ఇదిగిదిగో లోపలి మనిషి చిరునామా!

KuberanatharaoIyalaCover

కన్నడ భాషా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలని తపించే శ్రీ శాఖమూరు రామగోపాల్ వెలువరించిన ఎనిమిదవ పుస్తకం “డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావ్ మరియు ఇయాళ”.

ఈ అనువాద కథాసంకలనంలో మొదటి అయిదు పూర్ణచంద్ర తేజస్వి గారి కథలు కాగా మిగతా పది కథలు వివిధ రచయిత(త్రు)లు రాసినవి.

పూర్ణచంద్ర తేజస్వి గారు రచించిన “కుబి మత్తు ఇయాళ”, “అవనతి”, “అబచూరిన పోస్టాఫీసు”, “తుక్కోజి”, “డేర్‌డెవిల్ ముస్తఫా” అనే ఈ అయిదు కథలు కన్నడ కథామాలలో మణిపూసలనడం అతిశయోక్తి కాదు. ఈ అయిదు కథల తెలుగు అనువాదాలను ఈ వ్యాసంలో పరిచయం చేసుకుందాం.

***

ఆస్పత్రి లోపల్నుంచి ఫినాయిల్, స్పిరిట్, డెట్టాల్‌ల విశిష్టమైన వాసన ఒకటి గుప్పంటూ బయటకు వస్సుంది. బెంచీల మీద ఎంతో మంది రోగులు కూర్చుని ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఖళ్ ఖళ్‌నే దగ్గుతున్నారు. కొంత మంది తమ రోగంలోని కారణాల్ని దాని గుణ లక్షణాల్ని ఇతరులకు వివరిస్తున్నారు. జ్వరపీడితడైన ముసలోడొకడు అస్ ఉస్ అని వదుల్తూ పీలుస్తూ అప్పుడప్పుడు సంకటం సంకటం అని గొణుగుతున్నాడు. వారి మనమడొకడు వారి ఊతకర్రను తీసుకొని అరచేతి మీద నిలువుగా నిల్పే సర్కస్ చేస్తున్నాడు. ప్రతిసారి ఓడిపోయి ఊతకర్ర క్రిందపడినప్పుడు ‘’మరోమారు చూడు తాతా’’ అంటూ తన సర్కస్‌ను పునరారంభిస్తున్నాడు.

