Divine Tragedy

వంశీధర్ రెడ్డి

వంశీధర్ రెడ్డి

KS స్పోర్ట్స్ ఎక్స్ ట్రా డాట్స్, విస్పర్ అల్ట్రా క్లీన్
ఐదు పాల పాకెట్లు, రెండు రేజర్లూ
పార్క్ అవెన్యూనో మైసూర్ సాండలో
వైల్డ్ ఫాంటసీ వాసనా
ఓ బియ్యం బస్తా కిలో టొమాటోలూ డజను గుడ్లూ పళ్ళూ
గుళ్ళో గంటా కొబ్బరికాయలూ …
కొత్త సంసారానికీ.. పాతబడుతున్న సహజీవనానికి ..

ఎప్పుడైనా కలలో
కాలో నడుమో తగిల్నపుడూ
బాత్రూం షవర్కింద నీళ్ళు సుడుల్తిరిగినపుడూ
ఓ ఏకాంతానికో ఒంటరితనానికో తెరపడిందని
వెంట్రుకలకు వేళ్ళాడ్తోన్న కొబ్బరినూనె అంటిన దిండు చెబితే తప్ప,
నేనింకా అకేలానే.. కేలాలు తింటూ..

తత్వం బోధపడడానికి
చాలా రాత్రులూ కొన్ని పగళ్ళతో గతానికి కట్టేసుకున్నాక
మెలకువొచ్చేప్పటికి నాలో నాకు దూరం కొన్ని జన్మలై..
బ్రతికిన క్షణాలు తెలిసిన పోయినోళ్ళరాతలే దిక్కపుడు
పిల్లాడి ఏడుపుల్లోంచి దారడగడానికి,

పడగ్గది వాసనకి విసుగొచ్చిన సాయంత్రం మిత్రుడి పిలుపొస్తుంది
నిశాచరుడివై నషానిషాదపు బీ ఫ్లాట్ గొంతులో దూరదాం
దురదెక్కిన చర్మాలున్నాయి వేలిగోళ్ళు పెంచుకురమ్మని

కాలం మరణం నేనూ
మూడుముక్కలాడుతుంటాం మాడు ముక్కలయ్యేదాకా,
సముద్రాలు పీపాల్తాగి ఆకాశమ్మీదికి మూత్రిస్తుంటాయి
తోడేళ్ళు రొమ్ముల్నాకి హత్యించిన స్త్రీలు
సమాధుల్లో ఆకలేసి కేకలేస్తుంటారు,
నీ సగమూ ఉండొచ్చు వాళ్ళలో..

ముప్పై మూడో పెగ్గులో
కాలానికీ మరణాన్ని ఊహించి మరణం తర్వాతి కాలాన్ని ప్రశ్నిస్తాను,
మూడు ఆసులు పడగానే సమాధానం దొరికిందనుకుని
జోకర్ ముఖంతో వెలిగిపోతాను,
బీట్ కనిస్టీబు విజిల్విని భయమేసి భూమిని కప్పుకోగానే
కాలమూ మరణమూ పట్టుబడి రిమాండుకెళ్తాయి..

మత్తు తలకెక్కి నాలోని ఖగోళాల్లోకి జారిపడి
వంటింటిగిన్నెలో తేలగా పిల్లాడు ఏడుస్తుంటాడు పాలు లేక,
ఇది ఏ యుగమో ఎన్నో నాగరికతో పోల్చుకునేలోపు
దోసిలిలో పోగేసుకున్న రెప్పల్ని
పెరుగన్నమ్ముద్దలో తడిపి కడుపులో దాచేస్తుంది తను,
పిల్లాడి ఏడుపు ఆగిపోతుంది రక్తమోడుతున్న రొమ్ము నోటికందాక,
నే చెప్పాలనుకున్నవన్నీ తనకు తెలిసిపోయి
“నేనెవరు” అని అడిగి దీపాన్ని ఆర్పేస్తుంది..
వెయ్యిన్నొకటోసారి పునర్జన్మిస్తాను నేనపుడు ఎప్పట్లాగే..

