సీమాంధ్ర కత్తికి ఇంకెన్నాళ్లు ధారపడదాం ?

sangisetti- bharath bhushan photo

సీమాంధ్ర కవులు అభ్యుదయం, ప్రగతి, విప్లవం, వామపక్షం, ఇంకా పైకి కనపడని అనేక రూపాల్లో, హిడెన్‌ ఎజెండాలతో తెలంగాణపై తమ ఆధిపత్యాన్ని ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ఇలా చలామణిలో పెట్టిన భావజాలం కారణంగానే నేటికీ తెలంగాణ సాహిత్యకారులు తమకు జరిగిన అన్యాయాన్ని, అభ్యుదయం ముసుగులో నొక్కేసిన/ నొక్కేస్తున్న సొంత గొంతుని పసిగట్టలేక పోతున్నారు. గొంతుని నొక్కుతున్నవారినే ఇంకా ఆరాధిస్తున్నారు. అందలాలెక్కిస్తున్నారు. తమ ఆత్మగౌరవాన్ని భంగ పరిచిన వారినే బానిస మనస్తత్వంతో భళిరా అని పొగుడుతున్నారు.1956 నుంచీ వారి మెప్పుకోసం, ఆమోద ముద్రకోసం తహతహలాడుతున్న తెలంగాణవాదులు చాలామందే ఉన్నారు. వీరంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. సాయుధ పోరాట కాలంలో ఏమి వ్రాయని శ్రీ.శ్రీ 1969లో మాత్రం ‘విడిపోవడమంటే చెడిపోవడం’ అని శాపనార్థాలు పెట్టిండు. అయినా శ్రీశ్రీని ఆరాధించే వీర తెలంగాణవాదులకు కొదువలేదు. ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పీడితుల పక్షాన గాకుండా దోపిడి పాలక వర్గాల పక్షాన నిలబడ్డ శ్రీశ్రీది ముమ్మాటికీ అభ్యుదయం ముసుగులో ఆధిపత్యమే! ఇట్లాంటి వారు చరిత్రలో ఇంకా చాలా మంది ఉన్నారు.

ఆస్థానాల శృంఖలాలు తెంపుకొని ఆవిర్భవించిన అభ్యుదయ కవిత్వం ఆచరణలో మాత్రం సీమాంధ్ర ఆధిపత్యాన్నే కొనసాగించింది. ఒకవైపు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే తమ దబాయింపుని చలాయిస్తూనే తెలంగాణలో తమకు ఆమోదనీయతను సాధించుకున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తూ కూడా జేజేలు అందుకోవడం వీరికి మాత్రమే సాధ్యమయింది. పీడితుల పక్షాన నిలబడాల్సిన వారు అందుకు విరుద్ధంగా గుడ్డిగా పెట్టుబడిదారులు, దోపిడిదార్లతో అంటకాగుతూ అభ్యుదయవాదుల ముసుగులో అభినందనలు అందుకున్నారు. తాము తెలంగాణలో అడుగుపెట్టడానికి అనుకూలంగా ఉన్న సాయుధపోరాటాన్ని సమర్ధిస్తూ కవిత్వమల్లిన కవులు, అదే 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీద దుమ్మెత్తి పోసిండ్రు. ఇట్లా ద్వంద్వ వైఖరులతో, విరోధబాసతో, పీడితులకు కాకుండా తమకు మాత్రమే మేలు జరిగే విధంగా తెలంగాణ కవులపై ‘థాట్‌పోలిసింగ్‌’కు దిగిండ్రు. ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో గత చరిత్రను పునరావలోకనం చేసుకోవాలి. సీమాంధ్ర అభ్యుదయ వాదులు చారిత్రక క్రమంలో ఎలా వ్యవహరించారు. నిర్ణాయక సమయంలో ఎటువైపు మొగ్గారో నిగ్గు తేల్చాల్సిన సందర్భమిది. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్‌ తెలంగాణ సాధనకు మార్గాలు వేసుకోవాల్సిన చారిత్రక తరుణమిది. ఈ అభ్యుదయవాద కవిత్వం చారిత్రక క్రమంలో నిజంగా అభ్యుదయవాదం పక్షాన్నే నిలబడిరదా? లేదా అభ్యుదయం ముసుగులో వామపక్ష భావజాలం పేరుమీద ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారా? పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలబడి ఉన్నారా? అని నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో జవాబులు దొరికే వరకూ పదే పదే వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఎవరెవరు? యే యే ముసుగులేసుకొని తెలంగాణను అడ్డుకున్నారో తెలుసుకున్నట్లయితే ఆ ప్రమాదాల నుంచి బయటపడడానికి మార్గాలేర్పడతాయి. ఆ దారి వెతుక్కునేందుకు ఇదో చిన్న ప్రయత్నం.
