రంగు రాయి

hrk photo

తెలుసు. ఇది కల. మొదటి సారి కాదు, వెయ్యిన్నొకటో సారి కంటున్న కల. చిన్నప్పట్నుంచి ఎన్నో సార్లు కన్న కల, కొంచెం కూరుకు పట్టగానే ఎట్నించి వస్తుందో తెలియదు, వచ్చి నన్ను ఎత్తుకుపోతుంది. ఇదిగొ అదే మళ్లీ ఇప్పుడు. తెలియదని కాదు. తెలుసు.

ప్రతి సారీ ఎవరో దీన్ని నా కళ్ల మీద కప్పి వెళ్తారు. నన్నొక మసక వెలుగులో వదిలి వెళ్తారు. నేనొక విహ్వలమైన కనుగుడ్డునై తిరుగుతుంటాను. అణువణువు ఆర్తిగా కదుల్తుంది. ఆసరా కోరుతుంది. ఆసరా అందక గింజుకుంటుంది. కల కదా, కాసేపట్లో అయిపోతుందని అనిపించదు. క్షణాన్ని అనంతంగా సాగదీసినట్లుంటుంది.

కలలో పడిపోయిన ఒక ఇంటి గోడలు. చిందరవందరగా పడి వున్న రాళ్లు. కొన్ని, ఏ రాయికి ఆ రాయి. ఇంకొన్ని, ఎగుడు దిగుడుగా ఒక దాని మీదొకటి. ఒకదానితో ఒకటి అమరడానికి వీలుగా ఎప్పుడో గడేకారి చేతిలో ఉలి దెబ్బలు తిన్న రాళ్లు.

ఆ రాయి వంటింట్లో ఒక మూలన గోడ లోపల్నించి ముందుకు పొడుచుకొచ్చినట్లుండేది. అన్నం తింటూ ప్రతి సారీ కాసేపయినా ఎందుకో ఆ రాయి వైపు చూసే వాన్ని.  ‘ఎందుకట్టా వుండడం’ ఆని నేను అడిగినట్టు, ‘ఏమో, వున్నానంతే’ అని అది నాలుక చాచి నన్ను వెక్కిరించినట్టు మా మధ్య ఒక మౌన సంభాషణ జరిగేది.  ‘ఏందిరా, బువ్వ దినుకుంట అట్టా దిక్కులు జూచ్చొంటావు. ద్యానాలు సాలిచ్చి తిను. తల్లెలొ ఈగెలు వడ్తాయి. యాన్నాన్నో సూసుకుంట మెతుకులు తల్లె సుట్టు పోచ్చావు. బండలు తుడ్స ల్యాక నా రెట్టలు గుంజుతొండాయి…’ అని అమ్మ నన్ను కోప్పడేది.

అదిగో, ఒక రాళ్ల గుట్ట కింది నుంచి పాం పిల్లలా నిక్కి చూస్తున్నది, ఐమూలగా విరిగిపోయిన కిటికీ ఊచల చట్రం. వంటింటి వెనుక-గోడకు ఏడడుగుల మనుషులు చెయ్యెత్తినా అందనంత ఎత్తున వుండేది కిటికీ. దాని మీదికి ఎక్కి కూర్చోవాలని, అటు వైపు ఏముందో చూడాలని అనిపించేది. అవతల ఏమున్నాయని అడిగితే, ‘ఏముంటాయిరా తిక్కోడా, మనొల్లదే సేను, ఇంటెన్క మన జాలాడి (స్నానాల గది) నీల్లు పార్తాయి. బుర్ద బుర్ద’ అని పెద్దవాళ్లు నవ్వే వాళ్లు. కిటికీ బాగా కిందికి వుంటే ఎక్కి కూర్చోవచ్చని ఆశ పడే వాడిని. ఆ మాట అనే వాడిని కూడా. ‘ఆఁ, బలె జెప్పినావులేరా, నువ్వు కూకోనీకి కిట్కి కిందికి పెట్టియ్యాల్నా? పిల్లకాకి, నీకేం దెల్సు. కిందికి వుంటే దొంగోల్లు దాన్ని ఊడ బెరికి ఇంట్లొ దూరనీకెనా?’ అని నా నెత్తిన చిన్ని మొట్టి కాయ వేసే వాళ్లు. ‘ఒరేయ్, గదురోన్ని నెత్తిన కొట్ట గుడ్దు (కొట్ట గూడదు), గాశారం సాలక ఆయం పాట్న తగిల్తె ఎవుని పండ్లు పట్టుకోని సూడాల…’ అని మా జేజి వాళ్లను గదమాయించేది.

