సాయంత్రపు సరిహద్దు

jaya

 

ఉదయమంత ఆశ

జీవితపు దేశాన్ని వెలిగిస్తూనే వుంటుంది
 అక్షరాల కొమ్మలకు
భావాల నీటిని తాగిస్తూ
వొక కల అతకని చోట…
ఒంటరితనం ఏకాంతమవని పూట
కొన్ని సాయంత్రాలు వొస్తాయి..
నన్నిలా వొదిలేస్తూంటాయి
2.
వదిలేస్తున్నాను… వొదిలొస్తున్నానూ..
అంటూనే వెంట చాలా తెచ్చేశాను
గింజల్లో మొలకెత్తని పచ్చదనాన్నీ
పువ్వుల్లో కనిపించని పళ్ళనీ
మట్టిలో ఆవిరవుతున్న నీటిని
నీటిని దాటిన నివురునీ..
వెంటొచ్చాయనుకుంటునే
నన్నొదిలేశాయి చాలా..
వెలుగునంటుకున్న చీకట్లూ
తోడు జోడవుతున్న ఒంటరితనాలూ
నిలదీయాలనుకున్న నెమ్మది నీడల్లో
ఆటలాడుకుంటున్న ప్రశ్నా పతకాలు
3.
వాటేసుకున్న విరాగాలు
జోల పాడతాయి ఏకాంతానికి
రాత్రంతా నిద్ర మేల్కొంటుంది
మెలకువ కలగంటుంది
ఉదయాన్నే ఊపిరి పీల్చిన ఊహలు
గాలిలో గంధంలా
మొదటి మెలకువతో పాటు
ఊపిరితిత్తుల్లోకి జొరబడతాయి..
భుజాన మోస్తున్న జీవితాన్ని
ప్రేమగా సర్దుకుని
మళ్ళీ మొదలెడతా…
సాయంత్రపు సరిహద్దుకు ఓ నడక..
-జయశ్రీ నాయుడు

మీ మాటలు

 1. జీవితపు ప్రయాణపు నడకనీ, అందులోని సాధకబాధకాల్ని పద్యాప్రదంగా హృద్యంగా చెప్పుకొచ్చారు జయాజీ…ఎన్ననుకున్నా ఎలా అనుకున్నా ఇది తప్పదు అనే నిజాన్ని కవిత్వీకరించిన తీరు శ్లాఘనీయమే….మొదటిలైను తర్వాత గ్యాప్ ఎందుకో అర్ధంకాలేదు. ముందు అదే టైటిల్ అనుకున్నాను. టైపో అనుకోవచ్చేమొలెండి.

 2. సాయి పద్మ says:

  వదిలేస్తున్నాను… వొదిలొస్తున్నానూ..

  అంటూనే వెంట చాలా తెచ్చేశాను

  గింజల్లో మొలకెత్తని పచ్చదనాన్నీ

  పువ్వుల్లో కనిపించని పళ్ళనీ

  మట్టిలో ఆవిరవుతున్న నీటిని
  నీటిని దాటిన నివురునీ..
  వెంటొచ్చాయనుకుంటునే
  నన్నొదిలేశాయి చాలా..
  వెలుగునంటుకున్న చీకట్లూ
  తోడు జోడవుతున్న ఒంటరితనాలూ
  నిలదీయాలనుకున్న నెమ్మది నీడల్లో
  ఆటలాడుకుంటున్న ప్రశ్నా పతకాలు… At the end of the day .. what matters ..there is unique slow living in your worlds which is mesmerising and makes one stop and introspect life .. kudos jaya

  • థాంక్యూ పద్మా

   నీ స్పందన లో చక్కగా ముస్తాబైన అక్షరాల్ని మరో సారి మురిపెం గా చూసుకున్నట్టుంది

 3. “తోడు జోడవుతున్న ఒంటరితనాలూ”లాంటి నూతన ఎక్స్ప్రెషన్సు …భావ ఘాఢత మెండుగా ఉన్నాయి..మంచి కవిత.

 4. రవి says:

  జయశ్రీ గారు,

  పోయెమ్ చక్కగా వచ్చింది. అభినందనలు!

  రవి

 5. జయశ్రీ గారూ!

  బాగుంది మీ కవిత. అభినందనలు.
  మొదటి, ఆఖరి పార్టుల్లోని మధ్యభాగాలు పులుముకున్న కవితాస్పర్శ హాయిగొలిపే విధంగా వుంది.
  మొదటి పంక్తి తర్వాత గ్యాప్ విషయంలో వాసుదేవ్ గారి అభిప్రాయమూ నా అభిప్రాయమూ ఒకటే.
  ‘ఉదయమంత’ ఆశ మీ కవితకు శీర్షిక అయినప్పుడే అలా గ్యాప్ వుంచటం ఎక్కువ సమంజసంగా
  వుంటుందేమో.

