పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర?

పేరున్న సీనియర్ రచయిత్రి పి. సత్యవతిగారు 90లలో పెళ్ళి ప్రయాణం అని ఒక గొప్ప కథ రాశారు. రకరకాల మధ్య తరగతి మనస్తత్వాలని అద్భుతంగా ఆవిష్కరించారు ఆ కథలో. నాకు బాగా గుర్తున్న ఒక దృశ్యం – ఇద్దరు విద్యావతులైన అమ్మాయిలు, వరసకి అక్క చెల్లెళ్ళు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. ఒకామె పోస్టు గ్రాడ్యుయేటు. లెక్చరరుగా ఉద్యోగం చేస్తోంది. మంచి జీతం తెచ్చుకుంటోంది. అయినా పెళ్లి చూపులు అనేటప్పటికి అమ్మ చెప్పినట్టల్లా అలంకరించుకుని ఆ చూడ్డానికి వచ్చిన వాళ్ళ ముందు తలదించుకుని కూర్చోవడానికి సిద్ధపడుతూనే ఉంది. వయసు మీరిపోకపోయినా, మీరి పోతోందేమో అనే భయం తల్లి దండ్రుల్లోనూ, కొద్దికొద్దిగా ఆమెలోనూ ప్రవేశిస్తూన్న తరుణం. కథ చెబుతున్న చిన్న చెల్లెలు అకస్మాత్తుగా అడుగుతుంది ఆమెను – నీకన్న కాస్త చిన్నవాణ్ణో, పోనీ నీకన్న తక్కువ జీతం తెచ్చుకునే వాణ్ణో – నీ మనసుకి నచ్చిన వాడైతే – చేసుకోవచ్చుగా? అని. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పెద్దక్కయ్య, “అలా ఏం బావుంటుందోయ్?” అనేస్తుంది, తేలిగ్గా తీసి పారేస్తూ.

ఇప్పుడు అమెరికాలో పెళ్ళి విషయంలో సరిగ్గా అదే పరిస్థితి. ఈ పరిణామం కొన్నేళ్ళుగా జరుగుతూ ఉన్నా, 2008 ఆర్ధిక సంక్షోభంలో, తద్వారా ఉద్యోగాలు హుష్ కాకీ అయిపోయి, నిరుద్యోగ నిష్పత్తి మింటి కెగరడంతోనూ అమ్మాయిలకి ఈ పెళ్ళి సమస్య స్పష్టమైన భీకర రూపంతో ప్రత్యక్షమై భయపెడుతున్నది.

కనీసం గత వంద, నూటయాభయ్యేళ్ళుగా స్త్రీలు సామాజిక జీవితంలో ఎటువంటి ప్రతిపత్తి సాధించాలన్నా సరైన మగవానితో – అంటె అన్ని విధాలా తనకంటే హెచ్చు స్థాయిలో ఉన్న పురుషునితో – పెళ్ళి ఒక్కటే మార్గంగా ఉంటూ ఉన్నది. అరవైలలో పెరిగిన హిప్పీతరంవారు కూడా, కొందరు ఆ సమయంలో ఏదో కొంత స్వేచ్ఛాగీతాలు ఆలపించినా, మొత్తమ్మీద పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లల్ని కని, ఉద్యోగాలు చేసి, అమెరికను సామాజిక జీవనస్రవంతిలో పాయగానే ఉన్నారు తప్ప వేరు పడినది లేదు.  స్త్రీ విమోచనము, స్వేచ్ఛ, సమానత్వమూ అని ఎంత మొత్తుకున్నా, ఆ తరంవరకూ దంపతులైనవారిని పరికిస్తే, విద్యలో, ఉద్యోగంలో, ఆదాయంలో భర్తదే పైచెయ్యిగా ఉంటూ వచ్చింది. స్త్రీలు ఎక్కువగా “నర్చరింగ్” ఉద్యోగాలైన నర్స్, టీచర్ వంటి ఉద్యోగాలకు గానీ, లేక సెక్రటరీ, ఆఫీస్ మేనేజర్ వంటి సహాయక ఉద్యోగాలకు గానీ పరిమితమయ్యారు. లేదా, కాలేజి చదువులు చదివి కూడా ఇల్లు చూసుకుంటూ గృహిణిగా ఉండిపోయారు. ఆ కాలంలో టీవీలో బాగా ప్రసిద్ధికెక్కిన సీరియళ్ళలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. Leave it to Beaver, All in the family వంటి సీరియళ్లలో ఈ స్థితిగతులని చిత్రించారు. అక్కడక్కడా కొన్ని ఉదాహరణలు దీనికి భిన్నంగా ఉండొచ్చును గానీ సగటున అర్బన్ మధ్యతరగతి అమెరికాలో ఉంటూ ఉన్న పరిస్థితి ఇది.

