మొహమాటం లేకుండా…ఇప్పటి కథల గురించి కొన్ని ఫిర్యాదులు!

 972368_1415799075312585_947027319_n

సాహిత్య సృజనకూ సమకాలీన సామాజిక సందర్భానికీ అన్యోన్య సంబంధం ఉంది. ఈ సంబంధాల సరళమైనవి కావు. అత్యంత క్లిష్టమైనవి. గత రెండు మూడు శతాబ్దాల చరిత్ర చలనంలో భిన్న పార్శ్వాలున్నాయి. అనేకానేక వైరుధ్యాలున్నాయి. గతిశీలత ఉంది. వీటిని అవగాహన చేసుకోవడానికీ, తమ అనుభవంలోకి ఇంకింపజేసుకోడానికీ తమ కథల ద్వారా వ్యక్తీకరించడానికీ రచయితలు మునుపటికంటే ఎక్కువగా ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు. ఇతివృత్తాలను ఎన్నుకోవడంలో, పాత్రచిత్రణలో, కథన రీతుల్లో, నేపథ్య చిత్రణలో, ప్రాంతాలకు-వర్గాలకు సంబంధించిన భాషాభేదాల వాడకంలో రచయితలు ఈ కాలంలో ఎంతో వైవిధ్యాన్ని సాధించారు. ఈ ప్రయత్నాన్నీ, ఈ సాధననూ ఆహ్వానిస్తూ, అర్థంచేసుకొంటూ కథలిచ్చే నాగరిక సంస్కారాన్ని ముందుకు తీసుకొనిపోయే పాఠకుడు ఎప్పుడూ అవసరమే.

అయితే మంచి పాఠకుడైన విమర్శకుడు-విస్తార సాహిత్య పరిచయమున్న విమర్శకుడు-కేవలం కథా నిర్మాణ రీతుల మీద మాత్రమే దృష్టి పెట్టడు. ఆ నిర్మాణానికి మూలమైన చరిత్ర, సంస్కృతి, ఇతరేతర సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అంశాల వెలుగులో కథని విశ్లేషించి కొత్త ద్వారాలను తెరవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాదు-రచనల ద్వారా అందే స్పందనలను, రచనల వస్తు శిల్పాలను, రచయితల ప్రాపంచిక దృక్పథాన్నీ చర్చిస్తూ పాఠకులకు ఒక చూపునివ్వగలిగిన వివేచనా శక్తిని అందిస్తాడు. ఇది గమనించినపుడు సమకాలీన కథా రచయితల ముందున్న సవాళ్ళకంటే ఈనాటి కథా విమర్శకుల ముందున్న సవాళ్ళూ బాధ్యత ఎక్కువే.

కథా విమర్శ అంటున్నప్పుడు సాధారణంగా చాలామంది సమీక్షకులూ విమర్శకులూ వస్తు పరిచయానికి మాత్రమే పరిమితమై ఉంటారు. ఇది దోషం కాకపోవచ్చు; కానీ వస్తువు వెనక ఉండే సామాజిక శక్తులను పరిశీలించడం గానీ  ఆ వస్తువును వాహికగా చేసుకొన్న రూపానికి గానీ ప్రాధాన్యమివ్వరు. వస్తు-శిల్పాలను అనుభూతం చేసే భాషా శైలులను అసలు పట్టించుకోరు. అవి పట్టించుకోకపోవడం వల్లనే నిర్హేతుకమైన పరస్పర విరుద్ధ భావాలు కాకపోతే దుర్భ్రమలు చెలామణిలోకి వచ్చాయి.

కథా విమర్శకు సంబంధించిన ఈ మథన, ఈ చింతన ఎ.కె. ప్రభాకర్‌కు ఉండడం వలనే ఈ వ్యాసాల్లో కథా విమర్శ స్థాయిని అతను పెంచాడు. ఈ స్థాయి ఈ సంపుటిలోని ప్రతి వ్యాసంలోనూ కనిపిస్తుంది. సమకాలీన రచయిత చుట్టూ పెరుగుతూ పోతున్న సామాజిక సంక్షోభాలను ప్రభాకర్‌ ఈ వ్యాసాల్లో గుర్తించాడు. గుర్తించడమే కాదు, రచయితల అస్తిత్వ వేదనలూ, ఆకాంక్షలూ, ఆశయాలూ-వాటికి  కారణమైన భిన్న వాదాలూ, ఉద్యమాలు కథల్లో ఏ విధంగా ప్రతిఫలనం చెందాయో లోతుగా తరచి చూశాడు. ఉదాహరణకు-తెలంగాణ రచయితల భాష విషయంలో, శిల్పి విషయంలో కొందరికున్న అపోహలను ప్రస్తావిస్తూ ‘అదంతా బతుకు పోరునీ-వేదనా భరితమైన తండ్లాటనీ, మొత్తం సమాజంలోని కల్లోలాన్నీ తమ రచనల్లో ప్రతిఫలిస్తున్న యీ రచయితల్ని రూపవాదులు ఒక మూసలోకి ఇమడ్చాలని ప్రయత్నించడం తప్ప మరేంకాదు’ అని ప్రభాకర్‌ నిర్మొహమాటంగా చెబుతాడు. వస్తువు-రూపం పడుగుపేకల్లా కలసిపోయిన ఆడెపు లక్ష్మీపతి కథల్ని మనముందుంచుతాడు.

