మరణ మజిలీ

541392_4595388722851_1575449086_n
కథ ఎప్పుడూ అలానే ఎందుకు రాయాలి.. ఇలా ఎందుకు రాయకూడదు అని ప్రశ్నించే మహా టెక్కు ఉన్న కథ ఇది. సరికొత్త ఫార్మెట్‌తో మన ముందుకు వచ్చిన వాసుదేవ్‌ అసలు పేరు శ్రీనివాస్‌. మొదటి కథ ‘అమ్మకానికో మనసు’ ఉదయం పత్రిక ఆదివారం అనుబంధంలో 1997లో ప్రచురితమైంది. ఇప్పటిదాక పది కథలు రాశారు. కవిగా కూడా గుర్తింపు పొందారు. ఈమధ్యే ఆయన కవిత్వానికి మెచ్చి “Poesiesonline” (ఫేస్‌బుక్‌లోని ఇంటర్నేషనల్‌ పోయిట్రీ గ్రూప్‌ ) అనే సంస్థ ‘అవుట్‌ స్టాండింగ్ పోయెట్‌ ఆఫ్‌ది ఇయర్‌ `2013’ అవార్డు ఇచ్చింది. సొంత ఊరు వైజాగ్‌. పదిహేడేళ్లపాటు విదేశాల్లో ఉండి వివిధ కాలేజిల్లో ఇంగ్లీష్‌ బోధించారు. ప్రస్తుతం ఇండియా వచ్చేసి బెంగుళూరులో ఉంటున్నారు.   –వేంపల్లె షరీఫ్ 
***

జరిగిన కథ

సాహితీ లోకంలొ చీకటి కోణాలకి విలువెక్కువె.  రైటర్ ఫిక్సింగ్ లూ, స్టోరీ ఎరేంజ్‌‌మెంట్లకీ తెలుగు సాహిత్యం  మినహాయింపుకాదన్నది నిఖార్సయిన నిజం. పాఠకులకి తెలియనివీ, తెలిస్తె అబ్బురపర్చేవీ చాలానే ఉంటాయి… ఓటమికీ, అనుభవానికీ ఉన్న అవినాభావసంబంధం తెలుగు కథలకీ పెద్ద సోర్స్. బహిరంగ రహస్యాలే  కొన్ని కథలకి పెద్ద వ్యాపారం. తెలుగుసాహితీ లోకంలో ప్రదీప్ ఇంతలా వెలిగిపోవటానికి ముందు అతనో ఘోస్ట్ రైటర్. రాఘవదాస్ అనే ఓ ప్రముఖ (?) రచయితకి రాస్తూ ఇద్దరూ సంపాదించేవారు. రాఘవదాస్ కున్న కాంటాక్ట్స్, ప్రదీప్ రచనా శక్తీ ఇద్దరు కల్సి విజయవంతంకావటంలో ఆశ్చర్యంలేదు. కానీ అలా ఎల్లకాలం జరగదు-జరిగితే అది జీవితం అవ్వదు.

జీవితానికి కథ అవసరంలేదు కాని కథకి జీవితమే సోర్స్.  రానూ రాను రాఘవదాస్ ప్రదీప్ కివ్వాల్సిన వాటా రెమ్యూనరెషన్ తగ్గించటం, అది సహజంగానే ప్రదీప్ కి నచ్చకపోవటం- ఇద్దరి మధ్యా అగాధానికి ఎక్కువకాలం పట్టలేదు. కలాన్నీ, కీబోర్డ్ ని నమ్ముకున్న ప్రదీప్ పరిస్థితి దయనీయంగా తయారయింది. అంతకుముందు తను రాసిన మరో ముగ్గురు రచయితలని కల్సి వివరించాడు. వాళ్ళు కొంతిచ్చారు. మళ్ళీ రాయమన్నారు. కొంతమంది పూర్తిగా రాఘవదాస్ కి రాయటం మానేస్తేనే మళ్ళీ బిజినెస్ మాట్లాడతామన్నారు. ఇప్పుడు రాత్రీ పగలు అందరికీ రాస్తున్నాడు. ఎవరేం అడిగితే అది…కథలకోసం శ్రమిస్తున్న  ప్రదీప్ జీవితంలో అప్పుడే ఓ అద్భుతం–తన కజిన్ ఇంద్రాణి రూపంలొ అతనికి అదృష్టం కలిసొచ్చింది.

ఇంద్రాణి– ఓ అద్భుతం ఈ ప్రపంచంలో! తన అందచందాలని ఎన్ని రకాలుగా ఈ ప్రపంచంలో వాడుకోవచ్చో ఆమెకి తెల్సినట్టుగా

పమేలా బోర్డెస్ కి కూడా తెలియదంటె ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ప్రదీప్ తన ఘోస్ట్ అవతారం చాలించి తనంతట తాను కథలు రాయడానికి ఇంద్రాణి మాత్రమే అతిపెద్ద ఉత్పత్తిస్థానం. రోజుకో కథ చెప్తుంది అతనికి.ఇంద్రాణి కథలకి సోర్సేంటో తెలుసుకోవాలనే కుతూహలం ఉండొచ్చు కానీ తొందరపాటు అనవసరం. ఇప్పుడు ప్రదీప్ ఓ ప్రముఖ రచయిత. డబ్బుతో కొనగలిగినవన్నీ ఉన్నాయతని దగ్గర. సమాజంలో అతనో సెలబ్రిటీ . తన చివరి “రచనని” ఓ సీరియల్ గా రాస్తున్నాడు. దీనికి “మరణమజిలీ” అని పేరుపెట్టుకున్నాడు. సిక్‌‌యూనిట్ గా తయారైన ఓ పత్రిక ఈ సీరియల్ తో బాగా పుంజుకుంది. పత్రికని మూసేద్దామనుకున్న తరుణంలొ ప్రదీప్ సీరియల్ ఓ మహాద్భుతాన్నే సృష్టించింది. దీనికి మరో ముఖ్యకారణం ఆ సీరియల్‌‌కి ట్యాగ్‌‌లైన్‌‌గా “యధార్ధ సంఘటనల ఆధారంగా” అని రాయటమే! ఇదే ప్రదీప్ ఆఖరి రచన అని ఆ పత్రిక నెలానెలా ప్రముఖంగా పచురించటం కొసమెరుపు…..ఇక చదవండి

 ’మరణమజిలీ’ సీరియల్ ప్రచురిస్తున్న పత్రికాఫీసునుంచి ఓ రోజు ప్రదీప్‌కి ఫోన్.

