అగ్నిని జయించిన….వాళ్లు!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

చతురంబోధిపరీత భూవలయమున్ సద్వీప సారణ్య స

క్షితిభృత్కం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచున్

గ్రతువుల్ నూరొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా

హితుడై యా నహుషుండు దా బడసె దేవేంద్రత్వముం బేర్మితోన్

                                                            -నన్నయ

                (శ్రీమదాంధ్రమహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం) 

( నాలుగు సముద్రాలూ చుట్టుకున్న భూమండలాన్ని ద్వీప, అరణ్య, భూభాగాలతో సహా తన గొప్పదైన భుజశక్తితో పాలిస్తూ నూరు యాగాలు చేసి, తన కీర్తి దిగంతాలకు వ్యాపించగా శత్రువులందరినీ జయించిన ఆ నహుషుడు ఇంద్రపదవిని పొందాడు)

 అక్కథకుడు శౌనకాది మహామునులకు చెప్పాడు…అటువంటి నహుషునికి ప్రియంవద అనే ఆమె వల్ల యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువులనే ఆరుగురు కొడుకులు కలిగారు. వారిలో యయాతి రాజై అనేక యాగాలు చేశాడు. శుక్రుని పుత్రిక అయిన దేవయాని వల్ల అతనికి యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; వృషపర్వుని పుత్రిక అయిన శర్మిష్ట వల్ల దృహ్యుడు, అనుడు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. శుక్రుని శాపంతో వృద్ధాప్యభారం మీదపడగా కొడుకుల నందరినీ పిలిచి అన్నాడు…

***

“—and so-and-so took as a wife so-and-so, and begat…and begat…and  begat…”

ఆ వృద్ధ గాథికుని కథనం వింటున్న హెలీకి బైబిల్ శైలి గుర్తొచ్చింది. కుంటా కింటే ముస్లిం మతస్థుడు. అతని నుంచి ఏడో తరానికి చెందిన హేలీ దగ్గరికి వచ్చేసరికి  ఒంటి రంగు, కారు నలుపు నుంచి గోధుమవర్ణానికి మారిపోవడమే కాదు, మతమూ మారిపోయింది. హెలీకి బైబిల్ ఒక్కటే తెలుసు. మహాభారతంతో అతనికి పరిచయం ఉండుంటే  గాథికుని కథనం మహాభారత శైలిలా ఉందని కూడా అనుకుని ఉండేవాడు. అంతేకాదు, మౌఖిక సంప్రదాయానికి చెందిన ప్రపంచ పురాణ కథకులందరూ తమ వీరపురుషుల గాథలనూ, వంశచరిత్రలనూ, కుల పురాణాలనూ ఈ శైలిలోనే చెప్పుకుని ఉండచ్చన్న సంగతి అతనికి స్ఫురించి ఉండేది.

గాథికుడు కింటే వంశ వివరాలు చెప్పుకుంటూ వెడుతున్నాడు. నాటి ముఖ్యమైన కొన్ని ఘటనల ద్వారా సంవత్సరాలను, తేదీలను సూచిస్తున్నాడు. ఉదాహరణకు, అప్పుడు “భారీగా వరదలు వచ్చాయి”… “అతను ఓ దున్నపోతును వధించాడు”…

గాథికుడు చెప్పిన కింటే వంశ వివరాలను సంగ్రహీకరిస్తే…

కింటే వంశం ఓల్డ్ మాలి అనే దేశంలో మొదలైంది. వారు వృత్తిరీత్యా కమ్మరులు. “అగ్నిని జయించినవాళ్లు”. కింటే తెగలోని ఆడవాళ్లు కుమ్మరిపనీ, నేతపనీ చేసేవారు. కింటే వంశంలోని ఒక శాఖ మారెటేనియా అనే మరో దేశానికి తరలిపోయింది. అక్కడినుంచి ఆ వంశస్థులలో ఒకడైన కైరాబా కుంటా కింటే అనే ముస్లిం గాంబియాకు వలసపోయాడు. మొదట పకాలి ఎన్డిగ్ అనే గ్రామంలో కొద్ది కాలం ఉండి  ఆ తర్వాత జఫరాంగ్ అనే ఊరికి, అక్కడినుంచి జఫూరుకు మారాడు. అక్కడ సిరేంగ్ అనే మాండింకా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి జానే, సలౌమ్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు. ఆ తర్వాత అయిసా అనే అమ్మాయిని రెండో భార్యగా స్వీకరించాడు. ఆమెకు ఒమొరో అనే కొడుకు పుట్టాడు.

