Hypothesis

  సరళమైన వాక్యం, లోతైన భావం ఆర్.దమయంతి సొంతం. పుట్టి పెరిగింది బందరులో… స్థిరపడింది హైదరాబాద్ లో. కొన్ని ప్రముఖ వారపత్రికల్లో ఉపసంపాదకురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు అరవైదాక కథలు, వందకు పైగా కవితలు  రాశారు. ఈమె కథలకు వివిధ పత్రికల్లో బహుమతులు వచ్చాయి.  “గుండెమీద రాయి” అనే కథకు రంజని అవార్డు అందుకున్నారు.  తన అభిమాన కవి, కథకుడు తిలక్ అని చెబుతారు దమయంతి.

-వేంపల్లె షరీఫ్
     ***
images
 
“ఏమిటీ? స్నేహ   పెళ్లికెళ్తున్నావా?” – ఫోన్లో సూటిగా అడిగింది రాజీ.ఇప్పటికిలా అది  అడగడం ఎన్నో సారో తెలీదు కానీ, అడిగినప్పుడలా మౌనాన్నే ఆశ్ర యించాల్సిన  పరిస్థితి   నాది!స్నేహ – మా ఇద్దరికి స్నేహితురాలే ఐనా, రాజీ తో కంటేనూ, నాతోనే ఎక్కువ స్నేహం గా వుంటుంది.రోజుకో సారైనా ఫోన్ చేసుకోకుండా, మాట్లాడుకోకుండా వుండలేనంత క్లోజ్
ఫ్రెం డ్స్ మి .. మేము.అలాటి స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళ కుండా ఎలా వుంటం?కానీ, రాజీ  – “వొద్దంటోంది”.వెళ్తే కలిగే నష్టాలు, పరిణామాలు చెబుతూ నన్ను భయపెడుతోంది. వెన్ను జలదరించే నిజాలు చెబుతూ..నా చేత వెనకడుగు వేయిస్తోంది.రాజీ! – ఒక మామూలు గృహిణి.   ‘దాని మొహం. దానికేం తెలుసు. పెద్ద లోక జ్ఞానం లేని మనిషి ‘ అని అనుకున్నా ఇన్నాళ్ళు.  కానీ, నా  అంచనాలన్నిట్నీ తారు మారు చేస్తూ, తనెంత గొప్ప  లోక జ్ఞానూ నాకు తెల్సిచ్చేలా మాట్లాడుతోంది.లేక పోతే ఏమిటీ! రోజూ వార్తా విశేషాలు కోసం డేగ కళ్ళేసుకుని చూస్తూ, అన్ని మూలల సమాచారాల్ని ఆంగ్లం లోంచి  తెలుగులోకి తర్జుమా చేసుకుంటూ..,  వార్తా కథనానికి   ఏ విషయం దొరుకుతుందా   అని  నిరంతరం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే నాకు సైతం తట్టని పాయింట్,  దానికెలా తట్టినట్టు?  నా  కళ్ళకి కనబడని  ఆ ప్రమాదపు అంచు రాజీ కి మాత్రమే ఎలా క నిపించినట్టు?  – ఖిన్నురాల్నై పోతున్నా!

అందుకే అంటారు.  చదువుకున్న ప్రతి  వెధవాయికీ, లోకం తీరు తెలీదని, బ్రతకడం రాదనీనూ.

మనిషి వేరు. ఆర్జించే జ్ఞానం వేరు.  మెదడు వేరు. మనసు వేరు. ప్రతిభ వేరు. లౌక్యం వేరు. అన్నీ వేర్వేరు శాఖలే అయినప్పటికీ, వీటన్నిట్నీ  కలిపి మోసే  వృక్ష కాండం మాత్రం ఒకటి కాదు అనిపిస్తుంది.

అంత బాధ లోనూ, నా విశ్లేషణకి  నాకే నవ్వొచ్చింది.

“ఏంటీ, చెప్పవూ?వెళ్తున్నావా?, లేదా?” – విస్సురుగా అడిగింది, మళ్ళీ. ఏం  చెప్పాలో తెలీని దాన్లా అన్నాను. “కాస్త ఆలోచించుకోనీ, రాజీ!,.. చెబుతాను.” అన్నాను నిదానం గా.

అవతల  ఠపీమని ఫోన్ పెట్టేసిన చప్పుడైంది.

రాజీ కోపం నా మీద కాదు. నాకా సంగతి తెలుసు. పూర్తిగా తెలుసు. ఆ మాట కొస్తే దానిదసలు   కోపమే కాదు. ఆవేదనై వుండొచ్చు.

కారణమేమిటంటే…స్నేహ  ఈ పెళ్ళి  చేసుకోవడం రాజీ కి ఇష్టం లేదు.

” నేను ఖాయం గా వెళ్ళడం లేదు. నువ్వూ వెళ్ళకు. ఏం? సరేనా?  ” -ఇందాకటి రాజీ మాటలు  పదే పదే గింగురుమంటున్నాయి చెవిలో.

ఈ క్షణం దాకా,  స్నేహ పెళ్ళికి వెళ్దామనుకున్న నా ప్రయత్నానికి , రాజీ వైల్డ్ వివరణ తో – ‘ఐతే, వొద్దా, వెళ్లొద్దా!” అనే సంశయావస్థలో పడేసాయి.ఇంతకీ  వెళ్ళా లా వద్దా అని  నిర్ధారించుకోడానికి ముందుగా…

నేను – నా    స్నేహ మయిని  మొదట్నించి చదవడానికి సిధ్ధమయ్యాను.

నా ప్రమేయం లేకుండానే…స్నేహ నా ఆలోచనా  తరంగాల మీద నవ్వుతూ ముత్యం  పూసలా  కనిపిస్తోంది.

 

***

మేం ముగ్గురం ప్రాణ స్నేహితులం.

చిన్నపట్నించి కలసి మెలసి చదువుకున్నాం.  ఎక్కడికంటే అక్కడికీ ముగ్గురం గుంపుగా వెళ్ళే వాళ్ళం. మమ్మల్ని చూసి, ముగ్గురమ్మాయిలు అనీ,  ముగ్గురమ్మలనీ, రంభ ఊర్వశీ,  మేనక లనీ ఇలా పెట్టుడు పేర్లెట్టి పిలుచుకునే వాళ్ళు, చూసినవాళ్ళు.

డిగ్రీ వరకు మమ్మల్ని విడదీసిన వాళ్ళే లేరు. నిరంతరం గా సాగి పోయిన స్నేహం…డిగ్రీ కాగానే జీవన దారులు వేరయ్యాయి.

రాజీ కి పెళ్ళి కుదిరింది. అత్తారింటికెళ్ళిపోయింది.

నేను జర్నలిజం లోకి దూకాను. పత్రికాఫీసులో ట్రైనీ గా చేరి!

స్నేహ  – లా చదవడం కోసం.. యు.కె. కెళ్ళి పోయింది.

రాజీ పూర్తిగా గృహిణి పాత్రలో ఐక్యమై  పోయింది. ఇప్పుడు దాని లోకమే వేరు.

నేనైతే, నేనేమో నా పుస్తకాలేమో! న్యూస్ అందిపుచ్చుకోవడం, తెలుగు లోకి తర్జుమా చేస్తూ .. భాషతో తర్జన భజనలు  పడటం,    మరో పక్క  జర్న లిజం  పీజీ డిప్లొమా కోసం  ఈవినింగ్ కాలేజ్ కెళ్ళి, రాత్రికింటికి చేరడం.. ఇలా క్షణం తీరిక లేకుండా గడచిపోయేది.  రోజుకి ఇరవై నాలుగ్గంటలేం సరిపోవనిపించేలా!

స్నేహ రోజూ   నెట్ చాట్ లో కొచ్చేది.  ఈ మెయిల్స్ సరే సరి.   స్కైప్ లో ఎదురైతే, గంటలై పోయేవి. మాటలు, పాటలు, జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకునే  వాళ్ళం.

మా ఇద్దరి అభిరుచులు కామన్ గా వుంటం వల్ల, ఎంత సేపైనా, బోర్ అనేది వుండేది కాదు.

రాజీ కి కూడ స్నేహ  ఫోన్ చేసేది తప్ప, ఇన్ని మాటలు  కుదిరేవి కావు. కారణం, రాజీ కి అత్త గారింట్లో అంత స్వేచ్చ లేక పోవడం వల్ల!

అందు వల్ల, స్నేహ నాతోనే ఎక్కువ గా  మాట్లాడుతూ వుండేది. అలా చనువు పెరిగి, స్నేహం ఇంతకి మరింతైంది.

మా మాటల్లో ఎక్కువగా ప్రపంచ విషయాలు, జరిగే వింతలే వుండేవి. పుస్తకాలు, ప్రజలు,  ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ ఎవరెవరున్నారనే సంగతులే దొర్లేవి.

ఇంతలో..నా డిప్లొమా పూర్తి కావడం, ఉద్యోగం కన్ ఫార్మ్  అవడం, ప్రొఫెషన్ పట్ల మరింత బాధ్యత పెరగడం జరిగింది.

స్నేహ చదువు పూర్తి చేసుకుని, హైదరా బాద్ కొచ్చేసింది. ఓ ప్రముఖ న్యాయ వాది దగ్గర అసిస్టెంట్ గా చేరింది.

వచ్చాక కూడ స్నేహ నన్నే ఎక్కువ గా కలుస్తూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణాలు రెండు.

ఒకటి – అది రోజూ వచ్చే  కోర్ట్ కి దగ్గరలోనే మా పత్రికాఫీసు వుండటం.

రెండు – రాజీ మాటల ధోరణి దానికంత రుచించక పోవడం.

“రాజీ ఏమిటే, అలా మాట్లాడుతుంది!?” అంటున్న స్నేహ మాటలకి నవ్వి వూరుకునే దాన్ని.

తూనీగ ల్లాంటి  ఆడ పిల్లలు పెళ్ళయ్యాక ఇంటి ఈగలౌతారని విన్లేదెమో తను బహుశా!

స్త్రీ ల కి వివాహనంతరం జీవితం అంటే –  భర్తా, ఇల్లూ, పిల్లలు. బస్! ఇక ఆ ప్రంపంచం లోనే తిరగాడుతూ పోతారు.  కాపురం లో ఏ చిన్న  సమస్య వచ్చినా, ‘ ఇంకేముంది, ఇహ జీవితం ఐపోయింది,’ అని అల్లకల్లోలమై పోతుంటారు.  రాజీ కూడా అంతే.

అందుకే, స్త్రీలు నిరంతరం – తమ సంసారాలు చల్ల గా వుండాలని, సాఫీగా సాగాలని నోములు వ్రతాలు  చేస్తారు కాబోలు!

నాకు రాజీ గుర్తుకొచ్చినప్పుడలా, తులసి కోట దగ్గర నిత్య పూజలు చేసే అమ్మే  గుర్తుకొచ్చేది.

స్నేహ బోర్ గా వుందని పిలిస్తే వెళ్ళే దాన్ని. బ్రిటిష్ లైబ్రరీ కెళ్ళి కొత్త బుక్స్ చూడటం, టాంక్ బండ్ కెళ్ళి సాయాంకాలాలు చల్ల గాలి లో నడవడం, ఐ మాక్స్ కెళ్ళి సినిమా చూడటం, అట్నించటే రెస్టారెంట్ కెళ్ళి డిన్నర్లు చేయడం..అలా  గడిచిపోయేది కాలం.

మేమిద్దరం కలిస్తే, గంటలు క్షణాల్లా గడిచేవి.

రాజీ తో మేము కలిసినప్పుడు, స్నేహ – ఏం మాట్లాడాలో తెలీని దాన్లా  కొంత ఖాళీ గా చూస్తూ వుండేది. అప్పుడప్పుడు, చేతి గడి యారం వంక చూసుకోవడాన్ని నేను కనిపెట్టాను.

ఒక వయసొచ్చాక, ఒక వ్యక్తిత్వానికి అలవాటు పడ్డాక కొంతమంది –  అన్ని పర్సనాలిటీలతోనూ కాలాన్ని గడపలేరేమో! – మనమెవరితో నైనా మాట్లాడుతున్నప్పుడు సమయం వృధా అవుతోందేమో అని బాధ పడుతున్నామూ అంటే, ఖచ్చితం గా వాళ్ళు మన హృదయానికి దగ్గర గా లేరనే  అర్ధం.

ఈ సూత్రం స్నేహితులకు  మాత్రమే వర్తించదు.    ఒక్కో సారి తల్లి తండ్రుల మాటలు కూడా చాలా మందికి చాదస్తం గా,  అనిపిస్తాయంటే దీర్ఘం గా ఒక గంట పాటైనా గడపలేరంటే, అబధ్ధం కాదు.

అలా అని… విరోధ భావమేం  వుండదు. కానీ, వాళ్ళ సమక్షం లో దీర్ఘ కాలాన్ని వెచ్చించలేరు. ఇలాంటి పరిస్థితులే కమ్యూనికేషన్ గాప్ కి దారి తీస్తాయి. మనిషికీ మనిషికీ మధ్య ఆంతర్యాలు ఏర్పడి   పోతాయి. ఆంతకంతకీ ఒకరి కొకరు దూరమై పోతుంటారు. కాల క్రమేణా  ఆ ఇద్దరి మధ్య మాటలు కరువౌడానికి ఫెద్ద కారణాలేవీ కనిపించవు.

