చిన్నతనం

swamy1

చిన్నప్పుడు

నేనెప్పుడు పాలు తాగిన్నో  తెలియదు!

పోయే  ప్రాణం నిలిపెటందుకు

ఏ చల్లని  తల్లో అందించిన
మొదటి  అమృతధార –
చెంప మీద గరుకు మరక.

ఏ బొమ్మల్తో ఆడుకున్ననో,
ఏ ఏ ఆటల్ని
లోకమెరుకలేని  మురిపెంతో
నేర్చుకున్ననో గుర్తుకు లేదు.

పగిలిన బొమ్మల ముక్కల్ని

కూలిన గోడలకు దారాల్తో  కట్టి
నాకు నేనే మాట్లాడుకున్న,
ఎడతెరిపిలేని సంభాషణలు –
చినిగిన బట్ట పేలికలతోటి  ఆరబెట్టుకున్న

లోలోపలి ఏడ్పు వానలు.

మూసుకున్న పాత అర్ర
తలుపుల వెనుక

నా ఒంటరితనపు దోస్తులు.

ఎవరెవరిని ముద్దు పెట్టుకున్ననో,

ఎవరెవరితో తన్నులాడుకున్ననో –
చిమ్మచీకటి అలవాటు పడ్డకళ్ళకు

ఎప్పటికీ కాని పరిచయాలు.

నాలో నేనే,
అందరికీ వినబడెటట్టు,
వాడచివర తల్లి లేని కుక్కపిల్ల ఏడుపుతో

రాగం కలిపి పాడిన పాట –
చిన్నతనమంతా అలుముకున్న
చెవులు చిట్లిపొయ్యె  నిశ్శబ్దం.

ఈత నేర్చుకున్న పాతబావి

పచ్చటి నీళ్ళలో జరజర పాకిన

నల్లటి నీరు కట్టెలు –
laxman_aelayచుట్టలు చుట్టుకుంటూ

బుజాలమీద నుండి జారిపోయే

పసితనపు భయాలు.

కలలో,    లోలోపలి కలల్లో

రోజూ కనబడే పగిలిన బొమ్మలు,
సుడులు తిరిగే  గొంతు విరిగిన పాటలు –
వెంటాడుతుంది కందిరీగలా కుట్టే

కనికరం లేని ఒంటరి చిన్నతనం!

పెయింటింగ్ : లక్ష్మణ్ ఏలే

మీ మాటలు

 1. చిరు పదాలు … చిన్న నాటి చిత్తరువులు ….చిత్రించిన తీరులు అద్భుతం ..

  నాలో నేనే,
  అందరికీ వినబడెటట్టు,
  వాడచివర తల్లి లేని కుక్కపిల్ల ఏడుపుతో…..”

  అని అన్నా …

  “ఈత నేర్చుకున్న పాతబావి

  పచ్చటి నీళ్ళలో జరజర పాకిన

  నల్లటి నీరు కట్టెలు –

  చుట్టలు చుట్టుకుంటూ

  బుజాలమీద నుండి జారిపోయే

  పసితనపు భయాలు.”

  అని ముక్తాయిన్చినా ,…..అది “వెంకట యోగి ” పద విచిత్రం ..అభినందనలు. నారాయణ స్వామీ గారు.

 2. bhasker says:

  చాలా మంచి కవిత స్వామి గారూ…
  మీదైన ముద్ర, ఒరవడి ఉన్నాయ్ కవితలో.
  మూలాలను ఇంకా మరచిపోకుండా మీరు శుభ్ర సుందరంగా ఉన్నారు.
  మీ మిత్రుడు,
  -భాస్కర్ కూరపాటి.

 3. ఎన్ వేణుగోపాల్ says:

  స్వామీ, చాల బాగుంది, ఎప్పట్లాగే…

 4. మెర్సీ మార్గరెట్ says:

  మంచి కవిత సర్ .. చదువుతున్నంత సేపు కళ్ళ ముందు కదులుతున్న బాల్యం వెంట సాగిన నడక.

 5. వలస, ఒంటరితనం గురించి నిన్ననే ఒక మిత్రుడితో మాట్లాడుతున్నా. ఇక్కడ మీ పద్యం. అసలు బాల్యాన్నించి యవ్వనం మీదుగా నడివయసులోకి ప్రయాణం కూడా ఒక వలసే.

 6. balasudhakarmouli says:

  kavitha adbhutam…. daaniki LAXMAN ఏలే గారి బొమ్మ అద్బుతం……..

 7. బాల్యాన్ని ఆర్తిగా హత్తుకున్న కవిత,..బాగుంది,.

 8. స్వామి

  కవిత చాలా బాగుంది. మనం కలిసి కవిత్వం చదువుకున్న
  పాత రోజులు గుర్తు కొచ్చి…..

  విమలక్క

 9. Narayanaswamy says:

  రాఘవేంద్ర రావు గారూ, భాస్కర్ గారూ, వేణూ, మెర్సీ గారూ, నారాయణస్వామి, బాలసుదాకర మౌళి, భాస్కర్ కొండ్రెడ్డి గారూ, విమలక్కా – మీ ఆత్మీయ వచనాలకు ధన్యవాదాలు !

 10. C.V.SURESH says:

  బాల్య స్మృతులు బావున్నాయి

 11. నీ బాల్యం నా బాల్యాన్ని తట్టి…. కాదు కాదు….తన్ని లేపి నట్టుంది. అంతా నేను గానే వుంది నీ బాల్యం. అలాంటి ఒంటరి చిన్నతనం గడిపినందుకే నెమో, ఇప్పుడు అందరి తో కలివిడిగా ఉంటావు, కలిసి పోతుంటావు.
  బాగా గుర్తు చేసావు….. మనం ఇక్కడున్నా….ఎక్కడున్నా…..ఆ మట్టి వాసనల ముందు…..Macy’s perfumes ఎంత….

  చాలా బాగుంది…..నేను ఇప్పుడే చిర్ర గొనె ఆడి వచ్చి నంత గా…….

  శ్రవణ్ నాగపురి

 12. నారాయణస్వామి says:

  ప్రియమైన శ్రవణ్ – నాతో, నా బాల్యంతో ఐడెంటిఫై ఐనందుకు నా కృతజ్ఞతలు! మనమేనాడూ మర్చిపోలేని కల లాంటిది బాల్యం! అనునిత్యం వాస్తవమై వెంటాడుతుంది కదా!

మీ మాటలు

*