ఎవరీ ‘సామాన్యుడు’? ఎప్పటి వాడు?!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?

సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది?

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీ లెవ్వరు?

                                                          -శ్రీశ్రీ

                                (మహాప్రస్థానం, దేశచరిత్రలు)

ఇవి ప్రసిద్ధ పంక్తులే కానీ, ఇందులో చెప్పిన ‘సామాన్యుడు’ ఎప్పుడు, ఎందుకు, ఎలా అవతరించాడో ఎప్పుడైనా గమనించారా?

మనిషికి ‘నరుడు’ అనే పర్యాయపదం ఉంది. పురాణ, ఇతిహాసాలు దేవ, దానవ, సిద్ధ, సాధ్య, యక్ష, రాక్షస, వానరాల మధ్య నరుని ఇరికించి చెప్పాయి. నేటి అవగాహనతో దేవ దానవాదులను కూడా నరులుగానే గుర్తిస్తే, లేదా ఆ మాటలు నరుని గుణ, స్వభావాలను; లేదా తెగ నామాలను తెలిపేవి అనుకుంటే ఆ జాబితాలో చెప్పిన ‘నరుడు’ ఎవరనే ప్రశ్న వస్తుంది. ఇంకో విచిత్రం చూడండి: మహాభారతం అర్జునుని నరునిగా పేర్కొంటూనే, అతనిని నరుడనే ముని అవతారంగా చెప్పి మహాత్ముణ్ణి చేసింది. నరుని… అంటే మామూలు మనిషిని గుర్తించడంలో మహాభారతానికి ఏదో ఇబ్బంది ఉంది. మహాభారతానికే కాదు, ప్రపంచ పురాణ కథలన్నిటికీ ఆ ఇబ్బంది ఉంది.

కీచకుడు తన వెంటపడి వేధిస్తున్నప్పుడు ద్రౌపది ఏకాంతంగా భీముని కలిసి తన దుఃఖాన్ని వెళ్లబోసుకుంటుంది. ఆవేశం పట్టలేక, ఆ జూదరి వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నామని ధర్మరాజును తూలనాడుతుంది. అప్పుడు భీముడు ఆమెను మందలించగా తప్పు దిద్దుకుంటూ ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తిస్తుంది. ఆ సందర్భంలో “…కేవల మర్త్యుడే ధర్మసుతుడు?”  అంటుంది. ధర్మరాజు మామూలు మనిషి కాదు, మహాత్ముడని చెప్పడం అందులో ఉద్దేశం. ఇలా మహాత్ముడు-మర్త్యుడు అనే విభజన మహాభారతంలో ఇంకా చాలా చోట్ల వస్తుంది.  అజ్ఞాతవాసం గడపడానికి విరాటనగరానికి వెళ్లబోయేముందు, ‘ఇంతటివాడు ఒక మర్త్యుని ఎలా సేవించుకుంటాడు’ అంటూ ధర్మరాజును తలచుకుని అర్జునుడు బాధపడతాడు. ఇంద్రునితో అర్థసింహాసనం అధిష్టించిన అర్జునుడు ఒక మర్త్యుని కొలువు ఎలా చేస్తాడని ధర్మరాజు విచారిస్తాడు. మామూలు మనుషులను సూచిస్తూ మహాభారతం ప్రయోగించిన మరో మాట: ప్రకృతిజనులు. “పుడుతూనే కవచ, కుండలాలతో పుట్టిన కర్ణుడు ఒక ప్రకృతి కాంతకు పుట్టడం ఎలా సాధ్యం?” అని దుర్యోధనుడు ప్రశ్నిస్తాడు. సారాంశం ఏమిటంటే, మహాభారత కాలానికి మనుషుల్లో సామాన్యులు-అసామాన్యులన్న తేడా వచ్చేసింది.

