జన్మభూమి

1016912_628010210545356_685997217_n

ప్రసాద మూర్తి

 

అమ్మనీ నాన్ననీ చూద్దామని ఊరెళ్ళాను . నేనొచ్చానని ఆనందం వారి కళ్ళల్లో,  తీసుకుపోతాడేమో అని బూచాడిని చూసిన పిల్లల్లా గుబులు వారి గుండెల్లో ఒకేసారి చూశాను. నాన్న తన మోకాలు చూపించి  అటూ ఇటూ ఊగించి ఇప్పుడు బాగుందని కూర్చుని లేచి మరీ నవ్వాడు. అమ్మ తన చేయి చూపించి అతుక్కుపోయింది నానా అంటూ  అటూ ఇటూ తిప్పి నన్ను నమ్మించడానికి తెగతిప్పలుపడింది. ఒంటరిగా ఉన్నా ఆరోగ్యంగానే ఉన్నారన్న సంతోషం ఎప్పుడూ ఒక విచారాన్ని వెంటబెట్టుకుని నన్నంటిపెట్టుకుని ఉంటుంది. ఆరోగ్యంగానే ఉన్నామన్న ధీమాతో అతిహుషారులో వాళ్ళు అప్పుడప్పుడూ కాలో చెయ్యో విరగ్గొట్టుకుంటూ ఉంటారు.

అప్పుడే సమస్య అంతా. వాళ్ళు నాతో రారు. నేను వాళ్ళతో ఉండలేను. డబ్బెంత పంపినా..మనుషుల్ని పెట్టినా ఇదో తెగని ఇనపతీగ సమస్య.   నేను అలా వారిని చూస్తూనే ఇల్లంతా కలయతిరిగాను. అమ్మ నా కళ్ళల్లో ఏదో వెదుకుతుంది. నాన్న నా కదలికల్లో ఏదో వెదుకుతాడు. నేను ఇల్లంతా తిరుగుతున్నట్టే వారి చుట్టూ తిరుగుతూ నా ఆరాలేవో నేను తీస్తాను. అమ్మ కళ్ళల్లో నా బాల్యపు ఆకాశాలు కనిపిస్తాయి. నా కళ్ళల్లో అమ్మ తన యవ్వన కాలపు బొమ్మల్ని చూస్తుంది.  

నా కూడా మా ఊరు చూద్దామని నాతో హైద్రాబాద్ నుంచి వచ్చిన మిత్రుడు రమేష్ లోపలేమనుకుంటున్నాడో కాని అంతా మౌనంగా చూస్తున్నాడు. వాడు ఆర్టిస్ట్. నేను జర్నలిస్టు. ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. సికిందరాబాద్ లో జన్మభూమి ట్రైన్ పట్టుకోని తాడేపల్లిగూడెంలో దిగి మా ఊరు చేరుకునే సరికి సాయంత్రమైంది. ఊరంతా చీకటి. ఊళ్ళో చీకటి మా ఇంట్లో కూడా తిష్ట వేసింది. పరిచయాలయ్యాయి.  ఎప్పుడో కొనిచ్చిన ఛార్జింగ్ లైటు బాగానే పనిచేస్తున్నట్టుంది. అది పట్టుకోని అమ్మ మా కూడా ఒకటే తిరుగుడు. నాన్న హాల్లో కూర్చుని ఒంటరిగా గోడతో ఏదో మాట్లాడుతున్నట్టుగా పోజు పెట్టాడు. రమేష్ ఎప్పడూ ఆట పట్టిస్తూ ఆంధ్రా దొంగా అని ముద్దుగా పిలుస్తుంటాడు. మేమెక్కిన రైలు తెలంగాణా బోర్డర్ దాటగానే సమయం కోసం ఎదురుచూస్తున్న వాడిలా పచ్చని పొలాలను చూసి ఇక ఒకటే లంకించుకున్నాడు. ప్రపంచంలో పచ్చదనమంతా మీ దగ్గరే పెట్టుకున్నారు కదరా దొంగల్లారా అని దారి పొడవునా తెగ తిట్లు. ఇదంతా మమ్మల్ని దోచుకున్నదే కదా అని ఒకటే శాపనార్థాలు. పక్కనున్న ఆంధ్రావాళ్ళు వింటే వాడితో తగాదా పడతారని నా భయం నాది.

కాని అలా ఏమీ జరగలేదు. వాడు నన్నే ఉడికిస్తూ..ఉడికిపోతూ..రైలుబండిలా దారిపొడవునా మోతే మోత. వాడి మాటలు నాకు అలవాటే కదా నేను నవ్వుతూనే ఉన్నాను. ఎప్పుడూ మా ఇంటికి రాలేదని ఒకసారి కొల్లేరు ట్రిప్ వేద్దామని వచ్చాం. మా ఇంటికి రాగానే దారిలో కానిచ్చిన నసుగుడంతా మర్చిపోయాడు. మా అమ్మానాన్న కూడా నేను, నా కూడా వాళ్ళు, మా కూడా రమేష్.. ఇలా అలిసిపోయేదాకా అటూ ఇటూ ఆ మాటలూ ఈ మాటలూ చెప్పుకుంటూ ఇల్లంతా  తిరిగాం. ఇంట్లో ప్రతీగోడ మీదా నా బాల్యం నీడల్ని తడిమి తడిమి మరీ మరీ చూసుకున్నాను. ఏమిటీ తిరుగుడు అనుకున్నాడో ఏమో ఒక్కసారిగా కుర్చీలో కూర్చుని “ అమ్మా కరెంటు ఎప్పుడొస్తుంది” అని అడిగాడు రమేష్.  అమ్మకి ఏం చెప్పాలో తెలియక “ ఏమయ్యో..కరెంటంట ఎప్పుడొస్తాది?” అని నాన్న వైపు మా మిత్రుడి ప్రశ్నను ఫార్వర్డ్ చేసింది అమ్మ.  ఆ..అంటూ సాగదీస్తూ నాన్న ఓ సారి ఫోనందుకో అన్నాడు. ఎందుకో అని అమ్మ నవ్వుతూ అడిగింది. “ఛీఫ్ మినిస్టర్ ని అడిగి చెప్తాను.” నాన్న వేసిన ఈ జోక్ తో చెలికాడు రమేష్ ఒకటే పగలబడి నవ్వాడు. ఏంట్రా సంపదంతా మీ దగ్గరే పెట్టుకుని మీకెందుకిన్ని కష్టాలు? అమాయకంగా అడిగాడు రమేష్. పగటికీ రాత్రికీ తేడా ఏంటో జనానికి తెలియజెప్పాలన్న తాపత్రయంలో మన నాయకులు ఇలాంటి ఘనకార్యాలు చేస్తున్నారు.  ఇందులో మాత్రం ప్రాంతీయభేదం లేదురా బాబూ.

అదోలా చూశాడు వాడు. ఇంతలో అమ్మ అందుకుంది. “కరెంటు మాట మర్చిపోయాం నాయనా. అది వచ్చినప్పుడు దాని అవసరం ఉండదు. అవసరం ఉన్నప్పుడు అదుండదు.”

‘దొంగలకు కూడా కష్టాలు తప్పవన్నమాట.’  చెవిలో గొణిగాడు రమేష్. ఇంతలో నాన్న బాత్ రూమ్ లో నీళ్ళు పెట్టాడు. డెభ్భయ్యేళ్ళు వచ్చినా తానింకా మిస్టర్ పెర్ ఫెక్ట్ అని  నిరూపించుకోవడానికి నాన్న ఒకటే ప్రదర్శన పెడతాడు. నేను వచ్చినప్పుడల్లా ఇది తప్పదు. అమ్మ కూడా చెంగుచెంగున తిరుగుతూ క్షణాల్లో వంట చేసి పడేసింది. ఎవరూ లేక ఇల్లు బోసిపోయినా వారు మాత్రం కళకళలాడుతూ  అప్పుడే పెళ్ళయిన కొత్త జంటలా ఉత్సాహంగా కనిపించారు మా వాడికి. నేను కూడా వీళ్ళెప్పటికీ ఇంతే ఆరోగ్యంగా ఉంటే ఎంత బావుండు అని ఆశపడుతూ ఉంటాను. అమ్మానాన్న కళ్ళ చుట్టూ కాళ్ళ చుట్టూ వారి కలల చుట్టూ ఒరుసుకుంటూ ప్రవహించిన నా బాల్యం తలపులు ఇక్కడికొచ్చినప్పుడల్లా నన్ను చుట్టుముడతాయి. వారు కూడా నాతో పాటే వస్తే అమ్మానాన్న పిల్లలై నా చుట్టూ తిరిగితే ఎంత బావుండు అనుకుంటాను. కాని వారికి పోటీ వచ్చేవారు నా చుట్టూ చాలా మందే ఉన్నారన్న స్పృహ నాకంటె వీళ్ళకే ఎక్కువ. అందుకే రారు.

“అదృష్టంరా మీ అమ్మా నాన్నా ఆరోగ్యంగా ఉన్నారు.” రమేష్ నార్మల్ గానే అన్నాడు.

“అంత లేదు. నేనెక్కడ నాతో తీసుకుపోతానో అని వారి హంగామా అంతే. నాకు పంచిచ్చిన రక్తం కంటె నాతో పంచుకున్న రక్తం మీద వారికి నమ్మకం లేదు.”

రాత్రి భోజనాల దగ్గర అమ్మ కొసరి కొసరి వడ్డించింది. అమ్మలంతా ఒకటే. నేను రమేష్ వాళ్ల ఊరు వెళ్ళినప్పుడు రమేష్ అమ్మ చేసిన హడావుడి..చూపిన ప్రేమ మర్చిపోలేను. అమ్మ ప్రేమ తట్టుకోలేక పోతున్నాడు  రమేష్.  కొంచెం ఇబ్బందిగానే ఉన్నా చాలా త్వరగా వాళ్ళమ్మకీ మా అమ్మకీ తేడా మర్చిపోయి చనువుగానే మెలగడం మొదలుపెట్టాడు. ఆ చనువుతోనే ఏవేవో అడగడం స్టార్ట్ చేశాడు. అమ్మ, నాన్నా అంతే చనువుగా జవాబులు చెప్తున్నారు.

