నినదించే కవిత్వం ‘చెర’ ప్రతి పదం!

cherabandaraju1

చెరబండ రాజు ఇక లేడు.

ప్రజలకోసం అంకిత భావంతో అశ్రాంతమూ శ్రమించిన వాడు… పది సంవత్సరాలపాటు ప్రభుత్వం అతన్ని వెంటాడింది. ప్రజలకోసం ప్రజలభాషలో కవిత్వం రాసేవాళ్లని రాజ్యం పెట్టే హింసలు గిరిజన, రైతాంగ వీరులని పెట్టే హింసలకి తులతూగుతుంది. అయితే అతని మార్గదర్శకుడూ, శ్రీకాకుళం విప్లవ కవీ అయిన సుబ్బారావు పాణిగ్రాహిలా అతన్ని ప్రభుత్వం చంపలేదు… అతను బ్రెయిన్ ట్యూమర్ వల్ల చనిపోయాడు,అంతమాత్రం చేత అతని ఆరోగ్యం మీద అతను పదే పదే జైలుకి వెళ్లిరావడం యొక్క ప్రభావాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. అతను మొదటిసారి 1971లో PD Act క్రిందా, 1973లో MISA Actక్రిందా, సికిందరాబాదు కుట్రకేసులో ఇరికించి 1974 లోనూ అరెస్టు అవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో ఇతర విప్లవ కవుల్లా ఎమర్జెన్సీ సమయం అంతా జైల్లోనే గడిపేడు… ఆ సమయంలో అతను పేగు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ. (బ్రెయిను ట్యూమరు అనంతర పరిణామం).  అతని సన్నిహిత మిత్రులతనిని ముద్దుగా ‘చెర ‘ అనిపిలుస్తారు… అతని జీవితానికి ‘చెర ‘ అంత చక్కగా అమిరిపోయింది.

పూర్వపు హైదరాబాదుజిల్లాకి చెందిన అంకుశపురం గ్రామంలో బద్దం భాస్కర రెడ్డి గా జన్మించిన చెరబండ రాజు, ప్రాచ్యభాషాహిత్యంలో పట్టా తీసుకుని హైదరాబాదులోనే ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించేవాడు. అతను మరో అయిదుగురు  కవులతో కలిసి దిగంబర కవులలో ఒకడిగా 60వ దశకం చివరలో ఒక్క సారిగా తెరమీదకి వచ్చేడు.  వాళ్ళు …. చెరబండ రాజు జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, మహాస్వప్న, భైరవయ్య… వంటి చిత్రమైన పేర్లు పెట్టుకుని అద్భుతమైన కవిత్వం రాసేరు. ఆ ఉద్యమం ప్రాధమికంగా వ్యక్తుల్నీ, సిద్ధాంతాల్నీ లక్ష్యపెట్టకుండా పేరుకుపోయిన విశ్వాసాల్ని విధ్వంశం చేయ సంకల్పించినది… దానికి వాళ్ళు ఎన్నుకున్నవికూడా ఘాటైన అశ్లీలమైన పదాలు… భ్రష్ట ఛిద్ర శృంగార జీవితాల్లోంచి ఎంచుకున్న ప్రతీకలూను. దానికి తగ్గట్టే ఆ రోజుల్లో గౌరవించడానికి యోగ్యతగల వ్యక్తులు గాని, సిద్ధాంతాలు గానీ లేవు.

