జీవిత నాటక రంగం పై “ఆమె” !

bhuvanachandra

Untold Stories – 7

 

“మొదట్లో మా అమ్మంటే  నాకు అసహ్యం..!” నవ్వింది సుచరిత.

“నిజమా?” అడిగాను. నా గొంతులో ఆశ్చర్యం లేదని నాకు తెలుసు.

“నా నాలుగో ఏట నన్ను వదిలేసి, మా నాన్న పరువు తీసి ఇల్లొదిలి పెట్టి వెళ్ళిపోయింది. సంఘంలో నేను చిన్ననాటి నుంచి పడ్డ అవమానాలు నన్నో ‘ఇంట్రావర్ట్’ గా మార్చాయి. దేముడూ, పూజలూ అంటూ పవిత్రంగా ఉండే మా నాన్న మా అమ్మ కొట్టిన దెబ్బకు ‘దేవదాసై’ కొంపని పట్టించుకోవడం మానేశాడు. ఇహ మా బామ్మా, మా తాతయ్య అయితే, నేనో దురదృష్టవతురాల్ననీ, నా దురదృష్టమే కొంపని నాశనం చేసిందనీ, నా చదువు పూర్తయ్యేదాకా సాధిస్తూనే ఉన్నారు. అట్లాంటి పరిస్ధితుల్లో పెరిగిన నాకు, అమ్మంటే అసహ్యం కాక అభిమానమూ, అనురాగమూ పుడతయ్యా?” సుచరిత నవ్వుతూనే చెప్పినా కళ్లల్లో మాత్రం ‘కసి’ నివురు గప్పిన నిప్పులా కనిపిస్తూనే ఉంది.

“అయితే ‘మొదట్లో.  మా ‘అమ్మంటే నాకు అసహ్యం’ అని మీరిచ్చిన ‘స్టేట్మెంట్’ రాంగ్ కదూ. ఎందుకంటే మీ కళ్ళల్లో ఇంకా ‘కసి’ ఉంది” నేను నవ్వుతూనే అన్నాను. ఆ మాత్రం చనువు సుచరితతో నాకు ఉంది. “ఇప్పటికీ అసహ్యం అవునా?” కళ్ళలోకి చూస్తూ అన్నాను.

సుచరిత వాళ్లది తెనాలి. తెనాలి అంటేనే గొప్ప కళాకారులు జన్మించిన ఆంధ్రా పేరిస్. భానుమతిగారూ, రామకృష్ణగారూ, శారదగారూ, ముక్కామలగారూ ఇలా చెప్పుకొస్తే తెనాలి కళాకారులూ, నిర్మాతలూ, దర్శకుల సంఖ్య అనంతం. నాకు డబ్బింగ్ మెళకువలు నేర్పిన అన్నగారు శ్రీ రామకృష్ణగారిదీ తెనాలే.

సుచరిత వాళ్లమ్మ కల్పన.(అసలు పేరు కళ్యాణి) . కల్పనగారు సినిమాల్లో ఎంటరై రెండో సినిమాకే కళాశ్రీ అని పేరు మార్చుకుంది. (ఇది నేను పెట్టిన పేరు. ఆమె కోరికతో అసలు పేరు దాస్తున్నాను). ఇరవై రెండేళ్ళకే ముగ్గురు పిల్లల తల్లై కుటుంబాన్ని వదిలేసుకుని మద్రాసు పారిపోయి వచ్చేసింది. పెద్దకొడుకు, చిన్నకొడుకు అమ్మమ్మగారింట్లో  పెరిగితే కూతురు సుచరిత బామ్మగారింట పెరిగింది. కళాశ్రీగా పేరు మార్చుకున్న తరుణంలో పెద్దాడికి ఏడేళ్లూ, రెండో వాడికి ఆరేళ్ళు, సుచరిత నాలుగేళ్ళు. యీ వివరాలు సుచరితని కలవకముందే నాకు తెలుసు. కళాశ్రీ కూడా ‘అంబిక’ అనే కలం పేరుతో కథలు రాస్తూ ఉంటుంది. అది నాకు తెలుసు.

నిజం చెబితే అంతే కవిగారు. ‘కసి’ ఉందీ…. లేదూ… ఒకటి నిజం. అప్పుడు ఆమె అంటే అంతులేని అసహ్యం. ఇపుడు జాలీ, కసీ ఇంకా ఏదో తెలీని మమకారం కూడా ఉందని అనుకుంటున్నాను. “సూటిగా నా కళ్లలోకి చూస్తూ అంది సుచరిత.

“ఒకే వరలో మూడు కత్తులా?” నవ్వాను.

“జాలీ మమకరం కూడా కత్తులేనా?” కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యం నటిస్తూ అన్నది సుచరిత.

