అడివిలో మాయమయిన ఇంకో వెన్నెల!

’సముద్రుడు’ ఈ పేరు వినగానే ఒక గంభీరమైన వాతావరణం ఆవరించుకుంటుంది. నాకు కవిత్వాన్ని విశ్లేషించడం రాదు. ఆస్వాదించడం లేదా వంటపట్టీంచుకోవడమే వచ్చును. కొన్ని కవితలు చదివినప్పుడు బాగున్నాయనుకుంటాం మరికొన్ని చదువుతుండగానే  మనలోని వెలితిని కోల్పోతూ మమేకమవుతాం మరికొన్ని చదువుతూ కొత్త వెలుగును చూస్తాం. అలా కొత్త వెలుగును చూపే కవిత్వం ఆసరా భరోసా ఇచ్చే కవిత్వం ఇన్నేళ్ళ తరువాత కూడా నాకు కొద్ది మంది కవిత్వంలోనే పొందుతాను. అందులో మొదటిది సముద్రుని కవిత్వం. ఈ వరుసలోనే అమరులు కామ్రేడ్ ఎమ్.ఎస్.ఆర్., కామ్రేడ్ కౌముదిల కవిత్వం. ఈ ముగ్గురి కవిత్వ వస్తువు ఒక్కటే అయినా ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరి అక్షరం వారిదే. ఒకరికొకరు యుద్ధ రంగం నుండే రాస్తున్నా తమ మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ విప్లవ కవిత్వానికి ఓ కొత్త పరిమళాన్ని అద్ది దారి చూపిన వారే. ఇప్పుడు సముద్రుని సమయం గురించి మాటాడుకుందాం.

సరిగ్గా ఇరవై రెండేళ్ళ క్రితం 1991 సెప్టెంబర్ ఒకటో తారీఖున ఉద్యమ కార్యాచరణలో భాగంగా మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరు యువకులపై కాల్పులు జరిపి గాయపడిన వారిని తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసి ఎదురుకాల్పుల పేరిట రాజ్యం హత్య చేసింది. వారిద్దరిలో ఒకరు కామ్రేడ్ జనార్థన్. తన కలం పేరు సముద్రుడు. అతని అమరత్వం తరువాత ఆయన ముద్రిత రచనలు ’త్యాగమే జయిస్తుంది’, ’భూమి నా తల వెల నిర్ణయించు’, ’స్వేచ్చ’, ’వాడు నా భూమి, మరణానంతరం అచ్చయిన ’మృత్యువే మరణిస్తుంది’ కవితా సంకలనాల సంపుటిగా సముద్రుడి సమయం’ పేరుతో విరసం 1994 లో ప్రచురించింది.

నిజానికి విప్లవ కవిత్వమంటే నినాద ప్రాయంగా ఒకే వస్తువుతో ఎలిజీలకు పరిమితమవుతూ ఉంటుందని చాలా మంది అభిప్రాయం, నిజమే కదా యుద్ధ రంగం నుండి పిలుపు ప్రేమ పల్లవిలా ఎలా పలుకుతుంది? అది వీరుని గొంతులోనుండి యుద్ధ నినాదంగానే పెడబొబ్బలా సింహనాదంలా ప్రతిధ్వనించి మేల్కొలపాల్సిన అవసరముంది. అదే సమయంలో మీ తూనిక రాళ్ళకు సరిపోయే కవిత్వాన్ని అందించే కృషి జరుగుతునే వుంది నిరంతరం. అలా కృషి కొనసాగుతున్న క్రమంలోనే నూనూగు మీసాల నూత్న యవ్వన ప్రాయంలోనే యుద్దరంగంలో ఒరిగిపోతున్న వారి కవిత్వానికంటిన పచ్చి నెత్తురు తడి మీ అరచేతులకంటుతుంది ఈ సంపుటినిండా. ఒరిగిపోతున్న తన గురువులు, సహచరుల గురించి కవి గుండె కలిగిన సముద్రుడు రాయకుండా వుండగలడా? అలా ఇందులోను ఎలిజీలు వున్నాయి.

