వీలునామా-12 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

సంభాషణ

ఫ్రాన్సిస్ పార్టీకి వెళ్ళే ముందే జేన్ ని కలవాలని ఆశపడ్డాడు. కానీ, అతను పెగ్గీ ఇల్లు చేరేటప్పటికి అక్కా చెల్లెళ్ళు బయటికెళ్ళారని తెలిసింది. దాంతో నిరాశగా రెన్నీ గారిల్లు చేరుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత జేన్, ఎల్సీ ఇద్దరూ విందుకు హాజరయ్యారు.

అతనికి వాళ్ళిద్దర్నీ చూడగానే చాలా సంతోషం వేసింది. నిజానికి వాళ్ళిద్దరూ పెద్ద అందగత్తెలు కాదు. ఇద్దర్లో కాస్త ఎల్సీ పర్వాలేదనిపిస్తుంది. జేన్ చాలా సాధారణంగా వుంటుంది. ఈ మధ్య తగిలిన ఎదురు దెబ్బలతో ఎల్సీ మొహం కొంచెం పెద్దరికాన్ని సంతరించుకుని బాగుంది. కానీ, ఫ్రాన్సిస్ కి జేన్ వంకే చూడాలనిపిస్తుంది. ఆమె మొహంలో అలసట నిరాశ చూసి అతనికి ఏదో తెలియని బాధ అనిపించింది. కనిపించగానే ఆమె చేతులు పట్టుకుని, అక్కడ మాట్లాడుకుందాం పద, అంటూ ఒక పక్కకి తీసికెళ్ళాడు. ఎల్సీ కూడా వాళ్ళని ఒంటరిగా వదిలేసింది.

రెన్నీ గారి అమ్మాయి వచ్చి ఎల్సీని ఎవరికో పరిచయం చేస్తానని తీసికెళ్ళింది. మామూలుగా వుండే జెన్నీ కంటే కొంచెం చూపులకి నదురుగా వుండే ఎల్సీ కి స్నేహితులని చూపెట్టడం కష్టం కాదు, అనుకున్నారు రెన్నీ కుటుంబ సభ్యులు.

“తరచుగా ఉత్తరాలు రాసుకుంటూనే వున్నాం. ఇంకా కబుర్లేం వుంటాయి ఫ్రాన్సిస్?” చిరునవ్వుతో అంది జేన్.

“ఎన్ని ఉత్తరాలు రాసుకున్నా, కలుసుకునేటప్పుడు మాట్లాడుకోవడానికి బోలెడంత వుంటుంది. అసలు నీ వుత్తరం చూసినప్పుడల్లా నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది. కాబట్టి చెప్పు, నీ ఉద్యోగప్రయత్నాలెలా వున్నాయి?” ఆత్రంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“ఏమీ లేదు ఫ్రాన్సిస్. ఎల్సీకి ఆ మధ్య వచ్చిన ఉత్తరం చూసి కృంగి పోయింది. ఆ వుత్తరం మరీ మొరటుగా రాసారులే. పాపం దాన్ని చూస్తే జాలేసింది. ఇహ ఆ తర్వాత మొత్తానికే రాయడం మానేసింది.”

“మరి నీ సంగతి?”

“ఏముంది? ఏమీ లేదు. ఎవరైనా ప్రైవేటు చెప్పించుకుంటే బాగుండని ప్రయత్నించాను. అదీ దొరకలేదు. ఇహ బట్టల కొట్లో కుట్టు పని తప్ప ఇంకేదీ దొరికేటట్టు లేదు. ”

“అయ్యో! నీకెలా సాయపడాలో నాకర్థం కూడా కావడం లేదు.”