దొంగలను నేను ఎప్పుడూ చూళ్లేదు. చూసినంత బాగా తెలుసు. పెద్ద వాళ్ల మాటల్లో చాల సార్లు విన్నాను. ఇంకో పక్కన ముక్కలు ముక్కలుగా పడి వున్న ఆ పల్చని బండలు మా ఇంటి గరిసెలవి. గరిసె బండలను చూస్తే ఎన్నెన్నో దొంగల కథలు గుర్తుకొస్తాయి. గరిసెల్లో జొన్నలు, కొర్రలు పోసే వాళ్లు. గరిసెలు నిండుగా వున్నప్పుడు, అంటే ధాన్యం బాగా పైకి వున్నప్పుడు అమ్మ నన్ను దింపి చిన్న తట్టగంపలో జొన్నలు పైకి తెప్పించేది. పిండి చేసి రొట్టెలు చేసేది. దంచి సంకటి చేసేది. గరిసెలో చీకటి చీకటిగా చిత్రంగా ఉండేది. గుండ్రం గుండ్రంగా చేతికి చల్లగా తగిలే జొన్నలతో ఇంకాసేపు ఆడుకోవాలనిపించేది.

ఒక సారి అమ్మ పొద్దున్నే వంటింట్లోకి వెళ్లి పెద్దగా కేకలు వేయడం మొదలెట్టింది. ‘జాలాడి తూము లోంచి యా పామన్న దూర్న్యాదేమోరా, సూడు పో’ అని జేజి మా నాన్నను లేపి పంపింది. నాన్న వెనుక నేను, మా తమ్ముడు. ‘మీరు యాడికి రా’ అని జేజి అరుపులు. లోపలికి వెళ్లి చూస్తే ఏముంది?! ఆ కిటికీకి బాగా కింద వంటింటి వెనుక గోడకు పెద్ద కన్నం. దాని లోంచి చూస్తే అవతల చేని లోని నల్లమట్టి బెడ్డలు బెడ్డలుగా, మా జాలాడి నీళ్లతో కలిసి బురద బురదగా కనిపిస్తోంది. గరిసెల దగ్గర్నించి కన్నం వరకు జొన్నలు చెదరు మదురుగా పడి వున్నాయి. హడావిడిగా మోస్తున్నప్పుడు పడిపోయిన గింజలు. ఇంట్లో దొంగలు పడడం, కన్నం వేయడం అంటే ఏమిటో అప్పుడే తెలిసింది. తరువాత ఎన్ని కథలు విన్నానో. ఎప్పుడెప్పుడు ఎట్టెట్టా ఇంట్లో దొంగలు పడ్డారో జేజి వైనవైనాలుగా చెప్పేది. ఇప్పుడా కిటికీ విరిగి పడి రాళ్ల మధ్య నుంచి దొంగ చూపులు చూస్తోంది.

గరిసె బండలను చూస్తే, పెద్దవాళ్లు చెప్పిన మరో ఘటన మనసులో కదిలి భయపెడుతుంది. గరిసెలో దిగేప్పుడు బయట అమ్మ కాకుండా ఇంకెవరైనా వున్నారేమోనని భయంగా చూసుకునే వాన్ని. మా మామ అన్న ఒకాయన వాళ్లింటి గరిసెలో ఊపిరాడక చచ్చిపోయినాడంట. మా మామకూ ఆయన అన్నకు ఆస్తి పంపకాలలో తగాదా వచ్చింది. తమ్ముడు గరిసెలో ఏదో మూలన బంగారం దాచిపెట్టాడని అన్నకు అనుమానం. అన్న గరిసెలో దిగి బంగారం కోసం వెదకడం మొదలెట్టాడు. మా మామ గరిసె మీద బండ మూసి కూర్చున్నాడు. గాలి పోవడానికి సందు లేని బండ. అన్న ఎంత అరిచినా తమ్ముడు బండ తీయలేదట. ఊపిరాడక ప్రాణం వదిలాక బయటికి తీసి ఏవో కతలు అల్లి చెప్పినాడంట మా మామ. వాళ్లు బాగా ఉన్నోళ్లు. అంత ఆస్తికి మా మామ ఒక్కడే. ఇక, నోరు తెరిచే దెవరు? ఈ కథ విన్నాక, మా ఇంటికొచ్చినప్పుడు మామను చాల సార్లు చూశాను. నెమ్మది మాట, నెమ్మది నడక. ఆయన మాట మీద మా నాన్నకు మంచి గురి. అలాంటాయన ఆ పని చేసుంటాడని ఎలా అనుకుంటాం. అదేదో పుకారు. అయినా, కథ చెప్పుకోడానికి, వింటానికి బాగుండేది. పెద్ద వాళ్లు ఆ కథ చెప్పుకుని పగలబడి నవ్వుకునే వాళ్లు. చివరాఖర్న ‘గరిసెలో దిగేటప్పుడు బామ్మర్దిని నమ్ముకోవాల గాని తమ్మున్ని నమ్మకో గుడ్దు రోయ్’ అని నీతి కూడా చెప్పుకునే వాళ్లు.