అవి చెకోస్లోవేకియా సోషలిజానికి అనువుగా ఉండడానికి రివిజనిజం యుద్ధ టాంకులు నడిపి అణగదొక్కిన రోజులు; ఒక తరం తరం యువత యావత్తూ అసాంఘిక కార్యకలాపాలవైపూ, అరాచకపు అలవాట్లవైపూ మరలిపోతుంటే, ఇంకోవైపు  ప్రాన్సులో కోపోద్రిక్తులైన విద్యార్థులని ంచుకుందికి జీన్ పాల్ సార్ట్ర వంటి సంప్రదాయ వ్యతిరేకి తప్ప వాళ్లగోడు వినే నాథుడు ఎవరూ దొరకలేదు; మనదేశంలో చూడబోతే, శ్రీకాకుళంపోరాటంలో నక్సల్ బరీ ఉద్యమం దాని ప్రభావం పూర్తిగా కనబరచలేదు; మావో ఆలోచనా విధానంలోని మౌలిక విశిష్టతగాని, అద్భుతమైన శ్రామికవర్గపు సాంస్కృతిక విప్లవాన్ని గాని ప్రపంచం అర్థం చేసుకోని రోజులవి. అధికార మార్క్సిస్టులని కోశాంబి తిరస్కారంగా మాటాడే మార్క్సిస్టులు దిగంబరకవులని అనామకమైన బూర్జువా అరాచకపు కవులుగా కొట్టి పారేసినా, అధికార మార్క్సిస్టుల ప్రాపకంలో, మద్రాసు సినీ కవిత్వపు అంతస్సంస్కృతితో అభ్యుదయ ముద్రతోఅలరారేవారి ముతక చవకబారు బజారు అశ్లీల సాహిత్యంకంటే, వీరి నిజాయితీ గల ఆగ్రహంలోంచివచ్చిన అశ్లీల పదజాలమే ప్రశ్నించగల యువతరాన్ని ఆకట్టుకుంది. దిగంబర కవులు అన్ని సిద్ధాంతాలకీ వ్యతిరేకత ప్రకటించి, వ్యవస్థీకృత రాజకీయాలకి వ్యతిరేకులైనప్పటికీ, సామాజిక, రాజకీయ  సమస్యలకి విముఖులు కారు. 1965లో వాళ్ల ప్రథమ కవితా సంకలనంతో పాటు వాళ్లు విడుదల చేసిన మేనిఫెస్టో ఒక అస్తిత్వవాద కరపత్రంగా కనిపిస్తుంది.

(ఇన్ని సాంఘిక, ప్రకృతిసిద్ధ మైన కార్య నిమగ్నతల మధ్య, నిన్ను నువ్వు ఇరికించుకున్న వేల తొడుగుల ముఖాల మధ్య, విరామమెరుగని జీవన పోరాటాల మధ్య, నువ్వు ఒంటరివే, జీవన్మరణ పోరాటంలో ఒంటరి సైనికుడవే.) వీరి కవితలు పాఠకుడిని పదే పదే తనకున్న సామాజిక తొడుగులని విడిచిపెట్టి , తమని తాము దిగంబరంగా చూసుకోమని అర్థిస్తాయి. మనిషి తపనపడే సామాన్య విషయాలని  గర్హిస్తాయి:

నాకోక సారి చెప్పు,

నువ్వు ఏడవని రోజుందా?

పొగచూరిన నీ ముఖం

నాకు బొగ్గుగనుల్ని గుర్తుచేస్తుంది

(నిఖిలేశ్వర్)

ఆ రోజుల్లో కూడా వాళ్ళు దిగంబరంగా చూడమన్నది మనిషి స్వభావంగా మారిన అవినీతిమయమైన సమాజపు దుర్మార్గాన్ని; వాళ్లు పీలికలు చెయ్యమన్నది శాంతి, ప్రగతి అంటూ మోసకారి రాజకీయ నాయకులూ, ఆదర్శవాదులూ ప్రజాస్వామ్యానికి తొడిగిన బూటకపు ముసుగుని; నాగరికత తెచ్చిపెట్టుకున్న గౌరవనీయతని. ఇది ముఖ్యంగా చెరబండరాజు, నగ్నముని, నిఖిలేశ్వర్ ల విషయంలో ఎక్కువ వర్తిస్తుంది. చెరబండరాజు విషయంలో ఇతరకవులు భావించినట్టు మనిషి నగ్నత్వాన్ని కప్పిఉంచే సామాజిక వ్యక్తిత్వంకంటే, ఆ వ్యక్తిలోని ఆత్మవంచనని ఎక్కువగా అతను నిరసించాడు.