“ఈ  ‘అసహ్యం, కసి’ అనబడే కత్తులకంటే వెయ్యిరెట్లు పదునైన కత్తులు ‘జాలీ, మమకారం’ . ఆ విషయం ఇరవై రెండేళ్ళ వయసులో ఉన్న  నీకు ప్రస్తుతం అర్ధం కాదేమోగానీ, జీవితాన్ని ‘మనసుతో’ గమనించిన వాళ్లకి ఖచ్చితంగా అర్ధమౌతుంది.” నేనూ తన కళ్లలోకి చూస్తూనే అన్నాను.

“ఓహో అవిడా రచయిత్రేగా! అందుకే మీరు కాస్త అటుపక్క మొగ్గు చూపుతున్నారన్నమాట!” మాటల్లో తీవ్రత ఉన్నదని చెప్పక తప్పదు.

“కావచ్చు. కానీ సుచీ, ఒక్క విషయం చెప్పు. అప్పటి ‘కాలా’నికీ, ఇప్పటి ‘కాలా’నికీ, అప్పటి సామాజిక పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకి ఉన్న తేడాని బేరీజు వేశావా ఏనాడైనా? మీ అమ్మ ‘లేచి’పోయిందని జనాలు నీతో నీ చిన్నతనాన అన్న మాటలే నీలో పాతుకుపోయాయిగానీ, ఆమె నిజమైన పరిస్థితినీ, బాధనీ ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా? కనీసం ఊహించావా?” సిన్సియర్‌గా అడిగాను.

“ఊ!” ఏ కాలమైనా ‘తల్లి’ తల్లేనండీ. తను నవమాసాలూ మోసి చావుకి తెగించి కన్న బిడ్డలని, తనే వదిలిపోయిందంటే, ఆమె తల్లి అవుతుందా? సరే.. తన పరిస్థితి భరించలేనంత దుర్భరంగా వుంటే బిడ్డల్ని కూడా తీసుకుపోవచ్చుగా తనతో? పోనీ తను కొద్దో గొప్పో సెటిల్ అయ్యాకైనా తన బిడ్డల్ని తన దగ్గరికి పిలిపించుకోవచ్చుగా?” కచ్చగా అన్నది సుచరిత.

“నీకు క్రికెట్ అంటే ఇష్టం కదూ? ప్రేక్షకురాలిగా బోలేడన్ని కామెంట్స్ ఎవరైనా ఇవ్వొచ్చు. కానీ, పిచ్‌లో నిలబడి ఆడుతున్నవాళ్లకి కదా కష్టం తెలిసేది.? కాదంటావా?”

“ఓహో … మీరు తర్కం వుపయోగిస్తున్నారన్నమాట. అయ్యా… తర్కంలో కూడా నాలుగు విభాగాలున్నాయని నాకూ తెలుసు. ఇక్కడ కావల్సింది గెలుపోటముల వ్యవహారం కాదు. మానవత్వం” సుచరిత గొంతులో కాస్త అవహేళన ఉంది.

“ప్రస్తుతం మీ నాన్నగారు మంచాన పడి వున్నారని నాకు తెలిసింది. మానవత్వం గురించి చర్చించేటప్పుడు మరి ఆయన హాస్పిటల్ ఖర్చులన్నా నువ్వు భరించాలిగా. భరించే స్థోమత నీకుండీ ఎందుకు మీ నాన్నని దూరంగా పెట్టావు?” బిలో ద బెల్ట్ ఏనాడూ దెబ్బ కొట్టకూడదని తెలిసీ కావాలనే దెబ్బ కొట్టాను.

“ఉక్రోషం ఎంత అసహ్యంగానైనా మాట్లాడిస్తుందనటానికి మీరన్న మీ మాటలే ఉదాహరణ మాస్టారూ.. నిజమే స్థోమత ఉంది. కానీ ఆయన చేసిన అన్యాయం? ఎనిమిదేళ్ళ కూతుర్నీ, అదీ తల్లి ప్రేమకి నోచుకోని దాన్ని పట్టించుకోకుండా, ఇంటీ పనిమనిషిని ఉంచుకుని, దాన్నే పెళ్ళి చేసుకుని, దాన్నే అమ్మ అని పిలవమని నా వీపు మీద వాతలు పెట్టాడన్న విషయం మీకు తెలీదు. వదిలెయ్యండి కవిగారూ.. నా గతాన్ని తలుచుకున్న కొద్దీ పగిలేవి అగ్నిపర్వతాలే!” బొటబొటా కన్నీరు కార్చింది సుచరిత.

“గుడ్! నీ కష్టాలు  నువ్వు తల్చుకోగానే పగిలేవి అగ్నిపర్వతాలు. కానీ, మీ అమ్మ కష్టాలు మాత్రం నీ దృష్టికి శీతలపవనాలుగా అనిపించి ‘కసి రేగుతుంది’ కదూ! ఇదేం న్యాయం?” నా గొంతులో మోతాదుకి మించిన వ్యంగ్యాన్ని వొలికించాను.

“అంటే మీరనేది మా అమ్మ చేసింది రైట్ అనా? “కోపంగా అన్నది.