“అదేం లేదు ఫ్రాన్సిస్. నిజానికి నేనంత బాధల్లో ఏమీ లేను తెలుసా? నిజమే, భవిష్యత్తు తలచుకుంటే భయంగానే వుంది. కానీ, మరీ అంత నిరాశగా కూడా లేను. పెగ్గీ చాలా మంచిది. నన్ను చాలా విధాలా ఆదుకుంటూంది. అన్నిటికంటే నన్ను అభిమానంగా, గౌరవంగా చూస్తుంది. ఇహ పిల్లలయితే చెప్పనే అక్కర్లేదు. అందరికంటే తెలివైన వాడు టాం. చూస్తూ వుండు, వాడు ఎంత పెద్దవుతాడో. ఆడవాళ్ళకిమాకు పైకెదగడానికి అవకాశం వుండదు కాబట్టి,  పైకెదగాలన్న ఆశయం వున్న వాళ్ళని చూస్తే ఎక్కళ్ళేని సంతోషమూ! నాకెటూ అన్నదమ్ములో, భర్త గారో, కొడుకులో లేరు కదా! అందుకే నేను టాం లౌరీ భవిష్యత్తు గురించీ, నీ భవిష్యత్తు గురించీ కలలు కంటూ ఉంటాను.  నా మొహం చూసి నా కష్టాలు ఊహించుకోకు. సాయంత్రం పూట టాం, నాన్సీ లకి పాఠాలు చెప్పేటప్పుడు నన్ను చూడు! అప్పుడు అర్థమవుతుంది నేనెలాగున్నానో. ఇక్కడికొచ్చేసరికి నా పాత జీవితం అంతా ఙ్ఞప్తికొచ్చింది. అంతే!”

“నీ మాటలతో నా మనసు తేలికైంది జేన్. కానీ…”

“ప్రతీ సంఘటనలోనూ మంచీ చెడూ వుంటాయి ఫ్రాన్సిస్. ఈ సంగతి నేను అనుభవం మీద తెలుసుకున్నాను. కొంతమంది అన్ని సుఖాలూ, సౌకర్యాలూ వున్నా,  ఇంకా దేనికోసమో ఏడుస్తున్నట్టుంటారు. ఇంకొంతమంది దుర్భరమైన జీవితం లో కూడా అన్నీ వున్నట్టు ధీమాగా వుంటారు. దేన్నైనా మనం చూసే దృష్టిని బట్టి వుంటుంది. ఆ మధ్య నేనో పేదరాలిని చూసాను. ఆవిడకి లేని కష్టం లేదంటే నమ్ము!  అష్టకష్టాలూ పెట్టే భర్తా, స్వార్థపరులైన పిల్లలూ, పేదరికమూ, అనారోగ్యమూ! ఆమె సంతానంలో ఒక్క కొడుకు మాత్రం మూడు నెలలకోసారి వచ్చి కొంచెం డబ్బిచ్చి వెళ్తాడు. ఆవిడని చూస్తే, ఏ నమ్మకంతో ఆవిడ బ్రతుకీడుస్తుందా అని మనకే అనుమానం వేస్తుంది. కానీ ఆవిడ నవ్వు మొహం చూస్తే ఇప్పుడు నేను చెప్పిన దాన్లో ఒక్క మాట కూడా నమ్మలేవు నువ్వు! ఆవిడని చూసింతర్వాత నన్ను చూసుకుంటే నాకే సిగ్గేసింది. ఇంకా నాకు, ఆరోగ్యమూ, చదువూ, చిన్న వయసూ వున్నాయి. నేనింత నిరాశతో దిగజారిపోవడం ఏమిటి అనిపించింది. అది సరే కానీ, నువ్వు ఫ్రాన్స్, ఇంగ్లండు అంతా చుట్టి రావాలానుకున్నావు. చూసొచ్చావా? ప్రయాణం విశేషాలేమిటి?” కుతూహలంగా అడిగింది జేన్.