“ మీరు హాయిగా మాతోనే హైద్రాబాద్ లో ఉండొచ్చుగా అమ్మా. ఇక్కడెందుకు ఇంత ఒంటరిగా ఈ లంకంత కొంపలో?” అడగరాని క్వశ్చన్ అడిగేశాడు. అంతే అమ్మా నాన్నా బిగుసుకుపోయారు. మాటల్లేవు. మాట్లాడుకోవడాల్లేవు.

“అన్నట్టు పెద్దోడు పచ్చడి తీసుకు వెళతాడు. ఆ జాడీ తీసి కింద పెడతారా? ఎక్కడో అటకమీద పెడతారు. ఈయనగారి పచ్చడికోసమే దొంగలొస్తారు కాబోలు!” టాపిక్ డైవర్ట్ చేయడానికి  అమ్మప్రయత్నం.

‘అవును కదా..తీస్తానుండు!’ అని నాన్న అక్కడ నుండి లేచాడు. అమ్మ కూడా ఆయన్ని అనుసరించింది.

వాడికర్థంకాక నా మొహం చూశాడు.   ఏతల్లిదండ్రులూ రారు. ఉన్న ఊరినీ, పిల్లల్ని కనీ పెంచి పెద్ద చేసిన ఇంటినీ వదిలి అస్సలు రారు. పక్కనున్న పుల్లమ్మో ఎల్లమ్మో వారికి కొడుకుల కంటె కూతుళ్ళ కంటె దగ్గరవుతారు. వాళ్ళే సమస్తం చూసుకుంటారు. వాళ్ళు రాలేరు. బలవంతంగా తీసుకు వెళ్ళినా పోలీసులు ఎత్తుకుపోతున్న ఫీలింగ్.  ఒకవేళ మనతోపాటు వచ్చినా జైల్లో ఉన్నట్టు ఇబ్బంది. ఎవరి పనుల్లో వాళ్ళం పోయి, రాత్రి ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తారో..కొడుకూ కోడలూ మనవలూ ఎవరూ ఎవరితోనూ కనీసం మాట్లాడుకోవడాల్లేని బిజీబిజీ. ఈ లైఫ్ లేమిటో వారికసలు అర్థం కాదు. వద్దురా బాబూ! మన దగ్గర అన్నీ ఉన్నా ఉండాల్సిందే ఏదో లేదని వాళ్ళకు తెలుసు. రెండు రోజులకే సంచులు సర్దేస్తారు. అలాగని మనం ఊళ్ళకు  వచ్చేసి వారితోనే ఉండిపోవాలనీ కోరుకోరు. సంపాదన లేని బిడ్డలంటే వారికీ కొంచెం నలుగురిలో నగుబాటే మరి. ఇరుగుపొరుగుతో మన గురించి గొప్పులు చెప్పుకోవాలిగా. అంతే! అమ్మా నాన్న మనమూ  చిన్నప్పుడు కలిసి ఏం ఉన్నామో ఏం తిన్నమో.. ఏం గడిపామో అదే మనకు చివరికి మిగిలేది. వీలు కాని జీవితంలోంచి కొంత టైమ్ తీసి వారికోసం వీలుచేసుకుని అప్పుడప్పుడూ వెళ్ళడం మినహా మరో గత్యంతరం లేదు. మనం వెళ్ళినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం మాత్రం ఏ ప్రపంచ భాషలోనూ ఎవడూ వర్ణించి ఉండడు. కానీ ఈ మధ్య నేనొచ్చినప్పుడల్లా స్కూలుకి రాకుండా మారాం చేసే పిల్లల్ని తన  కూడా తీసుకు వెళ్ళడానికి వచ్చే బడిపంతుల్ని చూసినట్టు  నన్ను అనుమానంగా చూస్తారు. ఈ సారి ఏమైనా రమేష్ తో తీవ్ర ప్రయత్నం చేయించైనా సరే  కూడా తీసుకుపోవాలి. అదీ నా ప్లాన్. లేదంటే చెయ్యి విరిగిందనో..జబ్బు చేసిందనో..మాటిమాటికీ ఎవరెవరో ఫోన్లు చేయడం అస్సలు తట్టుకోలేం.

దొడ్లో  ఆరుబయట ఆకాశం కింద మంచాలు వేసుకున్నాం. అమ్మా నాన్న త్వరగానే పడుకుండిపోయారు.

మేం ఏదేదో మాట్లాడుకుంటూ ఆకాశాన్ని చూస్తూ రాత్రిని ఆస్వాదిస్తూ చుక్కల్ని లెక్కపెడుతూ ఎప్పుడో కాని నిద్రలోకి జారుకోలేదు. నగరాల్లో దొరకని అనుభవం కదా. బాల్యంలో పొందిన ఆనందం కదా. ఆ జ్నాపకాలు, ఇప్పటి ఇరుకు బతుకుల చికాకుల అనుభవాలు, ఇద్దరికీ ఒకే గతం కాబట్టి మాటలూ మౌనం కలగలిసిన ముచ్చటైన రాత్రిని బాగానే ఎంజాయ్ చేశాము. నాలుగింటికే నాన్న లేచిపోయాడు. చీపురు పట్టుకుని వాకిలి..ఇల్లూ పరపరా ఊడ్చేశాడు. అమ్మ కూడా లేచి తెల్లారక ముందే స్నానం చేసి పనుల్లో పడింది. వాళ్ళ రొటీన్ అలవాటే కాబట్టి నేనూ లేచి కాసేపు వారి చుట్టూ తిరుగుతూ ఏవేవో కబుర్లు చెప్తూ గడిపాను.

నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో అమ్మ నన్ను తెల్లవారు జామునే లేపేది. లాంతరు దగ్గర నేను చదువుకుంటుంటే అమ్మ మజ్జిగ కవ్వం తిప్పేది. ఆ శబ్దం భలే ఉంటుంది. బహుశా ఆ సవ్వడి వినే దొడ్లో మందారం..నంది వర్థనం, గన్నేరు పూలు రేకులు విప్పి నవ్వేవి. ఆ శబ్దం తాకిడికే ఎద్దుల మెడల్లో గంటలు ఘల్లున మోగేవి. పనిపాటలకు పోయే రైతుల కూలీల అరుపులు కేకలు మొదలయ్యేవి. అమ్మ కవ్వం చప్పుడు ఆగిందంటే అక్కడొక వెన్నెల ముద్ద నాకోసం తయారైనట్టే. దానికోసమే త్వరగా మొహం కడుక్కోవడం జరిగేది.  ఇప్పుడు నగరంలో బిజీబిజీ జీవితం..ఇద్దరు పిల్లల అల్లరి..అప్పుడప్పుడూ ఏ తెల్లారుజామునో అమ్మ కవ్వం చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. కానీ అమ్మే కనిపించదు.

రమేష్ లేచినట్టున్నాడు. అప్పుడే తెల్లగా తెల్లారి వెలుగులు మా ఇంటి పెరటి గుమ్మం ముందు తచ్చాడుతున్నాయి చుట్టం ఎవరో వచ్చారని చూడ్డానికి వచ్చినట్టు. చిన్న బల్లమీద ఉన్న బిందెలో నీళ్ళు ముంచుకుని తాగబోయాడు రమేష్. అమ్మ ఎక్కడ చూసిందో కాని ఒక్కసారిగా అరిచింది.

‘వద్దు నాయనా!ఆ నీళ్ళు కాదు. ఆగు ఇస్తాను’ అని లోపలికి వెళ్ళి చెంబు నిండా మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఆశ్చర్యం రమేష్ మొహం మీద మెరుపులా మెరిసింది.

“ఒక్క చుక్క మంచినీరు దొరకడం లేదురా. పొరుగూరి నుంచి వస్తున్న మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు నువ్వు తాగబోయిన నీళ్ళు కూడా స్థానిక ఎమ్మల్యే గారి పుణ్యమా అని టాంకుతో చేస్తున్న సరఫరా. అవి తాగడానికి పనికి రావని వంటకు వాడుతున్నాం. ఈ సరఫరా కూడా ఈ మధ్యనే మొదలు పెట్టారు. త్వరలో ఎన్నికలొస్తన్నాయ్ కదా. “ అమ్మ వివరణ.

“అరేయ్..వచ్చేప్పుడు పెద్దపెద్ద ట్యాంకులు చూశాం కదా?” రమేష్ ఆశ్చర్యం.

“బోర్డుంది..రోడ్డు లేదన్నట్టు..ట్యాంకులుంటాయి. నీళ్ళే ఉండవు.” నా సవరణ

“అదేంటిరా మా దగ్గర  దొంగిలించిన నీరంతా ఏమైపోయింది? అది  మీ  దాహం తీర్చడం లేదా..? ఆశ్చర్యంగా ఉందే?” నాకు మాత్రమే వినపడే  రమేష్ ప్రశ్న.

“అంత ఆశ్చర్యం వద్దురా.  చుట్టూ నదులు కాల్వలు  నిండుగా ప్రవహిస్తున్నాయి నిజమే. కాని అవి కొందరి ఇళ్ళవైపే పరుగులు తీస్తాయి.  ఇప్పుడిక్కడ బీద బిక్కీ ఇళ్ళల్లో  మాత్రమే కాదు ..మధ్యతరగతి  ఇళ్ళల్లో కూడా   ఎడారి ఇసుక మేటలు  వేసింది. నువ్వు నమ్మలేవులే కాని రా..అలా ఊరవతలకి వెళ్ళొద్దాం పద!”

ఇద్దరం బయటపడ్డాం. మా ఇంటి పక్కనే ఒక చెరువు ఉండేది. ఇది చిన్న చెరువు. మరొకటి పెద్ద చెరువు.  ఇందులో అసలు నీటి చుక్క జాడలే లేవు. గట్టుతో సమానంగా నేలపూడుకుపోయింది. నెర్రలిచ్చిన నేలలా మారింది. పుట్టి పెరిగిన తర్వాత ఇంత వరకు ఈ చెరువు ఇలా ఎండిపోవడం చూడలేదు.  ఒక్క పరుగులో ఇంట్లోకి వెళ్ళి అమ్మ అమ్మా అని కేకలు పెట్టాను. అమ్మ కంగారు పడి వంట గదినుంచి బయటకొచ్చింది.