అటువంటి మహాభారత సమయానికీ, “నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది?” అని ఆధునిక మహాకవి ప్రశ్నించే నాటికీ మధ్య చాలా కాలం ప్రవహించింది. చాలా చరిత్ర గడచింది. విచిత్రం ఏమిటంటే, ప్రజాస్వామ్య రాజకీయాలు తనకు సరికొత్త అసామాన్యతను కల్పించి అందల మెక్కించి ఊరేగిస్తున్నా ‘సామాన్యుడు’ ఇప్పటికీ సామాన్యుడి గానే ఉన్నాడు. వాస్తవంగా అసామాన్యతను చలాయిస్తున్న నాయకుల నోట మంత్రంగా మారాడు. అదలా ఉంచితే, మనదేశంలో ‘సామాన్యుడు’ తన ఉనికిని చాటుకోవడం ఎప్పటినుంచి ప్రారంభమైందో తెలిపే చారిత్రక అంచనాలను ఎవరైనా నమోదు చేశారో లేదో ఇప్పటికిప్పుడు చెప్పలేను కానీ; యూరప్ లో ఆ పరిణామం ఎప్పుడు, ఏ ఘట్టంలో జరిగిందో చరిత్రకారుడు హెచ్.జి. వెల్స్ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్  లో రాశాడు.

A_Short_History_of_the_World_(H.G._Wells)

పదకొండవ శతాబ్ది చివరిలో టర్కులు జెరూసలెంను ఆక్రమించుకుని, క్రైస్తవులందరూ పవిత్రయాత్రాస్థలిగా భావించే  హోలీ సెపుల్చర్ చర్చిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. దాంతో టర్కులపై మతయుద్ధానికి  సిద్ధపడవలసిందిగా అప్పటి పోప్ అర్బన్-II పాశ్చాత్య క్రైస్తవ ప్రపంచానికి పిలుపు నిచ్చాడు. ఆ యుద్ధాలే క్రూసేడ్ లుగా, శిలువకోసం జరిగిన యుద్ధాలుగా ప్రసిద్ధికెక్కాయి. అప్పుడు పీటర్ అనే ఒక చింకి పాతల సన్యాసి పెద్ద శిలువను మోస్తూ చెప్పులు లేని కాళ్లతో గాడిద మీద జర్మనీ, ఫ్రాన్స్ వీధుల్లో తిరుగుతూ క్రూసేడ్లకు అనుకూలంగా ప్రజలను ఉద్బోధించాడు. అప్పటికి శతాబ్దాలుగా క్రైస్తవ బోధలకు ప్రభావితమవుతున్న యూరప్, క్రూసేడ్ల పిలుపుకు ఎంతో ఉద్విగ్నపూరితంగా స్పందించింది.  క్రైస్తవజనసామాన్యం ఒక ప్రజాశక్తిగా అవతరించి తన ఉనికిని చాటుకోవడం ప్రారంభించారు. ఒక పిలుపును అందుకుని సామాన్యప్రజానీకం అలా ఉవ్వెత్తున విరుచుకుపడడం మానవాళి చరిత్రలోనే కొత్త పరిణామమనీ;  వెనకటి రోమన్ సామ్రాజ్య, భారత, చైనా చరిత్రలలో దీనితో పోల్చదగిన దేదీ కనిపించదనీ వెల్స్ అంటాడు. ఆధునిక ప్రజాస్వామ్య ఆవిర్భావానికి ఇది నాంది అని పూర్తిగా అనలేకపోయినా, ఇందులో కచ్చితంగా ఆధునిక ప్రజాస్వామ్య ఉత్ప్రేరకాలు ఉన్నాయని ఆయన అంటాడు.