1990వ దశకం ఆరంభంలో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం నేడు ఉచ్ఛదశలో ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప దేనికీ అంగీకరించేది లేదని తెగేసి తెలంగాణ సమాజం చెబుతుంది. ఇదే విషయాన్ని తెలంగాణ కవులు తమ రచనల ద్వారా తేటతెల్లం జేసిండ్రు. పొక్కిలి, మత్తడి, 1969`73 తెలంగాణ ఉద్యమ కవిత్వం, జాగో జగావో, ఊపిరి, దిమ్మిస, క్విట్‌ తెలంగాణ, మునుం, జిగర్‌ ఇలా వందల సంఖ్యలో వెలువడ్డ తెలంగాణ ఉద్యమ సంకలనాలు, అంతకు పదింతలు ఎక్కువగా ప్రతి జిల్లా నుంచి తెలంగాణ కవితా సంపుటాలు, వేల సంఖ్యలో పాటలు గత దశాబ్ద కాలంగా వెలువడుతూ వచ్చాయి. తెలంగాణ పేరు లేకుండా ఈనాడు ఏ సాహిత్య పత్రిక, సాహిత్యపేజీ అచ్చుకావడానికి వీలులేని పరిస్థితి ఉద్యమం కల్పించింది. వీటికి జోడిరపుగా, ఉద్యమానికి సంఫీుభావంగా సీమాంధ్ర కవులు ‘కావడి కుండలు’ వెలువరించారు. ప్రత్యేక తెలంగాణ న్యాయమైన, ప్రజాస్వామికమైన డిమాండ్‌ కావడంతో న్యాయం పక్షాన నిలబడుతూ, అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కరూ ఇందుకు మద్దతుగా నిలిచారు. కవిత్వంలో ప్రజల కష్టసుఖాలు ప్రతిఫలిస్తాయి. కవిత్వం భవిష్యత్తరాలకు చరిత్రను చెబుతాయి.
సమాజపు హృదయ స్పందనను రికార్డు చేస్తాయి. అయితే ఈ రికార్డు చేయడంలో ‘ప్రఖ్యాత’ ఆంధ్ర కవులు 1969 నుంచీ పక్షపాతంతోనే వ్యవహరించారు. ఉద్యమ ఉధృతిని పూర్తిగా విస్మరించారు. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఎంత న్యాయమైన డిమాండో 2009లోనూ ఈనాడు కూడా అంతే న్యాయమైన డిమాండ్‌. సాయుధ పోరాట సమయంలో ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వేచ్ఛకోసం, దోపిడి, పీడనలపై తమ కలాన్ని రaులిపించారు. తర్వాతి కాలములో ఈ కవులే తెలంగాణ వందకు వంద శాతం న్యాయమైన, ప్రజాస్వామిక ఉద్యమం అయినప్పటికీ రెండు చేతులా దుమ్మెత్తి పోసిండ్రు. దునుమాడిరడ్రు. ద్వంద్వ వైఖరి అవలంభించే  ఇలాంటి వారిని ‘స్పేర్‌’ చేసినట్లయితే భవిష్యత్‌ తెలంగాణ నేటి ఉద్యమకారుల్ని ఎంతమాత్రం క్షమించబోదు. అయితే ఈ మలిదశ ఉద్యమంలో సీమాంధ్ర బహుజన కవులు తెలంగాణ ఉద్యమానికి సంఫీుభావంగా ‘కావడి కుండలు’ తీసుకొచ్చిండ్రు. అయినా కూడా ఇప్పటికీ కొంత మంది సీమాంధ్ర కవులు మౌనంగానే ఉన్నరు. మౌనం కోర్టు భాషలో అర్ధాంగీకారం కాగలదేమో కాని సాహిత్య భాషలో వ్యతిరేకమన్నట్లే. బహిరంగంగా వ్యతిరేకించే వారితో ఎలాంటి పేచీలేదు. వారు ప్రజాస్వామిక డిమాండ్‌కు వ్యతిరేకమని తేల్చి చెప్పవచ్చు. అయితే ఎటూ తేల్చి చెప్పకుండా నంగి నంగి మాటలతో నాన్చుడు ధోరణితో సందర్భానుసారంగా వైఖరిని మార్చుకుంటూ ప్రజల ఆకాంక్షలపై పూర్తి గౌరవాన్ని ప్రకటిస్తూ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారితో నేడు తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి.
అభ్యుదయం మాటున ఆంధ్రాధిపత్యం!
