గద్దరన్న చుట్టూ నా కెమెరా కన్ను…!

desktop gaddar(1)

 

1.

తారీఖులూ, దస్తావేజులూ సరిగ్గా గుర్తులేవు కానీ, దాదాపు ఓ మూడు దశాబ్దాల క్రితం అనుకుంటాను. హైద్రాబాద్

“మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్”లో మూడు రోజుల పాటు AJLRC మహాసభలు  జరిగాయి. దేశం నలుమూలల నుండి వచ్చిన కళాకారులు, వక్తలు, ఎర్రజండాల రెపరెపల్తో హాలు  హాలంతా హోరెత్తి ఎర్ర్ర సముద్రంగా మారింది. ఆ మూడు రోజులూ పాటలు, వుపన్యాసాలు వింటూ, ఫోటోలు తీస్తూ తలమునకలుగా వుండేవాణ్ణి.

2.

చివరి రోజు లాంగ్ మార్చ్‌లా హాలునుండి చార్మినార్ ఓల్డ్ సిటీ వరకు ఊరేగింపు. అక్కడ ముగింపు సభ. దారి పొడవునా పాటలు, డప్పుల చప్పుళ్ళు, వివిధ కళాకారుల జానపద నృత్యాలు. అది నిజంగా ఒళ్ళు జలదరింపజేసే ఎర్రమైలు రాయి ఊరేగింపు! గద్దర్ ఆట పాట, మాట మీదనే నా కెమరా కన్ను గురి ఎప్పుడూనూ! అంతలా అతని చుట్టే పరిభ్రమిస్తుండేది నా చూపెప్పుడూనూ.

3.

సభను ప్రారంభిస్తూ గద్దర్ “వూరు మనదిరా.. ఈ వాడ మనదిరా” అంటూ పాడి ప్రకంపనలు రేపుతూ తెరమరుగయ్యాడు. గద్దర్‌ని వెతుకుతూ నేను సభాస్థలి వెనుక భాగంలో కనిపించాడు. ఆకలిమీద వున్నాడేమో. విమలక్క (గద్దరన్న జీవిత సహచరి) వెంకటాపురం నుంచి తెచ్చిన వేడి వేడి అన్నం, పప్పుచారు  కలుపుకొని తింటూ కనిపించాడు. ఓల్డ్ సిటీ కదా.. మీటింగ్ వెనకవైపు కాబట్టి అక్కడ అట్టే వెలుతురు సౌకర్యం లేదు. అవి డిసెంబర్ మాసపు దీర్ఘ చలిరాత్రుల రోజులనుకుంటాను. మసక చీకటి. తను కూచుని తింటున్న గోడ చారికలతో పాకురు పట్టి ఉంది. కింద కాళ్ల దగ్గర రాళ్లు, రప్పలు. గడ్డి విపరీతంగా పెరిగి వుంది. పైన వెన్నెల పుచ్చపువ్వులా కాచిలేదు కాని మసక మసకగా వుంది.

నేనా ప్రదేశం చూడగానే నాకు అడవిలో అన్నలకు ఆప్యాయంగా అక్కలు, తల్లులు, చెళ్ళెళ్ళు, సహచరులు తమ ఇంట్లో కలిగింది ప్రేమతో పంచుతున్నట్టు అనిపించింది. విమలక్క కూడా ఖద్దరు గళ్ళ ముతక చీర ధరించి వుంది. నాకు వెంటనే వాళ్ల ఫోటో మనసు రెటీనా మీద ముద్ర వేసుకుపోయింది. అన్నలు తుపాకి సరి చేసుకుంటున్నట్టు, వెంటనే నేను నా Pentax K 1000 ని క్లియర్ చేయబోతే (ఇప్పటిలా అవి ఆటోస్టార్త్ కాదు) నాకు ఏదీ సరిగ్గా కనిపించలేదు. ఫోటో బ్లర్‌గా  బావోదు కదా! వెంటనే నాకు ఆశాకిరణంలా గద్దర్ కట్టుకున్న తెల్లని పంచె అంచు కనిపించింది. దాని మీద క్లియర్ చేసుకుని బుల్లెట్‌లా క్లిక్‌మనిపించాను. అంతే! ఎగిసి  పడుతున్న నా గుండె చప్పుళ్ళు, గద్దరన్న గుండె చప్పుళ్ళతో మమేకమైనట్టు అనిపించి ఊరట చెందాను. గద్దర్, విమలక్కలు ఫ్లాష్ లైట్ పడగానే తలపైకెత్తి చూసి నవ్వారు. కించిత్ ఆశ్చర్యంతో.

