‘ తంతే బూరెల బుట్టలో ……’

నోములూ వ్రతాలూ, పెళ్ళిళ్ళూ పేరంటాలు లేకుండా   పొదుగుడు కోడిపెట్టల్లాగా  ఎవరింట్లో వాళ్ళు పడుండే  ఆషాఢ  మాసం అంటే అత్తగారికి అంత అభిమానం లేదు. అలా అని అలక్ష్యమూ లేదు . ” ఆషాఢం ఇంకా ఎన్నాళ్ళుంటుందే  ” అని అక్కరకురాని చుట్టాన్ని తప్పక  భరిస్తున్నట్టూ రోజూ  కేలండర్ చూస్తూనే వుంటారు .  ఎక్కడో మూడు వారాల అవతల వున్న శ్రావణాన్ని  మాత్రం  “అదిగో వచ్చేస్తుంది ….ఇంకెంత ”  అంటూ  అంత మొహం చేసుకుని ఆహ్వానించేస్తూ వుంటారు .

అయినా  దేని దారి దానిదే అన్నట్టూ  ఆషాఢానికి జరగాల్సిన లాంచనాలన్నీ తు. చ తప్పక జరిపిస్తారు .ఆ ప్రకారం  ఆషాఢం  లో తప్పక తినాలని చెప్పే మునగాకు కోసం దొడ్లో మునగ చెట్టుని ఆకు లేకుండా దూసేశాం . నల్లేరు పచ్చడి, బలుసాకు పులుసు ,వాక్కాయ్ -పప్పూ  అంటూ నాలుక పసరెక్కేలా  కంచెలన్నీ మేసేశాం  . రంగు మాయకుండా డిజైను మారకుండా ( ఇంకేవిటీ చందమామ చుక్కలూను )  మళ్ళీ మళ్ళీ చేతులకి గోరింట పూయించేశాం .

తొలేకాశి వెళ్ళేనాటికి   లాంచనాలన్నీ యధావిధిగా పూర్తిచేసి పప్పులో ఉండ్రాళ్ళు కూడా వండుకు తినేసి   , ఈ ఆషాఢం ఇంకెన్నాళ్ళుందో అని  రోజులు   లెక్కపెట్టుకుంటుంటే ….హటాత్తుగా   అత్తగారికి గుర్తొచ్చింది తాటిపండు లాంచనం  ఒకటి . “ఈకాలంలో తాటి బూరెలు వండుకోవటం కూడా ఆచారమేమేనేవ్ . కానీ …,” అంటూ  కామాలో  ఇరుక్కుపోయారు .

అప్పటివరకూ అత్తగారి ఆకుపసరు  ఆచారాలకి నాలుక పీక్కున్న నేను ఈ పండాచారానికి  లొట్టలేసాను. చిన్నప్పుడెప్పుడో తిన్న తాటిరొట్టె, తాటిబూరెలు, అప్పాల రుచులు  గుర్తొచ్చి గుటకలు మింగాను .

“కానీ లేదు అర్ధణా లేదు కానిచ్చేద్దాం ..కానిచ్చేద్దాం” అని  తొందరపడ్డాను .

నా తొందరకాళ్ళకి బంధం వేస్తూ అత్తగారు ”  ఎప్పుడో నాలుగు తరాలకి ముందే మనింట తాటిపండుకి  తిలోదకాలు ఇచ్చేసారట  . ఎవరయినా పెడితే తినచ్చుకానీ  మనింట్లో వండుకోటం ఆనవాయితీలేదు . మనకి  అచ్చిరాదు  అని మా అత్తగారు మాకు మరీ మరీ చెప్పేవారు  అన్నారు . ” ఒకసారెప్పుడో మందపాటోరి ఇంటినుంచీ వచ్చాయి …..నిరుడు పెనుమత్సోరి చిన్నకోడలు వాళ్ళ పుట్టింట్లో  వండి తెచ్చి అందరికీ పంపింది . అలా తినడమే తప్ప మనింట్లో ఎప్పుడూ వండలేదుమరి. అయినా …..ఆనవాయితీ లేని పని అగచాట్ల పాలుచేస్తుందనీ ఎందుకొచ్చిన సంత ఊరుకుంటేపోయేదానికి అని నాలుక చప్పరించేసారు .

అప్పటికే తాటిబురెల మీద మనసుపడిపోయిన నాకు  అత్తగారి మాటలు ఏమాత్రం రుచించలేదు . పైగా అప్పుడెప్పుడో ఆవిడ అత్తగారు చెప్పిన మాట ఈనాటికీ పాటించడం అనేది అసలు  బుర్రకెక్కలేదు . ” ఊరుకుందురూ …మీరు మరీ చెపుతారు . ఒకరికి ఆచారం ఇంకొకరికి అనాచారం ఎలా అవుతుంది . అయినా ‘ పప్పులో ఉప్పెయ్యడానికీ, నిప్పుమీద నీళ్ళొయ్యడానికీ’  కూడా ఆనవాయితీలు చూసుకుంటామా . అలాంటివన్నీ నేను నమ్మనుబాబూ ” అనేసాను తేలిగ్గా  . “అంతేనంటావా !?”   అన్నట్టూ అనుమానంగా చూసేరు  అత్తగారు. అంతేకదామరి ! ఒకరికి మంచి ఇంకొకరికి చెడెందుకవుతుంది . చెట్టునించీ రాలిన పండు ఏ దేశంలో అయినా కిందికే పడుతుంది . ఎండలో నుంచుంటే ఎవరి నెత్తయినా మాడుతుంది . కాలమేదయినా  మబ్బుంలోంచే కదా  వాన పడుతుంది . అంటూ సినిమాల్లో లాయర్ లా  అటూ ఇటూ తిరుగుతూ అడ్డదిడ్డంగా వాదించేసాను  . దాంతో  కన్ ఫ్యూస్ అయిపోయిన అత్తగారు    “అంతేనంటావా ” అంటూ గుడ్లు తేలేసారు  .