శివారెడ్డి గారన్నట్టు విప్లవ సాహిత్యం ఎదుగుదలలో ’ఎలిజీ’ది ప్రత్యేక స్థానం. ఒక ఎడబాటు, ఒక లాస్, ఒక తీరని దు:ఖం, పోయిన దాన్ని వెతుక్కునే క్రమంలో తగిలే కారణాల్లోంచి జన్మించే క్రోధం నుంచి ’ఎలిజీ’ పుడుతుంది అంటారు. అసహజ మరణాలు నిత్యకృత్యమయ్యే దశలో ’ఎలిజీ’ అనివార్యమయింది. ఎవడి ’ఎలిజీ’ వాడు రాసుకునే దశ ఇది అంటారు. యుద్ధ రంగంలో వున్న గెరిల్లా తనను తాను సంభాళించుకొని అడుగు ముందుకు వేయటానికి పనికొచ్చేదే కామ్రేడ్ స్వర్ణలత ’చరితార్థయై’ గాధగా మిగిలినప్పుడు రాసిన వాక్యాలు..

 

’ ప్రపంచంలోని విషాదాన్ని, ఆనందాన్ని ఒక్కసారే ఎవ్వరైన

 తాగుతారో లేదో తెలియదు గానీ.

 విప్లవకారులు మాత్రం హాలాహలాన్ని అమృతాన్ని ఒకేసారి

 తాగి జీర్ణించుకోగలరు’

అలాగే కామ్రేడ్ సుధాకర్ అమరుడయినప్పుడు రాసిన ’బేబాకీ’లో

 

’ చావు ద్వారం వద్ద నిలబడి పిలుస్తుంటే

 గేలిచేస్తూ పగలబడి నవ్వే వారెవరు?

 కబళించిన చావును తిరిగి విసిరి

 గోడకు దిగ్గొట్టిన వారెవ్వరు?

 శహభాష్! నా వీరులారా!

 మీరు చావుకి గోరీలు కడుతున్నారు’

అలాగే కామ్రేడ్ బాబూరావు అమరత్వంపై రాసిన కవిత ’మృత్యుంజయులు’ లో

 

మీ కోసం వదిలిన ఈ కన్నీళ్ళు

సామాన్యమైనవి కావు కామ్రేడ్ అంటూ

ఇవి రక్త సంబంధం కోసం వదిలిన అశువులు కావు

హిమాలయాలకంటే ఉన్నతమైన

వర్గసంబంధం కోసం వెచ్చించిన కన్నీటి ధారలు

కామ్రేడ్! అంటాడు సముద్రుడు.

 samudrudi samayam

కవిత్వంలో కొత్త ఎత్తుగడలను పదబంధాలను ఎన్నుకొని ప్రయోగించడంలో సముద్రుడు తనదంటూ ఒక ముద్రను వేస్తూ పోయాడు. అందుకు ఈ సంపుటిలోని మొదటి కవిత నీవు – నేను ఒక మంచి ఉదాహరణ. మిషనరీ స్కూళ్ళలో విద్యార్థులపై తీసుకునే క్రమశిక్షణా చర్యలును ఉదహరిస్తూ రాజ్య దౌష్ట్యాన్ని మన కళ్ళముందుంచుతాడు,

 

’పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చుగాక!’

 నీ రాజ్యంలో దాసదాసీలున్నంత కాలం నీ రాజ్యం వద్దు స్వామీ!

 ప్రజల కొరకు ఏ రాజు పాటుపడ్డాడు?

 ఏ పులి మేకలకై త్యాగానికి సిద్దపడుతుంది

 రెండు చేతులు జోడించనందుకు

 నా అరచేతులు కాల్చినపుడు

 రాలిన నీటిబిందువులపై

 నీ ఆత్మ ’అల్లాడిందా’ ప్రభూ?’