4

నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని కితాబు ఇక్కడ తప్పక చెప్పాలి. అప్పుడే ఎందుకో ఆర్. నారాయణమూర్తిగారు (సినిమా డైరెక్టర్, నిర్మాత, నటుడూ) నా వెనకాల నేను పడుతున్న తపనను గమనిస్తూ నించున్నారు. ఫోటో తీయగానే నన్ను భుజం తడుతూ గట్టిగా కౌగలించుకొని “చాలా మంచి ఫోటో తీసావ్ తమ్ముడు! అడవిలో అన్నలకు అక్కలు ఆప్యాయంగా తినిపిస్తున్నట్టు వుంది. పాకురు పట్టి వున్న ఆ గోడ, నాచు అవీనూ!  మనసు కదిలింది. బావుంది” అన్నారు.

“నా మనసులో కూడా అదే భావన కలిగి తీసాను సార్” అని నేనంటే.  “మనం కళాకారులం కదా. అలాగే ఉంటుంది. నువ్వు కెమెరా కవిలా వున్నావు తమ్ముడూ. ఆల్ ది బెస్ట్” అంటూ వెళ్లిపోయారు.

5

దరిమిలా, ఆ ఫోటో ఒకటి పెద్దది చేయించి లామినేషన్‌తో గద్దరన్నకు ఇస్తే తన ఆఫీసు హాల్లో పెట్టుకున్నాడు. అన్ని ఇంటర్వ్యూల్లో ఆ ఫోటో కనపడినప్పుడు నాకు చాలా సంతోషం, తృప్తి కలిగేది

5

తర్వాత కొన్నాళ్లకు గద్దరన్న మీద ఓ సారి చంద్రబాబు హయాంలో కాల్పులు జరిగాయి. సరే తను బ్రతికి బయటపడ్డం. అదో చరిత్ర… కొంతకాలం తర్వాత పెద్ద ఎత్తున సికిందరాబాదు ‘హరిహర కళాభవన్’ లో ఆటా, పాట, మాట బంద్. కళలకు, గళాలకు సంకెళ్ళు” అంటూ పెద్ద సభ జరిగింది. అందరు ఫోటోగ్రాఫర్స్‌ని వెళ్ళనివ్వడం లేదు. Pressని తప్ప. సో అలా అని నేను బయటే వుండిపోయాను. Surprisingగా గద్దరన్న అబ్బాయి వచ్చి “నాన్న మిమ్మల్ని కెమెరాతో తీసుకురమ్మన్నాడు” అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. “అదీ, గద్దరన్నకు నా మీద వున్న గురి!” అని మనసులో పులకించిపోయాను.

ఒకసారి ఏదో ఒక పత్రికకు ఆ ఫోటో ఇస్తే వ్యాసంతో పాటు వేసారు. అవుతే కంపోజర్‌కు Photo Importance  తెలియక విమలక్కను కట్ చేసి  గద్దరన్న ఫోటోనే వేసాడు. ఎందుకు లేనిపోని Importance ఆమెకి ఇవ్వడం అని. కాని ఆమె గద్దరన్న సహచరి అని అతనికి తెలియదు కదా! ఎడిటర్‌గారూ, ఆర్టికల్ రాసిన జర్నలిస్టూ, నేను చాలా బాధపడ్డాం అలా జరిగినందుకు.