10.30కి పత్రికాఫీసుకి చేరుకున్నాడు ప్రదీప్.

చీఫ్ ఎడిటర్ రెడ్డిగారి ఛాంబర్‌లో సినిమా ప్రొడ్యూసర్ కోటేశ్వర్రావు కూడా ఉండడం కొంచెం ఆశ్చర్యమనిపించినా అతనితో ఉన్న పూర్వ పరిచయంతో ఇరువుర్ని విష్‌చేసి కూర్చున్నాడు ప్రదీప్.

“ప్రదీప్! నీ సీరియల్‌ని మన కోటేశ్వర్రావుగారు కొనుక్కుంటారటయ్యా, దాని గురించే మాట్లాడ్డానికే నిన్ను పిలిపించాం.” రెడ్డిగారి ఉపోద్ఘాతం.

“అవునయ్యా ప్రదీప్, నీ సీరియల్‌కి నువ్వెంత అడిగితే అంతిస్తానయ్యా, కానీ మన డీల్ కుదరటనికి ముందర నా ప్రశ్నలకి నీనుంచి సమాధానం కావాలి, నిజాయితీగా” కోటేశ్వర్రావు విషయానికొచ్చేశాడు.

“అడగండి” ప్రదీప్ నవ్వుతూనే ముక్తసరిగా జవాబిచ్చాడు. అతను ఏం అడగదల్చుకున్నాడో ప్రదీప్ ఊహించాడు. ఈ రోజుల్లో హిట్టయిన ప్రతీ సినిమా కథపై ఓ కాంట్రవర్శీ ఉంటోంది. ఫలానా సినిమా కథ నాదేనని, కాపీ కొట్టారని, నాకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని కొంతమంది కోర్టులకెక్కటం, కొందరు మీడియా ముందుకు రావటం రొటీన్ అయ్యింది ఈ మధ్య. కోటేశ్వర్రావు కూడా ప్రొడ్యూసరె కాబట్టి రిస్క్ లేని విధంగా జాగ్రత్తపడుతున్నాడన్పించింది ప్రదీప్‌కి. అయితే తనూహించని ప్రశ్నలొచ్చాయి.

“ఏమయ్యా ప్రదీప్! నువ్వు ఇంతకు ముందు వేరే రచయితలకి రాసేవాడివని విన్నాను. అదేనయ్యా ఘోస్ట్‌రైటర్ ఉద్యోగం. నాకు ఎన్నాళ్ళనుంచో కొన్ని సందేహాలున్నాయి. అసలీ ఘోస్ట్‌రైటర్స్ ఎందుకుంటారు, వాళ్ళే రాయొచ్చుగా స్వంతంగా? ఎవరికో రాసిపెట్టి డబ్బులకోసం వాళ్ళని దేబిరించరటం, డబ్బు, పేరు మరెవరొ తీస్కోవటం, ఏంటిదంతా? సో ఇన్నాళ్ళకి నాకు సమాధానం చెప్పేమనిషి దొరికాడని ఆనందంగా ఉందయ్యా!”

ప్రదీప్ ఏం మాట్లాడలేదు. ఓ చిర్నవ్వు నవ్వి సాలోచనగా ఛీఫ్ ఎడిటర్ రెడ్డిగారివైపు చూశాడు. వెంటనే కోటేశ్వర్రావుకి ఏంచెయ్యాలో అర్ధమయింది. తన బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేసులోంచి ఓ చెక్‌బుక్ తీసి అందులోంచి ఓ లీఫ్ చింపి దానిపై సంతకం చేసి ప్రదీప్ ముందుకితోసి “” నీ నిశ్శబ్దం నాకర్ధమయిందయ్యా, ఇదిగో బ్లాంక్ చెక్.సీరియల్‌గా వస్తున్న నీ కథని నేను కొనుక్కుంటున్నా. ఎంత కావాలో దానిపై రాసుకో.”

ప్రదీప్ ఏం మాట్లాడకుండా చెక్ తీస్కుని జేబులో వేస్కున్నాడు.

  **ప్రదీప్ చెప్పిన కథలు**

 “హు! ఇప్పుడు చెప్పవయ్యా!” రెడ్డిగారు కొంచెం రిలాక్సయ్యారు కుర్చీలో వెనక్కి వాలుతూ.

