కలలు కావాలి జీవితం దున్నడానికి…!

“కళ్ళు తుడుస్తాయి కమలాలు వికసిస్తాయి మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా”- కవిత్వాన్ని ఒక ఉత్సవంగా పాడుకునే గజల్ సంస్కృతిని అమితంగా ఆరాధించే గుంటూరు శేషేంద్ర శర్మ గారి వాక్యాల్లో ఆ సౌకుమార్యం, అత్తరు సౌరభాల సంగీతం గుభాళిస్తూ ఉంటాయి. వసంతం వాసనేస్తే ఉండబట్టలేని నవకోకిలలా జీవన తరుశాఖల్లో తియ్యని రాగాల్ని ఒలకడమే ఈయన కవిత్వ లక్షణంగా కనపడుతుంది. పువ్వునీ శిల్పాన్నీ దారంతో కలిపి ఇల్లు అల్లుకునే సాలెపురుగు లోని ప్రజ్ఞ ఈయన కవితా వైవిధ్యంలో గోచరిస్తుంది.

నిశ్శబ్ధమైన తోట మానసిక ఆవరణంగా, అక్కడి కొమ్మలపైని పక్షి పాడుకునే పాటలు భావోద్వేగాలకు ప్రతీకలుగా, పక్షి ఉత్సాహ ,విశ్రాంత, విషాద అనుభూతులకు సంకేతంగా- ఇవే చిహ్నాలు ఎన్నో సందర్భాల్లోని సంఘటనలకు రూపాంతరాలుగా మారి అంతస్సూత్రంగా కనిపిస్తుంటాయి శేషేంద్ర కవితా ఇతివృత్తాల్లో. మరికొన్ని చోట్ల అదే తోట స్థబ్ధమయ్యి, నిర్లిప్తమయి “గాలితో కుట్ర చేసి ఒక్కో పరిమళం/ ఒక్కో గడిచిపోయిన దూరదూర జీవితదృశ్యాన్ని” ఆవిష్కరిస్తుంటే “గుండెనరాల్ని తెంపే/ఆ క్రూరమైన పక్షుల గానస్వరాలకు” తట్టుకోలేక తల్లడిల్లే స్వాప్నికుడు ఎదురవుతాడు. అటువంటి కలవరపాటు కవి సమయాల్లో వెలువడ్ద ఒక కవితలోని పంక్తులు ఇవి;

 

గడియారంలో కాలం

                                        -గుంటూరు శేషేంద్ర శర్మ

అందరూ నిద్రపోయారు

గడియారాన్ని ఒంటరిగా విడిచిపెట్టి…

భయంతో కొట్టుకుంటోంది దాని గుండె-

మొరుగుతూ ఉంది ఒక కుక్కలా దూరాన

దిగంత రేఖ

ప్రార్ధిస్తోంది రాత్రి మైదానాల్లో మోకరించి

 

భూదృశ్యాలూ సముద్రదృశ్యాలూ

తపస్సులు చేస్తున్నాయి,

ఒక్క పాటకోసం బతుకు బతుకంతా సమర్పించిన

వాడెక్కడని

వాటికి గొంతులు ఇచ్చేవాడు వస్తాడనీ

మాటల దేశాల్లో వాటికి దేవాలయాలు కడతాడనీ

నిరీక్షిస్తున్నాయి.

 

తిరుగుబాట్లు లేస్తున్నాయి మనోమయలోకాల్లో

నిశ్శబ్ధాల గనుల్లో నా ఆత్మ సొరంగాలు తవ్వుతూ ఉంది

విలువైన రాళ్ళకోసం అన్వేషిస్తూ-

ఆకాశాన్ని చూస్తుంది రెక్కలు విప్పి

నా కిటికీ…

 

వలలు కావాలి సముద్రం దున్నడానికి

పడవ భుజాన వేసుకున్నవాడికి

కలలు కావాలి జీవితం దున్నడానికి

గొడవలు భుజాన వేసుకున్నవాడికి

విలవిల కొట్టుకుంటున్నాను నీళ్ళు కోల్పోయిన చేపలా

కలలు కోల్పోయిన నేను-

—-

87648618-seshendrasharma-the

జీవన సంరంభానికి కాసేపు విరామమిచ్చి లోకమంతా చీకటి పక్కపై ఒత్తిగిల్లింది.  అరక్షణమైనా ఆగడానికి వీల్లేని కాలం మాత్రం వేకువ కోసం ఎదురు చూస్తూ రాత్రంతా ఒంటరితనపు భయాన్ని పోగొట్టుకునేందుకు గుసగుసగా లోపలెక్కడో చెప్పుకునే మాటల శబ్ధంలా- గడియారపు ముళ్ళు నిద్రల్లో, నిశీధిలో నిర్విరామంగా కాలం గుండెచప్పుడులా మోగుతూ ఉన్న సమయం. దిక్కులన్నీ భూమికి అవతల కాంతి వలయాల్లో కలుసుకునే చోట- ఎత్తునుంచీ, దూరాన్నుంచీ వేర్వేరు రూపాలుగా కనపడుతున్న భూభాగాలని చూసి వాటికన్నిటికీ కలిపి ఒకే అర్ధం ఇవ్వలేక, ఒక వృత్తంలో చుట్టెయ్యలేక నిరాశ పడుతుంది దిగంతరేఖ.