“ప్రయాణం బాగా జరిగింది. కొంచెం ఫ్రెంచి మాట్లాడడం కూడా నేర్చుకున్నాను. అన్నట్టు, మనం ఎస్టేట్లో ఒక ఉత్తరం చదివాం చూడు, ఫ్రెంచి మహిళ, మార్గరెట్! గుర్తుందా? ఆవిడ కూతురు క్లెమెన్స్ ని కలిసాను. ఇప్పుడావిడ శ్రీమతి లీనాయ్.”

“అవునా? ఏలా వుందావిడ?”

“చూడడానికి మామూలుగా వుంది కానీ, మాట్లాడితే భలే బాగుంది. సుతి మెత్తని యాసా, నాజూకూ, డబ్బున్న స్త్రీల హుందాతనమూ! నేనొక్కటి చెప్పనా? మన ఇంగ్లీషు యువతులంత అందంగా వుండరు ఫ్రెంచి అమ్మాయిలు. కానీ, వాళ్ళ సంభాషణా చాతుర్యంతో నెగ్గుకొస్తారు ఎక్కడైనా.”

“ఆవిడని ఎలా కలిసావు?”

“ఫ్రెంచి సొసైటీలో జొరబడడం ఇక్కడికంటే తేలిక. ఒక ఫ్రెంచి హోటల్లో ఒకాయన కనిపించాడు. నాన్నగారికి పాత స్నేహితుడట. నా పేరు చూసి నాన్న గారిని గురించి అడిగాడు. ఆ తర్వాత అతనితో ప్రతీ విందుకీ తీసికెళ్ళాడు. అసలు నాకు మనుషులతో మాట్లాడడమంటేనే సిగ్గూ, మొహమాటం. అలవాటు కూడ లేదాయె. సరే, మొత్తం మీద ఎలాగో నెట్టుకొచ్చాను. ”

“కొత్త వాళ్ళముందు అంత సిగ్గు పడడానికేముంది ఫ్రాన్సిస్? అయినా నీకు బాంకు లో ఎంతో మంది స్నేహితులుండాలిగా?”

“అవుననుకో! కానీ, ఆడవాళ్ళతో మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బందే. అందులోనూ, జేన్, ఇల్లూ వాకిలీ, కుటుంబమూ, అమ్మా నాన్నా లేని నాలాటి అనాథకి ఇతర్లతో స్నేహంగా మాట్లాడే అలవాటు ఎలా వుంటుంది చెప్పు? వింత ఏమిటో తెలుసా? అందరూ ఇప్పుడు నా తండ్రెవరో నాకు తెలిసిపోయింది కాబట్టి ఇక నేను చాలా సంతోషంగా దర్జాగా వున్నాననుకుంటారు. కానీ నాకెందుకో ఇంకా సిగ్గుగా మొహమాటంగానే అనిపిస్తుంది.”

“నేనూ నువ్వు సంతోషించి వుంటావనే అనుకున్నా మరి!”

“నన్ను కన్న తల్లీ తండ్రులు ఒకర్నొకరు ప్రేమించుకోలేదు. మోసం చేసుకున్నారు. నన్ను కన్న తల్లికి నా మీద ప్రేమ లేదు. నా తండ్రికి నా పట్ల బాధ్యత తప్ప మరేమీ లేదు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు లేకపోగా అలవిమాలిన అసహ్యం. నా పరిస్థితి నీకర్థం కాదు. నా వునికే నాకు చాలా అవమానకరంగా తోస్తుంది. ”

“అమ్మా నాన్నల మధ్య వుండే ప్రేమలతోటే మన ఆత్మ గౌరవాలు ముడి పడి వున్నట్టయితే, నా పరిస్థితీ అంతే మరి. మేము పుట్టిన కొన్నేళ్ళకే అమ్మ మనసులో నాన్న పట్ల ప్రేమ చచ్చిపోయింది. ఆయనకైతే స్వార్థం తప్ప ఆమె మీద ప్రేమ ఎన్నడూ లేదు. అందుకే అలాటి ఆలోచనలు మానేద్దాం. అమ్మా నాన్నల మాటెలా వున్నా మనం దేవుని బిడ్డలం. ఆయన ప్రేమ అందరికీ అందుతుంది కాబట్టి దాంతో తృప్తి పడదాం. ఇంతకీ క్లెమెన్స్ తల్లి గురించి నీతో మాట్లాడిందా?”

