దళిత కవిత్వపు వెలుగు రవ్వ తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ !

మాకు ఒక భాష కావాలి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్న సుధాకర్ !

గాడిద పేడతో
డిటర్జెంట్లు చేసే రజకుల మేధస్సునీ
గొడ్డుటావుల చర్మాన్ని
గంటలో ఒలిచే చర్మకారుల నైపుణ్యాన్నీ
వాంతి చేసుకోకుండా
దేశీయుల మలాన్ని చేతులతో పట్టుకెళ్ళే
దౌర్భాగ్యుల సహనాన్నీ
గుర్తించని ఈ భాషాజాతులు
ఎవరికి ట్రోజన్‌ హార్సులు!

జాతిలో సమైక్యం కాలేనప్పుడూ
నీతిలో సమతుల్యం లేనప్పుడూ
వాచకాల్లో ఒక్క గౌరవ పదమూ
దళితుల గౌరవం కోసం రాయనప్పుడూ
సమానత్వం ఫ్లాట్‌ఫారాల మీద
సగౌరవంగా వీధులూడ్చే వాళ్ల పిల్లల్ని
సివంగిలా తరిమికొట్టేదెవడిభాష!

                                                                          –తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్

‘చిలిపి కళ్లతో నవ్వుతా భూమి ఆకాశాల మజ్జన ఎవరి పాట వాళ్లు రాసుకోవాలంటాడు’ త్రిపురనేని శ్రీనివాస్. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంటాడు కలేకూరి. ఇప్పుడు సుధాకర్ కి  భాష కావాలంట. ఇన్నాళ్లకన్నా ఆ దళిత భాష. ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి స్పృహ వచ్చింది. నిజానికి అంటరాని కవిత్వాన్ని, దళిత జీవితాలని, సాహితీ ఆకాశంలోకి ప్రవేశపెట్టి, బతుకు ఆలోచనల మకిలిని , అహంకారపు మాడుని  పచ్చడి బండతో కొట్టి, నా దారి నేనే ఏసుకుంటా అని ఎగరేసుకున్న జండా సుధాకర్.

ధిక్కారిగానూ, ఒకసారి యోధుడుగానూ, ఒకసారి జపాన్‌లోని పార్కు గురించీ, మరోసారి నొసలు ముడవద్దంటూ విశ్వభాష అయిన నవ్వు గురించి, ఒకటా రెండా, రిజర్వేషన్లు, దళిత క్రైస్తవం, ఇవాంజులికల్ చర్చి పెద్దలు , కామ్రేడ్లపైన చురకలు, వర్గీకరణలు అంగీకరించకుండా ధిక్కరించి, ఏ విభజననీ ఎవ్వరేమనుకున్నా ఒప్పుకోకుండా తుఫానులో లైటు హౌస్‌లాగా నిలబడ్డాడు. చెవిలో సీసం పోసిన వాళ్లని, మురిగిన కషాయాల కాషాయలని, ఉత్తుత్తి ప్రజాస్వామ్యాన్నీ, ప్రజల ప్రాణాలతో ఆడుకునే పాలకుల నిర్ణయాలని, వ్యతిరేక వ్యక్తులనీ, శక్తులనీ, తన కవిత్వంతో, ప్రతి కణాన్ని ఒణికించాడు. గుండెల్ని చీల్చే మాటలతో, విషయాన్ని మూడోకంటితో చూస్తా. ఎప్పటికప్పుడు మారే వాసనలని కలంతో పీల్చుతా, అందరికీ కొంచెం పూశాడు. వర్గీకరణలూ లేని కవిత్వాన్ని ఎంతో కొంత (ఇది సరిపోదు) అందించాడు. దళిత కవిత్వాన్ని అందించాడు. ఇంకొక్కసారి చెపుతున్నా. నిర్బంధ మానవ జీవితాల వ్యధల్ని, ఆంక్షల కట్టడాలని కూల్చిన సరికొత్త కవితా గ్రామ నిర్మాణ శిల్పి. ‘రావణాసురు’డి కాలుతున్న కాష్టపు కంపు ఆరని చితిమంటలని కథలుగా చెప్పుకుంటా, బొట్టూ, పూవులు ఉన్న మండోదరి పతివ్రత అని దణ్ణం పెట్టుకునే లోకంలోనే బతుకులు ఈడుస్తున్నాం. ఆ కవురు కంపుని కాష్టపు పొగలనీ కూడా కవిత్వం చేసినవాడు. తరతరాలుగా దళిత జాతి మనస్సులో, జీవితాల్లో, మాటల్లో చితి ఆరటంలేదు. వాళ్ల మాటల్ని, వాళ్ల బాధల్ని మనం భాషగా ఒప్పుకోం. ఇక్కడ భాషంటే రెండు తోలు పెదాల్లోనించీ స్వరపేటికతో కలిపి వచ్చే శబ్దాలు, అరుపులు. నాలిక మడతలు కాదు. భాష అంటే  పాట్లు, భాష అంటే బతుకు, భాష అంటే జీవితం. కత్తికన్నా కలం పదునయినదన్నది పాత బూజు సిద్ధాంతం. కాదు ఈ రెండింటికన్నా భాష పదునయినదనీ, దానిలో కూడా మళ్లీ ఎన్నో తేడాలు. Power of Languageకి Language of Powerకీ ఉన్నంత తేడా.. దీన్ని చర్చిస్తే  ఒక గ్రంధమే రాయాలి.

