మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన ‘మల్లెల తీరం’!

చలం రచించిన ‘సావిత్రి’ లో సావిత్రి, సత్యవంతుడిని చూసి “మనస్సులు ఎప్పుడో కలిసాయి, మరణం ఒక్కటే మిగిలివుంది” అని అంటుంది. ఈ మాటల స్ఫూర్తితోనేismail“మల్లెలతీరంలో సిరిమల్లెపూవు” అనే సినిమా తీసాను అని ఒక ఇంటర్వ్యూలో అంటాడు ఈ చిత్ర దర్శకుడు జి.వి.రామరాజు.  చాలా కాలం నుంచీ ఫేస్ బుక్ లో ఈ సినిమా గురించి కొంతమంది నోట వింటూ వస్తున్నాను. దాదాపు అందరూ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసే విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ సినిమా అంత బాగుందా అనుకొనేవాణ్ణి. ఈ మధ్యన డాలస్ వెళ్లినప్పుడు పనికట్టుకొని మరీ చూసి వచ్చానీ చిత్రాన్ని. మొదట ఈ సినిమా పేరు “మల్లెలతీరం” మాత్రమే, కానీ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా వచ్చాక పేరు మార్పుకు గురైంది. అలా అన్నా ఈ సినిమా పేరు కొద్దిగా ప్రజల నోళ్లలో నాని, సినిమా చూసేందుకు వస్తారని చిత్ర యూనిట్ ఊహ కాబోలు. కానీ నా వరకైతే ఈ సినిమా టైటిల్ “మల్లెలతీరమే” బాగుంది.
ఇక సినిమా కథ విషయానికి  వస్తే, “ఓ అందమైన అమ్మాయి, అంతకన్నా అందమైన మనస్సున్న అబ్బాయి, డబ్బే ప్రాధాన్యం అనుకొనే ఆ అమ్మాయి భర్త వీరి ముగ్గురి నడుమ జరిగిన కథే ఈ చిత్ర కథ.” ప్రతి అమ్మాయికి ఉన్నట్లే కలల రాకుమారుడు ఈ అమ్మాయికీ ఉన్నాడు. కానీ ప్రతీ కల నిజం కాదు. జీవితం ఎన్నెన్నో సర్దుబాట్లు నేర్పుతుంది. కానీ అందగాడు, తెలివైన వాడు, డబ్బు బాగా సంపాదించేవాడు అయిన భర్త దొరికితే ఏ ఆడపిల్లయినా సంతోషంతో పొంగిపోతుంది. ఇది మన సమాజం గిరిగీసి పెట్టుకొన్న నియమాల్లో ఒకటి. మరి ఇవన్నీ ఉన్నా తనకు కావాల్సినది లేని పెళ్లిలో ఆ అమ్మాయి ఎలా సర్దుకుపోవాలి? లేదా తన వ్యక్తిగత స్వేచ్చకు ప్రాధాన్యం ఇవ్వాలా? ఇలాంటి ప్రశ్నలకు జవాబివ్వాలనే ప్రయత్నమే ఈ సినిమా. అలా అని ఇదే సరైన సమాధానం అని ఎవరూ అనుకోక్కర్లేదు. కథ కన్నా కథనం, అంతకన్నా తాత్విక దృష్టి కలిగిన సంభాషణలు, మృదువైన సంగీతం, అందులో పాలు నీళ్లులా కలసిపోయిన సాహిత్యం, వీటన్నిటినీ ఓ దృశ్యకావ్యంలా తీసిన ఛాయాగ్రహణం…ఈ సినిమాని ఓ కళాఖండంగా నిలబెట్టాయి.
సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తే చాలా నిదానంగా, ఏ మాత్రం వినోదం లేకుండా, ట్విస్టులు-బ్యాంగులు-ఐటం సాంగులు లేని చప్పిడి కూడులా అనిపించవచ్చు. కొద్దో గొప్పో ఈ తరహా సినిమాలు ఇష్టపడే  ప్రేక్షకులు కూడా కథనం సాగదీసినట్లు ఉందని కొన్ని కొన్ని సన్నివేశాల్లో అనుకొనే ప్రమాదమూ ఉంది. కానీ నావరకు ఈ సినిమాలో నన్ను కట్టిపడేసిన అంశాల్లో మొదటిది అమ్మాయి అందం కన్నా, తన ఆహార్యం. తను కట్టుకొన్న చీరలు, ఆ-కట్టుకొన్న విధానం, పొందిగ్గా ఉన్న జడ, సింపుల్గా ఓ జత గాజులూ, మెడలో ఓ నల్లపూసల గొలుసూ అంతకన్నా ముఖాన తాండవించే అందమైన నవ్వు, సమ్మోహనపరిచే మార్దవమైన మాటలు…ఏ కృష్ణశాస్త్రి పుస్తకంలో నుంచో నడచివచ్చిన కావ్యకన్యకలా ఉంది శ్రీదివ్య.