అనుమానంలేకుండా అంతేమరి . ఈ ఆచారాలనేవి ఏనాడో ఏర్పడ్డాయి …ఇలా  నచ్చలేదనీ , అచ్చిరాలేదనీ ఎవరికి వారు మధ్యలో  వదిలెయ్యడం ఏం బావుంటుందీ అంటూ ,ఆచారాలు – సాంప్రదాయాలు , బూరెలు- గారెలు, పరమాన్నాలూ- పట్టుకొమ్మలు  అంటూ అప్పటికప్పుడు ఒక ఉపన్యాసం  అల్లి  అత్తగారి మీదికి  విసిరాను

ఎంతోకాలంగా వస్తున్న ఈ  ఆచారాలను   మనం ముందు తరాలకు  ముక్కుపిండయినా సరే నేర్పించి తీరాలన్నాను  . భూమ్మీద తాటి చెట్టనేది ఉన్నంతవరకూ ఆషాఢంలో  తాటిబూరెలు- అప్పాలు ఒండుకు తినడం అనే ఈ ఆనవాయితీని మనం  పాటించి తీరవలసిందే అన్నాను.  అసలా మాటకొస్తే ప్రతీ ఇంటిలోనూ కొబ్బరి మొక్కలు, అరటి పిలకలు నాటినట్టే ఒకటో రెండో  తాడి చెట్లు కూడా పెంచి వాటిని వారసత్వ ఆస్తిగా పిల్లలకు  రాసిచ్చే ఒక కొత్త ఆచారానికి మనమే నాంది పలకితే ఎలా వుంటుందో ఆలోచించండన్నాను .

అసలు సంగతి గ్రహింపుకి రాని అత్తగారు నా ఆరాటానికి  మురిసిపోయి , ఆచారాల మీద నాకు గల మక్కువకు మిక్కిలి సంతసించి  ” సర్లే  నువ్వంత సరదా పడుతుంటే నేనెందుకు కాదనాలీ  .అయినా …..అప్పాలొండటం అదెంతపనీ ” అంటూ చెంగున లేచి కూర్చున్నారు . లేడికి లేచిందే పరుగన్నట్టూ ఉన్నపళంగా బియ్యం నీళ్ళలో పోసేసి , అవతల దొడ్లో ట్రాక్టరుకి దమ్ము చక్రాలు బిగిస్తున్న అబ్బులు ని ఒక్క కేకేసి , ” ఒరేయ్ ఆ పనులు తరవాత …ముందెళ్ళి కట్టవలోంచీ మాంచి తాటిపళ్ళు నాలుగు ఏరుకురా ఫో” అని ఆర్డరేసారు.

ఆకారానికే కాక బుద్ధికీ ‘బండోడు’ అయిన  అబ్బులుగాడు ఓ బండినిండా తాటిపళ్ళు తోలుకొచ్చి వాకిట్లో  ఒంపేసేడు  . పైగా” కొనాలా పెట్టాలా ఉత్తినే వొచ్చినియ్యేకదండీ …మిగిలితే  తంపటేసుకుందారి ” అని అలవాటుగా  అక్కరలేని సలహా ఒకటి ఫ్రీగా పడేసాడు. ముందు ‘ ఇన్నేం  చేసుకుంటావ్ ‘   అని చిరాకు పడ్డా “ ఒండిపెడితే తినేవాళ్ళకి కరువా . మనవాళ్ళందరికీ తలో నాలుగూ పెట్టుకోవచ్చు  ” అని మరిన్ని బియ్యం నీళ్ళలో పోసేసారు అత్తగారు .

ఆ సీనంతా నడుస్తున్నప్పుడే  మొదటి ప్రమాదపు హెచ్చరికగా నా ఎడం కన్ను అదరడం మొదలుపెట్టింది. కానీ బూరెలు తినాలన్న బులబాటంలో  నేను దాన్ని ఖాతరు చెయ్యలేదు . అటకమీదనించీ పెద్దం బెల్లం దిమ్మ తీయించి దాన్ని మెత్తగా తరిగేయాలన్నారు. నీళ్ళు వాడేసి బియ్యం పిండి చేసి  , జల్లించేస్తే సగం పనయిపోయినట్టే అన్నారు. ఆ తరవాత బాగా మాగిన తాటిపళ్ళు  మదాయించి మెత్తగా గొజ్జు తీసుకుంటే ముప్పావువంతు వంటకం     తయారయిపోయినట్టే , ఇంకేవుందీ ఆ పిండీ బెల్లం తాటిపేశం ( గుజ్జు) కలిపి మనకి కావల్సిన బూరెలు, అప్పాలు నూనెలో వేయించి తీసేయడమే అన్నారు.  రోట్లో తలపెడుతున్నాని తెలీని నాకు నోట్లో నీళ్ళూరిపోయాయి .

