చత్తిరి

మామిడి హరికృష్ణ

మామిడి హరికృష్ణ

అత్త అస్మాన్
కోడలు జమీన్
ఆషాడంల అత్తకోడండ్లు
మొఖాలు మొఖాలు సూస్కో వద్దంటరు
గనీ ,గీ ఆషాడo లనే గమ్మత్తి జర్గుతది గదా
జేష్టం  దాక అస్మాన్ అంతా మండిపోతది
జమీన్ ని అంతా నెర్రెలు బడేట్టు సేత్తది
గంతటి  రోకళ్ళు పగిలి పోయే రోయిణి  కాలంగుడా
ఆషాడం రాంగానే నిమ్మల పడ్తది
జమీన్ కోడలు కడుపుల ఇత్తనం బడే
సైమం అచ్చిందని తెల్వగనె
ఎండల్ని – ఉడ్క పోతల్ని ఇచ్చిన ఆస్మాన్ అత్త
చినుకుల్లెక్క  సల్లబడ్తది
మబ్బుల మీంచి వానై కురుత్తది
*             *     *          *             *
గప్పుడు చత్తిరి మతిల కత్తది
దాన్ని పోయినేడు అటక మీద పెట్టినట్టు యాదికత్తది
గూన పెంకుటింట్ల ఓ మూల డొల్ల పోయిన గుమ్మి పాకి
ఇంటి వాసాల మీన ఉన్నఅటక మీదికి ఎక్కుత
అట్క మీద
బూజు పట్టిన పాత బొక్కెన – చీకి పోయిన తాడు
తాతల నాటి చిల్లు పోయిన గంగాళం
చింత పండు తోముడు లేక కర్రె బడ్డ ఇత్తడి బిందె
కట్టెల పొయ్యి కాగుడికి నల్ల బడ్డ సత్తుగిన్నెలు
కొన్ని టేకు ముక్కలు – పాత చెప్పులు
చినిగిన మా నాయ్న దోతి – అవ్వ పాత చీరలు
నేను పుట్టక ముందు
మా ఎలుపటి దాపటి ఎద్దులకని పర్కాల అంగట్ల
మా నాయ్న తెచ్చిన గజ్జెల పట్టీలు
చేతికి తగుల్తయి
అసొంటనే చత్తిరి కన్పిత్తది
దాన్ని సూడంగనే
చీకట్లల్ల బజారు మీద ఓ గోడ మూలకు నక్కిన
దిక్కులేని కుక్క యాదికత్తది
ఇన్నొద్దులు పట్టించుకోనందుకు
అలిగి ముడ్సుకొని పడుకున్న మా ముత్తవ్వ లెక్కనిపిత్తది
నీటి సుక్క కరువై నారేయక నీరు పెట్టక
పడావు బడ్డ నా పొలం కండ్లల్ల కనబడ్తది
            ***
దుమ్ము దులిపి పాత గుడ్డ తోని తుడ్సినంక
చత్తిరి మల్ల నిగనిగ లాడుతది
వంకీ తిర్గిన చత్తిరి నా చేతిలోకి రాంగనే
నాకు ఎక్కడలేని రాజసం వచ్చినట్లయితది
నా ఒంటరి నడకకు తోడు దొర్కినట్లయితది
ఇగ రాసకార్యం ఏదీ లేకపోయినా
వాన పడ్తానప్పుడు
మా వాడ దాటి సడుగు మీదికి వత్త
పెయ్యంత నిండు చెర్వు లెక్క అయి
గొడ్లను తోలుక పోతున్న మల్లి గాడిని సూసి
చత్తిరి కింద నేను
వాన సుక్క తడ్వకుంట నడుత్తానందుకు
మా గర్రుగ అనిపిత్తది
e91c0d78-dc24-4257-aa5a-8eff6f6840c6HiRes
ఇగో, ఎవ్వలకి తెల్వని ముచ్చట నీకు చెప్పనా
మా ఊళ్లోల్లకి నా చెత్తిరి సూపియ్యదానికే
వానల్ల నేను ఇల్లు దాటి వత్త, ఎర్కేనా
అయితమాయె గనీ,
గిదంత పై పై పటారమే
నివద్దిగా చెప్తే గీ వానల చత్తిరి ఉంటె
పక్కన మనిషున్నట్టే
కాల్వ గట్టు తెగి నీళ్ళు
పొలం లకి అగులు బారుతానప్పుడు
నేను ఉరికురికి పోయి కట్ట కట్టేది
గీ చత్తిరి బలం సూస్కునే..
ఇంటి మీది పగిలిన గూనెల నుంచి
వాన నీళ్ళు కారుతానప్పుడు
మా బడి పుస్తకాలు తడ్వకుంట కాపాడేటిది
గీ చత్తిరే ..
ఇగ, బజార్ నల్ల కాడ్నుంచి మంచి నీళ్ళు తెచ్చేటపుడు
లసుమక్క వసుదేవున్లెక్క
దాని తలకాయ మీది బిందె కిష్ణ పరమాత్మున్లెక్క
చెత్తిరేమో ఆది శేషున్లెక్క
నా కండ్ల కన్పడ్తది
మా ఐదేండ్ల అఖిలు
ముడ్డి మీద జారుతున్న నెక్కరును ఎగేసుకుంట
చత్తిరి పట్టుకోని వత్తాంటే
వామనుడే మా వాకిట్లకి నడ్సి వచ్చినట్లనిపిత్తది
కచ్చీరు అంగట్లకు
కూరలకు వచ్చిన రాజయ్య
చత్తిరి పట్టుకోని నిలబడితే
గోవర్ధన గుట్టని యేలు మీద నిలబెట్టిన
గోపయ్య లాగనిపిత్తడు
బీడీల గంప మీద
చత్తిరి  పట్టుకొని వచ్చే కమలమ్మ
పల్లాకిల పెండ్లి పిల్లను తీస్క పోతాన
ముత్తయిదువ లెక్కనిపిత్తది
చత్తిరి పట్టుకోని
భుజాల మీద నూలు సుట్టలను
మోస్కుపోతాన మార్కండయ్య
మబ్బుల్ని మోస్కపోతాన ఇంద్రుని లెక్కనిపిత్తడు ..
***
మీ అసోంటోల్లకు చత్తిరి అంటే
ఆరు ఇనుప పుల్లల మీద కప్పిన నల్ల గుడ్డ.
గనీ, నా అనుబంల, నియ్యత్ గ చెప్పాల్నంటే
గీ వానా కాలంల చత్తిరి–
చినుకులల్ల పూసిన నల్ల తంగేడు పువ్వు
వూరి చెర్వు కట్ట మీద పెద్ద మర్రి చెట్టు
మనకు సాత్ గ నిలబడ్డ జిగిరి దోస్త్
అత్తా కోడళ్ళ పంచాయితి నడిమిట్ల

