దేవుడమ్మ

jhansi papudesiనన్ను మావూర్లో అందురూ దేవుడమ్మంటారు.మామూలుగా పూజబెట్టి పిలిస్తే వొచ్చే దేముడు నా పైనికి రాడు. నాకెప్పుడు దేముడొస్తిందో నాకు తప్ప ఇంగెవురికీ తెల్దు. దేముడ్ని నమ్మనోల్లు నన్ను దొంగ దేవుడమ్మని ఎక్కిరిస్తారు. వోల్లు నన్నట్టా ఎక్కిరిస్తే నాకు భయింగా వుంటుంది. మాయత్త ఇనేస్తిందేమో అని.యాలంటే నాకు దేముడొచ్చింది ఆమెవల్లే. మాయత్త పేరు యెంగట లచ్చిం. నేను ఆమి రెండో కొడుకుని పెల్లిజేసుకోని ఈవూరికొచ్చినా. మాయమ్మోల్లు రోజూ కూలికి బోతేనే రోజూ అంత సంగటి తినేది. మాయత్తోల్లు బాగా వున్నోల్లు.ఈడైతే కూట్నీల్లకు కరువుండదని మాయత్త గయ్యాలిగంపైనా నన్నీఇంట్లో ఇచ్చేసింది మాయమ్మ.

పెల్లి గాక  ముందు  ఆడతా పాడతా  వుంటి మాయమ్మోల్ల  ఇంట్లో .. తెల్లార్తో  లేసి  కళ్ళాపి  జల్లి  ముగ్గేసి, బోకులు కడిగేసి అంత  సద్దాగేసి కూలికి  బొయ్యేది… మాయిటాల  వొచ్చి  వుడుకుడుగ్గా  రెణ్ణీల్లు  బోసుకోని  కడుపుకింత  తినేసి అరుగుమింద కుచ్చోని అరుట్లు  కొడ్తా  నిద్దరబొయ్యేది .

ఆదినం  నేను  కూలికి పక్కింటి సుబ్బులత్త  దెగ్గిరికి బొయ్యింటి . నేను సింతకాయి  బొప్పిదీసి ఇసుర్రాయి  మింద బెట్టుకోని సుత్తితో  కొట్టి కొట్టి కిందేస్తా వుంటే సుబ్బులత్త  పండు  వొలస్తా వుండాది . అర్రోజు  పని జేసేసి ఇంటికి రమ్మని మాయమ్మ జెప్పింది . నన్ను చూసేదానికి పెల్లోల్లు వొస్తావుండారంట.

మద్దేనం మూడు గొడ్తా వుండగానే పల్లి బస్సుకు పెల్లోల్లు వొచ్చేసినారు. మాయత్త , ఆడబిడ్డి , ఆడబిడ్డి  మొగుడు , పెండ్లికొడుకు  వొచ్చినారు  నన్ను జూసేదానికి . నన్ను అట్టా ఇట్టా నడవమని, మాట్టాడమనిజెప్పి నాకు అయిటి లేదని దెల్సుకున్నారు. నాకు వొంటజేశేది వొస్తిందని మాయమ్మ జెప్పింది. వుత్త  జల్లి గదా  అది..  సద్దినీల్లకే సచ్చిబతకతా వుంటే ఇంగ వొంటేం వొండేది…మాయమ్మ నాగురించి ఏందేందో జెప్పి ఎచ్చులుబోతావుంది. నాకు మాత్తరం వోల్లకు కయ్యలుండాయని,రెండుమూడు జీవాలుండాయని,ఇంట్లో టీవీ గూడా వుందని భలే కులుగ్గా ఉండాది. బొట్టుగట్టిచ్చుకోని ఆయిగా ఆడికి పూడిస్తే సిన్మాల్లో మాదిరి వుండచ్చని కాస్కో నుండా. నాఈడుదే ఎగవీధిలో వుండే సుబ్బక్క.