తరాల తర్వాత ఓ రోజు,
పిల్లాడిని ఆడిస్తుండగా తాజా వార్త,
మరణానికీ కాలానికీ ఉరేయబడిందని,
ఆకాశం చిట్లి పాలపాకెట్లు కూలి
దొంగజేబులోని కండోములు కాలిపోతాయి,

మర్నిమిషం సముద్రపొడ్డున,
రెండు ఖాళీ కుర్చీల నడుమ మూడుముక్కలు
ఆడుతుంటాడు పిల్లాడు నిండా మీసాలు పెంచుకుని,
స్థలకాలాలన్నీ ఆవృతమౌతుంటాయి
మీసాల గడ్డాల పిల్లాడు
జోకర్ ముఖమంటించుకుంటాడు  వీపుకి.. నాలాగే..
ఎక్కడో ఎవరో అన్నం కలుపుతుంటారు కళ్ళు పొడుచుకుని
ఎప్పటిదో రక్తంవాసన
చెవులకు కన్పిస్తుంటుంది  మెత్తగా..

మీ మాటలు

 1. ఐదవ స్టాంజాలో, ఆ తర్వాత కూడా కొన్ని చోట్ల కవిత్వం చిక్కగా వచ్చింది. అయితే శీర్షికలోని అంతరార్థమేమిటో బోధపడలేదు. Is it ‘Device Tragedy’ or ‘Divine Tragedy’?

 2. కవిత శీర్షికను డివైన్ ట్రాజెడీ గా మార్చి, అయోమయాన్ని నివారించినందుకు కృతజ్ఞతలు.

 3. బావుంది

 4. ఈ కవితలో ప్రతి స్టాంజా దానికదే ఓ కవితగా మనగలిగే అవకాశం ఉంది..అంటే కవితని ఎక్కడైనా ఆపేయొచ్చు. ఐతే చివరి దాంట్లొ మళ్ళీ కొన్ని పదచిత్రాలు రిపీట్ కావటం ఎక్కడో తెగిన దారం తనదారి తాను వెతుక్కుని వచ్చినట్లుగా మంచి ముగింపునిచ్చారు…మళ్ళీ మీదైన మరో కవిత.

 5. చాణక్య says:

  ఒక ఔత్సాహికుడిని నిరాశపరచడమో లేక వ్యక్తిగతంగా విమర్శించడమో నా ఉద్దేశ్యం కాదు కానీ ‘కవిత్వం’ అంటే ఎందుకంత పలుచని భావం కలుగుతోంది? కేవలం ఈ కవిగారినే దృష్టిలో పెట్టుకుని చెప్పడం లేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఎవరో రచయితలే నడుపుతున్న మ్యాగజైన్ అనుకుంటాను ఇది. యువకవులను ప్రోత్సహించాలనే సదుద్దేశ్యం గల నిర్వాహకులను, తన పరిధిలో ధైర్యం చేసి రాయగలిగిన కవిగారిని అభినందిస్తాను ఖచ్చితంగా.

  ఒక కవి లేదా రచయిత మెరుగుపడాలంటే షార్ప్ క్రిటిసిజం చాలా అవసరం. అది కూడా మన వ్యక్తిగత అభిప్రాయాలు, అజెండాలు పక్కనబెట్టి, ఆ వ్యక్తిలో ఆవేశాన్ని, ఆవేదనను ఒక క్రమమైన మార్గంలో పెట్టడానికి ఉపయోగపడేలా ఉండాలి. కవి కావాలంటే ప్రతివాడు విశ్వనాథవారిలా, శ్రీశ్రీలా ఛందస్సు నేర్చుకోనవసరం లేదు. కానీ గాత్రశుద్ధి ఉన్నంతమాత్రాన ప్రతివాడు గాయకుడు కాలేదు కదా! నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది.. స్వరాలు, రాగాలు, మెళుకువలు ఇలాంటివన్నీ గురుముఖతః లేదా స్వీయసాధన ద్వారానో నేర్చుకుంటేనే మంచి గాయకుడిగా మనగలుగుతారు. కవిత్వం కూడా సంగీతానికి సాటియైన కళ! కేవలం భావం, భాష సరిపోవు. వాటిని ‘కవిత్వం’గా మార్చగలిగే నేర్పు కావాలి. అది స్వతహాగా రాదు. విపరీతంగా చదివి నేర్చుకోవాలి. లేదా పెద్దల సలహాలు, విమర్శలు ఆ కాలుతున్న ఇనుముని వంచాలి.