1969లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా శ్రీరంగం శ్రీనివాసరావు, ఆరుద్ర, కె.వి.రమణారెడ్డి, కె. శివారెడ్డి, జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇంకా అనేక మంది ఆంధ్ర కవులు కవిత్వాన్ని రాసిండ్రు. ఒక వైపు విప్లవ రచయితల సంఘం సూత్రప్రాయంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్ధతు నిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదిస్తే దానికి అధ్యక్షుడిగా ఉన్న శ్రీ.శ్రీ అందుకు వ్యతిరేకిస్తూ ఉద్యమానికి మద్ధతు ఇస్తే తాను రాజీనామాను ప్రకటిస్తానని హెచ్చరించాడు. సంఘాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసిండు. ఇదే శ్రీశ్రీ మరో వైపు అంతకుముందు ఆంధ్రరాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ తెలుగుతల్లి పేరిట కవితలల్లిండు. అంధ్రులు యేయే కారణాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్‌ చేసిండ్రో అవే కారణాలతో 1956 నుంచి ఈనాటి వరకూ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీశ్రీకి ఆంధ్ర రాష్ట్రం న్యాయమైన డిమాండ్‌, తెలంగాణ ‘వేర్పాటువాదం’. ఇక్కడే ఆయన ద్వంద్వ నీతి తెలుస్తుంది. తెలంగాణ డిమాండ్‌ని వ్యతిరేకిస్తూ 1969లో శ్రీ.శ్రీ. ఇలా రాసిండు.
srisri
మర్కటాల కర్కటాల
సర్కస్‌ ఫీట్ల, పందెపు
కుక్కుటాల పోట్లాటలు
…..
విచిత్రమేమంటే మన
విశాలాంధ్ర గృహమందే
వేరు వేరు వంట గదులు
కోరి పోరు ధోరణులు
తిరుగుబాటు పేరిట ది
మ్మరులు చేయు హంగామా
చీలిక వాదుల సంఘపు
సెక్రటరీ చిరునామా
(సామ్యవాది మానిఫెస్టో)
విడిపోవడం అంటే చెడిపోవడం అని
వీళ్ళకెలా నచ్చచెప్పడం
చించడం సులభమే కాని అతికించడమే కష్టం
నిర్మూలనం కంటే నిర్మాణమే నయం
అలనాడు దేశాన్ని మూడుముక్కలు చేస్తూంటే
చూస్తూ ఉరుకున్నాడు గాంధీజీ
కొయ్యనీ, శస్త్ర వైద్యం చెయ్యనీ అని సలహా
యిచ్చాడు వియ్యంకుడు
డబ్బు సంచుల్తో అమ్మని కొనలేరు
అభిమానాన్ని కొనలేరు
ఆత్మల్ని కొనలేరు
పాపం అమాయకుడు తెలుగువాడు
మద్రాసు నుంచి పొమ్మంటే కర్నూలుకి వెళ్ళాడు
కర్నూలు కాదనుకొని హైద్రాబాదు కొచ్చాడు
ఇక్కణ్ణుంచి పొమ్మనడం ఏ భాషలోనూ సాధ్యంకాదు’ అన్నాడు.
నిజానికి పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందేవరకు మద్రాసు నుంచి పొమ్మని ఏ తమిళుడు కోరలేదు. అక్కడ కూడా వీళ్లు అత్యాశకు పోయి మద్రాసు నగరం కావాలని అప్పటి ముఖ్యమంత్రి రాజాజి  చేత ‘క్విట్‌ ద డాగ్స్‌’ అని తిట్టించుకొని కర్నూలు చేరారు. కావాలనే పొట్టి శ్రీరాముల్ని పొట్టన బెట్టుకున్నరు. మరుగు దొడ్లు లేని ప్రాంతానికి గవర్నర్‌ రావటానికి నిరాకరించడంతో తెలంగాణాపై వీళ్ల కళ్లు పడ్డాయి. అప్పటికే అన్ని హంగులతో మిగులు బడ్జెట్‌తో ఉన్న హైదరాబాద్‌లో తిష్ట వేయడం కోసం కుతంత్రాలు చేసారు. ఇది చేసింది ‘ఏదో అమాయకమైన తెలుగువాడు’ కాదు. అప్పటికే బ్రిటిష్‌ పాలనలో ఉన్న వీళ్లు, విభజించు పాలించు పద్ధతినవలంభించారు. రాష్ట్రావతరణ నాడే ఉపముఖ్యమంత్రి ‘ఆరోవేలు’ అంటూ  ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిండ్రు. మోసం, వంచనతో తెలంగాణను నిలువుదోపిడి చేసిండ్రు. ఇప్పడా వంచన పరకాల ప్రభాకర్‌ ‘నూటొక్క అబద్దాల’ ‘టక్కరి’ ఆంధ్రుడిగా రూపాంతరం చెందింది. ప్రత్యేకాంధ్ర మేధావి రూపంలో తెలంగాణపై విషంగక్కే చలసాని శ్రీనివాస్‌ రూపంలో టీవీల్లో చర్చలు చేస్తోంది. ఒక వైపు హైదరాబాద్‌ని దోపిడి చేసి ఉన్నకాడికి స్వాహా చేసి తామేదో త్యాగం చేసినట్టు ఫోజు పెట్టడమంటేనే వలసవాదుల దురహంకారపు ఆధిపత్యం అర్థమవుతుంది. ఉన్న జుట్టంతా ఊడబీకి ఫ్రీగా ‘గుండు చేస్తే’ ఎందుకేడుస్తవ్‌ అన్నట్టుగుంది ఆంధ్రకవుల దబాయింపు.