“అమ్మా చెరువేంటే అలా ఎండిపోయింది?”

“అదా నాయనా..పూడిక తీయిస్తామని ఎండబెట్టారు. తర్వాత ఆ మాట మర్చిపోయారు. ఏంటో  చెరువెవరిక్కావాలి.. చెరువులో నీళ్ళెవరిక్కావాలి..జనమెవరిక్కావాలి..జనం పడే బాధలెవరిక్కావాలి!” ఇలా గొణుక్కుంటూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది.

‘త్వరగా వచ్చేయండిరా..వేడివేడిగా దోసెలు వేస్తాను. చల్లారితే తినవుగా.’ అంటూ అరుస్తూ తన పనిలో తాను పడిపోయింది అమ్మ.

మా ఇంటి పక్క చెరువుతో నాకు చాలా జ్నాపకాలే ఉన్నాయి. చెరువు గట్టుమీదున్న రైలుచెట్టు  పైనుంచి అందులోకి దూకే వాళ్ళం. నన్ను తరుముకుంటూ వచ్చే నాన్నమ్మని ఏడిపించడానికి అందులో దూకి తామరాకుల కింద నక్కేవాడిని.  అప్పట్లో చెరువు తాటిచెట్టంత లోతుగా ఉండేది. నేనెక్కడ మునిగిపోతానో అని నానమ్మకు భయం. అందుకే ఆ వేట. నాకదో ఆట.  అంత లోతైన చెరువు ఎందుకు  ఎండిపోయిందో..అందులో  ఉండాల్సిన నీరు మాయమైపోయి మట్టి ఎలా పేరుకు పోయిందో కాని..ఆ పగుళ్ళిచ్చిన చెరువులో నాన్నమ్మ బొమ్మ కదిలినట్టనిపించి త్రుళ్ళిపడ్డాను.  మనుషులకు మట్టిని మాత్రమే మిగిల్చి..నీటిని మాత్రం కొందరి ఇళ్ళల్లో ఉరకేలేసే ఆనంద తరంగాలుగా మార్చుకున్నచిత్రాలు రమేష్ కి తీరుబడిగా ఎప్పుడైనా వివరించి చెప్పాలి.

నా తర్జనభర్జన వాడికి అర్థమైనట్టుంది?

“అరే ఇంతకీ మనలో మన మాట. మీక్కూడా ఈ నీటి కష్టాలేంట్రా?” మళ్ళీ ఉడికించడానికి రమేష్ ప్రయత్నం. చిరునవ్వే నా సమాధానం.

అలా నడుచుకుంటూ మా ఇంటికి అతి సమీపంలో ఆనుకుని ఉన్న పొలాల వైపు  వెళ్ళాం.  ఒకప్పుడు మా ఇంటి చుట్టూ పొలాలే ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు చేపల చెరువులు..రొయ్యల చెరువులు ఎక్కువయ్యాయి. వాటిలోనుంచి విడుదల చేసే మురికి నీరు కాల్వల్లో ప్రవహస్తోంది.  తెలిసిన ఒక మిత్రుడి చెరువు దగ్గరకు రమేష్ ని  తీసుకెళ్ళాను. అందులో చేపల పట్టుబడి జరుగుతోంది. ధాన్యాన్ని గుట్టలుగా వేసినట్టు చేపల్ని రాశులు పోసి ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎక్కించడం వాడికి చూడ ముచ్చటగా అనిపించింది.

02_13_Tribute-Dr-Rao-Painting

అలా ఆ చెరువులు దాటుకుని ఇంకొంచెం ముందుకు తీసుకు వెళ్ళాను. రమేష్ సందేహాల శస్త్రాలు సంధించక ముందే వాడికి చెప్పాల్సిన విషయాలు చెప్పాను.

“ ఇక్కడ చుట్టూ చాలా మందికి పొలాలు ఉండేవి. అవి రానురాను కొందరికే సొంతమయ్యాయి. వేల మంది భూములు లేని వారిగా మారిపోతే పదుల సంఖ్యలో పెద్దలు మాత్రమే ఇలా చేపలు..రొయ్యల  గుట్టల మీద నిలబడి మీసాలు మెలేస్తున్నారు. మా చిన్నప్పుడు కొల్లేరు వ్యవసాయం కోసమని ఊళ్ళో కోమటాయన దగ్గర నాన్న చేసిన చిల్లరమల్లర అప్పులకు చెల్లుచీటీగా మా పొలాలు గల్లంతయ్యాయి.  ఇక్కడుండాల్సిన మా పొలాలు  ఏ చెరువులో కలిసిపోయాయో ఇప్పుడు పోల్చుకోలేం. ఊళ్ళో బలిసిన వారు బక్కజనుల  పొలాలను సొంతం చేసుకున్నారు. మా చిన్న తాతకు ఊళ్లో వందెకరాలు ఉండేవట. కానీ ఆయన ముగ్గురు కొడుకులు ఇప్పుడు మూడూళ్లలో ఉన్నారు. ఊళ్లో మాత్రం వారికి సెంటు భూమి మిగల్లేదు.  హైదరాబాదైనా ఆగడాల్లంకైనా సాగుతున్న నీతి ఒక్కటే. బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా మార్చేయడం. ఇక్కడే కాదు. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కొల్లేరులో కూడా ఇదే పరిస్థతి. అక్కడకు మనం టిఫిన్ చేసి బయలుదేరదాం. నా చిన్ననాటి చేలాగాడు రాంబాబు వస్తాడు. వాడు మనల్ని కొల్లేరు తీసుకు వెళ్ళే ఏర్పాట్లు చేశాడు. “

ఇలా చెప్తున్నంతలోనే రాంబాబు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.

“ఏరా రాంబాబు! ఏంటి సంగతులు. వీడు నా ఆప్త మిత్రుడు రమేష్. ఆంధ్రా దొంగలు ఏం తింటారో ఎలా ఉంటారో కళ్ళారా తిలకిద్దామని వచ్చాడు.” రాంబాబుకి రమేష్ ని పరిచయం చేశాను.

“ఏం కాదులేరా! కూడా ఇంకో దొంగను పెట్టుకుని వచ్చావు. ఎలాగైనా మీ అమ్మానాన్నని తీసుకుపోదామని. అది జరిగే పని కాదులే.” రాంబాబు ముందే నన్ను బెదరగొట్టాడు.

ఇద్దరూ హలో అంటే హలో అనుకున్నారు. రాంబాబు డిగ్రీ మథ్యలోనే చదువుకు స్వస్తిచెప్పి కుటుంబ పోషణార్థం కూలీగా మారిపోయాడు. అన్న అమెరికా వెళ్లిపోయాక ముసలి తల్లిదండ్రులకు అండగా.. ఉన్న ఊరినే నమ్మకుని ఉండిపోయాడు. రాంబాబు సైకిల్ ని కాల్వ పక్కనే నిలబెట్టి మాతో కొంత దూరం నడుచుకుంటూ వచ్చాడు.

ఊరిని ఆనుకుని ఉన్న పొలాల మధ్య మరుగుదొడ్డిలాంటి దారిని దాటుకుని కొంత దూరం నడిస్తే మాదిగ్గూడెం వస్తుంది. ఊళ్ళో చచ్చిన గొడ్ల అస్థిపంజరాలతో కంపుకొట్టే వాతావరణం మధ్య గూడెం జనాలు కాపురాలుండేవారు. మా నాన్న చేసే కొల్లేటి కమతాల్లో గూడెం జనాలు కొందరు పనిచేసేవారు. పనే కాదు. ఆ కమతాల్లో వారికి వాటా కూడా ఉండేది. అలా చిన్నప్పటి నుంచి దావేదు మా కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాడు. వాళ్ళబ్బాయే రాంబాబు. వాడిని రాంబాబు అని పిలిచేది నేను ఒక్కడినే. ఊళ్లో జనమంతా వాణ్ణి రామిగా అనో చిన్ని దావేదుగాడనో  పిలుస్తారు.

“ఒరేయ్ రాంబాబు..ఇక్కడ మీ గూడెం ఆనవాళ్ళేమీ కనిపించడం లేదు. ఏంటి సంగతి?”

“ఇక్కడ గూడేన్ని లేపి ఊరవతల కట్టిచ్చిన ఇందిరమ్మ ఇళ్ళల్లో కూర్చోబెట్టారుగా.. తెలియదా..?” అన్నాడు రాంబాబు. ఈ మధ్య చాలాసార్లు వచ్చినా రాంబాబును కలవడం కుదురలేదు. అందుకే ఈ మార్పు తెలుసుకోలేకపోయాను.

వారసత్వంగా వచ్చిన ఇళ్ళూ ఊరవతలే. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళూ ఊరవతలేనా?  కనీసం ఇప్పుడు కట్టిన ఇళ్ళన్నా ఊరి మధ్య కడితే ఎంత బావుండు. నాలో మెదిలిన ప్రశ్న రాంబాబుకు అర్థమైనట్టుంది.  ఒక చిన్న నవ్వు వదిలి ముందుకు కదిలాడు. రాంబాబు వాళ్ళ గుడిసె ఎక్కడ ఉండేదో ఆ దిబ్బను చూపిస్తేనే కాని నాకు జ్నాపకం రాలేదు. ఇక్కడ ఒకప్పుడు ఒక జన సమూహం ఉండేదని.. దీపాలు లేకపోయినా తెల్లవార్లూ పాటలు పద్యాలతో ఆ పల్లె వెలిగిపోయేదని  అప్పుడు గాని గుర్తుకు రాలేదు.