బూరెలొండే బృహత్తర కార్యక్రమం లో భాగంగా పెందలాడే భోజనం చేసేసి , ఆ కార్యక్రమానికి అవసరమయిన రోలూ రోకలి, జల్లెడా, మూకుడూ వంటి సరంజామా అంతా సిద్ధం చేసేసి కూర్చున్నారు అత్తగారు . సరిగ్గా అదేసమయంలో రెండో ప్రమాద హెచ్చరికగా  చెవుల్లో చిన్నగా సైరన్ మోగింది కానీ  నేను దాన్ని వినిపించుకోలేదు.

”  కరెంటు మిల్లులో వేసిన పిండి తింటే వేడి చేస్తుందట . అయినా అదేవంతపనీ . నాలుగు దెబ్బలు పడితే నలిగి కూచుంటుంది  ”  అంటూ రోకలి నా చేతికిచ్చేసరికి గానీ నాకు బల్బు వెలగలేదు . ఓర్నాయనోయ్ …పిండి పోటెయ్యడమా ఎప్పుడూ కోలాటం  ఆడిన చేతులు కూడా కావే ఇవి ….రోకలి ఎత్తెత్తి దంచాలా ” అని లోపల్లోపల కుమిలిపో తూ   ”  అమ్మో…!నాకు చాతకాదండీ ” అనేసరికి   , “నేర్చుకుంటే సరి  అదేవంత  బ్రహ్మవిద్య! ఊ… కానియ్”  అని,  నేను ‘ ఊహు’  అంటున్నా వినిపించుకోకుండా  అప్పటికే ” ఆహూo…” అంటూ దంచుడు మొదలెట్టేసారు అత్తగారు.

అత్తగారికి ఎదురాడ్డం నేర్చుకోని ఆ రోజుల్లో ఇక చేసేదేముంది . ‘ దంచూ దంచూ…బాగా దంచూ’  అని పాడుకోటం దంచుకోటం తప్ప.

అలవాటులేని ఆచమనం లాగా  సాగుతుంది పని . పడాల్సినచోట తప్ప అంతటా పడుతుంది రోకలి . అంత పొడవున్నరోకలిని   ముందుకీ వెనక్కీ పడిపోకుండా   బేలన్స్ చేయలేక నానా హైరాన పడ్డాను . ఒక చేత్తో గాల్లోకి లేపిన రోకలిని   ఇంకో చేతిలోకి మార్చుకుంటుంటే  చెయ్యి జారి అత్తగారి నెత్తిన పడతానని బెదిరించింది. ‘ హవ్వ పరువు తియ్యకే ‘ అని బ్రతిమాలి బామాలి ఎలాగో దార్లోకి  తెచ్చుకునేసరికి  తలప్రాణం తోక్కొచ్చింది.   కత్తికట్టిన కాలం గురించి తెలుసుకానీ,  రోకలెత్తిన కాలం కూడా ఒకటుంటుందని  అది నాకే ఎదురవుతుందనీ   కలలోనైనా కలగనలేదు.

అదేం చిత్రమో ఎంత దంచినా బియ్యం తరుగుతున్నట్టు అనిపించడంలేదు . విఠలాచార్య సినిమాలోలాగా ‘ డొయ్యి…..’ మని అడుగునించీ   ఊరిపోతున్నాయేమో అని   అనుమానం వచ్చింది. ” హే ప్రభూ ఏవిటి ఈ పరీక్ష !? కాలాన్ని బట్టి     ఇష్టాలు మారుతున్నట్టే కష్టాలూ  మారాలికదా . సతీ సక్కుబాయికీ నాకూ ఒకేటైపు కష్టాలు పెట్టి , చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూడాలని సరదాపడుతున్నావే నీకిది న్యాయమా !? నోటికి కాస్త రుచిగా తినాలని కోరుకోవడమే  పాపమా ? ఆ కోరికని దాచుకోకుండా అత్తగారిముందు ప్రకటించడమే  నేరమా ? ఎందుకు స్వామీ ఈ పిండి పరీక్ష ? అని  అలవాటుగా కలవరిస్తు  ఏ మూలనుంచయినా ఆ దేవదేవుడు డింగ్మంటూ ప్రత్యక్షమయి నా కష్టాన్ని తీర్చకపోతాడా అని దిక్కులు చూసాను.

మా అత్తగారు వాయ వాయకీ ” అబ్బో…భలే దంచేస్తున్నావే ” అంటూ నన్ను భుజం తట్టి ముందుకు తోస్తుంటే నేను నిజమే కాబోలని మురిసిపోయి మరిoత ఎగిరెగిరి దంచడం మొదలుపెట్టాను . అలా ఒక పూటంతా దంచగా దంచగా పని ఒక కొలిక్కివచ్చింది . కానీ అప్పటికి ఒంట్లో ఓపికే కాదు బూరెలు తినాలన్న కోరికా కొడిగట్టిపోయింది . ఆ మాటే అత్తగారితో చెప్పేసాను.