ఇక్కడ పిటీ ఏమిటంటే, రాజీ కి అర్ధం కాని స్నేహ, నాకర్ధమౌతోంది. అదే నా బాధ.

ఇలా మనుషుల్ని చదివే  సెన్స్ నాకున్నందుకు సంతోషమే కానీ, అప్పుడప్పుడు ఎవరికీ అర్ధం కాని వారు, నాకు మాత్రమే అర్ధమౌడం వల్ల కలిగే కష్టాలు ఇలా ఒక విపరీతానికి దారి  తీస్తుందని  నాకప్పుడు కాదు,… ఆ తర్వాత కానీ తెలియ లేదు.  ఎప్పుడంటే..

ఓ రోజు, హఠాత్తుగా రాజీ ఫోన్ చేసి, చాలా ఆత్రపడిపోతూ  ఓ సమాచారాన్ని అందించింది. ” ఇదిగో, నీ కో మాట చెప్పాలి. రాత్రి రెస్టారెంట్  లో మా ఆయనకి  స్నేహ కనిపించిందిట. ఒక్కత్తే కాదు.  పక్కనే ఎవరో ఒకతనున్నాడుట.  ‘వాళ్లిద్దరి తీరు చూస్తుంటే, స్నేహితుల్లా లేరు. ‘  అని అన్నారాయన.  ఓ సారి కనుక్కో! దాన్ని. అతనెవరూ, ఏమిటీ అని.” అంటూ ఆరిందాలా మాట్లాడింది.

దాని మాటలకి నవ్వొచ్చింది.

ఎంత స్నేహితురాలైతే మాత్రం అడుగుతామా?

నే విని వూరుకున్నా. రాజీ కి చెప్పలేదు కానీ, నేనూ ఓ  సారి చూసాను. ఐస్ క్రీం పార్లర్   కెళ్ళినప్పుడు  కనిపించింది.

అనుకోకుండా ఎదురవడంతో…నన్ను చూసి ఓ క్షణం పాటు తత్తర పడ్డా, ఆ వెనకే ఆనందపడిపోయింది.

మరు క్షణమే  తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేసింది. “ఈయన మోహన్! వీరి కంపెనీ లొనే నేను లీగల్ అడ్వైజర్ గా వున్నా..” అంటూ నవ్వింది. నవ్వుతూనే, మోహన్ వైపు తిరిగి..”నా క్లోజ్ ఫ్రెండ్ దామిని..జర్నలిస్ట్” అంటూ, పరిచయం చేసింది.

అతను నన్ను చూసి కూల్ గా నవ్వి, చేయి కలిపి,  ఆ మరు క్షణం లోనే  సెలవు తీసుకుంటూ.. కారు వైపు  నడిచాడు.

‘వస్తానంటూ ‘ ఆ వెనకే తనూ..  వేగంగా నడుచుకుంటూ, అతనితో కలసి   వెళ్లిపోయింది.

ఈ మధ్య తను పిచ్చ  బిజీ గా వున్నా నని వంకలు చెబుతూ నన్ను  తరచూ కలవలేక పోవడానికి గల కారణం ఏవిటో ఇప్పుడర్ధమై, లోలోనే నవ్వుకున్నా.

స్నేహ ప్రేమలో పడింది. ఖచ్చితం గా పడింది. అంత గట్టిగా ఎలా చెబుతున్నానంటే..

మోహన్ని  పరిచయం చేస్తున్నప్పుడు..ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపు..చెంపల మీద పరుచుకోవడాన్ని, రెప్ప పాటు  వేగం లో అర లిప్త కాలం లో పట్టేసుకున్నా.

ప్రేమ అనేది  హృదయ రహస్యమే. కానీ, అప్పుడప్పుడు కళ్ళ లోంచి తొంగి చూసే సంతోష వెన్నెల తరంగం కాదూ!

అతను కేవలం స్నేహకి  యజమాని మాత్రమే కాదు అన్న సంగతి  తనిట్టే పసి గట్టేసింది.

ఇద్దరిలోనూ తొట్రుపాటు తనాన్ని కూడా కనిపెట్టింది. కాని, ఇగ్నోర్ కొట్టేసింది. ఎందుకంటే..అప్పటికి తనకీ నిజం తెలీదు. కనీసం ఊహించనైనా ఊహించలేదు.

ఆస్థి అంతస్తుల మాటెలా వున్నా, ఇద్దరూ మేడ్ ఫర్ ఈచదర్ లా వున్నారు’ అనుకుని,  తృప్తి పడింది.

స్నేహ తన  ప్రేమ  విషయాన్ని నా దగ్గర దాచిందని కానీ, ఈ  వార్తని   వెంటనే రాజీ కి చేరేయాలని  కానీ తనెప్పుడూ అనుకోలేదు.

ప్రేమ, పెళ్లి అనేవి ఆ వ్యక్తుల స్వవిషయాలు. పూర్తిగా వ్యక్తిగతాలు. వారంతట వారు చెబితే మనం తెలుసుకోవాలి కానీ, ఆరాలు తీసి, ప్రాణాలు తోడేయ కూడదు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఐనా, మన పరిధులు మనకున్నప్పుడే, అవతల వారికి మన స్నేహం మీద ప్రేమ, గౌరవం పెరుగుతుంది. కాదు, రెట్టింపౌతుంది.

ఆ సంఘటన తర్వాత, స్నేహ మోహన్ ప్రసక్తి ని ఎక్కడా తీసుకొచ్చేది కాదు.   సస్పెన్స్ భరించ లేక,  ఒకటికి పది సార్లు ముందూ వెనకా ఆలోచించుకుంటూ   అడిగే దాన్ని.  “ మోహన్ కంపెనీ లోనే కంటిన్యూ అవుతున్నావా?” అంటూ.

ఆ పేరు వింటూనే ఉలిక్కిపడేది.  సిగ్గుపడ్డ   చెంపలూ..దొరికిపోయేవి.

జవాబు చెప్పకుండా దాటేసేది.  తనేం విననిదాన్లా..మరో టాపిక్ లోకి తీసుకెళ్ళేది, తెలివిగా.

మనసులోనే నవ్వుకుని ఊరుకున్నా. మరిక రెట్టించలేదు.

ఎప్పుడో ఒక రోజు, చెబుతుందిలే శుభ వార్త అనుకున్నా.

కానీ , ఆమెని ఒక శోక సముద్రం లా చూస్తానని కలలో కూడా అనుకోలేదు.

 

***

ఆ  రోజు సాయంత్రం దాటి, రాత్రౌతోంది. తలమునకలయ్యే   పనిలో.. సిటీ ఎడిషన్ క్లోజింగ్ లో, … చివరి నిమిషపు టెన్షన్ లో వున్నా..ఇంతలో స్నేహ ఫోన్ చేసింది.

“హలో”- అని  అనక ముందే..అవతల్నించి తను అందుకుంటూ..”నువ్వొక్కసారి రావూ?” అంటూ దుఖంతో అడిగింది.

వొణికిపోతున్న  ఆ కంఠాన్ని వింటూనే, కంగారు పడ్డాను. “ఏమీటీ? అంతా ఓకేనా?” అడిగాను.

“లేదు. ఐ యాం నాట్ ఓకే.. నీతో…చాలా చెప్పుకో..వా..లి..ప్లీజ్..” మాట్లాడలేకపోతోంది.

“ఎక్కడున్నావ్?” ఆత్రంగ  అడిగా.

తనెక్కడుందీ చెప్పింది. “ఐదు నిమిషాల్లో వచ్చేస్తా…  నువ్వక్కడే వుండు. డోంట్  వర్రీ..వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం..ఓకే?” అంటూ ఉద్వేగంగా చెప్పాను.

అన్నట్టు గానే, గబగబా, పని పూర్తి చేసుకుని, వేగంగా బయల్దేరి వెళ్ళాను.

లేక్ వ్యూ రెస్టారంట్ కి.

***

 నన్ను చూస్తూనే..చేతుల్లో ముఖం దాచుకుని భోరుమంది స్నేహ.

నాకేం అర్ధం కాలేదు. మౌనం గా, దాని కెదురు గా వున్న కుర్చీ లో కూర్చున్నా.

ఆమె ఎంతటి శోక సాగరమై  వుందంటే, ఆ  ఉధృతి  కి ఆమె  రెండు భుజాలు, వువ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలకు మల్లే కదులుతున్నాయి. మనిషంతా అల్ల కల్లోలమైన సముద్రం   లా విషాదమైపోయుంది.

ఏమని ఓదార్చ గలదు తను?

పరుగుల సం ద్రాన్ని  అడ్డుకునేందుకైతే  ఒడ్డు కావాలి కానీ, విరుచుకు పడుతున్న సునామీ కేమవసరం?

కష్టం లో వుంటే ఓదార్చొచ్చు. ముంపులో లో మునిగిన ఆమేకేం  పని   నా జాలి నిట్టూర్పుల తో !

అందుకే, నిశ్శబ్దం గా దాన్నే చూస్తూ..ఆలోచిస్తూ…గుండె దిటవు చేసుకుంటూ…అసలు కారణమేవిటో  తెల్సుకోవడం కోసం ఎదురుచూస్తూ…వున్నాను.

పది నిమిషాల దీర్ఘ కాలం తర్వాత,  దుఖాన్ని దిగమింగుకుంటూ…నిఠారు గా కూర్చుంది.

కర్చీఫ్ తో కళ్ళు, ముక్కూ తుడుచుకుంటూ..జుట్టు సరి చేసుకుంది.

నలిగిన దుస్తులు, చెదరిన జుట్టు, ఏడ్చి, ఏడ్చీ ఉబ్బిన కళ్ళు, పీక్కు పోయిన చెంపలు..ఇవన్నీ ఆమె మానసిక స్థితిని పట్టిస్తున్నాయి.

“ఏమిట్రా..ఏం జరిగింది?” అనునయం గా అడిగాను.

నా వైపు చూస్తూనే మరో సారి..ఏడ్చేసింది. ఏమైందీ? ఎందుకిలా అమితం గా దుఖిస్తోంది?

పొరబాటు జరిగాక, పశ్చాత్తాపం తో నలిగిపోతున్న మనిషి లా అయితే మాత్రం కనిపించడం లేదు.

ఒక వేళ, మోహన్ తో ప్రేమ వ్యవహారం కానీ, బెడిసి కొట్టిందా? మోస పోయిందా తను?

పెళ్ళి చేసుకుంటానని మాయ పుచ్చి గానీ..

ఊహు.

మోహన్! అలాంటి వాడు కాడని తనకొక గొప్ప నమ్మకం. అతన్ని దగ్గర్నించి చూసింది. అతని ముఖం లో కారెక్టర్ కొట్టుస్తూ కనిపించింది.  ఎంత మంది లో వున్నా, ఆ కూల్ మాన్ ని ఇట్టే గుర్తించేయొచ్చు.   మొదటి రోజు తను చూసినప్పుడు..ఆ  ఒక్క చూపులో నే తెల్సిపోయింది.

అతనలాంటి వాడు కాడు. పెళ్ళికి ముందు అతని వల్ల   మరో రకం గా   మోసపోయేంత చిన పిల్లేం  కాదు స్నేహ.

నిజానికి ఏ ప్రియురాలు, ప్రేమించిన వాడు మోసం చేసినందుకు ఏడ్వదు. తన గొప్ప నమ్మకాన్ని ఖూనీ చేసినందుకు, తనని నిర్జీవిని  చేసినందుకు ఏడుస్తుంది.

స్నేహ ది అలాటి బాధ కాదని తన మనసు చెబుతోంది. గట్టిగా చెబుతోంది.

కానీ, దాని సున్నిత మైన మనసుకి  పెద్ద  ఎదురు దెబ్బే తగిలింది.   బహుశా, ఎప్పటికీ కోలుకోలేనంత..గాయ పడి వుంటుందేమో!

ఇప్పుడు తను తీరిగ్గా ఆ గాయాలను పెకిలించి చూడటం అమానుషత్వమే అవుతుంది.

ఉధృత గాలి వాన లు తర్వాత, విరిగిన కొమ్మలు, చెదరి పడ్డ పక్షి గూళ్ళు వాటంత టవే బయట పడట్టు,  అన్ని విషయాలూ అదే  చెబుతుంది లే. ముందు తను కోలుకోనీ!  అని అనుకున్నా.

మధ్యలో  స్టువార్టొస్తే,   “రెండు పైనాపిల్ జూస్ ”  చెప్పి పంపాను.

తనని ఏదో ఒకటి మాట్లాడించడం కోసం అడిగాను.”అమ్మా నాన్న ఎలా వున్నారు?” అంటూ.

స్నేహ తలూపింది. బాగానే వున్నారన్నట్టు.

ఇంతలో..దూరం నించి..మోహన్ వస్తూ కనిపించాడు.

వడి వడి అడుగులతో..చూపుల్ని టార్చ్ లైట్లు గా చేసుకుని, తన ప్రియమైన వస్తువు ఇక్కడే, ఎక్కడో  వుండాలన్న ట్టు..ఖిన్న వదనుడై,   వెతుక్కుంటూ వస్తున్నాడు.