  ఈ కవిగారిని విమర్శించడం నా ఉద్దేశ్యం ఎంతమాత్రమూ కాదు. ఆయన ఉత్సాహాన్ని, ఆసక్తిని మెచ్చుకుంటాను. కానీ మ్యాగజైన్ నిర్వాహకులు ఒక్కసారి మన పూర్వ పత్రికా సంపాదకులను, వారి సునిశిత విమర్శనా శైలిని గుర్తుతెచ్చుకుంటే బాగుంటుంది. సదరు కవికి మంచీ, చెడూ, బాగున్నవీ, బాగులేనివి, బాగుచేయాల్సినవీ చెప్పి, మంచి కవిని తయారుచేసేలా ప్రోత్సహిస్తే బాగుంటుంది. లేదంటే చేతులారా ఒక సాహితీప్రియుడి ప్రతిభను నాశనం చేసినవారవుతారు.

  • చాణక్య గారు – మీరు కామెంట్ చేసారు బాగుంది. కాని సంపాదకులు కవులతో కూర్చొని ఎలా కవిత్వం రాస్తే బావుంటుంది అని చెప్పడానికి సారంగ పత్రిక ఒక స్కూల్ కాదు. అయినాకాని చెపితే నేర్చుకొని రాసే కవిత్వం ఎం కవిత్వమూ? పోయెట్రీ etc. లాంటి ఆర్టిస్టిక్ రాయడంలో immerse అయిన వాళ్లకు టీచింగ్ కన్నా పర్సనల్ ఇన్స్పిరేషన్ మరియు పర్సనల్ struggle ఎక్కువగా ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి రీడర్ ఎక్కువగా హెల్ప్ చెయ్యలేడు. Personally speaking, I wish the day will never come when someone proposes to teach how to write good poetry, because that will kill all the young poets and it is just one step away from the Orwellian world, which we should resist by all means. For a poet, young or old, road to perdition is marked with gleeful smiles of well-meaning editors and (essentially narcissistic) critics. :- )

   రాజ్

   • చాణక్య says:

    బహుశా నా కామెంట్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. తప్పు లేదు. కవిత్వం ఎవరూ నేర్పించరు. కానీ కవి అనేవాడు నేర్చుకోవాలి. ఈ ‘నేర్చుకుని రాయడం రాయడమా?’ అనే పలుచన భావనే ప్రమాదకరమని అనుకుంటున్నాను. ఒక గాయకుడో, సంగీత విద్వాంసుడో ఎప్పుడూ ఇలా అనడే! సంగీతంలో ఉన్నట్టుగానే కవిత్వంలో కూడా వ్యాకరణము, రసము, ఛందస్సు అని కొన్ని రూల్స్ ఉన్నాయండీ. అయితే భావకవిత్వానికి ఛందస్సు అవసరం లేదు. కానీ వ్యాకరణ శుద్ధి లేని భాష జీవం లేని శరీరం లాంటిది. ‘ఎవడైనా కవిత్వం రాయొచ్చు’ అనే భావన సరియైనదే. కానీ ‘ఎవరుపడితే వాళ్లు కవిత్వం రాయగలరు’ అనేదే చాలా ప్రమాదకరమైంది. మీరు చెప్పిన ఇన్స్పిరేషన్ అండ్ స్ట్రగుల్ మాత్రమే కావలసింది కవికి. కానీ అవి కవిత్వంగా మారాలంటే ఒక పద్ధతి ఉంది. అది పెద్దలు, పుస్తకాలు మాత్రమే నేర్పగలవు. Even narcissists are worth listening to , for a poet who wants to excel in his own way of writing .

 6. అచంగ says:

  ‘హత్యించు’ అంటే ఏమిటో ఎవరన్నా వివరిస్తే సంతోషిస్తాను. కవిహృదయం బొత్తిగా అర్థంకాలేదక్కడ! ఇన్నాళ్ళూ తెలుగు సాహిత్యం చదవాలంటే సంస్కృత నిఘంటువు దగ్గర పెట్టుకోవాలి అంటుండేవారు. ఇప్పుడు దాంతోబాటే ఇంగ్లీషు నిఘంటువు కూడా దగ్గరపెట్టుకోవాలేమో! తెలుగు సాహిత్యం కర్మేమిటో ఓ కవితకి పేరు పెట్టుకోవటానికి తెలుగులో పేరే కనబడలేదు రచయితకు! అలాగే అనవసర సంయుక్తాక్షరాల వాడకం శెనగల్లో మట్టిబెడ్డల్లా తగిలి తెగ ఇబ్బంది పెట్టింది.

