీలు ఆసాస్వితం, బుక్సు సాస్వితం అని నిట్టూర్చేవాడిని. (అసాస్వితం అంటే గబుక్కుని అయిపోయేవిట , సాస్వితం అంటే బోల్డు రోజులు ఉండేవిట)

అంటే, ముందు పకోడీసు తినేస్తే, బుక్సు ఆనకైనా చదూకోవచ్చు అని అర్ధం అన్నమాట.

మెడ్రాసూ – బాపూ రమణీయం – ఖద

 

ఏం. మెడ్రాస్ వెళ్ళిపోయామా, అక్కడ బాపూరమణగార్ల ఇంట్లో ఉండేవాళ్లమన్న మాట! అక్కడ ఇంతమంది పిల్లలం ఉన్నామా!

(“ఎంతమంది? నువ్వు చెప్పలేదుగా! బుడుగూ!”

“అయితే చదువు “తోక కొమ్మచ్చి” బై అనూ ముళ్ళపూడి ‘అను’ రమణగారమ్మాయి. ‘అను’ మా అమ్ములు”)

ఏం ఇంతమంది ఉన్నామా – గెస్టులూ, ఇష్టులూ . ఇంకా బోళ్ళుమంది.

mullapudi budugu

భగ్యవతీ ఆంటీ మమ్మల్నందరినీ బీచికీ, ఇంకా బోలెడు షికార్లకీ తిప్పేవారు. తిరిగీ, తిరిగీ, అలిసి, సొలసి ఇంటికొచ్చేసరికి, శ్రీదేవీ ఆంటీ మాకందరికీ భోయనాలూ..

పిల్లలందరూ వరసాగ్గా కూచుని.. ఏం . భలే ఉండెదిలే! అల్లరి టుది పవరాఫ్ అల్లరి.

బీచ్‌లూ, షికార్లూ వీటిల్లో మాతోపాటు నానారు లేరన్న సంగతి ఎప్పుడో సాయంకాలం గుర్తొచ్చి

“అమ్మా నానారేరమ్మా” అనడిగితే .. పెద్దాళ్ళతో కబుర్ల హడావిడీలో ఉన్న అమ్మ

“వాళ్ళు కథ మీద కూర్చున్నర్లే ఆ గదిలో” అనేసి మళ్ళీ కబుర్లలో పడిపోయేది.

‘కథ మీద కూచోటం’ అంటే నాకర్ధం కాలేదు.

సర్లే అని ఆ గది గుమ్మం దగ్గిరకెళ్ళి తొంగి చూశా.

బాపూరమణగార్లూ, నానారు ఇంకొన్ని ఫ్రెండ్సులూ సుబ్బరంగా నేల మీదే కూచున్నారు. కథా లేదూ ఏమి లేదు!

అదే సంగతి ఆనక నానారితో చెప్పాను.

“వాళ్లు నేల విడిచి సాము చేయరు” అని వెళ్ళిపోయారు. ఇదీ నాకర్ధం కాలేదు.

హ్మ్మ్ .. ఏంటో ఈ పెద్దాళ్ళు!!

 

ఫోటో వివరాలు -ఎడమ నుంచీ కుడికి  ( కూర్చున్న వారు ) శ్రీ యుతులు కనుమూరి వెంకట రామరాజు, ముళ్ళపూడి వెంకట రమణ, ఎమ్వీయల్, బాపు,నవోదయ రామ్మోహనరావు గార్లు (నుంచున్న వారు) శ్రీ యుతులు బివియెస్ రామారావు, నండూరి రామ్మోహనరావు గార్లు

ఫోటో వివరాలు -ఎడమ నుంచీ కుడికి: ( కూర్చున్న వారు ) శ్రీ యుతులు కనుమూరి వెంకట రామరాజు, ముళ్ళపూడి వెంకట రమణ, ఎమ్వీయల్, బాపు,నవోదయ రామ్మోహనరావు గార్లు, (నుంచున్న వారు) శ్రీ యుతులు బివియెస్ రామారావు, నండూరి రామ్మోహనరావు గార్లు

‘వంట + ‘ఒంట’ బట్టిన వొకాబులరీ ఖద

 మిత్రులతోనూ, అపుడపుడు ఇంట్లోనూ సరదాగా నానారు రమణగారి భాష మాటాడుతుండేవారు. అంచాత మా ఇంటిల్లిపాదికీ అదే విద్యాభ్యాసం. బుడుగు భాష, అప్పారావు భాష, ముత్యాలముగ్గు కంట్రాక్టరు భాష వగైరాలు సమయం సందర్భం బట్టీ.