రాంబాబుతో నా స్నేహం ఆ ఊరవతలి బతుకుల పట్ల  నాలో సానుభూతినే కలిగించింది కాని  అసహ్యాన్ని కాదు. ఊరి చుట్టూ ఎంత పచ్చని అందం అల్లుకుందో ఇక్కడి దళితుల బతుకుల లోపలా బయటా  అంత కారుచీకటి  ఆవహించి ఉండేది. ఆ పచ్చదనం ఈ గుడిసెల గుమ్మాల దాకా ఎందుకు పాకలేదని చిన్నప్పుడు ఎంతగానో బాధపడేవాణ్ణి. పెద్దయ్యే కొద్దీ రాంబాబులో కూడా ఈ బాధ అగ్నిపర్వతమై కూర్చుంది. కొంచెం పెద్దయ్యాక మాకిద్దరికీ అర్థమయ్యింది. ఊళ్ళ చుట్టూ ఉన్న ఆకుపచ్చ సౌందర్యం..పంటకాల్వల గలగలలూ..ఊరిని పలకరించి పోయే ఆరు రుతువుల అందాలూ అన్నీ కొందరికే సొంతమైనట్టు నేనూ రాంబాబు సమానంగానే గమనించాం. ఎందుకో కాని తరవాత్తర్వాత రాంబాబు చదువు మానుకుని కూలీల దండుకట్టే దండనాయకుడయ్యాడు. నేను ఉద్యోగం వేటలో ఊరొదిలి పారిపోయాను. ఇలా కలిసినప్పుడు ఆనాటి బాల్యాన్ని..ఈనాటికీ మారని బడుగుబతుకుల చిత్రాన్ని కలబోసుకుంటాం. వాడు ఉద్రేకపడతాడు. నేను ఊకొడతాను. మా ఇద్దరి బాల్యపు ముచ్చట్ల మథ్య ఇక్కడ ఒకప్పుడుండే గూడెం స్వరూపాన్ని రమేష్  అర్థం చేసుకున్నాడు.   మాటలు..జ్నాపకాలు..ఊళ్ళో సాగుతున్న తతంగాలు అన్నీ రాంబాబు చెప్తూ మేం వింటూ అలా కొంతసేపు తిరిగితిరిగి ఇంటికి చేరుకుని టిఫిన్లు ముగించాం. రాంబాబు మా కొల్లేరు యాత్ర ఏర్పాట్లకోసం ఇంటికెళ్ళాడు. మేం రెడీ అయ్యేసరికి ఒక బైక్ తో ప్రత్యక్షమయ్యాడు. ముగ్గురం బర్రున కొల్లేరు వైపు దారి తీశాం.

కొల్లేరు చేరుకునే సరికి ఎండ బాగానే దంచుతోంది. చిన్నప్పుడు అక్కడన్నీ పొలాలే. వందల ఎకరాలు అక్కడ కమతాలుగా చేసుకుని బడుగు బలహీన వర్గాల ప్రజలు వ్యవసాయం చేసుకునే వారు. ప్రభుత్వం నుంచి కూడా వారికి అధికారాలు అందేవి. నాన్న వ్యవసాయం చేసే రోజుల్లో ఒక పెద్ద కమతంలో వ్యవసాయం సామూహికంగా సాగేది.  అంతా కలిసి హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ వానల్ని ఎండల్ని తుపానుల్ని చలినీ అనుభవించేవారు. దళితులకు కూడా ఆ కమతాల్లో వాటాలుండేవి. హక్కులుండేవి. అప్పుడప్పుడూ నాన్నతో పాటు నేను కొల్లేరుకి వెళ్ళేవాడిని అంతా వరసలు కలుపుకుని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒకే కుటుంబంలా పనులు చేసుకునే వారు. ఇప్పటిలా రోడ్డు ఉండేది కాదు. ఒకరోజంతా నడుచుకుంటూ కొల్లేరు చేరాల్సిందే. వర్షాలు బాగా పడుతున్నప్పుడో..పనులు పోతాయనో..మాటిమాటికీ తిరగలేకో.. కొన్ని వారాల తరబడి ఒక్కోసారి వచ్చేవారు కాదు. మేం ఇంటి దగ్గర భయపడేవాళ్ళం. అప్పట్లో కొల్లేరంటే ఎటు చూసినా నీరు..వింతవింత పక్షులు.. శూన్యంలోకి ఎగిరే చేపల విన్యాసాలు..అంతా అదో ఆనందలోకం. ఒకే పంట పండించే వారు. వానాకాలం అదంతా అభయారణ్యమే. దాళ్వా పంట మాత్రమే వేసేవారు. ఆకుమళ్ళు కట్టే దగ్గర నుంచి..ఊడ్పులు..కోతలు..పంటనూర్పుళ్ళు..ఇంటికి ధాన్యం బళ్ళల్లో తోలుకు రావడాలు అంతా అదో కోలాహలం. అవే అసలైన పండగలుగా ఊరిని సంబరాల్లోకి నెట్టేవి.  మా ఇంటి పెరట్లో  పెద్ద గాదె ఉండేది. అందులో చాలా ధాన్యం నిల్వ ఉంచేవారు. మిగతాది షావుకార్లకు తోలేవారు. పంట కోతకు ఎదిగినప్పుడు కొల్లేటి పెద్దింట్లమ్మకు వేటలు వేసేవారు. వేటల్ని వేసినప్పుడు అటు గూడెంలోనూ ఇటు ఊళ్ళోనూ పగలూ రాత్రి తేడా తెలియని జాతర మత్తు గమ్మత్తుగా ఆవహించేది.

మా కోసం ముందే ఏర్పాటు చేసిన చిన్న పడవ ఎక్కి వెనక్కి వెనక్కి కుంచించుకుపోతున్న కొల్లేరు సరస్సులో విహారానికి బయలుదేరాం. చుట్టుపక్కల ఊళ్ళను ఉధ్ధరించడానికే పుట్టినట్టు  రాజకీయాల్లోనూ వ్యాపారాల్లోనూ తమ కబ్జా జమాయించిన పెద్దలు పేదల కమతాలను ఆక్రమించుకున్నారు. కొందరికి తాగించి..కొందరికి భూములకు భూములిస్తామని చెప్పి ఊరించి..లొంగని వారిని కొద్దిపాటి డబ్బుతో కొనేసి..ఎవరి మాటా వినని సీతయ్య లాంటివారిని భయపెట్టి కొల్లేటిలో పేదల భూముల్ని పెద్దలు స్వాధీనం చేసుకున్నారు. కొల్లేటి సరస్సును కొల్లగొట్టి దాన్ని చిన్నచిన్న చేపల చెరువులుగా కత్తిరించి తమ ఖాతాలో వేసుకున్నారు.  మా చిన్నప్పుడు మా నాన్న నిర్వహించిన కమతాలు అలా మాయమైపోయినవే. రాంబాబు వాళ్ళ కుటుంబానికి కూడా కొద్దోగొప్పో భూములుండేవంటే ఈ కొల్లేరులోనే. అవన్నీ ఇప్పుడు పరాధీనమైపోయాయి.

“అంతా సరస్సే అయినప్పుడు మరిన్ని సరస్సులు అవసరమా?” రమేష్ అమాయకంగా అడిగాడు.

వాడికెలా చెప్పాలి. కొల్లేరు ప్రకృతి ప్రసాదించిన సరస్సు. ఈ చెరువులు ప్రకృతిని కొల్లగొడుతున్న సరస్సులు. ఆ సరస్సు మీద వింత వింత పక్షులు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి కొంతకాలం విడిది చేసి తిరిగి పోయేవి. ఈ చెరువుల మీద పక్షి వాలిందా..దాని గుండెల్లో బుల్లెట్ దిగుతుంది. ఆ సరస్సుకు ఆకాశం కాపలా. ఈ చెరువులకు తుపాకుల కాపలా.  ఏ ఎరువులూ అవసరం లేకుండా కొల్లేరు సరస్సు నిండు గర్భణిలా నిత్యం రకరకాల జీవరాశుల్ని ప్రసవిస్తూ ఉండేది. ఈ చేపల చెరువుల్లో వాడుతున్న మందులు..ఎరువులు ఆ నాలుగు గట్ల మధ్యనున్న చేపల్ని తప్ప మరే జీవరాశినీ బతికి నీటిబట్ట కట్టనీయవు. ఇవి చేసే వాతావరణ కాలుష్యంతో కొంచెంకొంచెం కుంచించుకుపోతున్న సరస్సు ఏదో ఒకరోజున అమాంతం మనకు కనపడకుండా ఎక్కిడికో పరుగు లంకించుకుంటుంది.

ఇక్కడ ప్రకృతి విధ్యంసమే కాదు..పర్యావరణ వినాశనమే కాదు..బీదాసాదా రైతుల జీవనాధారం కూడా ధ్వంసమైంది. కొల్లేరంటే అందం..ఆనందం..బతుకు పడవ కదా..మరిప్పుడు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కొంప కొల్లేరైందన్న సామెత ఎందుకు వెలిసిందంటే కారణం ఇదేనేమో.

ఊళ్ళో ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉన్న మా నాన్నలాంటి పెద్దరైతులే పేదరైతుల్లా బతుకుబండి లాగుతున్నారు. ఇక రాంబాబులాంటి గూడెం జనాలు గోడు ఎవరు పట్టించుకుంటారు ? నా ధోరణిలో నేనేదో చెప్తున్నాను.

ఏందిరా బాయ్ మీరేదో ఆనందాన్ని అనుభవిస్తున్నారని చూడ్డానికి నేనొస్తే అన్నీ కష్టాలే వల్లిస్తున్నారు? అంటూ రమేష్ ఎగిరి మా పడవలో పడిన చేపను పట్టుకుని ముచ్చటగా ముద్దాడాడు. అప్పటికే  మా పడవ నడపుతున్న మనిషి  చిన్నచిన్న చేపల్ని పట్టుకుని మాకోసం కాల్చి పెట్టడానికి పడవలోనే అన్నీ ఏర్పాట్లు చేసిపెట్టాడు. పేరు రాముడు. మా చిన్నప్పుడు రాముడు కాదు భీముడు అనేవారు. ఇప్పుడు కొల్లేరు చిక్కిపోయినట్టే కొంచెం కొంచెం ఎండిపోయి కండ తీసేసిన కొరమేను ముల్లులా తయారయ్యాడు.  చేపల రుచి..ప్రకృతి రుచి..అనుభవిస్తూ కొల్లేటి అంతరంగంలోని విషాదం చేదును మర్చిపోదామని రమేష్ తో పాటు మేం కూడా ప్రయత్నించాం.