స్త్రీలు పెద్ద చదువులు చదవడము, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నతస్థాయి మేనేజిమెంటు ఉద్యోగాలలో స్థిరపడడము, లేదా స్వంత వ్యాపారాలు మొదలు పెట్టడమూ మొదలై వృద్ధి చెందుతూ వస్తున్నది. ఈ పరిణామాలు జరగడానికి అనేక రాజకీయ, సామాజిక, ఆర్ధిక కారణాలు ఉన్నాయి. అలాగే అంతకు ముందే జరిగిన ఉద్యమాలు, మేలుకున్న చైతన్యాలు కూడా. ఏదేమైనా, 80లలో పెరిగిన జెనరేషన్ ఎక్స్ (Generation X) కాలేజికి వెళ్ళేసరికి, ఆ తరం స్త్రీలలో పెళ్ళి చేసుకోవడం అనే ఆలోచన బాగా వెనకబడిపోయింది. భవిష్యత్తుని గురించిన వారి ఊహల్లో పెళ్ళి ఎక్కడా కనుచూపు మేరలో లేదు. అలాగని అస్సలు పెళ్ళి చేసుకోరనీ కాదు, పెళ్ళంటే విముఖత లేదు. కానీ ముందు కాలేజి చదువు, తరవాత తమ మనసుకి నచ్చిన ఉన్నత విద్య, ఏతన్మధ్య తనని తాను అర్ధం చేసుకోవడం (అంటే ఆసియాకో దక్షిణ అమెరికాకో ఒక విహార యాత్ర, అధమాధమం యూరపు యాత్ర), అటుపైన మంచి జీతం, అధికారం, తృప్తినిచ్చే ఉద్యోగంలో చేరడం, ఊరికినే ఉద్యోగంలో చేరి ఊరుకోవడమే గాక ఉద్యోగసోపానంలో తన శక్తియుక్తులని వృద్ధి చేసుకుంటూ పైకెదగడం – ఇవన్నీ వాళ్ళ ఊహల్లో ప్రతిఫలించిన స్పష్టంగా పెళ్ళి, వైవాహిక కుటుంబ జీవనము కనబళ్ళేదు. పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర? ఇంకా చాలా టైముందిగా!
జరిగింది ఏవిటంటే, వీళ్ళు ఈ జీవిత ప్రయాణంలో సోలోగా జాలీగా ప్రయాణిస్తూ ఉండగా, వారికి ఈడైన వయసువారు, వారి విద్యా ఉద్యోగ ఉన్నతికి సరిదూగగలవారు అయిన పురుషుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఆ స్థాయిలో ఉన్న మగవారు అప్పటికే పెళ్ళిళ్ళై ఉన్నవారు. అలాగ పెళ్ళంటూ చేసుకోవాలని తోచే సమయానికి తమకన్న చిన్నవయసువాడిని చేసుకోవడమో, లేక ఉద్యోగ ఆర్ధిక స్థాయిలో తక్కువగా ఉన్నవాడిని చేసుకోవడమో ఈ స్త్రీలకి మిగులుతున్నది. అంతే కాక గత రెండు దశాబ్దాలుగా వస్తు ఉత్పత్తి తయారీలకి సంబంధించిన అనేక ఉద్యోగాలు అమెరికానించి తరలిపోవడంతో, అమెరికను మధ్యతరగతికి జీవగర్రగా ఉన్న మగవారి ఉద్యోగాలు మాయమైపోతూ వచ్చాయి. కేవలం హైస్కూలు డిప్లొమాతో, లేక ఎసోసియేట్ డిగ్రీతో మంచి జీతం పొందగలిగే ఉపాధులు, ముఖ్యంగా మగవారికి, కనుమరుగైపోయాయి.
జెనరేషన్ ఎక్స్ స్త్రీ పురుషుల వివాహ విముఖత, కొంత విశృంఖలమైన శృంగార జీవితమూ సినిమాల్లో సాహిత్యంలో చిత్రించబడినంతగా పైన చెప్పిన ఆర్ధిక సామాజిక పరిణామాలు చిత్రించబడలేదు. సైన్ ఫెల్డ్, ఫ్రెండ్స్ వంటి టీవీ సీరియళ్ళు, వెన్ హేరీ మెట్ శాలీ వంటి సినిమాలు ఈ మనస్తత్వ చిత్రణకి అద్దం పడుతూ వచ్చాయి, కానీ అక్కడ వినోదమే ముఖ్యం కావడంతో, ఈ ఫలితాలకి పునాదిగా ఉన్న పరిణామాల చర్చ ఎక్కడా కనబడదు. సాహిత్యం కూడా ఈ తరాన్ని నిర్లక్ష్యం చేసిందనే చెప్పుకోవాలి. ఐతే, సమాజాన్ని గమనిస్తూ, అధ్యయనం చేస్తూ ఉండే కొందరు సామాజిక శాస్త్ర పరిశోధకుల, జర్నలిస్టుల దృష్టి ఈ పరిణామాలని గమనించింది. తద్వారా non-fiction పుస్తకాలలోనూ, కొన్ని పత్రికల వ్యాసాలలోనూ ఈ విషయాలు చర్చకి వచ్చాయి.
