పద్యం ‘పల్స్’ విజయ్ కి తెలుసు!

దేశరాజు

దేశరాజు

నగరానికి చేరుకోవడమే ఒక విషాదమా ? …. ఏమో చెప్పలేము !

ఉన్న వూరు పదిలంగా లేకపోవడం వల్లనే ఎవరైనా నగరం చేరుకుంటారు. పది కాలాలపాటు సుఖంగా వుండేందుకు  అన్నీ సమకూర్చుకుంటారు. అన్నీ అమరినా ఎండమావి లాంటి ఆ సుఖం ఎప్పటికీ దరి చేరదు. అలవాటు పడిపోయిన నగర జీవి ఈ సాలెగూడుని చేదించుకుని బయటకు వెళ్ళ లేడు. ఆ స్థితి లోనే ఒక పద్యం జన్మిస్తుంది. అయితే, అది మృత పద్యం కావొచ్చు. లేదా, మృత ప్రాయంగా మారిపోతున్న నగర పద్యం కావొచ్చు.  పద్యం పల్స్ ని కరెక్ట్ గా పట్టుకోగలిగిన వాడే అసలైన కవి. అలాంటి అసలు సిసలైన కవి కోడూరి విజయకుమార్.

తన మూడో కవితా సంపుటి ‘అనంతరం’ ను ‘నగరం లో పద్యం మరణిస్తుంది’ అంటూ శాపనార్థాలతో ప్రారంభిస్తాడు. ‘Clearly, then the city is not a concrete jungle, it is a human zoo’   అంటాడు, Desmond Morris  అనే సామాజిక శాస్త్రవేత్త. మృగ తృష్ణ తో సంచరించే ఈ జూ లో కవి యెప్పుడూ  అంతర్మథనం తో నలిగిపోతూనే వుంటాడు.  అందుకే, విజయకుమార్ ఇందులోంచి బయటకు గెంతేయ్యాలని చూస్తాడు. అలా చేయలేక పోతున్నందుకు తనను తానే నిందించు కుంటాడు.

60051_703360903013918_1420695648_n

నిజానికి నగరం ఒక బందీఖానా అనే సూచన తన రెండవ కవితా సంకలనానికి ‘ఆక్వేరియం లో బంగారుచేప’ అని పేరు పెట్టడం లోనే అందించాడు. ‘అనంతరం’ కు వొచ్చేసరికి ఆ భావన మరింత విస్తృతమైంది. అందుకే కేవలం ఒక పద్యంతోనే తృప్తి చెందలేదు. ’40 ఇంచుల కల’, ‘నగర జీవితమూ-శిరచ్చేదిత స్వప్నాలూ’, ‘జలపాశం’, ‘ఒక మహానగర విషాదం’, ‘నగర వీధిలో ఎడారి ఓడ’ … ఇలా ఒక అర  డజను  పద్యాస్త్రాలను సంధించాడు. నగరాన్ని ఎంతగా ద్వేషించాడో, ఊరిని అంతగా ప్రేమించాడు. ఆ వూరి లోని మనుషులనూ, బంధువులనూ అక్కున చేర్చుకోవాలని ఉవ్విళ్ళూరాడు. పెనాన్ని కాదని పొయ్యిపై మోజు పడిన ‘డాలర్లను ప్రేమించిన మిత్రుల ‘ ను చూసి ఆవేదన చెందాడు. ఆ మిత్రుల్లోని గురివిందల ‘గ్లోబల్ సూత్రాల’ ని అవహేళన చేసాడు.

ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ అందించే బాధ్యతను తన తొలి కవితా సంపుటి ‘వాతావరణం’ నుండే చేపట్టిన విజయకుమార్  ఇప్పుడు నగరం ‘అనంతరం’ ఇంకా ఏమయినా ఉన్నట్టా? …. లేక, ఇక ఏమీ లేనట్టా?  అని నిలదీస్తున్నాడు.  ‘సీతాకోక చిలుక రూపాన్ని కోల్పోతూ / గొంగళి  పురుగులా  మారిపోతున్న రహస్యం’ తెలుసుకోమని హెచ్చరిస్తున్నాడు. ఈ జూ లోంచి బయటపడే మార్గమేదో మీరు కనిపెట్టగలిగితే అతనికి కొంచెం చెప్పండి.

(కోడూరి విజయకుమార్ కవితాసంపుటి ‘అనంతరం’ కు 2011 సంవత్సరం తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ పురస్కారం లభించిన సందర్భంగా )

 

-దేశరాజు

మీ మాటలు

 1. రాజారామ్ .టి says:

  నగర జీవిత భీభత్స విషాదాన్ని విజయకుమార్ చాలా పద్యాల్లో కళ్ళల్లో సూటిగా గుచ్చుకునేటట్లు ఆవిష్కరించాడు .కవులకు నాస్టల్జియా పై వున్న యిష్టాన్ని “అనంతరం”కవితా సంపుటి
  స్పష్టంగా ప్రస్ఫుటం చేయడమే కాదు అందుకు కారణాలను
  జీవితం వేగవంతమైన క్రమంలో నగరజీవన సంక్లిష్టతను నిరూపిస్తుంది .మాములుగా గొంగళి పురుగు సీతా కోకచిలుకగా
  మారుతుంది .కానీ దాన్ని రివర్స్ చేయటంలోనే కవి చేప్పదలుచుకున్నది అర్థం అవుతుంది .దేశిరాజు గారన్నట్లు పద్యం పల్స్ విజయకుమార్ కు తెల్సు

 2. దేశరాజు గారు,

  వ్యాసం బాగుంది.

  రవి

మీ మాటలు

*