12

టీవీ జూద్దారని వోల్లింటికిబోతే పెగ్గిజేస్తా వుంటింది. మిసిను ఆపుజేసేసి దాయాలు ఆడేదానికి రమ్మంటింది.నాకు దాయాలు ఆడేదానికన్నా టీవీ జూసేదే బాగిస్టం.  ఎట్టోకట్ట ఈ సమందం కుదిరిపోతే దినామూ టీవీ జూడచ్చు. ఇట్టనుకోని మాయత్తకు కొంచిం నోరని జెప్తే కూడా పెల్లికి వొప్పుకునేసినా. నామొగుడు బాగనే వుండాడు…కొంచిం మనిసి కుర్స. అయితేబొయ్యినాడు…కొరుక్కోనేమన్నా తింటామా…కడుపులో సల్లగుంటే సాలు. కాణిపాకులో పెల్లిజేసుకోని వొచ్చేసినా. బంగారు బొంతాడు,మాయమ్మ గుండ్లకమ్మలు, ఒక రాగి అండా బెట్టించికోని మరేదగా వొచ్చినా ఈడికి.

వొచ్చినాకగదా దెల్సింది నాకు…మాయత్త నోట్లో నోరు బెట్టేంత బుద్దిలేనిపని ఇంగోటి లేదని. మాఇంట్లో తాగేది సద్దినీల్లే ఐనా తిండికోసం ఎప్పుడూ తిట్లుదిన్లా. మాయత్త నోరంటే నోరుగాదది. నామొగుడు వోల్లమ్మ ముందర నోరుగూడా దెరవడు. ఎప్పుడన్నా తెర్సినా నన్ను దిట్టేదానికే. వుత్త దద్దమ్మ. మూడురాత్తుర్లు జరక్కముందే నాకుదెల్సిపొయ్యింది… పెద్దగాండ్లపొయ్యిలోకొచ్చి పడ్నానని.

పెండ్లయ్యిన మర్రోజే మాయత్త మా మొగుడూపెళ్ళాలు పొణుకోనుండారని గూడా సూడకుండా పొరకతో దెమదెమా తలుపును గొడ్తా సెత్తదోస్తా వుండాది. పంజేసుకుంటా కొడ్తావుండాదేమో అనుకోని మల్లా ముడుక్కోని పొణుకున్నా. నేను లేశి బైటికొచ్చేదాకా ఆడ్నే తోస్తా వుండాది. లేశొస్తానే  “అప్పుడే లేసేస్తివా…బాయికాడికి బొయ్యి రెండు బిందెలు నీల్లుదెచ్చి అండాలోబోసి నీల్లకిందట్ట మంటెయ్యి..బిన్నిగా నీల్లుబోసుకోని దీప్ము బెట్టెయ్యి. మల్లి మనిద్దురూ అన్నం జేసుకుందారని’’….నవ్వతా నవ్వతా పనంతా నాతోనే జేపిచ్చేసింది మాయత్త.

మెట్నిల్లుగదా… పనిజేస్తే తప్పేవుండాదిలే అని జుట్టు ముడేసుకోని మాయత్త దగ్గిర పొరక దీసుకున్నా. పనంతా అయిపొయ్యినాక వంటింట్లోకి బొయ్యి ఏంజేద్దామత్తా టిపనుకి అంటె సద్దుండాది తాగెయ్యి..కూరేమన్నా జేసుకుందారి మద్దేనానికి అనింది. కొత్తపెల్లికూతురికిఎవురన్నా సద్దిబోస్తారా…? నా నోరట్టా తెరసక పొయ్యింది. ఇంగేం జేసేది…అత్తయ్యి పొయ్యె..వొచ్చి వొకరోజైనా కాలా…  ఏంటికి జగడాలేసుకునేదని గొమ్మునైపొయ్నా. ఏదో వొగిటి తినేసి..కూరజేద్దారని పప్పేడుందో ఎతకతా వుండా.. నేందెచ్చిస్తా వుండని చాటెత్తుకోని వొంటిల్లుకానుకోనుండే రూము బీగాలు దీసుకోని లోపలికి బొయ్యింది. నేంగూడా యనకమ్మిడి పొయ్యినా..