ఏది ఏమైనా, ఒక ఏడాది తర్వాత వచ్చిన తమ రెండవ మేనిఫెస్టోలో “ప్రస్తుతం ఉన్న క్రూర సమాజాన్ని రూపుమాపి, సరికొత్తదీ, ఉదాత్తమైన సమాజాన్ని తీసుకు రావాలనుకుంటున్న ఆకాంక్షని ప్రకటించారు. ఈ క్రింది పంక్తులు ఆ రోజుల్లో చెరబండరాజు కవిత్వానికి అద్దం పడతాయి:

అవకాశవాద పెత్తందారుల బూట్లు నాకుతూ

వాళ్ళ నీడల్లోనే నువ్వు భవంతులు కట్టుకున్నావు

ఆ పునాదులు కదిలేలోపు

నిన్ను పంపిస్తాను,

లేదు, జైలుకి మాత్రం కాదు

కసాయి కొట్టుకి.

1968లో విడుదల చేసిన వాళ్ళ మూడవ మేనిఫెస్టోలో, వాళ్ళ ఆవేదనలు ఇంకా స్పష్టంగా సామాజికమైపోయాయి.

వాళ్ళ సైద్ధాంతిక వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. అయితే వాళ్ళు ఒకటి గుర్తించేరు: పేదరికమూ, ఆకలీ విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నంతకాలమూ, మార్క్సిజాన్ని ఎదిరించేసాహసం ఎవరూ చెయ్యలేరని. పేదరిక నిర్మూలనానికి  మార్క్సిజం గురించి ఇంత చిన్న ప్రాధమిక అవగాహనతో, విరసం (విప్లవ రచయితల సంఘం) ఆవిర్భవించే వేళకి ఇందులో కనీసం నలుగురైనా మార్క్సిస్టు- లెనినిస్టు రచయితలుగా ఎదిగేరు.  కమ్యూనిజం రివిజనిజంగా రూపుదిద్దుకున్న కాలంలో, ప్రతిఘటనలు కూడా శూన్యవాదంలోకి దిగడం సహజమైనప్పటికీ, లక్ష్యం పట్ల నిబద్ధతా, సైద్ధాంతిక అరాజకత్వం రెండూ జంటగా ఎక్కువ్కాలం కొనసాగలేవు. ఎప్పుడో ఒకప్పుడు ఆ రెండింటిలో ఏదో ఒకటి రెండవదానిపై పైచేయి సాధించవలసిందే. ఆరుగురు దిగంబరకవుల్లో నలుగురు విషయంలో మొదటిది గెలిచింది(మిగిలిన ఇద్దరిలో ఒకరు తర్వాత ఆచార్య రజనీష్, మరో కొంతమంది బాబాలకి భక్తుడిగా మారిపోయాడు) శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమ ప్రేరణతో ఈ నలుగురూ, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, వరబర రావు, రమణారెడ్డి వంటి మరికొంతమంది రచయితలూ కలిసి 1970, జులై 4 న విరసం స్థాపించేరు. ఆ నలుగురిలో చెరబండరాజు ఒకరు. 1971-72 లో దానికి అతను జనరలు సెక్రటరీగా ఉండడమే కాకుండా, దానికి మరణ పర్యంతం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా కొనసాగేరు.

ఇంతకుముందు చెప్పినట్టు, దిగంబరకవిగా ఉన్నప్పుడుకూడా  అందరిలోకీ ఎక్కువ సామాజిక స్పృహ కనపరిచింది చెరబండ రాజే. దిగంబర కవుల మూడవ సంకలనం వచ్చే వేళకి అతని పదాల్లో విచక్షణారహితంగా తిరస్కారం కనిపిస్తూ, హృదయాన్ని కదిలించడానికి బదులు ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ, అతని కవిత్వం విప్లవభావాలతో గుర్తుపట్టగలిగేదిగా  ఉంది. వందేమాతరం అన్న కవితలో భారతమాతని ఒక వేశ్యగా వర్ణిస్తూ, ఆమెని ఇలా సంబోధిస్తాడు:

నీ అందం ఎలాంటిదంటే

అంతర్జాతీయ విఫణిలో నీ

అంగాంగమూ తాకట్టుపెట్టబడింది

నీ యవ్వనం

ధనవంతుల కౌగిళ్ళలో

ఆదమరచి నిశ్చింతగా నిద్రిస్తోంది.