సిద్ధాంతాన్ని తద్వారా పోరాట పటిమను ఎలుగెత్తి కీర్తించడంలో సముద్రుని కవిత్వం ప్రతిభావంతంగా సాగుతుంది. ’మేకవన్నె పులులు’, ’జడుడు’, ’ప్రతిఘటన’ ’మేం వజ్రాలనే వెదుకుతాం!’ మొ.న కవితలు ఉదాహరణలు. ఇందులో ’ప్రతిఘటన’ కవితలో

 

’సముద్రపు అంచు పైపైకొస్తున్న

 సూర్యుణ్ణి అణచాలని

 సాయుధంగా సముద్రంలో ముందుకు సాగినా

 సూర్యుణ్ణి చూసి ఉత్సాహంగా లేచే అలల్ని

 మాత్రం మీరు అణచగలరు గాని

 సూర్యుణ్ణి ఏమీ చేయలేరు’

అని విప్లవ ఉద్యమాన్ని రాజ్యం ఎన్ని బూటకపు ఎదురుకాల్పులు జరిపినా, ఎన్ని వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తూ విష ప్రచారం చేసినా అణచలేదని భరోసా ఇస్తాడు.

 

గెరిల్లా కవిగా సహచరులకు తన కవితల ద్వారా కార్యోన్ముఖులను చేయడంలో సముద్రుడు చాలా శ్రద్ధ తీసుకొన్నాడు. ఉదాహరణకు

’కాలం సందిట్లో గుణపాఠం నేర్వకుంటే

 పొందికగా నడవడం చేతకాదు

 గుణపాఠాన్ని గుర్తించకుంటే

 రేపటి నీ ఆకారానికి గుర్తింపే ఉండదు’

’వేళ్ళను నమ్మని వాళ్ళకు చెట్టుపై విశ్వాశముండదు

కాపును కోయ సిద్ధమేగాని నీళ్ళు పోయడానికి భయం’ అని లొంగిపోయిన వాళ్ళని ఎద్దేవా చేస్తాడు

’విశ్వాశం పట్టుదల తరాలను మారిస్తే

త్యాగం అంతరాలను మారుస్తుంది’  అంటాడు.

ఇంకా ఉద్యమాన్ని హేళన చేస్తూ తామే ఉద్యమాన్ని నిర్మించామనుకునే స్వీయ ప్రకాశుల కోసం

 

’ సారె మీద తిరిగే ఈగ

 సారె తిరిగేది తన గొప్పతనంనుండే అనుకుంటే

 చివరకు కుడితిలో పడ్డ ఈగలా

 ఊపిరాడక చావక తప్పదు

 ఒకనాటి తోటరాముడు చివరకు

 కాగితం పువ్వుకంటే హీనమైపోతాడు’ అంటాడు

’పాలక వర్గం “ఫేస్” మీద “పౌడర్”లా

అతుక్కుపోయిన వీరికి

ఏ ధర్మం అర్థం కాదు

అందుకే అవకాశవాది నోరు తెరిస్తేనే దుర్వాసన’ అంటాడు.

సముద్రుడు కవిత్వంలో ఏ వస్తువునీ స్పృశించకుండా వదలలేదు. తన తల్లి, గురువులు, సహచరులు, బిడ్డ సాగర్, అడవి, ప్రకృతి, పెట్టుబడిదారీ విధానం, గెరిల్లా యుద్ధతంత్రం, అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు, ఎత్తుగడలు వ్యూహాలు ఇలా అన్ని అంశాలను తన కవిత్వంలో పొందుపరిచాడు. ఇందులోని చివరి దీర్ఘ కవిత ’అడివి’ చదివితే మన కళ్ళ ముందు అడివిలోని జీవితం ప్రకృతి రమ్యతతో పాటు యుద్ధమూలాలు సజీవంగా మనకు కదలాడుతాయి. తన రచనా శైలిలోని బిగువుకు అడివి సజీవ ఉదాహరణ. విప్లవ కవికి శిల్పం పట్ల నిర్లక్ష్యం అన్నమాటకు జవాబుగా ఇందులో తాను తీసుకున్న అనేక ప్రతీకలలో

 

’నడిజాము ముబ్బుల మధ్య దోబూచులాడే చంద్రుడు

 నీటిలో చేపలా తిరుగాడే గెరిల్లా

 అకస్మాత్తుగా దాడి జరిపే వానజల్లు

 చివరికి ఆకులపై పొంచివుండి సెంట్రీ జేస్తుంది!

