ఛానెల్ 24/7 – 14 వ భాగం

sujatha photo

  (కిందటి వారం తరువాయి)

మనం బతికివున్న నిముషంకన్నా మంచి ఘడియ ఇంకేముంటుందీ.. దేవుడొక్కడే ఇరవై నాలుగు గంటలూ బతుకంతా కృషి చేస్తూ మనందరి కోరికలు తీరుస్తూ కూర్చుంటాడా..? కాళ్ళు నొచ్చుకోవా? మొన్న ఎండిగారికి మంచి ఆశీర్వచనం అందరూ చూస్తుండగానే చెప్పారు ఈ చారిగారే. రెండో నిముషంలో అడుగుపెట్టి చూడకుండా అక్కడేదో వైరు తన్నేసి బొక్కబోర్లా పడ్డాడెందుకు ఎండి. ఈ ఆశీర్వచనం పనిచేయలేదా?, ఈయన చెప్పే లక్ష్మీయంత్రం నాలుగు వేలు పెట్టి కొనుక్కుంటాను. మరి నా జీతం రెండేళ్లదాకా పెంచనని మేనేజ్‌మెంట్ చెప్పారు కదా. నాకు ధనలాభం ఎలా వస్తుంది? ఒకవేళ ఏదైనా సంచో పాడో, డబ్బులకట్టో రోడ్డు మీద దొరుకుతుందా అనుకొంటే ఇంతింత అద్దాలలో నాకు అడుగు ముందు ఏమవుతుందో కనబడి చావదు. మీ లక్ష్మీయంత్రం కథేమిటి అని చారి పని పట్టాలని శ్రీధర్ తన ప్రశ్నలతో ఇప్పటికే సిద్ధంగా వుండే వుంటాడు. కనుక వీడే అసలైన శనిగ్రహం చారి పాలిట. ఆయన శనిదోష నివారణ పూజలు ఎన్ని చేసినా ఈ విగ్రహం చలించదు కదా” అనుకొన్నాడు నవ్వుకొంటూశ్రీకాంత్.

“చారిగారు నేను ఎండి్‌గారితో మాట్లాడి ఫైనల్ చేస్తాను” అన్నాడు.

“సరేనండి నేను కూడా ఎండి్‌గారిని ఒకసారి కలిసి వెళతాను” అన్నాడు చారి.

 ***

“నేను ఎస్.ఆర్.నాయుడుని, బెహరా బావున్నారా?”

“ఓ..మీరా.. గుడ్… ఎలా వున్నారు? మిమ్మల్ని కలిసి చాలా కాలం అయింది” అన్నాడు బెహరా.

అతని గొంతులో ఒక చానల్ హెడ్‌తో మాట్లాడుతున్న గౌరవం గానీ అభిమానం కానీ లేవు. ఎస్.ఆర్.నాయుడుకి ఒక్క నిముషంలో ఈ ధ్వని తెలిసింది. తప్పదు. ఇతనితో మాట్లాడేందుకు ఉదయం నుంచి ట్రై చేస్తున్నాడు. అతన్ని ట్రాప్ చేసేందుకే నెలరోజులనుంచి కష్టపడుతున్నాడు. ఇప్పటికి చిక్కాడతను.

“చెప్పండి బెహరా నేనేం చేయాలి?”

“మీరేం చేయాలో నేనేం చెప్తాను. అంతా చేసేది మీరే కదా” నవ్వాడు బెహరా.