భర్తగా నటించిన జార్జి తన పాత్రకు తగ్గట్టు నటించాడు. లేనితనంలో అనుభవించిన కష్టాల వల్లో, మనకు తెలియని (ఈ సినిమా కథానాయిక పరంగానే సాగుతుంది) అనుభవాల వల్లో తనకు సంబంధించి రెండే ముఖ్య విషయాలు 1.నేను 2. డబ్బు. తను బాగుండాలి, సాధ్యమైనంత డబ్బు సంపాదించాలి. కట్టుకొన్న భార్య ఈ ఈక్వేషన్లో లేకపోవడం తనకు మైనస్సో, ప్లస్సో తేలీనంత బిజీలో జీవితం గడుపుతుంటాడు. అతన్ని ఇచ్చి పెళ్ళి చేసిన అమ్మాయి తండ్రి దృష్టిలోనూ, సమాజం దృష్టిలోనూ అతను ఆదర్శ భర్తే కానీ కాపురం చేయాల్సిన భార్య దృష్టిలో కాదు.
ఇక ఓ పాటల రచయితగా, భావుకత్వం నిండిన ఓ యువకుడిగా క్రాంతి చాలా చక్కగా నటించాడు. కానీ తను ఎక్కువ సేపు ఆ అమ్మాయి ఏం చెప్పితే దానికి తలూపే వ్యక్తిగానే ఈ సినిమాలో కనబడతాడు. (ఇది కథలో నాకు నచ్చని అతికొద్ది విషయాల్లో ఒకటి. మనలోమన మాట, అమ్మాయి ఏం చెబితే దానికి తలూపే అబ్బాయి ఉంటే ఏ అమ్మాయికి మాత్రం నచ్చడేంటీ;-)  ఈ అబ్బాయి ఆ అమ్మాయి స్నేహితురాలింట పరిచయమౌతాడు. ఆ స్నేహం ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుకొనే దాకా వస్తుంది. సినిమా మొత్తం మీద ఇద్దరు ఎన్ని సార్లు ఒంటరిగా కలుసుకొన్నా ఎవరి హద్దుల్లో వారుంటారు.
ఇద్దరి భావాలు ఒక్కటే అవడంతో పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవడం, నచ్చిన పాటలు పాడుకోవడం, ఒకరి విషయాలు మరొకరితో పంచుకోవడం ఇలా సాగిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు స్నేహం నుంచీ ప్రేమగా మారిందో ఇద్దరికీ తెలియకుండానే అందులో మునిగిపోతారు. ఇందులో అమ్మాయి ఓసారి తన స్నేహితురాలితో అంటుంది “నేను ఏ అందమైన మనిషిని కలిసినా నాకు తోడుగా ఓ పాటుంటుంది, కానీ తనని చూసినప్పుడల్లా ప్రపంచమే పాటగా అనిపిస్తుంది.” మళ్లీ ఒకసారి ఆ అబ్బాయితో అంటుంది,”నిన్ను కలసినప్పుడు నాకు ఏ పాటా గుర్తుకు రాలేదు” అని. “అలా ఏం?” అని ఆ అబ్బాయి అడిగితే “నేనే నువ్వైనప్పుడు నాకు పాటెలా గుర్తొస్తుంది” అని అంటుంది. ఇలా వారిద్దరి మధ్య ప్రేమను అద్వైతంలా చిత్రీకరిస్తాడు దర్శకుడు.
ఇంట్లో భర్తతో సంసారబంధం లేకపోగా, (నీకు నచ్చకపోతే నిన్ను తాకనైనా తాకను అనే మంచి విలన్(?) ఆమె భర్త) ఫారిన్ ట్రిప్పులు, కొత్త వ్యాపారావకాశాలతో వీరిద్దరి మధ్య ఉన్న అగాధం మరింత పెరుగుతుంది. అది ఆమె విడాకులు కోరేవరకు వెళుతుంది. అప్పుడు ఆ భర్త తీసుకొనే నిర్ణయం ఏంటి? ఆమె ఆ నిర్ణయానికి ఒప్పుకొందా? వారిద్దరి ప్రేమ ఎలా ముగిసింది? ఇవన్నీ తెలియాలంటే మిగతా కథ మీరు తెరపై చూడాలి.
mallela
ఇందులోని కొన్ని ఆలోచింపచేసే మాటలు:
‘నాకు తెలిసి ఈ ప్రపంచంలో మనసు కన్నా అందమైనది ఏదీ లేదు. ఆ మనసుని వెతుక్కుంటూ వెళ్తే ఎన్నో తీరాలు కనిపిస్తాయి. వాటిల్లో మల్లెల తీరం ఒకటి” (హీరోయిన్‌తో క్రాంతి)
‘ప్రేమ, మనసు, ఆకాశం -వీటిని నచ్చిన విధంగా వర్ణించుకోవచ్చు కానీ, హద్దులు గీయలేం’(హీరోయిన్‌తో క్రాంతి)
‘సంపాదించు…కానీ లైఫ్‌ను బిజినెస్‌చేయకు’ (భర్తతో కథానాయిక)
‘భార్యగా అవడం వేరు. భార్యగా బతకడం వేరు’’ (కథానాయిక)
‘కోపం కూడా ఒక ఫీలింగే.. నాకు తన మీద అది కూడా లేదు’’ (భర్త గురించి నాయిక)
‘మానవ సంబంధాలు గ్యారంటీలతో రావు, మనమే పోషించుకోవాలి’’ (హీరోయిన్‌తో క్రాంతి)
ఇక పాటల వరకూ ఎంతో ఆహ్లాదమైన సంగీతం, సున్నితమైన సాహిత్యం బంగారానికి తావి అబ్బినట్లు అమిరాయి.
1. నీ నీడనా.. ఇలా నడవనా…
2. మబ్బులు కురిసే..మొగ్గలు విరిసే…
3. అలా చందమామనై..ఇలా చేతికందనా…
4. మాటకందని పాటలా మనమిద్దరూ కలిశాముగా…
5. పిల్లగాలుల పల్లకిలో..మల్లె వధువై నీలో చేరి…
మొత్తానికి ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగినా, ఈ సినిమా కథ కొని ప్రశ్నలను మిగిలిస్తుంది. ఒక సమీక్షకుడన్నట్లు -“పురుషుడు ఏ స్వేచ్ఛనైతే తన హక్కుగా భావిస్తాడో, ఆ స్వేచ్ఛను స్త్రీకి ఇస్తే చాలు. అంతకు మించి స్త్రీ ఏమీ ఆశించదు’ అన్నది ఈ చిత్ర ఇతివృత్తం. ఆ అంశాన్ని తన ఈ తొలి చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నారు దర్శకుడు రామరాజు.”- కానీ ఇదే కథ కొద్దిగా మార్చి భర్త భావుకుడిగా, భార్య ఇవన్నీ పట్టించుకోని ప్రాక్టికల్ మనిషిగా ఉంటే, ఆ భర్తకే తన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే అమ్మాయి పరిచయమైతే …???
mallela teeram(1)
అలాగే ఈ సినిమాపై ఎన్ని సమీక్షలు వచ్చినా, కొన్ని అర్థవంతమైన ప్రశ్నలు మితృడు, ఛాయాగ్రాహకుడు అయిన ‘చక్రధరరావు’ లేవనెత్తారు-
“ప్రేమించే మనిషి దొరికేవరకూ పెళ్ళి చేసుకోవద్దా? 
లేక పెళ్ళి చేసుకొని బతికేస్తూ ప్రేమించేమనిషి తారసపడితే పెళ్ళిని వదిలిపోవాలా?? 
లేక పెళ్లిలో ఉంటూనే ప్రేమని కొనసాగించాలా? 
ప్రేమించిన మనిషిని తప్పక పెళ్ళి చేసుకొని తీరాలా ?? 
అసలు ఫలాన వ్యక్తి తప్ప ప్రపంచంలో నాకేమీ వద్దు అనే మానసికస్థాయి అదే సినిమాలో చెప్పిన అద్వైత స్థితి మనుషులకెప్పుడయినా కలుగుతుందా ?
అది కలగాలంటే ఎలా ప్రాక్టీసు చేయాలి ? 
పోనీ ఫలానా వ్యక్తిని ప్రేమించామే అనుకో.. వాళ్ళూ మనని ప్రేమించాలిగా ?
లేకుంటే అలా రెసొనెన్స్ కలిగేవరకూ వెతుక్కుంటూ పోవాలా , ఈ లోపు పుణ్యకాలం గడిస్తే ?? 
ఒకసారి ఆ ‘అద్వైత స్థితి’ కలిగితే అది ఎల్ల కాలం అలాగే ఉంటుందా ! అంటే ఒకసారి ఒకరి మీద ప్రేమ కలిగాక అది ఎప్పుడూ అలాగే ఉంటుందా వాళ్ల తదుపరి ప్రవర్తన వల్ల తరుగుదల/ఎదుగుదల ఉండదా ? ఉంటుందా?”
వీటికి సమాధానాలు ఎవరికి వారే వెతుక్కోవాలి!

