జీవితమే ఒక నాటక రంగం – ‘థియేటర్ స్క్వేర్’

uri_civara

“All the world’s a stage, and all the men and women merely players. They have their exits and their entrances; And one man in his time plays many parts”

 

“Oh! How bitter a thing it is to look into happiness through another man’s eyes!”

 

“I like this place and willingly could waste my time in it”

 

పైన ఉటంకించినవన్నీ షేక్స్పియర్ వ్రాసిన ‘As You Like It’ లోనివి. ఎప్పుడో డిగ్రీ చదువుకున్నప్పుడు బట్టీ పెట్టిన వాక్యాలు. అసలు ఇవి ఎందుకు చెప్పాల్సివస్తున్నదంటే, కొన్నాళ్ళ క్రితం అఫ్సర్ గారు వ్రాసిన ‘ఊరిచివర’ తిరగేస్తున్నప్పుడు మొట్టమొదటగా ఆకర్షించిన పేజీలో నేను చదివిన కవిత ‘థియేటర్ స్క్వేర్’ దీనికి కారణం. ఈ శీర్షిక చూడగానే ఒకదానివెంట మరొకటిగా పైవన్నీ గుర్తుకొచ్చాయి. అఫ్సర్ గారి కవితల్లో నా స్వభావానికి అంటే నా అంతర్యానానికి నచ్చిన కవిత ‘థియేటర్ స్క్వేర్’.

 

ఇదో అరుదైన, కాకతాళీయమైన సందర్భం. ఎందుకంటే, నాకు గుర్తుకువచ్చిన, పైన ఉటంకించిన మూడు కోటబుల్ కోట్స్ అఫ్సర్ గారు ‘థియేటర్ స్క్వేర్’ లోని తన పద్యాలలో స్పృశించారు! అవేమిటో చూద్దాం…

 

షేక్స్పియర్ ఒక సందర్భంలో అంటాడు “All the world’s a stage, and all the men and women merely players. They have their exits and their entrances; And one man in his time plays many parts”. చాలామంది చాలాచోట్ల ఇదే విషయాన్ని కొద్ది మార్పుచేర్పులతో చెప్పినా, అఫ్సర్ గారు మొదటి పద్యంలో ఇదే విషయాన్ని ఎలా చెబుతున్నారో చూడండి :

 

దృశ్యం – 1

 

ఒక నిశ్శబ్దంలోకి అందరూ

మౌనంగా.

 

తెర మీద

ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా.

 

షేక్స్పియర్ వ్రాసినదానికి, ఈ మొదటి పద్యానికి ఎంత సామ్యం! నా ఆశ్చర్యం అంతటితో ఆగలేదు. నాలుగో పద్యానికి వచ్చేటప్పటికి ‘As You Like It’ లోని మరో వాక్యం కళ్ళముందే దాగుడుమూతలు ఆడటం మొదలేసింది. ముందు ఆ పద్యం :

 

దృశ్యం – 4

 

ఎవరి జీవితం వాళ్ళకి చేదు

అవతలి బతుకు

కాసేపు అద్దం

తెలియని అర్థానికి.

 

షేక్స్పియర్ అంటాడు “Oh! How bitter a thing it is to look into happiness through another man’s eyes!”

 

సాథారణంగా మనిషికి,  తనకు ఏం కావాలో కూడా తనకు తెలియదు. అలా అని ఉన్నదానితో తృప్తి చెందడు. ఆనందం పొందడు. తను కోరుకున్న వ్యక్తి మరొకరికి చేరువౌతున్నదని తెలిసిన సందర్భంలో ఓ పాత్ర చేత షేక్స్పియర్ చెప్పించిన విషయాన్ని, ఎంతో సరళంగా, సున్నితంగా అఫ్సర్ గారు సార్వత్రికం చేసారో!

 

చివరి పద్యానికి వచ్చేటప్పటికి అఫ్సర్ అంటారు :

 

దృశ్యం – 6

 

థియేటరు

నన్ను అనువదించే యంత్రం

ఇక్కడ

నన్ను నేను వెతుక్కుంటాను

ప్రతి సాయంత్రం.

 

శుద్ధ వ్యావహారిక వ్యాపకంగా ఓ పాత్ర చేత షేక్స్పియర్ చెప్పించిన విషయాన్ని (“I like this place and willingly could waste my time in it”) అఫ్సర్ గారు ఎంత గొప్పగా చెబుతున్నారో!