గ్రామీణులు దేన్నైనా ఒక సారి నమ్మితే, వారి విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో “డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావ్ మరియు ఇయాళ” కథ చెబుతుంది. సైన్యంలో డాక్టరుగా చేరి, అక్కడ తను చేసేది పెద్దగా ఏముండదని గ్రహించిన డా. కుబేరనాథరావ్ భైరవపురంలోని ధర్మాసుపత్రిలో వైద్యుడిగా చేరుతారు. ఆయన హేతువాది. వైద్యంతో పాటుగా గ్రామంలోని ప్రజలను చైతన్యవంతులని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన ఆ ఊర్లో సాక్షాత్ దైవం వంటి వారు. ఎటువంటి రోగాన్నైనా చిటికెలో నయం చేయగలరని ప్రఖ్యాతి పొందారు. ఆయన హస్తవాసి మంచిదనే నమ్మకం ప్రజలలో పాతుకుపోయింది. ఇయాళ అనే బాలికకి కడుపు నొప్పి వస్తే, వాళ్ళ అమ్మ బాయమ్మ డాక్టర్ గారికి అన్ని రోగ లక్షణాలు వివరించి, మందు రాయించుకుంటుంది. వాళ్ళ నాన్న హసన్‌లో మా మందు సీసా కొనుక్కొని వస్తాడు. ఆ మందు సీసాను ఆయన ముట్టుకుని, మూత తీసి పెట్టి ఇస్తే రోగం ఇట్టే తగ్గిపోతుందని చెప్పి, ఇయాళను డాక్టరు గారి దగ్గరికి పంపుతుంది బాయమ్మ. డాక్టరు గారు అందులోని అసంబద్ధతని చెప్పి, ఇయాళని వెనక్కి పంపబోతారు. చిన్నబోయిన ఇయాళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అది చూసి కాంపౌండర్ రామారావ్ – ఆ సీసాని ముట్టుకుని ఆ పిల్లకిస్తే తప్పేంటి అని అడుగుతాడు. బదులుగా అశాస్త్రీయంగా మాట్లాడవద్దని, తాము జీతభత్యాలు పుచ్చుకునేది మూఢనమ్మకాలను వ్యాప్తి చేసేందుకు కాదని అంటారు డాక్టరు. కానీ రామారావు వాదనలోని తర్కాన్ని కాదనలేక చివరికి ఇయాళని పిలిచి, ఆ మందు సీసా తీసుకుని, మూత విప్పి, మళ్ళీ పెట్టి ఇస్తారు. ఇయాళ సంతోషంతో ఇంటికి బయల్దేరుతుంది. అయితే, ఆమె ఇంటికి చేరదు. ఎవరో ఆమెని కర్పూర వృక్షం దగ్గర ఓ పెద్ద బండ దగ్గర హత్య చేసి పడేసారు. ఆ హత్య చేసింది ఎవరో తెలియదు. రాజకీయాలు తెలెత్తుతాయి. చనిపోయిన ఆ పిల్లను ఉపయోగించుకుని ఎవరి ప్రయోజనాలను వారు సాధించాలని ప్రయత్నిస్తూంటారు. హత్యకి కారణం తెలియదు. పోలీసులు చేతులెస్తేస్తారు. చివరికి అనుకోకుండా, డాక్టరు కుబేరనాథరావ్ ఆ కారణాన్ని తెలుసుకుంటారు. హంతకుడెవరో వెల్లడి చేస్తారు. తన వృత్తి ధర్మం పరిధి నుంచి బయటపడి, మానవత్వం ఉన్న మనిషిగా ప్రవర్తించినందుకు డాక్టరుగారికి సంతోషమవుతుంది. కానీ జనాలు మాత్రం కుబేరనాథరావ్ ప్రేతాత్మలను లొంగదీసి, నిజాలు వెల్లడి చేయించాడని నమ్మసాగారు. ఆయన ఏ విధానాన్ని నమ్మక తిరస్కరిస్తూ వచ్చారో, అదే సిద్ధాంతాన్ని జనాలు రహస్యంగా ప్రతిపాదించడం కాలపురుషుడిలోని అపహాస్యమేనంటారు రచయిత. ధర్మాసుపత్రి వర్ణన, వైద్యం కోసం అక్కడ ఎదురుచూస్తున్న వ్యక్తుల హావభావాలు, ప్రవర్తన కళ్ళకు కట్టినట్టు చిత్రించారీ 31 పేజీల ఈ పెద్ద కథలో.

ఆ పల్లెలలోని జనమంతా ఒక రకమైన విచిత్రంగా ఉండే వ్యవహరాలలో మునిగి తేలుతుండేవారు. ఉత్తిగనే కాలాన్ని గడుపుకొనే వ్యవహరాలులాగ ఉంటుండేవి వారి పనులు. వెళ్ళేది, వచ్చేది, కూలబడేది నిలుచుండేది… ఈ తరహలో ఉండే ఈ పల్లెజనంకు… ఎలెక్షన్ల కాలంలో వీళ్ళకు ఏమి ప్రలోభాల్ని చూపించి, వీళ్ళనుంచి ఓట్లు గుంజుకొనేది ఎలాగబ్బా అనేది ఒక సమస్యగా ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులకు అంతుచిక్కని సవాల్ అన్నట్టుగా ఉంటుండేది.