ఎదురుగా వున్న నన్ను చూడ్డం లేదతను. వెనక నించి స్నేహని గుర్తు పట్టి, త్వర త్వర గా దగ్గరకొచ్చాడు.

“మోహన్ వచ్చారు..” నా మాటలు పూర్తి కాకముందే, స్నేహ వెనక్కి తిరిగి చూడటం..అతను గబగబా ఆమెకి దగ్గరై, ఉద్వేగం గా  ఆమె భుజం మీద   చేయి వేయడం  జరిగిపోయింది. ఆ స్పర్శ లో ఎంత మృదుత్వముందో ఏమో కానీ…

ఆతన్ని చుస్తూనే..తుఫాను కు కొట్టుకుపోతున్న తీవె, ఆలంబన దొరికిన ట్టు, అతన్ని చిన్న పిల్ల లా చుట్టేసుకుంది.  మోహన్ కూడా కదలిపోతూ..చెబుతున్నాడు. “సారీ స్నేహ..ఐ యాం సారీ, అయాం టెర్రిబ్లీ  సారీ..ఇంకో సారి ఇలా జరక్కుండా చూస్తాను. ప్రామిస్. నన్ను నమ్ము..ప్లీజ్..ట్రస్ట్ మి ”   అతను ఓదారుస్తున్నాడో, ఓదార్చుతూనే దుఖిస్తున్నాడో ..తెలీడం లేదు.   మొత్తానికీ ఇద్దరూ ఒకే రకపు వేదనా  సముద్రం లో కొట్టుకుమిట్టాడుతున్నట్టు గ్రహించా!

వాళ్ళిద్దరికీ, చుట్టుపక్కల ఎవరం వున్నదీ తెలీడం లేదు. నా ఉనికి అక్కడ చాలా అనవసరం గా తోచింది.

చీకట్లో కొవ్వొత్తి వెలుగు పెద్దదే కానీ, కరెంట్ వచ్చాక,  దాని ప్రాముఖ్యత వుండనవసరం లేదు.

నేను మెల్లగా, చాలా మెల్ల గా అడుగులేసుకుంటూ..బయట పడ్డాను. వాళ్ళ  కంట పడకుండా వుంటం కోసం..దొరికిన ఆటో ఎక్కి, ఇంటి కొచ్చేశాను.

ఎలా వచ్చానో తెలీదు. ఆ రాత్రం తా, కంటి మీద ఒక్క కునుకుంటే ఒట్టు.

సమస్య మనదైతే, పంచుకోవడం వల్ల తగ్గుతుంది.   స్నేహితురాలి దైతే..ఆలోచించి పరిష్కారాన్నివ్వడం వల్ల కొంత వరకు వీలుంటుంది. కానీ, సమస్యేమిటో తెలీకుండా..ఎమోషన్ సీను చూపించి, కనుక్కో మంటే, తనెలా కనుక్కుంటుందీ!?

అసలు నాకు స్నేహ  ప్రాబ్లం ఏమిటో తెలీకుండా…ఏమని తనని అడగాలి.

అది కాదు ప్రస్తుత నా సమస్య. ఏమీ తెలీకుండానే  దాని గురించి ఎడ తెరిపి లేని ఆలోచన్లతో తెగ సతమతమై   పోతున్నా!

ఏమై వుంటుందా అని , నా జర్నలిస్టిక్ వ్యూహరచనా చాతుర్యాన్నంతా రంగరించి కారణాన్ని దొరకబుచ్చుకునే ప్రయత్నం చేసా.  ఆ పైన ఆ పరిశోధనలో మునిగి పోయా.

ఊహు. దొరకలేదు.

ఒక్కటి మాత్రం ఖరారు గా  తెలుస్తోంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మామూలు గా కాదు. గాఢం గా!

అవునూ, ఇంతకీ ఇద్దరిదీ ఒకటే కులమా, కాదా? తెలీదు.

పోనీ..మతం? మోహన్ కదా పేరు. నో ప్రాబ్లెం. సేం మతం.

ఆస్థి అంతస్తుల సమస్యేమో! – అదేమన్నా  బీదదా ఏమిటి?

చదువు? -బ్రహ్మాండం గా వుంది.

జ్ఞానం? – దానికి కొలతేముంది?

ధనికుల ఇళ్లల్లో ఆస్థి గొడవలు, వాటికి వివాహ బంధుత్వాల లింకులు వుంటాయి.

నాకు తెలిసిన ఒక వూరి కులం లో  – పెళ్ళిలన్నీ వాళ్ళ వాళ్ళ చుట్టాల లోనే జరిగిపోతాయి. మేన మామలు, మేనమామ కొడుకులు,   మేనత్త కొడుకులు,   లేదా పిన తండ్రి పెదతండ్రి ఆడ పిల్లలు తోడుకోడళ్ళవడాలు..ఇవన్నీ మొత్తానికి అక్కడక్కడే తిరుగుతాయి బంధాలన్నీ ,  కాసుల చుట్టూ రా. ఇదేమిటంటే ఆస్థులు ఎక్కడికీ పోకుండా వుంటం కోసమట.

ఆశ్చర్య మేసేది నాకు. వరుడు విదేశాల్లో వున్నా సరే, సమయానికి రాకున్నా, బే ఫికర్!  వీళ్ళిక్కడ తాంబూలాలు పుచ్చేసుకుని, సంబంధం ఖాయం చేసేసుకుంటారు. పెళ్ళి కి ముందు రోజొస్తే చాలని వరునికి భరోసా ఇస్తారు. అలాగే పెళ్ళిళ్ళై పోతాయి. కాపురాలు జరిగిపోతుంటాయి. పిల్లలు కూడా పుట్టేస్తారు. పెరుగుతారు. వూళ్ళొ పొలాలు   ఆ యేడాదికా యేడు వాళ్ళ పేర్ల మీద  యెకరాల కొద్దీ పెరిగి పోతూ వుంటాయి.

ఈ భాగ్యానికి  ప్రత్యేకించి పెళ్ళిళ్ళెందుకు చేసుకోవడం. ఒక పోలానికి, మరో పొలానికి మనువు  చేస్తే సరిపోదా? రెండు ఇనప్పెట్టెల్ని  గదిలోకి తోస్తే రాలవా? కాసుల గుట్టలు?

అందుకు రెండు శరీరాలే బలి  కావాలంటావా? …నేనూ స్నేహ ఈ కథ చెప్పుకుని,  ఇద్దరం కలసి పకపకా నవ్వుకునే వాళ్ళం.

రాజీ కల్పించుకుని, అనేది. ” మీకన్నీ వేళా కోళాలు గానే వుంటాయిలే! అద్సరే  కానీ,ఇంతకీ   పెళ్ళెప్పుడు చేసుకుంటారిద్దరూ?” అని నిలేసేది.

స్నేహ చురుగ్గా చూసేది రాజీ వైపు. నేను కళ్ళు దించుకునే దాన్ని, మౌనం గా.

” నన్ను చూడండి. మీ తోటి దానే గా! ఇద్దరి పిల్ల ల తల్లి నై పోయాను. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా అయిపోయింది. పెద్దది, అప్పుడే సెకండ్ గ్రేడ్ దాటేసింది. మరి మీ సంగతో? ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు, ఎప్పుడు పిల్లల్ని కంటారు? ముసలోళ్ళై పోయాక నా? ” పెద్ద తరహా లో పెద్దక్కలా అడిగేది.

స్నేహ మాత్రం ఊరుకునేది కాదు. ” నా టెంత్  క్లాస్ లోనే , మా మావయ్య నన్ను చేసుకుంటానన్నాడు. సరే అని ఒప్పుకుని వుంటే, ఈ పాటికి నా కూతురు పెళ్ళీడు కి  వచ్చేసేది. ఏం చేస్తాం. అలా రాసి పెట్టి లేదు. ..హు!” అంటూ నాటకీయం గా నిట్టూర్చేది.

నాకు నవ్వాగేది కాదు.

రాజీ, రోష పడకుండానూ వుండేది కాదు.

ఆమె ఉడుక్కోవడం చూసి – అనేది, స్నేహ. ” దామిని సంగతి నాకు తెలీదు కానీ, రాజీ! నేనంటూ పెళ్ళంటూ చేసుకుంటే..నా ముందు పిలుపు నీకే. ప్రామిస్” అంటూ మాటలతో రాజీని చల్ల బరిచేది-

అనడమే కాదు, తన పెళ్ళి విషయాన్ని ముందుగా రాజీ కే ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాతే, మా ఇంటికొచ్చింది.

ఎప్పుడంటే, ఆ రోజు ఆ సంఘటన జరిగాక,   రెస్టారెంట్ నించి నేను బయట పడి వచ్చేసిన…వారం పది రోజుల తర్వాత..స్నేహ నా ఫ్లాట్ కొచ్చింది.

***

 “లోపలకి రావొచ్చా” మాటలకి వెనక్కి తిరిగి చూద్దును కదా..నవ్వుతూ కనిపించింది స్నేహ.

చేతిలో పని అక్కడ్నే వదిలేసి..ఆనందంగా ఎదురెళ్ళాను.

రెండు చేతులూ జాపింది.

ఎందుకో తెలీని ఉద్వేగం మా ఇద్దరి మనసుల్లో నూ పొంగి ప్రవహిస్తోంది. వెంటనే  ఆత్మీయం గా హృదయానికి హత్తుకుంది.

నన్ను కుర్చీలో కి తోసి, హాండ్ రెస్ట్స్ మీద చేతులుంచి, వయ్యారంగా బొమ్మలా వంగి చెప్పింది. “నేనూ మోహన్ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నామే! రేపే వివాహం. రాజీ కి ఆల్రెడీ ఫోన్ చేసి  చెప్పాను. నిన్ను మాత్రం  పర్సనల్ గా పిలవాలనిపించింది.  తప్పకుండా రావాలి. నువ్వు అస్సలు మిస్సవ్వకూడదు.” చెప్పిందే చెబుతోంది.

బహుశా..అమితమైన ఆనందంతో కావొచ్చు.

“నువ్వన్ని సార్లు చెప్పాలా ఏమిట్లె, కానీ! సంతోషం లో పడి శుభలేఖ ఇవ్వడం మర్చిపోయేవు సుమా!” అన్నాను నవ్వుతూ.

కాని అది నవ్వ లేదు నా మాటలకి. పై పెచ్చు ముఖం లో రంగులు మారాయి. నేనేమైనా పొరబాటు మాట్లాడానా అని ఆలోచించుకునే లోపే తనే చెప్ప సాగింది.

“సారీ దామినీ!

మొన్న జరిగిన సంఘటన తర్వాత నిన్ను కలవలేకపోయాను. కనీసం ఫోన్ కూడా చేయలేని పరిస్థి తిలో వుండిపోయాను. సారీ..!”

“నీ మొహం. అందుకు సారీ ఎందుకు? ప్రేమ వివాహాలకికి ఇంట్లో వొప్పుకోకపోవడం అన్ని చోట్లా జరిగేదే. చివరికి మీ ప్రేమే గెలిచింది సంతోషం. ఇంతకీ ఎవరే,  మీ పెళ్ళికి అంతేసి  ఇనప గోడలా తయారైన వ్యక్తి?  మోహన్  తల్లా? తండ్రా?” అని అడిగాను, నవ్వుతూ.

ఒక్క క్షణం మౌనం తర్వాత మెల్లని స్వరం తో చెప్పింది. “అతని వైఫ్.”

వింటున్న నా చెవుల్లో బాంబ్ పేలిన శబ్దమైంది. కొంత సేపటి దాక, నోరు పెగల్లేదు.

తప్పు చేస్తున్న దానిలా తలొంచుకున్న స్నేహని చూడగానే అర్ధమై పోయింది. తను   అబధ్ధ మాడటం లేదని!

“ఏ..ఏమిటన్నావ్?” మరో సారి నిర్ధారించుకోవడం కోసం..’నువ్ చెబుతోంది నిజమేనా?’ అన్నట్టు చూసా.

జవాబు చెప్పకుండా, తలూపింది ‘ అవునన్నట్టు.’

“నీకేమైనా పిచ్చా? ” అని అడగాలనిపించింది. కాదు అరవాలనిపించింది  తన్నుకొచ్చిన ఆవేశం తో.

కానీఅప్పటికే ఆమె పెదాలు బిగించి ఏడ్చేస్తుంటే…అగ్గి లాంటి నా  కోపం మీద దాని కన్నీళ్ళు పడి చప్పున చల్లారిపోయింది.

గభాల్న దాని భుజం మీద చేయేసాను..ఓదార్పు గా.

నా చేతి మీద చెంపనానించుకొని  వెక్కుతూ చెప్పింది.”దామినీ!  నేనతన్ని ప్రేమించ లేదు.  అతనెప్పుడూ ఐ లవ్యూ అని చెప్పిందీ లేదు.   కానీ, మేము  ఒకరి కోసమొకరం అని మాత్రం తెలుస్తోంది..ఇక్కడ..ఈ గుండె సాక్షి గా మేము విడిచి వుండలేమనిపిస్తోంది..అందుకే..పెళ్ళి చేసుకుంటున్నాం..ఈ పెళ్ళి కూడా నా తృప్తి కోసం…పసుపు బట్టలతో అతని పక్కన నిలబడటం కోసం..అంతే..ఇంకేమీ అడగొద్దు. ప్లీజ్..” అంటూ కర్చీఫ్ తీసుకుని, ముఖం తుడుచుకుంది.

