స్వర సాంగత్యం

elanaga

ఇసుక తిన్నెల మీంచి గుసగుసల్ని మోసుకొస్తూ

గుండె లోపలికి దూరుతుందొక రాగం

వేలి కొసను పట్టుకుని వేల మైళ్ల దూరం

లాక్కుపోతుంది లయతో –

గాలిలో గంధమాధుర్యాన్ని నింపి

వీనులకు విందు చేస్తుంది

పూర్వజన్మల పురా వైభవాల అపూర్వ సమ్మేళనాన్ని

పూస్తుంది మనసుగోడల మీద మందంగా –

సొంపును పులుముకున్న ఇంపైన రాగాన్నాస్వాదించి

సోలిపోతుంది పులకాంకితమైన ఆత్మ

నాదవృష్టిలో తడిసి పుట్టిన మోదం

ఖేదానికి వీడ్కోలు పాడుతుంది

స్వరలయల మెట్ల మీదుగా

స్వర్గసౌధానికి దారి మొలుస్తుంది

 

రాగం ఆవహించినంత సేపూ

రంజకత్వం మేఘమై ఊగుతూనే వుంటుంది

హృదయపు పొదరిల్లు మీద –

గానం ఆగిన తక్షణమే

గాయపు నొప్పికి జన్మ

నరాలు స్వరాల కోసం తపిస్తూ

నరకాన్ని తలపించే వేదనకు శంకుస్థాపన

 

గానం తోడు లేని జీవన ప్రస్థానం

ప్రాణం లేని మనుగడకు సమానం

 

*****

—    ఎలనాగ

 

మీ మాటలు

 1. స్వాతీ శ్రీపాద says:

  ఇసుక తిన్నెల మీంచి గుసగుసల్ని మోసుకొస్తూ

  గుండె లోపలికి దూరుతుందొక రాగం

  వేలి కొసను పట్టుకుని వేల మైళ్ల దూరం

  లాక్కుపోతుంది లయతో -చాలా బాగుంది

 2. రాగసుధామధురంగా ఉంది ఎలనాగ గారూ మీ స్వర సాంగత్యం. “జీవనంబు తనకు జీవనంబైయుంట” మకరి అలసిపోలేదనీ, కరి అలిసిపోయిందనీ అంటాడు పోతన గారు గజేంద్రమోక్షం కథలో. ఆ తడి ప్రభావం అలాంటిది.

  ఆ తడి దానికెలాటిదో, ఈ స్వరాల తడి కూడా మానవ జీవితానికి అలాంటిదే.
  అభివాదములతో

 3. ఎలనాగ గారు,

  పోయెమ్ చాలా బాగా వచ్చింది.

  “వేలి కొసను పట్టుకుని వేల మైళ్ల దూరం లాక్కుపోతుంది” నచ్చింది.

  అభినందనలు,

  రవి వీరెల్లి.

 4. స్వాతీ శ్రీపాద గారూ, నౌడూరి మూర్తి గారూ, రవి వీరెల్లి గారూ!

  నా కవిత మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది. మీ ముగ్గురికీ
  నా కృతజ్ఞతలు.

  • enugu narasimha reddy says:

   గానం తోడులేని జీవం నిజంగా అసంపూర్ణమే. చాలా బాగా చెప్పారు ఏలనగా గారు, కంగ్రాట్స్.- ఏనుగు నరసింహ రెడ్డి

 5. Mercy Margaret says:

  బ్యూటిఫుల్ పోయెమ్ సర్ ..

 6. Rammohan Thummuri says:

  నాద వృష్టిలో తడిసిపుట్టిన మోదం
  ఖేదానికి వీడ్కోలు పాడుతుంది
  చాల బాగా వచ్చింది పోయెం

 7. రామ్మోహన్ గారూ!

  పొయెం మీకు నచ్చినందుకు సంతోషం, కృతజ్ఞతలు.

మీ మాటలు

*