జీవితాన్ని ఒడ్డున కూర్చుని చూడాలా?

‘‘జీవితానికి అర్ధం ఏమిటి? పరమార్ధం ఏమిటి?’’
ఈ ప్రశ్న ప్రతి మనిషి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవక మానదు. ఒక సారి ఈ ప్రశ్న ఎదురయినాక మనిషి మనిషి గా మామూలుగా ఉండడు, ఉండలేడు. తనను తాను శోధించుకోవడం మొదలు పెడతాడు. అప్పటి వరకూ తనకు ఎదురయిన అనుభవాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా తను పాల్గొన్న సందర్భాలు, తాను నడచివచ్చిన దారులు, తాను విడిచి వెళ్ళిన పాదముద్రలు, తనకు ఎదురయిన వ్యక్తులు, తను చదువుకున్న పుస్తకాలు, తాను నివసించిన భిన్న ప్రపంచాలు, వాటి ప్రభావాలు, ప్రమేయాలు, పరిధులు, పరిమితులు ఆధారంగా తనకు నచ్చిన జవాబు ఏదో వెతుక్కుని సంతృప్తి పడతాడు. అదే జీవితానికి అర్ధమూ, పరమార్ధమూ అని సమాధాన పడిపోతాడు.
కానీ, కొన్ని ప్రశ్నలు ఒకే సమాధానాన్ని ఎల్లకాలమూ అంగీకరించవు. జీవితాంతం ఒకే జవాబును మోస్తూ తిరగవు. స్థలాన్ని అనుసరించీ, కాలాన్ని అనుసరించీ జవాబులు మారుతూ వుంటాయి. ప్రశ్నలకు సార్వ కాలీనత, విశ్వ జనీనత వుంటాయి. కానీ…..జవాబులకి సర్వకాలీన సర్వామోదము వుండదు. అందుకే అవే ప్రశ్నలు మళ్ళీ, మళ్ళీ, పుడుతూ కొత్త కొత్త సమాధానాలు అన్వేషిస్తూ వుంటాయి. అందుకే ఒకసారి జీవితానికి ఇదే అర్ధము, పరమార్ధము అని నిర్ణయించుకుని సమాధానపడినా మరుక్షణంలో ఆ సమాధానం అర్ధరహితం అయ్యే ప్రమాదం వుంది. జీవితం లోతూ, విస్తృతి అర్ధం అవుతున్న కొద్దీ, దాని పట్ల క్షణక్షణం మనం నిర్మించుకొనే నిర్వచనాలు మారిపోతూ జీవితం ఒక ప్రహేళికగా, నిండీనిండని గడులతో విస్మయ పరుస్తూ వుటుంది.

‘‘జీవితానికి అర్ధం ఏమిటి?’’ అని చివరకు మిగిలేది నవలలో దయానిధి తన చిన్నప్పుడు వైకుంఠ మాస్టారుని అంతు లేని అసహనంతో అడుగుతాడు. ఆ ప్రశ్నకు వైకుంఠం మాస్టారు తన జీవిత చరమాంకంలో ఒక సీల్డు కవరు ద్వారా దయానిధికి జవాబు చెపుతాడు. కవరు విప్పి చూసిన దయానిధికి అందులో స్వచ్ఛ సుందర శుభ్రస్ఫటికం లాంటి తెల్ల కాయితం కనిపిస్తుంది. కాయితం తెల్లగా వుంది కనుక, జీవితానికి అర్ధం శూన్యం అనుకుని, జీవితానికి అర్ధమే లేదనుకుని సమాధాన పడతాడు దయానిధి.
నిజానికి చివరకు మిగిలేది నవల మొత్తం ‘‘మనుషులు ఎందుకు ద్వేషిస్తారు?’’ అనే ప్రశ్న చుట్టూ, దయానిధి చేసుకున్న ఆత్మావిష్కరణ. సంఘ ద్వేషానికీ, తల్లి కారణంగా తనలో ఏర్పడిన అపరాధ భావానికీ, ఆకుపచ్చని పాపికొండలని, అపరిమితమయిన అనుకంపతోనూ, దయతోనూ ఆప్యాయంగా చుట్టేసిన ప్రసన్న గోదావరిలాంటి ‘‘అమృతం’’ అవ్యాజమయిన అనురాగానికీ, ఒక తుఫానులాగా, ఒక ఉప్పెనలాగా, ఒక సునామిలాగా ఉధృతంగా, ఉద్వేగంగా కల్లోల పరిచే ‘‘కోమలి’’ ప్రేమకీ నడుమ తూగుటుయ్యాల ఊగిన దయానిధి. జీవితం అనే నాణేనికి రెండు ముఖాలుగా వున్న ప్రేమనీ, ద్వేషాన్ని విస్మరించి జీవితానికి అర్ధమే లేదు అనుకునే భావనలోకి వలస వెళ్ళడం ఆశ్చర్యకరమే అయినా కఠిన కరకు వాస్తవం కూడా !