“ఈ ప్రపంచంలో డబ్బెవరికి చేదు చెప్పండి. ఓ వ్యక్తి ఘోస్ట్ రైటర్‌గా తయారవ్వటానికి అన్నిటికన్న ప్రధానకారణం డబ్బే, ఆ తర్వాత చాలానే ఉన్నాయి కొంతమంది రాస్తారు కాని వాళ్ళ రచనలు పబ్లిష్ అవుతాయో, లేదోననే ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. అలాంటివారు అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన రచయితలకి, రచయిత్రులకి రాసి పరీక్షించుకుంటారు. ఆ తర్వాత వారిచ్చే రెమ్యూనరేషన్‌తో సంతృప్తిపడిపోతూ వాళ్ళే నేరుగా ప్రయత్నించడమనే ఆలోచనే చెయ్యరు. మరికొందరికి వ్యక్తిగత ప్రచారం నచ్చదు. వాళ్ళ ఫోటోలు ఎక్కడా ప్రింట్ అవ్వటం కాని రేడియో, టీవీల్లో ఇంటర్వ్యూలకి కూడా ఇష్టపడరు. వారికి బ్రహ్మాండంగా రాసే స్కిల్ ఉంటుంది. వారు కూడా ఇలానే వేరే వారికి రాసి పెడ్తూంటారు. వీరికి కూడా డబ్బే ముఖ్యం.

ఇకపోతే కొంతమందికి భాషపై మంచి పట్టు ఉంటుంది.కథకి ప్లాట్ అంత సులభం కాదు వీళ్ళకి. కథల కోసం రకరకాలుగా ప్రయత్నించి వివిధ సొర్సస్ ద్వారా మంచి కథల్ని సంపాదించి వాటికి తమ భాషా పరిజ్ఞానాన్ని జోడించి వేరే వారికిస్తారు. ఒకటి, రెండు కథలు క్లిక్కయాక ఇంక మరి వేరే వాటికోసం ఆలోచించరు. రాస్తునే ఉంటారు,రాసి ఇస్తూనే ఉంటారు ఎవరడిగితే వాళ్ళకి, ఏది కావాలంటే అది.” ప్రదీప్ ఆగాడు.

“ఆ, ఇక్కడే నాకర్ధంకాని విషయం. అంత టాలెంట్ ఉన్నవ్యక్తి, ఆ టాలెంట్ ప్రూవ్ అయ్యాక అయినా స్వంతంగా రాసి మెత్తం రెమ్యూనరేషన్ తనే తీస్కోవచ్చుగా, పైగా సంఘంలో బోలెడంత పేరు, సన్మానాలు వగైరా…” కోటేశ్వర్రావు ఆ పాయింట్‌పై చాలా ఆసక్తి కన్పడుస్తున్నాడని ప్రదీప్‌కి అర్ధమయ్యింది.

“ఆ! మంచి పశ్న. ఒక్కసారి ఘోస్ట్ అవతారం చాలించి తనే స్వయంగా పబ్లిష్ చేసుకోవడంలో చాలా రిస్క్ ఉంది, కోటేశ్వర్రావుగారూ! అది అంత సులభంకాదు.మీకు తెలియందేముంది, కళా రంగంలో సెంటిమెంట్ పాత్ర చాలా ఎక్కువ. ఏ సినిమా ఎందుకన్నాళ్ళు ఆడుతుందో, ఓ మంచి సినిమా ఎందుకు ఫెయిలవుతుందో తెలీనట్లే ఏ రచన, ఏ రచయిత ఎందుకు పాప్యులర్ అవుతాడో, ఒక్కో రచయిత ఎందుకు వెలుగుచూడడో అర్ధంకాదు. అంతవరకూ ఘోస్ట్ రైటర్ గా ఉన్నవ్యక్తి, ఐమీన్ రచయిత వెళ్ళి నేను ఫలానా వాళ్ళందరికీ ఘోస్ట్ రైటర్‌గా రాస్తున్నాను, ఇక ఇప్పట్నుంచీ నేను నా పేరుమీదే రాస్తానంటే ఏ ఎడిటరూ ఆసక్తి చూపరు సరికదా మొదటి మోసం వచ్చే పరిస్థితి. పోనీ పోస్ట్‌లో పంపించి తన అదృష్టాన్ని పరీక్షుంచుకునే ఓపిక, టైమూ ఉండవు డబ్బు యావలో పడిపోయిన ఈ రచయితలకి. అదే మార్కెట్‌లో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా రాసేస్తున్న వారికివ్వటం, అవి వెంటనే పబ్లిష్ అవ్వటం, నెల రెండు నెలల్లోపే రెమ్యూనరేషన్ అందుకోవటం జరుగుతుంది.ఒక్కేసారి ఈ రచయితలు తమ ఘోస్ట్ లకి, కథ అందుకోగానే ఎంతోకొంత ఇవ్వటం కూడా పరిపాటి. ఇంకేం కావాలి చెప్పండి?” ప్రదీప్ ఆపాడు. రెడ్డిగారు, కోటేశ్వర్రావు అలా చేష్టలుడిగి అతని వాక్ప్రవాహాన్ని చూస్తూ వింటున్నారు.

“మీకు మరో విషయం, ఈ సో-కాల్డ్ ప్రముఖ రచయితల్లో స్త్రీలు, అంటే రచయిత్రులు ఎక్కువగా ఘోస్ట్‌లన్ని ఆశ్రయిస్తారు. కొంతమంది రచయిత్రులకి వారి భర్తే రాసి పెడతాదు లేదా నాలాంటి ఫేక్స్‌ని అరేంజ్‌చేస్తారు. ఇలాంటి రచయిత్రుల్లో కేవలం కథలు రాసేవారే కాదు “మీరడగండి–నేచెప్పేస్తా”, “మీరు ముడేయ్యండి–నే విప్పేస్తా” లాంటి శీర్షికలు నిర్వహించే వారుకూడా నా లాంటివారితో రాయిస్తారని మీకు తెలీదు. ఈ ప్రాక్టీస్ కేవలం తెలుగులోనే అనుకునేరు, తెలుగులో కంటే ఇది మన నార్త్‌లో ఇంగ్లీష్‌లో రాసే రచయితల్లో చాలా ఎక్కువ. సోషల్ సెలబ్రిటీస్‌గా చెలామణి అవుతున్న చాలా మంది ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని తెలివైన స్టూడెంట్స్‌కి డబ్బు ఎరచూపి వాళ్ళచేత ఆర్టికల్స్ రాయించి తమపేరు మీద పబ్లిష్ చేయించుకుంటారట. ఈ సెలబ్రిటీస్‌కి పబ్లిషర్స్‌తో మాంచి యాక్సెసబిలిటీ ఉంటుంది, ఇక మీకు చెప్పేదేముంది. మీకు మరోషాకింగ్ న్యూస్. ఇలా మనం ముగ్గురం చేరి ఆడాళ్ళ తెలివితేటల గురించి తక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఘోస్ట్ రైటర్స్‌లో పురుషులకంటే స్త్రీల సంఖ్యే ఎక్కువ అంటె నమ్ముతారా?”