లోపలంతా దొంతులు పేర్శి పెట్టిండాది. వొగొయిటే దించి కొంచుం పప్పు, లెక్కేశి నాలుగు మిరక్కాయిలు, తెలగెడ్డ వొల్చి రొండు రెబ్బలు, కొంచుం తిరగబాత సామాను వొక శిబ్బిడిలో యేశి ఇచ్చింది. గొమ్మునే తీస్కోని బైటికొచ్చినా.. నా యెనకాలే వొచ్చేసి మల్లీ బీగాలేసేసింది. బొంతాడుకి బీగాలు తగిలిచ్చుకోనుండాది. అప్పుట్నుంచి ఒక పదేండ్లు ఆ గడపలో  సంసారం జెయ్యాలంటే సావే నాకు.

కూల్ది మాదిరి తెల్లారి లేస్తే నడిజాము దాకా పనిజేస్తానే వుండాల. యెప్పుడన్నా యేమారి కుచ్చున్నానంటే లంజల మాటే మాటాడ్తాది మాయత్త. పొరకతో గొట్తా..ఛాటతో గొట్తా…చెప్తో గొట్తా … అంటా కుక్కమింద పిల్లి మింద సాకు బెట్టుకోని తిడ్తానే వుంటాది.

ఇంతాజేసి ఇంట్లో యామన్నా సొంతముందా అంటె అదీలే..నూనెసుక్క, శెనిగ్గింజె గూడా బొంతాడుకుండే బీగాలు దీసి ఇస్తేనే గెతి. ఒకసుక్క నూని జాస్తిబోసి యేవన్నా జేసేస్తే ఇంగంతే. ఈదాట్లు ఆడేస్తాది. జుట్టుబట్టుకోని ఈపుమింద గుద్దిగుద్ది నడుములు ఇరగ్గొటేస్తింది. పనంతా ఐపొయ్యినాక ఎప్పుడన్నా టీవీ ముందర కుచ్చుంటే సాలు…వొచ్చి టీవీ ఆపుజేసేసి యాదోవొగ పనిజెప్తింది. నేనెప్పుడు యేం జెయ్యాలనేది ఐవోరి మాదిరి ఒగదానియెనకాల వొగిటి జెప్తానే వుంటింది. బొట్టుగట్నోడన్నా అన్ని నీల్లు బోస్తాడంటే ..అయ్యోరామ! యెప్పుడూ అమ్మకొంగు బట్టుకోని తిరగతావుంటాడు. సావుకో, దినాలకో వూరికి బొయ్యిందంటే  నన్నెట్ట మెడ్తోగొట్టాలో జెప్పిచ్చేసి బోతాది. థూ.. ఈ బతుకు బతికేదానికంటే వడిశాకు మింగి సస్తేనే మేలు. వొగిటికి నలుగురు బిడ్లుండారు..అందురూ అవ్వ సుట్లానే తిరగతా వుంటారు.వీల్లకు నేనో కూలిది…అంతే..

ఆడికో అమాసకో మొగునిపక్కన పొనుకుంటే ఆడాణ్ణే తిరగతా  వుంటింది. ఎందురు బిడ్లను కనాలనేది గూడా మాయత్తే జెప్పింది. నెలదప్పినప్పిట్నించి ఒగ మాత్తర మింగింది లేదు… ఆసుపత్రికి బొయ్యింది లేదు. అన్నీ ఇంట్లోనే. నెలదప్పినప్పుడు గానిగాడే పన్లు వొచ్చేస్తే పచ్చి పరిందికాయి తినిపిచ్చేసి కడుపు తీసేస్తింది. కనిండేది నలుగుర్నయితే..పొయ్యిండేది మూడు. వొద్దంటె ఇనేది యొవురు??

పిండాకాపుగ్గూడా …ఎవురు జస్తారా…యాడ దినాలకాడికి పొయ్యి తిందామా అని కాస్కోనుంటావుండా…ఈ ముసిల్ది అట్టగూడా నన్ను తిన్నీకుండా ఆడిగ్గూడా ఎలబారి పూడస్తాది. ఎట్టజచ్చేది??

