పాడని పాట

kurma

మేరి భీగి భీగిసి , పల్కోన్ పే రెహ్గయీ

జైసే మేరే సప్నే బిఖర్ కె

కిశోర్ కుమార్ పాడుతున్నాడు గొప్పగా, ముక్కలైపోయిన సుందర స్వప్నం గురించి. శోకంలో తడిసిన హృదయం కారుస్తున్న కన్నీళ్లు అతడి గొంతులోంచి పాటలా అనువాదం అవుతున్నాయి.

 జలే మన్ తెరాభీ, కిసీ కె మిలాన్ కొ

అనామికా, తు భీ తర్సే

తుఝే బిన్ జానే, బిన్ పెహ్ చానే

మైనే హృదయ్ సే లాగాయా

 గుర్తుచేస్తున్నాడు, తననెట్లా ప్రేమించిందీ. ఎంత గొప్పగా ఊహించుకున్నదీ.

కానీ నేను వింటున్నది అది కాదు. కిశోర్ కుమార్ గొంతులో పలికిస్తున్న వేదనని పలికించడానికి హీరో తంటాలు పడుతున్నాడు. నేను చూస్తున్నది అదికాదు. ఆయన పాటకి విలవిలా కొట్టుకుంటున్న కథానాయికని చూస్తున్నాను. బాణం గుండెల్ని నిలువునా చీలిస్తే అమాంతం విరుచుకు పడిపోయిన లేడిలా వుంది ఆమె. తప్పు చేసిన దానిలాగానో, అపరాధభావం కుంగదేస్తుంటే నోట మాట రానిదైన లాగానో ఆమె అతడిని తప్పించుకో చూస్తోంది.

కానీ, అతడు వెంట పడుతున్నాడు. దొరికింది ఇక నలుగురిలో, ముక్కలు ముక్కలు చేద్దామన్నట్టు వున్నాయతడి చూపులు. గుర్తు చేసి మరీ కొడుతున్నాడు. లేడి ఇంకా ప్రాణాలతోనే వుండగా చర్మాన్ని కొంచెం చీరి, కొంచెం వుప్పు కారం వేసి చూస్తున్నట్టు చూస్తున్నాడు.

నాకు హిందీ పూర్తిగా రాదు. కానీ కిశోర్ కుమార్ మీద అభిమానం తో ఈ పాటని వందల సార్లు చూసివుంటాను. నాకు తెలిసిన పదాల అర్ధాలతో కిశోర్ పాటకి అర్ధాన్ని వెతుక్కున్నాను. భాషది ఏముంది. కిశోర్ శోకాన్ని, వేదనని పలికిస్తుంటే ఇక ఆ భాష రాకపోతే ఏం? కవి హృదయాన్ని మాత్రమే కాదు, పాత్ర హృదయాన్ని పూర్తిగా ఆవాహన చేసుకుని కిశోర్ పాడుతున్నాడు.

 

పర్ మేరే ప్యార్ కె బద్లేమే తూనే

ముఝ్కో యే దీన్ దిఖ్ లాయా

 

కానీ, నా ప్రేమకు బదులుగా నువ్వేమిచ్చేవు. ఎడబాటు. నరకం, అని సాధిస్తున్నాడు. ఇక తప్పించుకోలేవు నువ్వు. ఇంతమందిలో, ఈ వేడుకలో నువ్వు నాకు అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడేం చేస్తావు, అంటున్నట్టు నిలదీస్తున్నాడు.

 

ఆడదానితో స్నేహం నిప్పుతో సావాసం లాటిది

ఈ విషయాన్ని నేను ఎందుకు అర్ధం చేసుకోలేకపోయాను?

నాకేమైంది అసలు. ఒక విశ్వాస ఘాతుకురాలితో

ఎందుకు పడ్డాను ప్రేమలో……

అంటూ, ఆమెను చూపుల, పదాల పిడిబాకులతో గుచ్చుతూ వున్నాడు. ఆమె పారిపోలేక, కాళ్ళు పాతాళంలో పాతుకుపోయినట్టయి ఒక పల్చటి పరదా వెనుక దాగుంటుంది. ఛిద్రమైన గుండెని బయటికి కనిపించనీయకుండా అన్నట్టు కొంగుని భుజాలమీద నుంచి తీసి వడిసి పట్టుకుంది. కత్తులవాన నుంచి, శాపాల వెల్లువనుంచి ఆ పరదా కాపాడలేదని తనకి తెలుసు. కానీ, ఈ పెను వరదలోంచి ఆ చిన్న గడ్డిపోచ కాపాడక పోదా అని కావచ్చు. లేకపోతే, కొంచెం కనికరించి కొన్ని శూలాల్ని వదలకుండా వుంటాడని, కొన్ని ఆరోపణల్ని చేయకుండా వదిలేస్తాడని ఆమె ఆశ.