  ఇక పైన చాణక్య లేవనెత్తిన అంశాల్లో నేను ఏకీభవించినా ఏకీభవించకున్నా ఒక్క విషయాన్ని మాత్రం చెప్పక తప్పదు. కవిని తయారు చెయ్యటం పత్రిక సంపాదకవర్గం బాధ్యత కాకపోవచ్చు కానీ కవి రాసిన కవితలో విషయం ఎంత అనేది నిర్ణయించాల్సిందీ, అది పత్రిక స్థాయికి ఎంతమాత్రం ఎన్నదగ్గదీ అన్న విషయాలు నిర్ణయించాల్సింది మాత్రము సంపాదకవర్గమే. బహుశా చాణక్య చెప్పాలనుకున్నది ఇదే అని అనుకుంటున్నాను.

  • హత్యించు అంటే హత్యను క్రియగావాడారు సార్‌!
   చాణక్య గారు! మంచి మాట చెప్పారు.
   కవిత్వమంటే అదేదో దేవుడిచ్చిన వరం లా ఫీలవుతుంటారు కొంతమంది! నిన్నటిం తరం లోనే ననుకుంటే ఇంకా అది కొనసాగుతుంది. శ్రీ శ్రీ గారు ఎంత ఆధునికుడో ఈతరం వాల్లతో పోలిస్తే!
   కొంతమందికి కొన్ని ప్రతిభలు సహజంగా ఉండటం నిజమే అయినా, వారి కృషి మీదనే అది కూడా ఆధారపడుతుంది. అందుకే ఆరుద్ర గారు ‘ కృషి వుంటే మనుషులు ఋషులౌతారు ‘ అన్నది. దాని మiI ద ఇంటరెస్ట్‌ లేకపోతే ఏదీ రాదు. కవిత్వం అందుకు మినహయింపు ఏమీ కాదు.
   @ పడగ్గది వాసనకి విసుగొచ్చిన సాయంత్రం మిత్రుడి పిలుపొస్తుంది
   నిశాచరుడివై నషానిషాదపు బీ ఫ్లాట్ గొంతులో దూరదాం
   దురదెక్కిన చర్మాలున్నాయి వేలిగోళ్ళు పెంచుకురమ్మని @ అందంగా చెప్పారు గాని అందమైన- సౌందర్యమైన -భావన కాదు. ఆదునిక విశ్రుంఖల జీవితాలకు పరాకాస్టా!

   • అచంగ says:

    మనం ఎవ్వరమూ తెలుగు ప్రత్యేకంగా నేర్చుకున్నవారము కాదు. మనము ఎదిగేకొద్దీ మనతోబాటు మనలో ఎదుగుతూ/వస్తూ వచ్చిన భాష తెలుగు. అలాంటి భాషలో మనం రాస్తున్నప్పుడు ఎక్కడనుంచో ఏరుకొచ్చిన వాడుకలను ప్రయోగాలని చెప్పి తెలుగుపై రుద్దటం అన్యాయమని నా అభిప్రాయం. (Murder – Murdering, Urine – Urinate ఇలాంటివి రచయిత కొత్తగా కనిపెట్టినదేమీ కాదు. ఇది ఆంగ్లభాషా వాడుక) ఒక భాషను/భాషా సాంప్రదాయాన్ని మరో భాషపై రుద్దితే అవి సంకరమవుతాయి. దాన్నే ఇంగ్లీషులో creole language అంటారు. తెలుగు సాహిత్యంపై ఒకవైపు ఛందస్సు స్వారీ చేస్తున్న సమయములోనే అన్నమయ్య, రామదాసు, త్యాగరాజులాంటి ఎందరో ఛందస్సు వెన్ను విరిచి సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు, జనమూ ఆదరించారు. కొత్తదనమన్నది రెండువైపులా పదునున్న కత్తి అని మిత్రులు గుర్తించాలని కోరుతాను. భాషా సౌందర్యాన్ని చీలికలు పీలికలు చేసి కొత్తదనమని మురిసి ముక్కలవ్వమంటే నేను కొంత సందేహిస్తాను. అసలివన్నీ ఎందుకొచ్చిన చర్చలండీ? తెలుగులో రాస్తున్నవారు వారి రచనలకు తెలుగులో పేరుపెట్టుకుంటే తెలుగువారికి అర్థం కాదా? ఒకవేళ ఇతరులకు తెలియాలని అనుకుంటే అదేదో ఇంగ్లీషులోనే రాసేస్తే పోతుందిగా! విచ్చలవిడితనానికి విశాలభావమన్న ముసుగువేస్తే ఎవ్వరమూ చెయ్యగలిగింది ఏమీ లేదు. రాస్తున్న భాషకు న్యాయం చెయ్యటం రచయిత ప్రధాన బాధ్యత.