పంచాయితీలు బెట్టి మాట్టాడిస్తే గూడా లాభంలా…ఇట్టగాదని నేనే నోరు అడ్డమేసుకోని ఎంతమాటోస్తే అంత మాట అనేసేది మొదులుబెట్నా..అట్ట అత్తదగ్గిరా…ఇట్ట మొగుడి దెగ్గిరా ఈపు పగిలిపొయ్యేది. బొట్టుగట్టిన ముండాకొడుకు నలుగురు బిడ్లను కనిచ్చినానన్న అరువు గూడా లేకుండా కుక్కకంటే ఈనంగా ఇదిలిచ్చి కొడ్తా అమ్మను యెనకేస్కోని వొచ్చి ఇంట్లో నుండి పోవయ్ అనె..

యాడికి బొయ్యేది  నేను ? మొగుడ్ని వొదిలేసి పుట్టింటికి బోతే పొరకదెబ్బలే… కస్టంవొచ్చిందని  మాయమ్మోల్లు కడుపులో బెట్టుకుంటే గూడా వూల్లోల్లు గొమ్మునే వుంటారా ? వయసుకొచ్చిన ఆడది వొంటిగా వుంటే వూర్లో యెదవల కండ్లన్నీ దానిమీదే గదా ? అమ్మగారింట్లో బాగుంటే నేనీడ యెందుకు ఇట్ట సస్తా?

ముసిల్దానికి యాదన్నా మందు బెట్టాల అని, మాయమ్మతో జెప్తే ఎవురో ఐవోరి దెగ్గిర మందు దెచ్చిచ్చింది. మంతరమేసిన  ఎండు  నిమ్మకాయ  పొట్టు .. అత్తకు దెలీకుండా అన్నం లో, కూర్లో కలిపి నలభై ఐదు దినాలు తినిపిచ్చేసినా.అదిగూడా పనిజెయ్యలా..

కాపురానికొచ్చిన పదేండ్లలో నాకు దెల్సిందొగిటే…మాయత్త ఎవురికీ బైపడ్దు. దేవుడొచ్చినోల్లకు…దెయ్యమొచ్చినోల్లకు తప్ప. యింట్లోకి దెయ్యాలు రాకుండా రాగిరేకులు బెట్టిచ్చేది , నిమ్మకాయిలు కట్టిచ్చేది జాస్తి . పిలకాయిలికి వొల్లు  బాగలేకపోతే గాలి బట్టుకునేసిందని మెళ్ళో మంత్రించిన దండేసి , దిస్టిదీసి ఎర్నీల్లు మూడు దోవల మద్దెలో బొయిపిస్తింది .

అట్నే వూర్లో  యాడ ఎవురికి దేముడు వొంటి మీదికి వొచ్చినా మాయత్త ఆడికి పూడిస్తింది . పూజబెట్టి , కర్పూరం దిగదీసి దేముడు దిగిపోయ్యేదాకా ఆడ్నే వుండేసి  వొస్తింది . ఆమికి ఏందన్నా బాదుంటే  చెప్పుకోని జవాబులు దీసుకుంటింది . రావుకాలం ,అమావాస్య పూజలు  జెయిపిస్తింది . పడవ పడిపొయ్నా ఈపన్లు మాత్రం సచ్చినా నిలపదు . నేను మాయత్తను బైపడిచ్చాలంటే నన్ను దేవుడన్నా పూనాల…లాకపోతే దయ్యమన్నా పట్టుకోవాల.