”   నాకు బూరెలు తినాలని లేదు  మొర్రో  ” అని  ఏడుపు మొహం పెట్టుకున్నాను. ” ఓసి పిచ్చిదానా …..అలా ఢీలా పడిపోతే పనులవుతాయా . సగం పని అయ్యేపోయింది . ఇంకెంత  తాటిపళ్ళు గుజ్జుచేసి కలిపేసి ఒండేసుకోవడమే ” అనేసారు ఎంతో తేలిగ్గా . దాంతో నేనూ పారిపోయిన ఉత్సహాన్ని తిరిగితెచ్చుకుని ‘ఓస్  అంతేనటే పిచ్చి మొహమా’  నాకు నేను నచ్చచెప్పుకుని…. నడుం  బిగించి కూర్చున్నాను.    తీరా కూర్చున్నాకా తెలిసింది  అదంత ఆషామాషీ వ్యవహారం కాదనీ. తాటి పళ్ళు గుజ్జుతీయటం అరటి పండు తొక్క తీయటం ఒకటికాదని  .  పండులో ఉండే చిక్కని పీచునుంచీ మెత్తని గొజ్జుని వేరు చేయటానికి  చాలా భుజబలం అవసరమని .

మా అత్తగారు చేతులకి మట్టి అంటకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించే మంత్రిగారిలా  తాటిపండు నుంచి మెత్తని గొజ్జును సేకరించడం ఎలా ? అనేదాన్ని ఎంతో చాకచక్యంగా పైనుంచీ  చక్కని అభినయంతో ప్రదర్శించి చూపించి  , “అదిగో అవతల ఎవరో పిలుస్తున్నారు . నే చూసొస్తాను నువ్వు కానీయ్” అని   చక్కగా  చేతులు దులుపుకు చెక్కేసారు.

నేను మళ్ళీ ‘ అలో లక్ష్మణా ….!’అంటూ నా ప్రారబ్ధానికి మిక్కిలి వగచుచూ పనిలో పడ్డాను . చేతులు విరిగేలా, భుజాలు వాచేలా నాకు చాతనయినంతగా కష్టపడుతూ ‘ ఆచారాలు-  అగచాట్లు  ‘ అనే విషయం మీద మనసులోనే ఒక దీర్ఘ కవిత   రాసేసుకున్నాను ( కంగారుపడకండి ఇప్పుడది వినిపించను ) .

‘ఇదిగో వస్తా ‘ అన్నావిడ ఎంతకీ రారేవిటీ ? పనంతా నా నెత్తిన పడేసి ఎక్కడికి మాయమయిపోయారు ! ఇదేం పద్ధతి ?.అని నేను అలోచిస్తుంటే , ఆకుపచ్చ అంచున్న ఎర్ర చీరలో ఆకుల మధ్య మందారంలా మెరిసిపోతూ ప్రత్యక్షమయ్యారు అత్తగారు . మొహానికి పౌడరు రాసుకుని తల నున్నగా దువ్వుకున్నట్టున్నారు . మెడలో మేచింగు   పగడాల దండ ధరించారు. బూరెలొండటానికి ఇంత ముస్తాబెందుకబ్బా అని ఆశ్చర్యపోతూనే  ‘ ఒకవేళ ఇదీ ఆచారం కాబోలు  బాగానేవుంది !’ అనుకున్నాను .

‘చీర కుచ్చెళ్ళు సర్దుకుంటూ  పని ఏ మాత్రం అయిందీ అని ఆరాగా అడిగి ” అబ్బో…భలే తీసేశావే !” అంటూ  అలవాటయిన  లౌక్యాన్ని తిరిగి ప్రదర్శించారు అత్తగారు  . ఈసారి నేను ఆనందపడలేదు సరికదా ” ఆహా ఏమి  రచనా చమత్కృతి ” అని హాశ్చర్యపడ్డాను.  అత్తగారు కాస్త దూరంగా  ఎత్తుపీటమీద కూర్చుని , నే తీసిన తాటిపండు గొజ్జుకు సరిపడా పిండీ బెల్లం నాతోనే కలిపించి, ” ఇంకేవుందీ అయ్యేపోయింది” అన్న దంపుడు డైలాగుని మళ్ళీ కొట్టి , పొయ్యిమీద నూనె మూకుడు పెట్టించారు .

ఇందాకటి అభినయం తిరిగి కొనసాగిస్తూ ” నూనెలో పిండిని గుండ్రంగా వదిలితే బూరెలు,  పలచగా వేస్తే అప్పాలు అయిపోతాయి  అంతే ” అన్నారు .  మొదటివాయ వేయించి తీసాకా   వినాయకుడికీ, గ్రామదేవతకీ, ఇష్ట దైవాలకీ అంటూ పొయ్యి చుట్టూ నైవేద్యాలు పెట్టించారు ….”  రెండో వాయ , మూడో వాయ కూడా దగ్గిరుండి నాతో వేయించి ” వంద వాయలయినా ఇదే పద్ధతి . ఇలా వేసి అలా తియ్యడమే “  . నువ్వు కానీయ్ …నేనలా శాంత అత్తయ్యగారి ఇంటివరకూ వెళ్ళొస్తాను .  వాళ్ళింట్లో మూణ్ణాళ్ళ క్రితం కోడి పట్టు పెట్టిందట . ఆ మాయదారి పెట్ట ఒక్క గంటన్నా పట్టుమీదలేకుండా షికార్లు పోతుందట. అలా అయితే పిల్లలెలాదిగుతాయ్ . అదేవిటో  వాళ్ళకి కోడి పట్టు అచ్చిరాదు .ఎప్పుడూ  ముచ్చటగా మూడు పిల్లలయినా దిగవు .  పాపం ఏం చేయాలో తోచక నాకు కబురంపింది . అన్నారు . వెళ్ళటానికి తొందరపడుతూ .