అట్లాగే స్త్రీవాదానికి చెందిన పదజాలం లేకుండా కథ నడపడం కుప్పిలి పద్మ కథల్లో ఒక సుగుణమని ప్రభాకర్‌ పేర్కొంటాడు. ఉద్యమాలు పగిలిన అద్దంలాగా ఎట్లా ఉంటాయో ఎస్‌. జయ ప్రతీకాత్మకంగా చెప్పిన కథను ఉదహరిస్తాడు. అయితే ఈ సందర్భంలోనే బలమైన సామాజిక వాస్తవాలైన కులాన్నీ, మతాన్నీ విస్మరించిన విషయాన్ని కూడా మనముందుంచుతాడు. ఓల్గా గొంతులోని కాఠిన్యాన్ని గుర్తిస్తూనే  దానిలోని స్థెర్యాన్ని మెచ్చుకొంటాడు. లోపలి వ్యక్తిగా బి.ఎస్‌. రాములు, బయటి వ్యక్తి గీతాంజలి వంటి రచయితలు ప్రకటించిన దృక్పథాల్ని చర్చకు పెడతాడు.

‘సమకాలీనం’ ముప్పై కథా విమర్శ వ్యాసాల సమాలోచనం. మహాశ్వేతాదేవి కథలు, భారతీయకథలు, లోకేశ్వర్‌ చేసిన అనువాద కథల మీదా చేసిన పరామర్శ తప్ప మిగతా ఇరవైయేడు వ్యాసాలూ సమకాలీన తెలుగు కథల సామాజిక మూలాలను, రచనా సంవిధానాలనూ చర్చించినవే.

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

వర్తమాన కథపై ఎంతో ప్రేమతో రాసిన వ్యాసాలివి.వ్యాసాల్లో ఆయా రచయితల మీద అభిమానం కనిపిస్తే కనిపించవచ్చు గానీ అతిశయోక్తులతో కూడిన పొగడ్తలూ, వీరారాధనలూ లేవు. ఒక ప్రజాస్వామిక లక్షణం ఈ వ్యాసాలకు గీటురాయి. అందుకే వివిధ కథా రచయితల రచనల స్వరూప-స్వభావాలను ఒక వైపు విశ్లేషిస్తూనే కొన్ని రచనల్లోని సంకలనాల్లోని లోపాలను ఖండించడంలో ప్రభాకర్‌ వెనుకాడలేదు. తీరం తాకని కథా తరంగాలు ఒక పద్ధతీ పాడు లేకుండా కూర్చిన 300 పేజీల కలగూరగంప అనీ, కథా తరంగాల్లో ఏ మాత్రం సంచలనం లేనివీ ఎగసిపడి పాఠకుడిని తాకనివీ ఎక్కువనీ నిర్మొహమాటంగా ప్రకటిస్తాడు. అలాగే కర్నూలు కథా సంకలనంలో నిర్దిష్ట ప్రణాళిక లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు.

‘కథావసంతం’ పోటీ కథలను పరిశీలిస్తూ వర్తమాన కథకులు గమనించవలసిన అంశాలను ప్రభాకర్‌ నిర్ద్వంద్వంగా పాఠకుడి ముందుంచుతాడు. పోటీల్లో నిలబడ్డ కథల్లో ప్రభాకర్‌ గమనించిన అంశాలు కొన్ని :

– గ్రామీణ నేపథ్యానికీ, ప్రాంతీయతకూ పోటీ రచయితలు ఆమడ దూరంలో ఉన్నారు.

– అస్తిత్వ చైతన్యం తాకలేదు, వస్తు విస్తృతి లేదు, శిల్ప వైవిధ్యమూ లేదు- కొన్ని రచనలు వ్యాఖ్యానాలు-స్కెచ్‌లుగా మిగిలిపోయాయి.

– సంవిధానం పట్ల రచయితలు శ్రద్ధ చూపలేదు.

