యువ కవీ!


మా సూచనలు పట్టించుకోకు, మరిచిపో

నువ్వే మొట్టమొదటి కవిత్వం రాస్తున్నట్టు

లేదా నువ్వే ఆఖరి కవివైనట్టు

నీ సొంత పదాలతో మొదలుపెట్టు

 

మా కవిత్వం చదివే ఉంటావు

మా అహంకారాల కొనసాగింపు కావద్దు నీ కవిత

మా వేదనా గాథల తప్పులు సవరించాలి నీ కవిత

 

నేనెవరిని అని ఎవరినీ అడగకు

మీ అమ్మ ఎవరో నీకు తెలుసు

తండ్రి ఎవరో నువ్వే తెలుసుకో

 

సత్యం ఒక తెల్లకాగితం

దానిమీద కాకి సిరాతో రాయి

సత్యం ఒక అంధకారం

దానిమీద ఎండమావి వెలుగుతో రాయి

 

డేగతో కుస్తీ పట్టాలనుకుంటే

డేగ లాగనే పైపైకి ఎగరక తప్పదు

 

నువ్వొక స్త్రీతో ప్రేమలో పడితే

అంతు చూసే మనిషి

ఆమె కాదు, నువ్వే కావాలి

 butterflies

జీవితం మనం అనుకునేదానికన్న తక్కువ సజీవం

కాని ఆ విషయం ఎక్కువ ఆలోచించొద్దు

ఆలోచిస్తే మన ఉద్వేగాలకు జబ్బు చేస్తుంది

 

 

గులాబి పువ్వు వేపు చాలసేపు తేరిపార చూడు

తుపానులో కదలకుండా నిలబడగలుగుతావు

 

నువ్వూ నాలాంటి వాడివే, కాని నా అగాథం సుస్పష్టం

నీ దారుల రహస్యాలు ఎప్పటికీ ముగియనివి

పైకి ఎగుస్తాయి కిందికి జారుతాయి ఎగుస్తాయి జారుతాయి

 

యవ్వనం అంతం కావడమంటే

పరిణతి చెందిన నైపుణ్యమో వివేకమో అని నువ్వనుకోవచ్చు

అవును, సందేహం లేదు, అది వివేకమే

వేడి చల్లారిన అకవితా వివేకం

 

చేతచిక్కిన వెయ్యి పక్షులు కూడ

వృక్షాన్ని అలంకరించే ఒక్క పక్షికి సమానం కావు

 

కష్టకాలంలో పుట్టిన ఒకే ఒక్క కవిత

సమాధి మీద అందమైన పూలగుత్తి

 

ఉదాహరణలు సులభంగా దొరకవు

నీకు నువ్వే తయారు కావాలి

ప్రతిధ్వనుల సరిహద్దులకావల నువు కానిదీ నువ్వే కావాలి

 

పట్టుదలకూ కాలం చెల్లిపోతుంది, కాకపోతే కాస్త ఎక్కువ కాలం

అందుకే ఉత్సాహాన్ని గుండెల నిండా నింపుకో

నీ దారి చేరడానికి దాని వెంటనే నడువు

 

నువ్వే నేను, నేనే నువ్వు అని

నెచ్చెలితో ఎప్పుడూ చెప్పకు

దాన్ని తిరగేసి చెప్పు

మనిద్దరం బంధనాలలోని నిండు మేఘానికి

అతిథులమని చెప్పు

 

ఎప్పుడూ నలిగిన దారిలో నడవకు

నియమాన్ని తప్పడానికి శక్తినంతా ఉపయోగించు

 

ఒకే మాటలో రెండు నక్షత్రాల్ని గుదిగుచ్చకు

ఎగసే పారవశ్యాన్ని సంపూర్ణం చేయడానికి

అతి ముఖ్యమైన దాని పక్కనే కడగొట్టు దాన్నీ పెట్టు

 

మా సూచనలు కచ్చితమైనవని ఎప్పుడూ అనుకోకు

బిడారుల జాడలు మాత్రమే విశ్వసించు

 