“తల్లిదండ్రుల విషయంలో తప్పొప్పులు  ఎంచే హక్కు పిల్లలకి లేదు. ఎందుకంటే నీ పుట్టుకకు కారకులు వాళ్లు. తల్లి అండాన్ని దానం చేస్తే, తండ్రి బీజాన్ని దానం చేస్తాడు. అండము, బీజము కలిసి పిండమైతేనే నువ్వు లోకానికొచ్చింది. అయినా, నీ తండ్రికి చెయ్యగలిగీ నువ్వెందుకు సహాయం చెయ్యట్లేదో నీ నిర్ణయం. నీ తండ్రి నీకు చేసిన అపకారాన్నీ, నిన్ను పెట్టిన బాధల్నీ నువ్వు క్షమించలేవు . కానీ నీ తల్లి,  నీ తండ్రి పెట్టిన బాధల్ని మాత్రం క్షమించి ఆ నరకంలోనే ఉండుంటే నీకు చాలా తృప్తి కలిగి, మా ‘అమ్మ దేవత’ అనుండేదానివి కదూ?

అయితే అదే ప్రశ్న మళ్లీ అడగక తప్పదు. ‘ నా కూతురు దేవత’ అని ఇప్పుడు మీ నాన్నతో అనిపించుకోగలిగిన స్థితిలో ఉండీ, ఎందుకు అనిపించుకోలేకపోతున్నావు?” యీసారి నేను నవ్విన నవ్వులోనూ వ్యంగ్యం ఉందని నాకు తెలుసు.

“శబాష్ కవిగారూ! అటు ఆవిడా ఇంకోడ్ని పెళ్ళి చేసుకుంది. ఇటు ఈయనా ఇంకోదాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్లు పరిస్ధితులతో ఏనాడూ రాజీపడలేదు? వాళ్ల బుద్ధికీ, వాళ్ళ మనసుకి తోచింది చాల నిర్భయంగా నిస్సిగ్గుగా చెసేయ్యొచ్చు .  కానీ మేం మాత్రం చాలా విశాల హృదయంతో అర్ధం చేసుకుని, వాళ్ల అవసరాల్ని గమనించాలన్నామట! ఎంత ధృతరాష్ట్ర నిర్ణయం మీదీ?” వ్యంగ్యంగా నవ్వుతూ చప్పట్లు చరిచింది సుచరిత.

“ఓకే సుచీ..  నాది ధృతరాష్ట్ర నిర్ణయమే అనుకో. కాదనను. పోనీ నువ్వన్న మాటనే కాస్త వివరిస్తావా?”

“ఏ మాట?”

“మొదట్లో అసహ్యం ఉండేది. ఇప్పుడు జాలీ, కసీ కొంచెం మమకారం కూడా ఉన్నాయి. అన్న మాటని!”

“దీన్నేనా కాలుకేస్తే వేలికీ, వేలికేస్తే తలకి వెయ్యటం అంటే?  సరే.. జాలి ఎందుకంటే, ఇరవై రెండేళ్ళకే ముగ్గురు పిల్లల్ని వొదిలేసి, వేటూరిగారన్నట్టు యీ దుర్యోధన దుశ్శాసన దుర్మదాంధ ప్రపంచంలోకి ఒంటరిగా ప్రవేశించి నానా అగచాట్లు  పడినందుకు. కసి ఎందుకంటే, కేవలం స్వసుఖం, స్వార్ధం కోసం కన్నబిడ్డల్నీ, ఇంటి పరువు పతిష్టల్నీ నడిరోడ్డున వొదిలి తనతోవ తాను చూసుకొన్నందుకు. మమకారం ఎందుకంటే, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి గనక. ఆ రాస్కెల్ అదే నా తల్లి గొప్ప నటీమణి. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో వొదిగిపోతుంది. ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన నటీమణుల్లో ప్రధమురాలని అననుగానీ,  ప్రముఖురాలు. ఆవిడ్ని తెరమీద చూసినప్పుడల్లా ‘యీవిడా నా తల్లి!” అని ఆశ్చర్యంతో మైమరచిపోతా. హాల్లోంచి బయటికి రాగానే… “వాహ్.. అంతా నటనే!” అని జ్వలించిపోతా.  ‘తల్లిమనసు’ చిత్రంలో కూతురికి పోలియో అని తెలిశాక ఏడిస్తూ ఆవిడ నటించిన సీను చూస్తే ‘తల్లంటే అదిరా’ అని ఎవడైనా అనుకుంటాడు. అలాంటి అమ్మ ఉండాలని ప్రతివాడు ఊహించుకుంటాడు…. నేను తప్ప!! ఎందుకంటే ఆ ఏడుపు ఆ ఎక్స్‌ప్రెషన్సూ అన్నీ క్షణికాలే.. అంతా నటనే…!”కసితో పాటు అసహ్యమూ ధ్వనించింది. “అయినా .. ఇంత గొప్ప నటీమణి నా తల్లి అన్న గర్వం, మమకారం మనసులో మెదులుతాయి” అన్నది.

