దేశం నుదిటిపై పచ్చబొట్టు ‘బంజారా నానీలు ‘

 sri
 
       బంజారాలు అనగానే స్మృతి పథంపై మెదిలేవి మోదుగు పూల రంగు దుస్తులు, అద్దాల కాళీ (రవిక ), వెడల్పాటి భుర్యా (ముక్కుపోగు ), చెవులకు బుట్ట లోలాకులు, అలవోకగా వేసుకునే టుక్రీ (మేలి ముసుగు ), కాళ్ళకు బరువైన కడియాలు ధరించి ఇప్ప పువ్వంతటి ముగ్ధత్వంతో తండాలో చలాకీగా తిరిగే అమాయక యువతులు. కట్టెల మోపు ఎత్తుకుని సమీప నగరపు వాడల్లో తిరిగే చెమట పూలు, ఎడ్ల బండ్లు కట్టుకొని ఊరూరా తిరిగి ఉప్పమ్మే దేశదిమ్మరి తనం, ఎన్నో యేండ్ల తరువాత అంగట్లో కలుసుకొని దుఖాన్ని కలబోసుకునే తల్లీ కూతుళ్ళు, మోసం నేర్వని తండాలు, గాసం కోసం అడవంతా గాలించే స్త్రీ, పురుషులు ఇలా ఎన్నో..  ఎన్నెన్నో… ఇవ్వన్నింటినీ రంగరించి నానీలలో పోత పోసి తెలుగు కవిత్వపు వేదిక పై తండా ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేశారు డా. సూర్యాధనంజయ్.
       సాహిత్యం జీవితానికి ఉపనది లాంటిది. నదీ ప్రవాహంలో రాళ్ళు, రప్పలు, ఎత్తులు, పల్లాలు, ఆటంకాలు, వేగం, విశాలత్వం, ఉన్నట్టే ఈ నానీల నిండా బంజారా జీవితాల్లోని అనేక సంఘర్షణలు, మిట్ట పల్లాలు, సంసృతి, తండా బతుకు చిత్రాలు అడవి పూల పరిమళంలా పరచుకుని ఉన్నాయి.
      బంజారాలు, ఎరుకల, సుగాలీలు.. వీళ్ళంతా ప్రధాన స్రవంతికి దూరంగా తమ బతుకేదో తాము బతుకుతూ నిశ్శబ్దంగా ఈ లోకం లోకి వస్తున్నారు, కాల గర్భంలో కల్సి పోతున్నారు. ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ జీవితాలు, 1980 నుండి సాహిత్యంలో చోటు చేసుకుంటున్నా, గిరిజన జాతుల జీవితాలు, వారి అనుభవాలు ఎక్కడా సాహిత్య పుటల్లోకి ఎక్కలేదు. ఎక్కినా అతి తక్కువ. అలాంటి అమలిన, నాగరికత సోకని తండా పైకి ఒక కవిత్వపు కిరణాన్ని ప్రసరింపజేసి, బంజారా సంస్కృతి లోని అనేక రంగుల కాంతి పుంజాన్ని ఆవిష్కరిస్తున్నారు డా. సూర్యధనంజయ్.
      విత్తు తన కడుపులో మహా వృక్షాన్ని దాచుకున్నట్లు ఒక్కో నానీ ఒక్కో గాయాన్ని, శిథిలత్వాన్ని, బతుకు లోతును, తండా శకలాల్ని, జీవితపు పాకుడు రాళ్ళపై పైకెగబాక లేక అంతకంతకూ లోలోతుల్లోకి జారిపోయే తనాన్ని పట్టిచూపుతుంది. ఇటుకపై ఇటుక పేర్చినంత మాత్రాన ఇల్లు కానట్టు నానీ రాయడమంటే పిడికెడు  అక్షరాల్ని కుప్పగా పోయడం కాదు. ఇటుకల్ని కలపడానికి పదార్ధం పూసినట్టు, పదాల్ని  కలపడానికి, ఒక భావాన్ని ఆవిష్కరించడానికి కవిత్వాంశ ఏదో కావాలి. ఆ కవిత్వమనే పదార్థాన్ని కడవ నిండా నింపుకొని నానీల ముఖ ద్వారం గుండా తెలుగు కవిత్వ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన కవయిత్రి డా. సూర్యాధనంజయ్. ఒక్కో వ్యక్తీకరణ పాఠకుడిని కుదుపు కుదిపి, తండా చట్టూ గిర్రున తిప్పి, ఆ తిరుగుడు తనం దేహం నుండి దూరం కాకముందే బతుకు చిత్ర పటంపై నెమ్మదిగా నిలుపుతుంది. అప్పుడు అసలు భావ శకలంలోకో, బతుకు పుటల్లోకో ప్రవేశిస్తాం. కొన్ని నానీలు రోజంతా వెంబడించి కలల్లోకి కూడా దూసుకు వచ్చి కలవరపెడతాయి. స్వప్న ప్రలాపన చేపిస్తాయి. మనసు లోతుల్లో రోజుల తరబడి నానీ నానీ, ‘నానీ’ రూపాన్ని సంతరించుకున్నాయేమో చాలా నానీలు తడి తడిగా మట్టి ముద్రల్ని హృదయపు గోడలపై వేస్తాయి. కొన్ని పద చిత్రాలు కవయిత్రి ప్రతిభకు గీటురాళ్ళుగా నిలిచి అబ్బుర పరుస్తాయి.