…..
ఐకమత్యంగా ఉంటే
యావద్భారతంలోనూ రాణించగలం
పిండికేతిగాళ్ళ తోలుబొమ్మలాటలు కట్టించగలం
కామ రాజకీయాలకు విడాకు లిప్పించగలం
    (జన్మ దినోత్సవం)
శ్రీశ్రీ ఉద్యమకారుల్ని పిండికేతిగాళ్ళతోటి పోల్చిండు. ఉద్యమాన్ని కామ రాజకీయాలని తూలనాడిరడు. కర్నూలు కాదనుకొని హైద్రాబాద్‌ కొచ్చినామని అంగలార్చిండు. అసలు వాళ్ళని రమ్మని బతిలాడిరదెవరు? ఆనాడే భార్గవ కమిటీ, లలిత్‌ కమిటీలు లెక్కగట్టి మరీ తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కోట్ల రూపాయల సొమ్ముని సీమాంధ్రలో ఖర్చు పెట్టారని తేల్చి చెప్పిండ్రు. తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలని ప్రాంతేతరులు దోచుకు పోయారని లెక్కలేసి మరీ తేల్చిండ్రు. ఇంత అన్యాయం జరిగినా ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షల వైపు గాకుండా దోపిడిదారుల, పీడకుల పక్షాన నిలబడిరడు. శ్రీశ్రీ వేసిన బాటలోనే సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణను అనుబంధాలకు, ఉపశీర్షికలకు పరిమితం చేసిన ఆరుద్ర కూడా దోపిడిదారుల, పీడకుల తరపున వకాల్తా పుచ్చుకుండు.
Arudra
అన్న తమ్ముని యింట పగవాడా?
ఉన్న వూరును విడిచి పోవాలా?
కంట నెత్తుటి కణము కరుణ నోచని జనము
కాందీశీకుల బాట పట్టిందా?
స్వార్థ దేవత కచ్చ కట్టిందా
స్పర్ధానలము మిన్ను ముట్టిందా?
శ్రీలు పొంగిన గడ్డ పాలువారే గడ్డ
సిద్ధాన్నమే కుక్క ముట్టిందా?
రౌడీలకు సజ్జనులు జడవాలా?
రగడ చేస్తే అణిగి నడవాలా?
రక్షణే కరువాయె భక్షణే తిరమాయె
రాచరికమే కంపు గొట్టిందా?
ఒక్కతల్లికి మనము పుట్టాము
ఒక్క రక్తము పంచుకొన్నాము
ఒక్క దేహము నేడు ముక్కలుగునా మూడు
అక్కటా! శని మనకు పట్టిందా?
(అన్న తమ్ముని ఇంట పగవాడా?)
అన్న తమ్ముని ఇంట పగవాడా అని అమాయకంగా అడుగుతున్న ఆరుద్ర నాలుగువేల ఆరువందల మంది నాన్‌ముల్కీలు తెలంగాణలో పనిచేస్తున్నారని, న్యాయంగానైతే ఆ ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు దక్కాలని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశంలోనే చెప్పిండు. ఈ విషయాల్ని ఎక్కడ లెక్క చెప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుబట్టిండు.  ఆరుద్రనే కాదు కె.వి.రమణారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిరశిస్తూ కవిత్వాన్ని అల్లిండు. ‘జాతి వైర దుష్టజ్వాల’ అంటూ ఉద్యమాన్ని ఆడిపోసుకుండు. దీనికి మహబూబ్‌నగర్‌కు చెందిన ముకురాల రామారెడ్డి కవిత్వంలోనే అన్నన్నా రవణన్నా నీ ఆటలింక సాగవంటూ కవిత్వంలోనే జవాబిచ్చిండు.
