ప్రళయం

pralayam_illustration

అనిల్ ఎస్. రాయల్  పుట్టిందీ, పెరిగిందీ పల్నాడులో. పై చదువులు విజయవాడలో. ఆ పై చదువులు మద్రాసు లయోలాలో. పరిశోధన చేసింది గణిత శాస్త్రంలో. పనిచేస్తుంది కంప్యూటర్ రంగంలో. పద్నాలుగేళ్లుగా ప్రవాసం. సిలికాన్ లోయలో నివాసం. చిత్రలేఖనం చిన్నప్పట్నుండీ ఉన్న సరదా. కథా లేఖనం కొత్త సరదా. ‘ప్రళయం’ అతని ఏడో కథ.–వేంపల్లె షరీఫ్

ప్రళయం

 

* * 1 * *

 

“ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించును. ఓ మానవా, వెనుకకు మరలుము”

ఆ తలుపు మీద పెద్ద అక్షరాలతో చెక్కి ఉందా హెచ్చరిక. దాని కిందా, పైనా నోళ్లు తెరుచుకుని మింగటానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెడుతున్న రెండు నాగుపాముల ఆకారాలు. వాటి కళ్ల స్థానంలో పొదిగిన జాతిరాళ్లు పై కప్పుకి వేలాడుతున్న గుడ్డి దీపం వెలుగులో మెరుస్తున్నాయి. ఆ పడగల కింద భారీ పరిమాణంలో ఉందో తుప్పు పట్టిన ఇనుప తాళం.

అది శ్రీ చండీ అమ్మవారి ఆలయం. వెయ్యేళ్ల పురాతనమైనది. ఏడాది క్రితం దాకా ఇది స్థానికంగానే ప్రసిద్ధం. ఆ కాస్త పేరు కూడా సమీపంలో ఉన్న శివకోట రాకెట్ సెంటర్ సైంటిస్టుల పుణ్యాన వచ్చిందే. అక్కడ నుండి ప్రయోగించబోయే రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలు అమ్మవారి ముందుపెట్టి ప్రత్యేకంగా అర్చన చేయించటం ఆనవాయితీ. ఈ మధ్య భారతదేశం ప్రయోగించిన తొలి వ్యోమనౌక కూడా ఇక్కడ దిష్టి తీయించుకున్నాకే పైకెగిరింది. శాస్త్రవేత్తలు సొంత శక్తియుక్తుల కన్నా శక్తిస్వరూపిణి మహిమల్నే నమ్ముకోవటం వింతే. నాకలాంటి మూఢనమ్మకాలేం లేవు. ఒకే ఒక గాఢ నమ్మకం మాత్రం ఉంది: డబ్బు. భూమ్మీద దేవుడి అవసరం లేని వాళ్లున్నారు కానీ డబ్బవసరం లేని వాళ్లు లేరు. కాబట్టి నేను దైవానికన్నా ధనాన్నే ఎక్కువ నమ్ముతాను.

మొత్తానికి ఆ వెర్రి సైంటిస్టుల దయవల్ల చుట్టుపక్కల గ్రామాల్లో పేరుబడటమే తప్ప చండీ అమ్మవారి గురించి దేశంలో మరెవరికీ తెలీదు. అలాంటిది పోయినేడు అమ్మవారి పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. ఆలయం అడుగునున్న నేలమాళిగల్లో లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడటం దానిక్కారణం. భూమికి యాభై అడుగుల లోతున ఉన్న నేలమాళిగల్లో శతాబ్దాలుగా పోగుపడి ఉన్న బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాలని లెక్కించటానికి ప్రభుత్వాధికారులకి నాలుగు నెలలు పట్టింది. నేలమాళిగలో మొత్తం ఆరు గదులుండగా, ఐదు గదుల సంపద వెలికి తీశాక – ఆరోగది తెరిస్తే అరిష్టమని గుడి ధర్మకర్తలు దావా వెయ్యటాన, అది తేలేవరకూ దాన్ని తెరవొద్దని కోర్టు ఆదేశించటాన, ఆరో గది తలుపులింకా మూతబడే ఉన్నాయి. ఆ గది ముందే ఉన్నా నేనిప్పుడు.

ఇంత సంపదున్న ప్రాంతానికి ఉన్న భద్రతల్లా ఇద్దరు సెంట్రీలు, నేలమాళిగ లోపలకి వెళ్లే ఇనప గేటుకి రెండు పెద్ద తాళాలు, కోర్టు తీర్పు వెలువడేదాకా గేటు తెరవొద్దన్న ఆదేశాలు. అమ్మవారి సొమ్ముని ఆమే కాపాడుకుంటుందన్న ధీమానేమో, కనీసం లోపల అలారం సిస్టం కూడా లేదు. నాలాంటి దొంగకి ఇందులోకి చొరబడటం నీళ్లు తాగినంత సులువు. తవ్వకాలు జరుగుతున్నప్పుడు కాంట్రాక్టు కూలీ అవతారమెత్తి నేలమాళిగలో ఎక్కడేముందో క్షుణ్నంగా తెలుసుకుని మరీ ఈ పధకం రూపొందించాను. తెల్లవారుఝామున మూడింటికి సెంట్రీలు డ్యూటీ మారే సమయంలో నేలమాళిగలోకి చొరబడి, ఆరో గది తలుపు బద్దలు కొట్టి, లోపలనుండి అందినంత బంగారాన్ని మూటగట్టుకోవటం; ఈ లోగా పైన తెల్లారిపోతుంది కాబట్టి మళ్లీ చీకటి పడేదాకా అందులోనే కాలక్షేపం చేసి తిరిగి తెల్లవారుఝామున మూడుగంటలకి బయటికి జారుకోవటం; ఆలయం గోడ పక్కన పొదల్లో దాచిన మోటార్‌సైకిల్ మీద ఉడాయించటం …. అదీ ప్లాన్. పధకం పక్కాగా ఉంది. అందులో సగం చక్కగా పూర్తయింది.

తలుపు మీదున్న వాక్యం మరోసారి చదివి నవ్వుకుంటూ నాతో తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ తెరిచి అందులోని వస్తువుల్ని నేలమీద పరిచాను: రెండు బిరియానీ పొట్లాలు, నాలుగు మంచినీటి సీసాలు, ఒక టార్చ్ లైట్, చిన్న రంపం, అర డజను హ్యాక్ సా బ్లేడులు.

రంపం అందుకుని తాళం కొయ్యటం మొదలుపెట్టాను. గంటన్నర గడిచి, మూడు బ్లేళ్లు విరిగి, వళ్లు చెమటతో తడిసి ముద్దయ్యాక ఊడొచ్చిందది. రంపం కింద పడేసి గాఢంగా ఊపిరి పీల్చుకుని తలుపు బలంగా నెట్టాను. కిర్రుమనే శబ్దంతో తెరుచుకుందది.

ఎదురుగా, ఐదొందలేళ్లుగా మానవమాత్రుడు అడుగు పెట్టని గది.

టార్చ్ లైట్ వెలిగించి లోపలకు వేశాను. చాలా పెద్ద గదిలాగుందది. సొరంగంలా పొడుగ్గా ఉంది.

గుమ్మం దాటుకుని ఎడమ కాలు లోపల పెడుతుండగా …. టప్ మనే శబ్దంతో పైనున్న గుడ్డి బల్బ్ పేలిపోయింది. టార్చ్ వెలుగు తప్ప అంతా చీకటి.

“అపశకునమా?”. ఛత్. దొంగలకు చీకటి వరం. ఇది శుభశకునమయ్యుండాలి.

టార్చ్ లైట్ సాయంతో వెదకటం ప్రారంభించాను. బంగారం రాశులు ఏ మూల దాగున్నాయో?

పెద్దగా కష్టపడే పనిలేకుండా పావుగంటలోనే బోధపడింది. ఖాళీ గది వెక్కిరించింది. రాశుల్లేవు, రప్పల్లేవు. బంగారం మూటల్లేవు. నా ముఖంలో నెత్తుటి చుక్కలేదు. చిల్లర దొంగతనాలతో రోజులు నెట్టుకొస్తున్న నేను ఈ చివరి చోరీతో దొంగ బతుక్కి గోరీ కట్టి కొత్త జన్మెత్తొచ్చన్న ఆశలు ఆవిరయ్యాయి. కసిగా కాలితో నేలపై తంతుండగా టార్చ్ వెలుగులో ఓ మూల తళుక్కుమందది. వెంటనే వెళ్లి చూశాను.