అడ్డంగ నిలబడ్డ ఎర్రి బాగుల కొడుకు… !

– మామిడి హరికృష్ణ

మీ మాటలు

  1. పూర్తిగా మట్టివాసన వస్తోంది…ఆహ్లాదంగా, అందంగా ఇష్టంగా ఉంది కవిత..చిన్న తెలంగాణా పోరి నాతొ ముచ్చట్లు చెప్తునట్లుంది… :)

    • కల్లూరి భాస్కరం says:

      అవునండీ, చాలా బాగుంది. ‘..చత్తిరేమో ఆదిశేషున్లెక్క’, ‘చత్తిరి పట్టుకోని, భుజాల మీద నూలు సుట్టలను, మోస్కుపోతాన మార్కండయ్య, మబ్బుల్ని మోస్కుపోతాన ఇంద్రుని లెక్కనిపిత్తడు’…ఉపమానాలు బాగా కుదిరాయి.

      • Harikrishna mamidi says:

        కల్లూరి భాస్కరం గారూ , నమస్సులు .. ధన్యవాదాలు

    • Harikrishna mamidi says:

      అపర్ణ గారూ, తెలంగాణా లో కవిత్వం రాయడాన్ని కైకట్టడం అంటారు .. అలా కైకట్టిన ముచ్చట ఇది .. థాంక్స్ మీ సహృదయ స్పందనకు ..

  2. purushotham gullepelly says:

    చాలా బాగుంది సర్ చత్తిరి పద్యం…
    తెలంగాణా తెలుగు మాండలికాలతో చాలా బాగా రాసారు. ఒక్కసారిగా తెలంగాణా పల్లెల్లోకి
    వేల్లోచ్చినట్లుంది.

    • Harikrishna mamidi says:

      థాంక్స్ పురుషోత్తం .. తెలంగాణా మాటలను అక్షరాలలో రాస్తే నిజం గానే భాషకు జీవం వత్తది .. ఇక్కడ జరిగింది అదే అని నేను భావిస్తాను

  3. చత్తిరి సిత్తరంగా ఉంది. తెలంగాణం లా మాత్తరం మే కాదు చాలా ప్రాంతాల్లో చత్తిరి, చెత్తిరి పాత తెలుగే.

    • Harikrishna mamidi says:

      తిరుపాలు సార్, హృదయ పూర్వక ధన్యవాదాలు సర్

  4. మెర్సీ మార్గరెట్ says:

    నిజంగానే కవిత్వానికి బలమైన పదజాలం వాడడం కన్నా.. సరళమైన సులువైన పదాలతో భావ యుక్తమైన ఇలాంటి కవితలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి… గొడుగు గురించి నేను చదివిన కవితలు చాలా తక్కువ చాలా. తెలంగాణా మట్టి వాసన మీ కవిత అడుగడుగున కనిపించింది. అభినందనలు సర్

  5. చాలా రోజుల తర్వాత చద్విన మంచి పద్యం.

    • Harikrishna mamidi says:

      బాలకృష్ణ సర్, మీ మాటలతో నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు సర్.. థాంక్స్ ఏ లాట్

  6. రామారావు పాలూరి says:

    నికార్సయిన భాష… నిజాయితీగల తాజా అయిన విషయం…చదువుతుంటే చాలా హాయి కలిగింది..

  7. Rajendraprasad says:

    కూరలకు వచ్చిన రాజయ్య
    చత్తిరి పట్టుకోని నిలబడితే
    గోవర్ధన గుట్టని యేలు మీద నిలబెట్టిన
    గోపయ్య లాగనిపిత్తడు
    బీడీల గంప మీద
    చత్తిరి పట్టుకొని వచ్చే కమలమ్మ
    పల్లాకిల పెండ్లి పిల్లను తీస్క పోతాన
    ముత్తయిదువ లెక్కనిపిత్తది
    ఉపమానాలు చాలా బాగున్నాయి.. వానా కాలం లో తెలంగాణా పల్లెటూరు drushyam అద్భుతం..

  8. మంచి మట్టివాసన ,మరియు సాహితీ ఆస్వాదనా కలిపి అక్షర అమృత భావన.

Leave a Reply to మెర్సీ మార్గరెట్ Cancel reply

*