రాళ్ల గుట్టల్లో ఇంకో పక్కన బాగా పొడుగు, వెడల్పు, మందం వున్న కొన్ని బండలు సగం వరకు మట్టిలో కూరుకుపోయి వున్నాయి. అన్నిటి కంటె పెద్ద బండ మా ఇంటి ముందు పెద్దరుగుది. మిగిలిన చిన్న ముక్కలు అక్కడే ఎడమ వైపు అరుగువి. తలవాకిలి దాటి ఇంట్లోకి వెళ్లాలంటే ముందుగా ఆ రెండరుగుల మధ్య బండ-చట్టం మీద నడవాలి. పెద్దరుగు మీద గోడ వారగా ఎప్పుడూ ఒక రంగుల సిరిచాప చుట్ట వుండేది. చాప కొసన దారాలు అరుగు మీంచి కొద్దిగా వేలాడుతుండేవి. నేను కింద నిలబడి సిరిచాప ముట్టుకోడానికి చెయ్యెత్తే వాన్ని, ఎంత పొడుగు వున్నానో చూసుకోడానికి. మొదట్లో అందేది కాదు. చాప నాకు అందేంత దగ్గరయ్యే కొద్దీ పెద్ద వాన్ని అవుతున్నానని మురిసిపోయే వాన్ని.

పూర్తిగా చేతికి అందాక కూడా నాకు చాప మీద ఆసక్తి పోలేదు. అదొక సంకేతం.

అరుగు మీద చాప విప్పి పరిచారంటే, బయటి నుంచి బంధువులెవరో వచ్చారన్న మాట. ఆ రోజు ఇంట్లో వరి బువ్వ. మిగిలిన రోజుల్లో కొర్రన్నం లేదా జొన్న సంకటి. విసుగొచ్చేది. బంధువులొస్తే ఒక్కోసారి మాంసం కూడా వుంటుంది. వచ్చిన వాళ్లు చిన్న వాడినని నన్ను ముద్దు చేస్తారు. అందరు కాదు గాని మా మామ లాంటి వాళ్లు తియ్య-కారాలు కొనుక్కోడానికి ఒక బొట్టో, అర్ధణానో ఇస్తారు. సిరిచాప మీద కూర్చుని వాళ్లు మాట్లాడుకునే మాటలు అర్థం కాకపోయినా వింటానికి భాగుంటాయి. వాళ్లకు కనపడేట్టు, రెండరుగుల మధ్యన చేరి; నేనూ మా తమ్ముడు జొన్న-దంటు బెండ్లు, ఈనెల బండికి చిన్ని రాతి ఎద్దులు కట్టి ఆడుకునే వాళ్లం. నేను మా కళ్లం లోంచి బంక మట్టి తెచ్చి బస్సు చేసి ‘పాం పాం’ అంటూ నడిపే వాన్ని. అది చూసి అరుగు మీది వాళ్లు ‘ఈడు సేద్ద్యానికి పన్కి రాడు. తెల్లపుల్లగ బట్టలేస్కోని బస్సుల్లో తిరుగుతాడు, యా పట్నంల బతుకుతాడు’ అనే వాళ్లు.  ‘ఏమో ఎవుని నొస్ట ఏం రాసి పెట్న్యాదో. పిల్లొల్లు గుడ్క మన లెక్క ఎద్దు గుద్ద పొడ్సుకుంటా పల్లె కొంపలో పడుండాల్నా?’ అనే వాడు మా నాన్న కలలు కనే కళ్లతో.

చిన్నప్పుడు నాన్న మాటలు అంతగా అర్థమయ్యేవి కాదు. ఏదో మెచ్చికోలు మాటలు అనిపించేదంతే.