ఇందాక వెదికినప్పుడు కనబడలేదు. ఎక్కడినుండో ఊడిపడ్డట్లు ఉందది. అమ్మవారి బుల్లి విగ్రహం. పదంగుళాల ఎత్తున పోతపోసిన పసిడి. అధమం కిలోన్నర బరువన్నా ఉంటుంది. పాతిక లక్షలకి తక్కువుండదు. పోనీలే, ఇంత కష్టపడ్డందుకు ఇదన్నా దక్కింది.

ఉదయం ఆరున్నరయింది. రాత్రంతా నిద్రలేకపోవటంతో కళ్లు మండుతున్నాయి. బయటపడటానికి ఇంకా ఇరవై గంటల పైన నిరీక్షించాలి. అప్పటిదాకా చేసేదేమీ లేదు కాబట్టి కాసేపు వళ్లు వాలిస్తే పోతుంది.

 

 

* * 2 * *

నేలమాళిగనుండి బయటపడే సమయం దగ్గర పడింది. లేచి అడుగులో అడుగేసుకుంటూ గేటు దగ్గరికొచ్చాను. బయటంతా చీకటి. ఎక్కడినుండో వస్తున్న వెలుగులో పరిసరాలు మసకగా కనబడుతున్నాయి. ఆ వెలుగులో గంతులేస్తున్న నీడలు అది విద్యుద్దీపాల కాంతి కాదని తెలియజెపుతున్నాయి. శీతాకాలం కదా. సెంట్రీలు చలి మంటలేస్తున్నారేమో.

గేటు తాళాలు తెరిచి బయటికొచ్చి శబ్దం కాకుండా తాళాలేశాను. చోరీ సంగతి ఎంత ఆలస్యంగా బయటపడితే తప్పించుకోవటం అంత తేలిక. గేటు తెరిచిపెట్టి పారిపోకుండా తిరిగి తాళాలేయటం అందుకే.

ఆలయం ఆవరణలో ఓ మూల విసిరేసినట్లున్న చిన్న మంటపంలోకి తెరుచుకుంటుందా గేటు. మంటపాన్ని ఆనుకునే ఆలయ ప్రాకారం ఉంది. చీకటి మాటున ప్రాకారం అవతలకి దూకి అక్కడ పార్క్ చేసున్న మోటార్‌సైకిల్ సాయంతో జారుకోవాలి.

పిల్లిలా గోడవైపు నడుస్తుండగా వచ్చిందా అనుమానం. ఏదో తేడా. ఆగిపోయి చెవులు రిక్కించాను. ఏమీ వినపడలేదు. ఏవో పురుగులు చేస్తున్న సొద. కీచురాళ్లేమో. అది తీసేస్తే రాత్రి పూట సాధారణంగా ఉండే నిశ్శబ్దం. తేడా అది కాదు. ఏమిటది?

జుత్తు కాలుతున్న వాసన. చర్మం కాలుతున్న వాసన కూడా. వాతావరణమంతా ఆవరించినట్లు, అన్ని దిక్కుల నుండీ దుర్వాసన.

మనసు కీడు శంకించింది. అక్కడే ఉంటే దొరికిపోయే ప్రమాదం. కానీ దాన్ని మించిన అపాయమేదో రానుందని మొరపెడుతున్న మనసు. సెంట్రీ గదివైపు చూశాను.

అక్కడ రెండు ఆకారాలు నేలమీద పడున్నాయి – నిశ్చలంగా.

“ఏం జరిగింది?”, కుతూహలం పురివిప్పింది. నా ప్రమేయం లేకుండానే అడుగులు అటుపడ్డాయి.

నిమిషం తర్వాత ….

నేను స్థాణువునై ఆ శవాల ముందు నిలబడి ఉన్నాను. వళ్లంతా బొబ్బలతో పడి ఉన్నాయా శరీరాలు. వాటి మీదున్న దుస్తులు వాళ్లు సెక్యూరిటీ గార్డ్స్ అని చెబుతున్నాయి. ఆ శవాల పైన రొదచేస్తున్న కీటకాలు, పురుగుల సమూహం. తట్టుకోలేని దుర్గంధం.

“ఎవరి పని?”. ఆలోచించే సమయం లేదు. ముందిక్కడినుండి పారిపోవాలి. లేకపోతే దొంగతనానికి తోడు హత్యానేరం నా మీద పడుతుంది. వళ్లంతా చెమటలు పట్టాయి. భయంతో కాదు, ఉక్కతో. ఆ సమయంలో అంత ఉక్కపోత అసాధారణం. అయితే నేను దాన్ని పట్టించుకునే స్థితిలో లేను. వెనుదిరిగి ప్రాకారం వైపు పరిగెత్తబోతుండగా నా దృష్టి సెంట్రీ గది అవతల వంద మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన మంటపమ్మీద పడింది.

అప్రయత్నంగా నా గొంతునుండో గావుకేక వెలువడింది.

అక్కడ … పదుల సంఖ్యలో శవాలు. పారిపోయే ప్రయత్నం మానేసి అటు పరుగు పెట్టాను.

అక్కడికి చేరుకునేసరికి నా పై ప్రాణం పైనే పోయింది. ఎటు చూస్తే అటు నిర్జీవ దేహాలు. పెద్దలు, పిల్లలు, పూజారులు, స్త్రీలు, కుక్కలు, కాకులు, పిట్టలు …. గుట్టలు గుట్టలుగా శవాలు. సలసల కాగుతున్న నూనె కుమ్మరించినట్లు, ఆ శరీరాల నిండా బొబ్బలు. ఉడికీ ఉడకని మాంసం ముద్దల్లా, రక్తమోడుతూ. హృదయవిదారకమైన దృశ్యమది. చూడగానే కడుపులో తిప్పింది. నిన్న తిన్నదంతా వాంతయింది. అక్కడుండలేక దూరంగా పరిగెత్తాను. బ్యాక్‌ప్యాక్‌లోంచి నీళ్ల సీసా తీసి ముఖం కడుక్కుని, ఓ గుక్క నీళ్లు తాగి సీసా లోపల పెట్టేయబోతుండగా అందులో ఉన్న అమ్మవారి విగ్రహం చేతికి తగిలింది. దాన్ని తీసి ప్యాంట్ జేబులో దోపుకున్నాను.

కొంచెం స్థిమిత పడ్డాక చుట్టూ పరికిస్తే ఓ చివరన పార్కింగ్ లాట్‌లో అగ్నికి ఆహుతైన మోటారు వాహనాలు కనబడ్డాయి. వాటికి కాస్త అవతలో లారీ ఇంకా తగలబడుతూ ఉంది.

బాంబు దాడేమన్నా జరిగిందా?

అలా ఐతే గుడి కూడా ధ్వంసమై ఉండాలి కదా. పైగా పక్షులు కూడా రాలిపడున్నాయి. కాబట్టి ఇది బాంబు దాడి కాదు.

ఎవరన్నా చూసేలోపే ఇక్కడ నుండి వెళ్లిపోవటం మంచిది. బయట పార్క్ చేసున్న మోటర్ సైకిల్ వైపు నడవటం ప్రారంభించాను, జేబులో విగ్రహాన్ని తడిమి చూసుకుంటూ.

* * 3 * *

నా కళ్లనుండి నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. ఈ ఘోరకలి నమ్మటానికి మనసు నిరాకరిస్తుంది.

సెల్ ఫోన్ ఉదయం పదిన్నరైనట్లు చూపిస్తుంది. ఆ ఫోన్ అందుకు తప్ప మరెందుకూ పనికి రాదని అర్ధమై చాలాసేపయింది. ఎక్కడా సిగ్నల్స్ లేవు. ఆఖరికి సెల్‌ఫోన్ టవర్ల పక్కన కూడా. కరెంట్ కూడా లేదు.

నగరం నడిబొడ్డునున్న క్లాక్ టవర్ సెంటర్లో నిలబడున్నా నేను. అదో నాలుగు రోడ్ల కూడలి. రహదారుల్లో ఎక్కడికక్కడే ఆగిపోయిన వాహనాలు. కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా తగలబడిపోయాయి. వాటి లోపలా, బయటా, రోడ్ల మీదా, పక్కనున్న షాపుల్లో కిటకిటలాడుతూ నిర్జీవదేహాలు. కనుచూపుమేరలో మరో ప్రాణి సడి లేదు. వళ్లు కాలిపోయి, బొబ్బలెక్కి, కమిలిపోయి … మనుషులు, మృగాలు, పక్షులు, కీటకాలు. కళ్లకు కనబడినమేరా కళేబరాలు. మధ్యలో నేను – ఒంటరిగా.

అనాధగా పెరిగిన నాకు ఒంటరితనం కొత్తకాదు. అది నన్నెప్పుడూ భయపెట్టలేదు. కానీ ఇది …. ఇది భయాన్ని సైతం బెదరగొట్టే భీభత్సకాండ.