అవనతి కథ ఇస్లాపుర, ఇత్తావర, నస్లాపుర, సంగాపుర, మల్లినమడుగు అనే అయిదు గ్రామాల వర్ణనతో మొదలవుతుంది. ఈ అయిదు పల్లెలు విశిష్టమైనవి. అక్కడ మిగతా గ్రామాల్లో ఉండే కక్ష్యలూ, కార్పణ్యాలు లేవు. మత కలహాలు లేవు.. పేద గొప్ప తేడాల్లేవు. ప్రస్తుత ద్వేషమయ రాజకీయ దొమ్మరాటలకు ఈ పల్లెలు పెను సవాలుగా ఉన్నాయి అంటారు రచయిత. ఈ పల్లెల్లో ఉన్న ఇద్దరు గొప్ప వ్యక్తులలో ఒకరైన సూరాచారి, ఈరేగౌడతో కలిసి ఇస్లాపుర నుంచి ఇత్తావరకు వెడుతుండంతో కథ ప్రారంభం అవుతుంది. సూరాచారి నిజానికో శిల్పి. దేవాలయం నిర్మాణానికి ఇస్లాపుర వచ్చిన సూరాచారి అనుకోని పరిస్థితులలో ఇక్కడే ఇల్లరికం ఉండిపోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళు దేవుడి విగ్రహాలు, మందిరాలు తయారు చేసి ఇచ్చినా, సూరాచారికి పెద్దగా పని ఉండేది కాదు. కొన్నాళ్ళకి రుబ్బురాళ్ళు, తిరగళ్ళకి గాట్లు పెట్టే పని తప్ప మరొకటి దొరకదు. ఏం చేయాలో తోచదు. చివరికి జనాల కోరిక మీద టేకు చెక్కల నుంచి గ్రామ దేవత బొమ్మలను తయారు చేయడం మొదలుపెడతాడు. కానీ జనాలకి ఆ బొమ్మలు నచ్చేవి కావు. ఆ బొమ్మలలో వాళ్ళకి దెయ్యం కనపడేది గాదు. ఆ బొమ్మలని అంత అందంగా ఎందుకు చేస్తారని ఆక్షేపించేవారు. అనాకారితనం కొట్టొచ్చినట్లు కనపడే బొమ్మలి తయారుచేస్తే వాళ్లెంతో సంతోషిస్తారు. ఈ పనులు చాలవన్నట్లు… మంత్ర తంత్రాలతో తాయెత్తులను ఇవ్వడం, మందుమాకు ఇవ్వడం, విభూది పెట్టడం వంటి ఇతర పనులు చేపట్టాడు. కాలం గడపడం కోసం ఇంకా అనేకానేక పనులు చేసేవాడు. బాకీవసూళ్ళు, ఎడ్ల అమ్మకంలో మధ్యవర్తిగా ఉండడం, పెళ్ళిళ్ళు కుదర్చడం ఇలాంటివన్న మాట. ఉబుసుపోని జనాల మధ్య ఓ పనిలేని తెలివైన వ్యక్తి కూడా ఎలా పతనమవుతాడో చెబుతుందీ కథ. ముప్ఫై నలభై సంవత్సరాల క్రితం గ్రామీణ భారతంలోని జీవనాన్ని అత్యంత సుందరంగా చిత్రించిన కథల్లో ఇది ఒకటి.