పెద్దయ్యే కొద్దీ అవి బాగా అనుభవానికి వచ్చాయి. ఊళ్లో ఒకేలా మార్పు లేకుండా దొర్లే రోజులు; తెల్లారు ఝామున లేచి ఇంటి పనులన్నీ చేసుకుని, అన్నం ఎక్కడుందో మాకు చెప్పి ‘పెద్దోడా బయిటికి వొయ్యెటప్పుడు వాకి లెయ్యి, కుక్కలు వడ్తే రాత్రికి బువ్వ వుండద’ని అరిచి చెప్పి వెళ్లి మునిమాపుకు గాని రాని అమ్మ. పుస్తకాల్లోని అమ్మల్లా నన్నూ తమ్మున్ని లాలించడానికి, ప్రేమగా దగ్గరికి తీసుకోడానికి తీరిక లేని అమ్మ. అప్పుల ఊబిలో కూరుకు పోయి దిక్కు తోచక, మరెక్కడా కసి తీరక మా వీపుల మీద ములుగర్ర విరగ్గొట్టే నాన్న; ‘ఈళ్ల కేముంది, కొట్టం మింద సెత్త లేని నాయాండ్లు, పిల్లనిచ్చేటోడు గుడ్క దొర్కడు’ అని తిరస్కారంగా చూసే కలిగినోళ్లు; పట్నంలో చిన్న ఉద్యోగమైనా నీడ పట్టున బతకొచ్చునని, ఫ్యాను గాలి కింద పడుకోవచ్చని, వారానికి ఒక సారి సెలవుల్లో సినిమాలకు షికార్లకు వెళ్లొచ్చని అందరూ అనుకునే మాటలు…. వూళ్లో వుండడం నాకు ఒక మజిలీ మాత్రమే, ఎప్పటికీ వుండబోయేది లేదనే బాధ; అలా జరగదు, బతుకంతా ఆ ఇరుకులోనే గడపాలనే దిగులు… రెండూ ఒకే సారి కదుల్తుండేవి.

ఈ రాళ్లన్నీ కాదు, నాకు చాల ముఖ్యమైనవి రాళ్లు వేరే ఉన్నాయి. దుమ్ము పడినా ఎండకు మెరుస్తున్నఎర్ర రంగుపట్టెల రాళ్లు. వాటిని చూస్తే ఏడుపొస్తుంది. తల వాకిలికి రెండు పక్కల.,  కింద గడప దగ్గర్నుంచి పైన సుంచు-బండ (అటక) వరకు స్కేలు పెట్టి దిద్దినట్లుండేవి రంగుపట్టెలు. అవంటే నాకు చాల ఇష్టం. ఎర్ర రంగుపట్టెలు వూళ్లో అన్ని ఇళ్లకూ ఉంటాయి. మావి అన్నిటి లాంటివి కావు. మిగతా ఇళ్ల వాకిళ్లకు ఎర్రమన్నుతో పూసిన మొరటు పట్టెలుంటాయి. ఇంటి వాళ్లకు ఓపిక కుదిరి, బండి కట్టుకెళ్లి ఎక్కడి నుంచో ఎర్రమన్ను తెచ్చి పూస్తే కొన్ని రోజులు కొత్తగా ఉంటాయి. లేకుంటే మాసిపోయి, వెలిసిపోయి ఉంటాయి. మా ఇంటి పట్టెలు అట్టాంటి ఎర్రమన్నువి కావు. నూనె రంగులతో తీర్చినవి. మాసిపోకుండా నిగనిగలాడుతుండేవి. అవి మా ఇంటి ప్రత్యేకత. ఒక్కో ఇంటికి ఒక ప్రత్యేకత. ఇపుడు దుమ్ములో అడ్డదిడ్డంగా పడిన రంగుపట్టెల రాళ్లను చూస్తుంటే ఏదో లోయ లోనికి కొద్ది కొద్దిగా జారిపోతున్నట్లు దిగులు.

ఇదంతా కల. తెలుసు. ఇది భయం కాదు. దిగులు.

దిగులేనా? నిజంగా నేను దిగులు పడతున్నానా? కలను ఎంజాయ్ చేస్తున్నానా? ఏమో!

ఉన్నట్టుండి నాకు మా వంటింట్లోని చిన్నరుగు గుర్తొచ్చింది. రాళ్ల గుట్టల్లో ఆ పొడుగాటి పల్చని బండ కోసం కనుగుడ్డు వెదుక్కుంది. నేను, తమ్ముడు చాల చిన్నప్పట్నించి సునాయాసంగా ఎక్కి కూర్చుని అన్నాలు తిన్న చిన్నరుగు. దాని మీద ఆ స్తంభానికొకరం ఈ స్తంభానికొకరం కూర్చుని లేనిపోని కబుర్లన్నీ చెప్పుకున్న, కొట్లాడుకున్న చిన్నరుగు.