రెడ్డిగారేం మాట్లాడే స్థితిలో లేడు.

కోటేశ్వర్రావు తేరుకున్నాడు.  తెలివైనవాడు, బిజినెస్ తెల్సినవాడు.

“సరేనయ్యా ప్రదీప్ మా సినిమా వాళ్ళ కష్టాలు నీకు తెల్సుగా, ఓ సినిమా తియ్యటం ఎంత కష్టమో, ఆ కథని కొనడం, కొన్నాక కాపాడుకోవటం అంత కష్టంగానూ ఉంది. ఇప్పుడు నువు రాస్తున్న ఈ ’మరణమజిలీ’ పూర్తిగా నీ స్వంతమేకదా, ఏ ఇంగ్లీష్ నవలకి కాపీయో లేదా మరో రచయిత కథో కాదుకదా? నాకు పూర్తి వివరాలు కావాలయ్యా. నాకు నిజాలు కావాలి. అందుకే ఈ కథకి నీకెంత కావాలో తీస్కొమ్మని బ్లాంక్ చెక్కిచ్చాను.”

“వివరాలంటే?” ప్రదీప్ కావాలనే రెట్టించాడు.

“వివరాలంటే…నువు ఈ సీరియల్‌కి ట్యాగ్‌లైన్‌గా ’యధార్ధసంఘటనల ఆధారంగా’ అని పెట్టావుగా, ఏంటా సంఘటనలు? ఎక్కడ జరిగాయి? ఆ పాత్రల అసలు పేర్లేంటి, ఆ కథలు నీకెలా వచ్చాయి లాంటివన్నీ,”  కొంచెం స్లో చేశాడు కోటేశ్వర్రావు.

ప్రదీప్ జేబులోంచి చెక్ తీసి బల్లమీద పెట్టాడు.

“మీకు ఆ వివరాలన్ని చెప్తేనే కథ కొనుక్కుంటానంటే అమ్మడానికి, చెప్పడానికి నేను సిధ్ధంగా లేను, మీ చెక్ మీరు తీసేస్కోవచ్చు.” ప్రదీప్

“ప్రదీప్‌గారూ, మీరీ కథకి ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?” చాలా కూల్‍గా కోటేశ్వార్రావు చెక్‌పై తన కుడిచేయి రెండువేళ్ళు వేసి చిన్నగా బీట్‌చేస్తూ అడిగాడు. ప్రదీప్ ని గారూ అని సంభోధించడం పూర్తి బిజినెస్ వ్యవహారం. దానికి ప్రదీప్ ఏం మాట్లాడలేదు. రెడ్డిగారు వైపు చూస్తున్నాడు తీక్షణంగా.

“అబ్బే మన ప్రదీప్ చిన్న చిన్న ప్రలోభాలకి లొంగడండి.” డీల్ ఇలా చెడిపోవడం ఇష్టంలేని రెడ్డిగారు అదోమాదిరి చూస్తున్నారిద్దరిని.

“ఐదు లక్షలు?” ప్రశ్నార్ధకంగా చూస్తున్నాడు కోటేశ్వర్రావు.

మనుషుల్ని, వారి టాలెంట్‌ని కొనడంలో సిధ్ధహస్తుడు కోటేశ్వర్రావు.

ప్రదీప్ ఏమ్ మాట్లాడలేదు. ఇంకా రెడ్డిగారి వైపే చూస్తున్నాడు.

“పది?” కోటేశ్వర్రావు చిర్నవ్వుతో రెట్టిస్తున్నాడు.

ప్రదీప్ అంతే సీరియస్‌గా ఉన్నాడు. కానీ కుర్చీలో కొంచెం అసహనంగా కదిలాడు.

తెలుగులో ప్రముఖ రచయిత అతడు. బాడీ లాంగ్వేజ్‌ అతనికి తెల్సినట్టుగా మరెవరికి తెలుస్తుంది.

“పదిహేను?”

విలువల వేలంపాట జరుతోంది ఆ ఛాంబర్‌లో.

“ఓ.కే. చివరి ఆఫర్. పదిహేడు లక్షలిస్తాను. ఇక నీఇష్టం!” చెక్‌పై చేతివేళ్ళు తీసేసాడు కోటేశ్వర్రావు.

“ఇరవై అభ్యంతరమా?” అంతవరకూ వచ్చాక తగ్గకూడదన్నది ప్రదీప్ బేరానికి బేస్.

బహుశా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత ఖరీదైన కథ మరొకటి లేదేమో!

కోటేశ్వర్రావు లొంగే ప్రసక్తే లేదు…ఊ అనడానికి ఎక్కువ టైమ్ తీస్కోడు.

“అంటే ఇరవై లక్షలకి నా కథలకి సోర్స్ ఏంటి, నేనెలా ఇన్ని కథలు రాయగలిగాను లాంటి వివరాలన్నీ మీకు చెప్తే నేనీ చెక్‍పై ఆ ఎమౌంట్‌ని రాసుకోవచ్చు కదా, కోటేశ్వర్రావుగారూ?” కన్ఫర్మ్ చేసుకున్నాడు ప్రదీప్.