maakuOkaBhashaKaavaaliByWilsonSudhakar

సాల్వెడార్ ఆలెండీ మృతివార్త విని ప్లాబో నెరుడా మరణించాడు. విచిత్రం… కవిగా మరణించినా మెదడు మాత్రం ఆఖరి నిముషం వరకు పని చేసిందంట. బహుశా నెరుడా మెదడులోని ఒక కణం ఈ కవి చేతిలో దూరిందేమో. ఎన్నెన్ని సంఘటనలు. కష్టాలు ఎవరివయినా ఒకటే. ఎన్నెన్ని సంఘటనలని రూపం కట్టాడు. నిజానికి పారే నెత్తురికీ, ఊడదీసిన బట్టలకీ, భర్తాబిడ్డల ముందు మానభంగాలకీ, ఓపికలేని కుత్తుకలకీ, పిల్లికూతల స్వరల తరఫున నరాలు తెగిపడేలాగ అరిచాడు. అసలు ఈ సంఘటనలు కవితలుగా మలచటానికి ఇంత ఓపికా, శక్తి ఉండటం కూడా ఆశ్చర్యమే. మట్టిలో పడే పాదముద్రలకి శాశ్వత్వం మళ్లీ వాన కురిసేదాకానే. బాటగా బతుకుపాటగా, పాటుగ మారతయ్యనుకోటం మన ఆశ. అయినా ఎలుగెత్తటం మానకూడదు. ఎలుతురిని ఎతకటంలో తప్పులేదు.

కారంచేడు, చుండూరు, నీరుకొండ, కందమాల్,  భైర్లాంజీ, నిర్భయ, దళితక్రైస్తవం, అంబేద్కర్ , బుద్ధుడు, పూర్తి రిజర్వేషన్లు, అన్నీ చెపుతా ముల్లు కఱ్ఱతో తన వాళ్లని తనే పొడుస్తున్నాడు, పొడిచే పొద్దువైపు చూపుతా.

మరిప్పుడూ భాషెందుకు కావాలి. ఇప్పుడు మాట్టాడే భాష కాదు? మరి అందరూ ఆ భాషే మాట్టాడతంటే వీళ్లెందుకు ఆ భాషని కక్కిన కూడులాగా అసహ్యించుకుంటన్నారు.

వాళ్ల పదాలనీ, జీవితాలనీ, వృత్తులనీ, గుండెనీ, గుడిసెనీ, ఆటనీ, పాటనీ, బువ్వనీ, అవ్వనీ, నవ్వునీ, ఏడుపునీ మనం గుర్తించనప్పుడు అసలు ఈళ్ళు ఉనికే వద్దన్నప్పుడు, బతుకే దినదినగండం నూరేళ్ళ ఆయుస్సు అయినప్పుడు అది ఆనందపు మాటగా, మాట బాసగా మారుద్దా. వాళ్ల పాటకి సరిగమలు లేవంటే అది శ్రమది, ఇది ఇంకోటి. వాపుకీ, బలుపుకీ ఉన్న తేడా.