చాలా కక్షగా ఉందతనికి. ఒకప్పుడు తనెవరో ఏమిటో ఎవ్వళ్ళూ ఎరగరు.నిజమైన ప్రేమతో యూనివర్సిటీలో తనతో చదువుకొన్న రవళిని కోరి, ఆమెని వేటాడి పెళ్లాడాడు. వాళ్ల నాన్నకు, అమ్మకు ఎన్‌జి్ఓ ఉండటం, దాన్ని ప్రపంచ వ్యాప్తంగా వాళ్లు ప్రమోట్ చేసుకోవటం తన ఎదురుగా.. రవళి భర్తగా ఆ ఇంటికి వెళ్లాకే ఆ పాలిటిక్స్ తెలిశాయి. వాళ్లు ఎన్‌జి్ఒ పనిచేసే చోట కూలిజనం అవసరాలు, వాళ్లనెలా దోచుకోవాలో వాళ్లకే ముందు తెలుసు. ఎంబిఏలో గోల్డ్ మెడలిస్ట్ అయిన తనకి అర్ధం కదా? డబ్బు రుచి చూపించింది వాళ్లే. ఎంతో జీవితం చూసిన వాళ్లకే ఆశవుంటే తనలాంటి యువకుడికి ఆశ వుండదా? పేదవాళ్ల జీవితాలను బంధించే చిన్న వడ్డీకి అప్పు రూపం పోసుకొంది వాళ్ల ఇంట్లొనే. పెట్టుబడి వాళ్లే పెట్టారు. రవళి కూడా డైరెక్టర్. ఎవ్వరూ ఊహించని ప్రగతి. ఇంతింతై ఎదిగిన బిజినెస్, అప్పు ఇస్తామని క్యూ కట్టిన బ్యాంకులు, విరాళాలు కురిపించిన ఫారినర్స్… తనో సామ్రాట్. ఇప్పుడు వాటాలు కావల్సి వచ్చాయి. కమలకి, ఆమె మొగుడికి, మధ్యలో రవళి పావు. చానల్ పెడితే ఏం కావాలన్నా దాన్ని సాధించవచ్చు. కేసులు లేకుండా తప్పించుకోవచ్చు. జర్నలిజం ముసుగు ఎంత విలువైందో చెప్పింది ఎస్ఆర్‌నాయుడు. తను దొరక్కుండా పోతాడా? ఇప్పటికే దొరికాడు. వాళ్లు అనుకోవటం ప్రపంచవ్యాప్తంగా పదిమందిని పోగేసుకొని టీవీల్లో గోలచేసి తనను వంచాలని. కానీ తనకు తెలుసు. ఎలాగైనా తనకు ఇది లాభసాటి ప్రమోషన్. ప్రపంచానికి ఎంత ఓపిక వుంటుంది. ఎన్నిసార్లు తన సంగతి పట్టించుకొని, తిండితిప్పలు మానేసి తన ఆఫీస్ వంక చూస్తూ కూర్చుంటారు. వాళ్లని సంతోషపెట్టేందుకు వాళ్ల పూర్తి జీవితాన్ని కాజేసినందుకు, మహేష్‌బాబో, పవన్‌కళ్యాణో వున్నారు. పది రూపాయలు ఫోన్‌కు ఖర్చుపెట్టి బంగారు నాణాలు గెల్చుకొమ్మని పిలిచే గేమ్ షోలున్నాయి. పట్టుచీరెల అంచులు  చూసి ధరలు చెప్పి ఉత్తపుణ్యానికి చీరె మీ ఇంటికి తీసుకుపొమ్మనే యాంకర్లున్నారు. ఉదయం లేస్తూనే దేవుడి స్తోత్రాలు, కాస్తాగితే జ్యోతిష్యచక్రాలు, ఎనిమిది దాటితే ఏ పనీ చేయకపోయినా హాయిగా కార్లో తిరిగే జీవితమున్న రాజకీయ నేతలు, అన్ని చానల్స్‌కి ఇటోకాలు, అటోకాలు వేస్తూ ఎవడెవడు ఏమేం కాజేశాడో, ఎవడికి ఎంత ఆస్తి వుందో లెక్కలు, ఆధారాలతో చెపుతూ కాలక్షేపం చేసే రాజకీయ వేత్తలున్నారు. వాళ్లకి చానల్స్ కావాలి. ఇంకా మనమేం కొనుక్కోవాలి, మనకేం కావాలో, ఎంత వండాలో ఎలా పడుకోవాలో, రోగమొస్తే ఎక్కడ పాకేజీలుంటాయో, రాని గుండెజబ్బులకు కూడా ముందే డబ్బు కట్టేస్తే గుండెపోటొస్తే ఎలా ఖర్చు లేకుండా ఆపరేషన్లు చేస్తారో.. ఒకటేమిటి మన బతుకు వాళ్ళే బతికి పెట్టె చానల్స్ వుండగా సామాన్యునికి బెహరా కావాల్సి వచ్చాడా…?