“మాట్లాడింది. తన తల్లికి నా పేరే వున్న స్నేహితుడు వుండేవాడనీ, ఆ స్నేహితుడు మా నాన్నేననీ తెలిసి చాలా సంతోషించింది. తల్లి చిత్తరువు కూడ చూపించింది.”

“అయితే ఫ్రాన్సులో చాలా సరదాగా గడిచిందన్నమాట.”

“అవును! అందులో ఫ్రెంచి వాళ్ళ మాటలు, అబ్బో! ఏం చెప్పమంటావు. హాస్యమూ, చమత్కారమూ నిండి వుంటాయి. పెద్దగా వాదించుకోరు కానీ, అభిప్రాయాలు బానే ఇచ్చి పుచ్చుకుంటారు. వాళ్ళకి రాజకీయ స్వాతంత్ర్యం లెదని మనమేదో జాలి పడతాం కానీ, నాకైతే వాళ్ళకి భావ స్వాతంత్ర్యం చాలా వుందనిపించింది. అక్కడ చిన్న రైతులు వుంటారు. మన దగ్గరేమో చిన్న రైతులన్నవాళ్ళే కనబడరు. అంతా మోతుబర్లు, మిగతా వాళ్ళు రైతు కూలీలు. ఈ రైతు కూలీల పరిస్థితి ఎంత దయనీయంగా వుంటుందో తెలుసా? మన దగ్గర కూడా రైతు కూలీలకి చిన్న చిన్న పొలాలిస్తే వ్యవసాయం బాగు పడొచ్చేమో!”

“అదేమిటి ఫ్రాన్సిస్? చిన్న చిన్న పొలాలౌ ఆర్థికంగా మంచి కాదంటారు కదా? మరీ మన బ్రిటన్ లాటి కిక్కిరిసిన దేశంలో పెద్ద పొలాలు సాగు చేయడంలోనే లాభముందేమో! అప్పుడు డబ్బూ, యంత్రాలూ, మానవ వనరులూ ఎక్కువ అవసరం వుండదు కదా?”

“అవును. ఇక్కడంతా అలాగే అనుకుంటాం. ఫ్రాన్సు లో వేరేలా ఆలోచిస్తారు. ఒక భూస్వామి దగ్గర వంద ఎకరాలున్నాయనుకో. దాన్ని యాభై మంది రైతుకూలీలు సాగు చేస్తున్నారనుకో. ఆ పొలానికి తాము స్వంతదార్లం కాదన్న నిరాసక్తత వుంటుంది వాళ్ళలో. అదే వాళ్ళకి తాము తలా రెండెకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పామనుకో. అదే భూమిలో కష్టపడి బంగారం పండిస్తారు. అందుకే అన్నారు-‘ ఏడేళ్ళు పొలానికి కౌలుకిస్తే, తోటలాటి భూమి కూడా బీడు పడిపోతుంది. అదే మనిషికి సొంతానికి ఎడారి లాటి భుమినిచ్చినా, ఏడేళ్లలో దాన్ని నందనవనంలా మార్చగలడూ- అని! అదే ఆలోచన అమలులో పెట్టాలనుకుంటున్నాను.”

“ఏమిటది?”

“మన ఎస్టేటులో గుట్ట వెనకాల ఊరికే స్థలం పడి వుంది చూడు, దాన్ని చిన్న చిన్న భాగాలు చేసి పాలేర్లలో కష్టపడే వాళ్ళకి ఇద్దామనుకుంటున్నా. పదేళ్ళలో వాళ్ళు దాన్లో మంచి పంట పండించగలిగితే, అది వాళ్ళే వుంచేసుకోగలిగే ఒప్పందం మీద. ఆ మాటకొస్తే నీకసలు రెండు ఆలొచనలు చెప్దామనుకున్నా.”