సంగీతం అంటే సరిగమపదనిసలు. తిరగా బోర్లా ఎనిమిదక్షరాలు. ఆరోహణా, అవరోహణా అనే అర్ధం కాని పదాలా అంటే అవ్వొచ్చు. కాకపోవచ్చు. ఒక సినిమా” ద కలర్ కాల్డ్ పర్పుల్” లో స్పీల్‌బర్గ్ ఇలా అంటాడు. సంగీతం అంటే ఆఫ్రికన్ ఎడారుల్లో రైలు మార్గాలు వెయ్యటానికి, గడ్డపారల్లో పట్టాలు దొర్లించేటప్పుడు ఒదిలే ఊపిరి, కడుపు నింపుకునే ఆహారాన్వేషణలో భయాన్ని పోగొట్టుకోటానికి చేసే ధైర్యపు శబ్దాల పాట. ఆకలేసి, ఏసి ఏడ్చి సొమ్మసిల్లిన నిస్సత్తు రాగం. బహుశా ఇదే నా మెదడులో కూడా ఉందేమో.

ఏది ఏమైనా తెలంగాణా ఉద్యమానికి పునాది వాళ్ల మహోన్నతమయిన సాంస్కృతిక వాదమే. గొప్ప భాష వాళ్ల సొంతం. ఎంతో సొగసైన మాండలికం, కట్టె పుల్లలు, కట్టెల పొయ్యి, దుడ్డు, బిడ్డ, యాట లాంటి అసలయిన పదాలు ఆళ్ల సొంతం. ఎంతెంత సాహితీ సంపన్నులు. మాండలీకాలనే గవ్వలనీ, రవ్వలనీ పోగేసుకున్నవాళ్లు. గద్దర్, గోరేటి లాంటి సంస్కృతీ వారసత్వంతో అదీ ఒద్దీకరించబడి (రికార్డెడ్) ఉండాలి. అక్కడా అంతా గొప్పా అంటే అదేమీ లేదు. పట్టు చీరల గరగరల బతుకమ్మల్లో పాపం మన దళిత సోదరులకి  సోటుందా. సరే మళ్లీ విషయంలోకి వద్దాం. నేను “క” గుణింతాన్ని ఎన్ని రకాలుగా నేర్చుకున్నానో.

1. ‘క’కార అకారముల ‘క’, ‘క’కార ఆకారముల ‘కా’, ‘క’కార ఇకారముల “కి’

2. ‘క’కు దీర్ఘమిస్తే కా, ‘క’కు గుడిత్తే ‘కి’, ‘కి’కు పొల్లిత్తే ‘కీ’

3. క, కా, కి, కీ, కు, కూ,కృ, కౄ

ఇక్కడే మూడు మూడు వర్గాలయ్యాయి. ఒకటి బ్రాహ్మణులది, ఒకటి ధనగ్రవర్ణాలది, ఒకటి బీదలది. అయినా అన్నీ సదివినా, బతుకులో ఈ కాకిగోల ఎంతకి ఉపయోగపడుద్దో అర్ధమే కాదు.

అసలు దళిత వాదానికి పునాది ఏంటి? ఎవరో కొద్దిగా ఆలోచిత్తే చాలు. ఎవరికయినా తెలుత్తుంది. హైందవ అమానవీయ సంస్కృతిని ధిక్కరించే పోరాటమే. ధర్మశాస్త్రాల ఆధిపత్యాన్ని తిరస్కరించిన చార్వాకులు, బౌద్ధులు, అంబేత్కర్, పూలే, పెరియా ఉద్యమాలే కదా మూలం. కుల నిర్మూలన జరగాలనే వాదమే కదా వాస్తవానికి దళితవాదం. ప్రవాహపు నదిలా ఉండి ఉపనదులని కలుపుకుంటా సంపన్నం కావాలి. కానీ కాన్షీరాం అన్నట్టు కడుపు నిండినవాడు ఎవరంటే దళిత బ్రాహ్మణుడు అంటాడు కవి.