అమ్మవారి ఆలయం నుండి ఇక్కడిదాకా అదే పరిస్థితి. కాలిపోయిన వాహనాలు, తగలబడుతున్న భవనాలు, మండిపోతున్న ఎండుచేలు, చెల్లాచెదురుగా శవాలు. పొదల మాటున దాచిన నా మోటార్ బైక్ కూడా తగలబడిపోయుంది. దారిలో ఓ శవం నుండి తస్కరించిన డొక్కు సైకిల్ తొక్కుకుంటూ నగరానికి రావటానికి మూడు గంటలు పట్టింది. రెండు టైర్లూ పాడైపోయిన సైకిలది. వేరే దారి లేకపోవటంతో అదే నా వాహనమయింది. నగరానికొచ్చే దారి పొడుగునా యుద్ధరంగాన్ని తలపించే వాతావరణం. కాదు, కాదు .. యుద్ధం కూడా ఇంత భయంకరంగా ఉండదేమో.

నేనా నేలమాళిగలో ఉన్నప్పుడు ఏదో జరిగింది.

శత్రుదేశం దాడి చేసిందా? ఆటం బాంబులేమన్నా ప్రయోగించిందా?

కాకపోవచ్చు. సమీపంలో అణుబాంబు పేలితే భూకంపం లాటిది రావాలి. అలాంటివేవీ నేను గమనించలేదు.

ఇంతకీ … ఇంత దారుణం జరిగి ఇరవై నాలుగ్గంటలయ్యాకా ఇక్కడ మీడియా వాలిపోలేదెందుకు? ప్రభుత్వం సహాయానికి సైన్యాన్ని దించలేదెందుకు?

అప్పుడొచ్చిందా అనుమానం. క్షణాల్లోనే అది పెనుభూతంగా మారి నన్ను ఆపాదమస్తకం వణికించేసింది.

ఈ మారణకాండ ఈ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదేమో. దేశం యావత్తూ తుడిచిపెట్టుకుపోయిందేమో. బయటి నుండి కూడా సహాయం రాలేదంటే, అంతకన్నా కారణమేముండాలి?

అంటే …. నేనొక్కడినే బతికున్నానా?

ఆ ఊహకి – వెన్నులో మొదలైన జలదరింపు లిప్తలో వళ్లంతా పాకింది. ఉన్నచోటే కూలబడిపోయాను. ఆ వత్తిడికి జేబులో ఉన్న విగ్రహం గుచ్చుకుంటుంటే నా మస్తిష్కంలో ఓ మెరుపు మెరిసింది. “నేనే దీనికంతటికీ కారణమా?”.

తర్కానికి తాళం పడ్డ వేళది. గుట్టలుగా పడున్న శవాలన్నీ ఒక్కపెట్టున లేచి నన్ను చుట్టుముట్టినట్టూ, ఈ శాపం నా పాపమేనని నిందిస్తున్నట్టూ అనిపించింది. “ఆరోగదిలో అడుగుపెట్టి అమ్మవారికి ఆగ్రహం కలిగించానా? మూఢనమ్మకమంటూ కొట్టిపడేసిన విషయమే నిజమయిందా?”.

నాలో తొలిసారిగా పాపభీతి. ఇది నేనెన్నడూ ఎరగని అనుభూతి. “నో, నో. హేతుబద్ధంగా ఆలోచించు. దానికీ దీనికీ సంబంధమేమిటి?” అని నాకు నేనే నచ్చజెప్పుకుంటూ బ్యాక్‌ప్యాక్ లోంచి నీళ్ల సీసా అందుకుని ఓ గుక్క గొంతులో వంపుకున్నాను. అదే చివరి సీసా. ఎక్కడా మంచినీళ్ల జాడలేదు. మళ్లీ నీళ్లు దొరికేదాకా ఈ మిగిలిందొక్కటీ జాగ్రత్తగా వాడుకోవాలి. చూస్తుంటే విధ్వంసమంతా ఉపరితలమ్మీదనే జరిగినట్లుంది. నేలమాళిగలో ఉన్న నాకు ఏమీ కాకపోవటం దానికి సాక్ష్యం. భూమ్మీద నీరంతా ఆవిరైపోయినట్లుంది. నేల పొరల్లో నీరే నాకిప్పుడు గతి. బోరింగ్ పంప్ లాంటిదెక్కడన్నా కనిపిస్తే నీళ్లు తోడుకోవచ్చు. కానీ నగరాల్లో బోరింగులు ఎప్పుడో మాయమైపోయాయి. పల్లెల్లో ఏమన్నా మిగిలున్నాయేమో. తూర్పు దిక్కున పల్లెటూర్లున్నాయి. అటువైపు వెళితే? ఒకవేళ అక్కడ బోరింగ్స్ లేకపోయినా, ఇంకా ముందుకెళితే సముద్రం ఉంది. ఇసుక మేటలుండే సముద్ర తీరాల్లో కురిసిన వాన నీరు ఇసుక పైపొరల్లో నిలవుంటుంది. అక్కడ పైపైన తవ్వితే మంచినీరు ఊరుతుంది.

అప్పుడే మరో ఆలోచన స్ఫురించింది. “పరిసర ప్రాంతాల్లో నాలాగే అదృష్టవశాత్తూ విపత్తు తప్పించుకున్నవాళ్లుంటే? వాళ్లూ నీళ్ల కోసం వెదుక్కుంటూ సముద్రం దిక్కుగా సాగితే?”

ఆలస్యం చేయకుండా పైకి లేచాను. ఇరవై కిలోమీటర్ల లోపే ఉంది సముద్రం. సైకిల్ మీద నాలుగైదు గంటల్లో వెళ్లిపోవచ్చు.

ఎండ మందగించింది. తూర్పునుండి ముసురేస్తుంది. వర్షం మొదలయేలోపే తీరానికి చేరాలనుకుంటూ వాహనం అధిరోహించాను.

 

* * 4 * *

సముద్ర తీరం చేరటానికి అనుకున్నదానికన్నా ఆలస్యమయింది. సగం దూరం వెళ్లేటప్పటికే కారుమబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం మూడున్నరకే చీకటి పడిపోయింది. యుద్ధభేరీ మోగించినట్లు ఉరుములు, చెవులు బద్దలయ్యే శబ్దంతో పిడుగులు. మార్గమంతా మృత్యువు వికటాట్టహాసాలే. మెరుపుల వెలుగులో దారి వెదుక్కుంటూ, దార్లో పడున్న శరీరాలని జాగ్రత్తగా దాటుకుంటూ ముందుకు సాగటానికి నాకు శక్తెక్కడినుండొచ్చిందో! ఎలాగోలా తీరానికి చేరితే నాలాంటి వాళ్లెవరన్నా కనబడకపోతారా అన్న ఆశ బలాన్నిచ్చిందేమో. సీసాలో మిగిలిన నీళ్లు మధ్యలోనే ఖర్చైపోయాయి. తీరా, తీరానికొచ్చాక నా ఆశ అడియాసయింది. తీరమంతా మనుషులు, పక్షులు, చేపల పార్ధివ దేహాలే. సముద్రపు అలలకి కొట్టుకొస్తూ, తిరిగి లోపలికెళుతూ. లెక్కించటం మొదలుపెడితే సంఖ్య వేలల్లోనే తేలేట్టుంది. వీళ్లు కూడా వళ్లంతా బొబ్బలతో రాలిపోయిన వాళ్లే.

అక్కడికొచ్చేటప్పటికి సాయంత్రం ఆరయింది. ఉరుముల ఉద్ధృతి రెట్టింపయింది. నీటి చెలమ తవ్వుదామనుకుంటుండగానే వాన మొదలయింది. సముద్రం ఉగ్రరూపం దాల్చినట్లు అలలు విరుచుకు పడటం మొదలు పెట్టాయి. తోడుగా హోరుగాలి. దాని ధాటికి సైకిల్ ఎగిరిపోయింది. కొన్ని దేహాలు ఎగురుకుంటూ నా పక్కగా దూసుకుపోతున్నాయి. ఒకట్రెండు – పక్షులవో లేక చేపలవో – ఎగిరొచ్చి నాకు తగిలాయి. చుట్టూ చూస్తే దూరంగా ఓ బోర్లించిన పుట్టి కనబడింది. గాలికి ఎదురీదుతూ దాన్ని చేరుకుని, కాసేపు తిప్పలు పడి కొంచెం పైకెత్తి దాని కింద దూరి ప్రాణాలు అరచేత పెట్టుకుని క్షణాలు లెక్కబెట్టసాగాను.