buchibabu
నది ఒడ్డున కూర్చుని నదిలో గిరికీలు కొడుతున్న చేప పిల్లను చూసినట్లుగా జీవితం ఒడ్డున కూర్చుని జీవితం అనే చేప పిల్ల గిరికీలను గమనించండి. జీవితానికి అర్ధమూ, పరమార్ధమూ అర్ధం అవుతాయి అంటాడు జిడ్డు కృష్ణమూర్తి.
‘‘మనసు ఎప్పుడూ జీవితానికి ప్రయోజనం, పరమార్ధం కోసం వెతుకుతూ వుంటుంది. ఎందుకంటే మనుషులు జీవితాన్ని గాఢంగా పూర్తిగా అనుభవించలేరు కాబట్టి. మీరు జీవితాన్ని అనుభవించే తీరు గాఢమయినది అయితే, మీ లోంచి ఈ ప్రశ్న పూర్తిగా పోతుంది. జీవన ప్రక్రియ సంపూర్ణంగా సంతోషకరమైనది అయితే ఇక జీవితానికి ప్రయోజనం, పరమార్ధం అవసరం లేదు. ఉదాహరణకు మీరు  పనిచేస్తున్నారు అనుకుందాం. మీ ఉద్దేశ్యం డబ్బు సంపాదనో, బాధ్యతా నిర్వహణో అయి వుంటుంది. కానీ ఒక విందుకు వెళితే అక్కడ ఉద్దేశ్య మేమి వుంటుంది? ఏ లక్ష్యమూ వుండదు, కేవలం విందులో పాల్గొంటారు అంతే! జీవితం మీకు ఒక పెద్ద విందులాగా, పెద్ద ఉత్సవంలాగా మారిపోతే దాని పరమార్ధం ఏమిటని మీరు అన్వేషించరు. కేవలం అందులో పాల్గొంటారు అంతే! మీరు అక్కడ ఉండటానికి ఇష్టపడతారు అంతే! ఈ జీవితం ఎలా తయారుచేయబడిరది అంటే దానికి ఒక పరమార్ధమే అవసరం లేదు. దానికి అదే ఒక పరమార్ధం. అదే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. సంపూర్ణ స్ధాయిలో సజీవంగా వుంటే చాలు. ఎక్కడికో చేరుకోవాలన్న పరమార్ధం జీవితానికి అవసరం లేదు. అదే సృష్టి అందం’’.
ఈ మాటలు నావి కావు. దేశానికి చాలా కాలంగా ప్రేమ తత్వాన్ని బోధిస్తూ వస్తున్న సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వి.
‘‘ఏ నిర్ణయం తీసుకోకపోవడమే ఒక నిర్ణయం’’ అని దేశానికి రాజకీయ చాణక్యం అందించిన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు లాగా ‘‘ఏ అర్ధము లేకపోవడమే జీవితానికి అసలయిన అర్ధం’’ అని జగ్గీ వాసుదేవ్‌ గందర గోళ పరుస్తున్నట్లుగా అనిపించవచ్చుకానీ, ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు.
‘‘ఒకసారి పరమార్ధం అవసరంలేదని మీరు గ్రహించగలిగితే కేవలం సజీవంగా వుండటమే గొప్పగా అనిపిస్తుంది’’.
ఆధ్యాత్మిక తత్వ వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ చెప్పినదానికీ, బుచ్చిబాబు కల్పిత పాత్ర వైకుంఠం మాస్టారు చెప్పిన దానికీ పెద్ద తేడా ఏమీ లేదు.
ఒక మునిగోరింట పువ్వు అందమయిన స్త్రీ జడలో అందంగా ఇమిడిపోతుందా…..? అంతకంటే అందమయిన దేవుడి పాదాల చెంత వినమ్రంగా వాలి పోతుందా? అన్న దానితో సంబంధం లేకుండా పూచినప్పటినుండి రాలిపోయేదాకా తన సౌరభంతో ఈ సృష్టిని పరిమళ భరితం చేస్తుంది.
ఒక మలయానిలం అల్లనల్లన ప్రయాణిస్తూ జలభారంతో నిండు గర్భిణిలాగా వున్న మేఘాన్ని తాకి గ్రీష్మానల తప్త మేదినికి స్వాంతన చేకూరుస్తుందా? చండ ప్రచండ రaంరaా మారుతమయి అగ్ని రగిలిస్తుందా? అనే దానితో సంబంధం లేకుండా తనను తాను విస్తరించు కుంటూ వెళ్ళిపోతుంది.
ఈ చరాచర సృష్టిలో ఏదీ తన సహజ లక్షణాలను కోల్పోదు. ఒక్క మనిషి తప్ప. మనిషి మనిషిలాగా సంపూర్ణంగా జీవించడమే జీవితానికి అర్ధమూ పరమార్ధమూ….
వంశీ ఏమిటి? ఈ నెల అర్ధమూ, పరమార్ధమూ అనే విచికిత్స నడుమ, సత్‌సంశయముతో కొట్టుకుపోతున్నాడు అనుకుంటున్నారా? అదేమీ లేదు…