ఉన్నట్టుండి, తమ్ముడు చొక్కా జేబు లోంచి చిన్న గులక రాయి తీసి చేత్తో పట్టుకుని, ‘అనా, నేను సిన్నోన్నని ఊకూకె కొడుతొండావు. రాయితొ కొడ్తె నెత్తిన బొర్ర పడ్తాది సూడు’ అని బెదిరిస్తున్నాడు. వాడు నిజంగానే రాయి విసురుతాడనిపించింది. ‘అమా, ఈడు జూడే’ అని నేను అరుస్తున్నాను. ‘ఏందిరా ఇద్దరు ఎప్పుడు జూసినా? వాదు ల్యాక వల్లూరికి వోతొండ ఇరుగు పొరుగు నా సవుతులార ఇల్లు బద్రమే అన్నెట్టూ…..” అని అమ్మ కోప్పడుతోంది, పొయ్యి దగ్గర పొగ చూరిన వెలుగు లోంచి.

అంతలోనే గుర్తొచ్చింది. ‘ఇప్పుడు తమ్ముడు లేడు కదా?. అమ్మ… అమ్మ… మాత్రం ఎక్కడుంది? మరి ఈమె, వీడు… ఎవరు వీళ్లు? ఏమిటిదంతా’ అని మనసు గింజుకుంది.  లోతు నీళ్లల్లోంచి పైకి వస్తున్నప్పుడు, ఇంకా ఊపిరి తీసుకోడానికి వీల్లేనప్పటి మంచు తెర లాంటి స్థితి

‘ఇగో అనుమంత్రెడ్డీ’ ఎవరో పిలుస్తున్నారు. కలలోని వాళ్లు కాదు. భుజం మీద ఎవరిదో చెయ్యి. అది కూడా కలలోని మనుషులది కాదు. కళ్లు తెరిచా‍ను. మా పొట్టి వేపమాను కొమ్మల్లోంచి ఎండ పొడ మంచం మీద పడుతోంది. మంచం పక్కన రాజేశ్వరమ్మ పిన్ని నవ్వు మొహంతో చూస్తోంది. ‘ఏం సిన్నా! ఏమన్న కల వడింద్యా? ఏందేందో అంటొండావు. ఎవురితో మాట్లాడుతొండావూ?” అడిగింది దీర్ఘాలు తీస్తూ. ఒక్క క్షణం నేనెక్కడున్నానో తెలియలేదు. “నేను ఎక్కడున్నాను?” అడిగాను, పిచ్చి చూపులు చూస్తూ.  “యాడొండావు. మన ఇంటి కాడొండావు. ఇట్టా పదేండ్ల కొగ సారి వూరి మొగం జూచ్చె ఎట్ట తెలుచ్చాది నాయ్నా! మీకేం పట్నం బొయి హాయిగ వుండారు. ఈడ మనొల్లు ఎట్టా బతుకుతొండారొ అని ఎప్పుడన్నా అనుకుంటావా? సర్లె సర్లె, లేసి మొగం గడుక్కో. కాపి సల్లారిపోతాది”, ఈసారి పిన్ని నవ్వులో కొంచెం నిష్ఠూరం. నాకు లేవాలని లేదు. “కొంచెం వుండు పిన్నీ, అయిదు నిమిషాలు’ అని మళ్లీ కళ్లు మూసుకున్నాను.

మనసు చాల గజిబిజిగా వుంది. నా చుట్టూ అసహజమైనదేదో వుంది. నాకు ఇష్టం లేనిది ఏదో వుంది. తెలిసీ తెలియక కెలుకుతోంది. అదేమిటో తెలియడం లేదు. ఇల్లు… పడిపోయిన ఇంటి గోడలు, రాళ్లు… మగత మెలకువలో దొర్లుతున్నాయి. బాగా మందుకొట్టిన రాత్రి తెలవారు ఝాము మెలకువలో కలిగే పశ్చాత్తాపం లాంటి నొప్పి.

నన్ను బాధ పెట్టేది ఏమిటో వెంటనే గుర్తొచ్చేదే గాని, పిన్ని నిష్ఠూరం మాటలతో మనసు అటు వైపు పోయింది. మా చిన్నాన్నకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ పెద్దగా చదువుకోలేదు.  రియల్ ఎస్టేట్, కాంట్రాక్టు పనుల్లో తిరుగుతుంటారు. చిన్నాన్న, పిన్ని వ్యవసాయం చూసుకుంటూ వూళ్లో వుంటారు. అందరూ పట్నం పోదామని ఆలోచిస్తుంటారు. పట్నంలో ఏం చేయాలో తోచక ఊళ్లో వుండిపోయారు. నా మాదిరి తన కొడుకులకు పట్నంలో ఉద్యోగం లేదని పిన్ని దిగులు. వాళ్ల ఉద్యోగాల గురించి నేను పట్టించుకోడం లేదని నిష్ఠూరం. ఉద్యోగాలు ఏమంత గొప్ప కాదని వ్యాపారాలే మేలని చెప్పినా వినదు.