క్షణాలు నిమిషాలు, నిమిషాలు గంటలయ్యాయి. ఎన్ని గంటలయ్యాయో తెలుసుకోటానికీ లేకుండా సెల్ ఫోన్ వర్షానికి తడిసి మాడిపోయింది. గాలివాన అంతకంతకీ తీవ్రరూపం దాలుస్తుంది. పుట్టి ఏ క్షణంలోనైనా ఎగిరిపోయేలా ఉంది. అదే జరిగితే దానితో పాటు నేనూ గాలికెగిరిపోవటం తధ్యం. పుట్టి ఎగిరిపోకూడదని కోరుకుంటూ ప్రాణాలు చేతబట్టుకుని కూర్చున్నాను. అవసరం ఎవరినైనా అడుక్కునే స్థాయికి దిగజారుస్తుంది. కోరుకున్నవి దర్జాగా కాజేయటమే తప్ప అడిగే అలవాటు లేని నాకు, ఆ అవసరం మొదటిసారిగా వచ్చిపడింది. ఎప్పుడూ దేవుడిని ఏదీ అడగని నేను మొదటిసారిగా అడిగాను, నన్ను కాపాడమని. చేతులు జోడించి మరీ ప్రార్ధించాను. తీతువు కూతలు గుండెలదరగొట్టేవేళ హేతువు తోకముడిచి పారిపోతుందేమో.

ప్రార్ధన పూర్తవకముందే ఓ పెద్ద అల, సముద్రం చెయ్యి సాచినట్లు, వేగంగా దూసుకొచ్చి లిప్తలో నన్నూ పుట్టినీ గిరాటేసింది. నా నుదురు విసురుగా పుట్టికి తగిలింది. తల దిమ్మెక్కిపోయింది. కాసేపేం జరుగుతుందో అర్ధం కాలేదు. తేరుకునేసరికి అల నన్ను సముద్రంలోకి గుంజేసింది. ఉప్పునీరు నోట్లోకీ, ముక్కులోకీ పోయి ఉక్కిరిబిక్కిరవుతూ లోపలికి కొట్టుకుపోయాను. తలకి పెద్ద గాయమే ఐనట్లుంది. విపరీతమైన నొప్పి. కెరటం కాస్త తెరిపివ్వగానే పళ్ల బిగువున నొప్పి భరిస్తూ ఒడ్డుకేసి ఈదటం మొదలుపెట్టాను. అంతలోనే మరో అల నన్ను బలంగా వెనక్కి విసిరికొట్టింది. లేని ఓపిక తెచ్చుకుంటూ ఈత మళ్లీ మొదలుబెట్టబోయాను. అప్పుడే, పక్కనే తేలుతూ ఇందాకటి పుట్టి కనబడింది. వెంటనే ఎక్కేశాను.

ఈ గొడవలో నా బ్యాక్‌ప్యాక్ తప్పిపోయింది. ఓ పక్క దాహం, మరో పక్క ఆకలి. ఇంకోపక్క వణికిస్తున్న చలి. అలలు, ఉరుములు, ఈదరగాలి చేస్తున్న శబ్దాలు కలసికట్టుగా చెవులు పగలగొడుతున్నాయి. పైనుండి కుండపోతగా కురుస్తున్న వర్షం, నాలుగు దిక్కులనుండీ ఎడాపెడా కొడుతున్న కెరటాల మధ్యలో నానిపోతున్న నేను. కన్ను పొడుచుకున్నా కనబడని చిమ్మచీకటి. మెరుపులు మెరిసినప్పుడు మాత్రం సముద్రుడి ఉగ్రరూపం కళ్లముందు ప్రత్యక్షమై వళ్లు జలదరింపజేస్తుంది. ఆ మెరుపుల సాక్షిగా తీరానికి సుదూరంగా వెళ్లిపోయానన్న సంగతి అవగతమయింది. తల తడుముకుంటే చేతికి రక్తం అంటింది. బాగానే పోయినట్లుంది. తొడుక్కున్న చొక్కాలో కొంతభాగం చింపి అక్కడ బిగించి కట్టాను.

ప్రకృతి శక్తుల ముందు మనిషి అల్పత్వం గురించి నాకింకా అనుమానాలేవైనా మిగిలుంటే ఆ తర్వాత కాసేపట్లోనే అవి పూర్తిగా పటాపంచలయ్యాయి. చుట్టూ జరుగుతున్న విలయతాండవం నా కళ్లబడకుండా చీకట్లు కాపాడాయి. అంతెత్తున విసిరేస్తున్న అలల మధ్య పుట్టి తిరగబడకుండా ఉండటం అద్భుతమే. దాని లోపల నాలుగు చోట్ల బలమైన మోకులు కట్టున్నాయి. ఆ మోకులతో నన్ను నేను పుట్టికి కట్టేసుకుని, అలల ధాటికి దాన్నుండి దూరంగా విసిరేయబడకుండా కాపాడుకున్నాను. అలా ఎంత సేపు గడిచిందో తెలీదు. క్రమంగా నన్ను ఆకలి, అలసట ఆక్రమించుకున్నాయి. నీరసం కమ్ముకుంది. అలాగే నిద్రలోకి జారుకున్నాను.

 

* * 5 * *

 

కళ్లు తెరిచేసరికి …. చుట్టూ పండగ వాతావరణం.

ఆశ్చర్యం! నేనున్నది పుట్టిలో కాదు. అది నడిసముద్రమూ కాదు. శ్రీ చండీ అమ్మవారి ఆలయం. మంటపంలో ఓ మూల పడుకుని ఉన్నాను. ఆలయం నిండా భక్తజన సందోహం. తిరునాళ్లేదో జరుగుతున్నంత కోలాహలంగా ఉందక్కడ.

“ఏమిటీ హడావిడి?”, హారతీ గట్రా సరంజామాతో అటుగా వెళుతున్న పూజారిని ఆపి ప్రశ్నించాను.

“ఇంకా తెలీదా నాయనా? ఆరో గదిలో బంగారు బొమ్మ రూపంలో అమ్మవారు వెలిశారు”, ఆయన వింతగా చూస్తూ చెప్పాడు.

“ఆరో గదా? అదెప్పుడు తెరిచారు! తెరిస్తే అరిష్టమని కోర్టునుండి స్టే తెచ్చారుగా”, తెలీనట్టు అడిగాను.

“ఎవడో దొంగవెధవ నాయనా. రాత్రి నేలమాళిగలో చొరబడి గది తలుపులు తెరిచాడు త్రాష్టుడు. వాడి శ్రాద్ధం పెట్ట. తెల్లారి సెక్యూరిటీ గార్డులు వెళ్లి చూస్తే అమ్మవారి విగ్రహం కనబడింది. అపచారం ఉపశమించటానికి శాంతి జరిపిస్తున్నాం” అంటూ పూజారి హడావిడిగా ముందుకు సాగిపోయాడు.

అంటే, ఇందాకటిదాకా జరిగిందంతా నిజం కాదా!?! ఆరో గది తలుపు తెరిచాక, అందులో ఏమీ దొరక్కపోవటంతో బయటికొచ్చి మంటపంలో పడుకుని నిద్రపోయానా? ఆ మొద్దునిద్రలో ప్రపంచం నాశనమైపోయినట్లు కలగన్నానా?

హమ్మయ్య. గుండె తేట పడింది. ఎంత భయంకరమైన పీడకల! నిజంలా భ్రమ పెట్టిన కల.

అయినా, ఏమీ దొరక్కపోతే గప్‌చుప్‌న జారుకోకుండా మంటపంలో పడుకుని నిద్రపోవటమేంటి? ఇంకా ఎక్కువ సేపిక్కడే ఉండటం మంచిది కాదు. వెంటనే వెళ్లిపోవాలి. మోటార్ సైకిల్ తాళాలు ఎక్కడ పెట్టానో?

ప్యాంట్ జేబులు వెదుక్కున్నాను. కుడివైపు జేబులో ఎత్తుగా తగిలిందది. బయటికి తీశాను.

అమ్మవారి విగ్రహం! పదంగుళాల ఎత్తున బంగారు రంగులో మెరిసిపోతూ. ఇది నా దగ్గరుంటే మరి ఆ గదిలో వాళ్లకి కనిపించిందేమిటి?

సాలోచనగా చూస్తుండగానే అమ్మవారి బొమ్మ కదిలింది. ఆమె చెయ్యి అలా అలా పెరిగి పెద్దదై వచ్చి నా చెంపని బలంగా తాకింది. అదే సమయంలో ఆమె గొంతు ఉరిమింది.

“మూర్ఖ మానవాధమా. అనుభవించు”.