బెహరాకి ఇంకా  హుషారొచ్చింది. ఎస్ఆర్‌నాయుడిని ఫుట్‌బాల్‌లా తన్నగలడు.

“ఏం సార్.. నన్నేం చేయాలనుకొన్నారు?” అన్నాడు నవ్వుతూ.

ఎస్ఆర్‌నాయుడుకి వళ్లు మండింది.

“అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏం వ్యాపారం బెహరా? ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇవ్వాళ చానల్స్ చుట్టూ ఆ బాధితులు గుంపులుగా వున్నారు. ఇదంతా చూసి కమల, రవళి ఎలా వున్నారో తెలుసా?”

“ఈ విషయాలు గుండెల్లో దాచుకోలేక ప్రపంచానికి చాటాలని మీ దగ్గరకు పరుగెత్తి వచ్చి వుండాలే” అన్నాడు బెహరా వెటకారంగా.

ఎస్ఆర్‌నాయూడు గుటక వేశాడు. బిపి అమాంతం వెరిగిందతనికి.

“బెహరా! ప్రజల ప్రాణాలను నువ్వలా దూదిపింజల్లా చూడటం బావుండలేదు. హోం మినిస్టర్ కూడ ఇందాక మాట్లాడారు. ఆయన కూడా లైవ్‌కి వస్తానంటున్నారు. ఇదంతా సి.ఎం. పేషీలో డిస్కషన్ అవుతోంది. నాతో వాళ్లంతా టచ్‌లో వున్నారు” అన్నాడు బెదిరింపుగా.

బెహరాకి కోపం నషాలానికి ఎక్కింది.

“ఆ.. సర్.. తప్పనిసరిగా చర్చించండి. మీరు తెలుసుకోవలసిన ఈ పదేళ్ళ బిజినెస్ గురించి కాదు. దీన్ని గురించి నేనేం ఆలొచిస్తున్నానన్నది లెక్కలు వేశారు మీరు. ఇప్పటికే వందకోట్లున్నాయి. నా పెళ్లాం బిడ్డలు మీ ఆఫీసులోనే పడి వున్నారు. నాది అనుకొన్న కుటుంబం వాటాకోసం రోడ్డెక్కింది. వాళ్లు సమాధానపడినా మీలాంటివాళ్లు, మా కేస్ టేకప్ చేసిన క్రిమినల్ లాయర్లు, నా బిజినెస్ షేర్లు కోరుతున్న సొకాల్డ్ మినిష్టర్లు ఎవ్వరూ ఊరుకోరు. నేను మీకు పైసా ఇవ్వను. ఎవ్వళ్లకీ  ఇవ్వను. ఏం కోరి మీరు రచ్చ చేశారో…? మీ మీద కేస్ వేస్తున్నాను. మీ రైవల్ గ్రూప్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను. నన్ను మీరు మీ లాభం కోసం రోడ్డుకెలా ఈడ్చారో చెప్పేస్తా. నాకేంటండి భయం. నా డబ్బు ఆశించింది మీరు. డబ్బు సంపాదించుకొనేందుకు మెట్లు వేసుకొన్నవారికి, దాన్ని కాపాడుకోవటం ఎలాగో తెలియదా? మీరే నా గురువులు. రేపే యాడ్ ఇస్తా. మీతో ఎవరికైతే పడదో వాళ్లచేతే పేపర్ పెట్టిస్తా. చానల్ పెట్టిస్తా. మీరు నా డబ్బులు వరకే కాజేయాలనుకొన్నారు. నేను మొత్తంగా మీ జీవితం మొత్తాన్ని రోడ్డుపైన పెట్టిస్తా. మీకేమైనా డౌట్లున్నాయా?”