‘‘..కుడిచేతిని ఎడమచేయి
పడగొట్టగ జూచినపుడు
కవి ప్రేక్షకుడై చూచే
కనికట్టు గారడీ గమ్మత్తు కాదిది
ఆ యింటివాని చేతులూ
ఈ యింటివాని చేతులూ
కలియబడుతున్న
‘జాతివైర దుష్టజ్వాల’ ఇది.
అవునా భువనఘోషనా ఇది.
అలనాడు సవరింపబడిన
‘తెలంగాణ కోటి రత్నాల వీణ’
తీగలను తెంపేసి
అతక నేర్చుకుంటున్నదా? నెరజాణ
‘‘వీర తెలంగాణానికి
వైరుల ఏకోదరులా?’’ అంటూ ముకురాల రామారెడ్డి జవాబిచ్చిండు.
ఇక ఫక్తు ఆరెస్సెస్‌ భావజాలం గల జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినట్లయితే అది దక్షిణ పాకిస్తాన్‌ అవుతుందని రాసిండు. తెలంగాణ ప్రజలు మాట్లాడేది ‘తౌరక్యాంధ్రమని’ ఎగతాళి చేసిండు.ఈ విషయాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారు రికార్డు కూడా చేసిండు. ‘‘ 1968`69లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు ఒక అనుభవం ఎదురైంది. ఆ రోజుల్లో జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒక గేయంలో , ఒక వేళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే, అది దక్షిణ పాకిస్తానం అవుతుందని రాశాడు. అది అర్థం కాక నేను ఇంకో మిత్రుడు ఆయన దగ్గరికి వెళ్ళి ‘శాస్త్రి గారూ, మీ బాధేమిటని’ అడిగాము. దానికి ఆయన సమాధానమిస్తూ ప్రత్యేక తెలంగాణలో తెలుగంతా భ్రష్టుపట్టిపోయి, అది పూర్తిగా తౌరక్యాంధ్రం అవుతుందని అన్నాడు.’’ (సింగిడి` తెలంగాణ ముస్లిం ప్రత్యేక సంచిక, ఉర్దూ ఉసురు తీసిన ఆంద్రులు` జయశంకర్‌)
తెలుగుతల్లి, విశాలాంధ్ర పేరిట కవితలల్లిన పాపయ్యశాస్త్రి ఒక్కసారి కూడా న్యాయంగా ఆలోచించలేదు. కనీసం అవతలి పక్షంవారు ఏమడుగుతున్నారు? అని కూడా ప్రశ్నించుకోలేదు. ‘విజయీభవ’ పేరిట
‘పెద్ద తలలు గద్దెలకై
గుద్దులాడు కొంటున్నై
వద్దనవోయ్‌ స్వార్థబుద్ధి
కద్దనవోయ్‌ కార్య సిద్ధి’ అంటూ తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం గుద్దులాటగా వర్ణించిండు. బట్టకాల్చి మీదేసినట్లయితే అది ఆరిపేసుకునే పనిలోనే తెలంగాణ వాడుంటే ఈలోపు తమ దోపిడీని సులువు చేసుకోవచ్చనేది నాటికీ నేటికీ సీమాంధ్ర ఆధిపత్యవాదులు ఆచరిస్తున్న నీతి.
‘ తెలుగుతల్లి కన్నుల్లో
వెలుగుతుంది మన భాగ్యం
భాగ్యనగర వీధుల్లో
పండును మన సౌభాగ్యం’ అంటూ హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంపదను ఆనాడే లెక్కేసిండు. విశాలాంధ్ర పేరిట
‘ఆ సీమని ఈ సీమని
ఆగం చేస్తారెందుకు
అంతా రాయలసీమే
అంతా మన తెలంగాణె’ అంటూ ప్రత్యేక తెలంగాణ వాదుల్ని జోకొట్టే ప్రయత్నం చేసిండు. ఆధిపత్య శక్తుల కొమ్ముకాసే వీరి పక్షపాత వైఖరి కారణంగా ఈనాడు తెలంగాణ ప్రజల్లో, మేధావుల్లో సీమాంధ్ర సాహితీవేత్తలు ఎంతటి ప్రతిభావంతులైనా వారి పట్ల గౌరవభావం ఏర్పడడంలేదు.
అలాగే అప్పటికి అంతగా పేరు పొందని చిన్నా చితక ఆంధ్ర కవులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై దుమ్మెత్తి పోసిండ్రు. ఇందులో వక్కలంక లక్ష్మీపతిరావు ఇలా రాసిండు.
అన్నాదమ్ములు కలబడి దేశం
ఛిన్నా భిన్నం చేస్తారా?
పచ్చని యింటికి చిచ్చులు రగిల్చి
పరమానందము చూస్తారా?