నేను అలాగే చూస్తూ వుండి పోయా. ఏం మాట్లేడందుకు, గొంతు పెగిల్తే గా!

తప్పు చేస్తోంది అన కూడదు. ఎందుకంటే, ఈ రోజుల్లో ఎవరు చేసిన పని వారికి కరెక్టైనది కాబట్టి.

తప్పు అంటే కేసౌతుంది. నేరారోపణ కిందకొస్తుందిట. కాబట్టి ఈ తరహా పనుల్ని పొరబాటు అనాలి ట. లేదా, బలహీనత అనొచ్చు ట.  మా ఆఫీసులో ఓ సీనియర్ జర్నలిస్ట్ చెబుతుంటే ఔనా అన్నట్టు ముఖం పెట్టి, శ్రధ్ధగా ఆలకిస్తూ వుండిపోయా. నా అమాయకత్వానికి  కామోసు ఆయన పెద్ద గా నవ్వేయడం తో,  ‘ఓహో, సెటైరన్నమాట ‘   అప్పుడు అర్ధమైంది.

అలాగే, ఇప్పుడు స్నేహ చేస్తున్న పని ని  ఏ పేరుతో పిలవాలి.

“ నువ్వు రాకుంటే పెళ్ళే జరగదంటూ.. –  తప్పక రావాలంటూ మరో సారి హెచ్చరిస్తూ.. చెయి నొక్కి వెళ్లిపోయింది.

నాకు అంతా అయోమయం గా అనిపించింది.

ఇంకా అప నమ్మకం గా వుంది. అపస్మారక  స్థితిలో  వుంది మనసు.

స్నేహ వెనక్కొచ్చి, ‘అవాక్కయ్యవా?’ అంటూ , తననొక ఏప్రిల్ ఫూల్ అన్నట్టు చూసి,  గల గలా నవ్వితే  ఎంత బావుణ్ను అని ఆశ గా వుంది. చచ్చేంత ఆశ గా వుంది.

సరిగ్గ మనమిక్కడే పొరబడుతూ వుంటామేమో తెలీదు.  మనం మనుషుల్ని ప్రేమిస్తున్నంత తేలిగ్గ, వారి వ్యక్తిత్వ లోపాలని మన్నించలేకపోవడం వల్లో, ఒప్పుకోవడం రాక వల్లో ..ఇలాంటి  పరిస్థితి కి లోనవుతుంటామేమో!

‘నీ మొహం. అంతెందుకు ఆశిస్తావ్ నువ్వు? అసలైనా నువ్వింత  నిరాశ పడిపోయి, డీలా పడిపోయేంత విషయం ఏముంది ఇందులో?  ఇవన్ని నగరం లో జరుగుతున్న వి కావూ? నీ చుట్టు సమాజాన్ని నువ్ రోజూ చూడ్డం లేదూ?   చిత్రం కాకుంటె,  నువ్వెప్పుడూ అసలిలాటి సంఘటన తాలుకు వార్తలే చదవనట్టు, రాయనట్టు ఇలా కుంగి పోవడం బాలేదమ్మాయి!   అంటూ నన్ను కేకలేస్తూ, ఊరడిస్తోంది..నా లో నాకెవరో తెలీని నా తను.   నన్నూ, నా భారమైన గుండెని తేలిక చేసే ప్రయత్నం చేస్తోంది.

ఇవేవీ కాదనను. నాకన్నీ తెలుసు. నిజమే. కానీ, అవన్నీ  ఎవరికో జరిగాయి.

కానీ ఈ రోజు నా ఫ్రెండ్ కి జరుగుతోంది. అందుకే దిమ్మ తిరిగినట్టుంది. మెదడంతా బ్లాంకై కూర్చుంది. గదిలో లైట్ వెలుగుతున్నా, ఫ్యూజెగిరిపోయినట్టు చీకటి మయం గా వుంది.

మనతో మమేకమై పోయి మసులుకుంటూ…తమ శరీరాలే రెండు  తప్ప,  ఆత్మలు రెండూ ఒకటే అన్నంత గా కలిసి మెలిసి తిరిగిన స్నేహ..కాదు నా  ఫ్రెండ్ వెనక  ఇలాటి కథ ఒకటుందని హఠాత్తుగా తెలిస్తే మనసంతా కంగాళీ గా వుంటుందో..నాకూ అలానే వుంది. చేదుగా.

మెల్ల మెల్ల గా…ఆ షాక్ నించి బైట పడి, ఆ ఇద్దరి వైపు నించీ, వారి  పరిస్థితుల కోణాల నించీ ఆలోచించడం మొదలు పెట్టాను.

ఎంతైనా పొరబాటు పొరబాటే. అది కాదు నేనాలోచిస్తున్న సంగతి? – ఎవరు మూల్యం ఎక్కువ చెల్లిస్తారా భవిష్యత్తులో అని.

స్నేహ కి ఏం తక్కువనీ, ఇలాటి రిస్క్ తీసుకుంటోంది?

పోనీ మోహన్? స్నేహ కి మించిన అందగత్తెలెందరు లేరనీ? ఎవరు దొరకరనీ? ఐదేళ్ల పరిచయం తర్వాత కూడా..స్నేహ తో తనకు గల బంధాన్ని  శాశ్వతం చేసుకోవాలని వాంఛించడం  అంటే మామూలు మాట కాదు.  అందుకు ఎంత నిజాయితీ కావాలి, పదిమందిలో పెళ్ళికి ఒప్పుకోడానికి!

పోనీ, ఇద్దరిదీ పొరబాటు కానప్పుడు, ఇద్దరూ నడిచే దారి సరైనదే ఐనప్పుడు…స్నేహకి కన్నీళ్ళెందుకొస్తున్నట్టు?

ఈ పెళ్ళి (?) తర్వాత,  వాటి అవసరమొస్తే మిగలనంత గా దుఖిస్తోంది కదు?

ఇదంతా పక్కన పెడదాం. చట్ట రీత్యా వీళ్ళు ఏమౌతారు? వీళ్లు ఇంత పవిత్రం గా అనుకుంటున్న సంబంధాన్ని  ఏ  పేరుతో  పిలవ బడతారు, ఈ సమాజం చేత?

ఒక సినీ నటికి ఇలాటి సమస్యే వస్తే, ఆ ఒత్తిడికి  తట్టుకోలేక, ఒక సీనియర్ నటుని సలహా తీసుకోవడ కోసం వెళ్ళింది.

అంతా విన్నక, ఆయన ఒకే ఒక్క ప్రశ్న వేశాడు ట. ‘నీకు సమాజం కావాలంటే అతన్ని వొదిలేయి. అతనే కావాలంటే, సమాజాన్ని వొదిలేయి. ఇప్పుడు చెప్పు. నీకు ఏది కావాలి?”  అని.

ఆమె  జవాబేం  చెప్పకుండా వెనక్కొచ్చి, తను వివాహానికి సుముఖమే అని చెప్పిందట ప్రియుని తో. ఆ తర్వాత కథ ఇక్కడ అప్రస్తుతం.

అలాగే, స్నేహ కూడా నేమో!

ఇంతకీ పెళ్ళి ఎప్పుడందీ? రేపే కదూ..

ఇంతలో సెల్ మోగింది. రాజీ కాల్ చేస్తోంది. “ఇది విన్నావా?” అవతల్నుంచి వాక్ప్రవాహం మొదలైంది.

“స్నేహ   పెళ్ళైన వాణ్ని చేసుకుంటోందిట..హవ్వ”  బుగ్గలు నొక్కుకోవడం నాకిక్కడికి కనిపిస్తోంది.

“మరి నువ్వేమన్నావ్?” అడిగాను నింపాదిగా.

“ఏమంటాను. తెలిసీ గోతిలోకి దూకుతానంటే ఆపేదెవరనీ! వినం గానే నోట  మాట రాలేదంటే నమ్ము. అవునూ, నీతో చెప్పిందా సంగతంతా?”

‘ఆ, వచ్చి చెప్పింది. పిలిచింది,  వెళ్లింది”

“ఏమిటీ, నీ దగ్గరకొచ్చిందా, పిలవడానికీ? ఎంత  ధైర్యం!?  నాలుగు  చివాట్లు పెట్టలేక పోయావా?

నేనైతే వూరుకునే దాన్ని కాను సుమా!

మా ఆయనకీ విష యం  తెలిస్తే    ఇంకేమైనా వుందా? స్వయంగా  నా పరువుని నేనే  తీసుకుని, గంగలో కలుపుకున్నట్టు అవ్వదూ? అయ్యొ..అయ్యో..ఎంత ఘోరం! ఎంత ఘోరం!”

రాజీ  నా లా గొప్ప షాక్ లో లేదు. అది స్పృహ లో వుండే మాట్లాడుతోందని నాకర్ధమై పోయింది.

ఎప్పుడైతే, వాళ్ళాయన ప్రసక్తి తీసుకొచ్చిందో, ఎప్పుడైతే, స్నేహ పెళ్ళి గురించి వాళ్ళయనకి తెలిస్తే పరువు పోతుందన్నదో నాకప్పుడే అర్ధమై పోయింది రాజీ మానసిక పరిస్థితి.

జస్ట్ ఆర్నెల్ల క్రితం..తన కాపురం నిలబెట్టమంటూ..మొగుణ్ని అవతలి దాని బారినించి అప్పగించమంటూ..పతి భిక్ష పెట్ట మంటూ..స్నేహ సాయం కోరిన రాజీ..ఇవాళ  స్నేహని, స్నేహ చేస్తున్న పని.. భర్తకి తెలిస్తె పరువు పోతుందని నెత్తీ నోరూ బాదుకుంటోం దంటేనే అర్ధమై పోతోంది.  రాజీ ఖచ్చితం గా స్పృహలో వుండే మాట్లాడుతోందని!

ఆడ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే –  మొగుడు బయటెన్ని  వెధవ పన్లు  చేసినా, గడపలోపలకొచ్చి పడితే చాలు.’ అనుకుంటారు. తప్పులన్నీ సర్వం తుంగలో తొక్కేసి, తెగ క్షమించేస్తారు.  ఆ మరు క్షణాన్నే అంతా మరచి పోయి, పైగా అదంతా ఎన్ని జన్మల కిందట జరిగిన సంగతో అన్నట్టు,  తమకేవీ గుర్తుకు రానట్టు ఎంత హాయిగా ప్రేమించేస్తారేం? మొగుళ్ళని!

తనెప్పుడైనా ఫోన్లో అడు గుతూ వుండేది. ” రాజీ, మీ ఆయన కుదురుగా వుంటున్నాడా? ఎందుకైనా మంచిది. ఓ కన్నేసి వుంచు” అని.

అప్పుడేమనేదీ? -“ఛ! మా అయన మరీ అంత చెడ్డవాడేం  కాడే బాబూ!  పాపం! ఖర్మ లో వుండి, ఏదో ఒక సారి గడ్డి తిన్నాడే గానీ, ఇప్పుడు పూర్తిగా  మారిపోయాడు.” అంటూ మురిసిపోయేది.

“అంత గట్టిగా ఎలా చెబుతున్నావ్ ? మారాడని ?” అని రెట్టిస్తే, – “అయ్యో! నిన్ననే గా సింగపూర్ నించి వొస్తూ, రాళ్ళ నక్లెస్ తెచ్చారు నా కోసమనీ! అయినా నువ్వు భలే ప్రశ్నలేస్తా వ్లే” అంటూ గలగలా నవ్వేసేది.

అంటే, భర్త నిజాయితీకి కొలమానాలు నగలా? గిఫ్ట్లా?

కట్టుకున్న వాని అనైతికత ని కప్పిపుచ్చే శక్తి, భార్యలకిచ్చే నగలబహుమతులకుంటుందన్న మాట!

“అబ్బో! పెద్ద చెప్పొ చ్చావ్  లేమ్మా. నీకూ పెళ్ళైతే తెలుస్తుంది లే. అప్పుడడుగుతా నిన్ను. నీ కంటే పదింతలుగా..” అంటూ గొల్లున నవ్వేది.

“ఏమిటీ మాట్లాడవ్?” ఖంగుమన్న దాని గొంతు విని, ఆ లోకం లోంచి  ఈ లోకం లోకొచ్చాను. “ఏమిటన్నావ్?” అంటూ.

“అదే,  దాని పెళ్ళికెళ్తున్నావా అని?”

“వెళ్దా..మ..నే..”

“నోర్మూసుకో. పిచ్చిదాన్లా  వెళ్ళకు. వెళ్ళి, ఫోటోలు గీటోలు దిగావనుకో..ఆ పైన పోలీస్ కేసులూ గట్రా అయ్యా యే అనుకో..కేసు కోర్ట్ వరకెళ్లిందే అనుకో..ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడ్లేడు తెలుసా?