సోదాహరణముగా వివరింపుము అని మీరంటే గనక, ఓ ఖద (చిన్నదేలే  భయపడకు)

కొత్తావకాయ పెట్టిన రోజుల్లో అమ్మ ఆవకాయ కాకుండా, వేరే ఏదైనా కూర వడ్డించబోతే..

“మహత్తరమైన ఆవకాయ కాకుండా అల్పమైన ఈ కూరలేల?”  అన్న భావన   బట్వాడా చేయటానికి

“ధిక్ అబ్బీ! యామి శిశువా” అని రాజాధిరాజు సైతాను భాష వాడేవారు.

అలాగ రమణగారి భాష మా జనజీవన స్రవంతిలోనే కాక భోజన జీవన స్రవంతిలో కూడా కలిసిపోయి వంట_ఒంట బట్టింది.

———————

” అఋణకిరణుడు కనుచూపు మేరలోకి రాగానే ఋణకిరణాలవాడు పాలిపోయి పారిపోయాడు…” అన్న రమణగారి “ౠణానందలహరి” ప్రారంభవాక్యంలో కథా నేపధ్యం, ఋణహృదయం, బోలెడు  హాస్సెంతో బాటు – సైన్సు సంగతులు కలగలసిపోయి (రమణగారి సాహిత్యంపై సమగ్ర పరిశోధన) చదివితేగానీ, నా చిన్ననాట అర్ధం కాలేదు.

“సూర్యుడు సముద్రం నించీ నీళ్లు అప్పుగా తీసుకుని మళ్లీ వర్షంగా భూదేవికి అప్పిస్తున్నాడు..” అన్న అప్పారావు థీరీ ‘వాటర్ సైకిల్’ అన్న పదిమార్కుల ప్రశ్న వీజీగా గుర్తెట్టుకోవడానికి ఉపయోగపడింది.

ఈ మేజిక్కులు,  నా ఇంజనీరింగ్ చచువులో ఫార్ములాలు అలావోకల్’గా బట్టీ పట్టడానికి ఆస్సెం గుళికలు మిళాయించమని అవుడియాలు ఇచ్చాయి.

పిల్లలకోసం బాపూరమణలు ఇష్టపడీ ఎంతో కష్టపడీ తీసిన వీడియోపాఠాలు ప్రజలకి అందేలా చేయమని శ్రీ ప్రభుత్వం వారిని ప్రార్ధిద్దాం. వీటిలో ముందు తరాల బుడుగులకి ఎంతో లాభం..

————————

“ఆయ్ మరేనండయ్యా! బాపూరమణలు శానా సినేమా కతలూ, వీడియో కతలూ చెప్పేశారు. ఆ బైగినెస్సులో జనాలకి కనీసం రెండు ‘ల’కారాల దాకా మిగిలింది.

‘లె’ర్నింగూ, ‘లా’ఫింగూ” అని ముక్తాయించాడు ము.ము.కాంట్రాక్టరు.

——————

 ముగింపు బిగిన్‌పు

“కొయ్ కొయ్ నా రాజా!”

మీ నానారిని  సిన్మా తీయమని నువు ఎంకరేజీ చేశావా – అదీ నీకు అయిదేళ్లప్పుడు!!

అసలు నువు రాసిందంతా రమణగారి భాష కాపీ” అన్నారు చదివిన కొందరు ప్రజలు.

“మీరు భలే తెలివైనవాడులు!! కనిపెట్టేశారు !! రాతలూ కోతలూ – వారు లేకుండా వేరు శాయంగల పరమహంసలు!

నాకు తెలుసు. అసలు బాపూరమణల్ని కాపీ కొట్టీనంత మాత్రాన్నే తెలుగుభాష ఇంకో ప్ఫదో, డెబ్భయ్యో, పదమూడే ఎక్కంలోని చివరి నెంబరన్ని ఏళ్లు – వాళ్లంత ధీమాగా బతికేస్తుందని, కాపీకొట్టని నా సొంత అభిప్రాయం.

అదియునూ గాక

ఆత్మఖద అంటేనే నికార్సైన ఆత్మస్తుతితో కల్తీలేని పరనింద అన్నారు మా గురువులు రమణారు. మరిహనేం మనకి ‘పవరాఫ్‌టర్నామా’ ఇచ్చేసినట్టే గదా! త్రివిక్రముడు శీనన్న చెప్పినట్టు

మాకు మాత్రం ఆత్మలుండవా ? వాటికీ కథలుండవా? అంచాత వేస్కున్నా నాకు నేనే వీరతాళ్ళు.

———————–

అయితే ఒకటి మాత్రం పచ్చినిజం. కాదు కాదు పండు నిజం.. పండిన నిజం.. మా నానారు నా ఐదోఏట నన్ను బాపూరమణల బళ్ళో పడేసి – గబుక్కున ‘పెన్’చేశారు.