 గుట్టలమీద నుండి దూకే జలపాతం తిరిగి తిరిగి అడవికి వడ్డాణమైంది

 ఎత్తైన కొండల్ని – అగాధాల్ని దాచుకున్న అడివి పూర్ణగర్భిణిలా వుంటుంది!

’ అడివిలో వృక్షాలపై, కొమ్మలపై, ఆకులపై నిఘాను పెట్టగలడేమో గాని

 అడివిలో వెన్నెల వెల్లి విరియడాన్ని ఎవడాపగలడు?

’వెన్నెల వేడిలో అడివి స్నానమాడుతుంది

 అడివి కిరీటాన్ని తొడిగినట్లు ఆకాశాన ఇంద్రధనుసు వెల్లివిరిసింది’

’అడివి వసంతాన్నావహించి చిగుర్లలో లేత ఎరుపును కౌగిలించి

 లేత చిరు ఎండలో ఆరుద్రలో మెరిసిపోతుంద”

’ఆకాశం కాలుష్యాన్ని చూసి భోరుమని విలపిస్తే

 అడివి కడిగిన ముత్యంలా వెలిగిపోతుంది’

 

ముప్పైఏళ్ళలోపు పిన్న వయసులోనే అమరత్వాన్ని ముద్దాడిన కామ్రేడ్.  నిత్యమూ యుద్ధరంగంలో తన మెడపై వేలాడే కత్తిని గమనిస్తూనే సమకాలీన కవిత్వాన్ని అధ్యయనం చేస్తూ, వేటగాళ్ళ చూపులనుండి తప్పించుకుంటూ తనకిష్టమైన కవులను కలుస్తూ సాహిత్యం గురించి చర్చిస్తూ తన సృజనకు మెరుగులు దిద్దుకునే క్రమంలో రాజ్యం అత్యంత నీచంగా హింసాత్మకంగా తన ముఖాన్ని చెక్కి దేహమంతా గాయాల మయం చేసినా తన కవిత్వంలో నిర్బంధం గురించి ఏమి రాసాడో అవే అక్షరాలకు బద్ధుడై తన పిడికిలిలోని రహస్యాన్ని తెరవకుండా చిరునవ్వుతో చావును గేలి చేస్తూ శతృవుకు తనను చంపడమనే చేతకాని చర్య తప్ప మరో దారి లేకుండా చేసిన మరో భగత్ సింగ్, ఆజాద్ ల వారసుడు. జీవితమే యుద్దమై యుద్ధమే జీవన రంగమైన ఓ నవయువకుని ఆశల స్వప్నాల ఆరని జ్వాల ఖండిక ఈ ’సముద్రుని సమయం’ ఇప్పటికీ యుద్ధ సమయమే.

-కెక్యూబ్ వర్మ

వర్మ

వర్మ

 

 

మీ మాటలు

 1. Karimulla Ghantasala says:

  Excellent review. Felt sad but elated. Thanks for this wonderful piece.

 2. వర్మగారూ,

  నిజంగా చాలా గొప్పగా పరిచయం చేశారు సముద్రుణ్ణీ, సముద్రమంత గొప్ప కవిత్వాన్నీ.

  ఈ ఉపమానం చదవగానే నాకు ఒక్కసారి చెప్పలేని ఆనందానుభూతి కలిగింది:

  “అడివి కిరీటాన్ని తొడిగినట్లు ఆకాశాన ఇంద్రధనుసు వెల్లివిరిసింది”… ఎంత అందమైన ఉపమానం. మనలో చాలామందికి అనుభవంలో లేని దృశ్యం.