“అవును”

“అయితే వినండి. రెడ్డిగారూ మీరు వినండి. వీలయితే నా ఈ కన్ఫెషన్స్‌ని కథలుగా మీ పత్రికలో   ప్రచురించుకోవచ్చు.”

“లేదు ప్రదీప్, నాకున్న  విలువల వల్లే నేనీ పత్రికని నడపలేని స్థితికొచ్చాను. అలాంటి పరిస్థితుల్లో నువ్వు రావడం, నీ సీరియల్ ఇంత క్లిక్ కావడం నాకింకా షాకింగ్‌గానే ఉంది. చెప్పు ప్రదీప్, అందరికీ ఘోస్ట్ రైటర్‌గా రాసే నీకు కథలందిచ్చే వ్యక్తి ఎవరు? ఘోస్ట్‌కి ఘోస్టా? నమ్మలేకున్నాను. చెప్పు ప్రదీప్!” రెడ్డి గారి మొహంలో ఉద్విగ్నత.

“నేను వేరేవాళ్ళకి రాసినవైనా, నాపేరు మీద రాసినవి అన్నీ నిజజీవితంలోని సంఘటనలే. నానుంచి ఎవరైనా కాపీ కొట్టారేమోగానీ, నేనెవరి కథలు కాపీ కొట్టాలేద్సార్. నమ్మితేనమ్మండి.”

“మరి ఈ మరణమజిలీకి ఇన్‌స్పిరేషన్ ఎవరు? ఆ ’ట్యాగ్‌లైన్’ కి అర్ధం ఏమిటి?” కోటేశ్వర్రావులో ఆనందం, ఆతృత కలిగలిపిన విభిన్న రియాక్షన్.

“అందులో ఓ క్యారక్టర్ నా కజినని, ఆమె జీవితాన్ని ఓ వంచకుడు నమ్మించి మోసంచేశాడని ఆ తర్వాత ఆమె జీవితాన్ని బాగుచేసే క్రమంలో నేను తెల్సుకున్న విషయాలని చెప్తే నమ్ముతారా?” కొంచెం స్లో చేసి ప్రదీప్ ఇద్దరినీ మార్చి చూశాడు.

టేబుల్ పైనున్న గ్లాసులోనున్న నీళ్ళన్నీ ఒకె గుక్కలో తాగేశాడు ప్రదీప్.

“చెప్పు ప్రదీప్, నువ్వేం చెప్పినా నమ్ముతాము.”

ప్రదీప్ చెప్పడం ప్రారంభించాడు.

 ** ఇంద్రాణి చెప్పిన కథలు **

ఇంద్రాణి.

ఆమె అందం గురించి చెప్పుకోకుండా ఇంకేం చెప్పుకున్నా ఇక్కడ అప్రస్తుతమే. ఇంద్రాణి ఓ అద్భుతం ఈ ప్రపంచంలో! అందం ఇలా పుట్టిందెందుకా అని ఆలోచించకమానరు ఆడాళ్ళందరూ..వాళ్ళకర్ధంకాని విషయం ఒకటే. అందాన్ని ఎలా ప్రొజెక్ట్ చెయ్యాలా అన్నది. కామాంధుడి నుంచి మునీశ్వరుడి వరకూ ఓసారి నఖశిఖపర్యంతం చూసికానీ తలతిప్పుకోలేని అందం ఆమెది. మంచి ఫిగర్‌కి, ఫిజిక్‌కి తేడా ఏంటని ఆలోచొంచేవాళ్ళని ఇంద్రాణి ఓ సమస్యే.  కాలేజీ రోజుల్లో ఆమె అందాన్ని వర్ణించడానికి కుర్రాళ్ళు నిఘంటువులు తిరగేసేవారని, శ్రీనాథుడు మళ్ళీ పుడితే ఇంద్రాణినే చూస్తే తన కావ్యాలని తిరగరాసేవాడని ప్రబంధనాయిక నిర్వచనాన్ని పూర్తిగా మార్చేసి ఒకే పదం వాడేవాడని అదే “ఇంద్రాణి” అని కొంతమంది కుర్రాళ్ళు ఆమెకి రాసిన ప్రేమలేఖల్లో పేర్కొనేవారు.

తేనె రంగు మేనిఛాయతో తేనెలూరే పౌటింగ్ పెదవులతో ఏ వయసువాళ్ళనైనా వివశుల్ని చేసి ’ఏంమాయచేశావే’ అని అన్పించే అందం ఆమెది. ప్రదీప్‌కి కజిన్ బంధుత్వం ఇంద్రాణి. అతనితో మంచి స్నేహితుడిగా ఉంటూ తన ’చెప్పు చేతల్లో’ పెట్టుకుంది. ఆమెకి మరో ప్లస్‌పాయింట్ ఆమె తెలివి తేటలు. అందం, తెలివితేటలు పోటిపడుతుంటాయి ఆమెలో. ప్రదీప్‌కి ఇంద్రాణి అంటె పిచ్చిగాని, అమెకి ప్రదీప్ ఓ మగాడు మాత్రమె. తన అదుపాజ్ఞల్లో ఉండే మగాడు. నిజానికి ప్రదీప్‌నుంచే మగాళ్ళని స్టడీ చెయ్యటం ప్రారంభించింది ఇంద్రాణి. ఆమె అందాన్ని, తెలివితేటల్ని, చురుకుదనాన్ని చూసి ఆమెకి దగ్గరవ్వాలని చాలా మందే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంద్రాణి తన మెదడుకి పదునుపెట్టి ఎవర్ని నొప్పించక తెలివిగా అందర్నీ దూరంగానే ఉంచగల్గింది. అప్పటికీ ఆమె మనిషి బలహీనతలపై ఓ అవగాహన ఏర్పరుచుకుంది.