ఏం బాబూ అసలు ఊరికి రావడమే మానేశారు? రాముడు కాల్చిన చేపలతోపాటు కొన్ని ప్రశ్నల్ని కూడా మావైపు పంపడం మొదలుపెట్టాడు. వాణ్ణి కదపకూడదనే అనుకున్నాను. కదిపితే కొల్లేరు డొంక కదిపినట్టే. ఏ డొంకలో ఏ పిట్టలుంటాయో..ఏ పిట్ట ఏం తింటుందో ఎలా తింటుందో..ఎంత ఒడుపుగా దాన్ని పట్టుకోవాలో కతలుకతలుగా చెప్తాడు. ఏ కాలంలో ఏపక్షులు వచ్చేవో..ఎంతకాలం ఉండేవో కల్లాకపటంలేని కొల్లేటి కొంగల భాషలో వర్ణించిపాడతాడు. అంతటితో ఆపడు. ఆపితే రమేష్ కి మంచి వినోదమే దొరికేది . కాని వాడి కథ మొదలుపెడతాడు. ఇప్పటికే రమేష్ కి ఇక్కడి వాతావరణం కంటె దాని వెనక సాగుతున్న దోపిడి కాస్త అసహనానికి కారణమవుతోంది. ఎందుకొచ్చానురా బాబూ అని తలపట్టుకుంటాడేమో అని నా సందేహం. కాని వాడూరుకుంటాడా. కదపనే కదిపాడు రాముడి కొల్లేటి డొంకని.   వాడి యవ్వనంలో కొల్లేరు ఎంత గొప్పగా ఉండేదో..ఇక లంకించుకున్నాడు.

“ నా మాలచ్చిని చూసినా కొల్లేటిని చూసినా నాకు రత్తంలో ఒకటే తియ్యని దురద మొదలయ్యేది బాబయ్యా. ఆ రోజులే ఏరు. వర్షాలు తగ్గి నీరు వెనక్కి తీసినప్పుడు ఇక్కడ ఎగసాయం మా జోరుగా సాగేది. నాక్కూడా ఏడెనిమిది ఎకరాల ఎగసాయం ఉండేది. ఇదిగో ఈళ్ళ నాన్నగారు కమతాలనీ..కలిసి ఎగసాయం చేసుకోవాలనీ మొదలెట్టాక అబ్బో అదో పండగలా సాగేదనుకోండి. ఊళ్ళో జనాలు ఎలాగుండేవారో కాని..ఇక్కడ మాత్రం ఊరూ వాడా తేడా లేకుండా అందరం అల్లదిగో ఆ ఎగురుతున్నాదే చేప పిల్ల. మరలా ఎగిరి గంతులేసే వాళ్ళం. కలిసి వండుకునే వాళ్ళం. కలిసి పండుకునే వాళ్ళం. వారాల పాటు ఇళ్లకు పోకుండా ఇక్కడ మేం ఎగసాయం చేస్తా ఉంటే మా ఆడది  అప్పుడప్పుడూ అనుమానంతో ఇక్కడికి లగెత్తుకొచ్చేది. మాలచ్చి వచ్చిందంటే ఇక నాకు పండగే. అందరూ నన్ను వదిలేసే వారు. దాన్ని తీసుకుని అదిగో ఆ దోనెలున్నాయే అలాంటి తాటి దోనెలో ఇక కొల్లేరులో ఒకటే తిరుగుడు. దూరంగా ఎవరికీ కనిపించకుండా దాన్నెటో తీసుకుపోయేవోణ్ణి. ఇప్పడు నేనిస్తన్నట్టే అది నాకు చేపలు కాల్చి పెట్టేది. నేను పాటలు పాడేవోణ్ణి. నాసామిరంగా నేను పాటలు పాడతా వుంటే ఎగిరే పచ్చులు కూడా అల్లాగిపోయేవనుకోండి. అయ్యా..పిట్టల మాటేం కాని ఆకాసంలో సూరీడు కూడా ఆగిపోయేవాడంటే నమ్ముతారా? “

‘నమ్ముతాం నమ్ముతాం.’  రమేష్ ఊతమిచ్చాడు. ఆ ఊతంతో పాటందుకున్నాడు. మేమంతా ఎక్కడన్నా పక్షులు ఎగురుతూ ఆగి వెనక్కి చూస్తాయేమో అని దిక్కులు చూశాం. పక్షులుంటేగా! ఖాళీ డొంకలు వెక్కిరిస్తున్నాయి.  అటు ఆకాశం వైపు చూశాం. నిజంగానే సూర్యుడు నిదానంగా కదులుతున్నాడు.

‘ఇప్పుడేం చేస్తున్నావ్ రాముడు?’ అడిగాడు రమేష్.

ఏం చేస్తాం బాబయ్యా. ఆ ఎగసాయం లేదు. ఆ బూములు లేవు. ఆ పనీ లేదు ఆ పాటా లేదు. ఉన్న కమతాలన్నీ పెద్దోళ్ళ చేపల చెరువుల్లో ఎక్కడ కలిసిపోయాయో తెలీదు.  కాగితాల మీద ఏలి ముద్రలు ఏయించుకున్నగ్నాపకాలు తప్ప ఇంకేం గుర్తులేదు. ఇదిగో ఇప్పుడు ఆ చెరువుల దగ్గర కాపలా కాసే పనోడిగా బతుకుతున్నాను. తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఈ కుళ్ళు నీరు తాగి నేనైతే సయించుకున్నాను కాని..నా ఆడది మాత్తరం కుంగి కుశించుకుపోయింది. మాయదారి రోగం కానరాలేదు. కానొచ్చినా బాగుచేసుకునే సత్తా వున్నోణ్ణి కాదు. అలాగే అర్థాంతరంగా మాయమైపోయింది మాలచ్చిమి. బిడ్డలకి రెక్కలొచ్చాక ఇక్కడ రెక్కాడినా డొక్కలాడ్డం కష్టమని నగరాలకి వలస పచ్చుల్లా ఎగిరిపోయారు.”

ఉన్నట్టుండి రాముడు..నేను..రాంబాబు ముగ్గురం సైలెంట్ అయిపోయాం. రమేష్ కూడా మాతో పాటు నిశ్శబ్దంగా ఏదో ఆలోచనలో పడిపోయాడు. ఎగిరే చేపపిల్లల్లో చిన్నప్పటి జ్నాపకాల తుళ్ళింతల దృశ్యాలేవో దోబూచులాడుతూ నన్నుఉడికిస్తున్నాయి. నాన్న పొలాలు పోగొట్టుకున్న తర్వాత చుట్టం చూపుగా కొల్లేరు రావడమే అవుతుంది కదా అన్న బాధ కొంచెం గుండెల్లో మెలిపెట్టింది. రాంబాబు మనసులో ఏం జరుగుతుందో నేనూహించగలను. గతం వర్తమానం కలిసి అతని మనసులో ఒక ద్రావకంలా మరుగుతున్న విషయం అర్థమవుతోంది. ఇక రాముడు ఫ్లాష్ బ్యాక్ లోకి జారిపోయిన సంగతి తెలిసిపోతోంది. రాముడు పాలేరుగా మారడం..రాంబాబు కూలీగా మిగిలిపోవడం..కాస్త కలిగిన  కుటుంబంలో పుట్టినా చివరికి ఊళ్ళో బలవంతులకే ఆస్తులన్నీ ఫలహారంగా సమర్పించుకుని  ఇప్పుడు మేము ఇల్లు తప్ప ఏమీ మిగుల్చుకోలేకపోవడం .. ఈ విషయాలన్నీ రమేష్ కి కూడా అర్థమైనట్టున్నాయి. వాడూ మా నిశ్శబ్దంలో మరింత నిశ్శబ్దంగా ఒదిగిపోయాడు.

అలా కొల్లేటి కొంగలు సంధ్యరంగుల ఆకాశాన్ని తమ రెక్కల మీద ముద్రించుకుని ఒక గుంపుగా మా కళ్ళను తాకుతూ ఎగిరినప్పుడు ఇళ్ళకు తిరుగుముఖం పట్టాం.

ఇంటికి రాగానే నాన్న కనిపించలేదు.

అమ్మా నాన్నేడి?

“ఈ మథ్య గుడి కట్టిస్తున్నారుగా..శివాలయం. పొద్దస్తమానం అక్కడే గడిపేస్తున్నార్రా బాబూ. అన్నట్టు మీ ప్రయాణానికి అన్నీ రాత్రికే సర్దుకోండి నాన్నా. పొద్దుటే లేచి తాడేపల్లి గూడెం వెళ్లాలిగా. ఇలా ఒకరోజు ప్రయాణాలేంటిరా! పోన్లే కనీసం నెలకోసారైనా రా! మేమెలాగూ ఈ రైళ్ళూ బస్సులూ ఎక్కలేం!”

అమ్మ మాటల్లో నాకెందుకో ఏదో కనిపించని ఆరా..అన్వేషణ.. ఇంకేదో ప్రశ్న గుండెల్ని తాకుతున్నాయి. నేను వచ్చిన వాడిని వచ్చినట్టే తిరిగి వెళ్ళి పోతానని..వాళ్ళను నాకూడా తీసుకు వెళ్ళే ప్రయత్నాలేమీ చేయనని అమ్మ ఇంకా కన్ ఫాం కాలేదు. వారికి ఏ మూలో అనుమానం ఉంది. అందునా ఈసారి ఒంటరిగా రాలేదు. హైద్రాబాద్ మిత్రుణ్ని వెంటేసుకుని  సశస్త్రంగా వచ్చాను.

అమ్మా ఈసారి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికే వచ్చాను. మీరు కూడా బట్టలు సర్దుకోండి.

“వచ్చే నెల్లో వస్తాంలే నాన్నా.  నా బ్యాగూ నాన్న బ్యాగూ పక్కింటి పార్వతి తీసుకుంది. ఊరికెళ్ళాలంట. పాపం ఎప్పుడూ మమ్మల్నే కనిపెట్టుకుని ఉంటుంది. దానికేమైనా చెయ్యాలిరా!” అమ్మ జవాబు.