“మనకు బాగా అచ్చొచ్చిందని మీరు కానీ పొదుగుతూ కూర్చుంటారా పట్టుమీద “ అనబోయి మర్యాదకాదని మాటలు మింగేసి ఒట్టి క్వశ్చన్ మార్కు మాత్రం మొఖానికి తగిలించి చూసాను . ఆన్సరుగా అత్తగారు  పెంకి పెట్టలని దార్లోకి తెచ్చే మంత్రం ఒకటి ఉందనీ ,  అది కోడి చెవిలో మూడుసార్లు చెప్పి ,  దాన్ని బుట్టచుట్టూ తిప్పి పట్టుమీద వదిలేస్తే నిక్షేపంలా పడుంటుందనీ మేతకి కూడా లేవదనీ  ఉత్సాహంగా  చెపుతుంటే నేను ఆశ్చర్యంలో పడిపోయాను .

నే తేరుకునేలోగా   శాంత అత్తయ్యగారి పనమ్మాయ్ సూర్యావతి వెనకే పెళ్ళినడక నడుచుకుంటూ దొడ్డి గుమ్మం దాటేయబోయిన అత్తగారు  అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టూ  స్పీడుగా వెనక్కి నడిచొచ్చి ” నేనలా వెళ్ళగానే నోట్లో వేసుకుంటావేమో….  వేడిగాతింటే వెర్రెక్కుతుందoటారు జాగ్రత్తేవ్ ….. అసలే ఆనవాయి లేని పనొకటి  “ అనేసి మళ్ళీ ఓసారి  కుచ్చిళ్ళు సర్దుకుని ,పెళ్ళినడక నడుచుకుంటూ వెళ్ళిపోయారు  . నా గుండెల్లో  రాయి పడింది .

ఎప్పుడో కానీ గుమ్మం దాటే అవకాశం రాని అత్తగారు ఇలావెళ్ళి అలా రావటం అన్నాది ఒట్టిమాటే . ఆ వరసలో ఉన్న పది గుమ్మాలయినా ఎక్కి దిగకుండా వెనక్కి మళ్ళరు .  జరుగుతున్నదంతా పెద్ద కుట్రలా అనిపించింది . తన హెచ్చరికలని ఖాతరు చేయని నన్ను నీ చావు నువ్వు చావని వదిలేసి పోయింది నా సిక్త్ సెన్స్ .

నాకు మమ్మీ…..అని గట్టిగా ఏడవాలనిపించింది . కానీ నా ఏడుపు వినిపించేంత దూరంలో మమ్మీ లేదని గుర్తొచ్చింది . నాకు అత్తగారిని నిందించాలో …నా ప్రారబ్ధానికి  చింతించాలో అర్ధం కాలేదు. ఇక చేసేదేవీలేక ”  అయితే అరిసెలపాకం- కాకపోతే కాణిపాకం “ అని ఒక కొత్తసామెత చెప్పుకుని ”   నాముందున్న పెద్ద బేసినుడు పిండినీ  బూరెలు , అప్పాలేకాక  చేగోడీలు, చక్కిడాలు వంటి ఆకారాల్లో మలుస్తూ కొత్త పిండి వంటలకు ప్రాణం పోసే ప్రయత్నం చేసాను .

ఊరినించీ దిగిన రాజుగారు పొయ్యిదగ్గిర మసిపట్టిన  నా ఏబ్రాసి మొహాన్ని  చూసి గతుక్కుమని  నాలుగడుగులు వెనక్కీ  ఒక్కడుగు ముందుకీ వేసి  ”  చందమామ కథల్లో రాక్షసి  బొమ్మలా అలా అయిపోయావు ఏవిటోయ్. ఏ మాంత్రికుడు నిన్ను ఇలా మార్చేసాడు  . చెప్పు  వాడ్ని  తక్షణమే బంధించేస్తాను ”  అన్నారు  మీసాలు  మెలేసి వెటకారంగా నవ్వుతూ .

పూర్వ వృత్తాంతమతా తెలిపి బావురుమన్నాను   . చలించిపోయిన రాజుగారు  ” అకటా!!” అని అదేపనిగా బాధపడి “ఏవయినా సాయం చేద్దామంటే ఇది వంటింటి  వ్యవహారం అయిపోయింది . మగాళ్ళు పొయ్యికి పదడగుల దూరంలో ఉండటం మా ఇంటాచారం .  నేను కొంచెం మాడ్రన్ భావాలు కలవాడిని కాబట్టి ఇలా మూడడుగుల దూరం వరకూ వచ్చేసాను .  అని చుట్టూ పరికించి  , ఎవరూ తనని చూడ్డంలేదని నిర్ధారించుకుని  ,  ఒకడుగు ముందుకేసి  “ఓ నా ముద్దమందారం కావాలంటే   నీకు కష్టం తెలీకుండా  ఉండటానికో కథ చెపుతాను  . అది  వింటే నువ్వు వద్దన్నా నవ్వేస్తావు తెలుసా అన్నారు  ” భుజాలు కుదుపుకుంటూ కితకితల నవ్వొకటి  ఒంపేసి .