 ***

  ఆదినం మావూర్లో కొన్నిండ్లు అంటుకునేసినాయి..ఎవురో బీడీ తాగేశి పూరింటిపైన పారేశింటారు…వూరికేదో ఐపొయ్యిందని అందురూ ఎవురికొచ్చిన కతలు వాల్లు  చెప్పుకునేస్తావుండారు…మాఇల్లు మిద్దిల్లే …ముందరే ఇంగో సుట్టిల్లుంది…బోదిల్లు. మాయత్త ఫానేసుకోని మిద్దింట్లో పొనుకుంటే నేను నడ్జాము దాకా పంజేసి ఆ సుట్టింట్లో పొనుకోవాల. ఈఇల్లు అంటుకోని కాలిపూల్లేదే అని అనిపిచ్చింది. మాయత్తను బయిపడిచ్చల్లంటే ఇప్పుడైతేనే సరిగ్గా వుంటింది అనుకోని..కాపీబెట్టుకోని వొస్తావొస్తా పొరకపుల్ల వొగిటి అంటిచ్చి బోదలో గుచ్చేసి వొచ్చేసినా. మాయత్త కాపీదాగతా…ఎవురన్నా శాతబడి జేస్తేనే దెయ్యాలొచ్చి అట్ట ఇండ్లంటిచ్చేస్తాయని జెప్తావుంది. నేనా సుట్టిల్లుని జూస్తా ఇంటావుండా…అంటుకునేసింది. మాయత్త భయిపడింది ఆదినం జూసినా నేను.. నాకప్పుడొచ్చింది పదేండ్లు నాకు గెవనం లేని నొవ్వు. పొండ్లు బిగబట్టుకుంటే కూడా నోరు టకటకా కొట్టుకుంటాండాది. మాయత్త ఈసారి నన్ను జూశేశింది. ఏంటికి మేయ్ అట్ట నవ్వతా వుండావు..మూస్కో ఇంగ అనింది. ఇంకొంచుం గెట్టిగా నొవ్వినా.. ఆదినం కొంపలో గూడా ఎవురూ లేరు. చెయ్యెత్తుకోని కొట్టేదానికి నాదెగ్గిరికి వొచ్చింది. చెయ్యట్నే పట్టుకోని ఇంగా గెట్టిగా నొవ్వినా…నాకు దెయ్యం బట్టేసిందని అరస్తా పరిగెత్తింది బైటికి. నొవ్వినొవ్వి దొక్కనొప్పొచ్చేసి అట్నే పడిపొయ్యి నిద్దరబొయ్యినా. లేసినాక భయిం భయింగా వొచ్చి ఏమైందే నీకు?? గాలేమన్న సోకిందా అనింది. ఏం తెలీనట్టు బిత్తర సూపులు జూసినా..మల్లొక వారం దినాలు….నామీదకు చెయ్యెత్తలా..

ఇంటికెవురన్నా వొస్తే నాకు దెయ్యంబట్టిందని గుసగుసగా జెప్పేది నేను ఇనిండా. వారం దినాలికి మల్లీ పెత్తనం జేసేదానికి జూస్తే నాకింకోసారి దెయ్యమొచ్చి తిక్క కుదిరిచ్చింది. ఇట్టగాదని మాయత్త దయ్యాలొదిలిచ్చే వోల్లను పిల్చుకోనొచ్చి నన్ను సావగొట్టించే పనిబట్టింది. ఆ దెబ్బలు బరించేదానికి నావల్ల గాలా. ఆనాబట్లొచ్చి ఇది మొండిదెయ్యం…బాగా దెబ్బలుబడ్తేగానీ వొదల్దు అని యాపాకులు, యాప సులగ దెచ్చి నేను యాడస్తా, పరిగిత్తా వుంటేగూడా వొదలకుండా యాడివాడ ఇరగ్గొటేస్తా వుండ్రి. నాకు బట్టిండేది శానా మొండిదెయ్యం. మాయత్త దెయ్యం కొంపలోనుండిబోతేనే నాగ్గూడా దెయ్యం వొదిలేది. కొన్నిదినాలు దెబ్బలు వోర్సుకున్నా…ఇంగ నావల్ల గాలా .

దెయ్యాన్ని పంపించేసి మల్లీ కూలి పని మొదులుబెట్నా..దెయ్యాన్ని నావొంట్లోనించి తరిమేసినాక మాయత్త కొంపలో పూజ్జేసేది ఎక్కువైపోయ..నాపని మల్లీ మొదిటికొచ్చేసింది.