నేను సైలెంటైపోయాను. సుచరిత మనసులో కలిగే భావాలు నాకు తెలీకపోలేదు. కానీ నా ప్రయత్నం నేను చెయ్యక తప్పదు.

“నిజంగా సుచీ. నీ హృదయం చాలా గొప్పది. నిష్పక్షపాతం గా  మీ అమ్మగార్ని మెచ్చుకోవడం నీ నిజాయితీకీ, సంస్కారానికీ నిదర్శనం. బహుశా మీ అమ్మ నీకు ఏమిచ్చినా, ఏమివ్వకపోయినా నీకు తన రక్తాన్నేగా ‘నటన’నీ వారసత్వంగా  ఇచ్చిందని చెప్పక తప్పదు. ‘రాలిన చివురాకు’ లోనీ నటనకి అవార్డు రావడమే నీలోని నటి ‘ప్రజ్ఞ’కి నిదర్శనం.”నిజంగానే మెచ్చుకున్నాను.

“అవును గురూజీ! ఇంతకీ నన్ను ములగచెట్టు ఎందుకెక్కిస్తున్నారు?” పరిహాసంగా అన్నది సుచరిత.

“ఒక గొప్ప నటికి మరో మహానటి మనసు అర్ధం కాదా? మీ అమ్మ ఏనాడూ గ్లిజరిన్ వాడదని అందరికీ తెలుసు. సన్నివేశంలో దిగ్గానే కన్నీళ్లు వాటంతట అవే వర్షంలా కురుస్తాయని అంటారు. నువ్వూ ‘రాలిన చివురాకు’ సినిమాలో గ్లిజరిన్ వాడలేదని నాకు తెల్సు. ఆనాడు నీ కళ్లలోంచి వచ్చినవి వెచ్చని స్వచ్ఛమైన కల్తీలేని కన్నీళ్ళే. కళ్లలోంచి నీళ్లు కురవాలంటే మనసు కరగాలి. ఆ మనసు కరగాలంటే  అది పాషాణం కాకూడదు.  చిన్న చిరుగాలికైనా స్పందించి, అటూ ఇటూ ఊగే చిగురాకు  కావాలి.  అలా చూస్తే మీరిద్దరిదీ చివురాకులాంటి స్పందించే మనసులే. పాషాణాలు కావు.” మధ్యలో మాటల్ని ఆపేశాను.

“ఎందుకు మళ్లీ  మేము తల్లీకూతుళ్లమని జ్ఞాపకం చేస్తారూ? మా ఏడుపులూ మా నవ్వులూ ఒకలాగే ఉండొచ్చు. కానీ మా అదృష్టాలూ, దురదృష్టాలూ ఒకటి కాదుగా? ఆవిడకేం? మొగుడున్నాడు. ఒకరో ఇద్దరో మాలాగా కాకుండా, ‘ప్రియమైన’  పిల్లలున్నారు.  ఆస్తి వుంది… అంతస్థూ వుంది…’  నటిగా బోలెడు మందాన పేరుంది. ఇంకేం కావాలీ        “మా గోల మాది. నా ఇద్దరు అన్నలూ ఎందుకూ  పనికిరానివాళ్లయిపోయారు. చిన్నతనం నించీ వాళ్లు పడ్డ అవమానాలు వాళ్లని గొంగళి పురుగుల్లా మార్చినై. ఎక్కడా ఉండలేరు. కనీసం ‘ఇది’ కావాలని అడగలేరు. మమ్మల్ని ఒదిలి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఒకడు ఆర్మీలో ఎక్కడో బోర్డర్లో వుంటే ఇంకోడు రైల్వే కేటరింగ్ సర్వీసులో గంటకో వూరి గాలి పీలుస్తున్నాడు. మరి మీరు మాత్రం మా అమ్మగారిని మాకేదో దగ్గర చెయ్యలనే ప్రయత్నం మాత్రం మానటంలేదు. మమ్మల్ని కలిపితే మీకొచ్చే లాభం ఏమీ లేదని నాకు తెలుసు. కానీ ఆవిడ ‘ఈగో’ సాటిస్‌ఫై అవుతుంది. ఏవో కాకమ్మ కబుర్లు చెప్పి,  నన్ను దగ్గరికి తీసుకుని,” నా తప్పేమీ లేదు బుజ్జీ, ఇది కేవలం విధి లిఖితం. లేకపోతే నీ ‘దృష్టిలోపం’ అని తనని తాను విముక్తురాలిగా చేసుకుంటుంది. మాస్టారూ, అది నాకు ఇష్టం లేదు. ఇన్నేళ్ళ తరవాత ఆమె ప్రేమ ఒద్దు. అసలావిడ ప్రసక్తే మళ్ళీ తీసుకురావొద్దు” ఖచ్చితంగా అన్నది సుచరిత.

నేను నవ్వాను.