కొసమెరుపు:

 

ఈ సినిమాలో సాహిత్యం, సంగీతం, భావుకతతో పాటు ఎక్కువైంది ఇంకొకటుంది…అది కెఫైన్…ఇద్దరి మధ్య మాటలు, పాటలుతో పాటు కాఫీ కూడా వరదలై పొంగుతుంది.
ఈ సినిమా ముందూ వెనకా:
 శ్రీదివ్య,డా.క్రాంతి, జార్జి, రావు రమేశ్ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: పవన్‌కుమార్, ఛాయాగ్రహణం: బాలరెడ్డి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, సహ నిర్మాత: సూర్యనారాయణ ఆకుండి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి.వి. రామరాజు.

మీ మాటలు

  1. బావుందండీ.. ఈ మూవీ మీద ఇంత సవివరంగా వచ్చిన మొదటి రివ్యూ ఇదే అనుకుంటా!
    ఆఖర్లో ఇచ్చిన ఆ ప్రశ్నల్లో ఏ ప్రశ్నకీ మనదగ్గర సమాధానం ఉండదు, ఖచ్చితంగా! :))

    BTW — “మనలోమన మాట, అమ్మాయి ఏం చెబితే దానికి తలూపే అబ్బాయి ఉంటే ఏ అమ్మాయికి మాత్రం నచ్చడేంటీ;-) ”
    I think it’s a big myth :)

  2. సాయి పద్మ says:

    చాలా బావుంది మీ వివరణ .. నిజమే పూర్తిగా రాసిన రివ్యూ ఇదేనేమో .. బట్.. అమ్మాయిల మానసిక పరిస్థితి , భావుకత్వం, వ్యక్తిత్వం, అంచనా వేసి ..రమారమి దగ్గరగా తీసిన సినిమాల్లో .. ఇది ఒక మంచి ప్రయత్నం అనిపిస్తోంది చదివితే..

    సున్నితమైన భావాలు ఉండటానికి మనిషి అందంగా ఉండనక్కరలేదు. కానీ మీరు రివ్యూ లో కూడా అమ్మాయి అందానికి ఒక పేరా కేటాయించారు.

    చెప్పిన మాటల్లా వినే అబ్బాయిని అమ్మాయిలూ ఇష్టపడతారు అనుకోవటం ..ఒక అపోహ.. అభిప్రాయాల్లో అరశాతం తేడా వచ్చినా .. అమ్మాయిలూ, అబ్బాయిలు కూడా ఇష్టపడటం లేదు ..

    గౌరవంగా విభేదించటం .. మంచి బంధానికి ఒక సూత్రం అని చెప్పారు .. బాగుంది

    • థాంక్స్. నా దృష్టిలోనూ అందం ఓ అర్హత కాదు. ఏ మనిషికైనా వ్యక్తిత్వమే అందాన్నిస్తుంది.