ఈతూరి ఇట్టగాదని మాయత్త పూజ్జేసే రెండ్రోజులూ సాయంకాలమైతే వూగడం మొదులుబెట్నా… మల్లీ  దయ్యాన్ని తరిమేసే  మంత్రగాల్లు వొచ్చేసినారు . యాపమండ తో  ఒకదెబ్బ పడిందో లేదో ‘దేముడో  దెయ్యమో  తెల్దారా నా బట్టల్లారా … అమ్మోరిమిందనే సెయ్యెత్తినారా … మీ బతుకులు అగ్గయ్యి పోతాయిరా ‘ అని ఉరిమి చూసినా . దెబ్బకు నాకాల్లు బట్టుకోని తిరిగి  మల్లి  సూడకుండా  పరిగెత్తినారు  నాకొడుకులు. ఈసారి నాకు దేముడొచ్చింది…అమ్మోరు…అంకాలమ్మ. “సేయ్ ఎంగిటీ “అంటే మాయత్త  పరిగెత్తుకోనొస్తింది. నాకిప్పుడు కోడ్నికోసి వొండిపెట్టంటే గెంటగొట్టే లోపల గిన్నె నా ముందరుంటింది. నాకిప్పుడు పట్టుకోక గట్టి , బీరువలో బంగారు బొంతాడు తెచ్చి యెయ్మంటే, తెచ్చిచ్చి పూజ గూడా జేస్తింది. నాక్కోప్మొస్తే కర్పూరం చెయ్యిపైన ఎలిగిచ్చేసి దిగదీస్తింది. నేనిప్పుడు మాయత్తకు, నా మొగుడికి దేముడు.

మొన్నీమద్దె మాయత్త పెళ్ళో ఇరగబడి తుంటి ఇరగ్గొట్టుకునింది. మాయత్త బొంతాడు బీగాలు ఇప్పుడు నా తిత్తిలో ఉండాయి. మొగుడు, పిలకాయిలు నాతో బాగనే మాట్టాడ్తా వుండారు. నా ఇంట్లో పెత్తనమంతా నాదే.  నాకిప్పుడు పెండ్లయ్యి మల్లీ కొత్తపెల్లికూతురైనట్టు వుండాది. ఇప్పుడీ కొంపంతా నాదే..నన్ను కొట్టేవోల్లు, తిట్టేవోల్లు ఎవురూలేరు. ఇప్పుటికి నెమ్మతైపొయ్యింది నాకు. నా పని నేంజేసుకుంటా..నాకు ఇస్టమొచ్చింది వొండుకోని తింటా..దేముడొచ్చినట్టు నాటకాలు ఎయ్లేక ఇంగ నిలిపేద్దారా అనిపిస్తింది.గానీ నాబతుకు నాగ్గావాలంటే నేనీ పని  జెయ్యాల్సిందే.

మా ఇంటికొచ్చిన డాకట్రు జెప్పినాడు…వొల్లు నీరసించిపోతే ఇట్టాంటి దయ్యాలు, దేవుల్లు వొచ్చినట్టు అనిపిస్తిందంట. నేను వీల్ల దెగ్గిర తన్నులు తప్పించుకునేదానికి దేవుడమ్మ అయిపొయ్యినా..

దొంగ దేవుడమ్మనే నేను. కానీ ఈ ఇసయం మన మద్దెనే వుండాల. మాకొంపలో వోల్లకు తెలీగూడ్దు. కస్టమొస్తే వురేసుకునేవోల్లను నేను శానామందినే జూసిండా. నేనుగూడా యాడస్తా నా బతుకింగ ఇంతే అనుకొనింటే ఆరోజుకి యెత్తేసి నామొగుడికి ఇంగో పెల్లాన్ని తెచ్చేసింటాది మాయత్త. ఏదోవొగ యాసమేసి దేవుడిచ్చిన బతుకుని ముగిసిపొయ్యేదాక ఈదల్ల.

