మన తరానికి జాషువా నేర్పిన పాఠం ఇదీ!

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

“జీవితం నాకు ఎన్నో పాఠాలు  నేర్పింది.  నా గురువులు ఇద్దరు  – పేదరికం – కులమత భేదం .  ఒకటి నాకు సహనాన్ని నేర్పితే రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కాని బానిసగా మార్చలేదు .  దారిద్ర్యాన్ని , కులమతాల్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరుపించుకోదలిచాను. వాటిపై కత్తి కట్టాను.  అయితే నా కత్తి కవిత ” అంటాడు జాషువా. 
అట్టడుగు జీవితాల హీన , దీన స్థితిని స్వయంగా అనుభవించి మనసులో పడ్డ ఆవేదననూ , ఆర్తినీ కవిత్వ రూపంలో ఆవిష్కరించిన ఆధునిక యుగపు మహాకవి జాషువా.  దారిద్ర్యం , అంటరానితనం , ఆర్ధిక అసమానతలు, వర్ణ వ్యవస్థ, కులవ్యవస్థ, కర్మ సిద్ధాంతాలు వీటన్నిటితో  సతమతమయిన జాషువా, తన తోటివారిని చూసి తిరుగుబాటు చేసి వ్యవస్థను నిలదీసి మానవ విముక్తికి, ఉన్నతికి కవిత్వాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్న సామాజిక దార్శనికుడు.   బిరుదులూ, పురస్కారాలూ ఎన్ని అందుకున్నా సమతా ధర్మాన్ని , సమతా భావనను దర్శించిన క్రాంతి కవి జాషువా.  ప్రాచీన భారతీయ వైభవాన్ని వేనోళ్ళ కవులు స్తుతిస్తున్న ఆ రోజుల్లో తన నిత్య జాగృత కవితలద్వారా ఎప్పటికప్పుడు వర్ణ వ్యవస్థ వైకల్యాన్ని మతాంధ మనస్తత్వాన్ని, సాంఘిక దురాచారాల్ని, స్త్రీల స్థితిని ఎత్తి చూపి ఎలుగెత్తి చాటిన నవయుగ కవి చక్రవర్తి జాషువా.
అందుకు ఆయన ఎన్నుకున్నది సంప్రదాయబద్దమైన చందం. వస్తువుగా తీసుకున్నది సార్వకాలిక సామాజిక ధర్మ ప్రతిష్టాపన.  కులమతాల కుళ్ళుకు అతీతంగా కవిత్వానికి పరమార్ధం ప్రయోజనాన్ని నిర్దేశించడం ఆయన కవితల ఉద్దేశం .  కులము , కట్టుబాట్లు క్రౌర్యాన్ని, కాటిన్యాన్ని అంతగా చీత్కరించిన కవి మనకు ఆధునిక కాలంలో కనిపించరు.  అభ్యుదయ కవితాయుగంలో శ్రీ శ్రీ గేయంతో సాధించింది జాషువా చాల ముందుగానే పద్యంతో సాధించారని ఓ సందర్భంలో అన్నారు సినారె.
“కసరి బుసగొట్టు అతని గాలి సోక నాల్గు పడగల హైందవ నాగరాజు ”  అన్నప్పుడు ఆయన వ్యక్తం చేసింది తననుభవించిన బాధనే కాదు .  ఆనాటి ఆ స్థితిపై అసమ్మతిని.  విద్యాగంధం, సంస్కార సంపద లేని నిరుపేద కుటుంబంలో పుట్టిన జాషువా జీవితంలో తాను అనుభవించిన అవమానాల్ని , తిరస్కారాన్ని అధిగమిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమే కాకుండా తన కవితకి ఆత్మాశ్రయ రూపం ఇవ్వకుండా సాధారణీకరించడం, భావకవిత్వం రాజ్యమేలుతున్న రోజుల్లో వస్తాశ్రయ కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత.
“ప్రతిమల పెండ్లి చేయటకు వందలువేలు వ్యయించుగాని
దుఃఖ మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్పదీ భారతమేదిని ముప్పది మూడు కోట్ల దే
వతలెగవడ్డ దేశమున భాగ్య విహీన క్షుత్తులారునే !
అంటూ గబ్బిలంలో పరమ శివునికి పంపు కున్న సందేశంలో దరిద్రులపై దయ చూపని, దైవపూజలని, హృదయ దౌర్భల్యాన్ని, భావ దారిద్ర్యాన్ని ఈ కవి క్షమించలేక పోవడం కనిపిస్తుంది.
‘గబ్బిలం’  కాళిదాసు మేఘసందేశాన్ని మనసులో నింపుకుని చేసిన రచన.  ఇందులో నాయకుడు పరమ దరిద్రుడు.  క్షుద్భాధా  పీడితుడు.  సంఘం వెలివేసిన వాడు.  ఈ భేదం కావ్య వస్తు రూపాన్నే మార్చేసింది.  ఇంట్లో చీకట్లో కూర్చొన్న దీనుడైన , దరిద్రుడైన వ్యక్తి తలెత్తితే  ఓ మూలన గబ్బిలం కనిపించింది.  అతడు తన బాధను దానితో చెప్పుకుంటాడు.  కైలాసంలో  ఈశ్వరునికి తన కథ నివేదించమని వేడుకుంటాడు.  ఇది సాగినంతమేర కనబడే దృశ్యాలు దేశం , చారిత్రక , సామాజిక  స్థితిగతులు.  ఈ సంవిధానం ఎంతో శిల్పవంతంగా ఉంది. కరుణరసం నిండి ఉంది.  కన్నీటి కథకి ఆర్ద్ర హృదయం జత పరచిన మనోజ్ఞ కావ్యం గబ్బిలం .