అంటే అన్న ఎంత దోసుకుంటున్నా తమ్ముడు మాత్రం సడి సప్పుడు చెయ్యకుండా ఉంటే అది ఐకమత్యము. అన్యాయాన్ని నిలదిస్తే అది చిచ్చులాగా వారికి కనబడిరది. మరో కవి ఎం.కె. సుగమ్‌బాబు తెలంగాణ ఉద్యమాన్ని సంకుచితమని తేల్చిసిండు.
ఆంధ్ర యేమిటి?
తెలంగాణా యేమిటి?
కులమేమిటి?
మతమేమిటి?
భాషేమిటి?
మనిషి యింతగా యెదిగినా
సంకుచితంగా ప్రాంతమ్మేమిటి?
ఇది నాచేయి
ఇది నాకాలు అని
కన్నతల్లిని కోతపాలు చేసే మూర్ఖతేమిటి
కసాయితన మేమిటి?
ఇంకెలా నిలుస్తుంది దేశం
ఏమైపోతుంది మృతవీరుల త్యాగం, సందేశం’
న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటా అడగడం ఆంద్రోళ్ళకు మూర్ఖత్వంగా, కసాయితనంగా కనిపించింది. ఇదే అంశాన్ని కొంచెం సున్నితంగా సంగిరెడ్డి వెంకటరంగారెడ్డి అనే కవి ఇలా చెప్పిండు.
ఒకే ఇంటివాళ్ళు
అన్నదమ్ములు
అన్నా తమ్ముడి పైసలు వాడుకున్నాడు
అన్న తమ్ముడికి అన్యాయం చేశాడు
తమ్ముడు కోపంతో కల్లెర్ర చేశాడు
తమ్ముడు అన్న చేసిన తప్పులను చూపాడు
తప్పులను సరిదిద్దుకొందాం అన్నాడు అన్నయ్య
తమ్ముడు సంతోషంతో ‘సరే’ అన్నాడు
అన్యాయం చేసినంతమాత్రాన విడిపోతామా అన్నాడు తమ్ముడు
కలతలున్నంత మాత్రాన బంధాన్ని తెంపుతామా అన్నాడు అన్నయ్య”తప్పులను సరిదిద్దుకోవాలని వెంకటరెడ్డి చెప్పిండ్రు.
ఈ తప్పులు సరిదిద్దుకోక పోగా అంతకు వేల రెట్లు అధికంగా చేసి వాటినే ఒప్పుల కుప్పలుగా చూపెట్టే ప్రయత్నం జేసిండ్రు సీమాంధ్ర పక్షపాత అధికారులు, వారికి వత్తాసుగా వలసాధిపత్య ప్రభుత్వం నిలిచింది. గిర్‌గ్లానీ కమిటీ ఎన్ని సార్లు నిబంధనలు ఉల్లంఘించారో తనకు ఇచ్చిన అరకొర సమాచారంతోనే లెక్కగట్టిండు. 1984 డిసెంబర్‌లో ఇచ్చిన 610 జీవో 29 యేండ్లయినా ఇంకా అమలుకు నోచుకోలేదంటే ఇంకెంత సహనం కావాలి. తరాలకు తరాలు ఓపిక పట్టాలంటే అయ్యే ముచ్చటేనా?
యూ టూ శివారెడ్డి!
హైదరాబాద్‌ని అమితంగా ప్రేమిస్తానంటూనే దానిపై అభ్యంతరకరమైన కవిత్వమల్లి తెలంగాణవాదుల మనోభావాల్ని గాయపరిచిన కవి శివారెడ్డి. తాను ఏ శిబిరంలో ఉన్నా అభ్యుదయవాదిగా ఆమోదముంటుంది. వీర తెలంగాణ వాదులకు సైతం ఆయన ఆరాధ్యనీయుడవుతాడు. ప్రస్తుత సందర్భంలో నర్మగర్భంగా తెలంగాణకు వ్యతిరేకంగా కవిత్వమల్లే ఈయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు వ్యతిరేకేసిస్తూ ఏకంగా ‘తెలుగు బావుటా’ (సమైక్యతా సూచికా గేయకావ్యం) పుస్తకాన్ని ప్రచురించాడు.
కుడి చేయి ఎడమ కంట్లో
వేలుబెట్టి పొడిచింది
ఎడమ చేయి కుడికంట్లో
జిల్లేడు పాలు కొట్టింది-
రెండు కళ్ళు
భోరున ఏడుస్తున్నాయి
ఈ దేహం ఒకటే
ఆ కళ్ళు, చేతులు
ఈ దేహానికి చెందినవే
సరిగ్గా ఇలానే వుంది
తెలుగు గడ్డ పరిస్థితి
….