వాళ్లలోని ఈ ఆకారం లేని పోకడల పట్ల పెన్నం మీద గింజల్లా పేలతాం కానీ భూమిలోని విత్తులా మొలవరేం. దళితోద్యమాలు చైతన్యపూరితం అయ్యి తీవ్రమయిన అగ్రహాన్ని వ్యక్తం చేసే స్త్రీలని గాయపరిచే భాషలని  వాడటం నివారించగలిగాయి. ఎన్నో సంకలనాలు కూడా వచ్చాయి. ఎంతోమంది కవులు ఎన్నోరకాలుగా రాశారు. కొందరయితే పేరొచ్చినాక దళిత కవిత్వం, దళిత అనే మాటలకే దూరంగా జరిగిపోయారు. (ఇక్కడ  పేర్లు అవసరం లేదు) ఒకరకంగా అన్యాయాల పైన  కూడా . అంటే వాళ్ల మీద వాళ్లే  పోరాటాలు చేసుకోవాలేమో. అయినా ఎంత చెప్పినా దళితవాదం గురించి తక్కువే. అదొక పోరాటం, ఉద్యమం  స్థాయిలో ఇంకా పెరుగుతూనే ఉండాలి.

కొందరికి నదులు, కొండలు, పర్వతాలు, జలపాతాలు, కిటికీలోంచి లోకం, ఉదయాలు, సాయంత్రాలు.. ఇవే కవిత్వం. ఇక్కడి కవికి అణిచివేత, అణగదొక్కటం, నోటితో మాట్లాడి నొసలుతో ఎక్కిరించటం లాంటి వాటిపైన పశృతలతో పడ్డాడు. ఇది నిజంగా కొంతలో కొంత ఆధునిక ధిక్కారం. ఊకబస్తాలాంటి మెదళ్లని కదిలిచ్చటం. అంబరానికి ఎగిరిన పొలికేక, తెగిపడ్డాక కంఠాల అరుపు. మనుషులుగా గుర్తించాల్సిందే అనే హెచ్చరిక. మీద పడయినా మావాటా లాక్కుంటాం. పరిగె గింజలకి కాదు, పాలికుప్పలకోసం, కల్లాల కోసం పోరాటం. ఆమోదాలకోసమో, అలంకారాల కవిత్వం కాదు. ఆకలికేకలు. అణిచివేత అరుపులు, కులాల కుంఠాటల్ని జాడిచాడు.

మాకు ఒక భాష కావాలి. అది దళిత భాష కావాలి. కోరికయితే కోరాడు కానీ నిజానికి సుధాకర్ కవిత్వంలో ఎంత దళిత భాష ఉంది? ఉంటే ఎంత? లేకపోతే ఎంత. కొంచెం ఎనక్కి వెళితే నేను తన ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాను. కోస్తాలో మాంచి మోతుబరి కమ్మగ్రామం ఆయన ఊరు. తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులు. తండ్రి ఊరికి మంచి చెడులు చెప్పే పాస్టరు, పోస్టు మాస్టరు, హెడ్ మాస్టరు. తల్లిగారు కూడా ఉపాధ్యాయురాలే. ఒక రకంగా మాస్టారి అబ్బాయిగా మంచి జీవితమే. అందరికన్నా మెరుగయిన బతుకే. అందుకే ఎక్కువగా నాగరిక భాషే ఉంటది.. మరి విషయం దళితులది. విధానం స్థానిక, దేశ, విదేశ పదాల కలగలుపు. అయినా సమస్యనే తీసుకున్నాడు కనక ఈలోపాన్ని వదిలేద్దాం. మరి ఇపుడు మాట్టాడేది భాష కాదా? శ్రమ చేసి వాడి పాదాలు మనతో మాట్టాడాలి. డప్పు కొట్టె చెయ్యి గుండెల దడ కావాలి. కవికి ఒళ్ళంతా కళ్లయి ప్రపంచలోని ప్రాపంచాన్ని చూడాలి. ఎమ్మటే కంటిలో పాపలా లలితంగా మారిపోవాలి. మళ్లీ ఇట్టా అంటాడు. భూమినాది కాదు. భూమిపయిన హక్కు నాది కాదు. ఏ రూపంలోనయినా మమ్మల్ని కలుపుకోనప్పుడు మీ బతుకు కతల్లో మాకు గారవమే లేనప్పుడు, మాకు మీ చెడిన చరిత్రలో చిరుగుల పేజీ అయినా లేనప్పుడు ఈ భాష మాకెందుకు? అప్పుడప్పుడు అనిపిచ్చుది. సమాజం చేసిన గాయం ఎంత లోతయినదో కదా.. ఇంకా గేదె మానాన్ని పొడిచే కాకుల జీవితమే కదా. చిరుగుపాతల గోనెపట్టయినా కప్పట్లేదు. కాకులకి వదిలేశామిది చూడండి.

