ఆ సాయంత్రం గుర్తుందా?

Muralidhar(1)

కార్తీక మాసం కావోసు. ఆకాశం తొందరగా సూరీడ్ని ఆవలకి పంపేసి, రాతిరి రంగుని పులుమేసుకుంది. తుంటరి పిల్ల తెమ్మెరకు చలికాలం కదా అల్లరెక్కువ, రివ్వున చుట్టేసి గిలిగింతలు పెట్టి పోతోంది. ఊరంతా ఏదో తెరపరిచినట్టు మంచు పైనుండి మెల్లగా కురుస్తూ ఉంది. ఏ చెట్టుని, గట్టుని ముట్టుకున్నా చేతికి చల్లాగా తగిలి జిల్లుమంటుంది.

నీ కోసం ఆ వీధి చివర స్ట్రీట్ లైట్ క్రింద ఎంతసేపో మరి అలా ఎదురు చూస్తూనే ఉన్నాను. వళ్ళంతా చల్లబడి చిన్న వణుకు మొదలయ్యింది. గుమ్మాల ముందు కార్తీక దీపాలు మిణుకు మిణుకు మంటు చెప్పే కబుర్లేవో వింటూ కూర్చున్నా.

ఆ పరాకులో నేనుండగా అల్లంత దూరంలో నువ్వు, వెన్నెల దేశపు వేగులా, ఆనందలోకపు అందాల దేవతలా నువ్వు. బేల కళ్ళతో బిత్తర చూపులు చూస్తూ, చలిగాలికి ముడుచుకుని మెల్లగా నడిచొస్తున్న నువ్వు. గాలికి ఎగురుతున్న ఆ ముంగురులను ఒక చేత్తో చెవుల వెనక్కి నెట్టేస్తూ, ఒక్కో అడుగును కొలుస్తున్నట్టుగా నేల వైపే చూస్తూ లయబద్దంగా నడిచొస్తున్న నువ్వు. నీకు తెలుసా ఆ క్షణం ఒక కొత్త స్వర్గానికి కొత్త ఇంద్రుడ్ని నేను. అంతటి ఐశ్వర్యాన్ని నీ క్రీగంటి చూపు ఒక్క క్షణంలో సృష్టిస్తే, శాశ్వతమైన నీ తోడెంత అపురూపమో కదా.

చీకట్లో ఒంటరి వీధుల వెంబడి నీతో ఆ గమ్యంలేని నడక, గమ్యం ఎంతటి అసంపూర్ణమో నిర్వచించింది. పెదాలను మౌనంతో కట్టిపడేసి, నీ కళ్ళు పలికిన ఊసులు, భాష ఎంత పిచ్చి ఊహో నేర్పించాయి. నా కళ్ళలోకి నువ్వు సూటిగా చూసిన ఆ చూపు నన్నెంత ఉక్కిరిబిక్కిరి చేసిందో. చూపులు నేలపై పరిచిన ఎంతోసేపటికి కానీ అ కంగారు తగ్గలేదు.

నా తడబాటు గమనించి చెయ్యి అడ్డు పెట్టుకుని నువ్వు నవ్వుకుంటే, ఎంత సిగ్గనిపించిందో. ఆ కదలికలో నీ భుజం నన్ను తాకిన క్షణం, నీ శరీర సుగంధం నను కమ్మేసిన ఆ క్షణం నాలో కలిగిన ప్రకంపనలను ఏమని చెప్పాలి? నేను చెప్పను. అది మోహావేశం మాత్రమే అనుకునే వాళ్ళకి నేను చెప్పనే చెప్పను.

కాస్త కంగారుగా దూరం తొలగి, నన్ను దాటి ముందు నువ్వు నడుస్తుంటే, కనపడనీయక నువు దాచేసిన సిగ్గుని, ఎర్రబడ్డ నీ మోము పైన ఆ అందాల నవ్వుని నా కళ్ళలో దాచేసుకుంటూ నీ వెంట నడిచాను. ఆ అనుభవాలను రికార్డ్ చేస్తున్న జ్ఞాపకాల పుస్తకాన్ని సరిగ్గా అక్కడే మూసేసి, తాడు కట్టేసాను. ఎందుకంటే నువ్వు తిరిగి వెళ్ళిపోవటం జ్ఞాపకాల్లో నిలుపుకోవాల్సిన విషయమేం కాదుగా.

ఆ సాయంత్రం గుర్తుందా?
నువ్వులేని నా వేల సాయంత్రాల్ని వెలిగిస్తున్న ఆ సాయంత్రం నీకింకా గుర్తుందా?

మీ మాటలు

 1. సూపర్ మురళి….. బుల్లి కథ అయినా భలే ఉంది :)

 2. మురళీ మార్కు రాత :-)

 3. వేణూశ్రీకాంత్ says:

  బాగుంది మురళీ :)

 4. అపుడే అయిపోయిందా… సశేషమేమన్నా ఉందా అని వెతికానండి.. :)

 5. ఇలాంటి రొమాంటిక్ లైన్లు చదివి ఎంతకాలం అయిందో.. చాలా బాగా అనిపించింది…

 6. బాగుంది
  ఓ చెలి/చలి మెలిపెట్టే సాయంత్రం

  నేనైతే ఆ సాయంత్రాన్ని గుర్తుచేసుకుంటూ, వెదక్కుంటూ గోదారి ఇసుకతెన్నెలపై పరుస్తున్న సాయత్రపు చీటటిమధ్య ఎదురుచూపుల్ని
  వేదకుతున్నాను
  అభినందనలు మురళీ

 7. శ్రీనివాస్ పప్పు says:

  “నీకు తెలుసా ఆ క్షణం ఒక కొత్త స్వర్గానికి కొత్త ఇంద్రుడ్ని నేను. అంతటి ఐశ్వర్యాన్ని నీ క్రీగంటి చూపు ఒక్క క్షణంలో సృష్టిస్తే, శాశ్వతమైన నీ తోడెంత అపురూపమో కదా.”

  ఊహలకే రెక్కలు వస్తే ఇంత బావుంటుందా!!

  మురళీ ఇలా రాయడం నీకే చెల్లిందిలే.

 8. బావుందండీ మురళీ! నాక్కూడా అప్పుడే అయిపోయిందా అనిపించింది!

 9. Chaala baagundhi :)

 10. shiwazee komakula says:

  అంతటి ఐశ్వర్యాన్ని నీ క్రీగంటి చూపు ఒక్క క్షణంలో సృష్టిస్తే, శాశ్వతమైన నీ తోడెంత అపురూపమో కదా.
  అద్భుతమైన వర్ణన మురళి గారూ..
  అభినందనలు…

మీ మాటలు

*