“మీరు ఇదంతా ఊహించే వచ్చారనీ, మీరు ఊహించిన మాటల్నే నేను మాట్లాడుతున్నాననీ నవ్వొచ్చిందా మాస్టారూ? నవ్వండి. ఎందుకంటే పులి ఆకలి లేడికి నరకం. మీ రచయితలు బహుశా పులులకంటే క్రూరమైన లక్షణాలతో పుడతారేమో! మీ మీద నాకున్న గౌరవాన్ని దయచేసి అలాగే వుండనివ్వండి.  మా అమ్మకారణంగా దాన్ని మట్టిపాలు చెయ్యకండి.మరి…! “ఆగింది సుచరిత.

“సెలవు తీసుకోమంటావు అంతేగా సుచీ! సరే వెళ్ళొస్తాను. కానీ ఒక్కమాట… తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం న్యాయమే. కాదన్ను. కానీ వాళ్లు తమ తప్పుని సరిదిద్దుకోవటానికి ఓ అవకాశం ఇవ్వడం కూడా అన్యాయం కాదేమో?” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాను.

“వాళ్లు తప్పు దిద్దుకోవడానికి అవకాశమా? ఇస్తాను. మరి నా బాల్యం వాళ్లు నాకు ఇవ్వగలరా? చెప్పండి… ఇవ్వగలిగితే యీ క్షణమే మా నాన్న కుటుంబాన్ని మద్రాసు తీసుకొచ్చి నేను పోషిస్తా. ఇవ్వగలిగితే యీ క్షణమే మా అమ్మని కల్సి, ఆవిడ పిల్లల్ని నా తోబుట్టువులుగానూ, ‘ఆయన్ని’ తండ్రిగానూ  స్వీకరిస్తా. .. ఏం? నా బాల్యాన్ని మళ్ళీ వాళ్ల చేత నాకు ఇప్పిస్తారా?”

ఇసుకలో ఇంకిన నీటినీ, ‘గతపు’ నీడల్లో ఒదిగిన కాలాన్ని మళ్లీ ఎవరు వెనక్కి తేగలరు?”

“వస్తాను సుచీ.. తప్పో రైటో నాకు తెలీదుగానీ మీ అమ్మ బాధ చూడలేక వచ్చాను. కావాలనే కొన్నిసార్లు నిన్ను బాధపెట్టే మాటలూ, ఇబ్బంది పెట్టే మాటలూ అన్నాను. ఒకటి మాత్రం నిజం…! కొన్ని చెయ్యి జారిపోకముందే జాగ్రత్తపడాలి. కొందరి విషయంలో కాలాతీతం కాకముందే కనికరం చూపించాలి. సారీ.. అది నీ ఇష్టం..” నేను లేచి వచ్చేశాను.

కళాశ్రీ ఇంటికి వెళ్లలేకపోయాను. వెడితే, సుచరిత ఏమన్నదో ఆవిడకి చెప్పాలి. సుచరిత అడిగిన ప్రశ్నలకి ఖచ్చితంగా కళాశ్రీ అనబడే కళ్యాణి దగ్గర జవాబులు లేవు. అంతేగాదు, ఇప్పుడు నేను వెళ్లి సుచరిత అడిగిన ప్రశ్నల గురించి చెప్పినా, సుచరిత తల్లిని యీ జన్మలో చూడటానికి ఇష్టపడటం లేదు అని చెప్పినా, కళ్యాణిని ఇంకా బాధపెట్టిన వాడినవుతాను.

‘మౌనం’ చాలా ఇబ్బందుల్ని తొలగిస్తుంది. నేను అదే పాటిస్తున్నా. నెలన్నర గడిచిందేమో. ‘రాఘవ’ కనిపించాడు. రాఘవ అంటే కళ్యాణి రెండో భర్త. తెలుగువాడే అయినా ‘రాఘవన్’ అని పరిచయం చేసుకోవడమేగాక, కావాలని తమిళ యాసలో తెలుగు మాట్లాడతాడు. “హలో సార్.. ఎట్టా వుండారూ?” తమిళ యాసతోనే అడిగాడు రాఘవ.

“బాగున్నానండీ. ఏంటి విశేషాలు.?” మామూలుగా అడిగాను. ఆయన పరిచయం వున్నా లేనట్టే లెక్క. ఒకందుకు మెచ్చుకోవాలి. కళ్యాణి నాతో మాట్లాడేటప్పుడు మధ్యలోకొచ్చేవాడు కాదు. తను నాతో కూడా ఫ్రెండ్లీగానే అన్నట్టు ‘ఉండేవాడు.’

“ఏం చెబుతాం సార్. అంతా బాగానే ఉంది. ఏదో..!” నవ్వాడు.

ఇంతకీ మేం కలిసింది పాండీ బజార్లో ‘వుడ్‌లాండ్స్’ హోటల్లో.