ఉదాహరణకి న్యూయార్కు విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ప్రొఫెసరు, ఎరిక్ క్లైనెన్బర్గు (Eric Klinenberg) ఒంటరిగా జీవించడం అనే జీవన విధానాన్ని పరిశోధిస్తూ, ఒంటరి జీవితం గడపటానికీ, స్త్రీ పురుషుల వైవాహిక వాంఛకీ మధ్య ఉన్న పరస్పర ప్రభావాన్ని కొంత లోతుగానే పరిశోధించారు. ఆయన పరిశోధనలో ఒంటరిగా ఉండడం అంటే తన నివాస స్థానంలో నిజంగా ఒంటరిగా ఉండడం – ఇతరంగా రూమ్మేట్లు కానీ, లేక ఇతర కుటుంబ సభ్యులు కానీ లేకుండా. మొదటగా అతను గమనించిన విషయం ఒక మనిషి ఒంటరిగా జీవించడమనేది ఖర్చుతో కూడుకున్న పని. ఉదాహరణకి కలిసి ఉన్న ఒక జంట (పెళ్ళయ్యో, కాకుండానో) విడిపోయారు అనుకుందాం. వెంటనే, ఉండడానికి ఇల్లో, అపార్టుమెంటో ఒక నివాస స్థానం దగ్గర్నించి, పడక, వొండుకోడానికి, తినడానికి అవసరమైన పాత్రలు, తప్పేళాలు, అన్నీ రెండేసి సెట్లు అవసరమవుతాయి. అంచేత, దారిద్ర్య రేఖకి దగ్గర్లో ఉన్నవాళ్ళు ఈ సాహసం చెయ్యలేరు. అతను గమనించిన ఇంకొక విషయం ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పొందిన స్త్రీలు తమ స్వంత నివాసాలని కొనుక్కోవడం.
ఇదివరకల్లా ఇల్లు కొనుక్కోవడం అంటే, అది జంటగా కలిసి చేసే పని అనే దృక్పథం ఉండేది. గత పది పన్నెండేళ్ళలోనూ ఇల్లు కొనుక్కోవడాన్ని ప్రభుత్వమూ, బేంకులూ బాగా ఆకర్షణీయంగా చెయ్యడం వల్లనూ, మంచి కెరీర్‌లో ఉన్న యువతులు ముప్ఫై వయసుకొచ్చే లోపలే అవసరమైనంత తొలి పెట్టుబడి సంపాదించుకోవడం వల్లనూ తమ స్వంత ఇల్లు కొనేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ వచ్చారు. ఎప్పటికి వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియని మొగుడి గురించి తన జీవితాన్ని “పాజ్” లో ఉంచడానికి ఇష్టపడ్డం లేదు ఈ నాటి యువతి. అదలా ఉండగా, స్త్రీని కలిసే సమయానికే ఆమె ఒక ఇంటి యజమానురాలై ఉండడం పురుషుడికి ఒక పక్కన సహజంగా భీతి కలిగించే లక్షణం, మరొక పక్క ఆత్మ న్యూనత ప్రశ్న. ఇలా ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తున్నాయి ఈ ఆర్ధిక సామాజిక అంశాలు.
ఐతే, తన నివాస స్థలంలో ఒంటరిగా ఉన్నంత మాత్రాన, జీవితంలో ఒంటరిగా లేరు ఈ స్త్రీలు (ఆ మాటకొస్తే పురుషులు కూడా). కాలమిస్టు కేట్ బాలిక్ (Kate Bolick) ఒక పత్రిక వ్యాసంలో రాసినట్టు వీళ్ళు ఎప్పటికంటే బలమైన స్నేహ బంధాల్ని ఏర్పరుచుకుంటున్నారు. ఇదివరకటి తరానికి చెందిన సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ తన తోటి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని సెటిలైపోతుంటే తానొక్కతే ఒంటరిగా మిగిలిపోతున్నానే అనే మనోదౌర్బల్యాన్ని, దుఃఖాన్ని ఒంటరి స్త్రీపాత్రల మీద మోపుతుండేవారు. అలాంటిది, మందిలోనే ఉంది శక్తి అన్నట్టు, సింగిల్ గా ఉన్న స్త్రీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏ స్త్రీకయినా తోటి సింగిల్ స్నేహితురాళ్ళు తగినంత మంది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటోంది. చిన్నప్పటి స్నేహాలే కాక, ఇప్పుడు కొంత వయసూ అనుభవమూ ఏర్పడినాక చేసుకుంటున్న, బలపడుతున్న ఈ స్నేహాల్లో మరింత తృప్తిని పొందుతున్నామని యువతులు భావిస్తున్నారు. ఇటువంటి జీవితానుభవాలు, ఆలోచనా దృక్పథమూ ఇటీవలి సినిమాల్లో – ఉదాహరణకి, బ్రైడ్స్‌మెయిడ్స్, ఫైవ్ యేర్ ఎంగేజిమెంట్, యాయా సిస్టర్హుడ్ వంటి సినిమాలు – బలంగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, అంధ్రాలో మధ్యతరగతి అబ్బాయిలకి పెళ్ళి చేద్దామంటే పిల్లే దొరకడం లేదట! ఆ ముచ్చటేవిటో మరోమాటు చూద్దాం.