(ఇది రాసిన చాలా రోజుల తర్వాత, ఎమర్జెన్సీ రోజుల్లో ఈ కవితని జైల్లో చదివినప్పుడు, భారతమాతను ఇలా తూలనాడినందుకు ఒక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త అతనిపై దాడి చేశాడు)

అయితే, విప్లవకవిగా మారిన తర్వాత చెరబండరాకు క్రమంగా వచన కవిత్వం నుండి కవిత్వ రూపంగా పాటకి మరలిపోయాడు. విప్లవకవిగా ఉన్న రోజుల్లో వచనకవిత్వమూ, పాటా ఉన్న 8 సంకలనాలు వేసినప్పటికీ, నిరక్షరాస్యులూ, పాక్షిక అక్షరాస్యులూ అయిన పాటక జనానికి రాజకీయ పరిజ్ఞానాన్ని కవిత్వంద్వారా అందించాలంటే,పాట సరియైన మాధ్యమం అనిగుర్తించిన కొద్దిమంది కవుల్లో అతనొకడు. ఈ విషయంలో అతనికి ముందు సుబ్బారావు పాణిగ్రాహి, అతనికి తోడుగా శివసాగర్ ఉన్నారు. శ్రీశ్రీ భాషా, ప్రతీకలూ మధ్యతరగతికి సరిపోయినట్టుగా, వీరు ముగ్గురూ ముందుతరం వామపక్షభావజాలాకవిత్వానికి వారధిలా పనిచేశారు. అందులోని తీవ్రవాద భావజాలమూ, చెప్పేవిధానమూ పక్కన బెడితే, జననాట్యమండలికి చెందిన రచయితలూ, గేయకారులూ, ముఖ్యంగా గద్దర్ లాంటి వాళ్ళు కేవలం పాటలు రాయడమే గాక, ప్రజలభాషలో రాస్తూ, వాటిని జానపద సరళిలో పాడి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.

నక్సల్ బరీ తర్వాత తెలుగులో వచ్చిన వామపక్షభావజాలకవిత్వానికి చెరబండరాజు ఒక మార్గదర్శకుడవడం ప్రభుత్వానికి నచ్చలేదు.

మేం కొండలు పగలగొట్టాం

మేం బండరాళ్లను పిండి చేశాం

మా రక్తం రాయిగా

ప్రాజెక్టులు నిర్మించాం

కష్టం ఎవడిది?

కాసులెవడివి?

… అదికూడా నిరుపేదల్లో నిరుపేదలైన శ్రామికులకి అర్థం అయేరీతిలో రాయగల కవి, ఆ ప్రాజెక్టుల లబ్ధిదారుల ప్రయోజనాలను సం రక్షించే ప్రభుత్వాలకి ప్రమాదకర వ్యక్తిగా కనిపించడం సహజమే.