కానీ, ఆ కథానాయకుడికి జాలి లేదు. మనిషి లాగా కనిపించడం లేదు. ఆ గడ్డిపోచని కూడా కసితో లాగేసి, కొరికి నమిలేసి ఇలా అంటున్నాడు, ఆమెను హేళన చేస్తూ.

….తేరీ బేవాఫాయిపే, హసే జగ్ సారా

గలిగలీ గుజరే జీధార్సే

జలే మన్ తేరా

(నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని చూసి లోకం నవ్వుతోంది

ఇక, నువ్వెళ్లే చోటల్లా అది వింటావు

నీ హృదయం కూడా మండుతుంది, అవి విని)

తన ప్రేమకు ప్రతిగా ప్రేమనందించనందుకు నిందిస్తున్నాడు. శాపనార్ధాలు పెడుతున్నాడు. ఇక ఈ శిలువ వేసుకుని ఇక నీ జీవితమంతా తిరగాల్సిందేనని, లోకం తీర్పు కూడా ఇదేనని ప్రకటించేస్తున్నాడు. నేలదిగిన చూపుల్తో ఆమె ఏమైనా చెప్తామనుకుంటున్నట్టు చూస్తోంది. బెరుకు కళ్ళతో భయాన్నో, అశక్తతనో ప్రకటిస్తూ వుంటుంది. అసహాయారాల్నని అందామనుకుంటుంది. (లేదా, నాకు అలా అర్ధమయ్యింది.)

తన నిర్ణయం వెనుక ఏదైనా కారణం వుంటుందా అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు అతడు. వున్న ఆయుధాలన్నీ గుక్కతిప్పుకోకుండా వదులుతున్నాడు. గురితప్పకుండా, కళ్లలోకి చూసి పాడుతున్నాడు.

నేరారోపణా తానే చేసి, విచారణా తనేచేసి, తీర్పూ తానే ప్రకటించి, శిక్షనూ తానే అమలుపరుస్తున్నాడు. పాట అయిపోయింది. పాట’ అయితే అయిపోయింది కానీ, ఆ పాట దెబ్బకి ఆమె అపరాధభావంతోనో లేకపోతే అవమాన భారంతోనో చితికిపోయింది. ఆమె బహుశా ఆమె వున్నచోటనే కుంగి పోయివుంటుంది. బహుశా ఎన్నటికీ చెప్పలేని వేదనను కంటి రెప్పలవెనుక దాచుకుని వున్నది. ఆ మానసిక పరిస్థితిని ఆ నటి గొప్పగా అనువదించి చూపిస్తోంది.

పాట ముగియగానే చప్పట్లు కొట్టారంతా, అన్నిటికీ తమ మద్దతు వుందన్నట్టుగా — నీ బాధ సబబైంది, తన విశ్వాసఘాతుకం నిజమే, నీ తీర్పూ సహేతుకమే అన్నట్టు.

ఇప్పటికి ఈ పాటని వందల సార్లు విని వుంటాను. లేదా చూసి వుంటాను. మిగతా అన్ని పాటల్లాగా కేవలం కిశోర్ కుమార్ కోసమేనా? కాదేమో.

***

     అకారణంగా నేను కాదన్నపుడు, కనీసం మాట్లాడడానికి నిరాకరించినపుడు, లేదా సమయం లేదన్నపుడు  తను కూడా అప్పుడు ఇలాగే మదనపడి వుంటుందా? వేటగాడి దెబ్బకు దొరికిపోయిన లేడిలాగా తల్లడిల్లిపోయి వుంటుందా? ఏదో వత్తిడితోనే తప్ప, నీకు ద్రోహం తలపెట్టే వుద్దేశం లేదని చెప్దామనుకుంటుందా? ఆరోపణా నేనే చేసి, విచారణా నేనే చేసి, తీర్పు నేనే ఇచ్చేసి వుంటానా?

ఇది జరిగిన ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఏళ్ళు గడుస్తాయి జీవితంలో భారంగానూ, సులభంగానూ. కానీ ఆ తోవల వెంబడి గుచ్చుకున్న ముళ్ళు కొన్ని సలుపుతూ వుంటాయి ఎన్నటికీ. ఆ తలపుల బరువు మౌనంగా మోస్తూనే వుండాలి ఎవరైనా. మోసేవాళ్ళకి తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు.