మా ఆయన ఇట్లాంటివే  నాకు చెబుతూ వుంటారు  కాబట్టి నాకివన్నీ తెలిసాయి. లేకపోతే, నేనూ నీలానే వెళ్దామనుకునేదాన్నేమో! నువ్వెళ్ళకు. అసలే పెళ్ళి కావాల్సినదానివి. పోలీస్ స్టేషన్లూ, కొట్లాటల్లో ఇరుక్కోకు. సరేనా? ఏమిటీ, వింటున్నావా? అయినా ఒక మాటే దామినీ! మనలో రెండో పెళ్ళి చెల్లదు. మరో మతం ఐతె వేరే సంగతి…” చెప్పుకు పోతోంది. ఎక్కడా ఆగకుండా.

నేనే వింటం ఆపేశా.

‘మరో’  మతం అనే మాట  దగ్గర ఆగి, వింటం మానేసా.

మరో మతం ఐతే మాత్రం, తను బ్రతికుండంగానే భర్త మరో వివాహం చేసుకుంటుంటే కంట తడి పెట్టని  భార్యంటూ  వుంటుందా, ప్రపంచంలో? స్త్రీలు, స్త్రీ ల హృదయాలు అన్ని చోట్లా ఒక్కటే కాదా? ఇలాటి కష్టం అందరది ఒకటే అయినప్పుడు, ఒకే రకం గా స్పందిచరా? ఒక్క కన్నీటి చుక్కనైనా రాల్చకుండా వుంటాయా, నయనాలు?

ఒక మతచట్టం ఒప్పుకున్నంత తేలికగా,  ఓ మనిషి గుండె ఒప్పుకోవాలి కదా? మతం గురించి కాదు నా వాదన. సమ్మతం  గురించి.

అంతేలే, కొన్ని శాసనాలు మింగుడు పడవు.  మనిషిని చంపితేనే హత్య అంటాయి. హృదయాన్ని చంపడం, ఇక్కడ నేరం కాదు. మనసుని ఖూనీ చేయడం ఏ తప్పులోకీ చేరదు. వాటికెలాటి శిక్షలూ  వుండవు.

ఏమో. నాకేమీ అర్ధం కావడం లేదు.

ఇప్పుడు నా కళ్ళకి మోహన్, స్నేహ లతో బాటు మెల్ల మెల్ల గా…రూపం లేని ఓ ఆకారం కనిపిస్తోంది. ఆమె బహుశా..మోహన్ భార్య అయి  వుంటుందేమో!

అదేమిటీ ఆమెని అలా అంటావ్, భార్య అని? స్నేహ కూడా  కదా? …ఏమో! బహుశా ‘రెండో భార్య’ అని అనొచ్చేమో తెలీదు.

రాజీ  ఇంకా మాట్లాడుతూనే వుంది.

యధాలాపం గా రాజీ ని వింటున్నాను. “ ఏమిటోనే, తెలీడం లేదు ఒకటే కంగారు గా వుంది నాకైతే. లాయరై వుండీ, అన్నీ తెలిసి..ఇలాటి పని ఎలా చేస్తోందంటావే!?”

పిచ్చి కాకపోతే,  లాయర్ కి ప్రేమ గుణం వుండదా?  ప్రేమ కి – చదువు సంధ్యలతో, ప్రొఫెషన్స్ తో పనేముంటుందీ?  స్పందించే గుండె చప్పుళ్ళ ముందు ఏ లాజిక్కూ లూ  పని చేయవన్న సంగతి రాజీ కి తెలీదా! – ఏమో!

” ఇంతకీ చెప్పావు కాదూ?  కొంప తీసి పెళ్ళికి వెళ్తున్నావా ఏవిటీ? ”ఇంకేదో హితవు చెప్పబోతున్న రాజీ మాటల్ని కట్ చేస్తూ  “అవును.  వెళ్తున్నాను..” అంటూ చెప్పి, సెల్ స్విచాఫ్ చేసేశాను. మళ్ళీ మాట్లాడే వీలు లేకుండా. అది కాదు. నేను.

ఆపైన స్నేహ పెళ్లికి  ఖచ్చితం గా వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను.

 

***

 

రెండు రోజుల తర్వాత…

ఆ సాయంత్రం,  ఆరు బయట పడక్కుర్చీలో  కూర్చుని, నిర్మలమైన ఆ కాశం లోకి చూసుకుంటూ..అయిపోనీకుండా  ఒక్కో చుక్క గా టీ  రుచిని ఆస్వాదిస్తూ …  కాల ప్రవాహపు క్షణాల  అలల మీద తేలుతూ…

సరిగ్గా అప్పుడు ఫోన్ చేసింది రాజీ.

నిన్నట్నించి ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది.

నేనే బిజీ గా వుండి వెంటనే చేయలేకపోయాను.

మంచి సమయం లోనే చేసిందిలే అనుకుంటూ..”హలో, రాజీ” అంటూ పలకరించాను.

“ఏమిటే? పెళ్ళికెళ్ళావా? ఏమైంది?” సస్పెన్స్ భరించ లేనిదాన్లా అడిగింది.

“హు! అది ఎన్ని పెళ్ళిళ్లకి వెళ్ళదూ? మరెన్ని వివాహాలని మిస్ కొట్టి వుండదనీ.. అందర్నీ ఇలా అడగ గలదా? ఇంత  ఇది గా?

అందుకే బదులిస్తూ..“ అందరి పెళ్ళిళ్ళల్లో ఏమౌతుందో,  స్నేహ పెళ్లి లో నూ అదే అయింది.” అన్నాను చాలా సాధారణం గా.

“ఏమిటీ!సస్పెన్సా? లేకపోతే చెప్పకోడదనుకుంటున్నావా?” కోపం వినిపించింది, దాని కంఠం లో.

నేను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాను. “ఏమౌతుందే, లేకపోతే? ఆ? అంత తెలుసుకోవాలనుకునే దానివి పెళ్ళికి రావొచ్చు కదా?” అన్నాను. ఈ మాటని మాత్రం నేనూ కొంచెం నిష్టూరం గానే  అన్నాను.

నా మాటల్లోని నిగూఢాలేవీ దాని కిప్పుడు వింపించవని తెలుసు.

“అది కాదే, పెళ్ళి లో గొడవలేం కాలేదా? అతని ఫస్ట్ వైఫు…” ? వాక్యం పూర్తి కాకుండానే “వచ్చారు.” అని చెప్పాను

“ఏమిటీ? వచ్చిందా? ఒకర్తే నా?, లేక…”

“ఆవిడ, ఆవిడ తో బాటు మరి కొంత మంది కూడా వచ్చారు.  పది కార్ల నిండా జనం. గుంపులు గుంపులు గా వచ్చారు. ఆవిడ మేనమామ పోలిస్ కమీషనర్ ట, ఆయన, మరో రిటైర్డ్ జడ్జ్,  ఒక  ఎంపీ,  తోడు గా   వచ్చారు.”

“ఏమిటీ? పెళ్ళికే?” అపనమ్మకంగా అడిగింది. బోల్డంతా ఆశ్చర్యపోతూ.

“కాదు. వచ్చింది పెళ్ళికి కాదు. ఆస్తుల మీద అతనికెలాటి హక్కులూ అధికారాలు వుండబోవని సంతకాలు చేయించుకు పోడానికి వచ్చారు.”

“ఎవరితో?”

“అతనితో.”

“అవును మరి. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళవి. వుండొద్దూ?”- రాజీ వోటేసేసింది.

నా కళ్ళ ముందు ఆ దృశ్యం  మరో సారి కదలాడింది.

హఠాత్తుగా కార్లొచ్చి, వరసగా నిలబడటం, గన్ మాన్లు పరుగులు తీస్తుండగా, హడావిడిగా ఆ నాయకుడు రావడం, మందీ మార్బలం తో..ఆ వెనకే ఇంకొందరు  పెద్ద మనుషులు..కుర్చీలు టెబుల్స్ దగ్గర జరగుతున్న చప్పుళ్ళు…అన్నీ కలసి..క్షణాల్లో సినిమా సీనులా  లా మారిపోయింది.

ఆమె మాత్రం కారు దిగలేదు.

అతని ముందు కాగితాలు పరిచారు.  మోహన్  చక చకా సంతకాలు చే సే సాడు.

పది నిమిషాల్లో అందరూ మాయమై పోయారు. తుఫాను వెలిసినట్టైంది.

కానీ, ఆ కొంచెం సేపు మాత్రం తుఫాను ముందటి కటిక నిశ్శబ్దం..గుబులు పుట్టించేసింది అందరి గుండెల్లోనూ!

వాళ్ళు వెళ్ళిపోయాక, వీళ్ళిద్దరూ, ఒకర్నొకరు చూసుకుంటూ మిగిలిపోయారు.

నాకు అర్ధమౌతూనే వున్నాయి, భావాలు. సరిగ్గానే అవగతమౌతున్నాయి.

అద్సరే, మోహన్ భార్య – ఆస్తులు పోకుండా కాగితాలు రాయించుకోవడ మేమిటీ?

మనిషిని కదా రాయించుకోవాలి! అవును.   పాయింటే!

“అంటే? విడాకులు పడేస్తుందంటావా?” అడుగుతోంది రాజీ.

అంత పిచ్చిదా ఆమె? కాక పోవచ్చు.

చట్టం – మనిషిని తప్పు చేయకుండా కాపాడగల్గుతుంది కాని, మనసుల్ని కాదు.

జీవితం లో చేసిన ఒక పొరబాటు కి చట్ట రీత్యా పరిష్కార మార్గం కనుగొనడం కష్టమూ, అసంభవమూ అయినప్పుడు,

సుఖ శాంతుల కోసమని, పొరబాటున పొరబాటుమార్గాన్నెంచుకుని,  ‘పొరబడ లేదు. ఇది సరైనదే’   అని అనుకోవడం వల్ల ..అతనికి న్యాయం జరుగుతుందా? లేక జీవితం లో మళ్ళీ  అతను  చేస్తున్న మరో పొరబాటు అవుతుందా?

ఏమో!

రాజులు సైతం, ప్రేమ కోసం రాజ్యాలు పోగుట్టుకున్నారు.

ఇక మోహన్ ఆస్తులు పోగొట్టుకోవడం అంత బాధాకరమైన విషయం కాదేమో!

లేక పోతే వాళ్ళిద్దరు అంత గొప్ప ఆనందం గా ఎలా కనిపిస్తారు?

ఏమో.

నేనిక ఆలోచించలేను. ఇక్కడితో నా పరిశోధనని ఆపేస్తున్నాను.

ఇదిగో..

***

 

—-ఆర్.దమయంతి

మీ మాటలు

  1. మొదటి నుంచీ, చివరిదాకా చాలా ఆసక్తి కరం గా చదివించింది. కొన్ని వాక్యాలు అయితే నిజంగా ఆణిముత్యాలు.

    అయితే కాగితాల మీద లేకుండా, రెండవ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవడం, నేను ప్రాక్టికల్ గా ఎంత మాత్రమూ ఆమోదించలేను.. (తర్వాత ఈ ప్రేమ అవీ ఒకవేళ తగ్గి అతను, దూరమైతే తట్టుకునే ఆత్మస్థైర్యం అమ్మాయి కి, అలాగే ఆస్తి మీద కొద్దిగా మళ్ళీ మమకారం పెరిగి తప్పు చేసాను అని అతనూ అనుకున్నా నిలబడి ఉండగలము అనుకుంటే తప్ప)

  2. మణి వడ్లమాని says:

    కధని పట్టు విడవకుండా చదివాను. చాల బాగా రాసారు దమయంతి గారు. కృష్ణప్రియ గారు అన్నట్లు విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకొని ఎన్ని రోజులు సంతోషంగా ఉండగలరూఅనేది పెద్ద ప్రశ్న

    ‘అదే వేరే మతచట్టం ఒప్పుకున్నంత తేలికగా, ఓ మనిషి గుండె ఒప్పుకోవాలి కదా? ‘ అని అన్నరు కదా!నిజమే కదా అనిపించింది.

    నాకు ఎందుకో పరిమళా సోమేశ్వర్ గారి’తప్పెవరిది నవల ‘( యువ మాస పత్రికలో వచ్చింది ) గుర్తుకొచ్చింది

    • నిజమే కృష్ణ ప్రియ గారూ!
      అంత దూరం ఆలోచించి, నిర్ణయం తీసుకోవడం అవసరమే!
      మీ స్పందన తెలియ చేసినందుకు ధన్య వాదాలు. శుభాభినందనలతో..

    • మణి గారూ, మీ అభిప్రాయం లో ఆలోచన వుంది. కానీ వాళ్ళ ఆలోచనలో బహుశా ఆవేశం ఎక్కువై వుండి వుండొచ్చేమో!?
      మీ స్పందన తెలియ చేసినందుకు, కథ కి మంచి కితాబిచ్చినందుకు చాలా హాపీ గా వుంది. హృదయ పూర్వక ధన్య వాదాలతో..

  3. సున్నితమైన , పదునైన రచన. చాలా వాక్యాలు నచ్చాయి నాకు…

  4. దమయంతి గారూ .. ఏకబిగిన చదివించేశారు . మనసు vs పెళ్లి vs డబ్బు…. కడవరకూ నిలిచేది ఏదనుకోవాలి ?

