ఎన్నీల ఎలుగు

అన్నవరం దేవేందర్

అన్నవరం దేవేందర్

తెల్లని ఎన్నీల ఎలుగుల చల్లదనం
వాకిట్ల గడన్చల ఎల్లెలుకల పండి
తాత చెప్పిన శాత్రాలు ఇన్నందుకేమో
కొంతైనా కైత్వాల అల్లకం అబ్బింది
మక్కజొన్న కావలి కాడ
ఎత్త్హైన మంచె మీన్నుంచి చూసిన
గోరుకొయ్యల మూలసుక్కల మాంత్రికత
మదిల మెదులుతున్న ఆ మెరుపులేనేమో
అప్పుడప్పుడు ఒలుకుతున్న చమత్కార్యాలు
పెద్దెగిలివారంగ ఎన్నీల ఎలుగుల
వరికల్లంల ఎడ్ల బంతి కట్టి తిమ్పుడు
గడ్లె కెల్లి ఎల్లిన వడ్లను తూర్పాల పట్టి
బర్తి బండి ఇంటికి కోట్టుకచ్చిన జ్ఞానం
ధాన్యం దరిద్రం ల మద్య దూరం తెలిసింది
కృష్ణ టాకీసుల రెండో ఆట
మడికట్లల్ల మంద పెట్టిన్నాడు కావలి
కల్లంల దినుసు కాడ నిద్ర
నాత్రి నాత్రి ఏ పనికి పోయినా సరే
తాటి బొత్త్లల పానాది నిండా ఎన్నేలే ఎన్నేలా
ఆ ఎన్నీల నడకలే ఈ కైత్వపు పాదాలు
పురాగ ఎన్నీలా అని కాదు
సిమ్మని సీకటి అంతకన్నా కాదు
వొర్రెలు  వాగులు దాటుకుంట దాటుకుంట
కలువాలునుకున్న తావున
నర్రెంగ సెట్టు కింద కలయిక
మనసంతా పులకరించిన జరం
ఆ సాయ సాయ కై నీడలనే
మెరిసిన జిలుగు వెలుగుల చందమామలు
index
అసోయ్ దూల అసోయ్ దూల
ఆశన్న ఉశన్నల గజ్జెల చప్పుళ్ళు
పీరీల గుండం సుట్టు తిరిగిన కాళ్ళు
కనుచూపుల సైగలు కలుపుకొని
మందిలకెల్లి మందిలకేల్లె  మాయమవుడు
ఆ ఎన్నెల రాత్రుల్లోనే
నిండు పున్నం నాడు పండు వెన్నెల
భూమికి సున్నం ఎసినట్లు
ఎన్నీల ఎలుగు పల్లెటూరంత స్వచ్చం
ఎన్నీల ఎలుగే మనసు నిమ్మళం నిమ్మళం ..
– అన్నవరం దేవేందర్
చిత్రం: కాపు రాజయ్య

మీ మాటలు

  1. balasudhakarmouli says:

    అద్భుతమైన కవిత.

  2. కవిత బాగుంది.
    కంగ్రాట్స్ అన్నవరం గారూ.

  3. ఎన్నెల రాత్రుల్లోనే
    నిండు పున్నం నాడు పండు వెన్నెల
    భూమికి సున్నం ఎసినట్లు
    ఎన్నీల ఎలుగు పల్లెటూరంత స్వచ్చం..

    స్వచ్చమైన మా అన్న మనసులా..

  4. veldandi Sridhar says:

    శాన రోజులకు మళ్ళా పల్లె నడుమ ఎన్నీల ఎలుగుల కూసున్నట్టుంది. శాన రోజులకు పానమసొంటి ఆత్మగళ్ళ యాసను గుండె కత్తుకున్నట్టుంది. మొత్తం మీద నడి ఎండల చెర్ల దుంకినట్టుంది.
    అన్నవరం సారూ షుక్రియా…

    వెల్దండి శ్రీధర్

  5. విలాసాగరం రవీందర్ says:

    ఎన్నీల లాంటి కైత

  6. Dr. Vani Devulapally says:

    కవిత బావుంది ! అన్నవరం గారు ! కంగ్రాట్స్ !

Leave a Reply to Dr. Vani Devulapally Cancel reply

*