ఇక ఎవరి తోవలు వాళ్ళు చూసుకున్నాక, తన సంగతి చెప్పాను విష్ణుకి. “అసలు ఈ విషయం తేల్చకముందే చూశావా ఎలా చేసిందో,” అని. సాధ్యమైనంత సానుభూతిని సంపాదించుకునే ప్రయత్నం నాకు స్పష్టం కనిపిస్తూనే వుంది. కానీ విష్ణు కొట్టిపడేసింది.

“అమ్మాయిల పరిస్థితి నీకెపుడు అర్ధం కావాలి? ఎన్ని వత్తిళ్ళు ఎంతలా పనిచేస్తాయో నీకేం తెలుస్తుంది. నువ్వే అంటున్నావు కదా కొద్దిపాటి పరిచయమేనని. నీకు చెప్పే అవతలి వాళ్ళతో మాట్లాడి వుండాల్సిందని ఎందుకు అనుకున్నావు” అన్నది, నాకు అసలు benefit of doubt అస్సలే ఇవ్వకుండా.

“అసలు సంభాషణే పూర్తిగా మొదలు కాలేదంటున్నావు. ఎలా అనుకున్నావు నువ్వు తను నీకు అన్నీ చెప్పే చేయాలని,” అని అంది.

ఆ మాటలతో గూబగుయ్యి మన్నట్టయింది. కూడబెట్టుకున్న self-pity కుప్పకూలిపోయింది రెండు క్షణాల్లో. ఆ రోజు విష్ణు అంత కటువుగా చెప్పి వుండకపోతే ఆ self-pity బరువుకింద ఏనాడో అణిగిపోయి వుండేవాడిని. ఆలోచించడం మొదలుపెట్టాను అప్పుడే, తన వైపు నుంచి.

ఇప్పుడు ఇలా ఇన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అనిపిస్తుంది, ఎంత తక్కువగా ఆలోచించానా అపుడు, అని.

***

   బహుశా అప్పటినుంచే ఈ పాటలోని హీరో వంకర సంభాషణలు చికాకు పెట్టడం మొదలుపెట్టాయి నాకు. ఆ రోత  మాటలు నేనే అన్నట్టు, నేనే నిలదీసి కుంగదీసినట్టు అనిపించేది. ఇక ఆరోజంతా సోంపకుండా అయిపోయేది.

ఈ పాటలో కధానాయికలాగా, మౌనంగా ఎవరికీ అర్ధం కాని, వినబడని పాట ఏదో తను పాడి వుంటుందా? నేను వినడానికి నిరాకరించి వుంటానా? ఇక, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వినబడని పాటేదో వెంటాడుతోంది. బహుశా, వెంటాడుతుందేమో ఎన్నటికీ — మళ్ళీ ఎప్పుడైనా, ఎక్కడైనా తనని కలిసి ఒక కరచాలనం చేసి కడిగేసుకునేవరకూ. లేదా కళ్ళతోనే చెప్పుకునే వరకూ.

(ఎన్ ఆర్ అనుభవం విని)

–కూర్మనాథ్

 

 

 

 

 

మీ మాటలు

  1. సూర్యం గంటి says:

    చాలా బాగుంది నాకు బాగా ఇష్టమైన కిశోర్ పాట తో రాసిన చిన్న కధ ,హిందీ పెద్దగా రాదంటునే చక్కటి అర్ధం చెప్పారు పాటకు .

  2. a.rajendra babu says:

    పాడని పాటలో ఎన్ని రాగాలు పలికించారో! బహుశా పాట రాసింది గుల్జార్ అనుకుంటాను. గుల్జార్ పాటకు కిషోర్ ప్రాణం పోస్తే, కిషోర్ ను మీలో ధ్వనించారు కుర్మనాథ్ గారు! మనసు వీణను మీటితే ఎన్నో రాగాలు. సంగీతం లో నిష్ణాతుడు మీటితే రాళ్ళు కరుగుతాయి, మేఘాలు వర్షిస్థాయి, సముద్రాలు ఉప్పొంగుతాయి, వెన్నల పిండారబోస్తుంది.
    నలభయ్ ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా. తిరస్కరిస్తే తనలో కలిగిన అలజడిని సున్నితంగా పాట రూపంలో చెప్పాడు. ఇప్పుడైతే ఆసిడ్లు పోసి,కత్తులతో నరికి చెపుతారు కుర్రకారు.

  3. పాటలా ప్రవహిస్తూ కథ నడిపించడం బాగుంది

  4. కథ బాగుంది.
    అప్పట్లో ఇలాటి పాటలు చాలా వుండేవేమో కదా?

    రాజేంద్ర బాబు గారూ,
    ఈ పాటను రాసింది గుల్జార్ కాదండీ! బహుశా మజ్రూ అయుండాలి. (I am not sure about that, but it certainly is not Gulzar.)

Leave a Reply to సూర్యం గంటి Cancel reply

*