  కవికి ఉపమించడానికి కూడా చాలా సాహసం కావాలి. తమ భావుకతలోని బలమే వాళ్ళకి ఆ సాహసాన్నిస్తుంది.
  ఒక మంచి కవిని పరిచయం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు

 3. balasudhakarmouli says:

  జీవితమే యుద్దమై యుద్ధమే జీవన రంగమైన ఓ నవయువకుని ఆశల స్వప్నాల ఆరని జ్వాల.

 4. రక్తమంత చిక్కగా ఉంది. కవిత్వమూ, పరిచయమూ.

 5. కోడూరి విజయకుమార్ says:

  సముద్రుడినీ , సముద్రుడి కవిత్వాన్నీ ప్రేమించిన వాళ్ళతో హత్తుకున్న ఆత్మీయ ఆలింగనం ఈ వ్యాసం … కదిలించారు … కృతజ్ఞతలు, సముద్రుడిని జ్ఞాపకం చేసినందుకు !

 6. buchireddy gangula says:

  ఎన్ని సార్లు చదివినా –చదు వాలనిపించే సముద్రుని కవిత్వం —చాల
  చిక్కగా చక్కగా ఉంది పరిచయం —బాగుంది
  వర్మ గారు
  ————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 7. ఎ.కె.ప్రభాకర్. says:

  గుట్టలమీద నుండి దూకే జలపాతం తిరిగి తిరిగి అడవికి వడ్డాణమైంది

  ఎత్తైన కొండల్ని – అగాధాల్ని దాచుకున్న అడివి పూర్ణగర్భిణిలా వుంటుంది!

  ’ అడివిలో వృక్షాలపై, కొమ్మలపై, ఆకులపై నిఘాను పెట్టగలడేమో గాని

  అడివిలో వెన్నెల వెల్లి విరియడాన్ని ఎవడాపగలడు?

  ’వెన్నెల వేడిలో అడివి స్నానమాడుతుంది

  అడివి కిరీటాన్ని తొడిగినట్లు ఆకాశాన ఇంద్రధనుసు వెల్లివిరిసింది’

  ’అడివి వసంతాన్నావహించి చిగుర్లలో లేత ఎరుపును కౌగిలించి

  లేత చిరు ఎండలో ఆరుద్రలో మెరిసిపోతుంద”

  ’ఆకాశం కాలుష్యాన్ని చూసి భోరుమని విలపిస్తే

  అడివి కడిగిన ముత్యంలా వెలిగిపోతుంది’

  సముద్రాన్ని దోసిట పట్టినందుకు వర్మ గారికి అభినందనలు.

 8. సర్ చాల రోజుల తర్వాత సముద్రున్ని గుర్తు చేసినందుకు మీకు థాంక్స్

 9. Samudrudu ,thanaku thaanu enthaga theluso,Nannu anthaga eruugunu.athadu viplavaani enthga valachaado,kavithvaanni Anthe avasaramga avaposana pattadu.goppa premikudu sumee!

 10. సముద్రాన్ని పుక్కిట పట్టగలమా? అఫ్సర్ సార్ సముద్రుని పరిచయం రాయమంటే నాకొచ్చిన మొదటి సందేహం. కానీ సముద్రున్ని ప్రేమించిన వాళ్ళు, తన కవిత్వాన్ని నెత్తుటిలో చేర్చుకున్న వాళ్ళు ఇంకా వుండి వుంటారన్న నమ్మకంతో నా ఈ చిన్ని ప్రయత్నం. మిత్రులందరి కరచాలనంతో మరల మరోసారి నెమరువేసుకుంటున్నా మీతో పాటు. ధన్యవాదాలు.

 11. సముద్రుడు ఎప్పుడు సిద్దపడుతుంటాడు యుద్దానికి,.,. మంచి పరిచయం,.
  అభినందనలు వర్మ గారు,..

 12. ధన్యవాదాలు భాస్కర్ సార్…

మీ మాటలు

*