 

* * 6 * *

 

చెవిలో ఉరిమిన శబ్దానికి ఒక్కుదుటన మెలకువొచ్చింది. సమీపంలో పిడుగు పడినట్లుంది. కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. సముద్రమింకా అల్లకల్లోలంగానే ఉంది. నా పుట్టి చిగురుటాకులా వణికిపోతూనే ఉంది. నుదుటి గాయం నొప్పి తట్టుకోనీకుండా ఉంది. తోడుగా తలనొప్పి మొదలయింది. జ్వరం కూడా వచ్చినట్లుంది. వళ్లంతా వేడి సెగలు. జ్వరానికి, చలికీ వణికిపోతూ నేనలాగే పుట్టిలో పడి ఉన్నాను.

ఇదేంటి … ఇంకా పుట్టిలో! మళ్లీ అదే కలా? లేక ఇదే నిజమా? ఇది నిజమైతే ఇందాకటిది అందమైన కలా?

ఏడుపొచ్చింది. కోపమూ వచ్చింది, అమ్మవారి మీద. “అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్షా?”. దిక్కులు పిక్కటిల్లేలా అరవాలనుకున్నాను కానీ నోరు పెగల్లేదు. గొంతు పిడచగట్టుకుపోతుంటే వర్షం నీరు దోసిళ్లతో పట్టుకు తాగాను. దప్పిక తీరింది. ఆకలి అలాగే ఉంది. సమయం ఎంతయిందో తెలుసుకోటానికి సెల్‌ఫోన్ కూడా లేదు. పూర్వకాలంలో గడియారాలతో పనిలేకుండానే గంటెంతయిందో చెప్పగలిగేవాళ్లంట. ఆ విద్యేదో నేర్చుకుంటే ప్రస్తుతం పనికొచ్చుండేది. అయినా నా పిచ్చిగానీ, ఇప్పుడు టైమెంతయిందో తెలుసుకుని చేసేదేముంది?

బుర్రనిండా తలాతోకాలేని ఆలోచనలు. తల పగిలిపోతుంది. కళ్లు వాలిపోసాగాయి. అదృష్టవశాత్తూ మళ్లీ మగత కమ్ముకుంది. అది నన్ను నిద్రలోకో, మత్తులోకో …. మొత్తానికి  ఈ నరకం నుండి దూరంగా తీసుకుపోయింది. ఆ పరిస్థితిలో ఎంతసేపున్నానో, తిరిగి మెలకువ వచ్చేసరికి సూర్యుడు నడినెత్తినున్నాడు. వర్షం ఆగిపోయింది. పైన మబ్బుతునక లేదు. సముద్రం ప్రశాంతంగా ఉంది. దాని మీద నా పుట్టి తేలియాడుతుంది. కనుచూపు మేరలో భూమి లేదు. నలువైపులా నీళ్లు. పైన నీలాకాశం. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. సూర్యకిరణాలు సూదుల్లా గుచ్చుతున్నాయి. గొంతెండిపోతుంది. సముద్రపు నీరు దోసిళ్లతో చేదుకు తాగాలన్న కోరిక బలవంతంగా నిగ్రహించుకున్నాను. ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగటమంటే చావుని ఆహ్వానించటమే.

నడిసంద్రంలో నేను. జతగా జ్వరం, ఆకలి, నిస్సత్తువ. తల మీది గాయం సలుపుడు. వంట్లో వేడికి తోడు పైనుండి మండించేస్తున్న ఎండ. తట్టుకోలేనంత ఉక్కపోత. దాని దెబ్బకి కాసేపట్లోనే కళ్లు తిరగటం మొదలయింది. వడదెబ్బ తగిలిందా? మరోసారి మగతలోకి జారిపోయాను.

* * 7 * *

ఎవరో పట్టి కుదుపుతున్న భావనకి మెలకువచ్చింది. నేల మీద వెల్లకిలా పడుకుని ఉన్నాను. జ్వరం, వణుకు తగ్గలేదింకా. మత్తుతో కళ్లింకా వాలిపోతున్నాయి. కష్టంగా వాటిని తెరిచి చూస్తే, నా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న అపరిచితులు. దృష్టి ఇంకా మసకగానే ఉండటంతో వాళ్ల ఆకారాలు స్పష్టంగా కనబడలేదు. మొల చుట్టూ ఈకల్లాంటివేవో కట్టుకున్న తుమ్మ మొద్దుల్లాంటి శరీరాలు. ఐదారుగురు ఉంటారేమో. చుట్టూ దడి కట్టినట్లు నిలబడి ఉన్నారు.

వాళ్ల చేతుల్లో ఏంటవి … శూలాలు!

నేనెక్కడున్నాను? ఇది కూడా కలేనా? ఈ విచిత్రాకారులెవరు యమకింకరుల్లా ….

యమకింకరులు!

అర్ధమైంది. నేను చచ్చిపోయాను. నన్ను నరకానికి పట్టుకుపోటానికొచ్చిన యమదూతలు వీళ్లంతా. ఒక్కడి కోసం ఇంతమందా?

కింకరుల్లో ఒకడు ముందుకొంగి నా తల మీద చెయ్యేశాడు. సరిగా గాయమైన చోట. నొప్పి. భరించలేని నొప్పి.

ఇంకా నొప్పేంటి? చచ్చిపోయాకా వదలదా!

కింకరుడి చెయ్యి నెట్టేసే ప్రయత్నంలో తల పక్కకి తిప్పాను. అప్పుడే, తక్కిన కింకరుల్లో కలకలం చెలరేగింది. గజిబిజి భాషలో గందరగోళంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. కష్టమ్మీద కళ్లు పూర్తిగా తెరిచి చూశాను. వాళ్లలో ఒకడు కుడివైపుకి చేత్తో చూపిస్తూ ఏదో అరుస్తున్నాడు. నేనూ అటు చూశాను.

సుదూరంగా, ఆకాశంలో మండుతూ దూసుకొస్తున్న అగ్నిగోళం. క్షణక్షణానికీ దాని పరిమాణం పెరిగిపోతుంది. సూటిగా మేమున్న దిశలోనే వస్తుందది.

కళ్లు పెద్దవి చేసి చూడటానికి విశ్వప్రయత్నం చేశాను. అయినా వివరం తెలీకుండా బూజరగానే కనిపిస్తుందది. అంతలో కింకరుల్లో ఒకడు నా కాళ్లు, మరొకడు భుజాలు పట్టుకుని పైకి లేపారు. మిగతావాళ్లు ముందు పరిగెడుతుండగా నన్ను మోసుకుంటూ వాళ్లని అనుసరించారు. అందరి దృష్టీ అగ్నిగోళమ్మీదనే ఉంది. వేగంగా దగ్గరకొచ్చేస్తుందది.

కాసేపట్లో వాళ్లు నన్నో గుహలాంటి దాన్లోకి తీసుకుపోయారు. నేలమీద పడుకోబెట్టి బయటికి చూస్తూ పెద్దగా మాట్లాడుకోసాగారు.

నా చూపింకా మసకగానే ఉంది. అరుణవర్ణంలో ఆకాశం. దాన్ని చీల్చుకొస్తున్న అగ్నిగోళం. వస్తూ వస్తూ అది హఠాత్తుగా పక్షిలా మారిపోయింది. నాకు స్పష్టంగా కనిపించటం లేదు, కానీ అది బూడిద రంగు పక్షి కావచ్చు. ఆగాగు .. పక్షి కాదు … విమానం. అవును విమానమే. దాని పరిమాణం అంతకంతకీ పెరుగుతుంది.

ఎంతమందైనా పట్టేందుకు అనుగుణంగా పరిమాణం పెంచుకునే గుణం పుష్పక విమానానికొక్కదానికే ఉందని విన్నాను. ఇది .. అదేనా?

ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతుండగానే విమానం వచ్చి రన్‌వే లాంటిదాని మీద దిగింది.

పుష్పక విమానానికీ రన్‌వే అవసరమా? వెర్రిగా నవ్వాలనిపించింది. నవ్వాలో వద్దో తేల్చుకునేలోపే విమానం ఇందాక నేను పడి ఉన్న ప్రాంతంలో వచ్చి ఆగింది. కాసేపట్లో అందులోనుండి నాలుగైదు ఆకారాలు బయటికొచ్చి మాకేసి నడవసాగాయి. ధవళవస్త్రాల్లో మెరిసిపోతున్నాయా ఆకారాలు.

ఎవరు వాళ్లు? నన్నీ కింకరుల బారినుండి కాపాడి స్వర్గానికి తీసుకెళ్లటానికొచ్చిన దేవదూతలా?