    • @మనసు వ్స్ పెళ్లి వ్స్ డబ్బు…. కడవరకూ నిలిచేది ఏదనుకోవాలి ?

      *మీ సందేహమే నా సంశయంనూ! :-) మళ్ళీ మరో కథ కి సరిపడ స్ఫూర్తి నిస్తోంది మీ కామెంట్! మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు శాంతి ప్రబోధ గారూ!

  5. వివాహాలు ఏ ప్రాతిపదికపై జరుగుతాయి, అవి ఎలా నిలుస్తాయి ? అంతా డొల్లతనమే కనబడుతుంది . మోహన్ భార్య ఆస్తుల మీద హక్కులు సంపాదించుకుని మనిషిని వదిలేసింది. ఆ మనిషి మనసు వేరొకరి మనుసుని అల్లుకుంది ఎంత కాలం కలిసి ఉంటారన్నది అప్రస్తుతం. ఆ బంధంలో నిజాయితీ లేకపోతే మోహన్ భార్య దరికే చేరతాడేమో ! ఆమె అప్పుడు క్షమిస్తుందేమో! స్నేహ మోసపోతుందేమో ! ఏమి చెప్పలేం ! కానీ ఇలా మూడవ వ్యక్తీ ప్రవేశం వల్ల గాయపడని హృదయం ఉంటుందా!? బాధ్యులు మనవాళ్ళైతె ఒక రకంగా స్పందన వేరొకరైతే మరో రకంగా స్పందించే సమాజంలో ఇదో నిత్య నూతన సమస్య.

    దమయంతి గారు ఈ కథలో మీ శైలి చాలా బావుంది. హృదయానికి దగ్గరగా హత్తుకుంది . ముఖ్యంగా దామిని ఆలోచనల్లో విషయాలు ఎంతో నచ్చాయి .

    • @వివాహాలు ఏ ప్రాతిపదికపై జరుగుతాయి,
      * నేను గమనించినంత వరకు కొన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్, మరి కొన్నిఆర్ధిక భద్రతల కొలమానాలతో మాత్రమే అని నేననుకుంటున్నాను.

      @అవి ఎలా నిలుస్తాయి ?
      * ఎలానూ నిలవడం లేదని..ఆ మధ్య ఒక అత్యున్నత న్యాయ మూర్తి నిండు న్యాయ స్థానం లోనే తన బాధని వ్యక్త పరిచారు.
      @ అంతా డొల్లతనమే కనబడుతుంది
      * మీ అభిప్రాయాన్ని గొఉరవిస్తున్ననమ్డి వనజ గారూ!
      @. మోహన్ భార్య ఆస్తుల మీద హక్కులు సంపాదించుకుని మనిషిని వదిలేసింది.
      * వదిలేసిన విషయం బయటకి కనబడదు.
      @ఆ మనిషి మనసు వేరొకరి మనుసుని అల్లుకుంది ఎంత కాలం కలిసి ఉంటారన్నది అప్రస్తుతం.
      * ..కావొచ్చు.

      @ ఇదో నిత్య నూతన సమస్య.
      * నిజం! సమస్య తో బాటు బాధ్యులు ఎవరన్నదే పాయింట్.!

      @ దమయంతి గారు ఈ కథలో మీ శైలి చాలా బావుంది. హృదయానికి దగ్గరగా హత్తుకుంది . ముఖ్యంగా దామిని ఆలోచనల్లో విషయాలు ఎంతో నచ్చాయి .
      * చాలా థాంక్సండి వనజ గారూ, కదా రచన గురించి చేసిన లోతైన మీ విశ్లేషణ బాగుంది. అనేక ధన్య వాదాలు తెలియ చేసుకుంటూ..అభివం దానాలతో..

  6. దమయంతి గారు ,
    కథ చాలా బాగుంది సరైన పేరు కూడా…ఇందులో గమనించాల్సినవి , గుర్తు పెట్టుకుని ఆ లోచిన్చేవిషయాలు చాలా వున్నాయి . జీవిత సత్యాలనే కాక మనం ఏవిదంగా ఆలోచిస్తామ్న్నది రాజీ పాత్ర ద్వారా చెప్పారు “చట్టం – మనిషిని తప్పు చేయకుండా కాపాడగల్గుతుంది కాని, మనసుల్ని కాదు.” లాటివి ఎన్నో కోట్ చెయ్యచ్చు .దామినీ, స్నేహాల మధ్య వున్న సన్నటి, చిక్కటి స్నేహాన్ని , ఆప్యాయతను చక్కగా చెప్పారు . అభినందనలు

    • కథ లో కోట్ చేయ దాగిన వాక్యాలు ఉన్నాయన్న మీ ప్రశంస – నాకెంతో సం తోషాన్నిస్తోంది లక్ష్మీ రాఘవ గారూ!
      మీ అభిమానానికి కృతజ్ఞు రాల్ని శుభాకాంక్షలతో..

  7. సాయి పద్మ says:

    చాలా మంచి కథ దమయంతి గారూ .. చాలా విషయాలు తీసుకున్నారు ..ముఖ్యంగా , ముగ్గురు స్నేహితుల మధ్య వైరుధ్యాలు , వైవిధ్యాలు బాగా చూపించగలిగారు .. కడవరకూ నిలిచేది మాత్రం స్నేహమే అనే ఒక పాయింట్ తో ముగిసిన కథ .. చాలా బాగుంది .. నా వరకూ .. ఒకటే అనిపించింది , ఎవరికి కావలసినవి, వాళ్ళు తీసుకునే ..ఈ ప్రాసెస్ లో .. ఎవర్నీ తప్పు పట్టలేని ఒక పరిస్థితి ని చిత్రీకరించారు ..!!

    • ” ఎవరికి కావలసినవి, వాళ్ళు తీసుకునే ..ఈ ప్రాసెస్ లో .. ఎవర్నీ తప్పు పట్టలేని ఒక పరిస్థితి ..’

      * చాలా అద్భుతం గా చెప్పారు సాయి పద్మ గారూ!
      మీతో మాట్లాడుతుంటే నాకొక శాస్త్రజ్ఙుని మాటలు గుర్త్తుకొస్తున్నాయి. ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పే ప్రాసెస్ లో నే అంటాడు ఆయన. – “మెజారిటీ జనం మెచ్చారని అదే నిజమనుకుంటే పొరబాటు ‘ అని!ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు, మనం అనేక పరిశోధనలు చేయడానికి అనిపిస్తుంది నాకు.
      మీ స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

  8. డెభ్భైల్లోకి వెళ్లిపోయామా అనిపించింది, ఒక స్త్రీ ఈ కథ వ్రాయటం, అనేక స్త్రీలు దీనికి పాజిటివ్ గా స్పందించటం చూస్తుంటే! జెండర్ పాలిటిక్స్ పక్కకు పెట్టినా, ఒక సంఘటనను వివరించటమే తప్ప, దాని వెనకాల ఉన్న కారణాలను చూచాయగా సూచించి వదలి పెట్టటంతో, ఒక కథగా నాకు అసంతృప్తినే మిగిల్చింది. కొన్ని “కోట్” చేయదగ్గ వాక్యాలున్నా, ఏ రకంగా చూసినా నాకు అస్సలు నచ్చని కథ!

    • 1. @డెభ్భైల్లోకి వెళ్లిపోయామా అనిపించింది, ఒక స్త్రీ ఈ కథ వ్రాయటం, అనేక స్త్రీలు దీనికి పాజిటివ్ గా స్పందించటం చూస్తుంటే!
      *అంటే, డెభ్భైల తర్వాత ఎప్పుడు ఒక స్త్రీ కథ రాసినా, అనేక స్త్రీలు పాజిటివ్ గా స్పందించలేదు ‘ అనా? మీ అభిప్రాయం!

      2. @జెండర్ పాలిటిక్స్ పక్కకు పెట్టినా,
      * మీరు ఏ సందర్భంగా ఏ అర్ధం వచ్చేలా ఈ ‘జెండర్ పాలిటిక్స్’ అనే మాట వాడారో అనే విశ్లేషణని పక్కన పెట్టేసి, చూస్తే..నాకనిపిస్తోంది ‘ పాలిటిక్స్ ‘అనే పదానికి గల అసలైన నిర్వచనాన్ని తీసుకుని మా జెండర్ పురోభివృధ్ధి కోసం పాటు పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందనిపిస్తోంది.
      ఇక, ఇప్పుడు – నా మాట కొచ్చారు చూద్దాం.

      3. @ ఒక సంఘటనను వివరించటమే తప్ప,
      * నా ఉద్దేశం కూడా అదే. కాబట్టి నేనెదురుచూసిన సమాధనం మీ నించి రావడం నాకు ఆనందంగా వుంది.

      4. @….దాని వెనకాల ఉన్న కారణాలను చూచాయగా సూచించి వదలి పెట్టటంతో,
      * ఆ మధ్య ఒక సంపాదకులు నాకు ఫోన్ చేసి మంచి కథ రాసివ్వండమ్మా అని అడిగారు. “తప్పకుండానండి. మెస్సేజ్ ఓరియెంటెడ్ కథొకటుంది..పం..”అని నేను అనేలోపే అడ్డుకుంటూ..”వొద్దమ్మా..ఆ పని మాత్రం చేయకండి. ఈ రోజుల్లో సందేశాలు ఎవరికీ అఖర్లేదు. అవి చదివి బాగుపడాలని కోరుకునే దశలో లేరు మన పాఠకులు..” అని చెప్పి ముగించారు.
      ఇలా వుండండి, అలా బ్రతకండి అని చెప్పే అధికారం ఎవరూ ఎవరికీ ఇవ్వడం లేదు. మీరు చెప్పారు చూశారూ! – ‘కారణాలను చూచాయగా సూచించి వదలి పెట్టానని..’ ఇది కరెక్ట్! – థాంక్యూ. (ఏవిటో, మీ లేఖ లో అన్ని వాక్యాలూ నాకు ప్లస్ పాయింట్స్ గానే తోస్తున్నాయి.)

      5.@ ఒక కథగా నాకు అసంతృప్తినే మిగిల్చింది.
      * ఇది కూడా నిజాతినిజమేనండి. నేను రాసింది అసలు కథైతే కదా!.
      కాదు. ఇది కొందరి వ్యధ మాత్రమే.

      6. @ కొన్ని “కోట్” చేయదగ్గ వాక్యాలున్నా,
      * ఆ! ఏదో లేండి! మీరు మంచి సర్టిఫికేటే ఇచ్చారు. సంతోషం.

      7. @ ఏ రకంగా చూసినా నాకు అస్సలు నచ్చని కథ!

      * యాజి గారూ, మీ అభిప్రాయాన్ని గౌరవం తో స్వాగతిస్తున్నానండి!
      చదివే వాళ్ళు తక్కువైపోతున్న ఈ రోజుల్లో ఎంతో కొంత సమయాన్ని కేటాయించి, కథంతా పూర్తిగా చదివి, ‘ బాగుంది, లేదా బాగోలేదు’ అని కేవలం చెప్పి ఊరుకోకుండా, కథనింత చక్క గా విశ్లేషించి చెప్పిన మీ వైనానికి నా మనః పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ
      నమస్సులతో..

  9. మానవ బంధాలు సడలుతున్నాయి. ఆ ఫలితమే వివాహ బంధాల సడలింపు.ఇలాంటి నమోదుకాని బంధాలు ఉంటూన్న మాట నిజమే. మొదట మోహన్ అతని భార్య తమబంధం ఎప్పుడు గాడితప్పిందో గమనించుకొని ఉంటే, తమబంధానికి విలువ ఇచ్చుకుని, సరిచేసుకొని ఉంటే రెండవ బంధం ప్రసక్తే లేదు. కథానాయిక వంటి ఆధునిక మూర్ఖులు కనిపిస్తూనే ఉన్నారు. ఎంత మంచి వారైనా గోతిలోకి గంతేస్తే పళ్ళురాలక మానవు. బలవంతులకే బ్రతుకైన ఈ లోకంలో స్వయంగా బలమైన స్థానాన్ని వదలుకొని ప్రమాదంలోకి ప్రవేశించటం ముమ్మాటికీ మూర్ఖత్వమే!

    • * కామేశ్వరి గారూ, మీ రంటోందీ నిజమే. – ‘ మాన బంధాలు సడలుతున్నాయి.’
      ‘ నమోదు కాని భంధాలు ‘ పెరుగుతున్న మాటా వాస్తవమే. ఎందుకు, ఎలా అనే కారణాల కోసం వెదకినప్పుడు దొరికే జవాబులే మనల్ని
      న మ్మలేనంత ఆశ్చర్యా నికి గురి చేస్తాయి. ఆవేదనని మిగిల్చి పోతాయి.
      ‘బలవంతులకే బ్రతుకైన లోకం’ అనే బరువైన మీ మాటలు అందర్నీ ఆలోచింపచేస్తాయి.
      కథ చదివి, మీ విలువైన అభిప్రాయాన్ని వ్యక్తపరచినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంతూ..
      శుభాభినందనలతో..