తన తెలువితేటల గురించి అప్పుడప్పుడు యుఫోరిక్ అయినా, తన స్త్రీ సహజమైన మెచ్యూరిటీతో మగాళ్ళని బాగానే హ్యండిల్ చేసేది.

అందం,తెలివితేటలు సమానంగా ఉన్న అమ్మాయిల పారామీటర్స్ ఎప్పుడూ మారుతుంటాయి. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో.

తెలివైన ప్రతి అమ్మాయి, తనకంటే తెలివైన మగాణ్ణే కోరుకుంటారనడం తప్పుకాదు.

ఇంద్రాణి చేసింది కూడా అదే. మంచిగా అమాయకంగా ఉన్నచాలా మంది అబ్బాయిలందర్నీ దూరంగా నెట్టి రఘునెంచుకుంది. చాలా మంది తెలివైన అమ్మాయిలందరూ ఇలానే చేస్తారనడం అతిశయోక్తి కాదేమో.

ఇంద్రాణిని చాలా తెలివిగా డీల్ చేసాడు రఘు.

రఘు పరిచయం అయిన మొదటిక్షణంనుంచీ ఇంద్రాణి తనకి తెలియకుండానే అతనికి దగ్గరయింది.త్వరగానే సాన్నిహిత్యం పెరిగింది. రఘు మంచివాడే కానీ మంచితనాన్ని అతని తెలివితేటలు డామినేట్‌చేసి ఓ విలక్షణమైన వ్యక్తిత్వం పెంచుకున్నాడు. అదే అతనికి వరం, ఇంద్రాణికి శాపంగా పరిణమించింది తర్వాత. ఇంద్రాణిని బాగా ఇంప్రెస్ చెయ్యగలిగాడు రఘు.ఆమెని ఓ విధమైన మెస్మరిజం లోకి నెట్టేశాడు. ఫలితంగా రఘు అనుకున్నదానికంటే ముందుగానే ఇంద్రాణితో పెళ్ళయిపోయింది.

పెళ్ళయిన రెండు, మూడేళ్ళు చాలా మంది ప్రేమజంటల్లానే మేడ్‌ఫర్ ఈచ్ అదర్ లా జీవితాన్ని జుర్రుకున్నారు. ఒకరి తప్పుని మరొకరు క్షమించేసుకున్నారు.!

 జీవితంలో ఎదుగుతానంటూ ఉన్న ఉద్యోగం మానేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానన్నాడు రఘు. రియల్ ఎస్టేట్, చిట్స్ రన్ చెయ్యటం లాంటివి ప్రయత్నించాడు. అన్నీ ఫెయిలయ్యాయి. అదృష్టం కల్సిరాలేదన్నాడు. మరో ప్రయత్నంగా మిడిల్ ఈస్ట్‌కి, గల్ఫ్‌కి లేబర్ కార్మికులని పంపించే వ్యాపారం మొదలెట్టాడు. దాదాపు రెండేళ్ళు నిజాయితీగానే చేశాడు. ఇంద్రాణి కూడా రఘు బిజినెస్‌లో చేదోడువాదోడుగా ఉంటూ తన పాత్రని సమర్ధవంతంగా పోషించింది. తన మాటకారితనాన్ని తన వంతు పెట్టుబడిగా వ్యవహారాన్ని బాగా చక్కబెట్టే సమయంలో ఆఫీస్ విషయాలు కొన్ని తెల్సుకుంది. ఎవరెవరు వస్తున్నారు, ఎంతిస్తున్నారు లాంటివన్నీ…..

సరిగ్గా ఈ సమయంలో ఓ అనుకోని సంఘటన…..

ఒమాన్ రాజధాని మస్కట్‌కి లేబర్ కాంట్రాక్ట్ కోసస్ం వెళ్ళిన రఘు మరి రాలేదు. ఫోన్ కాల్స్ లేవు, మెయిల్స్ లేవు. పోలీస్ కంప్లయింట్‌తో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. ఇంద్రాణి తను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది.

రఘు ఏమయ్యాడనేది ఓ మిలియన్ డాలర్ ప్రశ్న ఎందుకంటే ఇప్పుడామె దాదాపు కోటిరూపాయల అప్పులో కూరుకుపోయింది. తమకి ఉద్యోగమైనా ఇప్పించమని లేదా డబ్బైనా వాపస్ ఇవ్వమని ప్రెజర్ మొదలయ్యింది జనాలనుంచి. అయితే ఇందులో చాలా మంది అసలు డబ్బు కట్టకుండానే, రఘు పారిపోయిన సంగతి తెల్సుకుని ఇంద్రాణిని వేధించటం మొదలుపెట్టారు.

జీవితంలో మొదటిసారిగా ఓడిపోయింది తెలివైన, అందమైన ఇంద్రాణి.

ఆత్మహత్య కూడా పరిష్కారం కాదు. తను హఠాత్తుగా చనిపోతే ఈ ప్రజలు ప్రదీప్‌ని వేధిస్తారు. అలా జరగడం తనకిష్టం లేదు. ప్రదీప్ అంటె ఇష్టం ఆమె చేత మరో పరిష్కారం ఆలోచింపజేసింది.

మరో మార్గం లేదు……ఎంత ఆలోచించినా ఇదొక్కటే పరిష్కారం.