 

కులపిచ్చిగాళ్లకి దేశమొక ఎలమావితోట

జాతికి జవ్వనాశ్వంలా మేమూ శ్రమదానం చేస్తున్నా

కుల ఓంకారాన్ని ప్రణవాక్షరం చేసుకున్న

దేశపౌరుల గుండెలోతుల్ని తెలుసుకోగలమా!

కాలేజీ రోజులు ఇంకా పచ్చగా, పచ్చిగా కళ్లముందే కదలటల్లా. ఆడు ఒకటా, రెండా అని మీ చెవుల్లో మోగటల్లా.. అన్నియ్యా, అక్కియ్యా, ఒచ్చేడు, ఎల్లేడు అనే ఎకిలి మంత్రాలు ఇంకా వాగి మోగుతున్నాయి.

రామా “అడ్‌కాప్” చెప్పులకన్నా

నీ పావుకోళ్ళ జత గొప్పవైతే

రా! బహుజన సామ్రాజ్యంలో గద పట్టుకు నిలబడ్డ అంబేత్కర్ని దాటి’

ఎంత ధైర్యం, నిబ్బరం, మేము దళితులం అని సగర్వంగా తలెత్తిన క్షణం, బతుకుల్ని బాగుచేసి, చేత్తన్న, చేసే వైనాన్ని కనుక్కొన్నారు. మీకొక మనిషున్నాడు. అతని ఆత్మ అంతరవలయమై ప్రతి దళితవాడని ఇనపకంచెలా, తిరగబడే పిడికిలిలా, కన్నీటిని తుడిచే అమృత హస్తంలా కావలి కాత్తానే ఉంది.  ఏ తలకాయ లేదనుకున్న గొఱ్ఱె తలకాయలకి ఓ సమాధానం ఈ తల. ఏ ధనం లేదనుకున్నవాళ్లకి జై భీమ్ పిడికిలే సంపద. తలే కొన్ని కోట్ల తలల తిరుగుబాటు. తలలకే తల అది. అసలు ప్రతి కులంలోనూ ఓ అంబేత్కర్ ఉండాలంటాడు కవి. అంబేత్కర్ వల్ల కడుపులు నిండినవాళ్ల మానం పైనా చురకలేశాడు. నిజానికి అంబేత్కర్ ఆశయాలు ఎంతగా ప్రచారం పొందాయో, అంతకన్నా త్వరగా దుష్ప్రచారాలని సాగించటంలో కూడా కొన్ని శక్తులు విజయం సాధించాయి. అసలు దళితులే అంబేత్కర్‌ని ఆరాధించాలని ఏమీ లేదు. వ్యక్తిగా ఎవరమయినా అతని గొప్పతనాన్ని సంఘం పయిన ఉండే ముందు చూపుకీ జై భీమ్. రామాలయాలు వద్దు. కాలే కడుపుకి గంజే ముద్దంటాడు.

మాంసం తినే హిందువంటే

మాంసం తినని హిందువు ఇంటిదాకా రానిస్తాడా…..

ఇంటిదాకా కాదు ఒంటికి తగిలినా మునుగుతారు. మన సిగ్గులేని  సమత్వం సిగ్గుతో దాక్కోటాన్ని చూత్తాం.