‘ ఆకలేస్తే రోకలిమింగు అరగకపోతే తిరగలి మింగు’  అన్నాట్ట వెనకటికొకడు .  ఈ కష్టమేమిటిరా పరమాత్మా అని నేనేడుస్తుంటే … కథలూ కాకరకాయలూ అంటారేం   ! నా వల్ల కాదు పొమ్మన్నాను  .  అయినాసరే అదేం  పట్టనట్టూ  ” దేవీ కష్టములెట్లున్నానూ …. నా కథ విని తీరవలె ” అంటూ అంగడి పాలైన హరిశ్చంద్రుడి పోజులో  చెప్పుకుపోయారు . ఆ కథేవిటంటే ……

అనగనగా ఆయన చిన్నప్ప్పుడు   ‘నచ్చిన పండుగ ‘   వ్యాసం రాసుకురండి అని తెలుగు మాస్టారు చెపితే ,     నాకు నచ్చిన పండుగ మా తాతయ్య తద్దినం అని రాసుకెళ్ళారట . ఆ ఒక్క లైనూ చదివి తరువాతి విషయం చూడకుండానే తెలుగు మాస్టారు ” బుద్ధిలేదటరా ” అని బడిత పూజ చేసేసి అంతటితో వదలక ఆ వ్యాసం ఇంటికి పంపించారు. ఇంట్లో ఉన్న పెద్దలందరూ తలో రెండూ వాయించి , ఆ వ్యాసాన్ని వీధిలోకి వదిలారట. ఇక అంతే ఆ వీధిలో వుండే  ఇరవై ఆరు కొంపల వాళ్ళూ తలో మొట్టికాయ వేస్తే అంత సాహసం చేయలేని ఇతరులు కనపడచోటల్లా కాలర్ పుచ్చుకుని ” తప్పుకదండీ బాబుగారు” అని అక్షింతలు వేసేసారట. పాయసం, గారెలూ వండుకుతింటాం  కాబట్టి  అదీ ఒక పండగే అనుకున్నానని చెప్పినా ఒక్కరూ  నమ్మలేదట.  దాంతో ఆయనకి బాగా కోపం వచ్చేసి , తనని ఇంత అవమానపరిచిన పాయసం -గారెలూ జన్మలో తినకూడదని నిర్ణయించేసుకుని , ఒక కాగితం మీద గారెలు, పాయసం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి , కాశీ వెళుతున్న చిన్న తాతయ్య కి ఇచ్చి వీటిని తనపేరు చెప్పి కాశీలో వదిలేసి రమ్మన్నారట ( వాళ్ళ నానమ్మ గుమ్మడికాయ తినమoటే కాశీలో వదిలేసాను  ఇక తినను అని చెప్పటం  విన్నారట )  .  అది చూసినవాళ్ళంతా ” తెలివి తెల్లారినట్టేవుంది ” అంటూ మళ్ళీ ఒకరౌండువేసి, బలవంతంగా పాయసం గారెలూ నోట్లో కుక్కి వ్రతభంగం కావించారట  .  అక్కడితో వదిలిపెట్టకుండా ఏటా వినాయక చవితికి క్రమం తప్పక కథ చదువుకుని అక్షింతలు జల్లుకున్నట్టూ , ప్రతీ తాతయ్య తద్దినం లోనూ  ఈ అజ్ఞానపు కథని  చెప్పుకుని అబ్బాయి నెత్తిన అక్షింతలు వేయటం ఆచారంగా వస్తుందట .

కథంతా అయ్యాకా “నవ్వవోయ్ “ అంటూ దోసిలి పట్టుకు కూర్చున్నారు  .  అడిగిన వెంటనే నవ్వేస్తే లోకువైపోతావని  “ఇప్పుడు వీలుపడదు  తరవాతెపుడయినా సావకాశంగా వున్నప్పుడు నవ్వుతా “పొమ్మన్నాను .

   ***

” ఇందుకే ఆనవాయితీ లేని పనులు చేయకూడదు అనేది “.

” మా కాలంలో వద్దంటే ఊరుకునేవాళ్ళం.  ఇలాంటి వితండ వాదనలు మేం ఎరగవమ్మా ”

ముందు రోజు పడ్డ శ్రమ ఫలితంగా జొరం తెచ్చుకుని  మూలుగుతూ పడున్న నన్ను చూసిపోటానికొచ్చిన  మా పిన్నత్తగార్లూ , పెద్దత్తగార్లూ, వాళ్ళ కోడళ్ళూ , ఇంకా వరసకి  పిన్నమ్మలూ, కన్నమ్మలూ అంతా చాప చుట్టూ కూర్చుని మధ్యలో పళ్ళెం నిండా ఉన్న బూర్లెలు అప్పాలు తింటూ పై విధంగా చింతిస్తున్నారు .

” ఏవిటో…  అచ్చిరాదని వదిలేశాం వద్దంటే విన్నదికాదు” .  అంటున్నారు అత్తగారు తింటున్నవాళ్ళకి మంచినీళ్ళు అందిస్తూ .

” అనుభవం అయింది కదా ఈసారి వింటుందిలే…..ఇకనైనా ఇలాంటి ఆనవాయితీ లేని పనులు చేయ్యకండి” అని అక్కడ ఉన్న కోడళ్ళందరికీ ఏకమొత్తమ్మీద వార్నింగ్ ఇచ్చేసిన మా పెద్దత్తగారు ” నువ్వేవన్నా వంటకంలో  చేయిపెట్టావా ?” అనడిగారు మా అత్తగారిని .