మనుషుల మనసుల్లో
కీనీడల జాడల హెచ్చింది
మమత పెల్లుబికిన ఇంట్లో
మచ్చరం పెను త్రాచులా
బుసలు కొడుతుంది
నిన్నటి మిత్రులు
నేడు శత్రువులు
అన్నదమ్ములిరువురు
పందెంలో కోడి పుంజుల తీరు
ఈ స్వార్థం తిని బలిసిన
రాకాసి పురికొల్పిందిలా?
అర్థమేమున్నది ` ఆ వేటలో
నీది ఆంధ్ర, నాది తెలంగాణా
తెలంగాణాణా`ఆంద్ర
పర్యాయ పదాలు కావా!
నిన్న మొన్న పురుడు బోసుకున్న
తెలుగు తల్లి గుండెల్లో బల్లెపు పోటా!
సిగ్గు విడచి చెప్పులు జత పట్టుకున్నాయి కదూ’
. అంటూ ఆనాడు అందరం ఒక్కటిగా ఉండాలని పిలుపు నిచ్చాడు.
అయితే అప్పటికే హైదరాబాద్‌లో శివారెడ్డి ఉద్యోగం చేయడమంటేనే ఒక స్థానికుడి అవకాశం గల్లంతు కావడం. తెలంగాణ ఫ్యామిలీకి దక్కాల్సిన చదువులూ, స్థానిక రిజర్వేషన్లు ఇట్లా వచ్చిన అనేకమంది తెలంగాణ బిడ్డలకు దక్కకుండా చేసిండ్రు. అట్లా ఒక్క శివారెడ్డే కాదు అంతకు ముందు 1944 నుంచీ తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం ఊపందుకున్నాక ఆంధ్ర ప్రాంతం వారి రాక పెరిగి పోయింది. అడివి బాపిరాజు, విద్వాన్‌ విశ్వం, కొడవటిగంటి కుటుంబరావు, తల్లావరa్జల శివశంకర శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, కురుగంటి సీతారామభట్టాచార్య, పిల్లలమర్రి వేంకట హనుమంతరావు ఇలా అనేక మంది తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్‌ని కేంద్రంగా చేసుకొని ఉద్యోగాలు చేసుకున్నారు.  ఇదే విషయాన్ని”నల్లవలుస”లో “శిరసులు ఇలా చెప్పిండ్రు.
‘‘గురజాడ ‘ఒఖడే’
అడుగు జాడల్లో వలసవచ్చినవారు
వేయిన్నొఖడు
నయాదళారుల వలసే
మహా ప్రస్థానం
త్వమేవాహమ్‌
త్వమ్‌ శూన్యమ్‌ అహమ్‌ సర్వమ్‌
ఆర్యా` స్వాహా సర్వమ్‌
దళ నిర్మూళనమే
మరో` మహాప్రస్థానం?

ఉద్యమం మీద
తేలుతూ వచ్చావ్‌
ఆంధ్రప్రస్థ నిర్మాణంలో
మయుడివి కావు
మనిషిని వస్తువుగా,
మా భూమిని
ముక్కలుగా విక్రయించావ్‌
నీ గణాంకాల
గారడీలో
నేనొక్క
గుండుసున్నానిమ మాత్రమే!
ముల్కీ పత్రం
ఒక మురికి పత్రమే
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దాదాపు అందరు సీమాంధ్ర కవులు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పటికీ వారిని అందలం ఎక్కించే ఉద్దేశ్యంతో సాయుధ పోరాట సాహిత్యాన్ని దానికి వారు అందించిన తోడ్పాటును అటు అభ్యుదయవాదులు, విప్లవవాదులు ప్రచారంలో పెడుతుంటారు. నిజానికి 1946`51 నాటి ‘సాయుధ పోరాటం’ గురించి చాలామంది రచనలు చేసిండ్రు.