ఈ అపార్థాల వైకల్యంతో కలగలిసిన కల. ఇప్పటిది కాదు. మొదటి సారి, కలకు నిజానికి తేడా తెలియని వయసులో కలత పెట్టిన కల. తరువాత నేను ఎక్కడ ఎలా ఉన్నా చెప్పా పెట్టకుండా వచ్చి కళ్ళ మీద వాలుతుంటుంది. అదే కల, అవే దృశ్యాలు.

కలలో రంగుపట్టెల రాళ్ల ముక్కలు చూస్తుంటే, అవి ఇక వుండవనే స్పృహతో పాటు, అవి కూడా లేకపోతే వూరిలో మా ఇంటికి ఏ ప్రత్యేకత వుండదనే బాధ. ఏ గుర్తింపు లేకుండా పిండిలో రేణువుల్లా ఎందుకు వున్నామని విచికిత్స, చదువుకుని పట్నం వెళ్లి ప్రత్యేకత సంపాదించాలని కోరిక, అదంత సులభం కాదు, ఎన్నో పరీక్షలు పాసు కావాలి అని నిరాశ.. ఉప్మా ప్లేటులో కాఫీ ఒలికి, తడిసిపోయినట్టు, దాన్ని తీసుకెళ్లి సింకులో పారబోయాలన్నంత చికాకు.

ఆ భయాలు, విచికిత్సలు ఇప్పుడుంటానికి వీల్లేదు. ఊరు వదిలేసి హైదరాబాదు చేరి చాల కాలమయ్యింది. నేనే కాదు, తమ్ముడు, అమ్మ చాల మంది బావలు, బా‍మ్మర్దులు హైదరాబాదుకు చేరారు. అర్ధాంతరంగా తమ్ముడు, ఆ తరువాత అమ్మ చనిపోయారు. తమ్ముడు వుండినా వూరికి వెళ్లి చిన్నరుగు మీద కబుర్లు చెప్పుకుంటామా? ఊరికి వెళ్లాలని వుంటుంది. మా ఇల్లు కళ్లారా చూసుకోవాలని వుంటుంది. వెళ్తే ఎక్కడ వుండటం? తమ్ముడు వున్నప్పుడే ఇంటిని చిన్నాన్న వాళ్లకు అమ్మేశాం. మాది కాని ఇంట్లో ఒకటి రెండు రోజులకు మించి వుండలేను. నేను హైదరాబాదులో హాయిగా వుంటే తాము, తమ పిల్లలు పల్లె కొంపలో వుండిపోయారని, దానికి నేను ఏమైనా చెయ్యొచ్చు కదా అని, చెయ్యడం లేదని దాయాదుల కళ్లల్లో అప్రకటిత ఫిర్యాదు. ఊరికి వెళ్లడం కుదరదు. కల వదలదు. వదలడానికి అది వట్ఠి జ్ఙాపకం కాదు. భవిష్యత్తు కూడా.

ఆ రోజు ఊళ్లో, మాఅఅ పొట్టి వేపచెట్టు నీడ కింద పడుకుని వున్నప్పుడు, మళ్లీ అదే కల. ఇదేమిటని అనుకుంటుండగా, అక్కడి అసహజమేమిటో చటుక్కున తోచింది. ఎవరో వీపున చరిచినట్లయ్యింది. కళ్లు తెరిచి మంచం మీద కూర్చున్నాను.

పొట్టి వేపచెట్టు కింద పడుకుంటే, దాని నీడ పక్కకు పోయే సరికి మా ఇంటి నీడ నా మీద పడా‍లి. పడడం లేదు. అక్కడ మా ఇల్లు లేదు. ఇల్లు వుండిన చోట, ఆ స్థలం మధ్యలో, తడి తడి ప్లాస్టరింగ్ వాసన వేస్తున్న కాంక్రీటు ఇల్లు. చిన్నాన్న వాళ్లు ఇంటిని మా నుంచి కొన్నాక, కొన్నాళ్లు అందులోనే కాపురం చేశారు. కొడుకులు వ్యాపారాల్లో గడించిన డబ్బుతో, పాత ఇల్లు పడగొట్టి కొత్తగా కట్టారు. ఇప్పుడు నేను వచ్చింది కొత్తింటి గృహప్రవేశానికి. కొత్తింటికి ఒక పక్కన, ఇంకా బయటికి తీసుకెళ్లి పడేయని పాత ఇంటి రాళ్లు, కిటికీ చట్రాలు, పగిలిన బండలు. అన్నీ మా ఇంటివే. కల కాదు. నిజం.

