Frozen సరోవరం!

 

కాసుల లింగా రెడ్డి

కాసుల లింగా రెడ్డి

 

అతని రాత్రుల్ని సాంప్రదాయ రాక్షసి మింగేసింది-

అందం చేసే నఖక్షతాల నాజూకు బాధల్లో మూర్ఛిల్లాలనే కోరిక

లేత యవ్వన తుఫాను ఉధృతిలో

నిలువ లేక గింగిరాలు కొట్టాడు-

నిటారుగా నిలిచిన కెరటాల్ని

తనలో కరిగించుకుంటుందని నమ్ముకున్న సముద్రం వంచించింది-

జీవితకాలమంతా

ఒక్క ఫ్రెంచి కిస్సుకైనా నోచుకోని

ఆంక్షల వలలో విలవిల్లాడాడు-

గీతదాటలేని నిస్సహాయతలో

తీరానికేసి తలబాదుకొని కరిగిపోయింది కెరటం-

అతని రమణీయ యవ్వన వసంతాల్ని మిడతలు మింగేసాయి-

 

అతని రాత్రులు వడగళ్ళవానలో కొట్టుకొనిపోయాయి-

కొలిమిలో ఎర్రగా కాలిన కర్రులాంటి కోరికతో అతడు వస్తాడు

ఆమె గురిచూసి విసిరిన మాటల బాణం

రక్త సంబంధాల నాభిలో దిగుతుంది

ఓడుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ

జ్వలన సరోవరాల్లో మునుగుదామనుకుంటాడు

పెట్టుబడుల ఉచ్చును

కోరికల కంఠాలకు బిగించి లాగుతుంది

చిక్కటి నిరాశ రాత్రినిండా గడ్డకడుతుంది

వడగళ్ళవాన తెరిపివ్వక కురుస్తూనే వుంటుంది-

అతని రమణీయ యవ్వన వసంతాల్ని మిడతలు మింగేసాయి-

 

painting: Mandira Bhaduri

painting: Mandira Bhaduri

ఆమె ఫ్రిజిడిటీతో అతని రాత్రులు గడ్డకట్టాయి-

కాలుతున్న పెదవుల తడి అద్ది

కోరికల కొనవేళ్ళతో శ్రుతి చేసినప్పుడు

ఏ రాగమూ పలకని వీణాతంత్రులు-

 

రగులుతున్న నిప్పుల గుండంలో స్నానించి

ద్వైతం అద్వైత రససిద్ధి పొందాల్సినచోట

మరబొమ్మతో మార్మిక క్రీడ-

సళ్ళకవ్వపు సరాగాన్ని కుండ నిరాకరించినప్పుడు

చేతివేళ్ళతోనైనా గిళ్ళకొట్టాల్సిందే కదా!

అతని రమణీయ యవ్వన వసంతాల్ని మిడతలు మింగేసాయి

 

–    కాసుల లింగా రెడ్డి

 

 

 

 

 

మీ మాటలు

  1. కోడూరి విజయకుమార్ says:

    ఎంతో సాహసం, సంయమనం వుంటే తప్ప ఇలాంటి సున్నితమైన అంశాన్ని స్పృశిస్తూ పోయెం రాయడం చాలా కష్టం …. మెప్పించడం మరీ కష్టం …. మంచి పోయెం లింగారెడ్డి గారూ … మీరు డాక్టర్ అయి వుండడం ఈ పోయెం కి కలిసొచ్చిన అదనపు అంశం అనుకుంటా !

  2. చక్కని కవిత.పలుచని ఆఛ్ఛాదనల కింద నిసర్గ వాక్యసౌందర్యం .గీత దాటని అభివ్యక్తి.నాజూకు మోహన రాగం.అభినందనలు.

  3. చక్కని కవిత.పలుచని ఆఛ్ఛాదనల కింద నిసర్గ వాక్యసౌందర్యం .గీత దాటని అభివ్యక్తి.నాజూకు  మోహ రాగం .అభినందనలు.

  4. ధన్యవాదాలు నాగరాజు గారు

  5. murali vemuganti says:

    సర్, మీ కవిత కొత్తగా ఉన్నది. మనం తరచుగా తెలంగాణా కవిత్వం మీ నుండి వింటున్నకాబట్టి, ఇది కొంచం చేంజ్ గా ఉన్న పోయెమ్,

  6. ధన్యవాదాలు

  7. చాలా మంచి కవిత. స్త్రీ లైంగికతని సెలబ్రేట్ చేస్తూ వచ్చిన ఫెమినిస్టు కవిత్వానికి మగ జవాబు (not in opposition, but an opposing perspective) అనుకోవచ్చు. నాకు చాలా నచ్చింది. ఆమె ఫ్రిజిడిటీ ప్రస్తావన లేకపోతే ఇంకా గొప్ప కవిత అయుండేది. అభినందనలు లింగారెడ్డి గారు,

  8. రవి వీరెల్లి says:

    అన్నా,

    పోయెమ్ ఇప్పుడే చూసాను.

    పోయెం చాలా కొత్తగా ఉంది. విజయ్ అన్నట్టు, ఇలాంటి అంశాన్ని స్పృశిస్తూ పోయెం రాయడం చాలా కష్టం.
    నేను ఈ మధ్య చదివిన కవితల్లో ఇది నాకు బాగా నచ్చింది.
    అభినందనలు.

    రవి

  9. అవును వేముగంటి , జీవితంలో అనేక పార్శ్వాలు వుంటాయి కదా అన్ని మాట్లడలే కదా

  10. నారాయణ స్వామి గారు చాల చాలా ధన్యవాదాలు.

  11. నారాయణ స్వామి గారు , ధన్యవాదాలు .మీరు చెప్పింది నిజమే .జ్వలన సరోవరం అని ఒక స్త్రీవాద రచయిత్రి రాసిన కవితకు సమాధానంగా రాసిందే. కాని ఎక్కడ ప్రింటింగ్ కి ఇవ్వలేదు .నా కారణాలు నాకుండే

  12. ధన్యవాదాలు రవి గారు

మీ మాటలు

*