పోస్టాఫీసు ఆత్మకూరులో కొత్తగా తెరవబడినప్పుడు బొబణ్ణ ఉదయంలో ఒక గంట, సాయంకాలంలో ఒక గంట టెంపరరీగా పోష్ట్‌మాష్టర్ డ్యూటి చేసేందుకు ఒప్పుకొన్నాడు. బోబణ్ణ ఒప్పకొన్న మీదట అతనుండే ఇల్లరికం ఇల్లే టెంపరరీ పోస్టాఫీసుగా రూపాంతరం చెందింది. అందరూ బోబణ్ణను పోస్టమాష్టరుగారు అని గౌరవంగా సంభోధిస్తుండేవారు. బోబణ్ణలో తానొకడే ఢిల్లి సర్కారు (కేంద్రప్రభుత్వం)తో సంపర్కాన్ని పొందిన ఇండియన్ అనే గర్వం తొణకిసలాడుతుండేది.

ఓ బలహీనమైన క్షణంలో చేసిన తప్పు ఎలా వెంటాడి వేధిస్తుందో, “ఆత్మకూరులోని పోస్టాఫీసు” కథ చెబుతుంది. కొత్తగా పెట్టిన పోస్టాఫీసుకి, ఆత్మకూరులో ఎస్. ఎస్. ఎల్. సి. దాకా చదువుకున్న బోబణ్ణని పోస్ట్ మాస్టర్‌గా నియమిస్తుంది ప్రభుత్వం. ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలలో చాలామంది నిరక్షరాస్యులు కావడంతో, వారికొచ్చిన ఉత్తరాలను చదివి పెట్టడం, వారు రాయాల్సిన ఉత్తరాలను రాసిపెట్టడం వంటి పనులు చేస్తూంటాడు బోబణ్ణ. ఊర్లో పోస్ట్‌మాన్ సౌకర్యం లేకపోవడం వల్ల వచ్చిన ఉత్తరాలన్నీ జాయికాయ పెట్టెలో పడేస్తుండేవాడు. జనాలు వచ్చి ఆ పెట్టెలో వెతుక్కుని తమ ఉత్తరాలు తీసుకువెళ్ళేవారు. అదే సమయంలో ఇతరుల ఉత్తరాలు కూడా చదివేస్తూండేవారు. ప్రస్తుతం బోబణ్ణ ఎంతో దిగులుగా ఉన్నాడు. ఆ దిగులుకి కారణం అతను చేసిన ఓ దొంగతనం. ఆ ఊర్లో ఓ కుర్రాడికి వచ్చిన ఓ కవర్‌ని ప్రేమలేఖగా భావించి దొంగతనంగా చించి తెరుస్తాడు. కానీ అందులో ఓ అర్థనగ్న సుందరి బొమ్మ ఉంటుంది. ఆ క్షణం నుంచి అతనిలో మనో వికారం మొదలవుతుంది. అప్పట్నించి అతను ఆ ఊరికొచ్చే ప్రతీ కవర్‌నీ తెరచి చూసి, వాటిల్లో సుందరాంగుల బొమ్మలేమయినా ఉన్నాయేమోనని వెతికేవాడు. పనిపాట లేని జనాలు పోస్టాఫీసు దగ్గర చేరి ఆయా ఉత్తరాల్లోని విషయాల్ని చర్చించుకుంటూంటారు. ఈ ప్రక్రియలో ఎన్నో పుకార్లు రేగుతాయి. జనాలు బోబణ్ణని కొట్టడానికి వస్తారు. అంతా గందరగోళమై పోతుంది. చివరికి పోస్టాఫీసు, ఇల్లు వదిలి పారిపోతాడు బోబణ్ణ. ప్రతీ వ్యక్తిలోనూ ఉండే చీకటి కోణాలని బహిర్గతం చేస్తూందీ కథ. ఈ కథ చలనచిత్రంగా నిర్మించబడి, జాతీయ స్థాయిలో “ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా” బహుమతి పొందింది.