“బాగుంది. రెండో ఆలోచన ఏమిటి? చెప్పు చెప్పు!”

“ముందుగా పొలంలో పని చేసే పాలేర్లందరికీ చిన్న ఇళ్ళు కట్టిద్దామనుకుంటున్నా. ఎప్పుడైనా ఆ పాలేర్ల ఇళ్ళు చుసావా? దుర్భరంగా వుంటాయి. భూస్వాములూ, రైతులూ మంచి ఇళ్ళు కట్టుకుంటారు కానీ, కొంచెం కూడా ఆ పాలేర్ల సంగతి పట్టించుకోరు. అందుకే ఇంకొంచెం శుభ్రంగా వసతిగా వుండే చిన్న ఇళ్ళు ప్లానులు గీయించి పట్టుకొచ్చాను. తర్వాత చూపిస్తాను.”

“పెగ్గీ అభిప్రాయం కనుక్కుందాం. తను అలాటి ఇళ్ళల్లోనే పెరిగింది కాబట్టి తన అభిప్రాయం నమ్మదగ్గదై ఉండొచ్చు.”

“నిజానికి అలా చిన్న ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి పెద్ద డబ్బు కూడా ఖర్చు కాదు తెలుసా? ఆ మధ్య చామర్స్ గారు నన్ను భవంతిని కొంచెం మార్చమనీ, కొన్ని కొత్త గదులు కట్టించమనీ సలహా ఇచ్చారు. అప్పుడనిపించింది, అదే డబ్బుతో ముఫ్ఫై కూలీలకి చిన్న యిళ్ళు కట్టించొచ్చు కదా అని! దీన్లో ఇంకొక ఆలోచన కూడా వుంది. మన స్కాట్ లాండు నుంచి ఎంత మంది అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారో తెలుసా? మరీ ఆస్ట్రేలియాలో బంగారం కొరకు మన దేశం నుంచి కష్టపడగలిగే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఇలాగే ఇంకొంత కాలం సాగితే ఇక్కడ పనికొచ్చేవాళ్ళెవరూ మిగలరేమో. అందుకే కనీసం నా పరిధిలోనేను పని వాళ్ళ పరిస్థితులు మెరుగు చేద్దామని ఆలోచిస్తున్నాను. నన్ను చూసి నాలా ఇంకొందరు చేయొచ్చు కదా? నువ్వేమంటావు?”

“నిన్ను చూసి నలుగురు చేసినా చేయకపోయినా, నీ ఆలోచన చాలా గొప్పది ఫ్రాన్సిస్!” మనస్ఫూర్తిగా అంది జేన్.

“సరే! ఎవరెవరికి ఇళ్ళు ఇవ్వదలచానో, ఎవరెవరికి భూమి ఇవ్వదలచానో పట్టిక రాసి వుంచాను. ఒక్కసారి నువ్వు చూసి నీ అభిప్రాయం చెపితే…”

“చాలా మంచి ఆలోచన ఫ్రాన్సిస్! మావయ్య నిన్ను ఆస్తికంతా హక్కుదారుణ్ణి చేసి మంచి పని చేసాడనిపిస్తుంది.”

ఇంకేదో చెప్పబోయిన జేన్, చాలా పరిచితమైన గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది.

విలియం డాల్జెల్ రెన్నీ దంపతులని పలకరించి, కొంచెం ఇబ్బందిగా వున్న మొహం తో ఎల్సీతో మాట్లాడుతున్నాడు.

“రెన్నీ గారికి విలియం ఎలా తెలుసు?” ఫ్రాన్సిస్ ని అడిగింది జేన్.