  • ఎలనాగ గారు మీ స్పందన కు, అభినందనలకు కృతజ్ఞతలు.
   ఉదయమంత ఆశ – తర్వాత గాప్ ఎలా వచ్చిందో నాకూ తెలియదు

 6. రాత్రంతా నిద్ర మేలుకుంటుంది మెలకువ కల గంటుంది…సాయంత్రం ఉదయం వెలుగు చీకటి ఇదేగా అస్తిత్వం…కవిత చాలా బావుంది.

  i

 7. ఉదయాన్నే ఊపిరి పీల్చిన ఊహలు
  గాలిలో గంధంలా
  మొదటి మెలకువతో పాటు
  ఊపిరితిత్తుల్లోకి జొరబడతాయి..
  భుజాన మోస్తున్న జీవితాన్ని
  ప్రేమగా సర్దుకుని.. …అన్నారు
  .ఒక పక్క బరువు ఒక పక్క ప్రేమ జీవితాన్ని మోసినందుకు విషాదమా? సంతోషమా?

  • మధు గారు
   మీ కామెంట్ కి కృతజ్ఞతలు
   జీవితాన్ని మోసినందుకు విషాదమా? సంతోషమా? — అన్నది మీ ప్రశ్న అని అనుకుంటున్నాను
   జీవితాన్ని మోయడం కాదు.. జీవితం అనేదే సమ్మోద ఖేదాల కలగలుపు రంగులు పూసుకున్న పికాసో చిత్రం
   అవి ఎప్పుడూ సమంగా వుండవు.
   విషాదం పాలు ఎక్కువే.. అదే బరువు కూడా..
   యీ బరువు మోస్తూ, ఆనందపు అతిథుల్ని ఆదరిస్తూ సాగవలసిందే. అదే ఇక్కడ చెప్పిన జీవితపు బరువు.
   ఆ రెంటినీ బాలెన్స్ చెయ్యడం కోసం ప్రేమ సహాయం తప్పదు – అదే జీవితపు నడక
   అందుకే ఆ బరువుని కూడా ప్రేమగా సర్దుకొని ముందుకు సాగడం

 8. C.V.SURESH says:

  a critical poem! వదిలేస్తున్నాను… వొదిలొస్తున్నానూ..
  అంటూనే వెంట చాలా తెచ్చేశాను
  గింజల్లో మొలకెత్తని పచ్చదనాన్నీ
  పువ్వుల్లో కనిపించని పళ్ళనీ
  మట్టిలో ఆవిరవుతున్న నీటిని
  నీటిని దాటిన నివురునీ..
  ………………ఒకే స్టా౦జా లో భిన్నమైన రీతులు. ఇక్కడివరకు నిర్వేద౦, నిరాశవాద౦ కనిపిస్తు౦ది. అటు తర్వాత అదే స్టా౦జా లో ఇలా సాగుతు౦ది..
  “వెంటొచ్చాయనుకుంటునే
  నన్నొదిలేశాయి చాలా..
  వెలుగునంటుకున్న చీకట్లూ
  తోడు జోడవుతున్న ఒంటరితనాలూ
  నిలదీయాలనుకున్న నెమ్మది నీడల్లో
  ఆటలాడుకుంటున్న ప్రశ్నా పతకాలు………” ఇది పూర్తిగా ఆప్టిమిజమ్ తొ సాగే పదాలు! అ డిఫెర్౦ట్ పొయమ్!

  మూడవ స్టా౦జ లో “వాటేసుకున్న విరాగాలు
  జోల పాడతాయి ఏకాంతానికి
  రాత్రంతా నిద్ర మేల్కొంటుంది
  మెలకువ కలగంటుంది
  ఉదయాన్నే ఊపిరి పీల్చిన ఊహలు
  గాలిలో గంధంలా
  మొదటి మెలకువతో పాటు
  ఊపిరితిత్తుల్లోకి జొరబడతాయి..
  భుజాన మోస్తున్న జీవితాన్ని
  ప్రేమగా సర్దుకుని
  మళ్ళీ మొదలెడతా…
  సాయంత్రపు సరిహద్దుకు ఓ నడక..//….” ఇది కూడా అ౦తే తర్క౦తో మిళితమైన అశా నిరాశవాదాల మేలు కలియక! ఒరిజినల్ గా సగటు మనిషి జీవిత౦ ఇలాగే ఉ౦టు౦ది. దాన్ని యధాతధ౦గా ఒక కవిత రూప౦లో ఉ౦చారు. ..అక్కడక్కడ నాకు ఈ కవిత చదువుతు౦టే కొన్ని ప్రశ్నలు ఉదయి౦చక పోలేదు. బావు౦ది మేడమ్ కవిత! a typical poem with theosophical touch!

 9. Jayashree Naidu says:

  సురేష్ గారు
  చాలా చాలా ఆలస్యం గా స్పందిస్తున్నందుకు క్షమాపణలు

  కవితనంతా చేనులోని మొక్క మొక్కనీ పలకరించినట్టుగా వాక్యా లన్నిటినీ సమీక్షించారు మీరు .
  మనసెప్పుడూ ద్వైదీ భావనల లోకం కదా ఒక సారి నిరాశా వాదం అయితే మరో సారి మరో సారి ఆశా వాదం చిగురిస్తుంది. నిరాశ నుంచి బైట పడటానికి ఆశ ను మనమే సృష్టించుకోవల్సి వస్తుంది కూడా. సాయంత్రపు సరిహద్దు దగ్గర రోజు జీవితాన్ని ఒక మారు అవలోకించుకోవడం — అదే ఇందులోని ముఖ్యాంశం

మీ మాటలు

*