Gollapudi-Maruti-Rao-Nagireddy-Memorial-Awards
ఇటీవల సుప్రసిద్ధ రచయిత, నటుడు, ప్రయోక్త, కాలమిస్ట్‌ గొల్లపూడి మారుతీరావు గారి పన్నెండేళ్ళ పాత నవల ‘‘సాయంకాలమయ్యింది’’ ని సరికొత్తగా చదువుతున్నప్పుడు నాలో కలిగిన భావ పరంపర ఇది.
ఈ నవలలో ‘‘బత్తిన రేచకుడు’’ పేరుతో ఒక పాత్రని సృష్టించారు మారుతీరావుగారు. ఆ బత్తిన రేచకుడు ఈ ఉపోద్ఘాత మంతటికీ కారణం.
ఆంధ్రదేశం నుండి అమెరికా వెళ్ళిన తొలి తెలుగు వాడి కథ ఇది. ఇప్పుడు గాఢంగా పెనవేసుకున్న అనుబంధానికి రేఖా మాత్రంగా పరిచయం ఏర్పడిన నాటి తొలి ప్రాక్‌ పశ్చిమ సంఘర్షణ ఈ కధా సారాంశం. ‘‘ఒక సాంప్రదాయక శ్రీ వైష్ణవ కుటుంబం’’ అనే వాక్యంలోని సాంప్రదాయమూ, కుటుంబమూ ఎలా సాయంకాలంవైపు నడచి సహజ మరణం పొందాయో చెప్పడం ఈ నవలలోని విషయం. ఈ నవలలో ప్రధాన కథలో ఎక్కడా సంలీనం కానటువంటి పాత్ర ఒకటి వుంది, అదే బత్తిన రేచకుడు. ఈ నవలలోని 23వ అధ్యాయంలో ఈ పాత్ర వస్తుంది. నవల మొత్తం చదవక పోయినా, కేవలం ఆ 23వ అధ్యాయం మాత్రమే చదివినా అర్ధం అయ్యే పాత్ర ఇది. నిజానికి ఇది కేవలం ఒక రచయిత సృష్టించిన పాత్ర మాత్రమే కాదు. ఇంతకు ముందు చెప్పుకున్న అర్ధము, పరమార్ధము లాంటి తత్వ విషయాలు, ఒక భారతీయ పరిపక్వ మనస్తత్వంలో ఎలా అందంగా అర్ధవంతంగా ఇమిడిపోతాయో దృశ్యమానం చేసిన పాత్ర. భారత సమాజం, మరీ ముఖ్యంగా హిందూ సాంప్రదాయక సమాజ జ్ఞానం నుండి పాశ్చాత్య సమాజం ఏం నేర్చుకోవాలో అన్యాపదేశంగా నయినా బలంగా చెప్పిన పాత్ర డెట్రాయిట్‌ లో పనిచేసే తిరుమల భారతదేశం వచ్చాక, తన మిత్రుడు విష్ణుమూర్తి తల్లితండ్రులను చూడటానికి శ్రీకాకుళం దగ్గర వున్న ‘‘గిర్‌గాం’’ అనే పల్లెకు బయలుదేరుతాడు. విష్ణుమూర్తి తండ్రే మన బత్తిన రేచకుడు.