  3. లలిత says:

    ఇదే కథ కొద్దిగా మార్చి భర్త భావుకుడిగా, భార్య ఇవన్నీ పట్టించుకోని ప్రాక్టికల్ మనిషిగా ఉంటే, ఆ భర్తకే తన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే అమ్మాయి పరిచయమైతే …?? మీరు చెప్పిన ఈ పాయింట్ తో బొచ్చెడు సినిమాలొచ్చాయండి . ఏదో కాస్త డిఫరెంట్ గా ఉన్న ఈ సినిమాని ఆస్వాదించడం, ఆలోచించడం , వరకూ నిరభ్యంతరంగా చేయొచ్చు.
    అమ్మాయి ఆహార్యం, మాట, పాట అన్నీ చాలా చాలా నచ్చాయి .

    • ధన్యవాదాలు. That was a rhetorical question with a pinch of sarcasm:-) అమ్మాయి చేస్తే స్త్రీ స్వేచ్చ…అదే పని మగవాడు ఇవే కారణాలతో చేస్తే మగ దురహంకారం అని తులనాడుతారు కదా? అందుకే ఓ మూడు ??? పెట్టా:P

  4. చక్రధరరావు మరీ సిద్ధాంతపరంగా ఆలోచించాడు. పెళ్లికాని అబ్బాయికి ప్రేమించే అమ్మాయే దొరకకపోతుందా? ప్రేమించే హృదయముండాలి. లేకపోతే సాంప్రదాయబద్ధమైన పెద్దలు కుదిర్చిన అమ్మాయినే ప్రేమిస్తే సరి. ఈ చిత్రం బాగుంది. ఇలాంటి చిత్రాలను ప్రొత్సహిస్తేనే మనకు parallel చిత్రాలు వస్తాయి. చిత్రసమీక్ష నచ్చింది.

  5. నగ్న పాదాల కన్నీళ దేరంగు..ఈ కవిత్వం చాల చాల బావుంది,కాస్త శ్రీ శ్రీ గారి కవిత్వం గుర్తు కొస్తుంది.కాని ఇంత మంచి భావన ఎవరి కొస్తుంది.బాగా నచ్చింది.
    సిరిమల్లె తీరంలో సినిమా మీ రివ్యూ చుసిన తర్వాత చూడాలని వుంది,కాని సౌదీ అరేబియా లో వున్నా నాకు చూడడానికి ఎలా కుదురుతుంది ఇండియా వస్తే తప్ప.

    • మీ మొదటి కామెంటు కవి గారికి అందజేసాను.
      ఇక రెండో విషయమై…తొందర్లోనే డి.వి.డి. రూపంలో ఈ సినిమా మన ముందుకు వస్తుందని ఆశిద్దాం. వచ్చాక… ఇక్కడే ఆ లంకె మీతో పంచుకొంటాను.

  6. Korivi Deyyam says:

    బావుందండి…అ వేరి డిటైల్డ్ రివ్యూ :)

    సినిమా చూసేయ్యాలి వెంటనే అన్న ఫీలింగ్ తెప్పించారు !!!

    థాంక్ యు ఫర్ ది రైట్ అప్ !!

  7. చలం సావిత్రి నవలా? ! నాటకమా ?

    • పౌరాణిక నాటికయే. తప్పు చూపించినందుకు ధన్యవాదాలు. I stand corrected.

  8. గ్రేట్ రివ్యూ

  9. kameswari says:

    ఏ అనుబంధానికి ఆ అనుబంధాన్ని చక్కగా నిలుపుకోవాలి.అన్నీ ఒకరితోనే పంచుకోవాలనే ఉబలాటం ఎందుకు?భావుకత్వం పంచుకున్నవారితోనే జీవితాన్నీ ఎందుకు పంచుకోవాలి? భావుకత్వం నిజజీవితం సాధారణంగా దూరంగా ఉంటాయి.కలలనుపంచుకునెవారు కలసి బ్రతక వలసి వస్తే అది ఒకరోజుకూదా నిలవకపోయే అవకాశం ఉంది.పప్పు,కూర, పులుసు, అన్నీ ఒకేముద్దలో తినాలనే ప్రయత్నం వికటిస్తుందని చెప్పాలని అనిపించింది.