ఎస్ఆర్‌నాయుడుకు మాట రాలేదు.

“బెహరా నీకు నాపైన ఏదన్నా పర్సనల్ గ్రడ్జ్ వుందా?”

బెహరా వికటంగా నవ్వాడు.

“మీరెవరు సార్. నేను కోపం తెచ్చుకోవటానికి.. నాకు మీమెదెందుకు కోపం. మీరంటే  నాకెంతో అభిమానం. ఎన్నోసార్లు మీ ఎదురుగ్గా కూర్చుని మీ ఎడిటోరియల్స్ గురించి డిస్కస్ చేశాను. మీ పుస్తకాలు నేను అచ్చువేయించా.. నేనేం ఆశించలేదు. మీవంటి గొప్పమనిషికి నేను ఉడతాభక్తిగా చేశాను. నా జీవితాన్ని దగ్గరగా చూసి ఇవ్వాళ నన్ను నేల్లోకి తొక్కాలని మీరు అనుకొన్నారు. మీ ముందు నేనెంత సార్”

ఎస్ఆర్‌నాయుడుకు గొంతులో ఏదో అడ్డం పడింది.

“నీ చానల్ ఎప్పుడు వస్తుంది బెహరా?”

బెహరా మళ్లీ నవ్వాడు.

“సో.. సారీ సార్.. ఊరికే అన్నాను. నాకేం కావాలి సర్. నా చుట్టూ చేరిన వాళ్ల గురించి చెప్పాను. నన్ను చానల్ పెట్టమని, పేపర్ పెట్టమని మీ సీనియర్స్ నన్నడగరా? నేను అడక్కుండానే నా వ్యాపారాలు కాపాడుకోవటానికి నేనేం చేయాలో వారు చెప్పరా?”

“బెహరా.. నీ బెదిరింపులకు నేను మారిపోయానని చెప్పటంలేదు కానీ ఈ విషయం నా చేతిలో లేదు. ఈ కాంపిటీషన్‌లో ఎక్కడో ఏదో కొట్టుకుపోతోంది. సర్వైవల్ కోసం ఏదయినా నేనూ చేశానేమో..”

“అదేంటి సార్.. సారీ సర్..  మీరంటే నాకెంతో ఇష్టం. ఇవ్వాళ్టికీ మీరు ఉదయం చేసే రౌండప్ చూడందే నాకు రోజు మొదలు కాదు. చాలా గుడ్డిగా మీరు చెప్పే ఎనాలసిస్ ఫాలో అవుతాను. మీరు ఏ అక్షరం పలికితే అది నాకు మంత్రం. నేను మీ విషయంలో చాలా ఎమోషనల్ సర్” అన్నాడు బెహరా.

“బెహరా నేనేం చేయాలి?” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

“మీకు ఎలా అనిపిస్తే అలా సర్. మీరేం చేసినా నేనేమీ అనుకోను. మీరంటే నాకు చాలా ఇష్టం సార్.” అంటూనే పోన్ పెట్టేశాడు బెహరా.

ఫోన్ పెట్టేసి వెనక్కి వాలిపోయాడు ఎస్ఆర్‌నాయుడు .

తనను తనెంత ఎత్తున పెట్టుకోగలిగాడో, తనంతట తను ఎలా కిందికి దిగుతున్నాడో తెలిసిపోతోంది. కిందికి జారకుండా ఉండలేడా? ఎవరెలా ఆడిస్తే ఎలా ఆడే కోతిబొమ్మనా ?ఎవరెవరి అవసరాలో తనకు గాలం వేస్తుంటే ఆ ఉచ్చులోంచి ఎప్పుడైనా తప్పించుకోవాలని ఆలోచించాడా? అది ఉరితాడు అని గ్రహించాడా? బంజారాహిల్స్‌లో కడుతున్న మేడ ఇటుకరాళ్లతో కాక పరువు ప్రతిష్టలతో కడుతున్నట్లనిపించింది ఎస్ఆర్‌నాయుడుకు.