అమ్మ మాటలు నాకెందుకో నమ్మబుద్ది కావడంలేదు. “ అయినా బ్యాగులదేముంది. ఇప్పుడే పోయి రెండు కొత్తవి కొనుక్కొస్తానుండు.”  అమ్మ ఏదో గొణుగుతున్నా వినకుండా బయలుదేరాను. రమేష్ స్నానానికి వెళ్ళాడు.

ఎక్కడికిరా?

నాన్నని తీసుకువస్తా.

అప్పుడే వస్తాడా ఆయనగారు. మీరు ముందు స్నానాలు ముగించండి.

అమ్మ మాటలు వినకుండా త్వరగా గుడి దగ్గరకు బయలుదేరాను. పక్కింటి పార్వతి ఎదురుపడింది. బ్యాగులు తీసుకువెళ్ళి  అమ్మే పార్వతి ఇంట్లో దాచిపెట్టిందట. వచ్చే నవ్వు ఆపుకోడానికి పార్వతి చీరకొంగును సాయం తీసుకుంది.

చిన్నప్పుడు స్కూలు ఎగ్గొట్టడానికి నేను కూడా ఇలా ఎన్నిసార్లు పుస్తకాల సంచి అక్కడా ఇక్కడా దాచిపెట్టేవాడినో. ఎక్కడ దాచానో అమ్మకు మాత్రమే తెలుసు. నాన్న వెదికి వెదికి నన్ను ఉతకడానికి రెడీ అయినప్పుడు ‘ పోన్లెండి రేపు వెళతాడులే బడికి’ అని అడ్డం పడేది అమ్మ. చిన్నప్పుడు నేనేసిన ఎత్తులన్నీ ఇప్పుడు నాదగ్గర అమ్మ ప్రదర్శిస్తోందన్నమాట. నవ్వుకుంటూ గుడికి వెళ్ళాను. అక్కడ నాన్న ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. నన్ను చూసి ఏరా పొద్దున్నే వెళ్ళాలన్నారు. త్వరగా తిని రెస్టు తీసుకోండి. ఇదిగో గుడి కడుతున్నాంగా ఇప్పటిదాకా మీటింగే సరిపోయింది. అంతా ఇప్పుడే వెళ్ళారు.

“ఎందుకు నాన్నా! మిమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్ళనులే. కనీసం నేను ఉండే ఒక పూటైనా ఇంటిదగ్గర ఉండొచ్చుగా! రాపోదాం”  నాన్న చేయి పట్టుకుని పైకి లేపాను.

“మళ్లీ ఎప్పుడొస్తార్రా? ఈసారి కోడల్ని..పిల్లల్ని తీసుకురావాలి మరి ఆ!”

నేను చిన్నప్పుడు బడికి ఎగనామం పెట్టి పాత శివాలయం దగ్గర గోళీలాడేవాడిని. ఆ విషయం నాన్నకెవరో చెప్పేవారు. దారీపోయేవారెవరో పెద్దమనిషి ఒరే మీ నాన్నొస్తన్నాడని బెదిరిస్తే గుడిదగ్గరే రాత్రి దాకా ఉండిపోయేవాడిని. ఎప్పుడో చీకటి పడ్డాక నాన్న వెదుక్కుంటూ వచ్చేవాడు.

“అమ్మ దొంగా నా దగ్గరే నా చిన్నప్పటి ట్రిక్కులు ప్లే చేస్తున్నావా నాన్నా”  అసలింత అవసరమా?  మనసులోనే అనుకుని నాన్నతో ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి రాగానే స్నానాలు చేసి ఒకసారి రాంబాబు ఉంటున్న ఊరవతల కాలనీకి వెళ్ళాము.

అక్కడ రాంబాబు కాలనీ చూసి మరీ బాధ కలిగింది. చూడ్డానికి దూరంగా ఇళ్ళలానే కనిపిస్తాయి. కాని అవి తలుపులూ కిటికీలూ లేని అగ్గిపెట్టె గుడిసెలంటే తప్పుకాదు. అక్కడ కూడా కాలనీలు ఏర్పడ్డాయి. దళితులు ఒక పక్కకి..వారికి దూరంగా ఇతర కులాల ఇందిరమ్మ ఇళ్ళు మరో మూలకి ఉన్నాయి. అభివృద్ధిని అంకెల్లో చూపించేవారికి ఈ కాలనీలను చూపిస్తే ఏమంటారో మరి.  రాంబాబు నాన్న దావీదుతో కాసేపు మాట్లాడాము. ఆయనా పాత ముచ్చట్ల నడుమ ఊరి గురించి బాధనే నిట్టూర్పుల భాషతో వ్యక్తం చేస్తున్నాడు.

“మీ పెద్దబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్ళారా” అని అడిగాను. సమాధానం రాంబాబు దగ్గర నుండి వచ్చింది.

“అన్నయ్య ఇక్కడకు రాడు. వచ్చినా వీళ్ళని ఇక్కడ నుంచి తరలించడానికే ప్లాన్లు వేస్తాడు. టౌన్ లో ఎక్కడైనా ఇల్లు తీసుకుని ఉండమంటాడు. డబ్బు పంపినా అమ్మానాన్నకి నాతోనే ఉండడం ఇష్టం. అయినా ఈ ఊరిని వదలడానికి ఏమాత్రం వీరికి ఇష్టం లేదు. ఇక్కడేముంది ఒక ఊరి చివరి నుంచి ఇంకో చివరికొచ్చారు. ఎప్పుడైనా ఊళ్ళల్లో చివరి బతుకులేకదా అన్నది అన్నయ్య వాదన. కొడుకుల దగ్గరున్నా మనుమలూ మనవరాళ్ళూ చుట్టూ ఉన్నా ఒంటరితనమే వెంటాడుతుందని అమ్మకీనాన్నకి భయం. పంచిన రక్తంలోనే మమకారాల కంటె పెత్తనాలు ఎక్కువవుతుంటే ఏ బంధాలూ లేకున్నా ఉన్న ఒక్క మట్టి బంధంతోనే హాయిగా గడిపేద్దామని మా పేరెంట్స్ వాదన. వీళ్ళకోసం నేనుంటున్నానో..నాకోసం వీళ్ళుంటున్నారో కాని ఉంటున్నాం. ఊళ్ళోనే ఉంటున్నాం. “  రాంబాబు మాటల్లో, కళ్ళల్లో, మనసులో ఏదో గుబులు కనిపించింది.

ఇక రాంబాబు ఇంటి దగ్గర సెలవు తీసుకుని మా ఇంటికి ముగ్గురం వెళ్ళాం. వేడివేడిగా అమ్మ వడ్డించింది. నాతోపాటు అమ్మనీ నాన్ననీ తీసుకు వెళ్ళే ప్రయత్నంలో మరోమాటు భంగపాటు చవిచూసి గమ్మున ఊరకున్నాను.  రాంబాబు కూడా ఆ రాత్రికి మాతోనే ఉండిపోయాడు. ఊరూ..వాడా..రిజర్వేషన్లు..ఎవరు ఎదిగారు..ఎవరు కుదేలయ్యారు..రాంబాబు ఏదో తన రహస్య రాజకీయ కార్యకలాపాల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మర్నాడు ఉదయమే లేచి స్నానాలు చేసి తాడేపల్లిగూడెం బయలుదేరాం. మళ్ళీ తిరిగి జన్మభూమి ట్రైన్ లోనే  ప్రయాణం.

వెళుతూ వెళుతూ రమేష్ నాన్నతో మళ్ళీ  కొంచెం కదిపి చూశాడు.

“ఏంటంకుల్..ఇక్కడేముంది? తాగడానిక్కూడా నీరు లేదు. మాకెలాగూ తెలంగాణా ఇచ్చేస్తున్నారుగా అక్కడికే వచ్చేయండి.”

ఏం సమాధానం వస్తుందో అని ముగ్గురం ఉత్కంఠగా ఎదురు చూశాం.

“లేదు. ఎక్కడికీ రాము.”

నాన్న నుండి వచ్చిన ఈ ఠపీమన్న సమాధానంతో నేనూ రాంబాబు నవ్వుకున్నాం కాని రమేష్ మాత్రం ఆశ్చర్యంగా అలాగే నోరు తెరిచి ఉండిపోయాడు.

“ఏమీలేదురా బాబూ. మీకు తెలంగాణా వస్తేనన్నా కనీసం ఇక్కడ ఊళ్ళు బాగుపడతాయేమో అని మా ఆశ.”

“అధికార బదలాయింపులతో ఊళ్ళు బాగుపడవు అంకుల్. ఆ అధికారం ఎవరి చేతుల్లోకి పోతుందన్నదే పాయింట్. స్వతంత్ర పోరాటం ఎప్పుడూ సమరోత్సాహంగానే ఉంటుంది. స్వాతంత్ర్య ఫలితాలు ఎవరికి దక్కుతాయన్నదే చూసుకోవాలి.”  ఇక రాంబాబు దొరికిందే తడవుగా అందుకున్నాడు. నాన్న కూడా తీరిగ్గా ఉపన్యాసానికి ఉపక్రమించాడు.

అంతా హైదరాబాద్ కే పరుగులు తీశారు తప్ప పుట్టిన ఊళ్ళు..పెరిగిన ఊళ్లు ఎలా ఉన్నాయో ఎంత ధ్వంసమవుతున్నాయో పట్టించుకునే తీరికా ఓపికా ఎవరికీ లేకుండా పోయింది. రాజకీయ నాయకులకు రాజకీయాలు కావాలి. పదవులు కావాలి. పీఠాలు కావాలి. పెట్టుబడిదారులకు వ్యాపారాలు కావాలి. ఏ వూరు ఎలా పోయినా పర్వాలేదు. వారి పెట్టుబడులు పెరగాలి. హైదరాబాదైనా పోతారు..ఆఫ్రికా అయినా పోతారు. వారికి మట్టిబంధాలు..మమతానుబంధాలు ఉండవు. ఉన్నదొక్కటే బంధం అది డబ్బు బంధం. నగరాలేవైనా వారికే ఉంపుడుగత్తెలు.  మనం మన రాష్ట్రంలో ఉన్నా..మన దేశంలో ఉన్నా..ఈ నేల మనది..ఈ గాలి మనది..ఈ నీరు మనది అన్న  ఏదో తెలియని భావంలో ఉప్పొంగిపోతాం. తీరా హక్కులు అనుభవించే సరికి ఎక్కడా నీకు కూర్చోడానికి కూసింత జాగా కూడా దొరకదు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినా డబ్బున్న వాడికి పక్కవేసే నగరంలో నిజానికి నువ్వు అనాథవే. కూలికోసం ఉదయాన్నే నాలుగురోడ్ల కూడలిలో నిలబడే వేలాది జనానికి నగరం ఎప్పటికీ పరాయిదే. వారితో పనిచేయించుకుని వారిని కుక్కలకంటే హీనంగా చూడ్డమే నగర సంస్కృతి వికృత రూపం. అలాంటి నగరం కోసం ఏడవడం కంటె కనీసం ఇప్పటికైనా మన ఊళ్ళను బాగుచేసుకుందాం అన్న స్పహ మా వాళ్ళకి కలిగితే అదే పదినగరాలపెట్టు.”  నాన్న ఉపన్యాస ధోరణికి బ్రేక్ వేస్తూ రాంబాబు అందుకున్నాడు.