    ‘కూడు తిను’ అని అనటానికి ‘కూడు చేయు’ అనటానికి మధ్య ఎంత తేడా ఉందన్నది నేను ప్రత్యేకంగా చెప్పాలా?! ఇకనుండి ఇదే విశాలభావాన్ని అలవర్చుకుని వంటించు (వంటచేయు) శుభ్రించు (శుభ్రముచేయు) అన్నించు (అన్నము తిను) ఇలాంటి క్రియాపదాలు వాడేసుకుందాం! ఎక్కడన్నా తెలుగుకు ఊపిరందుతుందేమో అది కూడా అందకుండా పీకనొక్కేస్తే ఒక పనైపోతుంది. అటు రాసేవారికీ, ఇటు చదివేవారికీ బోల్డంత ప్రశాంతత.

   • మనకు ఇది కొత్త కాదు. చలం గారు మాత్రమే కాదు, వడ్డెర చండి దాస్‌ గారి రచనల్లో బోలెడన్ని నామవాచకాలని క్రియలగా సందర్బొచితంగా వాడటం చూడొచ్చు. అది వారి శైలిలో భాగంగానే చూడాలి. అలా వాడటం వల్ల తెలుగుకు వచ్చిన భంగం ఏమీ లేదనే అనుకుంటా!

 7. narayana sharma says:

  మిత్రులు/పెద్దలు వ్యక్తం చేసిన అంశాలపై నాకు కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి.

  బహుశః ఇప్పుడు తెలుగు కవిత్వం విశ్వనాథ దగ్గరో,శ్రీశ్రీ దగ్గరో ఆగిపోలేదు.చాలా ముందుకు వచ్చింది.ప్రధానంగా అభివ్యక్తికి సంబంధించి శివారెడ్ది,అజంతా.మో దాకా అనేక దశల్లో వృద్దిచెందుతూ వచ్చింది.దీనికి ప్రాచ్య ,పాశ్చాత్య దేశాలనుంచి వచ్చిన కవితా మార్గాల ప్రభావమూ ఒక కారణం కావచ్చు.

  1966 లో ఫ్రాన్స్ లోవచ్చిన వినిర్మాణం కవితా నిర్మాణంలో మార్పులు తెచ్చింది.ఈ లక్షణాలలో ఒకటి గమనించ దగ్గది.ప్రధానంగా భాషకి అస్థిరత్వం ఎక్కువని,ఖచ్చితత్వం,సత్యం పేరుతో నిర్దిష్ట అర్థాల్ని(క్రమాన్ని)వెదక డాన్ని వ్యతిరేకించింది.

  పై కవిత ఆకోవలోకి వస్తుంది..కొన్ని సార్లు సాధారణ వాక్యానికి దూరంగా వాక్యాలు కొత్త రూపంలో నిర్మించబడుతాయి.

  ఈ కవిత జీవితం,వ్యసనం,పర్యవసానాలను గురించి మాట్లాడింది.

  వినిర్మాణాన్ని తలపించే వాక్యాలు.

  “వెంట్రుకలకి వేళాడుతోన్న కొబ్బరినూనె అంటిన దిండు చెబితే తప్ప”

  ఓ పడగ్గది దృశ్యాన్ని చిత్రించాడుకవి.సాధారణంగా”పడగ్గదిలో దిండుకి కొబ్బరినూనె,వెంట్రుకలు ఉంటాయి.దీన్నే కవి చిత్రించాడు.”-మరో రెండు

  “నిశాచరుడవై నషా నిషాదపు బి ఫ్లాట్ గొంతులో దూరదాం”
  ‘సముద్రాలు పీపాల్దాగి ఆకశమ్మీదికి
  మూత్రిస్తుంటాయి”-ఇలాంటివి చాలా వాక్యాలున్నాయి.వీటిని వ్యాఖ్యానించడం అవసరంలేదనుకుంటాను.