విత్తమూ నీది కాదు. విత్తనమూ నీది కాదు. విన్నాణమూ నీది కాదు. పుల్ల మామిడి దొరకని పురజనులకి, ఓడలు దిగిన చైనా యాపిళ్లలో గుట్టు, కిమయా డేట్సు, ఓట్సు, Ives(ఏవీస్) మాహిశ్చరైజర్లు, ఈ దేశం నీదయినా, ఈ రాజ్యం నీది కానప్పుడు , ఈ గింజ నీ చేతిలో ఉన్నా భూమి లేనప్పుడు అవి ప్రపంచీకరణ దుష్ప్రభావాలని దుయ్యబట్టి, ఎండేశాడు. ఈ పద్యాలన్నీ చదివితే ఇవి దళిత, బహుజన, క్రైస్తవ సమాజం కోసమే  అనుకుంటే పొరపాటు. ఆలోచిస్తే పుడమిని చీల్చుకుని వచ్చే ప్రతి ప్రాణి బాధ దిగులు. ఉనికిని కోల్పోయే జీవితాన్ని గుర్తు చేస్తా భయంతో చేసే హెచ్చరిక.

sindhumadhuri-మన్నెం సింధు మాధురి

 

(రెండో భాగం వచ్చే వారం)

మీ మాటలు

  1. దళిత కవిత్వంలో ఒక నిర్ధిష్టమైన దిశానిర్ధేశ స్వరం Wilson Sudhakar Thullimalli. ‘దళిత వ్యాకరణం’ నుంచీ ‘మాకూ ఒక భాష కావాలి” వరకూ ఒక కొత్తభాషను, ప్రాంత-దేశ- ప్రపంచ ఘటనలకు తనదైన ఒక దళిత భాష్యాన్ని విప్పిచెప్పిన… చెబుతున్న కవి, ఉద్యమకారుడు. మంచి సమీక్ష.

  2. DrPBDVPrasad says:

    సంప్రదాయ వ్యాకరణంలో వైయాకరణులు చెబుతుంటారు ఈ సూత్రం పరిభాష, ఈ ప్రకరణమంతా ఇది వర్తిస్తుందని అలాగే దళిత కవిత్వం పై వచ్చిన ప్రతి కవితా సంకలనానికి సుధాకర్ గారి రెండుపుస్తకాలు(వ్యాకరణం,భాష)టాగ్ చేసి ఇవ్వాలి.శ్రామిక వాడల్లోంచి వచ్చిన అక్షరాలు పదాలు పదబంధాలు బలంగాను బలిష్టంగాను ఉంటాయి ఆ అక్షరాలను నంజినప్పుడే రుచితెలుస్తుంది -సింధుమాధురి మంచి సమీక్షే చేస్తున్నారు మిగతాభాగం కోసం వేచి చూస్తుంటాం

  3. Thirupalu says:

    నాగరికులమధ్యన కంపు కొట్టే భాష . . చీ! చీ! . . అందమైన మమ్మీ, డాడీ! …. పోనీలే . . ప్రామాణిక, భాష ను కాదని (మీ)నీకు ఎన్ని గుండెలెన్నిగుండెలు…? అమ్మో! అమ్మో! ఏం పొయ్యే కాలం? ఎంటీ . . ఎంటీ … ? దళితులకూడా ఒక భాష కావాలా? ….. అసలు మీకు బాష వచ్చా? అది కావాలంటె విశ్వనాధ సత్యనారయణ వేయి పడగలు చదువుకోండి! మరీ కావలిస్తే నన్నయనో, ఏ కాళీదాసునో చదువుకోకుండా ……. అంతే గానీ , ఈ అలగా , గా…. కా’.. భాషను ఇంత పబ్లిక్కులో …. ఇంతమంది నాగరికులు చూస్తూండగా .. సారీ! చదువుతుండగా ఇక్కడ వినిపిస్తారా? కాదు.. కాదు…కాదు కనిపింపిస్తారా? అయినా, ఈ సంపాదకుల్ని అనాలీ! తెలుగుకి ఎంత నామోషీ! :)

మీ మాటలు

*