‘ఏం వోయ్. పల్లెటూల్లో ఫ్యాను ల్యాక పొయినా బాగ నిద్ర పట్టి నట్టుందే? ఏందో శాన దీర్గాలోశన్లో వుండావబ్భా!”

పలకరింపు విని, ముఖం మీది చెమట తుడుచుకుంటూ తల పైకెత్తి చూశాను. వీరా రెడ్డి మామ. వాళ్ల కల్లానికి వెళ్లాలంటే మా ఇంటి మీదుగానే వెళ్లాలి. మామ ధోవతి చుంగులు పైకి సర్దుకుని నాకు కొంచెం దూరంగా మంచం మీద కూర్చున్నాడు. తనది ఎప్పుడూ నవ్వుతున్నట్టుండే మొహం. మాట కూడా అంతే. ప్రతి దాన్నీ తేలిగ్గా‍ తీసుకుని మాట్లాడుతున్నట్టు వుంటుంది. కాని, అవి అనుభవాలతో పండిన మాటలు. అనుభవం పండితే అన్నీ తేలికే.

“ఎక్కడికి మామా! కల్లానికా?” అని ఎదురు పలకరించి, జవాబు కోసం చూడకుండా, “పాత రాతి మిద్దెలు ఎత్తుగా, చల్లగా వుండేవి కదా!? అవి పడగొట్టి పట్నంలో మాదిరి ఈ పొట్టి ఇళ్లు ఎందుకు మామా? ఈ ఖర్చులెందుకు? అర్థం కావడం ల్యా” అన్నాను, నా దీర్ఘాలోచనకు ఒక నెపం కల్పిస్తూ.

“అంటె, ఏమంటావ్వొయ్య్, మీరంతా పట్నంల ఫ్యాన్లేసుకోని, ఏసీలేసుకోని సల్లగ పండుకాల. మేము ఇట్నె యాపసెట్ల కింది సింత సెట్ల కింద బతకాల్నా?”, అని నవ్వేశాడాయన. “అట్ట గాదు గాని అల్లుడా! రాతి మిద్దెలయితే, పైన మట్టి మెత్తు ఏస్కో వాల్య. యాడాదికి ఒగ సారి బండి గట్క పొయ్యి, సౌడు మన్ను తోల్కోని రావాల్య. ల్యాకుంటే పైన బొక్కలు వడి పొట్కు వెడ్తాది. వానకు గోడలు వుబ్బిపొయ్యి, రాల్లు పక్కకు జరుగుతాయి. వుశారుగుండి సగేసుకోక పోతె గోడ పడిపోతాది. ఇప్పుడయ్యన్ని ఎవుడు జేచ్చాడు? ఆ ఓపిక ఎవుడికుంది? అన్ని సిటికెల పందిరి లెక్క అయిపొవ్వాల.”

ఆయన చెప్పింది కూడా నిజమే కదా అనుకుంటూ మౌనంగా వుండిపోయాన్నేను.

“అయిన గాని, ఇయ్యాల్రేపు పల్లె అని పట్నమని తేడా యాడ కాలవడింది లే. మీ కాడ వుండేటివన్ని మా కాడి గ్గూడ వచ్చొండాయి. అగో, ఈ బజారు దాటి పోతె బస్టాండు. నీ సిన్నప్పుడు మనూల్లొ బయిట కాపి నీల్లు దొర్కుతొండెనా. ఇప్పుడు బస్టాండు కాడికి వొయ్యి సూడు. ఐదు టీ హోటళ్లు, ఆడ పట్టకుండ పిల్లోల్లు. అప్పుడు ఒక బస్సు రెండు టిప్పులు తిర్గు తొండె. ఇప్పుడు రెండు బస్సులు కల్సి ఎనిమిది సార్లు తిర్గినా సీటు దొర్కదు. ఎవునికి వూర్లొ కాలు నిలవడదు. ఏం శాతగా‍నోనికి సేద్దెం. శాతనైనోడెవుడు పల్లెకొంపల్లొ వుందామనుకోడం ల్యా. ఈడ ఏందో కారిపోతోందని, ఏందో పొగొట్టుకున్న్యామని వూకె నోటి మాటకు అంటొంటారు నీ లెక్కటొల్లు. అదే నిజమైతె మీరు ఈడికి ఒచ్చి వుండొచ్చు గదా. రిటైరయినోల్లన్న రావొచ్చు గదా? యా రారు! ఈడ యా టీచరుద్యోగమో వున్నోల్లు గుడ్క ఈడ వుండరు. కర్నూల్లొ కాపిరం. ఈడికి ఏందదీ… అప్పండౌన్. అన్ని వుత్త మాటలు. ఆడ మీకు బోరు గొట్టినప్పుడు, ఏందన్న కస్టమొచ్చినప్పుడు అట్టా అంటొంటారు. ఈడ వుండెటోల్లు గుడ్క ఎవురు ఈన్నే వుండాలని అనుకోడం ల్యా. సదువు ఒంట బట్టినోల్లు, శాతనైనోల్లు యాదో ఒగ పని జూస్కోని పట్నం జేరుతొండారు. ల్యాకుంటే, ఈడ్నె ఉండి సుట్టుపట్ల యా బూముల యాపారమో సూసుకుంటొండారు. అది గుడ్క కుదరనోల్లు శాన కమ్మి. ఈడ వుండెటోల్లు గుడ్క, మరీ బాతిగానోల్లు దప్ప, పాత ఇండ్లు ఎవురుంచుకుంటారు? ప్యాదోల్లు గుడ్క వుంచుకోడం ల్యా. ఇందిరమ్మ ఇండ్లో ఇంగొగటో… సిమెంటు ఇండ్లు ల్యాకుంటే ఎవురు ఒప్పుకోడం ల్యా.”