  నిజానికి కవిత్వం సాధారణ కవిత్వం వలే స్పష్టమైంది కాదని అర్థమవుతూనే వుంది.

  కవిరాసిన”హత్యించు””మూత్రించు””పునర్జన్మిస్తాను”వంటివాటికి వ్యాకరణ సిద్దతలేదు.కాని ఈప్రయోగాలు ఈ కవినించే మొదలు కాలేదు.చలం గారూ”స్నానించి” లాంటి ప్రయోగాలు చేసారు.చేస్తో,పోతో-లాంటివి కూడా ఆయన భాషలో సహజంగా కనిపించాయి.(వీటినీ వ్యతిరేకించిన వారున్నారు-భద్రి రాజుగారు చలానికన్న భాషవిషయంలో విశ్వనాథకే ఎక్కువ మార్కులు వేస్తానన్నారని విశ్లేషకుల మాట.ఇప్పుడు వీటినీ ఒక సంప్రదాయంలా పాటించే వారున్నారు.)వొక ,వొచ్చిన లాంటివి ఇప్పుడు బాగ వాడుక లో ఉన్నాయి.

  ఇది కవిని సమర్థించడానికి కాదు.కవిత్వంలోని అనేక మార్గాలని ఆహ్వానించినపుడు ఈ ప్రయోగాన్ని ఎందుకు తప్పు పట్టటమా ?అని..

 8. aruna naarada bhatla says:

  భావవ్యక్తీకరణ!దైనందిన జీవితంలో ఆధునికత ఎంత ముందుకు వెళ్లిందో,ఆలోచనలూ అంతకు వందరెట్లు ముందుకు వెళ్లాయి.అలానే కవిత్వంలో కూడా.వ్యక్తపరిచే విధానం అందరిదీ ఒకేలా ఉండాలనీ లేదు. కవి ఓ భిన్నమైన ధోరణిలో జీవితాన్ని చిత్రించారు.

 9. balasudhakarmouli says:

  సాధన నుంచి మంచి కవిత్వం జనిస్తుంది.
  కవిత్వ వ్యక్తీకరణకు ఇంగ్లీష్ పేరు అయితేనే బాగుంటుందని అనుకున్నప్పుడు- అలా పెట్టడం తప్పులేదే..
  వొక్కో కవికి వొక్కో పరిభాష వుంటుంది- లేకపోతే కొత్తని శోధించే ప్రయత్నంలో కొత్త భాష పుట్టుకొస్తుంది. సృజనశీలి అన్వేషకుడు కూడా కదా……
  వొక ప్రయత్నాన్ని అభినందించడము …… గొప్ప విషయం…… చలంగారు- స్నానించు అని అన్నారు – హత్యించు పదంలో నాకైతే – అర్థమవకుండా పోయినదేమీ లేదు… చక్కగా అర్థమైంది. ఈ పదాన్ని గతంలో కూడా చదివాను…..

  ”‘కూడు తిను’ అని అనటానికి ‘కూడు చేయు’ అనటానికి మధ్య ఎంత తేడా ఉందన్నది నేను ప్రత్యేకంగా చెప్పాలా?! ఇకనుండి ఇదే విశాలభావాన్ని అలవర్చుకుని వంటించు (వంటచేయు) శుభ్రించు (శుభ్రముచేయు) అన్నించు (అన్నము తిను) ఇలాంటి క్రియాపదాలు వాడేసుకుందాం! ఎక్కడన్నా తెలుగుకు ఊపిరందుతుందేమో అది కూడా అందకుండా పీకనొక్కేస్తే ఒక పనైపోతుంది. అటు రాసేవారికీ, ఇటు చదివేవారికీ బోల్డంత ప్రశాంతత”
  – అచంగ గారు…. రాసినది…..

  – నేను అనుకుంటున్నా …. ఈ కవిత రాసిన కవి- వంటించు, అనించు అనే పదాలను జన్మలో వాడరు….. ‘హత్యించు’కు ఆ పదాలకు చాలా తేడా వుంది.
  -కవి తెలుగు భాష పీకనొక్కేసే పనేమీ చేయలేదు… వంటించు, అన్నించు అంటేనే పీకనొక్కినట్లూ…. కవి ఆ పదాలను వాడలేదు…
  -తన నేపథ్యం నుంచి వొక పోయెం బయటకు వొచ్చింది- నేపథ్యాన్ని చిద్రం చేసుకోవాలా…….? పోయెట్ – తన నేపథ్యం నుంచే విశాలతను సంతరించుకుంటాడు ….. ఈ కవిత రాసిన కవి – ఇప్పుడు అదే పనిలో వున్నారు…..
  -కవికి నా అభినందనలు……