“అయ్యో…. లేదు అప్పయ్యా నేనసలు వేలుకూడా పెట్టందే … పెద్దావిడ మాటే పదే పదే గుర్తొస్తుంటే ఎందుకన్నా మంచిదని  దూరంగానే వున్నా .  తాటిపండుని చేత్తో తాకనన్నా తాకలేదు”  అన్నారు .

” అలా అయితే నువ్వు ఈ బూరెలు నిక్షేపంగా తినొచ్చు . వండినవాళ్ళు తినడమే మనకి ఆనవాయిలేదు ”  అంటూ అత్తగారికి బూరెల పళ్ళెం  అందించి నాకేసి  అదోలా  చూసేరు మా పెద్దత్తగారు  .  ఆ చూపులో అయ్యిందా నీపని అన్న అర్ధం ద్వనించింది .

మా అత్తగారు నాకేసి జాలిగా చూసి , తోటికోడలి కోసం తప్పక తింటున్నట్టూ  ” ఆ…ఏదో ఆచారం అన్నారని తినడం తప్పిస్తే …….పూర్ణం బూరెల రుచి వీటికెక్కడొస్తుందీ ”  అంటూ బురె తీసి బుగ్గన పెట్టుకున్నారు .

నేను నీరసంగా నిట్టూర్చి ” దాల్ మే కాలా హై , కుచు కుచ్ హోతాహై ” అని  హిందీలో చింతించడం మొదలు పెట్టాను అక్కడున్నవాళ్ళకెవరికీ అర్ధం కాకుండా .

అత్తగారికి తెలిసింది కోడి మంత్రం ఒకటేనా …..అన్న అనుమానం మీక్కూడా వచ్చిందా ! తప్పు లెంపలేసుకోండి . ఇప్పుడు చెప్పండి ’ తంతే బూరెల బుట్టలో పడ్డట్టా …. పడనట్టా  !?’

–దాట్ల లలిత

 

మీ మాటలు

 1. ఆ..ఆ..పడ్డట్టే పడ్డట్టే… అత్తగారి బుట్టలో…:-)) :-) :-) :-))

  “ఆచారాలు- అగచాట్లు ’ అనే విషయం మీద మనసులోనే ఒక దీర్ఘ కవిత ” – వినాలని ఉంది..:-)
  “నవ్వవోయ్ “ అంటూ దోసిలి పట్టుకు కూర్చున్నారు … :-)

  ” దాల్ మే కాలా హై , కుచు కుచ్ హోతాహై ” అని హిందీలో చింతించడం మొదలు పెట్టాను అక్కడున్నవాళ్ళకెవరికీ అర్ధం కాకుండా ..” :-) :-)

  • లలిత says:

   తృష్ణ గారు ….మీ నవ్వులతో శుభారంభం చేశారు ధన్యవాదాలు :)

 2. :) :) బావుందండీ ! ఇంతకీ రుచి చూడనేలేదా!? నిజం చెప్పండి..అత్తగారు అటు వెళ్ళగానే రాజు గారు ఇంట్లోకి అడుగు పెట్టక ముందే ..రుచి చూసి ఉంటారు. అసలు అత్తగారు చెప్పిన మాట వినకుండా ఆనవాయితీనీ బ్రేక్ చేసిందే మీరు కదా ! :)

  • లలిత says:

   వనజ గారు ఇప్పటికే చాలా చెప్పేశాను ….ఇవి చాలక తెరవెనుక కథలు కూడా చెప్పేమంటారా . భలేవారే !

 3. అయ్యో లలిత గారూ,
  ఇంత తెలివీ, చదువూ ఏమయిపోయాయి? అలా పడిపోతారా బుట్టలో. పోనీ చేస్తూ తినాలని ఆలోచన కూడా కలగకపోతే ఎలాగండీ? ఈసారి జాగ్రత్తండోయ్.

  • లలిత says:

   రాధ గారు ,
   ‘ చదవేస్తే ఉన్న మతి పోయింది ‘అంటారు కదండీ….అందుకే అలా :(

 4. హాట్స్ ఆఫ్ లలితగారు! ఎంత బాగా రాసారో! ఇంకో రచన కోసం అప్పుడే ఎదురుచూపులు మొదలు:)

  • లలిత says:

   సుభ గారు థాంక్స్ అండీ . మీరిలా ఉత్సాహ పరుస్తుంటే నేను ఎగిరెగిరి దంచేయనూ :)

 5. Wonderful..had hearty laughs to no end…పొదుగుడు కోడిపెట్టల్లాగా LOL.

 6. G.S.Lakshmi says:

  తర్వాత జొరం, పడక ఎలాగూ తప్పవు కనక ఆచారం మార్చేసి మీరూ ఓ ముక్క నోట్లో వేసేసుకోడమే…
  (హ..హ.. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష…)

  • లలిత says:

   ఆహా ..ఏం చెప్పారండీ. ఈసారి అలాగే చేద్దాం :)

 7. కిరణ్ says:

  >>తంతే బూరెల బుట్టలో పడ్డట్టా …. పడనట్టా !?’