మామ మాటలు వింటుంటే నాకెందుకో ఎమ్మేలో నా క్లాసుమేటు, నక్సలైటు నాగేశ్వర రావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వాళ్ల పార్టీ ముందుగా పల్లెల్లో అధికారం సంపాదించి, పల్లెలతో పట్టణాలను ముట్టడిస్తుందని అనే వాడు. ఆ సంగతేమో గాని, ఇప్పుడు పట్నాలు పల్లెలను ముట్టడిస్తున్నాయి.

ఇది మంచికా చెడుకా?

ఏది మంచి ఏది చెడు?

చిన్నా‍న్న వాళ్ల గృహ ప్రవేశం చూసుకుని హైదరాబాదు వచ్ఛాక ఇంత వరకు మళ్లీ మా వూరికి వెళ్ల లేదు. అక్కడి నుంచి బయల్దేరే ముందు మా ఇంటి రాళ్ల దగ్గరికి వెళ్లి కాసేపు నుంచున్నాను. టేబుల్‍ మీద పెట్టుకుందామని, రంగుపట్టెల రాళ్ల ముక్కల్లో ఒకటి చేతిలోకి తీసుకున్నాను. నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. రంగు రాయిని గుట్ట మధ్యకు విసిరి వచ్చేశాను.

— హెచ్చార్కే

 

 

మీ మాటలు

  1. ఈ కథ చదువుతున్నంతసేపూ ఒకానొక ఇంటర్వ్యూలొ మీ వరకూ మీరు కథా లేదా కవితా రాయటాన్ని పోల్చి చెప్పటం గుర్తొచ్చింది. ఈ కథలో నాకు నచ్చిన విషయం భాష….చాలాపదాలు నాకు తెలియనవే! కథ ట్రీట్ మెంట్ అంటే ఏంటో కూడ తెలిసొచ్చింది సర్..ఇంతవరకూ మీ కవితలే చదివినవాడిగా నాకుఇదొక కొత్త అనుభూతి.హత్తుకున్న కథ.మళ్ళీ మళ్ళీ చదవాలి

  2. థాంక్సెలాట్‍ శ్రీనివాస్ వాసుదేవ్, ‘చాల పదాలు నాకు తెలియనవే’ అనే చోట టైపో దొర్లినట్టుంది. చాల పదాలు ‘తెలియనివి’ అయినట్లైతే మీకు ఇబ్బంది కలిగి వుంటుంది. ఈ విషయమై మీ అభిప్రాయం, ఇతర మితృల అభిప్రాయం తెలుసుకోవాలని వుంది. :-)

  3. కొన్ని పదాలు “తెలియనివి” అనె..ఇబ్బందేం లేదు. అది కథని ఆస్వాదించేపనిలో భాగమె. “బండలు తుడ్స ల్యాక నా రెట్టలు గుంజుతొండాయి…” “గడేకారి” “గాశారం సాలక ఆయం పాట్న తగిల్తె ఎవుని పండ్లు పట్టుకోని సూడాల” “వుశారుగుండి సగేసుకోక పోతె గోడ” వీటిని చదవటంలో ఇబ్బందేంలేదు..ఆ కాంటెక్స్ట్ ని బట్టి అల్లుకుపోతుంటాం లెండీ. కొన్ని కథలని ఆస్వాదించటానికి వేగిరపడి చదవలేం.అలాంటిదే ఈ కథకూడా. ఖచ్చితంగా మంచికథే!

Leave a Reply to హెచ్చార్కె Cancel reply

*