“ రమేష్ ! జన్మభూమి అన్నది ఒక ఫీలింగ్ మాత్రమే.  అది సామాన్యులకే కాని పెట్టుబడుల గుండెకోటల్లో అది మొక్కుబడిగానైనా ఉండదు. జన్మభూమి భావనే అందరినీ సమానంగా ఆదుకుంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అన్నార్తులు, అభాగ్యుల శాతమే ఎందుకు ఎక్కువగా ఉంటుంది చెప్పు? కూలికోసం కూటికోసం నిలువ నీడకోసం నువ్వక్కడా మేమిక్కడా పోరాటాలు చేయాల్సిందే. అధికారాలు..హక్కులూ సామాన్యులకు అందని ద్రాక్షల్లా ఉన్నంతకాలం యుద్ధం ఎక్కడైనా ఒకటే. ప్రాంతీయభేదాలు మామూలు మనుషులకే కాని దొంగలకు ఉండవురా బాబూ. యువకులను బలిపెట్టి మీరు సాధించిన ఈ స్వతంత్రం ఈనగాచి నక్కల కుక్కల పాలు కాకుండా కాపాడుకోండి. అందుకోసం ఒక మహాసంగ్రామానికి సిద్ధం కావాలి మరి. ఇక మీ తిప్పలు మీరు పడాలి. మా తిప్పలు మేం పడతాం. అందరి తిప్పలూ ఒకటేఅని వాటంతటికీ పరిష్కారం కూడా ఒకటేఅని..దానికోసం నువ్వూనేనూ వీడూ వాడూ అంతా కలిసే కత్తుల నదిలో ఈదాలని మాత్రం మర్చిపోవద్దు సుమా!”

నాన్న మాటలు, రాంబాబు మాటలు విన్న తర్వాత హైదరాబాద్ విషయంలో  జన్మభూమి ఫీలింగ్ తో బరువెక్కిన నా హృదయం ఇప్పుడు కాలిపోతున్న నుదిటిమీద అమ్మ చేయి పడినంత హాయిగా ఉంది.

పొద్దుటే తిరుగుప్రయాణం. రాంబాబు వాళ్ళ నాన్న దావీదు కూడా వచ్చాడు. మా వీధిలో ఉండే సోమన్న కూడా వచ్చాడు. మా ఊళ్ళో మొదటి డాబా ఇల్లు కట్టిన మొనగాడు అతడే. ఇరవై ఎకరాల ఆసామి. ఇప్పుడు నిలువ నీడ లేదు. ఇద్దరు కొడుకులు హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ల దగ్గర వాచ్ మెన్ లుగా పనిచేస్తున్నారు. నేనెప్పుడొచ్చినా వారి దగ్గర నుంచి వర్తమానం కాని..డబ్బులు కాని ఏమైనా వస్తాయేమో అని నన్ను పలకరిస్తాడు. మేం వెళుతుంటే అమ్మా..నాన్న..దావీదు. సోమన్న అలా శూన్యంగా చూస్తూ నిలబడిపోయారు. ఊరు వెనక్కి వెళుతుంది మేం ముందుకు కదిలాం. నిర్వాహకులు ఎవరూ లేని అనాథ వృద్ధశరణాలయంలా కనిపించింది నాకు మా ఊరు.

ట్రైన్ ఎక్కించి రాంబాబు వెళ్లిపోయాడు. అన్నీ కోల్పోయినా, ఉన్న ఊరినే జన్మభూమి అని మా అమ్మానాన్నలాంటి వృద్ధులెందరో ఆ మట్టినే అంటిపెట్టుకుని ఉంటున్నారు. రాంబాబు మాత్రం జన్మభూమి ఒకఫీలింగే అంటాడు. హైదరాబాద్ నా జన్మభూమి కాదంటే నా గుండె తట్టుకోలేకుండా ఉంది. రమేష్ మాత్రం నా జన్మభూమి అని ఎంతో ఉప్పొంగిపోతూ రాగాలు తీస్తున్నాడు. అసలు జన్మభూమి విషయంలో నీ అభిప్రాయం ఏంట్రా అని రమేష్ ని అడిగాను. “ అరేయ్ లైట్ తీసుకో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నది జన్మభూమి ట్రైన్ లోనే”  అని పకాలున నవ్వేసాడు.  వాడి మాటలతో తేలికైన మనసు కాసేపు అలా రైలు కిటిలోంచి బయట పచ్చదనం మీదకి మళ్ళింది. ఇంతలో  ఏమనుకున్నాడో రమేష్ “అరేయ్ పాగల్ గా ఏమనుకుంటున్నావో నాకంతా తెలుసు. ఇదిగో చూడు రాష్ట్రం ముక్కలైనా మన స్నేహాన్ని ముక్కలు చేసే శక్తి ఎవరికీ లేదురా బాయ్. మన అసలు జన్మభూమి స్నేహమేరా. దాని  పరిమళం తెలుగు.”

– ప్రసాద మూర్తి

చిత్రం: పెమ్మరాజు వేణుగోపాల రావు

మీ మాటలు

 1. కథ చాలా బాగుంది. నిజానికి ఈ కథ గురించి చాలా చర్చించాలనిపించింది. కనీసం నాలుగు సమస్యలను ఇందులో ఒడుపుగా జొప్పించారు. ఏ సమస్య గురించి మొండి వాదన చెయ్యకుండా, ఆయా సమస్యలకి రెండు వైపుల వున్నవాళ్ళని ఎవరినీ నొప్పించకుండా కథ నడపడంలో అమోఘమైన నేర్పు కనపడుతోంది. (కొడుకు-తండ్రి; తెలంగాణా-ఆంధ్ర మొదలైనవి). అలా రాసినా అది గోడమీద పిల్లి వాటంలా కనపడకుండా వుందంటే బహుశా తార్కిక దృష్టితో రాయడమే అని అనుకుంటున్నాను. ఇలా రాయగలిగిన సంయమనం రచయితకి వుండటం అభినందనీయం. తల్లిదండ్రులు వూరు వదిలి రాకపోవటాన్ని కొత్త కోణంలో చూపించడాం చాలా బాగుంది.

  అయితే కథగా చూస్తే రెండు మూడు భావాలు వివిధ సందర్భాల ద్వారా మళ్ళీ మళ్ళీ చెప్పడం, రకరకాల ఇష్ష్యూస్ వల్ల కాస్త కలగాపులగం అవడం, చివర్లో పెద్ద పేరగ్రాఫుల ప్రసగం కథని కాస్త కుంటు పరిచాయి. చిన్న కథ శీర్షికలో వచ్చింది కాబట్టి చిన్నదిగా వుండుంటే మహత్తరంగా వుండేదేమోనని నా వ్యక్తీగత అభిప్రాయం.

  సారంగ యాజమాన్యం గమనించాలి – ఒకోసారి చిన్నకథ శీర్షికలో వచ్చే కథలు కథాసారంగ కథలకన్నా పెద్దవిగా వుంటున్నాయి. ఒక గిరి గీస్తే బాగుంటుందేమో. (ఈ వ్యాఖ్య ప్రత్యేకించి ఈ కథ గురించే కాదు)

  • నిజానికి ఈ కథని మూడు చిన్న కథలుగా విభజించవచ్చు –

   కొడుకు తల్లిదండ్రులను పట్నం తీసుకెళ్ళడానికి రావడం వాళ్ళు చిన్నపిల్లల్లా రాకుండా వుండటానికి ప్రయత్నించడం – ఇది ఒకటే ఒక మంచి ఆహ్లాదకరమైన కథ అయ్యేది.
   ఆంధ్రా మిత్రునితో ఆంధ్రాకి వచ్చిన తెలంగాణా మిత్రుడు దోపిడీకి భౌగోళిక వ్యత్యాసాలు, విభజన రేఖలు కారణాలు కావని తెలుసుకోవడం – ఒక మంచి కథ అయ్యేది.
   చాలా రోజుల తరువాత వూరికొచ్చిన వ్యక్తికి ఆ వూర్లో వచ్చిన మార్పులు అందుకు గల కారణాలు తెలుసుకోవడం – మరో కథ (రొటీన్ కథ) అయ్యేదేమో.

 2. drpbdvprasad says:

  prasaada moorty katha cheppaledu nijaale raasaadu. kavigaabatti komchem poetic gaa unnayi
  jourlist gaabatti konta pariseelana undi taatvikudu kaabatti daarshanikata kanapadutunnaayi

 3. ఈ కథని సారంగలో మెయిన్ కథ గా పెట్టాల్సింది . పయిగా సమకాలీన అంశం తో ఉన్న ఇతివృత్తం కదా .
  ఎందుకు అలా ‘చిన్న కథ’ లో పెట్టారో అర్థం కాలేదు.
  ప్రసాదమూర్తి గారి కొన్ని కవితల్లో ఉండే ఆర్తి, ఆర్ద్రత ఇన్దులొనూ కొట్టొచ్చినట్టు కనిపించింది . ముఖ్యంగా బాలెన్సు గా రాయడం లో విజయం సాధించారు. పాఠకుడి కళ్ళు చెమర్చేలా కథను అల్లడం అందరికీ పట్టుబడే విద్య కాదు. రచయిత మెదడు తో కాకుండా మనసుతో రాసినప్పుడే ఆ అనుభవం కలుగుతుంది చదువరిలో … ప్రసాద మూర్తి మనసుతో రాసిన కథ ఇది.
  – గొరుసు

 4. kuppilipadma says:

  మనసంతా చెమర్చింది. ఎగిసిపడుతున్న అనేకానేక సంఘర్షణల్ని, కాపాడుకోవలసిన ఆకాంక్షల్ని , మనతోనే నిరంతరం ఉండే మన స్నేహాలని తాత్వికంగా నిండు మనసుతో చెప్పిన కథ . congratulations sir .