  పడ్డట్టే నండి. బాగుంది, చిన్నప్పుడు మా తాత దగ్గరికి సెలవులకు వెళ్ళినప్పుడు నానమ్మ ‘మనకు అచ్చిరాదు’ అంటూ అప్పుడప్పుడు చెప్పేవి గుర్తొచ్చాయి :)

  • లలిత says:

   కిరణ్ గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు . అవునండీ ప్రతీ ఇంటికీ ఇలాంటి కొన్ని పట్టింపులు వుంటాయి

 8. sasikala says:

  ha..ha.. bhale undhi.ilanti vantakam vinaledhu.
  bhale navvukoni malla ayyo papam anukunnanu

  • లలిత says:

   శశికళ గారు కొంచెం ఇష్టం- కొంచెం కష్టం అన్నమాట .

 9. శ్రీనివాస్ పప్పు says:

  “కథంతా అయ్యాకా “నవ్వవోయ్ “ అంటూ దోసిలి పట్టుకు కూర్చున్నారు”

  పాపం నవ్వాల్సింది కదండీ,ఆ ముత్యాలతోనో/రత్నాలతోనో ఓ కంఠాభరణం చేయించి తెచ్చేవారు కదా రాజు గారు

  అత్తగారిమీద రోకటి పోటు వేసే ప్లాన్ కూడా ఉందన్నమాట హవ్వ హవ్వ

  • తొందర కాళ్ళకి బంధాల బావున్నాయండి మీ కథలు అత్తగారి మీద
   కొత్త కథలు అని టైటిల్ పెట్టుకోండి

   • లలిత says:

    ‘ అత్తగార ిమీద కొత్త కథలు ‘ -పద్మజ గారు భలేవుందండీ ఈ టైటిల్

  • లలిత says:

   శ్రీనివాస రావు గారు , మీరు అర్జెంటుగా కళ్ళజోడు మార్చండి మాస్టారు

 10. chaalaa baagundi lalitha garoo. idi chaduvutunte bhanumati gari attagari kadhalu gurtuku vachinaayi.

 11. మీ కథలు ఏవి చదివినా మా పని బూరెల బుట్టలో పడ్డట్టే అవుతోంది.చక్కటి తెలుగుంటి కతల్ని వండి వారుస్తున్నారు.శహభాష్.

  • లలిత says:

   గోపాల కృష్ణ గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు

 12. suvarchala says:

  బూరెల బుట్ట గమ్మత్తుగా వుంది. దాంట్లోనే పడ్డా తినలేని పరిస్థితి!!
  ఎంత బావుంది.. మీ రాజుగారి నచ్చిన పండుగ! నేనూ, మావారు విరగబడి నవ్వేం. పొట్టచెక్కలయ్యేలా!!!! మా పిల్లల చేతా చదివించాను.
  నేను సావకాశంగా నవ్వుతానన్న మీ మాటా నవ్వు తెప్పించింది.
  మీ శైలి..ఎంచక్కా బావుంది..బావుంటుంది!! నాకైతే పొత్తూరి విజయలక్ష్మి గారి శైలి గుర్తొచ్చింది. ఫ్లో సాగిపోతుంది అలా..!!
  నేను కూడా మరింత సావకాశంగా మీ మిగతా రచనలు కూడా చదువుతా..లలితగారూ!

  • లలిత says:

   సువర్చల గారు , థాంక్స్ అండీ . మరీ అంత పెద్దవారితో పోల్చేస్తున్నారు అంతా మీ అభిమానం

 13. Satyabhama says:

  లలితగారూ, మీ తాటిబూరెల పరిమళం ఇక్కడివరకూ వచ్చింది. మీ రాజుగారి వ్యాసం చదువుతుంటే ఆపుకోలేనంత నవ్వు. అది చదువుతుంటే నాకో సంగతి జ్ఞాపకం వచ్చింది. మాకు తెలిసిన ఒక అమ్మమ్మగారు చెప్పిన ముచ్చట ఇది. వాళ్ళ అమ్మగారికి పెళ్ళయ్యి కాపరానికొచ్చిన మొదటి రోజు కార్యం గదిలో వాళ్ళ నాన్నగారిని అడిగిన ప్రశ్న– “మా ఇంట్లో ఏడాదికి నాలుగు తద్దినాలు. మీ ఇంట్లో ఎన్ని?”

  • లలిత says:

   సత్యభామ గారు మీరు చెప్పిన ముచ్చట మరీ బావుంది

 14. వేణూశ్రీకాంత్ says:

  ఎప్పటిలానే సులువుగా ఏకబిగిని చదివించేశారండీ.. చాలా బాగుంది :-)

  వచ్చేనెల అత్తగారూ – వరలక్ష్మీ వ్రతమా :-)

 15. buchireddy gangula says:

  సూపర్ గా ఉంది- కథ
  ఎంతభాగా రాశారండి —లలిత గారు
  —————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 16. బూరెల బుట్టలో మీరు పడటం కాదండి… అత్తగారే మిమ్మల్ని బూరెల బుట్ట కింద కమ్మేసారు…

  ఇది కోడి మాత్రం కాదు, కోడలి మంత్రం…హ హ హ… :-)

  • లలిత says:

   హమ్మయ్యా….మీరొక్కరు ధైర్యం చేసి చెప్పగలిగారు :)

 17. G B Sastry says:

  ఇలా మీ ప్రతి కధని చదివి అభినందించడం చర్విత చెప్పిందే చెప్పినట్లున్దండి దయచేసి ఒక్క చెత్త కద రాసి మొనాటనీ బ్రేక్ చేయండి ప్లీస్

మీ మాటలు

*