నాకంతా పిచ్చిపిచ్చిగా ఉంది. ముందు పుట్టిలో, తర్వాత గుళ్లో, మళ్లీ పుట్టిలో, ఇప్పుడిక్కడెక్కడో. అసలు నేనెక్కడున్నాను? తలకి తగిలిన దెబ్బకి వెర్రి కానీ ఎక్కలేదు కదా? నేను కలగంటున్నానా, ఏదో పిచ్చిలోకంలో ఉన్నానా, లేక చచ్చిపోయానా? సుడితిరుగుతున్న ఆలోచనలకి తోడుగా తల తిరగటం మొదలుపెట్టింది. మళ్లీ మత్తు కమ్ముతుంది. నో .. నో…. మత్తులో మునిగితే మరెక్కడ తే..ల…తా….నో…

* * 8 * *

హమ్మయ్య. మేలుకున్నాను. ఈ సారెక్కడున్నాను?

కళ్లు తెరిచి చూశాను. పైనెక్కడో కప్పు కనబడింది. పెద్ద గుహ అంతర్భాగంలా ఉంది. నేనింకా కింద పడుకునే ఉన్నాను, కానీ నేల మీద కాదు. మెత్తటి దేనిమీదో. గాయం పెద్దగా బాధించటం లేదు. వళ్లు కూడా తేలిగ్గా ఉంది. జ్వరం తగ్గిపోయినట్లుంది. లేచి కూర్చోబోయాను.

“మెల్లిగా. మీరింకా పూర్తిగా కోలుకోలేదు”. పక్కనుండి మృదువుగా వినబడిందా గొంతు. తల తిప్పి చూశాను. ఓ ధవళవస్త్రధారి, నా పక్కనే చిన్న బండరాయిమీద కూర్చుని ఉన్నాడు.

“ఎవరు నీవు? దేవదూతవా?”, నా గొంతు పీలగా ధ్వనించింది.

“లేదు. వ్యోమగామిని”

“నేనెక్కడున్నాను?”, సర్దుకుని కూర్చుంటూ ప్రశ్నించాను.

“ఆదిమాన్ ఐలాండ్స్‌లో ఉన్నారు. మీరున్న పుట్టి ఈ ద్వీపానికి కొట్టుకొస్తే ఇక్కడి ఆదివాసీలు కాపాడారు. నాలుగురోజులుగా కళ్లు తెరవనీయనంత జ్వరం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు”

“ఆదిమాన్ ఐలాండ్స్, ఆదివాసీలు! మరి వ్యోమగాములకేం పనిక్కడ?”. హేతువు మళ్లీ నా దరిచేరింది. వళ్లు స్వాధీనంలోకొచ్చేసరికి బుర్ర కూడా పాదరసంలా పనిచేయసాగింది.

“ఈ ద్వీపంలో భారతీయ వ్యోమనౌకలు దిగటానికి అనువుగా రన్‌వే ఉంది”, అతను బదులిచ్చాడు.

అదీ సంగతి. నేను చూసిన అగ్నిగోళం అదన్నమాట! అవి వ్యోమనౌక భూవాతావరణంలో ప్రవేశించినప్పుడు రాపిడికి పుట్టే మంటలన్న మాట.

“మీరు బతికి బయట పడటం ఓ అద్భుతం”, నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ మళ్లీ అతనే అన్నాడు.

“నిజమే. సముద్రంలో మునిగిపోకుండా ఇక్కడికి కొట్టుకు రావటం అద్భుతమే. అంతకు ముందు జరిగిన మారణహోమాన్ని తప్పించుకోటం మాత్రం నా అదృష్టం”

“ఎలా తప్పించుకున్నారు?”, అతను ఆసక్తిగా అడిగాడు.

చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించి చివరికి నోరు విప్పాను. నా కారణంగానే అదంతా జరిగిందేమోనన్న న్యూనతాభావం ఇంకా ఏ మూలో ఉండటం వల్లనేమో, నా ఘనకార్యం ఎవరికన్నా చెబితే కానీ మనశ్శాంతి ఉండదనిపించింది. నేను నేలమాళిగలో ప్రవేశించటం దగ్గర్నుండి మొత్తం పూసగుచ్చినట్లు అతనికి వివరించాక మనసు తేలికపడింది.

“అయితే అసలేం జరిగిందో మీకు తెలీదంటారు”, మొత్తం విన్నాక అతను సూటిగా చూస్తూ ప్రశ్నించాడు.

“ఊఁహు. మీకు తెలుసా?”

“తెలుసు. సూర్యుడి క్రోధాగ్నిలో మానవులు మాడి మసైపోయారు”.

“వాట్?”, అయోమయంగా చూశాను.

“వివరంగా చెబుతాను వినండి”. అతను గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పటం మొదలు పెట్టాడు. “వారం కిందట జరిగిందది. ఆ రోజు సూర్యుడినుండి విడుదలయ్యే శక్తి హఠాత్తుగా పదులరెట్లు పెరిగిపోయింది. సౌరశక్తిలో హెచ్చుతగ్గులుండటం సాధారణమైన విషయమే కానీ, ఈ సారది ఎవరూ ఊహించనంత ఎక్కువ స్థాయిలో విడుదలయింది. చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందెన్నడూ జరిగిన దాఖలా లేకపోవటాన, జరగబోయేది ముందే ఊహించి మనుషుల్ని ఆప్రమత్తం చేసేందుకు అవసరమైన గణాంకాలు లేక మన అబ్సర్వేటరీలేవీ దీన్ని పసిగట్టలేకపోయాయి. హెచ్చరిక లేకుండా వచ్చిపడ్డ ఉత్పాతమది. దాని దెబ్బకి ముందుగా ఉపగ్రహాలు, వాటి మీద ఆధారపడ్డ సమాచార వ్యవస్థలు నాశనమయ్యాయి. భూవాతావరణం కొన్ని గంటల్లోనే అసాధారణ స్థాయిలో వేడెక్కింది. ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు పేలిపోయాయి. కరెంట్ లేక, ఏసీలు పని చేయక జనం శలభాల్లా మాడిపోయారు. మండే స్వభావం ఉన్నవన్నీ మండిపోయాయి. నీటి చెలమలు ఆవిరైపోయాయి. సముద్రాల ఉపరితలమ్మీద నీరు మరిగిపోయింది. అక్కడుండే మత్స్య జాతి కళ్లు తేలేసింది. ఈ విలయం ఇరవై గంటల పైగా కొనసాగింది. భూమ్మీద అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ లోగా, సముద్రాల మీది నీటి ఆవిరి పైకెళ్లి చల్లబడి కనీవినీ ఎరగని స్థాయిలో తుఫాన్లు కురిపించింది. ప్రపంచమంతటా కోస్తా ప్రాంతాలని వరదలు ముంచెత్తాయి ….”

అతని వాక్ప్రవాహానికి అడ్డొస్తూ ప్రశ్నించాను, “ఇదంతా మీకెలా తెలుసు?”

“ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనుండి ఈ ఘోరాన్ని ప్రత్యక్షంగా చూశాం మేము.  మూడు రోజుల తర్వాత కింద పరిస్థితులు కుదుటపడ్డాయనిపించగానే హుటాహుటిన తిరిగొచ్చాము. మా రీ-ఎంట్రీలో సహకరించటానికి కిందెవరూ మిగిల్లేరు. అయినా సాహసించి వచ్చేశాం”

“ఈ ఉత్పాతం వల్ల స్పేష్ స్టేషన్‌కి ప్రమాదమేం రాలేదా?”

“భూమ్మీదకన్నా రోదసిలో సూర్యకిరణాల ధాటి ఎక్కువ. కాబట్టి స్పేష్ స్టేషన్ ఇంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకునేలా రూపొందించబడింది”

“బాగానే ఉంది. మరి, భూమ్మీద మిగతా అందరూ మాడిపోయినా ఈ ఆదివాసీలు క్షేమంగానే ఉన్నారేం?”

“ఆదివాసీలు కావటం వల్లనే వాళ్లు బతికిపోయారు. ప్రకృతితో మమేకమై ఉండటం వాళ్లని కాపాడింది. మనలాంటి నాగరీకులం ఎప్పుడైతే యంత్రాల మీద మితిమీరి ఆధారపడటం నేర్చుకున్నామో, అప్పుడే మనం ప్రకృతి భాష మర్చిపోయాం. ఫలితం? ఇదిగో …. ఇది. మనం రూపొందించుకున్న ఏ సాధనమూ ఈ ప్రమాదాన్ని ముందస్తుగా ఊహించి హెచ్చరించలేకపోయింది. టెక్నాలజీ దన్నుతో ప్రకృతిమీద పై చేయి సాధించానని విర్రవీగిన ఆధునిక సమాజం, తాను నమ్ముకున్న సాంకేతిక వ్యవస్థలన్నీ మూకుమ్మడిగా కుప్పకూలిననాడు జరిగేదేమిటో అంచనా వేయలేకపోయింది. మనకి భిన్నంగా, ఈ ఆదివాసీలు చుట్టూ ఉన్న ప్రకృతితో నిత్యం సంభాషిస్తారు. అది చెప్పేది శ్రద్ధగా వింటారు. ఈనాడు అదే వాళ్లని కాపాడింది”

“ఎలా?”