అందుకే చెరబండరాజు ఇంకెవరూ అనుభవించని హింసని అనుభవించాడు. మిగతా ముగ్గురు దిగంబరకవులతోపాటు అతను 1971లో  ప్రివెంటివ్ డిటెన్షన్ ఏక్ట్ క్రింద 50 రోజులు నిర్బంధించబడ్డాడు; 1973లో 37 రోజులు MISA (Maintenance of Internal Security Act) క్రింద అరెస్టుకాబడ్డాడు. రెండు సందర్భాలలోనూ అతని మీద అభియోగం అతను తన కవిత్వంద్వారా యువతని సాయుధపోరాటం వైపు పురికొల్పుతున్నాడని. సికిందరాబాదుకుట్రకేసులో అతన్ని ఇరికించడంతో 1974లో అతన్ని స్కూలు టీచరు ఉద్యోగమ్నుండి తొలగించడం జరిగింది. ఎమర్జెన్సీ తర్వాత అతను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోబడినా, మూడురోజులు తిరక్కుండా DIG (Intelligence) అతన్ని తిరిగిపనిలోకి తీసుకున్నందుకు DEO ని చీవాట్లు పెట్టడంతో అతనిదగ్గరనుండి తిరిగి ఉద్యోగం నుండి తొలగిస్తూ తంతి వచ్చింది. మార్చి 1980లో అప్పటి విద్యాశాఖమాత్యులు ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి ఎన్నికైన MLC అడిగిన ప్రశ్నకి అసెంబ్లీలొ అతన్ని పదవిలోంచి తప్పించినట్టు ప్రకతించారు. అతను చనిపోవడానికి కొన్ని వారాలు ముందు, అతను హాస్పిటల్లో స్పృహలేకపడిఉన్నప్పుడు, అతన్ని లాంఛనంగా ఉద్యోగంలోకి తీసుకున్నారు.

అతను అనుభవించిన రాజ్యహింస గురించి చెరబండ రాజు ఒక చోట మంచి కవిత చెప్పేడు:

 

పొరపాటున అమాయకత్వంకొద్దీ

నేను ఆకాశంవైపు చూడడంతటసిస్తే

వాళ్ళు నా చూపుల వాలుని కొలుస్తారు

నా అడుగుజాడలు పడ్ద మట్టిని

ప్రయోగశాలల్లో పరీక్షిస్తారు

నా పాటల్లో చరణాల నిర్మాణ

సరళిని పసిగట్టడానికి.

 ఈ మధ్యలో అతనికి కేన్సరు సోకింది… మూడుసార్లు శస్త్రచికిత్స చేశారు. అతనికి చూపు పోయి, చివరకి చాలా కాలం అపస్మారకస్థితిలో ఉండి జులై 2 న కన్నుమూసాడు.

సాధారణంగా విప్లవకవిత్వం అంటే నినాదాల ఘోష అన్న అపవాదు ఉంది. దాన్నే సరిగ్గా నిలబెట్తి, చెరబండరాజు కవిత్వంలో నినాదాలుగా చెప్పగలిగిన ఎన్నో పదాలున్నాయని చెప్పవచ్చు. (ఈ మధ్య ఒక విమర్శకుడు చెప్పినట్టు అది అంత సామాన్యమైన విషయమేమీ కాదు.) తెలంగాణా నగరాల్లోని గోడలనిండా కనపడే  శ్రీ శ్రీ, గద్దర్, శివసాగర్ లతోపాటు అతని నినాదాల్లోనూ, అతని కవిత్వానికి  ప్రతిస్పందించిన వాళ్ల హృదయాలలోనూ అతను శాశ్వతంగా నిలిచి ఉంటాడు.

 

(కె. బాలగోపాల్ ఇంగ్లీష్ లో రాసిన వ్యాసానికి నౌడూరి మూర్తి తెలుగు అనువాదం )

Courtesy: Economic and Political Weekly, July 24, 1982.

 

 

మీ మాటలు

 1. buchi reddy gangula says:

  మూర్తి గారు
  అనువాదం బాగుంది —– వారుంటే ఎన్ని రాసేవారో ???
  వారి సాహిత్యం ప్లస్ దిగంబర కవులు –పార్ట్ 1-2-3 ఎక్కడ
  దొరుకుతాయో దయతో ఇ- మెయిల్ చేస్తారా సర్
  ——————————————
  బుచ్చి రెడ్డి గంగుల
  హనంకొండ@ ఏ .ఓ .ల్.కాం

  • ns murty says:

   క్షమించాలి బుచ్చిరెడ్డి గారూ, ముందు ఆలస్యంగా సమాధానం ఇస్తున్నందుకూ, తర్వాత నాకుకూడా దిగంబరకవుల సాహిత్యం ఎక్కడదొరుకుందో తెలియనందుకూ.
   అభివాదములతో

 2. బుచ్చిరెడ్డి గారూ: దిగంబర కవుల సంపుటాలు ఇప్పుడు అందుబాటులో లేవు. కాని, ఆ కవులు విడివిడిగా (వొక్క మహాస్వప్న తప్ప ) అందరూ కవిత్వ పుస్తకాలు వేసుకున్నారు. అవి దాదాపూ దొరుకుతున్నాయి. హైదరాబాద్ నవోదయలో వొక సారి అడిగి చూడండి.

  మూర్తి గారు: మంచి అనువాదానికి మరో సారి ధన్యవాదాలు.

  అఫ్సర్

 3. Rajendra Prasad Maheswaram says:

  మూర్తి గారికి నమస్సులు. చరబండ రాజు గారి పై మీ అనువాద వ్యాసం చదివాను. Chaala థాంక్స్ . చెర ను athani రచనలప్రభావంతో abhimaaninche వేలాదిమంది లో నేను ఒకడ్ని. చెర హాస్పిటల్ లో వున్నప్పుడు కూడా కలిసిన జ్ఞాపకాలు ఇంకా మనస్సుపోరల్లో తడి గానే ఉనాయి. Dr రాజ రెడ్డి గారు కూడాఎంతో అభిమానంగా choosukonnaru. అయన paata Kondalu పగలేసినం అయన పిల్లలిద్దరూ నర్తించడం చూడడం కూడా ఒక అదృష్టం. కానీ చెర, శ్యామలక్క,pillaliddaroo కూడామనమధ్య లేకపోవడం బాధాకరం.
  చెర రాసిన పాటలు
  పోరాటపు బాటలు . అని గుర్తుకు తేచుకుంటూ ,marokkamaaru అభినందనలతో….. RP

 4. హెచ్చార్కె says:

  చాల మంచి వ్యాసం, చాల చక్కని అనువాదం. చెరను, బాలగోపాల్ ను… ఒకే సారి ఇద్దరు మంచి మనుషులను చూసినట్టయ్యింది. మూర్తి గారికి, ‘సారంగ’ కు అభినందనలు.

 5. narayana sharma says:

  మూర్తి గారూ..నమస్కారాలు..బుచ్చిరెడ్డిగారు అడిగినట్టు నగ్నముని గారివి,నిఖిలెశ్వర్ గారివి దొరుకుతున్నాయి..మిగతా వాళ్లవి నాకుతెలిసినంతవరకు లభించడమ్ లెఅదు…కాని పాత సంచికల్లో వారి కవితలు కొన్ని లభిస్తున్నాయి.. చెరబండ రాజుగారి కవిత్వం పై బాలగోపాల్ గారి వ్యాసాన్ని నేను ఇంతకూ ముందు చదవలేదు ..”సాహిత్యం పై బాలగోపాల్ ” అనే పుస్తకం లో కొన్ని ఉటంకింపులున్నాయి ..మీవ్యాసం (అనువాదం)చాలా విషయాన్ని అందించింది..ధన్యవాదాలు.

 6. నారాయణస్వామి says:

  మూర్తి గారూ – చాలా చక్కని అనువాదం – మంచి వ్యాసాన్ని అందించినందుకు నెనర్లు – అయితే చెర రాసిన కవిత్వం చెర దే ఐతే బాగుండేదేమో అనిపించింది – ఉదాహరణకు ‘కొండలు పగలేసినం బండలను పిండినం నా నెత్తురు కంకరగా పాజెక్టులు కట్టినం శ్రమ ఎవడిదిరో సిరి యెవడిదిరో’ కానీ ‘అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీదమ్మా’ కానీ అందరికీ సుపరిచితమైన చెర కవితా పాదాలు కదా!

Leave a Reply to నారాయణస్వామి Cancel reply

*