–ఎస్.నారాయణస్వామి

మీ మాటలు

 1. ఆసక్తికరమైన అంశాన్ని ఎంచుకున్నారు!

  మీ రిసెర్చ్ లో “పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర?” అని కెరీర్ బిల్డ్ చేసుకొనే అమ్మాయిలు కూడా పెళ్లి సమయం వచ్చేసరికి భర్తగా తనకంటే ఉద్యోగరీత్యా, సంపాదనాపరంగా పయ్యెత్తున ఉన్న అబ్బాయిలనే కోరుకుంటున్నారా?

 2. ఈ శీర్షిక కొద్దిగా అయినా మార్చకుండా ఇండియాలో పరిస్థితి కి వర్తింప జేస్తూ వ్యాసం రాయొచ్చండీ.

  ఇండియా విషయానికొస్తే అమ్మాయిలు చాలా సెలక్టివ్ గా ఉంటున్నారు. బ్రహ్మాండంగా చదివేసి, మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల వచ్చిన ఆత్మ విశ్వాసం అనుకుంటా అది. ఇది వరలో లోగా ఫామిలీ మంచిది, అబ్బాయి బుద్ధి మంతుడు వంటి మధ్య వర్తుల కబుర్లకు ఇప్పుడు ఇంపార్టెన్స్ లేనే లేదు.

  మందిలోనే ఉంది శక్తి అన్నట్టు, సింగిల్ గా ఉన్న స్త్రీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏ స్త్రీకయినా తోటి సింగిల్ స్నేహితురాళ్ళు తగినంత మంది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటోంది. _____________-యెస్… అందుకే “ఇప్పుడేం కొంప మునగలేదులే” అని మంచి ఛాయిస్ కోసం చూస్తున్నారు అమ్మాయిలు .అంతే కాదు, చక్కగా స్నేహాన్ని, అభిరుచుల్ని,సంపాదనలో ఉన్న సుఖాన్ని, స్వేచ్ఛను హాయిగా అనుభవిస్తూన్నారు కూడా. ఒక వైపు సొంత ఇల్లు, షేర్లు వంటి పెట్టుబడులు పెడుతునే మరో వైపు సంతోషంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చదువుకుని ఉద్యోగంతో పాటు ఆత్మ విశ్వాసం కూడా సంపాదించుకున్న అమ్మాయిలు చాలా సంతోషంగా జీవిస్తున్నారు

  ఇక…
  అబ్బాయిలు ఎంత గొప్ప క్వాలిఫికేషన్ తో ఎంతెంత సంపాదిస్తున్నా….అమ్మాయిలు దొరని మాట నిజమే! దీనికి కారణాలు బోల్డన్ని.