 5. ప్రసాద మూర్తి గారు, ఇతర చదువరులకు: నిజానికి ఈ కథ చిన్న కథ కాదు. కాని, కథ మాకు అందే సమయానికి కథా సారంగ లో వేయాల్సిన కథ ఖాయమైపోయింది. ఈ కథలోని సమకాలీనత వల్ల ఇది ఆలస్యం చేయడం బాగుండదని భావించి మేము ‘చిన్న కథ’ లో వేసాము. ఇది తప్పయితే మన్నించండి. ఈ కథ వేయడం కోసం ఇంకో క్యాటగిరి సృష్టించే సమయం మాకు దొరకలేదు. అప్పటికే, ఈ వారం చాలా శీర్షికలు పెట్టాల్సి వచ్చింది. ఇది సాంకేతికమయిన సర్దుబాటు మాత్రమే!

  • prasada murty says:

   డియర్ అఫ్సర్ తమ్ముడు, ఈ కథ నా పేరు కోసం రాసింది కాదు. ఒక చారిత్రక సందర్భంలో నా కర్తవ్యంగా రాశాను. మీ technical problems గురించి నాకు తెలియదు. మీరు నా కథ publish చేసినందుకు చాలా thanks. ఈ కథ మీద మంచి చర్చ జరగాలని నా కోరిక. అరిపిరాల అన్నట్టు చర్చ జరిగితే బాగుంటుంది. ఈ సందర్భంలో నేను చాలా కథలు రాయాలనుకుంటున్నాను. మిమ్మల్ని తొందర పెడితే క్షమించండి.

 6. buchireddy gangula says:

  కథ బాగుంధీ
  ఎన్ని చెప్పినా— ఎన్ని రాసినా—ఏళ్ల తరబడి
  తెలంగాణా – దోపిడీ– మోసం- అన్యాయం— అన్ని చవి చూసింధీ
  అధి పచ్చి నిజం
  స్వాతంత్రం వచ్చిన తెల్లారి నుండి అన్ని రంగుల — అన్ని రాజకీయ పార్టీ ల
  నాయకుల్లో— అవనీతి రోజు రోజు కి పెరిగిపోతూ—
  ఈ రోజు తెలంగాణా పక్రియ మొదలు కాగానే—అవనీతి గురించి– తెలుగు జాతి అని
  హైద్రాబాద్ గురించి—లేని పోనీ రాత ల తో—కవులు — రచయితలు–
  గిమిక్కిలు చేస్తూ—
  జై తెలంగాణా— నాలుగున్నర కోట్ల ప్రజల గుండె చప్పుడు
  నీళ్ళు– నియామకాలు— ని ధు లు—వీటి లో— అవకతవకలు
  ఏళ్ల తరబడి జరుగుతున్నపుడు ఏ కవి– ర చయిత స్పంధించాలె ధు–
  ఇపుడు–ఆటోక మాట– యిటోక మాట రాస్తూ– చెపుతూ—దేనికి ?? ఎంధుకు ???
  కొన్ని ఏళ్ల నుండి— జరిగిన ఎన్నికల్లో తెలంగాణా అశం తో— అన్ని రాజకీయ
  పార్టీ లు మాట్లాడి నపుడు—స మార్థించి నపుడు—ఈ రాస్తున్న మేధావులు
  ఎక్క్డ ఉన్నారు– ఏ దేశం లో– ఏ రాష్ట్రం లో—
  వేయి మంధీ కి పై గా ఆత్మ బలి ధానాలు చూస్తూ– చదువుతూ—అపుడు
  ఒక్క మాట కూడా రాయా ని కవులు– రచయితలు— ఇపుడు కట్టు కథలు
  సొల్లు ముచ్చట్లు– రాస్తూ— వీడి పోతే ఏమో మునిగిపోయినట్టు—కూని రాగాల తో ???
  మేధావులు—
  చరిత్ర చదవండి
  హైద్రాబాద్— తెలంగాణా ప్రాంత ధీ– వేయి ఏండ్ల కు పై గా
  ఈ రోజు తెలంగాణా ను ఎడారి చేసింధీ ఎవరు ???
  ఎన్ని రకాలుగా మోస పోయామో—దోపిడీ కి గురి అయ్యామో
  చదివి —ఆలోచించి– నిజాలు రాయండి –కవులూ– రచయితలు ???
  ఈ రోజు సీమాంధ్ర లో జరుగుతున్న తతంగం—చూస్తూ—ఇంకా
  కలియీక— స మై క్యాం ?? అనడం లో ????
  వీడి పోయి కలిసి బ్రతక లేమా ???
  చిన్న రాష్ట్రాలు గా ఉంటే తప్పు ఏమిటి
  విభజన రే ఖ –సరిహద్దుల మధ్య — కానీ మన మనుసుల మధ్య—మన స్నేహాలా మధ్య
  కాధుగా—
  కవులూ– రచయితలు
  నిజాలు రాయండి
  ఆలోచించి– చించి రాయండి
  ధయతో
  ————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 7. Rentala Jayadeva says:

  ఈ మధ్యకాలంలో చదివిన మంచి కథల్లో ఇది ఒకటి. అనేక అంశాలను ఏకకాలంలో చర్చకు పెట్టిన ఈ కథలో తల్లితండ్రులు కావచ్చు, రాంబాబు కావచ్చు, పడవ నడిపేవాడు కావచ్చు – చదువుతున్నంత సేపూ ప్రతి పాత్ర, దాని పాత జ్ఞాపకాలు – కొత్త పరిణామ క్రమం తీరని దుఖాన్ని మిగిల్చాయి. గుండెను తడిపాయి. కవితాత్మక వ్యక్తీకరణలే కాదు… బాకుల్లా దిగబడిన సన్నివేశ చిత్రణలూ ఉన్నాయి.

  ఇవాళే కాదు, ఎప్పుడైనా సరే పెట్టుబడిదారుల, పాలక వర్గాల పెను దోపిడీకి ప్రాంతీయ వివక్ష ఏమీ ఉండదు. సమైక్యం, సమన్యాయం, విభజన, విలీనం రద్దు, వేర్పాటువాదం, ప్రత్యేక రాష్ట్రం, అభివృద్ధి, ఆత్మ గౌరవం లాంటి మాటలు పైకి వేర్వేరు అర్థాలిస్తున్నట్లు అనిపించినా, ఇవన్నీ పంజరాన్ని చేతిలో పట్టుకున్నవాడి తీపి కబుర్లే. మనం ఇప్పటికీ పంజరంలో పక్షులమే.

  ఈ అవగాహన ఉంటే చాలు. లేదంటే, రాష్ట్రం ఒకటి గానే ఉన్నా, రెండైనా, కాదు… కూడదు… మూడు అయినా ఒరిగేదీ లేదు. బాధలు తరిగేదీ లేదు. ఉన్న ఊరినీ, కన్నతల్లినీ వదిలి పొట్ట చేతపట్టుకొని ఎక్కడెక్కడికో నగరాల దిశగా వచ్చేసిన, వచ్చేస్తున్న వారందరికీ జన్మభూమి ఓ తెగిన గాలిపటం. అందుకే, ఇవాళ ఎవిరిబడీ ఈజ్ ఇన్ సెర్చ్ ఆఫ్ దెయిర్ రూట్స్ . దేవుడా, నడిపించు నా లోకాన్ని స్నేహమనే జన్మభూమి వైపు… తెలుగు వెలుగులు గుబాళించే పుణ్యభూమి వైపు…. …..రాష్ట్రం ఎన్ని ముక్కలైనా కానీ….

 8. ప్రసాద మూర్తి గారూ,

  కథ పూర్తయ్యాక కదలకుండా కూచోబెట్టేసింది. చాలా గొప్పగా రాశారు. ఎవరినీ నొప్పించకుండా, కొన్ని అపోహలని తొలగించడానికి ఒక సవ్యమైన , అవసరమైన పద్ధతిలో కథను చెప్పారు.

  నిడివి ఎక్కువ అవడం పెద్ద సమస్యేమీ కాదు. కథ “ఇంతే” ఉండాలని గిరి గీసుకోవడం కథకు అవసరమైనపుడు చెడుపు చేస్తుంది.

  కథలో అక్కడక్కడా తొంగి చూసిన subtle హాస్యం ఆసాంతం చదివించింది. అలాగే కొన్ని కొన్ని వాక్య ప్రయోగాలు అద్భుతంగా అమరి పోయాయి.

  “.జనమెవరిక్కావాలి..జనం పడే బాధలెవరిక్కావాలి?” ___________అవును, ముసలమ్మ గారి మాటలే ఈ కథ సారాంశం!

  చాలా మంచి కథ చదివిన ఫీలింగ్ కల్గించారు.

  మీకు ధన్యవాదాలు . ఈ కథకు ఎంతో ప్రాచుర్యం కావాలి. ఎంతోమంది దరికి చేరాలి

 9. rama saraswathi says:

  చాల బాగుంది. కుప్పలి పద్మ గారు అన్నట్టు మనసు చెమర్చినది. ఈ సందర్భంలో ఇంకా చాలా కథలు రాయాలని ఉంది అని ప్రసాద మూర్తి గారు అన్నారు చదవడానికి మేమూ చాలా ఆత్రంగా ఉన్నాము సర్! మంచి కథలు చదివి మనసు నింపుకోవాలనే దాహం తో ఉన్నాం! థంక్ అఫ్సర్ సర్ అండ్ ప్రసాద్ మూర్తి సర్!

మీ మాటలు

*