సాంఘిక న్యాయసాధన నా జన్మహక్కు అనే కృత నిశ్చయంతో ఈ ప్రపంచంలోనే మరో ప్రపంచాన్ని , కావ్యలోకంలో  ‘కొత్త లోకం ‘ సృష్టించాడు జాషువా.  ఈ నీచ నికృష్ట నియంతృత్వ బందురమైన పాతలోకానికి బదులు కొత్త లోకాన్ని ప్రసాదించమని ‘కొత్తలోకం’లో ఆర్దిస్తాడు.  ఆ లోకం ఎలా ఉండాలో చూపిస్తాడు.  జాషువా ‘కొత్తలోకం’ ఒక జీవత్కార్యం.  సామాజిక కావ్యం.  అరుదైన రసవత్కావ్యం.  ఒక కొత్త సాంఘిక వ్యవస్థ కోసం ఆయన పడిన తపన, ఒక విన్నూత్న మార్పు కోసం ఆయన కన్న కళలు , సామాజిక చైతన్యం కోసం ఆయన కనబరిచిన ఆతురత ఆయన  ప్రతి పద్య పాదంలోనూ ధ్వనిస్తుంది.  నినదిస్తుంది.
hyf02VS-gurram-_HY_1537788e
ఆత్మీయాంశతో కూడిన కావ్యం ‘ఫిరదౌసి’.  తండ్రికి తగ్గ కూతురు ఫిరదౌసి కుమార్తె.  ఆమె పాత్ర చిత్రణ , స్త్రీ స్వభావ నిరూపణలో జాషువా చూపిన మెలకువ ‘ఫిరదౌసి ‘లో తెలుస్తుంది.
‘ముంతాజ్ మహల్ ‘ లో ముంతాజ్ సౌందర్య వర్ణనకి అవకాశం ఉన్నా కూడా ఆయన శృంగార వర్ణన చేయలేదు .  ముంతాజ్ – షాజహాన్ల మధుర ప్రణయాన్ని ఔచిత్యంతో, భావనా బలంతో, శబ్ద సౌందర్య వ్యంగ్య స్పూర్తితో అవసరమైనంత వరకే వర్ణించిన తీరు అనితర సాధ్యం .
జాషువా తన భావాలను ఎంత తీవ్రంగా వ్యక్తం చేసినా సమాజంలోని ఏ  వర్గానికీ దూరం కాలేదు.  పైగా అందర్నీ స్పందింప చేశాడు .  అది ఆయన చైతన్య స్థాయికి నిదర్శనం.  జాషువాకి కుల ద్వేషం లేదు.  అందుకే ఆయన ” మతపిచ్చి గాని, స్వార్ధచింతన కాని నా కృతులకుండదు ” అని చెప్పుకోగలిగారు.  జాషువా కవితా చైతన్యం సంకుచితంగా ఆగిపోకుండా ఒక విశాల పరిధిలో విస్తరించి ఒక బాధ్యతాయుతమైన పరిణామాన్ని పొందింది.
‘గబ్బిలం’ కావ్యంలో జాషువాలో ఒక హేతువాది కనిపిస్తాడు.  కాందిశీకుడు , కొత్తలోకం కావ్యాల్లోనూ ఆయన హేతుదృష్టి   కనిపిస్తుంది.  ఆయన కవిత్వంపైన ఆనాటి హరిజనోద్యమం , సహాయ నిరాకరణ , పుల్లరి సత్యాగ్రహం , ఆంధ్రోద్యమం మొదలైన వాటి ప్రభావం కనిపిస్తుంది.  అలాగే ఆయన ఆస్తికుడా, నాస్తికుడా అనే సంశయం కలుగుతుంది.  ఆయన రచనల్లో దళితవాద, స్త్రీవాద శబ్దాలు ప్రయోగించక పోయినా ఒక దళితవాదిగా, స్త్రివాదిగా అప్పుడప్పుడూ దర్శనమిస్తాడు.
“గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయచే న
న్నేవ్విది దూరినన్ ననువరించిన శారద లేచిపోవునే
ఇవ్వసుధా స్థలిన్ పొడమరే రసలుబ్దులు ఘంటమమూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్”
అనే జాషువా ఏనాడూ లోక విపరీత బుద్ధులకు వేరవలేదు. బెదరలేదు.  ఆయన వజ్ర సంకల్పం చెదరలేదు.  రానురాను మరింత తీవ్రమైంది.  ఆ స్వభావమే పై పద్యంలో స్పష్టంగా కనిపిస్తుంది.
“యుగ యుగమ్ముల  భారతీయుడను నేను ” అంటూ సగర్వంగా చాటుకున్న జాషువా ఆ తర్వాతి కాలంలో తన పరిధిని విస్తరించుకున్నాడు.
‘కులమతాల గీచుకున్న గీతలను జొచ్చి
పంజరాన కట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగు లేదు విశ్వ నరుడను నేను ‘
అంటూ తన విశ్వ జనీన దశకు చేరుకున్నాడు. ఆయనే చెప్పుకున్నట్లు   “వడగాడ్పు నా జీవితమైతే – వెన్నెల నా కవిత్వం ‘  అన్న  మాటలు అక్షర సత్యం.
 