 

  పాపుదేశి ఝాన్సీ

ఫోటో కర్టెసీ : కందుకూరి రమేష్ బాబు

 

 

 

మీ మాటలు

  1. manibhushan says:

    బాగుంది. ఇలాంటి కేరక్టర్ ఒకటి నాకు తెలుసు. కోడళ్ళను కూతుళ్ళలా చూడ(లే)ని అత్తలకు ఇదే మందు. కనీసం దేవుళ్ళు ఈ రకంగానైనా ఒంటిపైకి వచ్చి ఆదుకుంటుంటారు!
    ఆద్యంతం యాసను కొనసాగించడం కష్టం. అలాంటిది సునాయాసంగా పాఠకుల్ని చిత్తూరుకి తీసుకెళ్ళారు రచయిత్రి.

  2. Prasad Bhoja says:

    చాలా బాగా రాసారు ఝాన్సీ గారు … దేవుడు ఇలాగ కూడా ఉపయోగపడడం బాగుంది… మీ చిత్తూరు యాస బాగుంది.
    మీరు ఇంకా ఇలాంటి కథలు రాయాలి..

  3. చాలా బాగా వ్రాశారు.

  4. ఝాన్సీ గారూ,
    చాలా బాగుంది కథ. లోకంలో దేవుడమ్మ లాంటి వాళ్ళు ముఖ్యంగా పల్లెల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. బాధల నుండి తప్పించుకోవడానికి కొందరు, గుర్తింపు కోసం కొందరు ఇలా ప్రవర్తిస్తూ బ్రతుకుని సాగిస్తున్నారు. జాలేస్తుంది వాళ్ళని చూస్తుంటే.

  5. సాయి పద్మ says:

    ఝాన్సీ గారు, చాలా మంచి కధ. ఇలాంటి వాళ్ళు మాకు కూడా తెలుసు . ఇది పెరిగి హిస్టీరియా గా మారిన కేసులు కూడా .. కానీ మీరు కధ చెప్పిన తీరు, చిత్తూరు యాస .. దేవుడమ్మ కి జీవం పోశాయి .. మరిన్ని మంచి కధలు ఆశిస్తూ

  6. మా ఊర్లో మాట్లాడుకొనే యాస యిదీ. మా ఊరికిపోయోచినట్టుగా ఉంది మేడం ఈ కథ..
    నేను మా ఊర్లో బాతరామ్మను చిన్నపుడు చూసాను. ఆమె అంటే మా ఊర్లో అందరికి చానా భక్తి. మాది కాణిపాకం దగ్గర ఐరాల మండలం .. మా ఊర్లో మా చుట్టాలందరూ మాట్లాడుకొనే తీరు కళ్ళకు కట్టినట్లు వర్నిచారు..మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
    నేను ఇంతకముందు సన్నపురెడ్డి వెంకట రెడ్డి గారి రాయలసీమ యాసతో రాసిన కథలు చదివాను. ఇది మాత్రం నా మనసుకి ఇట్ట్నే నచ్చేసింది . ఒన్స్ అగియన్ తనక్ యు వేరి మచ్ ..

  7. sreelathakovi says:

    సూపర్బ్ ఝాన్సక్క బలే గుంది కథ చినప్పుడు గొల్లపల్లి లో మిద్దిపిన పండుకుని మనం ఆరట్లు కొడత(మొండిచయ్యి)కధలు నువ్వు చప్టా ఉంటే నాను బిక్కుబిక్కు మంతా పండుకుంట ఉన్నా కదా…

  8. mogirala lakshmi prasad says:

    చిత్తూర్ యాస లో మీరు చాల బాగా రాస్తునారు. ఇంతకు ముందు నా కథ రాసారు, ఈ దేవుడమ్మ ఎవరు మేడం.?. మీరు ఇతరుల ఫీలింగ్స్ ని బాగా అర్థం చేసుకొని, రాయడం లో మీరు స్పెసిలిస్ట్ . కొనసాగించండి. ఆల్ ధీ బెస్ట్ .

Leave a Reply to manibhushan Cancel reply

*