అంతకుముందు మనిషి చరిత్రలో వేల సంవత్సరాలు కొనసాగిన గణవ్యవస్థకు వెడితే, అందులో సామాన్యుడు, అసామాన్యుడన్న విభజనే లేదు. గణంలోని ప్రతి సభ్యుడూ సామాన్యుడే, లేదా అసామాన్యుడే. గణసభ్యులు కలసికట్టుగా ప్రకృతితో సంఘర్షించినంత కాలం వారిలో తారతమ్యాలు లేవు. మనిషి సాటి మనిషితో సంఘర్షించడం ప్రారంభమయ్యాకే తారతమ్యాలు వచ్చాయి. సామాన్యులు, అసామాన్యులనే విభజన వచ్చింది. గణవ్యవస్థలో  ప్రతి మనిషీ ముఖ్యుడే. ఏ ఒక్కరూ అనామకులు కారు. ప్రతి ఒక్కరి ఉనికీ చరిత్రలో నమోదు అయింది. కుంటా కింటే తన మూలాలనుంచి వేరుపడి తనది కాని నేలపై, తనది కాని భాష మధ్య అనామకంగా బానిస జీవితం గడిపినా; తను పుట్టిన గడ్డపై అతను అనామకుడు కాడు. అతని స్మృతిని  అది తరం నుంచి తరానికి భద్రంగా అందిస్తూనే వచ్చింది. విచిత్రాన్ని మించి,  విషాదం ఏమిటంటే; లిఖితచరిత్ర లేని కాలంలో కూడా ప్రతి మనిషి ఉనికీ నమోదయింది, లిఖితచరిత్ర వచ్చాక మనిషి చరిత్రహీనుడయ్యాడు.  గణంనుంచి జనానికి మారగానే సామాన్యుడి పేరుతో అనామక సముద్రంలో అజ్ఞాతంగా కలసిపోయాడు. తాత ముత్తాత పేరు కూడా తెలియని చారిత్రక అజ్ఞానిగా మిగిలిపోయాడు.

***

తమ పూర్వీకుడు కుంటా కింటేను బానిసగా పట్టుకుని ఓడలో ‘నేప్లిస్’ అనే చోటికి తీసుకొచ్చారని చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పగా హేలీ విన్నాడు. మేరీల్యాండ్ లో ఉన్న అన్నాపోలిస్ కు భ్రష్టరూపమే నేప్లిస్. గాంబియానది నుంచి బానిసలతో ఏయే ఓడలు అన్నాపొలిస్ కు ప్రయాణించాయో లండన్ వెళ్ళి శోధించడం ప్రారంభించాడు. “రాజుగారి సైనికులు వచ్చిన సమయంలో కుంటా కింటే అదృశ్యమయ్యా”డని జఫూరు గాథికుడు ఇచ్చిన సూచనే అతనికి చుక్కాని.  ‘రాజుగారి సైనికులు’ మరెవరో కాదు, 1760లో జేమ్స్ ఐలండ్ లోని బానిస దుర్గానికి రక్షణగా కల్నల్ ఒహేర్స్ నాయకత్వంలో వచ్చినవారేనని తేలింది. ఆ సమాచారంతో హేలీ లండన్ లోని లాయిడ్స్ కు వెళ్ళి, ఇంగ్లీష్ సముద్రయాన పత్రాలను గాలించడం ప్రారంభించాడు. ఆరువారాలు గడిచాయి. ఏడో వారంలో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక వెడల్పాటి పత్రం కనిపించింది. 1766-1767 మధ్యకాలంలో గాంబియా నది నుంచి ప్రయాణించిన 30 ఓడల వివరాలను అది నమోదు చేసింది. అతని చూపు ఓడ నెం. 18 దగ్గర ఆగింది.

1767లో… అంటే ‘రాజుగారి సైనికులు వచ్చిన’ ఏడాది… జూలై 5న లార్డ్ లిగొనీర్ అనే ఆ ఓడ గాంబియా నదిలో బయలుదేరింది. దాని గమ్యస్థానం అన్నాపొలిస్!  కెప్టెన్ పేరు థామస్ ఈ. డేవిస్…

