చీకట్లోంచి రాత్రిలోకి…

శ్రీధర్ బాబు

శ్రీధర్ బాబు

ఎంతసేపని

ఇలా

పడిపోతూనే ఉండడం?

పాదాలు తెగిపడి

పరవశంగా

ఎంతసేపని ఇలా

జలపాత శకలంలా

లేనితనంలోకి

దిగబడిపోతూనే ఉండడం?

రాలిన

కనుగుడ్ల నడుమ

కాలిన దృశ్యంలా

ఎంతసేపని

ఇలా నుసిలా

రాలిపోతూ ఉండడం?

గాలి

ఎదురుతన్నుతున్న

స్పర్శ లేదు-

జాలి

నిమిరి నములుతున్న

జాడ లేదు-

ఎవరో.. పైనుంచి

దిగాలుగా చూస్తున్నారన్న

మిగులు లేదు-

లోలోతుల్లో ఎవరో

చేతులు చాచి

నిల్చున్నారన్న

మిణుగురులూ లేవు-

ఎంతసేపని

ఇలా

అడ్డంగా

తలకిందులుగా

చీకట్లోంచి రాత్రిలోకి?

రాత్రిలోంచి చీకట్లోకి?

పొగల

వెలుగు సెగలకు

ఒరుసుకుపోతూ

తరుక్కుపోతూ

ఎంతసేపిలా

లోతుల్లోంచి లోతుల్లోకి..?

Pablo_Picasso_PIP025

వేళాపాళా లేని

ఖాళీలోకి

ఎండుటాకుల గరగరలతో

కూలే చెట్టులా

ఇలా

ఎందుకని

బోర్లపడ్డ ఆకాశంలోకి?

జ్ఞాపకమూ

దుఖ్కమూ

ఆనందమూ

నేనూ

ఎవరికెవరం కానివారమై

రేణువుల్లా చెదిరిపోతూ

పట్టుజారుతున్న

చీకటి వూడల నడుమ

నిద్ర స్రవించిన మెలకువలతో

గాట్ల మీద కట్లు కట్టుకుని

ఇలా ఎంతసేపని

కలల్లోకి

కల్లల్లోకి

కల్లోలంలోకి?

(12 గంటలు, 11 సెప్టెంబర్, 2013)

-పసునూరు శ్రీధర్ బాబు

మీ మాటలు

  1. naresh nunna says:

    శ్రీ!
    గొప్ప కవిత. మళ్లీ మళ్లీ చదివిన కొద్దీ – నువ్వు ఒక రూపంగానో, పరిచయంగానో తరిగి పోతూ, అంతకు మించిన ఒక భావంగా, చిక్కనైన అనుభవంగా దగ్గరవుతున్నావు. సుమారు పాతికేళ్ల వయసున్న మన స్నేహాన్ని అధిగమించి, ఒక కవిత నిన్ను భౌతికంగా పక్కకి నెట్టి, ఒక మూడ్‌లా చేరువ కావడం మించి ఆ కవిత వైశిష్ట్యానికి మరో దాఖలా అక్కర్లేదు.
    నిన్ను మించి నీ కవిత ఎదిగిన ఈ సాఫల్య సందర్భంలో, నీకు సంబంధించని ఒక సూచన:
    కవితకి illustration గీయడం ఆర్టిస్టుకి ఒక సవాలు. ఆ కవితని అతను కుంచెతో గీసే ప్రయత్నం చేస్తాడు. ఆ ఆర్టిస్టు పరిమితి విస్తృతల మేరకి ఆ చిత్రం ఉంటుంది. వనరులు, సమయం తక్కువ ఉన్న ఇటువంటి సందర్భంలో, కవితకి బొమ్మ నిర్ణయించడం ఎడిటర్లకి కత్తిమీద సామే. అది కవితకి distortionలా ఉంటే పత్రిక నిర్వాహకుల శ్రమ నిష్ఫలమౌతుంది.
    ఇక కవి/ రచయిత ఫొటో : Generalise చేయను గానీ, ఇక్కడ మాత్రం నీ ఫొటో నప్పలేదు. అలాఅని, ఒక silhouetteలా నువ్వు కలం పట్టుకొని శూన్యంలో కి, లేదా “చీకట్లోంచి రాత్రిలోకి…” చూస్తున్న ఫొటో వేయమని కాదు. క్లోజప్ ఫొటో మరొకటైతే బాగుండేది….

  2. నరేష్, షుక్రియా. బొమ్మలకు బాధ్యత నాదే! కొంచెం కాదు చాలా కష్టంగా వుంది కవిత్వానికి తగిన బొమ్మలు తెచ్చి పెట్టడం! శ్రీధర్ ఫోటో వేరేది పెట్టాం చూడండి. ఇష్టమయిన కవి కదా కొంచెం భిన్నమయిన ఫోటో పెట్టాలని తాపత్రయ పడ్డాను, అంతే! ‘ఎడిటర్’ లాగా ఆలోచించలేదు ఆక్షణంలో!

    – అఫ్సర్

Leave a Reply to naresh nunna Cancel reply

*