“ఇలాంటి ఉత్పాతాలని ముందుగా పసిగట్టగలిగే శక్తి పశుపక్ష్యాదులకుంది. ఈ విలయం మొదలవటానికి కొన్ని గంటల ముందే ఈ ద్వీపంలో ఉన్న జంతువులన్నీ ఎత్తైన ప్రాంతాలకేసి పరుగులు తీశాయి. అది గమనించి, ఏదో పెనువిపత్తు ముంచుకు రానుందని భావించి వీళ్లు కూడా కొండలపైకెళ్లి అక్కడున్న గుహల్లో దాక్కున్నారు. ఎక్కువ ఎత్తుకి వెళ్లే కొద్దీ వాతావరణంలో వేడి తగ్గుతుందని తెలిసిందే కదా. అదనంగా గుహాంతర్భాగాల్లో ఉండే సహజమైన చల్లదనం తోడై వాళ్లని కాపాడింది”

“అయితే నాగరీకులెవరూ బతికి బట్టకట్టలేదంటారా?”

“అందరూ పోయారనలేం. చల్లటి ధృవాల వద్ద, ఎత్తైన కొండప్రాంతాల్లో ఉండేవాళ్లు కొందరైనా తప్పించుకునే అవకాశం ఉంది. మీలా అదృష్టవశాత్తూ బతికిపోయినోళ్లు కూడా కొందరుండొచ్చు. కానీ వీళ్ల శాతం చాలా తక్కువ. మొత్తమ్మీద, ఆధునిక నాగరికతనేది అంతరించినట్లే. కానీ అంతమాత్రాన అంతా ఐపోయినట్లు కాదు. భూమాత చరిత్రలో మానవుడు లిఖించాల్సిన అధ్యాయాలు మరికొన్ని మిగిలే ఉన్నాయి. ఆ పని కొనసాగించే మహత్తర బాధ్యత ప్రపంచవ్యాప్తంగా మిగిలున్న ఇలాంటి ఆదివాసీలదే”

గుహ ద్వారం వద్ద ఏదో శబ్దమవటంతో సంభాషణాపి అటు చూశామిద్దరమూ. కొందరు ఆదివాసీలు నిలబడున్నారక్కడ. వాళ్లలో ఒకడు లోపలికొచ్చాడు. నేరుగా నా వద్దకొచ్చి నా చేతిలో ఏదో పెట్టాడు.

చండీ అమ్మవారి బంగారపు బొమ్మ. నా జేబులో ఉండాల్సింది.

దాన్ని తిరిగిచ్చేస్తూ ఉంచుకోమన్నట్లు సైగ చేశాను. నన్ను కాపాడినందుకు అంతకన్నా ఎలా కృతజ్ఞత తెలియజేయాలో తోచలేదు.

ఆదివాసీ తల అడ్డంగా ఊపి చాలాసేపు ఏదో గొణిగాడు. ఆస్ట్రోనాట్‌కేసి చూశాను. “ఏమంటున్నాడు?”

అతను నవ్వి చెప్పాడు.

“వాళ్లకు దానితో అవసరం లేదంటున్నాడు”

 ***

Story & Illustration: అనిల్ ఎస్. రాయల్

 

మీ మాటలు

 1. అనిల్ గారి నాగరికత చదివి తెలుగు సాహితీ ప్రపంచం లోకి ఒక కొత్త కథా కిరణం ప్రవేశించింది అని ఆనాడే అనుకున్నా. ఆ తర్వాత కల్కి, శిక్ష , రహస్యం, మరో ప్రపంచం , రీబూట్ … వాస్తవికతకి కల్పన జోడించి రాయడం లో అనిల్ గారు దిట్ట . వచనం కూడా ఎంతో హాయిగా ఉంటుంది . అంతర్లీనంగా కళ్ళు చెమ్మగిల్లే మానవీయత కథలో ఇమిడి ఉంటుంది. మనీషిగా గొప్పవాడయితె తప్ప గొప్ప కథలు రాయలేరు ఎవరయినా. ప్రళయం అందుకు ఒక ఉదాహరణ .
  – తహిరో

 2. ఊహించని మలుపులతో,సస్పెన్స్ తో సాగింది ఈ కథ.కథ ముగించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. మీ శైలి బాగుంటుంది. చిత్రం చాలా చాలా బాగుంది. గ్రేట్ వర్క్!

 3. చెంప ఛెళ్లుమనిపించే నిరసన. భయంకర అవకాశాన్ని తగినంత భయంకరంగా చెప్పిన కథ. కంది చేనిలో పోగొట్టుకున్న కడెం కోసం పప్పు కుండలో వెదుక్కోలేం, మళ్లీ కంది చేనిలోనే వెదుక్కోవాలి. ‘సూర్య ప్రళయం’ వస్తే ఆదివాసీలు తమను తాము కాపాడుకోగలరా? లేరేమో గాని, ‘నాగరికులమ’య్యే దారిలో ఎక్కడో మనల్ని మనం పోగొట్టుకున్నామని గుర్తు చేస్తారు. తిరిగి మనల్ని మనం వెదుక్కోక పోతే అందరం కట్ట గట్టుకుని ఛస్తాం. లేదా ఛస్తే బాగుండు అనిపించేలా బతుకుతాం.

 4. అవును HRK గారూ. మీరన్నది నిజం. మనం నాగరీకులమయ్యే క్రమంలో మనల్ని మనం పొగొట్టుకొవడాన్ని చాలా మార్మికంగా గుర్తుచేస్తారు అనిల్ గారు. ఆయన కథని చెప్పే పద్దతి లోనే ఒక హాయి, అందం నిభిడీక్రుతమయ్యి ఉంటాయి. ఉబుసుపోక ఏదో రాయాలని రాయరు. ప్రపంచం పోకడల్ని ఆకళింపు చేసుకుని మన గురివింద తనాన్ని మనకి చూపించే ప్రయత్నం చేస్తూ రాస్తారు. అనిల్ గారూ … మీరు ఏడాదికి ఒకటి, రెండు కథలను విధిగా రాయాల్సిన అవసరం ఉంది.
  – జగదీశ్వర్ రెడ్డి

 5. ఆధునికమానవుడు నష్టపోతున్న ప్రాకృతిక సంబంధాలను, తద్వారా అతడు ఎదుర్కుంటున్న వైఫల్యాలను సూటిగా చర్చించిన కథానిక ‘ప్రళయం’. ప్రకృతిని పరిరక్షించుకోవలసిన ప్రముఖమైన అంశాన్ని, అందమైన శైలితో, ఉత్కంఠత కలిగించే కథనంతో , ఆలోచింపచేసే ఇతివృత్తంతో కలిపి చెప్పడం రచయిత ప్రతిభకు నిదర్శనం.
  రాయదుర్గం విజయలక్ష్మి

 6. Your style is unique. Your story took me on a ride.Enjoyed it.

 7. అబ్బ.. చివరి వరకూ రెప్పలు అలానే వదిలేసి మరీ చదివాను.
  చాలా బావుంది !

 8. బాగుంది

 9. లలిత says:

  కథ నాకు చాలా నచ్చింది
  ఏ మాత్రం గందరగోళం లేకుండా ప్రారంభం నుండి చివరివరకూ ఒకే రీతిగా సాగిపోయింది . (అలాగే …. చాలా భయపెట్టింది )
  కథలో ‘అత్యవసరమయిన ‘ సందేశం వుంది . అనిల్ గారు థేంక్ యు మంచి కథ చదివించారు

 10. సాయి పద్మ says:

  మహామహులందరూ కధ గురించి ప్రశంసిన్చాక .. ఇక నేను చెప్పేది ఏమీ ఉండబోదు.. కానీ .. మీ చివరి వాక్యం మళ్ళీ కధంతా చదివేలా చేసింది … ప్రళయానికి మరో సీక్వెల్ కోసం వేచి చూస్తున్నాను .. గొప్ప కధ .. ప్రకృతిని వినని వాళ్ళు అందర్నీ పుట్టిలో ముంచే పచ్చటి కల కధ.. థేంక్ యు ..అనిల్ గారూ .. మంచి కథ రాసినందుకు ..