  10. స్వాతీ శ్రీపాద says:

    దమయంతి గారూ

    కదా బాగుంది. యుగయుగాలుగా ఇప్పటికీ కొనసాగుతున్న కధే. ఎవరు ఎందుకు ఎవరికీ నచ్చుతారనేది వెయ్యి వరహాల ప్రశ్న. ఎవరు ఎవరికీ ముడి వాడి ఉంటారన్నదీ అనూహ్యమే. గొప్పగాఢత ఉంటే తప్ప కడవరకూ డబ్బూ నిలవదు ,అనుబంధమూ నిలవదు. తప్పొప్పుల ప్రసక్తి వస్తే అవి మానవ అవసరాలను బట్టి రోజురోజుకీ మారిపోతూనే ఉన్నాయికద. మోహన్ భార్యకు నచ్చని అతను స్నేహకు ఎలా ఎందుకు నచ్చినట్టు? వీటికి జవాబులుండవు. అయితే పెళ్ళి అనేది కావాలనుకున్నప్పుడు అక్కడ ఇంకొంత వివరణ కావాలి. ఎవరికోసం ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి అవసరమా / మళ్ళీ ఇక్కడ సమాజానికి తలవంచుతున్నారా? ఇది ఒక కాంప్లికేటెడ్ ఇస్స్యూ. కధనం చదివించేలా బావుంది.

    • .
      స్వాతి గారూ,
      మిమ్మల్నిక్కడ కలుసుకుని మాట్లాడుకోవడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
      * ఎవరూ నొచ్చుకోనవసరం లేని ఒక నిజాన్ని ఖచ్చితం గా చెప్పారు. ‘యుగయుగాలుగా ఇప్పటికీ కొనసాగుతున్న కథే.’ అని!
      * మరో నిజం – ‘ ఎవరు, ఎందుకు నచ్చుతారనేది వెయ్యి వరహాల ప్రశ్న..’ అనే మీ ప్రశ్నకి చాలా హృదయాలు మౌనంగా జవాబిస్తాయి. ఈ విషయం లో ఎవరికి వారే జవాబుదారులు కావాలి. తప్పదు.
      * తప్పొప్పుల ప్రసక్తి వస్తే అవి మానవ అవసరాలను బట్టి, రోజు రోజుకీ మారిపోతేనే ఉన్నాయి కద ‘ అనే మరో నిజాల ఇజాన్ని కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి లో వున్నాం.
      ఆర్ధి శాస్త్రం లో మొదటి పాఠం..ఆర్ధికాభివృధ్ధి అంతా మనిషి కోర్కెలని అల్లుకుని వుంటుంది. ఉత్పత్తి కైనా, డిమాండ్ కైనా అదే మూలం. అదే సర్వస్వమూ.
      హార్దిక శాస్త్రం కూడా బహుశ ఇదే సూత్రాన్ని ఆలంబన గా చేసుకుంటోందా?
      మనిషి లో వస్తుపరమైన వాంఛల కంటేనూ, గుండె నిండిపోయే వలపు బ్రతుకొక్కటి చాలు అనే కంక్లూజన్ కొస్తున్నట్టు తోస్తుంది.

      * పెళ్ళి అవసరమా అనే ప్రశ్నలకి ఉన్నత న్యాయస్థానం వారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివరణలిస్తున్నారు, మనం రోజూ పేపర్లలో చదువుతూనే వున్నాం కదా!
      వివాహ వ్యవస్థని మార్చాల్సింది చట్టాలు కావు. మనుషులు.
      కఠిన నిబంధనలతో కాదు. కట్టుబడిన నైతిక నిబధ్ధతలతో!
      ‘..కాపురాలు నడవాల్సింది కత్తుల మీద కాదు.’ అనే సత్యాన్ని గుర్తించనంత కాలమూ ఈ ఘర్షణా సంఘర్షణలు తప్పవేమో!
      * నా కథ, కథనం బాగుందన్న మీ ప్రశంసకి నా హృదయపూర్వక ధన్య వాదాలు తెలియ చేసుకుంటూ..
      :-)
      అభివందనాలతో..

  11. ఆకునూరి మురళీకృష్ణ says:

    దమయంతి గారూ,

    కథ నాకు చాలా నచ్చింది. మీ శైలి అద్భుతం. ముగ్గురి స్నేహితుల పాత్రచిత్రణా చాలా బాగా కుదిరింది. మోహన్ స్నేహలు చేసేది తప్పు (సమాజ ఆమోదయోగ్యమైన పని కానిది) కనుక భవిష్యత్ లో ఇద్దరిలో ఎవరు ఎక్కువ మూల్యం చెల్లిస్తారో అని దామిని ఆలోచించడం, ఇలాంటివే మరికొన్ని వ్యాక్యాలూ ఆ పాత్రని చిత్రించడంలో రచయిత్రిగా మీ పరిణితిని సూచిస్తుంది.

    మోహన్ స్నేహలు చేసినది తప్పో ఒప్పో చర్చించడం అనవసరం కానీ, అలా సమాజ వ్యతిరేక పనులు చేయడానికి తెగింపు కన్నా ధైర్యం అవసరం. తన ప్రేమ విషయం ప్రాణ స్నేహితురాలికి పెళ్ళి ముందు రోజు వరకూ చెప్పకుండా దాచడం, పెళ్ళి కుదిరిందని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం చూస్తే, ఈ పెళ్ళి చేసుకోవడం వెనుక స్నేహకి ధైర్యం కన్నా తెగింపే ఎక్కువన్న విషయం అర్థమౌతోంది. తప్పు చేస్తున్నానన్న భావనలో వున్న ఆమె పెళ్ళి చేసుకున్నాక భవిష్యత్ లో ఏమాత్రం సుఖంగా వుంటుందో అనుమానమే. దామినితో పెళ్ళికి ముందు స్నేహ మనసు విప్పి మాట్లాడితే దామిని ఆమెకీ విషయం చెప్పగలిగి వుండేదేమో? అన్న ఆలోచనలు నాకు కథ చదువుతున్నప్పుడు కలిగాయంటే, అది చాలు మీరు కథనెంత సహజంగా రాసారో చెప్పడానికి.

    ఇలాంటివి సమాజంలో చాలానే చూస్తూ వుంటాం. ఆ సమస్యని రాజీ, దామిని అన్న రెండు కళ్ళద్వారా ఒకేసారి చూపిస్తూ, కథని మీరు నడిపిన తీరు బాగుంది. మోహన్ భార్య పాత్ర ద్వారా కథలో మరో కోణాన్ని కూడా స్పృశించారు.

    మీ కథ, దాని మీద పాఠకుల స్పందన, మీ సమాధానాలూ, చర్చ చూస్తుంటే పాఠకులకి చేరువవడంలో వెబ్ మ్యాగజైన్లు ముందున్నాయన్న మీ మాటలు నిజమనిపిస్తోంది.

    మీ శైలీ వాక్యాలూ, చాలా బాగున్నాయి.( ఈ కథలో రెండు ఊహూ లు వున్నాయి- హ హ) శుభాకాంక్షలతో,

    ఆకునూరి మురళీకృష్ణ

    • + కద నాకు చాలా నచ్చింది. మీ శైలి అద్భుతం. ముగ్గురి స్నేహితుల పాత్రచిత్రణా చాలా బాగా కుదిరింది. మోహన్ స్నేహలు చేసేది తప్పు (సమాజ ఆమోదయోగ్యమైన పని కానిది) కనుక భవిష్యత్ లో ఇద్దరిలో ఎవరు ఎక్కువ మూల్యం చెల్లిస్తారో అని దామిని ఆలోచించడం, ఇలాంటివే మరికొన్ని వ్యాక్యాలూ ఆ పాత్రని చిత్రించడంలో రచయిత్రిగా మీ పరిణితిని సూచిస్తుంది.
      * కథ ఎందుకు నచ్చిందో, మీరు చెప్పిన విధానం నాకు భలే ఆనందాన్నిచ్చింది మురళి కృష్ణ గారూ!

      + పెళ్ళి చేసుకోవడం వెనుక స్నేహకి ధైర్యం కన్నా తెగింపే ఎక్కువన్న విషయం అర్థమౌతోంది.
      *అయి వుండొచ్చు. :-)

      +. తప్పు చేస్తున్నానన్న భావనలో వున్న ఆమె పెళ్ళి చేసుకున్నాక భవిష్యత్ లో ఏమాత్రం సుఖంగా వుంటుందో అనుమానమే.
      * నాకు మాత్రమా లేదంటారా ఆపాటి అనుమానం. మీరు భలే వారే!

      +.దామినితో పెళ్ళికి ముందు స్నేహ మనసు విప్పి మాట్లాడితే దామిని ఆమెకీ విషయం చెప్పగలిగి వుండేదేమో?
      అదే నేను చెప్పాలను కున్న విషయం కూడా అదే!
      ఒక వేళ స్నేహ దామినితో చెప్పినా, ‘ తప్పమ్మా. నిప్పుని ముట్టుకుంటున్నావ్. జీవితం తగలబడి పోతుంది’ – అని దామిని నీతి (?) చెప్పబోయినా స్నేహ వింటుందని కానీ, విని జ్ఞానోదయమైపోయిన దాన్లా, మోహన్ కి గుడ్ బై చెప్పేస్తుందని కానీ, ఊహు. నాకు నమ్మకం లేదు.
      అందుకే, ముందుగా చెప్పకపోడమే మంచిది.

      *…అన్న ఆలోచనలు నాకు కథ చదువుతున్నప్పుడు కలిగాయంటే, అది చాలు మీరు కథనెంత సహజంగా రాసారో చెప్పడానికి!
      * థాంక్ యౌ..థాంక్యూ! :-)

      +ఇలాంటివి సమాజంలో చాలానే చూస్తూ వుంటాం. ఆ సమస్యని రాజీ, దామిని అన్న రెండు కళ్ళద్వారా ఒకేసారి చూపిస్తూ, కథని మీరు నడిపిన తీరు బాగుంది. మోహన్ భార్య పాత్ర ద్వారా కథలో మరో కోణాన్ని కూడా స్పృశించారు.
      * అవును. నాకు చాలా ఇష్టం ఆ పాత్రంటే.

      మీ కథ, దాని మీద పాఠకుల స్పందన, మీ సమాధానాలూ, చర్చ చూస్తుంటే పాఠకులకి చేరువవడంలో వెబ్ మ్యాగజైన్లు ముందున్నాయన్న మీ మాటలు నిజమనిపిస్తోంది.
      * ఇప్పుడైనా నమ్ముతారా? నేనెప్పుడూ నిజాలే మాట్లాడ్తానని! :-)

      మీ శైలీ వాక్యాలూ, చాలా బాగున్నాయి.( ఈ కథలో రెండు ఊహూ లు వున్నాయి- హ హ) శుభాకాంక్షలతో,
      * ఏమిటీ వెక్కిరింతే? ఊహు. ఒప్పుకోను.

      . -ఆకునూరి మురళీకృష్ణ.
      * చాలా చాలా ధన్య వాదాలు మురళీ కృష్ణ!
      కథ చదవడమే కాకుండా, ఎంత గొప్ప వ్యాఖ్య రాసారు! రియల్లి గ్రేట్.
      ఒక రచయిత మరో రచయితని మెచ్చుకోవడం, ప్రశంసించడం..రచయిత సంస్కారానికి తార్కాణం. మనః పూర్వక ధన్యవాదాలు మీకు!
      తనకో కథ కావలంటూ నన్నడిగి ,
      ఈ కథ తో బాటు నన్నిక్కడ వరకు తీసుకొచ్చిన షరీఫ్ కి,
      ప్రచురించిన సారంగ సంపాదకులకు, ఇంకా, కల్పన గారికి, చదివి మెచ్చుకున్న అందరకీ నా హృదయపూర్వక ధన్య వాదాలు తెలియచేసుకుంటున్నాను.
      శుభాభినందనలతో..
      విధేయురాలు…

      • ఆకునూరి మురళీకృష్ణ says:

        నా వ్యాఖ్య కన్నా మీ వ్యాఖ్యానం బాగుంది. థాంక్యూ దమయంతి గారూ, కథని ప్రేమించే మీరు మరిన్ని మంచి కథలు రాయాలి.

      • తప్పకుండా నండీ ! థాంక్యు!
        శుభాభినం దనలతో…

    • దమయంతి గారు ..ఎంత మంది ప్రశంసించిన నా స్పందన నాదే కదా
      కథను నడిపిన తీరు మాలాంటి వారు నేర్చుకునేలా ఉంది కథాశం మన సమీప బంధువు గాథలా ఉంది ఇలాంటివి ఎన్నెన్నో చూస్తుంటాము ..వారి భందం గురించి వ్యక్యానం చేస్తుంటాం కాని
      ఎవరి ఆమోదాలు తలవంచక కొన్ని భంధాలు ఏర్పడి పోతుంటాయి..
      ఏర్పడినంత సులువుకాదు అవి కొనసాగించడం నిలుపుకోవడం అది వారి మానసిక అవసరం
      అల్లుకున్నప్పుడు రాని ఆలోచనలు ఆ తరువాత వస్తాయి ..“చట్టం – మనిషిని తప్పు చేయకుండా కాపాడగల్గుతుంది కాని, మనసుల్ని కాదు.. చట్టం పరిధి లో ఉండే తప్పులు వేరు అ నై తికత వేరు ..తమకి తోచిన న్యాయం వేరు ..
      అదో పెను ఉప్పెన అందులో కొట్టుకుపోతారు ఒప్పుకుంటే పెళ్లితో కాదంటే రహస్యంగా .. వీలయితే బాహాటంగా ..