  సడి లేని వేళ అనువు చుసుకుని తపస్సుకి సిద్ధమౌతాయి మైదానాలు, సముద్రాలు, పర్వతాలు అన్నీ ఒక రససిద్ధి కోసం. దృశ్యాలుగా వాటికో సవర్ణమైన ప్రతిబింబాన్నిచ్చే కుంచెకోసమో, మాటలుగా పాడే కవి కోసమో. జీవితాన్ని త్యజించి రాత్రులని ఒత్తులుగా చేసి కలలని వెలిగించుకున్న సాహసి కోసమో, “ఒక్క పాటకోసంబతుకు బతుకంతా సమర్పించిన” స్వాప్నికుడి కోసం రాత్రులు మైదానాల్లో సాష్టాంగపడి ప్రార్ధిస్తూ ఉంటాయి.

నడక విసుగెత్తిన కాళ్ళు మజిలీ కోసం మొరాయిస్తే అలసట లేని ప్రయాణదాహం రెక్కల మొలిపించుకొమ్మంటుంది. కిటికీ రెక్కలు తెరుచుకుని పక్షిలా ఎప్పుడూ ఒకేదూరం నుండి ఆకాశాన్ని చూస్తూ ఏమని ఆశపడుతుందో తెలీదు. ఈ వేగం చాలదని, ఈ దారి మార్చమనీ, అమూల్యమైనవి సాధించుకోవడం కోసం గొంతు పెకల్చుకొమ్మని, నీ ఆశల్ని చెప్పెయ్యగల ఒకే ఒక్క మాటను సంపాదించుకొమ్మనీ మనసు తిరుగుబాటు మొదలు పెట్టింది. ఏకాంతం కుదిరిన కొన్ని అరుదైన క్షణాల్లోనే వెతుక్కోవలసిన లోపలి నిధులకోసం నిశ్శబ్ధాన్ని పొరలుగా పెకలించుకుంటూ మూలాలకి చేరుకున్నప్పుడు దొరకబోయే రాళ్లలో రత్నాలెన్నో అన్న ఆరాటంతో “ఆత్మ సొరంగాలు తవ్వుతూ ఉంది.”

అలలపైన తేలడమే బతుకైన వాడికి పడవ మోస్తున్న తన బరువుని బాధ్యత రూపంలో పడవతో పాటుగా తిరిగి తన భుజాలపైకి ఎత్తుకోక తప్పదు. ఉప్పునీటిని వడకట్టేసి  సముద్రసంపదని వెలికి తీసుకొచ్చే వలల్లాగే గొడవల్ని, అసంతృప్తుల్నీ అసాధ్యాల్నీ నీళ్లలా జార్చేసి సౌందర్యాన్ని, సంతోషాన్నీ మాత్రమే మిగిల్చి చూపించగల కలలూ అవసరమే “జీవితం దున్నడానికి గొడవలు భుజాన వేసుకున్నవాడికి”. గడియారంలోని కాలంలా వాస్తవాల్లో బందీ అయి అదే వృత్తంలో తిరగడం తప్పనిసరి అయినప్పుడు, ఒక లిప్తపాటు ఆ భ్రమణం నుంచి తప్పించుకుని కలల ఆకాశాల్లో ఎగిరిపోవాలనే కవి తపన ఈ కవితలో వ్యక్తమౌతుంది.

 

                                                                                                       —–**—-                                                    1swatikumari-226x300—స్వాతి కుమారి

 

మీ మాటలు

  1. Mangu Siva Ram Prasad says:

    “వలలు కావాలి సముద్రం దున్నడానికి/ పడవ భుజాన వేసుకున్నవాడికి/ కలలు కావాలి జీవితం దున్నడానికి/
    గొడవలు భుజాన వేసుకున్నవాడికి” అనేవి వెంటాడే వాక్యాలు. బరువు బాధ్యతలు మోసేవారికి ‘వలలు’ ‘కలలు’ జీవిత వాస్తవికతలోని సౌందర్య రేఖను దర్శింప జేస్తాయి. జీవిత చక్రభ్రమణంనుంచి విముక్తి పొంది స్వేచ్చగా పక్షిలా గగన వీధిలో విహరించాలనే కవి ఆకాంక్ష శేషేంద్ర శర్మ గారి కవితలోఅభివ్యక్త మౌతూంది. భావ చిత్రాలను కవితలో పొదగడంలో శేషేంద్ర శర్మ గారి ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమైనది.

  2. ” ఒక్క పాటకోసం బతుకు బతుకంతా సమర్పించిన వాడెక్కడని వాటికి గొంతులు ఇచ్చేవాడు వస్తాడనీ ..” చాలా బాగా వ్రాసారు స్వాతీ గారు , ఇంకాస్త , ఇంకాసేపు మీ మాటల్లోనే చదవాలనిపించింది !!

మీ మాటలు

*