ఉల్కాపాతం దాగివున్న అక్షరజ్వాల ‘చెర’ కవిత

వందేమాతరం

 

ఓ నా ప్రియమైన మాతృదేశమా

తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా

దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది

అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది

సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది

 

ఊసినా దుమ్మెత్తి పోసినా చలనంలేని మైకం నీది

కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న

ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న “భారతి” వమ్మా

నోటికందని సస్యశ్యామల సీమవమ్మా

వందేమాతరం వందేమాతరం

 

ఒంటిమీద గుడ్డలతో జెండాలు కుట్టించి

వివస్త్రనై ఊరేగుతున్న చైతన్య నీది

అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో

కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది

ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని

ఓదార్చలేని శోకం నీది

ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది

అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ

వందేమాతరం వందేమాతరం

cherabandaraju(1)

నేను డిగ్రీ ఆఖరి ఏడు  చదువుతున్నప్పుడు మిత్రుని ద్వారా ఈ అగ్ని గోళం వంటి కవిత పరిచయమై నాలో పేరుకున్న జఢత్వాన్ని పటాపంచలు చేసింది. చదవగానే అటు దు:ఖమూ ఆగ్రహమూ కలగలిసి నాభినుండి తన్నుకు వచ్చే దుఖాగ్రహ శకలాల ప్రేరేపితమైన ఉల్కాపాతం దాగివున్న అక్షరజ్వాల ఈ కవిత.

చెర తన కవితకు ప్రేరణ ఏమిటో చెప్తూ నా దేశ ప్రజలే నా కవితా వస్తువులు అంటాడు. దిగంబర కవితోద్యమం నా కవితావేశానికి వేదిక కల్పించి వెన్నెముక ఇచ్చి నిలబెట్టింది. మార్క్సీయమైన శాస్త్రీయ అవగాహన నా కవితాధ్యేయానికి స్పష్టతను ప్రసాదించింది అంటారు. దిగంబరకవిగా ఒకటి రెండు సభల్లో తనపై రాళ్ళు వేయించింది, ఎమర్జెన్సీలో జైల్లో ఒక ఆర్,ఎస్.ఎస్. వ్యక్తిచేత కొట్టించిందీ ఈ గేయమేనని చెప్పారు. అలాగే వందేమాతరం బంకించంద్ర వందేమాతరంనకు అనుకరణా కాదు, అనుసరణా కాదు. దానికి పూర్తి వ్యతిరేకమైనదన్నారు. వందేమాతరంలో బంకించంద్ర సుజలాం సుఫలాం అన్నప్పుడు మన భారతదేశ జల ఖనిజ సంపద మన కళ్ళముందు కదలాడుతాయి. కాని అవి ఎవరికి చేరాలో వారికి చేరడం లేదు కదా అని అందుకనే తాను నోటికందని సస్యశ్యామల సీమవమ్మాఅని రాసానన్నారు. ఈ వందేమాతరం దిగంబర కవుల మూడవ సంపుటంలో మొట్టమొదటి గీతం.

    ఈ తరానికి చెరబండరాజు చిరునామా. ఈ కవిత్వ తరానికీ చెరబండరాజు చిరునామానే. ఆయన కవితలలో దాగివున్న అనంతమైన ఉత్ప్రేరక శక్తి ప్రతి పద చిత్రంలోను దాగివున్న విస్ఫోటనాతత్వం వేరెవ్వరిలోనూ కానరావు. దిగంబరకవులందరిలోకి భవిష్యత్ తరంలోకి మార్పును ఆహ్వానిస్తూ దానికో శాస్త్రీయమైన సశస్త్రబలోపేతమైన మార్క్సిస్టు అవగాహనను చేర్చుకుంటూ వర్తమాన తరానికి దిక్సూచిగా తన ఆచరణ ద్వారా ముందు పీఠిన నిలిచిన వారు చెరబండరాజు కావడం యాధృచ్చికం కాదు. అందుకే చెరబండరాజు మనందరికీ చిరస్మరణీయుడు. 

వరుస మారిన వందేమాతరం ఇప్పటికీ మనకు  సజీవ సాక్ష్యం. నేటి కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ అంతర్జాతీయ వ్యాపార లాభాల స్వలాభాలకు భారతదేశ అపార ఖనిజ సంపదను దోచుకుపోవడానికి సెజ్ ల పేరుతో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో విధ్వంసకర అభివృద్ధి నమూనాను బలవంతంగా రుద్దుతూ పర్యావరణాన్ని  ధ్వంసం చేస్తూ, మనుషులలో నైతికతను చెరుస్తూ, మానవత్వాన్ని చెరబడ్తూ, ఓ అభధ్రతా బావాన్ని మనలోకి ప్రవేశపెడ్తూ ఈ దేశ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ సందర్భంలో చెర వందేమాతరం మరోమారు మనం ఆలపించి ఆచరణవైపు కదలాల్సిన యుద్ధసందర్భం ఇది.

–కెక్యూబ్ వర్మ

కెక్యూబ్ వర్మ

మీ మాటలు

  1. అన్నవరం దేవేందర్ says:

    వర్మ కు లాగే నన్నుకూడా కవిత్వ ప్రయాణం లో కి లాక్కెళ్ళింది చెరబండరాజు కవిత్వమే …ఆయన దృక్పథమే …చేర ను యాది చేసిన వర్మ వందనం …..

మీ మాటలు

*