తన అందమే పెట్టుబడిగా కొత్త బిజినెస్ ప్రారంభించింది. చెప్పిన వాళ్ళకి చెప్పినట్లుగా వారి సొమ్ము వాపస్ చేసింది– క్యాష్ ఆర్ కైండ్! ఏదో విధంగా బయటపదింది. ఆరు నెలలకే తను పూర్తిగా బయటపడిపోయింది. కాని తన వ్యాపకం మారలేదు, మానలేదు. “అభిమానుల”ని తగ్గించుకుని రాబడి పెంచుకుంది. సంఘంలో ఓ సుస్థిర స్థానం– ఎలీట్ సోషల్ వర్కర్ గా… చాలా మందితో పరిచయం. వాళ్ళలో రాజకీయ నాయకులు, పోలీస్ శాఖ నుండే కాక ఆఖరికి జ్యుడీషియరీ నుండి ఎందరెందరో ఇంద్రాణి ’కంపెనీ’ కోసం క్యూ కట్టే వారు.

రఘు మోసంతో ఇంద్రాణికి మగాళ్ళమీద, సమాజంమీద నమ్మకం, గౌరవం పోయింది. తన దగ్గర కొచ్చే వాళ్ళకి తన అందంతో హిప్నాటిక్ సజెషన్స్ ఇస్తూ వాళ్ళ జీవితాల్లోని అన్ని కోణాల్ని స్పృశించేది. వాళ్ళు ఓ రకమైన అచేతనావస్థలో ఉండగా వాళ్ళ కథలన్నీ వినేది. ఒక్కోసారి వాళ్ళకి తెలీకుండా వాయిస్ రికార్డర్‌లో రికార్డ్ చేసి అవన్నీ ప్రదీప్‌కి విన్పించేది. తను విన్న ప్రతీ కథని తప్పకుండా ప్రదీప్‌తో షేర్ చేసుకునేది. ఇలా అందరినుంచీ కథలు రాబట్టడం ఆమెకి చిన్నప్పట్నుంచీ హాబీ. అదే ఇప్పుడు ప్రదీప్‌కి ఓ అక్షయపాత్ర.

……..ముగింపు వచ్చే వారంలోనే!

అని లేచాడు ప్రదీప్.

“అదేంటయ్యా అలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్నావు?” రెడ్డిగారు, కోటేశ్వర్రావు ఒకేసారి అరిచినంత పనిచేశారు.

“ఇంకేం లేదండీ చెప్పడానికి, నా ఈ సీరియల్‌కి మీరు ’ముగింపు వచ్చే సంచికలోనే’ అని ప్రకటించేయండి” కూల్‌గా ఓ సారి తన జేబులోని చెక్ ని చెక్ చేసుకుని ఛాంబర్‍లోచి బయటకొచ్చేశాడు ప్రదీప్.

* * *
పత్రికాఫీస్ నుంచి బయట తన కారు దగ్గరికి చేరేసరికి ప్రదీప్ సెల్ మోగింది.

“ఆ, సర్! మీరు వెంటనే కొలంబియా హాస్పిటల్‌కి రావాలి, ఇంద్రాణి పరిస్థితి సీరియస్” తన మేనేజర్ కృష్ణారావు గొంతులో ఆందోళన.

ప్రదీప్ వెళ్ళేసరికి ఇంద్రాణి నిస్త్రాణంగా ఉంది మంచంపై. ఇంతవరకు అందరికీ మత్తిచ్చిన ఇంద్రాణి శరీరంలోకి ఏవేవో గొట్టాలు ద్వారా మందిస్తున్నారు.

“రారా ప్రదీప్ నీకు చివరగా ఓ కథ చెప్పాలని” చాలా ఆయాసపడుతోంది ఇంద్రాణి. చావుతో పోరాడుతూ….

దురదృష్టవశాత్తూ మరణానికి లంచం లేదు. కనీసం ఏ ప్రలోభాలకి లొంగదు. లేదంటే మరణశాసనాన్ని కూడా తన అందంతో తిరగరాయించేది ఇంద్రాణి.

కానీ ఇప్పటి ఇంద్రాణి పరిస్థితి వేరు. అందర్నీ తన కనుసన్నలతో ఆజ్ఞాపించే ఇంద్రాణిని, మరణం ఇప్పుడు తన గుపిట్లో ఉంచుకుని తన ప్రభావాన్ని చాటుతోంది.

“ప్రదీప్ నీకు సినిమా ప్రొడ్యూసర్ కోటేశ్వర్రావ్ తెల్సా? పేరెప్పుడైనా విన్నావా?” ఇంద్రాణి ప్రదీప్ జవాబు కోసం నిరీక్షించకుండా చెప్పుకు పోతోంది.

“ఆ కోటేశ్వర్రావు నాకు దగ్గరవ్వటం కోసం తన భార్యని ఎలా చంపిందీ, కేసవ్వకుండా అది ’బోన్ క్యాన్సర్’ గా ఎలా చిత్రీకరీంచాడో చెప్పాడు. ఆ కథంతా వాయిస్ రికార్డర్ లో రికార్డ్ చేశాను. తర్వాత విను. కానీ నా చావుకి మాత్రం కారణాలడగొద్దు. ఈ విషయం నాతోనే సమాధి కానీ…” తర్వాత ఇంద్రాణి కథలు చెప్పడానికి వేరే లోకానికి వెళ్ళిపోయింది.

ఇంద్రాణి మరణం ప్రదీప్‌ని  చాలా కలచివేసింది. నెమ్మదిగా ఆమె ఎలా చనిపోయిందో కారణాలు వెతకడానికి ప్రయత్నించాడు. పుర్తి వివరాలు సంపాదించలేకపోయినా చాలా వరకూ ఇంద్రాణి మరణానికి కోటేశ్వర్రవే కారణమని తెల్సుకున్నాడు.

వారం రోజుల తర్వాత తనకి కోటేశ్వర్రావు ఇచ్చిన చెక్‍ని చింపేసి తను రాస్తున్న సీరియల్ ’మరణమజిలీ’ కి ముగింపు రాయటనికి ఉపక్రమించాడు ప్రదీప్.