saayamkaalamaindi
విష్ణుమూర్తి తన తల్లి కోసం కొని యిచ్చిన అత్యాధునిక గ్రైండర్‌, తండ్రి కీళ్ళ నొప్పుల కోసం రబ్బరు కణుపులున్న రెండు జతల చెప్పులు తీసుకుని రేచకుడి దగ్గరకు బయలుదేరుతాడు తిరుమల.
బత్తిన రేచకుడు ఒంటరివాడు, వృధ్ధాప్యంలో వుండి చివరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నవాడు. ఇమాంపసందు మామిడి పండ్లంటే అతడికి మహాయిష్టం, ఒంట్లో షుగరు వున్నా పండు మీద మమకారం చంపుకోలేక పండ్లు విపరీతంగా తిని ఒక కాలుని మోకాలు వరకు పోగొట్టుకున్నాడు.
‘‘అసలు కాలు ఎలా పోయింది?’’ అని తిరుమల అడిగిన ప్రశ్నకి రేచకుడు ఏం చెప్పాడో చూడండి
‘‘మనకి ఒంటినిండా సెక్కెరే బాబు తీపి తినక్కరలేదు. సిన్నప్పటి నుండి నేను ఇమాంపసందు అంటే పీక్కోసుకుంటాను. కనిపించే మేరలో అయిదెకరాల మామిడితోపు నాదే, ఆరు వేల పళ్ళు దింపుతాను. ఎండలు ముదిరి తొలకరి దాకా ఎంత లేదన్నా రెండొందల పళ్ళు తింటాను. నీ యవ్వ……పోతే దొర బిడ్డలాగా పోవాలి. కానీ ఏడుత్తూ బతికితే ఏం లాభం….? మా డాట్టరు పద్మనాభయ్య ‘‘ఒరే రేసు నా కొడకా! తింటే సత్తావురా!’’ అన్నాడు. నేను నవ్వి ‘‘అయితే తినే సత్తాను’’ అన్నాను. రెండ్రోజులు పనికట్టుకు తిన్నాను, పండొదిలితే ఒట్టు’’
‘‘మరి విష్ణుకి తెలియజేయలేదేం?’’
‘‘తెలిత్తే ఆడేటి సేత్తాడయ్యా: అన్నీ తెలిసిన మూర్కుణ్ణి నేను’’ ఇప్పుడు ఒక్క పండు కూడా తినలేను’’
కాలు పోయేదాకా మామిడి పండ్లు తిన్న రేచకుడు, తన మనసుకు పసందైన ఇమాం పసందును ఎందుకు మానాడు…………?
భార్యకు ఇచ్చిన మాటకోసం!
కానీ భార్య ` కొడుకు కోసం బెంగ పెట్టుకునీ, పెట్టుకునీ మంచం పాలయితే వంట చేసి పెట్టాడు. మల మూత్రాలు తీశాడు.
నీళ్ళుపోసి చీర కట్టాడు. చివరకు తల కొరివి కూడా పెట్టాడు. తప్పిస్తే భార్య చనిపోయిందన్న విషయం కొడుకు కి కనీసం చెప్పను కూడా చెప్పలేదు. ఎందుకని…….?
‘‘ఇక్కడ జరిగేదేదీ ఆడిని బాధ పెట్టకూడదు. ఆడి సుకాన్ని పాడు చెయ్యకూడదు. అందుకే ఆళ్లమ్మ బతికున్నట్టు దొంగ ఉత్తరాలని పూర్ణయ్య పంతులు రాస్తాడు. సంవత్సరం పొడవునా ఆరికి పది బస్తాల ధాన్యం, అపరాలు, మామిడీ అన్నీ నేను పంపుతాను’’ ఇదీ రేచకుడి సమాధానం.
వృధ్ధాప్యంలో చూడవలసిన కొడుకు ఎక్కడో దూరాన అమెరికాలో వున్నాడు. భార్యలేదు, ఒంటరివాడు పైగా వికలాంగుడు
‘‘మీ సంగతి ఎవరు చూస్తారు?’’ అని అడిగితే………..
‘‘మన సంగతి మరోడు చూసేదేంటయ్యా! రోడ్డు మీద కుక్కపిల్ల సంగతి ఎవరుసూత్తున్నారు, సెరువులో సేపపిల్ల సంగతులెవరు సూత్తారు? నీకు ఓపిక వుందా…….. వండుకు తిను. లేదా నాలుగుపళ్ళు తిను, ఇంకా సేత కాదా సచ్చిపో……..’’
రేచకుడి లో ఎక్కడా పశ్చాత్తాపం లేదు. వేదనలేదు. ప్రతి కష్టాన్ని తృప్తిగా మల్చుకునే అద్భుతమైన సంకల్ప బలం ఏదో వుంది.
‘‘తల్లి చావునే కొడుకు నుంచి దాచి మోసం చేస్తున్న మీరు మీ ఆవిడకు ఇచ్చిన మాట తప్ప లేరా…..? అంటే రేచకుడు………..
‘‘కొడుకుని మోసం చేసేది ఆడిని బాధ పెట్టే హక్కు నాకు లేదని, నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిదీ దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని’’ అంటాడు.
మనిషి స్థితప్రజ్ఞుడు కావడానికి చదువుసంధ్యలతో సంబంధం లేని సంస్కార మేదో కావాలి. దాన్ని రేచకుడు సాధించాడు.
‘‘మీ అబ్బాయికి ఏమయినా  చెప్పమంటారా!’’ అని తిరుమల అడిగితే …..
ఒంటి కాలితో గెతుతూ వచ్చి ‘‘నువ్వు యిక్కడ విన్నది, సూసిందీ ఏమీ చెప్పకు. తల్లికుక్క పిల్లపుట్టగానే దాన్ని తినేత్తాది కారణం తెలుసా? తన ప్రేమ  నుండి ఆ పిల్ల దూరమయి పోతుందేమో అన్న భయం సేత. నా భయానికి ఆడి పీక కొరికీ కొరకకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడుతున్నాను. రెక్కలొచ్చాక పిల్లగూడులోంచి ఎగిరిపోకపోతే తప్పు తల్లిదే కానీ పిల్లది కాదయ్యా! పెపంచకాన్ని అలవాటుచేసి గూడులోంచి తోసెయ్యాల నేనా పనే సేత్తున్నాను’’
రేచకుడు ఒక్క కాలికే వంగి నమస్కారం చేస్తాడు తిరుమల. ఈ పాత్రని తరచి చూస్తే…ఎన్నో విషయాలు బయటపడతాయి!