ఎందుకో తెలియదు కానీ, ఆ వివరాలకు తను స్పందించడంలో ఆలస్యం జరిగిందనీ, యాంత్రికంగా ఆ సమాచారాన్ని రాసుకుని, పత్రాలను మూసేసి బయటకు నడిచాననీ హేలీ అంటాడు. వీధి మలుపులో ఉన్న చిన్న టీ షాప్ కు వెళ్ళి టీ తెప్పించుకున్నాడు. టీ చప్పరిస్తుండగా, కుంటా కింటేను తీసుకొచ్చిన ఓడ అదే కావచ్చని అతనికి మెరుపులా స్ఫురించింది. ఆ టీ ఇచ్చిన ఆమెకు ఎంతో రుణపడ్డాననుకున్న హేలీ అప్పటికప్పుడు బయలుదేరి న్యూయార్క్ వెళ్లడానికి నిర్ణయించుకుని, సీటుకోసం పాన్ అమెరికన్ ను సంప్రదించాడు. చివరి సీటు ఉందని అది జవాబిచ్చింది. తను దిగిన హోటల్ కు వెళ్లడానికి కూడా సమయం లేదు. ట్యాక్సీ చేసుకుని నేరుగా హిత్రో ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయాడు. విమానంలో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. వాషింగ్టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో తను చూసిన పుస్తకమే అతని కళ్ళముందు కదులుతోంది. అది గోధుమరంగు అట్టతో ఉంది. దానిమీద Shipping in the port of Annapolis అనే నల్లని అక్షరాలు ఉన్నాయి. రచయిత వాఘన్ డబ్ల్యు బ్రౌన్.

న్యూయార్క్ లో దిగీ దిగగానే మరో విమానంలో వాషింగ్టన్ వెళ్లిపోయాడు. ట్యాక్సీ చేసుకుని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు వెళ్ళాడు. పుస్తకం తెప్పించుకున్నాడు. ఆతృతగా పుటలు తిరగేస్తూపోయాడు. తను వెతుకుతున్నది కనిపించింది! లార్డ్ లిగొనీర్  అన్నాపొలిస్ లో 1767,సెప్టెంబర్ 29న కస్టమ్స్ క్లియరెన్స్ పొందింది…హేలీ అక్కడినుంచి బయలుదేరి కారు అద్దెకు తీసుకుని అన్నాపొలిస్ కు వెళ్ళాడు. నేరుగా మేరీల్యాండ్ హాల్ ఆఫ్ రికార్డ్స్ కు దారితీశాడు. 1767 అక్టోబర్ మొదటివారంలో ప్రచురితమైన స్థానిక వార్తాపత్రికల సంచికలు కావాలని అడిగాడు. సిబ్బంది మేరీల్యాండ్ గెజిట్  సంచికలున్న మైక్రో ఫిల్మ్ చుట్టలు తీసుకొచ్చి అతని ముందు ఉంచారు. వాటిని మిషన్ లో ఉంచి తిప్పుతుండగా  అక్టోబర్ 1 సంచికలో ఒక ప్రకటన కనిపించింది…

హేలీ అన్వేషణలో చివరి అంకం, తర్వాత…

 

-భాస్కరం కల్లూరి

 

 

 

మీ మాటలు

 1. chintalapudi venkateswarlu says:

  భాస్కరం గారి నరుడు నిజంగా చర్చనీయుడే. ఇది అనాదిగా మన పురాణ సాహిత్యం కూడా చర్చించినట్లే కనిపిస్తోంది. మనమనుకుంటున్న దేవతలందరు నరులే. విష్ణువు భార్యను హృదయంలో దాచుకున్న ధనవంతులకు ప్రతీక. బ్రహ్మ సరస్వతిని నాలుకపై నిలుపుకున్న పండితులకు మరో రూపం. శివుడు శక్తిని తన దేహమంతా దాచుకున్న శక్తివంతులకు ప్రతిరూపం. ఇంద్రుడు కృషిని సతిగా చేసుకున్న రైతుకు ప్రతీక ,,,, ఈ విధంగా పురాణాల్లో పురుషులంతా స్త్రీల వల్లనే పేరు పొందేరు. ఇది మాతృ స్వామ్య వ్యవస్థకు చిహ్నమే. కాబట్టి భాస్కరంగారూ నరుణ్ని సక్రమంగానే గుర్తించారనుకోవాలి.
  మీ …
  చింతలపూడి

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారూ, మీ పరిశీలన ఆసక్తికరంగా ఉంది.

మీ మాటలు

*