వి. శాంతి ప్రబోధ
హైదారాబాద్ లో ఈ వారం 26 న జాషువా జయంతి సభ జరుగుతున్న సందర్భంగా…
MaNaSu Invitation for Jashuva book release

మీ మాటలు

  1. కల్లూరి భాస్కరం says:

    శాంతిప్రబోధగారూ, జాషువా కవితాతత్వాన్ని చిన్న వ్యాసంలో హృద్యంగా రూపుకట్టించారు. ఔచిత్యాలను స్పృశించారు. అభినందనలు. ‘ముప్పదిమూడు కోట్ల దేవత లెగవడ్డ దేశమున’ భాగ్యవిహీనుల క్షుత్తులారునే అని జాషువా ప్రశ్నించారు. ఇప్పుడాయన పేర్కొన్న దేవతలు నూట ఇరవై కోట్లు దాటారు. అయినా ఆయన స్వప్నించిన సమాజం ఇంకా అవతరించలేదు! బాధాకరం,

    • ధన్యవాదాలండీ కల్లూరి భాస్కరం గారూ. ఇప్పుడాయన పేర్కొన్న దేవతలు నూట ఇరవై కోట్లు దాటారు. నిజమే కదూ! విశ్వనరుడు స్వప్నించిన సమాజం ఎప్పుడు అవతరిస్తుందో .. కనుచూపు మేరలో అగుపించడం లేదు.

  2. బాగుందండి, చాలా బాగా రాసారు. శాంతి ప్రబోధ గారూ !
    కవి రాసిన చివరి వాక్యాలు నేను నా ఫేస్ బుక్ లో కి తీసుకుంటున్నాను.
    అభినందనలతో.

  3. చాల చక్కగా రాసారు ; మీ ద్వారా, సారంగా వారపత్రిక ద్వారా జాషువ గారి గురించి తెలుసు కున్నందుకు ధన్యవాదాలు. 1970-80 లలో జాషువ గారి పద్యాలూ పాట్యపుస్తకాలలో చెప్పలేదు. వినడము తప్పితే విడిగా తెలియదు, జాషువ గారి గురించి. మీరు వ్రాసిన విధానము గ్రాంధికంగా వున్నది. మంచిదే కానీ, అందరికి అర్ధము అవ్వాలంటే, కొన్ని పంక్తులు వాడుక భాషలో వుంటే బాగుంటుంది.

  4. rajaram.thumucharla says:

    పాడుబడ్డ మశీదే బడిగా,గుడ్డి దీపమే గురువుగా,గిజిగాళ్ళు,గబ్బిలాలు నేస్తగాళ్ళుగా చేసుకొని మహాకవిగా ఎదిగిన జాషూవాను మీ వ్యాసంలో చాల వివరంగా పరామర్శించారు.కొత్తలోకం కావ్యాన్ని పరిచయం చెయండి .

Leave a Reply to Ramarao Cancel reply

*