తర్వాత కొంత కాలానికి కైరాబా పెద్ద కొడుకులిద్దరూ ‘కింటా కుండా జానేయా’ అనే కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడికి  వెళ్ళిపోయారు. ఒమొరో జఫూరులోనే ఉండిపోయాడు. తనకు “ముప్పై వర్షాలు” వచ్చిన తర్వాత బిట్టా కెబ్బా అనే మాండింకా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కెబ్బా వల్ల అతనికి ఉజ్జాయింపుగా 1750-1760 మధ్య కాలంలో నలుగురు కొడుకులు పుట్టారు: కుంటా, లామిన్, సువాడు, మాది…

అప్పటికి వృద్ధ గాథికుడు తన కథనం మొదలుపెట్టి రెండుగంటలయింది. తను పేర్కొన్న వ్యక్తుల గురించి మధ్య మధ్య వివరాలు అందిస్తూ కథనం కొనసాగిస్తున్నాడు. అలాగే, ఒమొరో నలుగురు కొడుకుల గురించిన వివరాలను చెప్పడం ప్రారంభించాడు. దుబాషీ వాటిని అనువదిస్తున్నాడు-

“రాజుగారి సైనికులు వచ్చిన సమయంలో”… “ఆ నలుగురు కొడుకుల్లోనూ పెద్దకొడుకు కుంటా కలప నరికి తెచ్చుకోడానికి ఊళ్ళోంచి అడవికి వెళ్ళాడు…అతను మళ్ళీ కనిపించలేదు…” గాథికుడు చెప్పుకుంటూ పోతున్నాడు.

తను చెక్కిన శిలలా కూర్చుండిపోయాననీ, తనలో రక్తం గడ్డకట్టుకుపోయినట్టు అనిపించిందనీ హేలీ అంటాడు. తన జీవితమంతా ఈ మారుమూల ఆఫ్రికన్ గ్రామంలో గడిపిన ఈ పెద్దమనిషి; టెన్నెస్సీ లోని తమ హెన్నింగ్ ఇంటి వసారాలో తను అమ్మమ్మ నోట చిన్నప్పుడు విన్న సంగతులే చెబుతున్నాడు! ఆ అప్రతిభస్థితిలోనే ఎలాగో బ్యాగు లోంచి ఒక నోటుబుక్కు తీశాడు. దాని మొదటి పేజీలలో అమ్మమ్మ చెప్పిన కథ ఉంది. దానిని ఒక దుబాషీకి చూపించాడు. ఆశ్చర్యచకితుడైన ఆ దుబాషీ వెంటనే గాథికుని దగ్గరకు వెళ్ళి ఆ నోటుబుక్కులోని పేజీలను చూపిస్తూ గబగబా ఏదో చెప్పాడు. గాథికుడు ఆందోళన చెందాడు. వెంటనే లేచి నిలబడి దుబాషీ చేతిలోని నోటుబుక్కు చూపిస్తూ జనానికి ఏదో వివరించాడు. దాంతో వాళ్ళు కూడా ఆందోళన చెందారు. ఎవరూ ఎలాంటి ఆదేశామూ ఇవ్వకుండానే అంతా తక్షణమే హేలీ చుట్టూ మానవవలయంలా ఏర్పడ్డారు. వ్యతిరేక దిశలో కదులుతూ; ఒకసారి మంద్రస్వరంలో, ఇంకోసారి ఉచ్చస్వరంలో ఏదో వల్లిస్తూ; మధ్య మధ్య మోకాళ్ళను పైకెత్తుతూ; ఎర్రని ధూళి పైకిలేచేలా ఒత్తి ఒత్తి అడుగులేస్తూ ప్రదక్షిణం చేయసాగారు…

అంతలో ఒక మహిళ ఆ వలయంలోంచి బయటకు వచ్చి, నగ్న పాదాలతో నేలను తన్నుకుంటూ హెలీవైపు బాణంలా దూసుకువెళ్లింది. తన వీపున వేలాడదీసుకున్న జోలెలోంచి పసిబిడ్డను తీసి దాదాపు మొరటుగా అతని చేతుల్లో ఉంచి “తీసుకో” అన్నట్టు చూసింది. హేలీ ఆ బిడ్డను హత్తుకున్నాడు. ఆ తర్వాత ఆమె బిడ్డను తీసేసుకుంది. మ్రాన్పడి చూస్తున్న హేలీ చేతుల్లో అలా ఓ డజను మంది మహిళలు తమ పసిబిడ్డల్ని ఉంచారు. వాళ్లందరినీ అతడు హత్తుకున్నాడు. వారు అలా ఎందుకు చేశారో అతనికి ఒక ఏడాది తర్వాత కానీ తెలియలేదు. అటువంటి విషయాలలో నిపుణుడైన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెరోమ్ బ్రూనర్ తో మాట్లాడినప్పుడు, “నీకు తెలియకుండానే మానవాళికి చెందిన అతి పురాతనమైన ఒక తంతులో నువ్వు పాల్గొన్నావు. దానిని ‘చేతులు వేయడం’ అంటారు.  “ఈ మా శరీరం ద్వారా మేము నువ్వే, నువ్వు మేమే” నని వారు నీకు చెబుతున్నారు” అని ఆయన  హెలీతో అన్నాడు.