 

***

 

ప్రతి పద్యాన్ని విడమరచి వివరించటం ఔచిత్యం అనిపించుకోదు కాబట్టి, అఫ్సర్ గారి కవిత :

థియేటర్ స్క్వేర్

దృశ్యం-1

 

ఒక నిశ్శబ్దంలోకి అందరూ

మౌనంగా.

 

తెర మీద

ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా.

 

దృశ్యం-2

 

ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు?

మాటల మధ్య చీకట్లు

ఎవరి చీకట్లో వాళ్ళు

లోపలి అనేకంతో కలహం.

 

దృశ్యం-3

 

కాసిని కన్నీళ్ళు వుప్పగా

పెదవి మీదికి.

చాన్నాళ్ళయ్యిందిలే కన్ను తడిసి!

ఇంకా కరగనీ

కళ్ళ వెనక శిలలు విరిగివిరిగి పడనీ.

 

దృశ్యం-4

 

ఎవరి జీవితం వాళ్ళకి చేదు

అవతలి బతుకు

కాసేపు అద్దం

తెలియని అర్థానికి.

 

దృశ్యం-5

 

ఎవరూ ఎక్కడా ప్రేక్షకులు కారేమో!

కొద్దిసేపు

పాత్రలు మారిపోతాయి అంతే

నేను అనే పాత్రలోకి

స్వకాయ ప్రవేశం ఇప్పుడు

 

దృశ్యం-6

 

థియేటరు

నన్ను అనువదించే యంత్రం

ఇక్కడ

నన్ను నేను వెతుక్కుంటాను

ప్రతి సాయంత్రం.

***

అనుభవాల అగాధాల్లో జ్ఞాపకాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. రెక్కలు విప్పుకుంటూ అవే జ్ఞాపకాలు జలపాతాలై దూకుతుంటాయి. ఇది ఓ నిరంతర ప్రక్రియ. ఇదే జీవితం. ఎగసిపడే కెరటాలని ఒడిసిపట్టుకుంటూ, కొత్త కెరటాలతో సరికొత్త ఎత్తులకు ఎదుగుతూ, జారుతూ సాగిపోతుంది, నిరంతరం నిత్యనూతనంగా ప్రవహిస్తూనే ఉంటుంది  – జీవితం.

 

ఇందులోనే అందం ఉంది… ఆనందమూ ఉంది. బహిర్ముఖుడైన వ్యక్తి అందాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ గడిపేస్తాడు. అంతర్ముఖుడైన కవి అది భయానక సౌందర్యమైనా సరే, ఆనందపు లోతులు ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఆ అంతర్ముఖత్వంలోనే, కవి తనను తాను చూసుకోగలడు, తన లోతులు అంచనా వేసుకోగలడు. కవిత్వానికి అతీతమైన ఏదో విషయాన్ని, కవిత్వంగా చెప్పగలడు. అలాంటి అంతర్ముఖత్వాన్ని కొందరు మాత్రమే సాధించగలరు. అలాంటి అద్భుతమైన ప్రయత్నం అఫ్సర్ గారి ‘ఊరిచివర’ సంకలనంలోని ‘థియేటర్ స్క్వేర్’ అనే కవిత.

 – కొండముది సాయి కిరణ్ కుమార్

kskk_amtaryaanam

 

మీ మాటలు

  1. మరల చదివి ఆకళింపు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ సాగిన మీ పరిచయం బాగుంది సార్..

  2. ” అంతర్ముఖుడైన కవి అది భయానక సౌందర్యమైనా సరే, ఆనందపు లోతులు ఆవిష్కరిస్తూ ఉంటాడు.”
    చక్కగా చెప్పారు. నెనర్లు

  3. మెర్సీ మార్గరెట్ says:

    ఎంత అధ్బుతంగా చెప్పారు సాయి కిరణ్ గారు. మీ లోతైన విశ్లేషణ మౌన౦గా మాట్లాడింది. గల గల శబ్దం చుట్టుముట్టినా ఇలాంటి కవితలు వాటిని వెనక్కి నెట్టి చేయి పట్టుకుని అంతర్యానం చేయిస్తాయి కదూ .. !. మరో సారి ”ఊరి చివర ” చదవాలన్నంత అందంగా మీ కవిత్వ విశ్లేషణ కూడా నచ్చింది. ధన్యవాదాలు .