‘‘పిల్లలు మనలోంచే వస్తారు కానీ, మన ఆశలకీ, ఆశయాలకు వాళ్ళు వారసులు కారు. వాళ్ళదొక ప్రత్యేకమయిన లోకం’’ అనే ఖలీల్‌ జిబ్రాన్‌ గుర్తుకు రాడా……….?
‘‘జీవితాన్ని ఒడ్డున కూర్చుని చూడాలి’’ అన్న కృష్ణమూర్తి గుర్తుకురాడా..? ‘‘జీవితాన్ని తెల్లకాయితంతో పోల్చి చూపి ప్రేమలేఖో, మరణశాసనమో ఏదో అద్భుతంగా నువ్వే రాసుకో’’ అన్న వైకుంఠం మాస్టారి తత్వబోధ యిదే కదా…..!
‘‘మనసు ప్రతిదాన్నీ భాగాలుగానే గ్రహించగలదు. ఈ చిన్ని చిన్ని ముక్కలుని మీరు కలిపితే అది మొత్తంగా మారదు. మీ వద్ద కేవలం ముక్కలు మాత్రమే వుంటాయి. మీరు ఎంత ఎక్కువగా సేకరిస్తే మీరు అన్ని ముక్కలుగా తయారవుతారు. మీరు ఎన్ని ముక్కలు సేకరించినా అవి ఎప్పటికీ మొత్తంగా మారవు. శివుడికి ముక్కంటి అని పేరు. మూడోకన్ను తెరుచుకోవడం అంటే భౌతిక మయిన కళ్ళకి అతీతమయిన జ్ఞానచక్షువు తెరచుకుని, ఇంద్రియాతీతమైన సంపూర్ణత్వాన్నీ, మొత్తాన్నీ చూడగలగడం. జీవితాన్ని పూర్తి లోతుతో, పూర్తి ప్రమాణంతో అర్ధం చేసుకోవడమే…..అదే జీవిత పరమార్ధం’’ అంటున్నాడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌.
రేచకుడు మూడో కన్ను తెరిచాడు కదూ……!
ఆ జ్ఞాన చక్షువే ఈ జీవితానికి అర్ధమూ…….పరమార్ధమూ……!’

-వంశీకృష్ణ

మీ మాటలు

  1. నా ఉద్దేశాంలో ఈ సంఘటన ఒక్కటే ఆస్వాదించదగిన సందర్భం ఈ నవల్లో.

మీ మాటలు

*