 10. balasudhakarmouli says:

  వొక , వొచ్చిన అంటే – భాష సామాన్యీకరించబడటమే…….. నేను మాట్లాడేటప్పుడు- నా నోటి వెంబటి ఒక, వచ్చిన అని రాదు- వొక, వొచ్చిన అనే వస్తుంది…. నేను అవే వాడతాను……… వాడుక మంచికే అయినప్పుడు తప్పు ఎందుకవుతాది. ?….

  నారాయణ శర్మ గారు- చాలా బాగా చెప్పారు …….

 11. కవిత్వం రాసేటప్పుడు, పనిని సూచించే ప్రతి నామవాచక పదాన్నీ క్రియాపదంగా మార్పు చేసి, దానికి కవితా స్పర్శను కలిగించలేము. వంట అనేది అచ్చతెలుగు పదం. వంటించు అనటం ద్వారా ఏ రకమైన అదనపు అందాన్నీ సాధించలేము. అన్నం సంస్కృత సమ శబ్దమే. అయినప్పటికీ ‘అన్నించు’ కూడా చప్పగానే ఉంటుంది. స్నానించు, యాత్రించు – ఇటువంటి ప్రయోగాల ద్వారా కొంత అదనపు శోభ చేకూరుతుంది. కానీ అట్లా అనుకోవడం కేవలం సబ్జెక్టివ్ ఊహ మాత్రమే అని ఎవరన్నా అంటే ఏమీ చెప్పలేము. ఇక తెలుగు కవితలో ఆంగ్లపదాల విషయమూ అంతే. ఒక అదనపు అందాన్ని చేకూర్చటానికో, ప్రత్యేకమైన ప్రభావాన్ని సాధించడానికో అనివార్యమైనప్పుడు తప్ప ఆంగ్లపదాలను ఉపయోగించే అవసరం లేదని నా అభిప్రాయం. ఫోర్త్ పర్సన్ సింగ్యులర్, ఇన్ క్రెడిబుల్ గాడెస్, హేంగ్ మి క్విక్ – మొదలైన శీర్షికల్ని తెలుగులో అదే భావంతో అంతకంటె బాగా రూపొందించలేము కనుక అవి O.K.. ‘డివైన్ కామెడీ’ని ప్రభావం తగ్గకుండా తెలుగులో అనువదించలేమా? ఆలోచించాలి. మొత్తానికి ఇటువంటి చర్చ జరగడం మంచిదే. అయితే అభిప్రాయాల్ని వెలిబుచ్చేటప్పుడు సంయమనం పాటించడం చాలా అవసరం. ఇప్పటివరకు ఈ కవిత గురించి తమ అభిప్రాయాల్ని వ్యక్తీకరించినవాళ్లు సంయమనాన్ని తప్పకపోవటం సంతోషించతగిన విషయం.

 12. సారీ,ఈ కవిత పేరు డివైన్ ట్రాజెడీ, డివైన్ కామెడీ కాదు. టైప్ చేసేటప్పుడు తొందరపాటులో పొరపాటు జరిగినందుకు చింతిస్తున్నాను.

 13. ఎందుకనో వంశీ గారు ఎక్కువ కవితలు ఇలానే రాయడానికి ఇష్టపడతారు,.. గత కవితలు చదివితే ఇంతకంటే భిన్నంగా వుండవు,. మొట్టమొదట్లో రాసినవి తప్ప,.. కొన్ని వింత పదాల కలయికలోని అస్పష్టతకు,. ఎక్కువ మంది నుంచి ఆదరణ, గుర్తింపు లభించండం ఒక కారణమేమో అనిపిస్తుంది,. ఏదేమైనా తన పంథాలో రాసుకువెళ్తున్నందుకు,. అభినందనలు.

 14. రవి వీరెల్లి says:

  వంశీ,
  పోయెమ్ బాగుంది.

  “కాలం మరణం నేనూ
  మూడుముక్కలాడుతుంటాం మాడు ముక్కలయ్యేదాకా” బాగుంది.

  ఆరవ పాదం ఇంకా నచ్చింది.

  రవి

మీ మాటలు

*