కవి గుండెలలో దిగిన తూటా లాంటిది నీతి

అది ఒక భయానక వివేకం

ఆగ్రహం కలిగినప్పుడు ఎద్దులా బలం తెచ్చుకో

ప్రేమించేటప్పుడు బాదం పువ్వులా మృదువైపో

మూసుకున్న గదిలో ఒంటరిగీతంగా ఉన్నప్పుడు

ఏమీ చేయకు, ఏమీ చేయకు

 

ప్రాచీన కవి అనుభవించిన రాత్రిలా సుదీర్ఘమైన రహదారి

మైదానాలూ పర్వతశ్రేణులూ నదులూ లోయలూ

నీ స్వప్నాలకు అనుగుణంగా నడుస్తాయి

నిన్ను వెంటాడేది ఒక మరుమల్లె పువ్వు కావచ్చు

ప్రాణం తీసే ఉరి కంబమూ కావచ్చు.

 

నీ కర్తవ్యాల గురించి నాకు చింతలేదు

నీ గురించి నా విచారమల్లా

తమ బిడ్డల సమాధుల మీద నాట్యాలు చేసేవాళ్ల గురించి

గాయకుల బొడ్డులో దాగిన రహస్య కెమెరాల గురించి

 

నువ్వు ఇతరుల నుంచి దూరమైపోతేనో

నా నుంచి దూరమైపోతేనో

నాకు విచారం కలగదు

నన్ను అనుకరించనిదేదైనా మరింత అందమైనదే

 

ఇకనుంచి, నిర్లక్ష్యపు భవిష్యత్తే నీ ఏకైక రక్షకురాలు

నువు కొవ్వొత్తి కన్నీళ్లలా విషాదంలో కరిగిపోతున్నప్పుడు

నిన్నెవరు చూస్తారనో

నీ ఆశల వెలుగును ఎవరు కొనసాగిస్తారనో ఆలోచించకు

నీ గురించి నువు ఆలోచించవలసిందొకటే

నా వ్యక్తిత్వమంతా ఇంతేనా అని.

 

ఏ కవితైనా ఎప్పుడూ అసంపూర్ణమే

సీతాకోక చిలుకలు మాత్రమే దాన్ని సమగ్రం చేస్తాయి

 

ప్రేమలో సలహాలుండవు, అది అనుభవం

కవిత్వంలో సలహాలుండవు, అది ప్రతిభ

 

చిట్టచివరికి,

చివరిదే గాని తక్కువదేమీ కాదు

నీకు నా వందనం

 

*

 

యువకుడిగా వున్నప్పుడు దార్వీష్

యువకుడిగా వున్నప్పుడు దార్వీష్

మహమూద్ దర్వీష్ (1941-2008) పాలస్తీనా కవి, పత్రికారచయిత, సామాజిక కార్యకర్త, కమ్యూనిస్టు, జాతి విమోచనోద్యమ నేత, ఇజ్రాయిల్ పాలనలో ఖైదీ, ప్రవాసంలో తన జన్మభూమి మీద పరిశోధనా కేంద్రం నడిపిన సంచాలకుడు, పాలస్తీనా ప్రయోజనాలకోసం నాయకుడు యాసర్ అరాఫత్ ను కూడ ధిక్కరించిన స్వతంత్రజీవి, పునర్నిర్మాణవుతున్న సాయుధ పోరాటాన్ని ఆసక్తిగా గమనించిన వ్యాఖ్యాత. పుట్టుకతో పాలస్తీనీయుడై, పాలస్తీనా దుఃఖాన్నే ఎక్కువగా గానం చేసినప్పటికీ, ఒక్క పాలస్తీనియన్లు మాత్రమే కాదు మొత్తం అరబ్ ప్రపంచమే దర్వీష్ ను తమ ఆత్మీయమిత్రుడిగా, మహాకవిగా భావిస్తుంది. దాదాపు ఐదు దశాబ్దాల సాహిత్య జీవితంలో దర్వీష్ కనీసం ఇరవై కవితా సంపుటాలు, పదిహేను ఇతర రచనల సంపుటాలు ప్రచురించాడు. ముప్పైకి పైగా ప్రపంచ భాషలలోకి అనువాదమయ్యాడు. అరబిక్ నుంచి ఇంగ్లిష్ లోకి పాలస్తీనియన్ – అమెరికన్ కవి, వైద్యుడు ఫాదీ జౌదా అనువదించిన ఈ కవిత పొయెట్రీ పత్రికలో 2010 మార్చ్ సంచికలో అచ్చయింది.