ఒకప్పుడు (నేను మద్రాసుకి వచ్చిన కొత్తలోకూడా) వుడ్‌లాండ్స్ కాఫీకి గొప్ప పేరు. రచయితలూ, హీరోలూ తరచుగా ఆ రోజుల్లో విజిట్ చేసే హోటళ్ళు నారాయణ కేఫూ… వుడ్‌లాండ్సూ.. ‘దాస్‌ప్రకాష్’ మరో గొప్ప హోటల్. మద్రాసు వచ్చినవాళ్లు దాస్‌ప్రకాష్‌లో తినకుండా వెళ్ళేవాళ్లు కారు. అదో ‘సింబల్’ అలాగే  బుహారీ హోటల్. అఫ్‌కోర్స్ అది మాంసాహార  ప్రియులకి.  నాలాంటి గ్రాస్‌యీటర్స్(వెజిటేరియన్స్)కి కాదు.

నేను ‘రవ్వ దోసె’ తింటుంటే ఆయన ‘మసాలా దోసె’ తింటున్నారు. కాఫీ తాగాక బయటికొచ్చాం. ఆయన ‘కారు’ ఎక్కి వెళ్లిపోయేదాకా ఉండి నేను పానగల్ పార్కులో ‘ఘంటసాల’గారి బెంచీ మీద సెటిలయ్యాను.

పాండీ బజార్ పానగల్ పార్కుకీ, తెలుగువారికీ ఎంత అవినాభావ సంబంధమో.. ఘంటసాల, సముద్రాల, మల్లాదిగారు, కృష్ణశాస్త్రిగారు, ఆరుద్ర, ఇంకా పింగళి నాగేంద్రరావుగారు వీరంతా పానగల్ పార్కులో కూర్చొని మాటలకీ, పాటకీ ‘సొబగులు’ దిద్దినవారే. అద్దినవారే.. సరే.. మరోసారి విపులంగా చెప్పుకుందాం.

బెంచి మీద కూర్చొని  ‘పోయిన మంచోళ్ల’ నీ తల్చుకుంటున్నా. “గురూగారు, రాఘవ మీకు బాగా తెలుసా?” కొంచెం అనవసరపు కుతూహలం   ప్రకటిస్తూ  అడిగాడు ‘చతుర్ బాబు’. అతనో ఘోస్టు రైటరు. అంతే కాదు చిన్న చిన్న వేషాలు కూడా వేసేవాడు. ఎక్కువగా ‘డైలాగ్’లేని శివుడి వేషాలకి ఆయన్ని పిల్చేవాళ్లు.

“తెలుసు” ముక్తసరిగా అన్నాను.

“మహాగట్టోడు” పకపకా నవ్వాడు చతుర్‌బాబు. పేరులో ‘బాబు’ అని గానీ, వయసు ఏభై దాటి వుంటూంది. నేను మాట్లాడలా.

“ఎందుకని అడగరేం? ఆయనది మా ప్రకాశం జిల్లానే. ఊళ్ళో పెళ్లాం పిల్లలూ వున్నారు. వాళ్లని పోషించాలంటే అక్కడ బేలన్స్ నిల్లు. మొత్తానికి కళ్యాణిని  పట్టి పబ్బం గడుపుకుంటున్నాడు. వాళ్లమ్మాయి పెళ్ళి జరిగింది ఆర్నెల్ల క్రితమే కదా..  పైకేమో విడాకులు. మరి పెళ్లిలో ‘కన్యాదానం’ ఎట్టా చేశాడూ?” లాపాయింటు లాగాడు చతుర్.

ఈ చలన చిత్ర పరిశ్రమలో ఎవరైతో ఏం మాట్లాడినా కష్టమే. వచ్చేది మాత్రం మీరు మాట్లాడని విషయమే. నా అదృష్టం బాగుండి ఆ రోజున నా ఫ్రెండ్ శ్రీవిలాస్ నావైపుకి వస్తూ కనిపించారు. ఆయన సూరి భగవంతంగారికి అతి దగ్గరి చుట్టమేగాక మంచి స్నెహితుడు. దాంతో చతుర్‌బాబుగారి ‘సంభాషణకి’ బ్రేక్ పడింది. అయితే రాఘవ కూతురి పెళ్లి  జరగటం, ఆ పిల్లకి రాఘవ కన్యాదానం చెయ్యడం నాకు కొత్తగా తెలిసింది.

ఎందుకో ‘సుచరిత’ గుర్తుకొచ్చి అప్రయత్నంగా (అనొచ్చా) ఓ నిట్టూర్పు వెలువడింది. ప్రస్తుతం సుచరిత అప్‌కమింగ్ నటి. నిజం చెబితే చాలా ‘మంచి’ నటి. మరి ఆమె పెళ్ళికి ఎవరు కన్యాదానానికి కూర్చుంటారు? ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న.