  మీరు ఇంకో కోణం గమనించారా? అమ్మాయిల సంగతేమో కానీ అబ్బాయిలు చాలామంది అమ్మాయి తన కంటే ఎక్కువ చదివినా, మంచి ఉద్యోగం చేస్తున్నా సరే, పెళ్ళికి ఒప్పేసుకుంటున్నారు. ఒక్కోసారి డిపెండెంట్స్ గా ఇక్కడికి H4 మీద రావడానికి కూడా ఒప్పుకుంటున్నారు.

  ఆ ముచ్చట కూడా పట్టించుకుని రాయండి మరి.

  • నిజానికి ఈ కాలం అమెరికాంతరంగం కదా .. ఇండియా సాంఘిక పరిణామాలు వేరెక్కడన్నా రాసుకోవాలి :)

 3. ఇంటరెస్టింగ్.. ఇండియా లో కూడా (బహుశా మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ చాలా దశాబ్దాలు గా ఉన్నా,. ఇప్పుడు తెలుగమ్మాయిలలొ కూడా ఎక్కువవుతోంది..) ..”చక్కగా స్నేహాన్ని, అభిరుచుల్ని,సంపాదనలో ఉన్న సుఖాన్ని, స్వేచ్ఛను హాయిగా అనుభవిస్తూన్నారు కూడా. ఒక వైపు సొంత ఇల్లు, షేర్లు వంటి పెట్టుబడులు పెడుతునే మరో వైపు సంతోషంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చదువుకుని ఉద్యోగంతో పాటు ఆత్మ విశ్వాసం కూడా సంపాదించుకున్న అమ్మాయిలు చాలా సంతోషంగా జీవిస్తున్నారు “..

  సంధి జెనరేషన్ కావడం తో, తల్లిదండ్రులు, చుట్టాలు, కొద్దిగా బాధ పడుతున్నా, పెద్ద గా చేసేది లేక, ఊరుకుండిపోతున్నారు. ఐదారేళ్ళు కారీర్ లో స్థిరపడి కొద్ది పాటి పెట్టుబడులు, కావలసిన చోట్ల కి ప్రయాణాలు,. హాబీలు అవీ పర్స్యూ చేసుకుని మాత్రమె పెళ్లి వైపు ఆచి తూచి అడుగులేస్తున్నారు.

  • అంటే పెళ్లి less important అయిందంటారా?

   • లేదు. పోస్ట్ పోన్ అవుతోంది.. ఎలా అయితే మగపిల్లలు కొద్దిగా సరదా గా గడిపి, ఆర్థికం గా స్థిర పడితే కానీ చేసుకోము అని ఎనభైల్లో, తొంభైల్లో లేట్ చేయడం మొదలు పెట్టారో.. అదే ట్రెండ్ తెలుగమ్మాయిల్లో కూడా మొదలయి.. ఎక్కువవుతోందని ..

 4. సాయి పద్మ says:

  వ్యాసం బాగుంది . హోం మేకర్స్ గా ఉన్న మగవాళ్ళు కూడా ఆత్మ న్యూనత తో బాధ పడుతున్నారా , ఆలోచించాలి . ఇదే పరిస్థితి ఇండియా లో కూడా ఉంది .. ఇప్పుడే ఒకమ్మాయి , ఇరవై నాలుగేళ్ళు, కోటి రూపాయలు సంపాదిస్తే గానీ చేసుకోను , అప్పుడు చెప్పండి సంబంధాలు అని చెప్పింది . ..

 5. అమెరి’కాంత’రంగాన్ని ఆవిష్కరించారు గురూగారు. :)

 6. రవి వీరెల్లి says:

  నారాయణస్వామి గారు,

  వ్యాసం చాలా బాగుంది.

  “అంధ్రాలో మధ్యతరగతి అబ్బాయిలకి పెళ్ళి చేద్దామంటే పిల్లే దొరకడం లేదట!”
  ఇంటరెస్టింగ్!!! ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే!