 11. పల్లేటి బాలాజీ says:

  Anil garu excellent story

 12. పల్లేటి బాలాజీ says:

  అనిల్ గారూ … మీ ప్రళయం చదివాను . నా అభిప్రాయం సారంగలో రాద్దమనుకొంటే అక్కడ తెలుగు ఎందుకో రాలేదు . మా చెంగాళమ్మని తిరువనంతపురపు అనంత పద్మనాభుడ్ని అద్బుతంగా కలిపేసారు కథలో … మన అంతరిక్ష పరిశోధన మొదలైంది తిరువనంతపురపు తుంబాలో … అంతర్జాతీయ ఖ్యాతి గాంచు చున్నది శ్రీహరికోటలో … ఈ రెండూ కలవడం నిజంగా నాకెంతో సంతోషాన్ని కలిగించింది . ఇక కథ విషయానికొస్తే …. ప్రకృతితో మమేకమై జీవించడమన్నది ఈ యుగంలో ఎవరికీ వీలుపడదన్నది నా నమ్మకం . కథకునిగా మీ ఆదిమానవ నమ్మకాన్ని నేను వ్యతిరేకించను కానీ పొరపాటున అలాంటివారు నిజంగా ఎక్కడైనా మిగిలివున్నరన్న ఆలోచనకూడా ప్రస్తుత మార్కెట్ శక్తులు తట్టుకోలేరేమో ? నిజంగా చాలా మంచి కథ . అభినందనలు … కథా చిత్రం కూడా …..

 13. Thank you all.

  ఇ-మెయిళ్లు, ఇతర మార్గాల ద్వారా ‘ప్రళయం’ కథపై పాఠకులు లేవనెత్తిన సందేహాలకు నా సమాధానాలు. I hope these explanations will save me, as well as future readers some time.

  Q. కథలో రాసినట్లు ఇలాంటి ఉత్పాతాలని ఆదివాసీ తెగలు నిజంగా పసిగట్టి తప్పించుకోగలుగుతాయా?
  A: I don’t know if primitive tribes can survive a solar apocalypse like the one imagined in ‘Pralayam’, but I strongly feel that they have better chances than their civilized brothers and sisters. Here’s why I feel so.

  2004 డిసెంబర్ 26న హిందూమహాసముద్రంలో వచ్చిన పెను సునామీ ధాటికి అండమాన్-నికోబార్ ద్వీపాల్లో స్థిరపడ్డ నాగరీకులు బలైపోగా, వేలాది ఏళ్లుగా అక్కడ స్థిరనివాసముంటున్న ఆదిమ జాతుల మనుషులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. ఎలా? సునామీ సంభవించటానికి ముందు భూమిలో కలిగిన చిన్న చిన్న ప్రకంపనలు, గాలి వేగంలో వచ్చిన హెచ్చు తగ్గులు, సముద్ర తీరంలో నీరు వెనక్కి పోవటం, పశుపక్ష్యాదుల్లో కలిగిన కలకలం, సదా రొదచేస్తుండే ఇలకోడి పురుగులు (కీచురాళ్ల వంటివి) హఠాత్తుగా మూగబోవటం …. ఇలాంటివన్నీ గమనించి, సముద్రం నుండి ఏదో ప్రమాదం ముందుకు రానుందని పసిగట్టటం ద్వారా. వెంటనే వాళ్లందరూ ద్వీపాంతర్భాగాలకి, కొండలపైకి తరలిపోయారు; బతికిపోయారు. On the other hand, కార్ నికోబార్ ద్వీపంలో కొలువయ్యున్న భారతీయ మిలటరీ బేస్‌కి చెందిన వందకు పైగా వ్యక్తులు సునామీలో చిక్కి ఆచూకీ తెలీకుండా పోయారు!

  The point is, all this modernization is making us forget the two fundamental traits which made us modern in the first place: observation and deduction. We lost basic survival skills. We let machines decide everything for us. What if a day comes when all our systems fail together?

  Q. అంత వేడిమికి ధృవాల వద్ద మంచు కరిగి భూమండలం మొత్తం నీటితో నిండిపోవాలి కదా. అలా జరగలేదేం?
  A. Why are the poles dead-frozen, covered with layers of rock-solid ice? That’s because they are not exposed to sun light the same way rest of the globe is. ఈ కథ జరిగింది శీతాకాలంలో (ఆ విషయం మొదటి చాప్టర్‌లో ప్రస్తావించబడింది). అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉత్తర ధృవం పూర్తి అంధకారంలో ఉంటుంది. ఆ ఆరునెలల కాలం అక్కడ సూర్యకాంతి తాకదు. కాబట్టి ఆ ధృవం పూర్తిగా కరిగి నీరయ్యే అవకాశం లేదు. ఇక మిగిలింది దక్షిణ ధృవం. Sun light hits this pole at such a shallow angle, that even at ten times higher intensity, it can’t generate enough radiation to melt this pole completely in just 20 hours (that’s how long the catastrophe lasted – as explained by the astronaut). Besides, South pole is at a high altitude which keeps the temperatures low. Having said that, the indirect heat could still force some amount of melting, causing flash floods, avalanches, etc. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చివర్లో వ్యోమగామి ‘ధృవాల వద్ద కొందరన్నా మిగిలే అవకాశముంది’ అంటాడు, instead of saying ‘ధృవాల వద్ద అందరూ బతికే అవకాశముంది’.

  Q. ఇంతకీ ఇది అమ్మవారు ఆగ్రహించటం వల్ల జరిగిందా, లేక కాకతాళీయమా?
  A. అది పాఠకులు తమ నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఎవరికి వారు నిర్ణయించుకోవలసిన విషయం.

  Q. కథ చివరి వాక్యం దేన్ని ఉద్దేశించినది? (‘వాళ్లకి దానితో అవసరం లేదంటున్నాడు’). ధనంతోనా, దైవంతోనా, ఆ రెండిటితోనా?
  A. I don’t know either :-)

  There were other questions. Some were so lame (‘ఇది నిజంగా జరిగిన కథా?’, ‘నేలమాళిగలో పాముల్లేవా?’), no explanation is offered. Rest of them (‘పురాతన గుడి తాళాలు అంత తేలిగ్గా ఎలా తెరుచుకున్నాయి?’, ‘ఆ అగ్నిగోళం ఏమిటి?’, ‘తిరునాళ్లు, జాతర … అదంతా నిజమా లేక భ్రమా?’) can be answered by re-reading the story.

 14. అనిల్ గారూ మీరు ఇచ్చిన clarification వలన నాతో పాటూ ఈ కథ చదివిన వారన్దరూ ఘాడంగా ఊపిరి వదిలే అవకాశం ఉంది . అమ్మో! మీరు దొరుకుతారా బాబూ?
  – గొరుసు

  • పల్లేటి బాలాజీ says:

   గొరుసు గారూ నమస్తే , ఎలావున్నారు? చాలా కాలమైంది మీతో మాట్లాడి.-పల్లేటి బాలాజీ

 15. రచయితగా మీరు అందరి అభిమానాన్ని సంపాదించారు
  తెలుగు కథకు కథనానికి మీరు కొత్త దారి చూపుతున్నారు
  మీకు అభినందనలు అనిల్ గారు

 16. మీ కథలు అన్ని చాలా బాగున్నాయి. తెలుగు కథల లో మీ కథలు ప్రత్యేకం. చాలా థాంక్స్. ప్రళయం కథ లో నాకు ఒక సందేహం వచ్చింది, అంతా సర్వనాసనం అయినప్పుడు కథ లో ఉన్న ఈ దొంగకు, గుడికి ఎందుకు ఏమి కాలేదు, బయట ఇంత జరుగుతున్నా గుడిలో ఉన్న అతనికి ఎందుకు తెలియలేదు?

 17. మీ తర్వాతి కథ కోసం వెయిట్ చేస్తున్నాను సర్.

 18. మీరు నాకు రిప్లై ఇచ్చినందుకు చాల హ్యాపీ గ ఉంది సర్, చాల బాగా చెప్పారు, చాల థాంక్స్. మీ తర్వాతి కథ కోసం వెయిటింగ్ సర్, thank u సర్.

 19. ratna prasad kondiparthi says:

  మీ కధలు సామాన్య మనిషి ని మన మూలాలు వెతుక్కునేల చేస్తునాయి .ప్రకృతి నుండి మనం నేర్చుకోవలసింది పోయి మనమే ప్రకృతిని సాసిస్తున్నాము .అదే ఈ అనర్ధాలకు కారణం.విజ్ఞానం మనలో మనిషిని జంతువును చేస్తూనే భయాన్ని
  పెంచుతుంది .

 20. nageswara rao says:

  sir గుడ్ story

మీ మాటలు

*