సాతానువాచ

కిరణ్ గాలి

కిరణ్ గాలి

సందేహమెందుకు ?

నిస్సంకోచంగానే స్వార్ధాన్ని ప్రేమించు

స్వార్ధం నిషిద్ధ పదార్ధమేమి కాదు కదా

సంశయిస్తున్నవా?

పసిపిల్లలను చూడు…

ఎంత స్వచ్ఛం గా స్వార్ధంగా సహజంగా

సంతోషంగా వుంటారో

స్వార్ధం శత్రువనే భ్రమలో బ్రతుకుతావెందుకు?

ఎవరు కలిపించారీ అపోహ నీకు?

ఎవడు వినిపించాడీ ఉద్బోధ నీకు?

***

గతాన్ని తరచి చూడు

గాయాలను తడిమి చూడు

ప్రేమ రక్తపు చుక్కంత చిక్కగా వుండదని

తెలుసుకున్నావు కదా

స్వార్ధం అంతకన్నా చిక్కగా వుంటుందని

నేర్చుకున్నావు కదా

తెలుసుకున్న దాన్ని తెలివిగా

ఆచరించక పోతే మూర్ఖత్వం కాదా

స్వార్ధమే ప్రాణి నిజనైజం

ఈ పరమ సత్యాన్ని సమ్మతించు

తక్కిన దంతా అసత్యం, అహేతుకమని గ్రహించు

***

స్వార్ధాన్ని త్యజిస్తావా?

ఎవరి అభినందన, ఆమోదం , అంగీకారాలకై

అర్రులు చాస్తున్నావు?

స్వార్ధం లేని వాడంటే వెన్నుముక లేని వాడు

ఇతరుల సంతోషాల ఎంగిలాకులు ఏరుకొని ఆనందించేవాడు

స్వార్ధమంటే స్వాభిమానం

నీ ఉనికిని నువ్వు గుర్తించడం

నీ ఉన్నతిని నువ్వు గౌరవించడం

***

ballet-de-papa-chrysanth-me-1892

అంతో ఇంతో స్వార్ధం లేనివాడు

ఎంతో కొంత స్వలాభం కోరనివాడు

సమస్త భూమండలంలోనే వుండడు*

సామాన్యుడికి సంపన్నుడికి

మధ్య వ్యత్యాసం సామర్ధ్యంలో కాదు

స్వార్ధం సాంధ్రతలోనే వుంది **

ఎప్పుడైనా వేదికనెక్కిన వాడే కనబడతాడు

మెట్లై తొక్కబడిన వాళ్ళు కాలగర్భంలో ధూళై కలిసిపోవలసిందే

స్వార్ధాన్ని కాదని నువ్వు

ఏమి సాధించలేవు…సగటు తనాన్ని తప్ప

నిస్వార్ధం నిరర్ధక పధార్ధం

దాన్ని తాకినా తలచినా అది

నిన్ను నిలువునా విలువలేని వాడిగా మారుస్తుంది

నీదైనది కూడా నీకు దొరకకుండా పోతుంది

***

జీవితంలో గెలుపు కావాలంటే

స్వార్ధం తో పోరాడడం మాని

స్వార్ధంతో పోరాడడం మొదలు పెట్టు

సర్వకాల సర్వావస్తలందు

స్వార్ధంతోనే సహచరించు

స్వార్ధంతోనే సంభోగించు

కణకణము, నరనరము

స్వార్ధాన్నే శ్వాసించు

సర్వసుఖాలను, సకలైశ్వర్యాలను,

సమస్త గౌరవాది యశస్సులను

సదా పొందగలవు.

ఆమెన్

***

Foot Notes

*ఇందుకలదువానందులేదని సందేహము వలదు

స్వార్ధం సర్వోపధారి

ఎవరందు వెదికిన వారందు వుండును

**”సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్” జీవ పరిణామం

“సక్సెస్ అఫ్ ది సెల్ఫిష్” జీవన పరిణామం

–కిరణ్ గాలి

మీ మాటలు

 1. balasudhakarmouli says:

  svaardham meeda kavita baagundi.. kaanee yenduko……!

 2. C.V.SURESH says:

  కిరణ్! ఏటికి ఎదురీత లా స్వార్థాన్ని సబ్జెక్ట్ గా ఎ౦చుకొని పాఠకున్ని అసలు స్వార్థ౦ తోనే మనిషి బ్రతకాలి అని పలక పైన రుద్ది౦చారు. బావు౦ది. కాస్త నిడివి తగ్గి ఉ౦టే బావు౦డేదని నా అభిప్రాయ౦! కవిత అ౦తా ఒక ధోరణిలో సాగితే… ఈ రె౦డు వాఖ్యలు……”జీవితంలో గెలుపు కావాలంటే

  స్వార్ధం తో పోరాడడం మాని

  స్వార్ధంతో పోరాడడం మొదలు పెట్టు” ……….నన్ను నాలుగైదు సార్లు చదివి౦చేలా చేసి౦ది. కానీ ఏదో తేడా అనిపి౦చి౦ది. నిజ౦గా స్వార్థ౦తో నే జీవి౦చమని చెప్పారో? లేక సటైరిక్ గా కవిత అల్లారో తెలుసుకోవడానికి నా బుర్ర చాలడ౦ లేదు. any how కవిత బావు౦ది…..

 3. Thirupalu says:

  @స్వార్ధం తో పోరాడడం మాని
  స్వార్ధంతో పోరాడడం మొదలు పెట్టు@

  @సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్” జీవ పరిణామం
  “సక్సెస్ అఫ్ ది సెల్ఫిష్” జీవన పరిణామం@

  సైంటిపిక్‌ గానే ఉంది గాని, దాన్ని ఎన్కరేజ్‌ చెయ్యటం అన్‌ సైంటిపిక్‌! అందరికి వెన్నతో పెట్టిన విధ్య అయిన విషయం కవిత్వంలో చెప్పాల్సిన అవసరం లేదు! కవిత్వ మంటే ఒక లెర్నెడ్‌ బిహెవియర్‌! ఒకానొక ఉద్బోద! ఆత్మ సంత్రుప్తి! జంతు ప్రపంచంనుండి మానవ ప్రపంచాన్ని వేరు పరచటం! ఏదో తాత్వికతను కోల్పోయారు వెతుక్కొండీ!

  • Thirupalu says:

   ”సాతానువాచ ” లో ఏదో పాజిటివిటీ కనిపిస్తుంది.. మీ శీర్షికను నేను గమనించలేదు. సాతాను ఇలానే ఏడుస్తుంది స్వార్ధం తో!

 4. చాలా రోజుల తరువాత మీ కవిత చదవడం ఆనందంగా వుంది ,. .స్వార్దగీతం,.ఎందుకో,..అసంతృప్తిని మిగిల్చింది,. మీ నుంచి మరన్ని కవితలకై చూస్తూ,..

 5. mercy margaret says:

  చాల రోజుల తరువాత మీ కవిత చదవడం బాగుంది .. మీరు సంధించిన విల్లులా ఈ కవిత ప్రయోజనం చేకురాలాని, నెగెటివ్లోంచి పాజిటివ్ వైపుగా ఏదో నలిగిపోయిన క్షణాల నుంచి పుట్టుకొచ్చిన కవితలా ఉంది. ఇలాగే రాస్తూ ఉండండి.. !!

మీ మాటలు

*