గద్దరన్న కూడా ఓ సారి అననే అన్నాడు. “ఏందిరా తమ్మి! అట్ల చేసిండ్రు?” అని.

 

– భాస్కర్ కూరపాటి

భాస్కర్ కూరపాటి

భాస్కర్ కూరపాటి

 

 

మీ మాటలు

  1. గద్దర్ గారిది ఇటువంటి ఫొటో ఎప్పుడూ చూడలేదు.. ఫొటో.. దాని వెనుక కథ బాగున్నాయి.

  2. krishna reddy kalmekolen says:

    జీవిత సహచరి విమలతో పేదల పోరాట పాట, ప్రజా యుద్ద నౌక గుమ్మడి విట్టల్ బొమ్మ అరక ఇడిసి ఆకలి గొన్న రైతుకు అతని బార్య బువ్వ తినిపించినట్లు గా సహజసిద్దంగా ఉంది.ఏ పాట కైనా బొమ్మ కైనా దాని వెనుకాల పేదల ఆర్తి ఉంటె ఆపాట,ఆ చిత్తరువు అశేష ప్రజానీకం మదిలో సజీవమౌతుంది.
    ఈ మద్యనే వి6 తెలుగు టి.వి.చానెల్ లో గద్దర్తో విమలను చూపించి ఆమె అనుబూతులు,అనుభవాలు విక్షకులతో పంచుకున్నారు.అప్పుడు విమల మాటలు, ఆమె నిండు తెలంగాణా హైదరాబాది తనం నిరాడంబరత్వం ఈ కూరపాటి ఫోటోతో సహజత్వంగ నా మదిలో ఎప్పుడు నిలిచి పోతుంది! ఇంతటి ప్రజా గాయకుడికి విమల తోడు విప్లవ బావజాలాన్ని ముందుకు తీసుక పోవడానికి గద్దర్కి ఎంతో ఊతమ్ ఇచ్చింది.

  3. గద్దర్, విమలక్క ఫోటో చూసి కళ్ళల్లో నీళ్ళు కదిలాయి. భాస్కర్ గారు, ఇంత మంచి artical కి ధన్యవాదాలు.

  4. ఎ.కె.ప్రభాకర్. says:

    భాస్కర్! మీ ఫోటోల్లానే మీ వచనం కూడా sharpగా ఉంది. కొనసాగించండి. ఆల్ ద బెస్ట్ .

  5. వావ్ భాస్కేర్ కూరపాటి ఇత్ వ్యాస్ అ వండర్ఫుల్ / మెమొరబ్లె ఫోటో అండ్ ఆర్టికల్

  6. srinivasulu kurapati says:

    చాలా మంచి ఆర్టికల్ . గుండెలోతుల్లో నుండి వచ్చిన భావాలు. సహజంగా ఉంది. గద్దర్తో నీకున్న సాన్నిహిత్యాన్ని సంతరించుకుంది. గద్దర్ సహజ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించావు. అనుభవంతో కూడిన భావాలు స్తిరంగా నిలిచేలాగా ఉంది. ఇలాంటి సహజమైన ఆర్టికల్స్ ఇంకా నీ కలం నుండి జాలువారాలని ఆశిస్తూ…
    మీ అన్నయ్య …
    –కూరపాటి శ్రీనివాసులు.

  7. భాస్కర్ గారూ,
    అరుదైన చిత్రాలు, విలువైన సూటి వివరణ చాలా బావున్నాయి.
    మీనుండి మరిన్ని విలువైన దృశ్యసంబాషణల్ని ఆశిస్తున్నాం.

  8. ఫొటో వెనకున్న కథ బాగుంది. ఆకట్టుకునేలా రాశారు. అది తెలియటం వల్ల ఈ ఫొటో మరింత అందంగా / భావగర్భితంగా కనిపిస్తోంది.

  9. భాస్కర్ సర్. ..మీ సీనియారిటి తెలిసింది. ఫోటో కథనం చాల బాగున్నాయి .

మీ మాటలు

*