చిన్నపుడు మేం ఆడుకున్న వాళ్ళింటి ముందరి చెట్టు సాక్షిగా!

నేటీకీ గుబాళిస్తున్న నాటి పూల సువాసన సాక్షిగా!!

-రాం ప్రసాద్

( ఎమ్వీయల్  ( 21 సెప్టెంబర్  1944 – 23 జనవరి  1986) వృత్తి రీత్యా తెలుగు అధ్యాపకులు. ప్రవృత్తి  రీత్యా  రచయిత .  ముత్యాల ముగ్గు చిత్ర నిర్మాత గా   , ఆంధ్రజ్యోతి లో ప్రశ్న – జవాబుల శీర్షిక  ‘యువజ్యోతి ‘ నిర్వాహకులుగా ప్రసిద్ధులు.  యువతరం మార్గ దర్శకత్వం, సాహిత్య ప్రచారం  ధ్యేయం గా ఆంధ్ర దేశం అంతటా 

ప్రసంగాల పన్నీటి జల్లులు కురిపించిన వారు. 

మరిన్ని వివరాలు ఈ బ్లాగు లో –

ఈ హార్టికల్ రచయిత ఎమ్వీయల్ గారి అబ్బాయి.  కార్టూన్ బొమ్మ: బ్నిం)

మీ మాటలు

 1. రామ్ గారూ, భలే ఉందండి బుడుగు కథ :-) మీ రచనల్లో తళుక్కుమంటూండే ‘puns’ భలేగా ఉంటాయండి!
  wishing to read some more interesting articles from your pen (i .e కీబోర్డ్ :))

  • రామ్ says:

   చదివినందుకు స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు తృష్ణ గారు

   రామ్

 2. DrPBDVPrasad says:

  హార్ని పిడుగా!బుడుగా పెద్దోడివయ్యావా? కౌముదిలో చూసి పలకరించటం కుదర లేదు నువ్వు నాన్నారేలు పట్టుకొని బులుగ్గా మా వూలు కోలూలు(కోడూరు) వచ్చావమ్మా చిన్నప్పులు
  ….
  ఎంవీఎల్ గారిని మరోసారి గుర్తుకు తేవటమే కాదు శైలి కూడ(ముళ్ళపూడి వారితొ కలిపి) పుణికి పుచ్చు కున్నందులకు అభినందనలోచ్

  • రామ్ says:

   నమస్కారం అండీ ప్రసాద్ గారు . మిమ్మల్ని ఇలా కలుసుకోవడం సంతోషం
   నానారిని గుర్తుకు తేవటం అన్నది చాలా పెద్ద ప్రశంస నాకు. ధన్యవాదాలు.

   రామ్

 3. ఇంత ‘అలవోకల్ ’గా రాసెయ్యటానికి ఐదో ఏటే బాపూ రమణల బళ్ళో పడేసి ‘పెన్’ చేయటమే కారణం అన్నమాట! తెలిసింది! రాసింది… బాగుంది!

  ఆ బిగినెస్సులో జనాలకి ఏ రెండు ‘ల’కారాలు మిగిలాయో ఎంత బాగా చెప్పారు! మరి ఆ వీడియో పాఠాలు జనాలకి పూర్తిగా అందేదెప్పుడో కదా!

  • వేణు గారు

   ఆయ అంతే కదండయ్యా మరీ !! ఆళ్ళు సదువుల కోసం సెపరేషను గా డిపార్టుమెంటు పెట్టకుండా నవ్విస్తా ఉపయోగ పడేయి సెప్పేసారు కదండయ్యా !!

   మీ స్పందన కు ధన్యవాదాలు

 4. పాండీబజార్ ప్లాట్‌పారమ్ మీద దమ్ము కొడుతూ మీ నాన్నారితో కబుర్లు చెప్పుకోవడం ఇంకా గుర్తుంది. స్వర్ణయుగం అది.

  • అనిల్ గారు

   చదివినందుకు మీ జ్ఞాపకం పంచుకున్నందుకు ధన్యవాదాలు .

 5. amarendra says:

  రామ్ ప్రసాద్ గారూ
  బావుంది మీ నిఖార్సయిన ఆత్మ కథనం!
  mvl గారిని ఒక సారి ఏలూరు లైబ్రరి లో విన్నాను..తిలక్ త్రిమూర్తులు చదివారు ఇప్పటికీ జ్ఞాపకం
  thanks

  • అమరేంద్ర గారు

   అవునండీ – రమణ గారు నానారికి ఇష్టమయిన రచయిత , తిలక్ గారు ఇష్టమయిన కవి.
   ఏలూరు లో తిలక్ గారి మీద చేసిన ప్రసంగం బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.

   ధన్యవాదాలు.