సమాధానం తేలిగ్గానే దొరికింది. రెండు నెలల తర్వాత. ‘సుచరిత’కి కాన్సర్‌ట. డ్రైవర్ కొసం వెయిట్ చెయ్యకుండా ప్రొ.. CMK రెడ్డి FRCS FRST (etc etc etc) గారి  వోల్‌స్టెడ్ సర్జికల్ హాస్పిటల్‌కి డ్రైవ్ చేస్తూ వెళ్లాను. సుచరిత జుట్టు పూర్తిగా ఊడిపోయింది. ఓ.. గాడ్…!!

“ఎంతో కాలం బతకనని నాకు తెలుసు అంకుల్.. అయినా అమ్మని రమ్మని పిలవలేను. ఎందుకంటే నన్నిలా చూస్తే తన గుండె పగులుతుందేమో! వద్దు. ఒక్క విషయం నిజం అంకుల్.. ఐ లవ్ హర్.. ఐ హేట్ హర్ (I love her.. I hate her) ఒక్క రిక్వెస్టు..  నేను చనిపోతే మాత్రం మా ఇద్దరన్నలకి ‘మాత్రమే’ ఇన్ఫామ్  చెయ్యండి. వాళ్లు రాకపోతే…..” సైలెంటైపోయింది.

భగవంతుడా… అసలెందుకీ అన్‌టోల్డ్ స్టోరీస్ రాస్తున్నాను..

 

మీ భువనచంద్ర

 

మీ మాటలు

 1. gorusu jagadeeshwar reddy says:

  భువనచంద్ర గారూ … మీరు రాస్తున్నారు సరే … రాసి మా గుండె మీది పెంకుల్ని పెకిలించి మనసుని కకావికలం ఎందుకు చేస్తున్నారు? మీ అక్షరాల్లో ఏదో మిరకిల్ ఉంది చంద్ర గారూ . దృశ్యాన్ని కళ్ళకు కడతారు. మీ పొట్టలో ఇంకా ఎన్ని జీవితాలు దాగున్నాయో … ఒకే సారి మాత్రం చెప్పకండి . తట్టుకునే శక్తి నాకు లేదు . సుచరిత కథ చదివాక పి. సత్యవతి గారి దమయంతి కూతురు కథ గుర్తొచ్చింది. ఇంకా ఏదో చెప్పాలని ఉంది మీతో … నాలుక తడి ఆరిపోయింది …

  – జగదీశ్వర్ రెడ్డి

  • Bhuvanachandra says:

   నిశ్శబ్దం చాలా చాలా చెబుతుంది రెడ్డి గారూ …. మీలోని స్పందించే గుణానికీ చివురాకు మనసుకీ నమోవాకాలు

 2. భగవంతుడా… అసలెందుకీ అన్‌టోల్డ్ స్టోరీస్ రాస్తున్నాను..
  అబ్బా..! ఈ ఒక్క మాటతో చదువుతూండగా కలిగిన బాధ ఎన్నింతలో పెరిగిన్దండీ..
  సహానుభూతి తో..
  అపర్ణ

  • Bhuvanachandra says:

   ఎంత మంచి మాటా అపర్ణ గారూ ….
   ఈలోకంలో అన్నీ దొరుకుతున్నాయి కాస్త జాలీ … సానుభూతీ తప్ప ….వాటికి డబ్బుతో పనిలేదు ….మనసుంటే చాలు …..భగవంతుడు మీకా మనసిచ్చాడు ……గాడ్ బ్లెస్స్ యు ……

 3. సార్ తెనాలి అంటే కొడవటిగంటి కుటుంబరావు గారు , శారద గారు

  • Bhuvanachandra says:

   చిత్రాజీ …. శారద గారి పేరు రాసాను …..ఇక కొ.కు గారిని మరవలేదు గానీ ….ఆయనగురించి ఒక పేరానే రాద్దామనుకున్నా …ఎంత పిచ్చితనం కనీసం ఒక వెయ్యి పేజీలు  రాసినా మనసు తీరదుగా ……వారి పేరు మీ బుల్లి మెయిల్ ద్వారా అందరికీ (ముఖ్యం గా నాకు )gurtu తెచ్చినందుకు ధన్యవాదాలు ……

 4. నేను ‘అమ్మాయిలూ ఆలోచించండి’ అని ఇలాంటి కథే ఒకటి రాసి సారంగ వారికి పంపాను రెండు నెలల క్రితం. నా కథలో సవితి తల్లిపైన కసితో తెలివితక్కువ పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటే మీ ఈ నిజమైన కథలో భగవంతుడే ఆమెకి అన్యాయం చేశాడు అనిపిస్తుంది. బ్రతికుంటే – కన్యాదానాలెందుకులెండి సంతోషంగా జీవించడానికి?