తర్వాత మగవాళ్ళు హేలీని వెదురు కర్రలతో, పూరితో నిర్మించిన మసీదులోకి తీసుకెళ్లారు. అతనిని మధ్యలో ఉంచుకుని అరబిక్ లో నమాజు చేశారు. వాళ్లతోపాటు మోకాళ్ళ మీద కూర్చుని నమాజులో పాల్గొన్న హేలీ, తన మూలాలు ఏమిటో తెలిసినా, వాళ్ళు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదనుకున్నాడు. వారి ప్రార్థన సారాంశాన్ని ఆ తర్వాత దుబాషీ అనువదించి చెప్పాడు: ఎప్పుడో తాము పోగొట్టుకున్న వ్యక్తిని తిరిగి తమకు అప్పగించినందుకు అల్లాకు వారు కృతజ్ఞతలు ప్రకటించుకున్నారు.

kinta

తిరుగు ప్రయాణమైన హేలీ ఈసారి రోడ్డు మార్గంలో బయలుదేరాడు. జఫూరు కంటె పెద్దదైన ఓ గ్రామానికి చేరుకునేసరికి ఆ ఊళ్ళో జనం, ఆడా మగా, చిన్నా పెద్దతో సహా అంతా రోడ్డు మీదికి చేరుకుంటూ కనిపించారు. తను అక్కడికి రావడానికి ముందే జఫూరులో ఏం జరిగిందో వారికి తెలిసిపోయింది. వారు అతన్ని చూసి చేతులు ఊపుతున్నారు. “మీస్టర్ కింటే! మీస్టర్ కింటే!” అంటూ ఒక్క గొంతుతో కేకలు పెడుతున్నారు. వారి ముఖాలు సంతోషంతో వెలిగి పోతున్నాయి. ఆ సమయంలో నా చీలమండల దగ్గరినుంచి దుఃఖం అలలు అలలుగా ప్రారంభమై క్రమంగా పైకి తన్నుకుంటూ వచ్చిందనీ, చేతులతో ముఖం కప్పుకుని బాల్యం తర్వాత మొదటిసారిగా భోరున ఏడవడం ప్రారంభించాననీ హేలీ అంటాడు.

హేలీ న్యూయార్క్ చేరుకునేసరికి కొన్ని టెలిఫోన్ వర్తమానాలు అతనికోసం ఎదురుచూస్తున్నాయి. వాటిలో ఒకటి కన్సాస్ సిటీ నుంచి వచ్చింది. ఎనభై మూడేళ్ళ కజిన్ జార్జియా కన్నుమూసినట్టు అది చెబుతోంది. హేలీ టైమ్ జోన్ సవరించుకుని చూసుకుంటే సరిగ్గా తను జఫూరులో అడుగుపెట్టిన క్షణాలలోనే ఆమె చనిపోయినట్టు అర్థమైంది. అమ్మమ్మతో తమ ఇంటి వసారాలో ముచ్చట్లు పంచుకున్న చివరి మనిషిగా ఆమె, తనను ఆఫ్రికాకు పంపించే బాధ్యత నెరవేర్చి, ‘పైనుంచి చల్లగా చూసే’ పెద్దలలో కలసిపోయిందని హేలీ అనుకున్నాడు.

***

హేలీకి మహాభారతంతో పరిచయం ఉండుంటే, జఫూరు గాథికుని కథనం బైబిల్ శైలినే కాక మహాభారత శైలిని కూడా గుర్తుచేసేదని పైన చెప్పుకున్నాం. అంతేకాదు, మన ఇతిహాస, పురాణ కథలు అతనికి తెలిసుంటే, శైలినే కాక ఒకేవిధమైన అభివ్యక్తిని, పదాలను, పదచిత్రాలను కూడా ఒకనాటి ప్రపంచ గాథికులు పంచుకున్నారని అతడు గ్రహించి ఉండేవాడు. కుంటా కింటే తండ్రి ఒమొరో తనకు ముప్పై ‘వర్షాలు’ (హేలీ  thirty rains అన్నాడు) వచ్చాక పెళ్లిచేసుకున్నాడు. మనం కూడా సంవత్సరాలను ‘వర్షాలు’ అంటాం. వసంతాలతో సంవత్సరాలను చెప్పుకున్నట్టే వర్షాలతో చెప్పుకోవడం వ్యవసాయ సంస్కృతి ప్రపంచానికి అందించిన వారసత్వం.  అలాగే, కింటే వంశీకులు ‘అగ్నిని జయించారు’ అని వినగానే మన పురాణ కథనాల తీరు ఒక్కసారిగా  తళుక్కుమంటుంది. అరణి మథించి నిప్పు చేయడంలో నేర్పరులైన అంగిరులను కూడా మన పురాణాలు అగ్నిని జయించిన వారుగానే పేర్కొంటాయి. మన అగస్త్యుడు ‘సముద్ర జలాలను తాగేస్తాడు’. పై పద్యంలోని నహుషుడు క్షత్రియవీరుడు కనుక నిర్జితాహితుడు- అంటే శత్రువులను జయించినవాడు. కింటే వంశీకులు కమ్మరులు కనుక ‘అగ్నిని జయించిన’వాళ్ళు!

హేలీ అన్వేషణ అంతటితో పూర్తి కాలేదు. అనంతర కథ తర్వాత…

 

 

మీ మాటలు

*