పాలస్తీనా కవిత:  మహమూద్ దర్వీష్

అనువాదం: ఎన్. వేణు గోపాల్


 

మీ మాటలు

 1. మంచి కవిత,..సరళమైన అనువాదం,…

 2. buchireddy gangula says:

  ధర్వీష్ మంచి కవి
  అనువాదం బాగుంది ————బుచ్చి రెడ్డి గంగుల

 3. Narayanaswamy says:

  చాల బాగుంది డియర్ వేణు!

 4. మొత్తం కవితంతా సరళ సమ్భాశణమైనా ఉద్విగ్న భావాన్ని అనుభవింప జేశారు
  మీ అనువాదం బాగుంది వేణు గోపాల్ గారు

  ఇంకొన్ని కవితలను కూడా అనువదించి అందించండి.. ఎదురు చూస్తుంటాం

 5. ఎన్ వేణుగోపాల్ says:

  భాస్కర్ కొండారెడ్డి గారు,
  బుచ్చిరెడ్డి గంగుల గారు,
  ప్రియాతిప్రియమైన స్వామి,
  జయశ్రీ నాయుడు గారు,

  కృతజ్ఞతలు. జీవితంలోంచి కవిత్వం వెళిపోయి చాల కాలమయింది. పది పన్నెండేళ్ల వయసు నుంచి దాదాపు పదేళ్ల కింది దాక ముప్పై ఏళ్లకు పైగా, కవిత్వమొక తీరని దాహంగా, బహిరంతర సామాజిక వయ్యక్తిక సంచలనాల తీవ్రావధి కవిత్వమే అనుకున్నాను గాని కవిత్వం ఒంటరి శాపమో వరమో అని ఇటీవల అనిపిస్తోంది. ఎవడి కన్నీళ్లు వాడి సొంత ఆస్తి అన్నాడు గదా కేశవరావు నగ్నముని కాకముందు. ఒక కవితా సంపుటం వేసినా, దాదాపు వంద కవితల దాకా ప్రపంచ మహాకవులందరినీ అనువదించినా, ఇప్పుడెందుకో కవిత్వం ఎవరికి వాళ్లే వాళ్లకోసమే రాసుకోవాలనీ, కాని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కవిత్వం రాసుకోవాలనీ అనుకుంటున్నాను. ఎప్పుడో అత్యవసరమైతే తప్ప బహిరంగ అభివ్యక్తి అవసరం లేదనీ అనుకుంటున్నాను. ఇటీవల పొయెట్రీ ఫౌండేషన్ పంపుతున్న పొయెమ్ ఆఫ్ ది డే లో దర్వీష్ మళ్లీ ఆ సుషుప్తి లోంచి లేపి, ఒకసారి లోలోతుల నుంచి కదిలిస్తే ఇది చేశాను. మీ అభినందనల ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

  -వి.

 6. adhbuthamaina kavitha..

 7. అధ్బుతం.

 8. అద్భుతమైన కవిత

  • ఎన్ వేణుగోపాల్ says:

   వెంకట్రావు గారూ,
   బొల్లోజు బాబా గారూ,

   ధన్యవాదాలు.

   వి.

 9. హృదయానికి దగ్గరగా ఉన్న కవిత్వం.. మీకు కృతజ్ఞతలు సార్..

మీ మాటలు

*