                                     పడిలేచే
                                     కెరటాలు వాళ్ళు
                                     వారి జీవితాలు
                                     జయించిన కన్నీళ్లు
  “జయించిన కన్నీళ్లు” అనే పదచిత్రాన్నిబహుశా తెలుగు కవిత్వం ఇప్పటిదాకా చూళ్ళేదేమో . జ్ఞాపకాల బొట్లు, శ్రామిక తపస్సు, కళ్ళల్లో చెలిమల్ని మోయడం, గాయాల గూడు, కడుపమ్ముకోవడం, పచ్చపచ్చని మాటలు, విషాదానికి ఊరే గుణం, శ్రమలోంచి పుట్టిన మయూరం, బానెడు కష్టాలు, వలసల అలజడి వంటి పదచిత్రాలు పఠిత మనసు ముంగిట్లో మేలిమి రత్నాల్లా జలజలా రాలుతాయి. నానీల విలువను కవిత్వపు నిచ్చెన మీదుగా నెల వంకను ముద్దాడేలా చేస్తాయి.
          ప్రపంచీకరణ ఇనుప పాదం పల్లెల మీదా, బతుకుల మీదా మోపిన సందర్భంలో ఆయా ప్రాంతాలు, ఆయా కులాలు, ఆయా జాతులు తమ తమ అస్తిత్వాన్ని పదిలంగా రెండు చేతుల మధ్య కాపాడుకుంటున్నాయి. అందుకు బంజారాలు కూడా అతీతం కాదు. తండా నడి బొడ్డున నిలబడి అక్కడి సంస్కృతిని. జీవితాన్ని, కన్నీళ్లను, గాయాలను, అనుభవించి, కలవరించి, పలవరించి ఒక్కో నానీలో జీవితమంత విశాలత్వాన్ని, గాఢతను 20-25 అక్షరాల్లో సర్దేశారు కవయిత్రి. అందుకే తండా ప్రతీ ముఖం, ప్రతీ కోణం మనకు కనిపిస్తుంది. పుస్తకం నిండా తండా ముచ్చట్లే. ఒక్కటి కూడా ఊహపోహలతో రాసిన నానీ లేదు. ప్రతీ నానీ ఇప్ప పూల అందంతో తొణికిసలాడుతూనే, మట్టి పరిమళాన్ని వెదజల్లుతుంది. అంతే కాదు అక్కడక్కడ బంజారా భాషా పదజాలం కూడా అందంగా ఒదిగి పోతుంది. తీజ్ పండుగ నాటి మొలకల సహజత్వాన్ని చాటుతుంది. కవయిత్రి ఇందులో తన జాతి ఔన్నత్యాన్ని, సొబగుల్ని చెప్తూనే మూఢ ఆచారాల్ని, అమానవీయతను ఎండగడుతుంది.
                                   నోట్లో సారా చుక్కేసి
                                   ఆడ శిశువును చంపేస్తారా?
                                   తండాకు
                                   గుండె లేదా?
  అని ప్రశ్నిస్తుంది. తండా పట్లా. సమాజం పట్ల, సంపూర్ణ బాధ్యతతో రాసిన నానీలు ఇవి. నానీలన్నీ చదివేసిన తరువాత గుప్పెడు నెత్తురు మనసు పొరల్లోకి చిమ్ముకొస్తుంది. అంతరంగాన్నంతా అతలా కుతలం చేస్తుంది. అదే సమయంలో నానీలన్నీ బంజారా డ్రెస్ వేసుకున్న కన్నె పిల్లల్లా మారిపోయి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అందంగా మెలికలు తిరిగే లంబాడ నృత్యాన్ని చేస్తూ సుతి మెత్తని సందడి చేస్తాయి. ఈ నానీలు బంజారా సాహిత్యానికి సరి కొత్త చేర్పు. తండాకు నగరానికి మధ్య ఒక కవిత్వపు వంతెన.
                                   తాండే చ్వారి
                                   పోంటిల్ పక్డన్
                                   అబ్
                                   కాగజ్ శీత్లా కర్లత్!
                                         వెల్దండి శ్రీధర్

మీ మాటలు

*