  రవి

 7. స్వాతీ శ్రీపాద says:

  పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర?-ఈ పరిస్తితి కి భయపడే మనువు మను ధర్మశాస్త్రం రాసినదీ అది హిందువులమీద రుద్దినదీ (జస్ట్ కిడ్డింగ్ ) సహజీవనం సమభావనకు అర్ధం తెలియనంత వరకు ఈ పరిణామాలు తప్పవు . అహం తరాల వారసత్వం చేసుకున్నాక అది వదిలించుకోడం అంత సులువు కాదు. ఇప్పటికీ అమెరికా వచ్చినా ఉద్యోగాలు చేసినా కోడలు అణిగిమనిగి ఉండాలనే అత్తమామలు అబ్బాయిలు లేరా? ఇవన్నీ చూసాక పెళ్లి చూద్దాం అనక సరే అని ఎలా అంటారు? అదే సమయంలో భర్తను గుప్పిట్లో పెట్టుకుని ఆడించాలనుకునే మహా తల్లులూ లేరని కాదు. అందుకే పెళ్లి ఇప్పుడు NEED BASED కాదు. అందుకే వ్యక్తిత్వాలను గౌరవించుకునే మార్పు వహ్చ్చే వరకు ఈ క్రైసిస్ తప్పదు

 8. కామెంటిన అందరికీ ధన్యవాదాలు

 9. బాగుందండీ…దారిద్ర్యం విడిపోయే స్వేచ్ఛను కూడా ఎలా హరిస్తుందో చెప్పిన పద్ధతి నచ్చింది. అబ్జర్వేషన్స్‌ బాగున్నాయి. హాలీవుడ్‌ సినిమాల్లోంచి అమెరికాను అర్థం చేసుకునే వారికి వాస్తవచిత్రం తెలుస్తుంది. నేరుగా సంబంధం లేకపోయినా ఇది చదువుతుంటే బౌమన్‌ వ్యాసం గుర్తొచ్చింది. 44 లెటర్స్‌లో అనుకుంటాను. ఐరోపాలోని మూడు జనరేషన్స్‌మీద రాశారాయన.

 10. vasavi pydi says:

  ఎందులోనైన సమతుల్యం పాటించాలి. ఆడపిల్ల కట్టుబాట్లను దాటుకుని స్వేఛ్చ గా ఎదుగుతుంది ఇప్పుడిప్పుడే కొత్త గా ప్రపంచాన్ని గమనిస్తుంది .పెళ్లి విషయంలో ఎక్కువ తక్కువలు చూడకుండా ,మనసు కు నచ్చిన మనిషిని సరైన వయసులో పెళ్లి చేసుకునేట్లుగా స్వతంత్రంగా జీవితం గడిపేట్లు గా తల్లితండ్రులు ప్రోత్శాహిస్తేఈ సమస్య సమసిపోతుందని నా అభిప్రాయం

 11. కె.కె. రామయ్య says:

  ప్రియమైన జి.ఎస్‌. రామ్మోహన్‌ గారు, ప్రఖ్యాత పోలండ్‌ సామాజిక తత్వవేత్త జిగ్మంట్ బౌమన్ సైద్ధాంతిక భావనతో కూడిన ‘లిక్విడ్ మోడర్నిటీ’ పుస్తకాన్ని డా॥ పాపినేని శివశంకర్ గారు అనువదించిన ‘ద్రవాధునికం’ గురించేనా మీరు ప్రస్తావిస్తున్నది.

  సమాజమనే బంధం నుంచి కట్టుబాట్లను ఛేదించుకొని స్వార్థ సంకుచిత జీవితాన్నే పరమలక్ష్యంగా ఎగబాకుతున్న వారికి తాము పోతున్నది పైకి కాదు, కిందికి అని తెలిసినా, దానిని సరిదిద్దుకొనే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. కులవృత్తుల నుంచి కుటీర పరిశమ్రలకు, వాటి నుంచి పొగగొట్టాలకు, అక్కడ్నించి ఐటి పరిశ్రమలకు ఎగబాకిన మానవ ప్రగతిరథం చివరకు చేరుకున్నది ఎక్కడికో తెలిస్తే మనసు ఉసూరుమంటుంది. ఇంగ్లండు, అమెరికా సమాజాల పోకడలను అతిగుడ్డిగా అనుకరిస్తున్న భారత్ సహా అనేక ప్రపంచ దేశాల్లోని సమాజాల పరిస్థితి ఇవాళ మీద మిటమిట- లోన లొటలొట అన్నట్టుగానే ఉంది.

  http://www.namasthetelangaana.com/Sunday/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%A4-10-9-476358.aspx

Leave a Reply to Sujatha Cancel reply

*