 6. Srinivasa Rao Mekala says:

  నమస్తే సర్ బాగున్నారా?
  ముందుగా మీకు మీ కుటుంబానికి విజయదసమి శుభాకాంక్షలు. మీ నాన్నగారి గురించి ఈ బ్లాగ్ లో చదివిన తరువాత నాకు తెలిసింది వారు ఎంత పేరు ప్రక్యాతులు గలవారో. మీరు కెయిన్ లో రవ్వ లో సుమారు పది పండ్రెండు సంత్సరాలు చేసారు,ఎప్పుడు మీ నాన్న గారి గురించి నాకు చెప్పలేదు, నాకు తెలియదు కుడా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది MVL గారి అబ్బాయి గారి దగ్గరా నేను ఇన్నిరోజులు subordinate గా చేసింది అని. నాకు ఇలా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. బుడుగు కథ బాగుంది. మీరు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కవితలు, కథలు ఈ బ్లాగ్ ద్వారా వినిపిస్తారని ఆశిస్తున్నాను.

  ఇట్లు
  మీ శ్రేయోభిలాషి,
  మేకల శ్రీనివాసరావు

  • శ్రీనూ !!

   cAIRN INDIA మిత్రుల జ్ఞాపకాలు కోనసీమ కొబ్బరాకు అంత పచ్చ గా దాచుకుని ‘నార్వే’ తెచ్చుకున్నాను – “ఆయిలా ఆయిలా ఆయిలాయే ” అని పాడుకుంటూ

   ఇలా కలవటం చాలా సంతోషం .

 7. vara mullapudi says:

  ప్రసాద్ గారూ- సూపర్బ్. చాలా చాలా చాలా చాలా బావుంది. బోల్డు బోల్డు జ్ఞాపకాలు..థాంక్ యు సో ముచ్.. మీ స్టైల్ అఫ్ రైటింగ్ నాన్నా మామలనీ, మీ నాన్నగారినీ- అ ఫన్ టైమ్స్ నీ కాళ్ళ ముందు జరిగినట్టుగా చూపించాయి. వండర్ఫుల్.

  కీప్ అప్ ది గ్రేట్ వర్క్. గాడ్ బ్లెస్స్ యు.

 8. vara mullapudi says:

  సవరణ- కళ్ళ ముందు.. కాళ్ళ ముందు కాదు. క్షమించాలి. ఈ తెలుగు టైపింగ్ కొంచం complicated గా ఉంది.

  • రామ్ says:

   ముళ్ళపూడి వారి వర వాగామృతం కురిసినందుకు ధన్యవాదాలు .

 9. voleti venkata subbarao ( eliyaas uncle) says:

  నేను ఆనందం లో మునగడం తో ,పైకి మాటలు సరిగ్గా రావడం లేదు .. ఇది హండ్రడ్ పర్సంట్ నిజం సుమీ … అంటే అంత బాగా రాసావన్నమాట ..రామ్ ప్రసాద్ .. నువ్వు రాస్తావని తెలుసు గానీ –మరీ ఇంత బాగా రాయగలవని..ఇదుగో ..ఇప్పుడే నాకు కుంచెం లేట్ గా తెలిసింది .మన ఎం వి ఎల్ గారు- రమణ గారు -ఇద్దరూ కూడబలుకేసుకుని నిన్ను ఆవేశించారు కాబోలును —-శుభమస్తు ..అభినందనలు –చికాగో సుబ్బారావు అంకుల్ ..

 10. రామ్ says:

  ముళ్ళపూడి వారి వర వాగామృతం కురిసినందుకు ధన్యవాదాలు .

 11. g b sastry says:

  మీరు ఎప్పుడో గొప్పగా రాసినది ఇప్పుడే చదివి ‘పండిత పుత్ర ……’ అన్నది తప్పని నిరూపించి న మీకు ధన్యవాదాలు.
  ఎక్కడా నాన్నగారు రమణ గారికిచ్చిన ‘ముళ్ళపూడి భాయీ జాన్సన్కి సెబాస్వెల్ ఎమ్వీయల్ ‘ అని ఆరుద్రగారి సెబాసులందుకొన్న ‘కానుక’ అనే సమగ్ర సాహితి విశ్లేషణాన్ని తెలపలేదేమా అని కించిత్ బాధపడినా సోత్కర్షకు లోనుగాని మీ హుందాతనాన్ని మెచ్చుకో లేకుండా ఉండలేక పోతున్నాను

 12. Vasantha Buddhiraju says:

  చాల బాగుంది ప్రసాద్ నేను చాల ఇష్టపడే పుస్తకం బుడుగు. ఇష్టపడే రచిత ముళ్ళపూడి గారు. చాల చాల……బాగుంది.

మీ మాటలు

*