  • Bhuvanachandra says:

   అన్యాయమో న్యాయమో తెలీదుగానీ కాలగతి మాత్రం నా ఊహకి అందడం లేదు ……ఒకామె వుంది 92 ఏళ్ళు”నా”అనే వాళ్ళు అందరూ పోయారు extra వేషాలు వేసేవాల్లెతిండి పెడుతూ వుంటారు ….ఆవిడ నోరువిప్పేతే తిట్లే…..గతించిన నటీ నటుల్ని అందర్నీ తిడుతూనే వుంటుంది ……ఒక్కమాట మంచిగా మాట్లాడదు…. కానీ గడిచిపోతోంది….ఇంకొక ఆతనువున్నాడు ….చాలా మంచివాడు ….మొన్నీమద్యే చచ్చిపోయాడు కారణం తిండి లేక …..అందుకే …కాలం చేతిలో మనం బొమ్మలమేమో …..

   • ఇలా నోరు విప్పితే ఒక్క మాట మంచి గా మాటాడకుండా తిట్ల పురాణం అందుకునే వాళ్ళని నేను చూసాను సర్ …దూరం గా పారిపోడం తప్ప ఏమి చెయ్యలేము ..ఆ తిట్ల వర్షానికి కారణం అర్దాహం కాలేదు పెద్దలు విజ్ఞులు ఎవరన్నా analise చెయ్య గలిగితే తెల్సుకోవాలని కుతూహలం గా ఉంది .

 5. తల్లి దండ్రుల పోట్లాటల వల్ల చెడిపోయామనుకొనే పిల్లలు, ఈ కతలు చదివితే బాగుండు వాళ్ళ మనసు కొంత ఆలోచించ గలదేమో , సినిమా రంగం లోనే కాదు మిగిలిన సమాజం లో కూడా చాలా మంది దురదృష్టవంతులున్నారు , గ్లిసరీన్ లేని కన్నీళ్ళ కు కొదువ లేదు ఈ లోకం లో ……………. మీ కతలు కదిలించి వేస్తున్నాయి

  జ్వలిత

  • Bhuvanachandra says:

   జ్వలిత గారూ…. ఆర్టిస్ట్ ల మనసు చాలా సున్నితం …. కవికావోచ్చు చిత్రకారుడు కావొచ్చు నటుడు కావొచ్చు ఏచిన్న సమస్య వొచ్చినా వాళ్ళు తట్టుకోలేరు ….నాకు బాగా తెలిసిన ఒక హీరో ఎవరు విమర్శించినా మేకప్ రూం కి పోయి ఏడిచేసే వాడు … ఆయనే తెరమీద వొందమందినిఅవలీలగా ఎదుర్కోనగలడు…..మిగిలిన సమాజం లో కూడా చాలామంది దురదృష్ట వంతులు వుంటారు …. వున్నారు ….కానీ వాళ్ళు ”’ఇలాంటి”’ గ్లాస్ ముక్కలు కారు. జీవితం వాళ్లకి ”బతకడం”నేర్పితే వీళ్ళకి ”’చావడం”నేర్పుతోంది. అందుకే ఇంతమంది హీరొయిన్ లు ఆత్మహత్యలకి పాల్పడడం ..

 6. తెనాలి నా ఊరు. దాని గురించి నాలుగు మంచి మాటలు చెప్పారన్న ఆనందంనుంచి తేరుకొనే లేదు, మిగిలినదంతా చదివాను. ఏమి జీవితాలు ఇవి! వాళ్ళ కష్టాలకి అంతులేదా? చిన్నప్పడి కష్టాల నుంచి బయటపడి మంచి నటి అవ్వబోయే తరుణం లోనే సుచిత్రకు క్యాన్సర్.

  “భగవంతుడా… అసలెందుకీ అన్‌టోల్డ్ స్టోరీస్ రాస్తున్నాను..”

  చాలా భారమైన ప్రశ్న! సమాధానం దొరికినప్పుడు చెప్పటం మర్చిపోకండే! మీరు ఈ కాలమ్ మాత్రం ఆపకండి.

 7. Bhuvanachandra says:

  యాజీ గారూ ….నాకు ఏమీ తోచనప్పుడు ”తెనాలి”కి పోయి ఒక రోజు ఉండేవాడిని ….ఎంతోమంది స్నేహితులు ఉన్నారక్కడ .ఇప్పటికీ ”తెనాలి” వెళ్లాలని మనసు కొట్టుకుంటూనే వుంటుంది .ఇక సినీరంగం గురించా ? చప్పట్లూ …పచ్చనోట్ల రెప రెపలూ…తప్ప ”చాలామంది” తల్లిచాటు హీరొఇన్లకి ఏమీ తెలీదు …తెలిసి,,,,, ..తప్పించుకోవటానికి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ….వాళ్ళు చేసేదీ నమ్మకద్రోహమే ..ఏంచేస్తారూ?కొంతమంది ”కధలు”గా మారితే కొందరు కాలనదిలోకి నిశ్శబ్దంగా జారిపోతారు . అందుకే నిర్వేదం …….మీరు ఇస్తున్న స్ఫూర్తి కి ధన్యవాదాలు …..చాలా రాయాలి …….

 8. srivasthava says:

  చివరికి కన్నిలు పెటించేరు చాల బాగుంది

మీ మాటలు

*