బేషరం వద్ద ఓ జవాబు ఉండదు

సైఫ్ అలీ గోరె సయ్యద్

సైఫ్ అలీ గోరె సయ్యద్

1.
అనుమతి లేకుండా ఎందుకలా చూస్తున్నావ్
అని జాబిల్లి  అడిగితే ఏం జవాబు చెప్పాలో తెలీదు .

కాలిపోతున్న దీపపు వత్తి కాంతి లో
చెవికమ్మల్ని చూసి తృప్తిగా నిదురపోయే బేషరం ని నేను
బేషరం వద్ద జవాబు ఉండదు

2
బేషరం
దేవుడి గురించి ఆలోచిస్తుంటే
తెలియనేలేదు ..
ఎప్పుడు నీ కురులు తెల్లబడ్డాయో !
తిరిగి నేనే సరిచేసుకుంటాను
ఆ కురులని ఆ కుచ్చీళ్ళని
నువ్వు తరువాత లేచి వెళ్ళి
దేవుడి గది శుభ్రం చేసుకుంటూ ఉండు

4
నీళ్ళు తగిలితే తడిచిపోయే
చిన్న నిప్పురవ్వకు కాలిపోయే
చిన్న చెద పురుగుకు తలుచుకుంటే  కనుమరుగయ్యే
ఓ పలుచని కాగితం ముక్కమీద
సంతకం పెడితే
మనకు ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం ఏమిటో
అర్ధం పర్ధం లేని తెలివైన దరిద్రం

5
రోజుల తరబడి కాల్చిన
ఇటుకలతో గోడలు కట్టుకున్న ఏం లాభం
వేకువ జాము కాకమునుపే
కమిలిపోయే పువ్వులు ఎలాగో వాడిపోవాల్సిందే

Love-artist-Vasily-Myazin

6
ఆజ్ఞను పాలించేవాడిని
ఆజ్ఞల్ని ఎలా ఇవ్వగలను
నీకు బేషరం నా కౌగిళ్ళు ముద్దులు
నా చేతి రెండు ముద్దలు ఇవ్వగలను

7
ఒప్పించడం కోసం ఈ సూర్యుడిని వాడుకోలేను
కొన్ని రాత్రులు భూమ్మీద ఈ తలకు
నీ గుండెల మీద ఆశ్రయం కావాలి అంతే
ఏ వృత్తలేఖిని తో గుండ్రని ఓ సరిహద్దు రేఖ
గీయబడుతుందో కాని …
దాని నుంచి బయటకు కాలుమోపడం అయ్యేపని కాదు

8
వాన పడిన ఓ రాత్రి
మసిపట్టి ఆరిపోయిన దీపపు బుడ్డిలో
బేషరం  రెండు మిణుగురులు కొద్దిసేపు అలా అలా తిరిగి
ప్రళయం రాకముందే
ఎప్పుడు బయటకు వెళ్ళిపోయాయో ఏమో ..!

9
లోకాన్ని కాపాడే దేవుడికి
పోలీసుల రక్షణ ఉన్నట్లు
కొన్ని హృదయాలకు  బయటి నుంచి ఎవరు కాపలా ఉండరు

10
నీ ముఖం అద్భుతంగా ఉందంటే నువ్వు నమ్మలేకపోవచ్చు బేషరం
అది నా జీవితాని మాత్రం అద్భుతంగా మార్చింది ఇది నేను నమ్ముతాను.

– సైఫ్ అలీ గోరే సయ్యద్

మీ మాటలు

  1. ప్రియమైన సైఫ్ ,

    4 లోని వ్యంగ్యమూ, 7 లోని తాత్త్వికత మనోహరంగా ఉన్నాయి. ముఖ్యంగా “ఏ వృత్తలేఖిని తో గుండ్రని ఓ సరిహద్దు రేఖ గీయబడుతుందో కాని … దాని నుంచి బయటకు కాలుమోపడం అయ్యేపని కాదు “… అన్నది ఎంత అందమైన భావన. మీ బేషరంలు కూడా అలాంటి వృత్తాలే గీస్తున్నాయి. వాటిలోంచి కాలుబయటపెట్టడం సాధ్యం కావడం లేదు.
    హృదయపూర్వక అభినందనలతో

  2. మనిషికి మనిషి మీదలేని నమ్మకాన్ని
    అర్ధం పర్ధం లేని తెలివైన దరిద్రం కాగితం మీధ పెట్టటం ఏంటీ?
    ఇది ఒక విషాదాత్మక వ్యంగ్యం! కాగితపు పువ్వు!

    @ రోజుల తరబడి కాల్చిన
    ఇటుకలతో గోడలు కట్టుకున్న ఏం లాభం!
    వేకువ జాము కాకమునుపే
    కమిలిపోయే పువ్వులు ఎలాగో వాడిపోవాల్సిందే @
    కఠోర జీవిత సత్యం!
    చాలా బావుంది.

  3. మెర్సీ మార్గరెట్ says:

    సైఫ్ గారు చాలా బాగా రాసారు. ప్రతి యూనిట్ కోట్ చేయాల్సిందే. నాకు చాల నచ్చేసాయి.

  4. ప్రశ్నల పరిధి దాటిన జవాబులైనపుడు.. ఇక వేరే జవాబులేందుకు

    ఎప్పటిలా మీ బేషరమ్ ఈజ్ సో స్వీట్.. అండ్ గ్రేట్లీ పొఎటిక్

  5. ప్రతి లైను లోనూ ఘాడత. చాలా బాగుంది సైఫ్ జీ.

Leave a Reply to ns murty Cancel reply

*