“రెన్నీ వాళ్ళు అక్కడ ఎస్టేటు చూడడానికి వచ్చినప్పుడు చుట్టు పక్కల అంతా పరిచయం అయ్యారు. ఒక్క క్షణం జేన్! ఇప్పుడే వస్తాను. రెన్నీ గారి అమ్మాయితో ఒక్క డాన్సు చేస్తానని మాటిచ్చాను. మళ్ళీ వస్తా!”

ఫ్రాన్సిస్ లేచి ఎలీజా దగ్గరకెళ్ళాడు.  ఎలీజా పక్కన విలియం డాల్జెల్ తో పాటు ఇంకొక అతను కూడా వున్నాడు.

“ మీరిద్దరూ నన్ను క్షమించాలి. ఈ డాన్సు నేను ఫ్రాన్సిస్ హొగార్త్ తో చేస్తానని మాటిచ్చాను. కానీ మీ ఇద్దరితో డాన్సు చేయడానికి అందమైన అమ్మాయిలని వెదికే బాధ్యత నాది. సరేనా, ఇక్కడే వుండండి, ఒక్క క్షణం లో వస్తా! ”

అంటూ వెళ్ళింది ఎలీజా. రెండు నిమిషాల్లో లారా విల్సన్ ని అక్కడికి తీసుకొచ్చింది. వాళ్ళ కుటుంబానికి చాలా సన్నిహితురాలు లారా విల్సన్. బోలెడంత డబ్బూ, కొంచెం చదువూ వున్నవి కానీ, తెలివితేటలు తక్కువ. ఈ పార్టీకి ప్రత్యేకంగా ముస్తాబయి వచ్చింది. ఆమెతో డాన్సు చేయడానికి విలియం వెళ్ళాడు.

“ఫ్రాన్సిస్! మీ కజిన్ ఎలీసా ఈ కొత్త వ్యక్తితో డాన్సు చేస్తుందంటావా? జేన్ అయితే భలే సీరియస్ గా వుంటుంది. ఆమెని అడిగితే ప్రయోజనం వుండదు. ఎలీసాని ఇతనికి పరిచయం చేస్తా..” గుసగుసగా ఫ్రాన్సిస్ తో చెప్పి ఆ కొత్త వ్యక్తి చేయి పట్టుకొని ఎలీసాని వెతుక్కుంటూ బయల్దేరింది ఎలీజా.

ఆస్ట్రేలియానించి కొద్ది రోజుల క్రితమే వచ్చిన బ్రాండన్ కి  ఎల్సీని పరిచయం చేసింది ఎలీజా రెన్నీ.

(సశేషం)

మీ మాటలు

  1. శారద గారూ,
    చాలా బాగుందండీ. ఒక్కో భాగం లో ఒక్కో ఆణిముత్యం లాంటి వాక్యం ఉంటోంది. అందరికీ తెలిసినవే కాని గుర్తుచేసుకొని పరిణితిని పొందుతూ ఉండాలి అందరూ జీవితంలో. ఈసారి నాకు నచ్చిన వాక్యం –
    “ప్రతీ సంఘటనలోనూ మంచీ చెడూ వుంటాయి ఫ్రాన్సిస్. ఈ సంగతి నేను అనుభవం మీద తెలుసుకున్నాను. కొంతమంది అన్ని సుఖాలూ, సౌకర్యాలూ వున్నా, ఇంకా దేనికోసమో ఏడుస్తున్నట్టుంటారు. ఇంకొంతమంది దుర్భరమైన జీవితం లో కూడా అన్నీ వున్నట్టు ధీమాగా వుంటారు. దేన్నైనా మనం చూసే దృష్టిని బట్టి వుంటుంది.
    ఇంత మంచి సీరియల్ ని మాకు అందిస్తున్న మీకు మరోసారి థాంక్స్
    రాధ

మీ మాటలు

*