  4. balasudhakarmouli says:

    ‘ ఊరి చివర ‘ కవిత్వం చదివన ఎవరైనా – కొత్త లోతుల్ని కవిత్వంలో చూస్తారు. కవులయితే ప్రభావితమౌతారు. నేనైతే విలవిలలాడుతాను- ఆ డెప్త్ కి బంధీనవడానికి…….. మళ్లీ మళ్లీ చదవాలనిపించే వ్యాసం.

  5. మీ విశ్లేషణ బాగుంది. కానీ నాకు ఒకటె సందేహం. అప్సర్‌ గారి కవిత్వాన్ని షేక్స్పియర్‌ కవిత్వతొ పోల్చటం వల్ల మీరు షేక్స్పియర్‌ కు గౌరవం చేకూరుస్తున్నారా? లేక అప్సర్‌ గారికా? ఎంతగొప్ప కవి అయినా షేక్స్పియర్‌ 5, 6 వందల సంవత్సారాల వాడు. అప్సర్‌ అధునికుడు. మన సమకాలికుడు. ఆయన ప్రత్యేకత ఆయనది. కాలం రీత్యా సరికాదని నా అభిప్రాయం. ఇది విమర్శ కాదండి. చిన్న సందేహం మాత్రమే.

  6. ఒక కవికి, మరో కవికి మధ్య ఎంత కాల వ్యత్యాసమున్నదన్నది అంత ముఖ్యమైనది కాదనుకొంటాను. ఎందుకంటే, ఎన్ని వందల ఏళ్ళు గడచినా మనిషికి కావలసిన కనీసావసరాల్లో మార్పు లేదు. కనబడే మార్పుల్లో చాలా వరకు తత్కాల పరిస్థితుల్లో జీవితం గడపడానికి మాత్రం ఉపయోగపడేవి.

    ఆరువందల ఏళ్ళ వెనుక ప్రకృతిని, జనన-మరణాల్నీ ఉటంకిస్తూ సాగిన రచనలున్నాయి. అవే విషయాల్ని రెండు వేల ఏళ్ళ క్రితం కూడా అప్పటి కవులు, మేధావులు స్పృశించారు. ఈనాడు మనమూ అవే విషయాల పై వ్రాస్తున్నాము. ఇక్కడ చూడాల్సిన విషయమల్లా గతంలో చెప్పబడినదాని కంటే కూడా నేటివారు భిన్నంగా చెప్పగలిగారా లేదా అన్నది మాత్రమే.

  7. తిరుపాలు గారు – రఘుగారు చెప్పినట్లు మనం చూడాల్సింది చెప్పిన విషయం భిన్నంగా ఉన్నదా లేదా అన్నదే. ఈ వ్యాసం ఉద్దేశ్యం కూడా వారిమధ్య పోలికలూ వ్యత్యాసాలపై అభిప్రాయం ప్రకటించటం కూడా కాదు. అందుకే వ్యాసంలో “ఇదో అరుదైన, కాకతాళీయమైన సందర్భం” అని పేర్కొనటం జరిగింది. అసలు ఆ మాటకొస్తే,

    “జీవితమే ఒక నాటకరంగం.. అందమే ఆనందం” అంటూ సముద్రాల గారు పాట వ్రాసినా,

    దాదాపు షేక్స్పియర్ కు సమకాలీకుడైన పురందరదాసు ఒక కన్నడ కీర్తనలో “జగవెల్లా ఒందు నాటకరంగ, జనరెల్లా బరి పాత్రధారిగళు” అన్నా,

    వీరికి ముందు భర్తృహరి జీవితాన్ని అభివర్ణిస్తూ..

    “క్షణం బాలో భూత్వా క్షణ మపి యువా కామరసిక:
    క్షణం విత్తైర్హీన: క్షణమపి చ సంపూర్ణ విభవ:
    జరాజీర్ణై రంగై: నట ఇవ వలీమండితతను:
    నర స్సంసారాంతే విశతి యమధానీయవనికామ్” అన్నా,

    చెబుతున్న విషయంలో ఏమాత్రం విభిన్నత గొచరిస్తున్నదనేదే ప్రధానం. ఆ విభిన్నత ముఖ్యంగా 4, 5, 6 దృశ్యాలలో అఫ్సర్ గారి అంతర్ముఖత్వం స్పష్టంగా కనిపిస్తుంది.

    Any ways, thanks a lot for your views.

  8. ధాంక్సండీ!
    మీవివరణకు

Leave a Reply to కెక్యూబ్ వర్మ Cancel reply

*