తలతిప్పి చుట్టూ చూశాడు. తను రాసిన పుస్తకాలు, ఎడిటోరియల్స్, అందంగా ముద్దుగా తనవేపు చూస్తున్నాయి. నీ జీవితం ఇది, నీ వేళ్లెంత గొప్పవి. నీ తెలివితేటలెంత విలువైనవి. నువ్వు  ప్రజలకెంత ఉపయోగపడగలవు అంటున్నాయి. తను తలుచుకొంటే ప్రతిక్షణం తను అర్ధం చేసుకొన్న, తను క్షణ్ణంగా పరిశీలించి, పరిశోధించిన ఈ ప్రపంచాన్ని, ఎన్నో రహస్యాలను ప్రతివాళ్లూ ఎలా తెలుసుకోవాలో మూలసూత్రాలన్నీ చెప్పగలడు. ఈ ప్రపంచం ఎంత అందమైనదో, ఎంత అపురూపమైనదో చెప్పగలడు. మానవ సంబంధాలు ఎంత గొప్పవో నిరూపించగలడు. ఈ ప్రపంచంలో మనుష్యులందరికీ తను ఆప్తుడు, దగ్గరివాడు. ప్రతివాళ్లకు ఎవరికి వాళ్లకే తను సొంతం. నాకేం కావాలి. దక్షిణామూర్తి గుర్తొచ్చాడు ఎస్ఆర్‌నాయుడుకు.

నాలుగేళ్ళ క్రితం ఓ మినిష్టర్ పెళ్లిలో కలసి భోజనం చేసి బయటికి వచ్చాక, దక్షిణామూర్తి నిన్ను డ్రాప్ చేయనా అన్నాడు తను. తన విశాలమైన కారు ఆదికేశవులు ఇచ్చింది. డిల్లీలో తనకు కారు లేదు. తను మినిష్టర్ ఇంటి పెళ్లికి వస్తుంటే గెస్ట్‌హౌస్ బుక్ చేసి కారు అరేంజ్ చేసారు ఆదికేశవులు. కారు దగ్గరకు వస్తూనే తనకు వేరే పని వుందన్నాడు దక్షిణామూర్తి. ఎక్కడ దిగావన్నాడు తను. రైల్వే స్టేషన్‌లోనే వుండి. తెల్లవారు జామున ట్రైన్ ఎక్కేస్తానన్నాడు. స్టేషన్‌కు బస్‌లోనో, ఆటోలోనో వెళ్లిపోతానన్నాడు. ఆరోజు ఆయన తిరస్కారం తనపైన అసూయగా అనుకొన్నాడు తను. కారు, హోదా చూసి ఓర్చుకోలేకనే అనిపించిందా  టైంలో. అన్నేళ్లు కలిసి పని చేసి అతన్ని ఇంకోలా ఎలా అర్ధం చేసుకొన్నాడు.

పదిహేనేళ్ల నుంచి ఇద్దరూ కలిసి పనిచేశారు. ఎడిటోరియల్, కాలమ్స్, ఎనాలసిస్‌లు, న్యూస్‌స్టోరీస్ పోటీలు పడి రాసేవాళ్లు. తను రాసిన ప్రతి అక్షరం ప్రజల మనసుల్లో హత్తుకుపోయి వుంది. ఇవ్వాళ తనపట్ల ప్రపంచం చూపిస్తున్న నమ్మకానికి అవ్వాళ్టి అక్షరాలు, ఆ నిజాయితీ పునాది. ఆ పునాదిపైన తను నిర్మించిన భవనం ఎలాంటిది?

 (సశేషం)

 

 

మీ మాటలు

*