      నీవు రాకుంటే నేను పెళ్ళే జరుగదు అన్నది కూడా వట్టి మాటే ..యెవరాపినా ఆగదది ..
      ఆడ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే – మొగుడు బయటెన్ని వెధవ పన్లు చేసినా, గడపలోపలకొచ్చి పడితే చాలు.’ అనుకుంటారు. తప్పులన్నీ సర్వం తుంగలో తొక్కేసి, తెగ క్షమించేస్తారు. ఆ మరు క్షణాన్నే అంతా మరచి పోయి, పైగా అదంతా ఎన్ని జన్మల కిందట జరిగిన సంగతో అన్నట్టు, తమకేవీ గుర్తుకు రానట్టు ఎంత హాయిగా ప్రేమించేస్తారేం? మొగుళ్ళని!

      ఓకే నిస్సహాయ స్తితి లో తాగు బోతూ మొగుడి తాగుడు ఆపలేక జీతం మొత్తం నాకు ఇచి ఏమయినా చేసుకో అన్నవారిని చూస్తాం … పర స్త్రీ పరిధి లోకి వెళ్ళాక ఇక ఏమి చెయ్య లేనపుడు ఆర్థిక రక్షణకు పాకిసలాడుతారు మోహన్ భార్య ని తప్పు పట్ట గలమా .. ఆస్తి రాయించు కోవడమేమిటి అతన్ని రాయించు కోవాలి గాని …కాని అతన్ని మొదటే రాయించుకున్ది ఆ రాత గీత అతను ఎప్పుడో దాటేసాడు .
      మూడో వ్యక్తి ప్రవేశం కాదు మూడో వ్యక్తిని ఆహ్వానించా క ఇలాగె జరుగుతుంది ..

      చదువుకున్న ప్రతి వెధవాయికీ, లోకం తీరు తెలీదని, బ్రతకడం రాదనీనూ.

      మనిషి వేరు. ఆర్జించే జ్ఞానం వేరు. మెదడు వేరు. మనసు వేరు. ప్రతిభ వేరు. లౌక్యం వేరు. అన్నీ వేర్వేరు శాఖలే అయినప్పటికీ, వీటన్నిట్నీ కలిపి మోసే వృక్ష కాండం మాత్రం ఒకటి కాదు అనిపిస్తుంది.
      తూనీగ ల్లాంటి ఆడ పిల్లలు పెళ్ళయ్యాక ఇంటి ఈగలౌతారని విన్లేదెమో తను బహుశా!

      పరుగుల సం ద్రాన్ని అడ్డుకునేందుకైతే ఒడ్డు కావాలి కానీ, విరుచుకు పడుతున్న సునామీ కేమవసరం?

      కష్టం లో వుంటే ఓదార్చొచ్చు. ముంపులో లో మునిగిన ఆమేకేం పని నా జాలి నిట్టూర్పుల తో !
      లాంటి వాక్యాలు నాకు చాలా నచాయి
      మొత్తము మీద మంచి ఆలోచనాత్మకమయి నా కథ రాసి చదివిన్చిందుకు ధన్యవాదాలు

      • హబ్బ!
        ఎక్కడా ఆగనీ కుండా చకచకా చదివించి పారేసారు, ఉమాదేవి గారూ !
        విమర్శ, ప్రశంస ల జుగల్బందీలు నన్నుక్కిరి బిక్కిరి చేసేసాయంటె నమ్మండి.
        అవునూ,
        నా నించి మీ..రు!.. నే..ర్చు..కో..వ..డ..మా?
        ఏమిటీ అతిశయోక్తి సుమీ ! :-)
        కథని ఆమూలాగ్రం చదివి, మీ విలువైన అభిప్రాయాన్ని అంద చేసినందుకు
        నా హృదయ పూర్వక ధన్య వాదాలు తెలియ చేసుకుంటూ..
        శుభాకాంక్షలతో…

  12. K. V. Suresh says:

    చాలా చాలా సహజం గా ఉందండి మీ కథ…ముఖ్యంగా రాజీ పాత్ర మా పక్కింటి ఆంటీలా ఉంది. కొన్ని వాక్యాలు చదువుతుంటే మీరు జీవితాన్ని కాచి వదపోసారనిపించింది. ముక్యంగా “సరిగ్గ మనమిక్కడే పొరబడుతూ వుంటామేమో తెలీదు. మనం మనుషుల్ని ప్రేమిస్తున్నంత తేలిగ్గ, వారి వ్యక్తిత్వ లోపాలని మన్నించలేకపోవడం వల్లో, ఒప్పుకోవడం రాక వల్లో ..ఇలాంటి పరిస్థితి కి లోనవుతుంటామేమో!”..అక్షర లక్షలు!! మీ రచనా శైలీ నన్ను ఆగకుండా చదివించింది. ఇంక కధ విషయానికి వస్తె, నా ద్రుష్టి లో మంచి, చెడు అనేవి లేవు. మన అవకాశాన్ని బట్టి వాటి మీనింగ్ మారుతుంది అని నా అభిప్రాయం. ఇక్కడ స్నేహ తీసుకొన్న నిర్ణయం యొక్క పలితం ఎలా ఉంటుందో చర్చ అనవసరం. అది కాలమో, లేక స్నేహ అండ్ మోహన్ యొక్క జీవితం పైన ఉన్న అవగాహన లేక పరిపక్వత మీద ఆదారపడి ఉంటుంది. నాకు చాలా చెప్పాలని ఉంది, కాని నా బాష అందుకు సహకరించటం లేదు.

    • ‘ నా దృష్టి లో – మంచి, చెడు అనేవి లేవు.
      మన అవకాశాన్ని బట్టి వాటి మీనింగ్ మారుతుంది ‘
      -అని నా అభిప్రాయం. – కె.వి. సురేష్.

      * చాలా గొప్ప అనాలసిస్! సురేష్ గారూ!
      జస్ట్ రెండురోజుల కిందట ఓ స్కాలర్ తో కూర్చుని మాట్లాడుతు న్నప్పుడు –
      ‘ రామాయణం, అందులోని పాత్రల విశిష్ట త’ – గురించిన చర్చ జరిగింది.
      రామాయణం గురించిన ఫలాన వారి విమర్శ ప్రస్తావనకొచ్చినప్పుడు
      అది చెల్లదన్నారాయన. కారణం విమర్శించడం తప్పు కాదంటూ తన అభిప్రాయాన్ని వివరించారు.
      రామాయణం త్రేతా యుగము నాటిది. ఈ యుగ ధర్మాలకి అన్వయించడం వాళ్ళ ఉపయోగం వుండదనేది వారి స్థిరమైన అభిప్రాయం.
      నిజమేననిపించింది. దరి దాపు మీ కామెంట్ లానే తోచింది.
      యుగ గ ధర్మాలు మారతాయి. మనుషులని బట్టి, వారి అనుభవాలను బట్టి, సాంఘిక కట్టుబాట్లలో ని లోపాలు బయట పడటం వాళ్ళ, కొత్త జీవన విధానాలు చోటు చేసుకుంటూ వుంటాయి.
      దాన్ని అనుసరించే – నీతి సూత్రాలు, ప్రజల ఆకాంక్షల మేరే – మారుతున్న చట్టాలు, జీవన విధాలు, జరుగు తున్న మార్పులు, పరిశీలనాత్మక గ్రంధాల్నూ!
      ద్వంద్వ నీతులతో – ఎందర్నని, ఎన్నిసార్లని కట్టి పడేయగలం? – ఎవ్వరం కానీ!
      చాలా సంతోషం సురేష్ గారూ, మీ అభిప్రాయాన్ని తెలియ చేసినందుకు మనః పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
      శుభాకాంక్షలతో..
      :-)

  13. K. V. Suresh says:

    థాంక్ యు వేరి ముచ్ ఫర్ బ్యూటిఫుల్ రిప్లై మామ్. ఇక్కడ నాకు నచ్చిన ముళ్ళపూడి వెంకటరమణ గారి కోట్ చెప్పాలనిపిస్తుంది. మంచి చెడులు అనేవి రాసులు గా పొసీ ఉండవు… అవసరాన్ని బట్టి మంచి, చెడు పెరుగుతాయ్ … మంచివాడు అవసరాన్ని బట్టి చెడ్డ వాడు గా మారోచ్చు.. చెడ్డవాడు అవకాసం లేక మంచి వాడిగా మిగిలిపోవోచు. మీ రిప్లై లో మీరన్న మాటలు “ద్వంద్వ నీతులతో – ఎందర్నని, ఎన్నిసార్లని కట్టి పడేయగలం? – ఎవ్వరం కానీ!” చాలా బాగున్నది …..

  14. శ్రీనివాస్ శాస్త్రి says:

    దమయంతి మేడమ్
    కధా రచయితలందరూ మనోవైఙ్ఞానికులై ఉంటారా..!!
    ఇక్కడ గమనించగలరు నేను మనో వైద్యులు అనలేదు..
    చాలా రోజుల తరువాత సురేష్ గారి పుణ్యమా అని ఒక మంచి ఆలోచింపజేసే కధ చదవగలిగాను..
    ధన్యోస్మి మీ ఇద్దరికీ..
    కధ వరకు ఒక ఎత్తైతే, తరువాత ఉన్న స్పందన-ప్రతిస్పందనలు చాలా బావున్నాయి..
    మీకు ఇష్టమైన పాత్ర అని చెప్పి ఆ పాత్ర ఆలోచనా విధానం ఎక్కడా ప్రస్తావించలేదు..
    వేరే ఎక్కడైనా (మరో కధలో) చెప్పారా..??

    మరొక పర్యాయం మీకు సురేష్ గారికి ధన్యవాదాలతో.. శుభాకాంక్షలతో..

  15. శ్రీనివాస్ శాస్త్రి గారూ!ఎంత గొప్ప ఆశ్చర్యం, ఆనందము కలిగిందో మీ వ్యాఖ్యని చుడంగానే!
    ‘కధా రచయితలందరూ మనోవైఙ్ఞానికులై ఉంటారా ‘ అనే ఈ ఒక్క వాక్యం చాలు, ‘ రైటర్స్ పట్ల మీకు గల ఎనలేని గౌరవాభినాల కు నిలువెత్తు అద్దం లా నిలిచాయి అక్షరాలు ‘ – అని చెప్పేందుకు గర్వపడుతున్నాను.

    మీరెంత గొప్ప విశ్లేషకులు అంటే, కథ తో బాటు స్పందనా ప్రతి స్పందనలు కూడా మీ దృష్టిని దాటి పోలేదంటే ఎంత అబ్భురమేసిందో నాకు.
    శ్రీనివాస్ గార!మీరన్నట్టు,పేరు లేని ఆ పాత్రంటే నిజం గానే నాకు చాలా ఇష్టం. కొంతమంది మనుషుల్ని, వారి ప్రవర్తనా తీరుల్ని చూసినప్పుడు భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తారు. అర్ధం కాకపోయినా అలా ఎప్పటికీ గుర్తుండి పోతారు. అలాటిదే ఆ పాత్ర కూడా!
    ఒకే!
    ఇంతకీ ఈ కథ ని మీకు పంపింది సురేశ్ గారా! ఎంత మంచి స్నేహితులు మీరిరువురు!
    మా చిన్నప్పుడు మా స్నేహితులతో మేము కూడా ఇలానే, సాహిత్యాన్ని పంచుకుంటూ సాన్నిహిత్యాన్ని పెంచుకునే వాళ్ళం.
    తను ఒక నవల ఇస్తే, నేనొక వార పత్రిక ఇచ్చి, తనొక కథ గురించి చెబితే, నేనొక కొటేషన్ గురించి చెప్పీ..అలా, ఆ బంగారు రోజులు గుప్పున గుర్తుకొచ్చాయి..
    ఇప్పటికీ అంతే, ఇలానే నా ఫేస్ బుక్ లో షేర్ చేస్తుంటాను నన్ను అమితం గా ఆకట్టుకున్న రచనలను.
    చాలా చాలా ధన్య వాదాలు శ్రీనివాస్ శాస్త్రి గారు, ఇలా మీకు సారంగ ని పరిచయం చేసినందుకు నాకెంతో ఆనందం గా వుంది.
    మీ చేత నా కథ చదివించి, మీ అభినందనలు అందుకునే అవకాశాన్ని కలిగించిన మన సురేష్ గారికి,
    అందమైన అభిప్రాయాన్ని అందచేసిన మీకూ..
    మీ ఇరువురికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ..
    దసరా పండగ శుభాకాంక్షలతో..
    :-)

  16. మంచి వడి కల కథనం. ఆసక్తి కరంగా చెప్పారు. ఎటొచ్చీ విదేశం వెళ్ళి లా చదివి, సుమారు ముప్ఫయ్యేళ్ళున్న స్నేహనే నేను జీర్ణించుకోలేకపోతున్నా.

Leave a Reply to Vanaja Tatineni Cancel reply

*