ఇంద్రాణి  తన చివరి మజిలీ పూర్తి చేసింది….

 

మీ మాటలు

  1. సాయి పద్మ says:

    ఇది ఒక విచిత్రమైన … కధ అందామా.. నెరేటివ్ అందామా.. పెరేదన్నా కానీ … మజిలీలు అవసరమై, ఏ మజిలీ కూడా శాశ్వతం కాని ముగింపులలో మిగిలేది మరణం.. కానీ.. మరణం నేర్పే మరో మానసిక మజిలీ కూడా. ఈ మరణ మజిలీ గా మిగులుతుందేమో … మంచి ప్రయత్నం వాసుదేవ్ గారూ ..!

    • అవసరమున్నా లేకున్నా మజిలీలి జీవితంలో తప్పనిసరి. ఆఖరికి చివరిమజిలీ కూడా మనచేతల్లోనో చేతుల్లోనొ లేదు.అందరికీ తెల్సిన విషయాన్ని కాస్త భిన్నంగా చెప్పాలన్నదే ఈ ప్రయోగం ఉద్దేశ్యం. మీ మెచ్చుకోలుకీ, షరీఫ్ గారి పరిచయ ప్రోత్సాహానికీ ప్రత్యేక ధన్యవాదాలు..

    • సాయిపద్మ గారూ! అవసరమున్నా లేకున్నా మజిలీలి జీవితంలో తప్పనిసరి. ఆఖరికి చివరిమజిలీ కూడా మనచేతల్లోనో చేతుల్లోనొ లేదు.అందరికీ తెల్సిన విషయాన్ని కాస్త భిన్నంగా చెప్పాలన్నదే ఈ ప్రయోగం ఉద్దేశ్యం. మీ మెచ్చుకోలుకీ, షరీఫ్ గారి పరిచయ ప్రోత్సాహానికీ ప్రత్యేక ధన్యవాదాలు..

  2. మణి వడ్లమాని says:

    kadha
    కధ నేరషన్ చాల కొత్త గా వుంది. మరి దీనిని ఏ సాహితీ ప్రక్రియ అంటారో తెలియదు నాకు. కధా వస్తువు మాత్రం తెలిసిన దాని లో వుంది. ఈ రకమైన విన్నూతనం గా వున్న ‘మరణమజిలీ’ కధ రచయతకి అబినందనలు.

    • మణి వడ్లమాని గారూ! కృతజ్ఞతలు. కథాశిల్పం గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పదల్చుకోలేదుకానీ ఈ ప్రయోగాన్ని ఏ జాన్రాలోనూ ఇరికించే పనిపెట్టుకోలేదు. బేసిక్ గా ఇది కథె. సీరియల్ లక్షణాలని కథకి ఆపాదిస్తూ ఓ కథ రాయాలన్న సంకల్పమే దీనికి ఆధారం…పూర్వం “పెద్దకథ” అనే శీర్షికగా కొన్ని కథలొచ్చెవి వార, మాస పత్రికల్లొ. అలా ఓ పెద్దకథని ఇలా రాయొచ్చుకదా అని అనిపించి……శిల్పంపై ఫోకస్ ఉండాలనే ఉద్దేశ్యంతో కథావస్తువుని ఫెమిలియర్ గానే ఉంచాను.మీరు ఓపిగ్గా చదివి అభిప్రాయం తెలిపినందుకూ మీ అభినందనలకూ ధన్యవాదాలు.

  3. కొత్త ప్రయోగం. చివరి వరకు ఆసక్తిగా చదివించారు.
    మనకు తెలియని జీవితాలు, అందులోని రహస్యాలు ఎన్నో కదూ!

    • ప్రవీణాజీ! ఔనండీ కొత్తప్రయోగమె…మనకి తెలియని జీవితాలూ అందులోని రహస్యాలె కదండీ మనకి కథావస్తువులు. మీరు ఆసక్తిగా చదివినందుకూ మీ అభిప్రాయం రాసినందుకూ కృతజ్ఞతలు.

  4. వేరే ఆలోచన రానీయకుండా.. అది ఆధునిక ప్రవాహంలో మానసిక నయాగరాల్ని కలిపేసి… ఆ వేగం లో ఒక్క సారి గా ఇంద్రాణి మరణం అన్న సడన్ బ్రేక్ వేసి.. అన్ని రహస్యాల్నీ చెప్పకుండానే పాఠకులకి విస్తారంగా అర్థమయ్యెలా చేశారు. గ్రేట్ నెరేషన్ దేవ్ జి. చాల నచ్చింది.

  5. ns murty says:

    వాసుదేవ్ గారూ,

    చాలా ఆసక్తి కరంగా, చదువుతున్నంతసేపూ ఏకాగ్రత సడలకుండా చదివించిన సీరియల్ని కథగా కుదించిన కథ.
    చెప్పినదానికంటే చెప్పకుండా చెప్పినది, చెప్పనక్కరలేకుండానే పాఠకుడికి అవగాహన అయేలా చెప్పడంలో మీరు సఫలం అయ్యేరు. అభినందనలు.

    • సర్ మూర్తిగారూ ధన్యోస్మి కంటే పెద్ద పదం తెలీక ఇలా చెప్తున్నా…..నా కథపై మీ స్పందన నా బాధ్యతలని పెంచి ఆలోచింపచేస్తుందని మీకూ తెల్సు. ఇక ఇంకా జాగ్రత్తపడతాను మీనుంచి ఇంకా మంచి “శభాష్” లు రాబట్టుకునేలా…..థాంక్యూ సర్..మీరేమంటారోననె భయం నుండి బయటపడ్డాను.

Leave a Reply to వాసుదేవ్ Cancel reply

*