అతను మరియు అతని భార్యైన సరోజ…ఆ ఇద్దరే కూర్చుని ఎంత పనినైనా చేస్తుండేవారు. భార్యకు మొట్టమొదలు కాజాల్ని కుట్టేది , గుండీల్ని కుట్టేది మొదలైన చిల్లర పనుల్ని ఇస్తుండేవాడు. సరోజకు కొద్దికొద్దగా బట్టల్ని కుట్టే పనితనం పరిచయం అవుతూ రాసాగగా ఇక ఇప్పుడు బట్టల్ని కత్తిరించే పనిని ఇస్తుండేవాడు. ఇతను రంగు సబ్బుముక్క(బిళ్ళ) నుంచి బట్టమీద కొలతల గీట్లును గీసి ఇస్తుండేవాడు. ఆ గీతలకు అనుగుణంగా సరోజ ఆ బట్టల ముక్కల్ని కత్తిరించి ఇస్తుండేది.

ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్ళిచేసుకున్న వాళ్ళు తమ మధ్య ప్రేమని చివరి దాక ఒకేలా ఎందుకుంచుకోవాలో చెబుతుంది “టైలర్ తుక్కోజీరావ్” కథ. తుక్కోజీరావ్ వంశమే బట్టలకు ప్రసిద్ధి. అతని తండ్రి హసన్ పట్టణంలో పేరుమోసిన కట్ పీసెస్ వ్యాపారి. అయితే తుక్కోజీ సామ్యవాద భావాలవైపు మొగ్గుచూపి, తండ్రి అభిమతానికి విరుద్ధంగా ఓ పేద విధవరాలి కూతురు సరోజని పెళ్ళి చేసుకుంటాడు. తండ్రి ఆస్తిలోంచి ఒక చిల్లిగవ్వ కూడా ఆశించకుండా, తన చేతి విద్యని నమ్ముకుని అప్పుడే పెరుగుతున్న గురుగళ్ళికి మకాం మారుస్తాడు. బట్టలు కుట్టడంలో తుక్కోజీకి అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఎవరినైనా ఒకసారి తేరిపార చూస్తే వారి శరీరపు కొలతలు అతని మనసుకో ముద్రితమైపోతాయి. అప్పటి దాక రెడీమేడ్ దుస్తులు ధరించే గురుగళ్ళి జనాలు తుక్కోజీ నైపుణ్యం పుణ్యమా అని కట్ పీసెస్ కొనుక్కుని తమ శరీరాకృతికి తగ్గట్టుగా చక్కని దుస్తులు కుట్టించుకుని తిరుగుతున్నారు. భర్తకి సహాయంగా సరోజ మొదట కాజాలు గుండీలు కుట్టడం ప్రారంభించి, క్రమంగా తను బట్టలు కుట్టగలిగే స్థితికి వస్తుంది. కొన్నాళ్ళకి వారికి ఓ కొడుకు పుడతాడు. కృష్ణోజీ అని పేరు పెట్టి కిట్టూ అని పిలుస్తూంటారు. కిట్టూ పుట్టిన తర్వాత సరోజ భర్తకి సాయం చేయడం తగ్గుతుంది. పిల్లవాడు నడక నేర్చే సమయానికి తుక్కోజికి పని ఒత్తిడి బాగా ఎక్కువవుతుంది. సరోజకి బిడ్డతో తీరిక దొరకదు. ఫలితంగా బట్టలు కుట్టడంలో తేడాలొస్తాయి. ఖాతాదారులు గొడవ చేయడం మొదలుపెడతారు. మొదట్లో అన్యోన్యంగా ఉన్న భార్యభర్తల మధ్య తగువులు మొదలవుతాయి. తనని అర్థం చేసుకోవడం లేదని ఇద్దరూ అనుకుంటూంటారు. కొన్నాళ్ళకి బేరాలు తగ్గుతాయి. ఇంట్లో చిరాకులు పరాకులు పెరుగుతాయి. కిట్టు అల్లరి పెరిగిపోతుంటూంది. ఆ ఊర్లో రైలు వంతెన నిర్మాణం కోసం ఓ క్రాలర్ వస్తుంది. కిట్టూ ఆ క్రాలర్‌కి అడ్డంగా వెళ్ళి, దాని అద్దం పగలగొడతాడు. క్రాలర్ డ్రైవర్ వచ్చి తుక్కోజీని మందలిస్తాడు. ఇంకా అల్లరి మానకపోతే, కిట్టూని తాను తీసుకెళ్ళిపోతానని అంటాడా డ్రైవర్. ఒకరి మీద మరొకరు విసిగిపోయి ఉన్న అ భార్యాభర్తలు, “తీసుకుపొండి.. మాకు హాయిగా ఉంటుంది” అని అంటారు. నిజంగానే ఆ డ్రైవర్ పిల్లాడిని ఎత్తుకుని క్రాలర్‌లో కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతాడు. అరగంట అవుతుంది, గంట అవుతుంది, క్రాలర్ జాడ లేదు. భార్యాభర్తలలో అలజడి మొదలవుతుంది. కిట్టూని అడ్డం పెట్టుకుని ఒకరి మీద మరొకరు ప్రతీకారం తీర్చుకోవాలని చూసిన తీరు గుర్తొచ్చి ఇద్దరూ పశ్చాతాప్తం చెందుతారు. క్రాలర్ డ్రైవర్ గురించి ఫిర్యాదు చేద్దామని బయల్దేరుతుండగా డ్రైవర్ తిరిగొచ్చి కిట్టూని అప్పగించడంతో కథ ముగుస్తుంది. ఒక టైలర్ దుకాణం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్లు చూపిన కథ ఇది.

 ఇక ఇప్పడు ముస్తాఫాలోని టోపి మా క్లాసులో కష్టాల్ని కలిగించసాగింది. ‘టోపి గీపి తీసేదిలేదు. నన్ను కోరేది మానండి. నేను డేర్ డెవిల్ మనుషిని’ అంటూ ముస్తాఫా మొండికేసి కూర్చున్నాడు. ఏమేమి చెప్పినా వినలేదు. మేము సైతం అతను టోపి తీయాల్సిందేనని పట్టుపట్టాము.మొత్తం మా క్లాసులో ముస్తాఫా పరంగా మాట్లాడేందుకు ఏ విద్యార్థి సిద్దమైలేడు. అయినా ముస్తాఫా మాత్రం, ‘’నన్ను వదిలేయండి; నేను డేర్ డెవిల్ లాంటోడ్ని’’ అని అంటూ ఎవరి మాటకు విలువ ఇవ్వకనే కూర్చున్నాడు స్థిరంగా.

హిందూమతానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఓ జూనియర్ కాలేజిలో “జమాల్ అబ్దుల్ ముస్తఫా హుసేన్” అనే కుర్రవాడు చేరతాడు. అయితే ఏ రోజూ కాలేజీకి రాడు. లెక్చరర్ హాజరు పిలిచినప్పుడల్లా మిగతా విద్యార్థులు ఆ కుర్రాడు ఎవరో చూడాలని ఎదురుచూస్తారు. కానీ వాళ్ళకి ముస్తఫా కనబడడు. ప్రతీ రోజూ లెక్చర్ హాజరు పిలవడం, ముస్తఫా పేరు పలికినప్పుడు ఎవరూ జవాబు చెప్పకపోవడంతో మిగతా విద్యార్థులకు చాలా కుతూహలంగా ఉంటుంది. ఎవరితను, ఎందుకు కాలేజీకి రావడం లేదు? అని అనుకుంటూ వాళ్ళ మనసుకి తోచిన కారణాలు ఊహించుకుంటూండేవారు. ఒక రోజు హఠాత్తుగా, ముస్తఫా తరగతికి హాజరవుతాడు. అతన్ని చూసిన విద్యార్థులు విస్తుపోతారు. భిన్న మతాలలోని ఆచార వ్యవహారాలు మనుషుల మధ్య విభేదాలు సృష్టించినట్లే, విద్యార్థుల మధ్య కూడా సృష్టిస్తాయి. మొదట్లో అతన్ని ఆటలలో చేర్చుకోరు. దూరంగా ఉంచుతారు. అయితే వినాయక చవితి సందర్భంగా ముస్తఫా చేసిన మేలు అతడిని మిగతా పిల్లలు ఆమోదించేలా చేస్తుంది. ముస్తఫాలో తుంటరితనం ఉన్నా, అంతకు మించిన సంస్కారం ఉందని, అతను బాగా చదువుకుని భారత ప్రభుత్వం వారి రక్షణ పరిశోధనా విభాగంలో ఉన్నత పదవి సాధిస్తాడు. ముస్తఫా డేర్ డెవిల్ ఎలా అయ్యాడో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

సాహిత్య స్వరూపం ఏదైనా, అది రాణించాలంటే రచయితకి రచనావస్తువు పట్ల నిబద్ధత అవసరం. కథా వస్తువుని తన నిజ జీవితంలోంచి తీసుకున్నా, సమాజం నుంచి గ్రహించినా, ఆయా వ్యక్తులను అత్యంత సన్నిహితంగా గమనిస్తే తప్పితే రచనను అత్యద్భుతంగా తీర్చిదిద్దలేరు. పూర్ణచంద్రతేజస్వి గారు ఆయన అన్ని రచనలలోనూ ఇదే పని చేసారు. తన చుట్టూ ఉండే వ్యక్తులను అత్యంత సమీపం నుంచి గమనించి, వారి స్వభావాలను, నైజాన్ని అక్షరబద్ధం చేసారు. కథలో తారసపడే ప్రదేశమైనా, సంఘటన అయినా చదువుతుంటే కళ్ళకు కట్టినట్లుంది. తోటివారితోనూ, పరిసరాలతోనూ ఎంతో సాన్నిహిత్యం ఉంటేగాని ఇదంతా సాధ్యం కాదు. ఒకప్పటి గ్రామీణులలోని అమాయకత్వం, సంస్కారం, సానుభూతి, కుళ్ళు, కుత్రలు, కుతంత్రాలు…. ఇలా మంచీ చెడూ అన్నింటిని ఆయా పాత్రల ద్వారా సమగ్రంగా వ్యక్తీకరించారు రచయిత. మనుషుల మనస్తత్వాలు, ద్వంద్వప్రవృత్తులు, మూఢ విశ్వాసాలు వారి జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథలలో చూడచ్చు.

పూర్ణచంద్ర తేజస్వి గారి ఈ అయిదు కథలు మన లోపలి వ్యక్తులను మనకి పరిచయం చేస్తాయనడంలో అనుమానం లేదు.

***

మొత్తంగా తరచి చూస్తే, చక్కని కన్నడ కథలని తెలుగు పాఠకులకు అందించే మరో ప్రయత్నం ఈ సంకలనం అని చెప్పవచ్చు. మంచి కన్నడ కథలని శ్రమకోర్చి తెలుగు పాఠకులకు అందించిన రామగోపాల్ గారు అభినందనీయులు. ఈ పుస్తకంలోని మిగతా కథలని గురించి మరోసారి ముచ్చటించుకుందాం.

 

“డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావు మరియు ఇయాళ”పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. 198 పేజీల ఈ పుస్తకం వెల రూ.200/- (విదేశాలలోని తెలుగువారికి $10.). ప్రతులకు రచయితనూ సంప్రదించవచ్చు.
చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in
kolluri–కొల్లూరి సోమ శంకర్

మీ మాటలు

  1. మంచి కథల్ని పరిచయం చేసారు. కథా పరిచయ విధానం కూడా చాలా బాగుంది. పుస్తకం లోని మిగిలిన కథలను కూడా త్వరలోనే పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను.

  2. ధన్యవాదాలు, రాజన్.
    మిగతా కథలను కూడా త్వరలోనే పరిచయం చేస్తాను.
    సోమ శంకర్

మీ మాటలు

*