  10. RameshBobbili says:

    నైస్ రివ్యూ ఇస్మాయిల్, నేను ఒక మంచి సినిమాని మిస్సయ్యఎననిపిస్తోంది, తప్పకుండా వీలైనంత త్వరలో చూసేస్త..
    థాంక్స్ ఫర్ షేరింగ్ :)

  11. కథాపరం గా గొప్ప సినిమా అని చెప్పలేము కాని, ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది నాకు మాత్రం సినిమా చూసాక. మధురమైన సంగీతం కారణం కావొచ్చు, అర్ధవంతమైన సంభాషణలు కారణం కావొచ్చు. అఖర్లేని మెలోడ్రమా లేని కారణం కూడా కావొచ్చు. ఒక సమస్య ఎదురయ్యినప్పుడు, దానిని పరిష్కరించుకున్న విధానం ఎంతో సౌమ్యం గా సినిమాలో చెప్పిన కారణం కావొచ్చు. మీ రివ్యు బాగుంది. You summarized it very well.

    • బ్లాగ్లో మీ స్పందన ఇప్పుడే చూశాను. నన్ను మిగతా 20%లో చేర్చారనే అనుకొంటాను:-)

  12. “ఈ సినిమాలో సాహిత్యం, సంగీతం, భావుకతతో పాటు ఎక్కువైంది ఇంకొకటుంది…అది కెఫైన్…ఇద్దరి మధ్య మాటలు, పాటలుతో పాటు కాఫీ కూడా వరదలై పొంగుతుంది.”- —- ఖాలీ కప్పులతో కాఫీ తాగుతున్నట్టు వారు నటించారన్నది ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఎక్కువ సీన్స్ ఉన్నాయి కదా సినిమాలో కాఫీ తాగుతూ, కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది అనిపించింది.

  13. buchi reddy gangula says:

    రివ్యూ భాగుంది
    అందరి అభిప్రాయాలు చదివిన తరవాత యీ సినిమా
    యిప్పుడు వస్తున్న ఐటెం సాంగ్ సినిమాల్ల గాక కొంత
    కొత్తదనం ఉన్నట్టు తోస్తుంది —మార్పు కావాలి –ఇలాంటి
    సినిమాలు రావాలి
    ——————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  14. “.. ఇదే కథ కొద్దిగా మార్చి భర్త భావుకుడిగా, భార్య ఇవన్నీ పట్టించుకోని ప్రాక్టికల్ మనిషిగా ఉంటే, ఆ భర్తకే తన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే అమ్మాయి పరిచయమైతే …???”
    **

    సమీక్ష బాగా రాశారు.
    ఈ మధ్యకాలంలో నేను చదివిన నాన్-రొటీన్ సమీక్ష ఇది.
    భాష, శైలి మంచి ఫీల్ ని ఇచ్చాయి. ఇస్మాయిల్ గారికి కంగ్రాట్స్!

  15. సవివరంగా మరియు చాలా బాగా వ్రాశారు, ఇస్మాయిల్ గారు!!

  16. నేనేదో మిస్ అయిపోయినట్టున్ననే! వెంటనే చూసేయ్యాలి ఈ సినిమాని.
    మీ రివ్యూ బాగుందండి.

  17. Achyuth Rao says:

    ఈ సినిమా

  18. ఈ సినిమా చూడాలనుకొనే వారు http://www.zingreel.com/fdfw.php?id=19&type=0
    ఇక్కడ చూడొచ్చు ఈ రోజుల మధ్య…
    Show Starts On : August 09, 2013 8:00 pm
    Show Ends At : August 25, 2013 11:59 pm

  19. Nenu kuda EE cinema ni chusanu,chala bavundu, nenu Oka rakamayuna taadytmam lo vundipoyanu kasepu, manchi cinema Idi, enni puvvulunna mallepulu vasana ela ventane telisupothundo apane enni commercial movies madhyalo ayuna sagarvam ga EE cinema nilavagaladu

  20. Nice comments/reviews. Wondering whether the DVD is out for this movie!

మీ మాటలు

*