– జీవితం లోతుల్లోకి చూపు మందగించింది, సామాజిక సంక్లిష్టత కథల్లోకి ఎక్కలేదు.

– సంఘటన ప్రధానంగా నడవలేదు, సంఘర్షణ లేదు.

– దృక్పథ లోపం ఉంది.

విమర్శనాత్మకమైన ఈ అంశాలను పరిశీలిస్తే కొత్త వారివైనా, పాతవారివైనా ప్రసిద్ధులవైనా, అప్రసిద్ధులవైనా కథలను ఏయే కోణాల్లోంచి మనం చూడాలో స్పష్టమవుతుంది.

పాపినేని శివశంకర్‌ కథల మీద చేసిన అనుశీలన ఒక్కటే ఈ ముప్పై వ్యాసాల్లో పెద్దది. మిగతావన్నీ చిన్నవే కానీ మనసు పెట్టి రాసినవి. అందుకే ఈ వ్యాసాల్లో విస్పష్టమైన చింతనాబలం ఉంది. వాదనాపటిమ ఉంది. వ్యాసరూప నిర్మాణ శ్రద్ధ ఉంది. నిజాయితీ ఉంది. ఆలోచనాత్మకమైన సరళశైలి ఉంది. మన ఆలోచనలకు కొత్త చూపునూ, కొత్త సంస్కారాన్నీ ఇచ్చే శక్తి కూడా ఈ వ్యాసాలు అన్నిటికీ ఉంది.

నిజానికి ఈ ముప్పై వ్యాసాల మీద పెద్ద చర్చ చేసే అవకాశం ఉంది. అయితే-ఒక ఆత్మీయుడిగా చేస్తున్న పరిచయమే ఇది. ఈ వ్యాసాలన్నీ చదివాకా సాహిత్య పాఠకులకు సంపుటిలో ప్రస్తావించిన రచయితల రచనలతోపాటు కథా సాహిత్యాన్ని విరివిగా చదవాలనే ఆసక్తి పెరిగితే మంచిదే. సమకాలీన కథా సాహిత్యం మీద ప్రభాకర్‌ పంచుకొంటున్న ఈ ఆలోచనలను పాఠకులు మాత్రమే కాకుండా కథకులు, విమర్శకులు కూడా పట్టించుకొంటే మరీ మంచిది. కథా సాహిత్యం, కథా విమర్శ మరింత దిటవుగా వర్థిల్లడానికి ‘సమకాలీనం’ వ్యాసాలు మనోచలనంగా తప్పక పని చేస్తాయని గట్టిగా నమ్ముతున్నాను.

కేతు విశ్వనాథరెడ్డి

Kethu Viswanatha Reddy

 

 

 

 

సెప్టెంబర్ 6 న ‘సమకాలీనం’ విమర్శ వ్యాసాల సంపుటి ఆవిష్కరణ
కథా విమర్శకుడు ఎ.కే ప్రభాకర్ ‘సమకాలీనం’ విమర్శ వ్యాసాల సంపుటి ఆవిష్కరణ ఈ శుక్రవారం హైదరాబాద్ లో  జరుగుతుంది.  వివరాలు ఈ ఆహ్వాన లేఖలో….

533246_10153204953790385_1512291172_n

మీ మాటలు

  1. ప్రభాకర్ గారి నుండి ఇటువంటి పుస్తకాన్ని చాలమంది కథకులు, పుస్తక ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్టికి వెలువడుతున్నది.

  2. DrPBDVPrasad says:

    డా.ఏ.కే.ప్రభాకర్ ప్రజాస్వామ్య దృక్పథం,అభ్యుదయ భావాలున్న విమర్శకులు
    కథ నాణ్యతని సప్రమాణంగా నిర్ణయించగలరు.

  3. veldandi Sridhar says:

    కథా సాహిత్య విమర్శకులలో ఏ.కే. ప్రభాకర్ గారు సీరియస్ విమర్శకులనేది సాహిత్య ప్రపంచం గుర్తించిందే. కథను లోతుగా అధ్యయనం చేసి ఒక న్యాయమూర్తిలాగా తీర్పు చెప్పగలరు వారు. ఏ.కే. ప్రభాకర్ గారి నుండి ఇలాంటి పుస్తకం ఆశించిందే. కథ సాహిత్య అభిమానులు అందరు చదివి తీరాల్సిన పుస్తకం. కథకులు, కథా విమర్శకులు తమను తాము సవరించుకోవడానికి ఉపయోగపడే పుస్తకం. అయితే ప్రభాకర్ గారి ఫిర్యాదుల్ని పట్టించుకోవాల్సి ఉంది. కేతు గారి పరిచయం చాలా బాగుంది.

    వెల్దండి శ్రీధర్

మీ మాటలు

*