అయితే శ్రీ.శ్రీ ఒక్క కవిత కూడా రాయక పోవడానికి కూడా కారణముంది. ఆరుద్ర ‘త్వమేవాహా’నికి ఆపేరు సూచించిన శ్రీ.శ్రీ స్వయంగా నిజాం ప్రభుత్వం కొలువులో ఉన్నాడు. ప్రభుత్వ కొలువులో ఉంటూ దానికి వ్యతిరేకంగా రాస్తే ఉద్యోగం ఊడుతుందనే ఉద్దేశ్యంతో ఒక్క కవిత కూడా రాయలేదు. అలాగే తిన్న ఉప్పుకు ద్రోహం తలపెట్టొద్దు అనే ఉద్దేశ్యంతోనో ఏమో ఆ తర్వాత కూడా ఏమీ రాయలేదు. ఒక వైపు తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన పేద రైతులు, ఉద్యమకారులు సాయుధ పోరాటం చేస్తూ ఉన్నారు. రోజూ  పోలీసుల చేతిలో కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు చనిపోయారు. చనిపోయిన వారిలో రజాకార్లు కూడా ఉన్నారు. బండి యాదగిరి లాంటి పాటగాడు, రేణికుంట రామిరెడ్డి లాంటి యోధుడు, అనభేరి ప్రభాకర్‌ లాంటి పోరాట నాయకులు అనేక వందల మంది 1946`48 మధ్య కాలంలో ఉద్యమంలో తమ ప్రాణాలర్పించారు. అయితే శ్రీ.శ్రీ నిజాం ప్రభుత్వ పోలీసు శాఖలో పౌరసంబంధాల విభాగంలో ఉంటూ ప్రభుత్వ ఎన్‌కౌంటర్ల గురించి, ఉద్యమ కారుల మరణాల గురించీ ఆంగ్లంలో ఇచ్చే వివరణలను తెలుగులో తర్జుమా చేసేవాడు. ఎంత మనసు చంపుకున్నా బూటకపు ఎన్‌కౌంటర్లనీ తెలుస్తూనే ఉన్నా శ్రీ.శ్రీ వాటిని ఎదురుకాల్పులుగా మార్చి రాసే పనిలో ఉన్నాడనే విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఒక్క శ్రీ.శ్రీయే కాదు పైన పేర్కొన్న ఏ ఒక్క ఆంధ్రప్రాంత సాహితీ వేత్త ఆనాడు ప్రభుత్వ దమన కాండను నిలదీయలేదు.
 సాయుధ పోరాటంపై రాయకపోయినప్పటికీ ‘మహాప్రస్థానం’ పాడెను ఇప్పటికీ తెలంగాణ వాదులుమోస్తున్నారు. ఆరుద్ర తెలంగాణను చూడకుండానే ‘త్వమేవాహా’న్ని రాసిండు. కె.వి.ఆర్‌. భువనఘోష వినిపించిండు. అట్లాగే విరసం తరపున సాయుధపోరాట సాహిత్య చరిత్రను రికార్డు చేసిండు. తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉన్న వీళ్ళు ప్రత్యేక తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి నిర్ద్వందంగా వ్యతిరేకించిండ్రు. తమ ఆంధ్రాధిపత్యాన్ని ప్రదర్శించారు. తాము చెప్పిందే న్యాయం, తాము రాసిందే వేదం అన్నట్టుగా వ్యవహరించిండ్రు.
1969లో ప్రత్యేక తెలంగాణ నినాదం ఉధృతంగా రావడంతో దాన్ని అధిగమించడానికి కమ్యూనిస్టు పార్టీలు, ఆ భావజాలం ఉన్న రచయితలు తిరిగి సాయుధ పోరాటాన్నే తెలంగాణపై ఆయుధంగా మలిచారు. సాయుధ పోరాటాన్ని తామే నడిపించామన్న తీరుతో ‘చరిత్ర’ రచనలు చేసిండ్రు. 1972 నాటికి ‘సాయుద పోరాట’ ఉద్యమానికి రజతోత్సవాలు జరిపి తమ అనుభవాల్ని అక్షరీకరించి ‘విశాలాంధ్ర’ కోసమే సాయుధ పోరాటం జరిగిందని తీర్పులిచ్చారు. సాయుధ ఉద్యమానికి 60 యేండ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పనిని ఇప్పటికీ సిపిఎం పార్టీ బాహాటంగా చేస్తూనే ఉంది. అందుకే ఆంధ్రప్రాంతం వారి రచనల్లో స్వప్రయోజనాలున్నాయి. హిడెన్‌ ఎజెండాలున్నాయి.
సీమాంద్ర ఆధిపత్య శక్తుల రహస్య ఎజెండాలను పసిగట్టి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతూ దోపిడిదార్లను నిలదీయడమే నేటి తెలంగాణ కవుల కర్తవ్యం. ఎవరు ఏ రూపంలో వచ్చినా ఎన్ని మోసపు మాటలు చెప్పినా కరిగి పోవొద్దు. ఎబికె ప్రసాద్‌ లాంటి వాళ్ళు తెలంగాణమే ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతూ ఎన్ని దోబుచులాటలాడిన మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోవాలి. కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా బెట్టి స్వీయప్రయోజనాల్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని నరికే “గొడ్డలి కామాలు కావొద్దని కోరుకుంటున్నా!
జర్నలిస్టులుగా, సాహిత్యకారులుగా, మేధావులుగా, విశ్లేషకులుగా, ప్రొఫెసర్‌లుగా, విద్యార్థి నాయకులుగా, రాజకీయ దళారులుగా, దోపిడీదార్లుగా, కబ్జాదార్లుగా, పెట్టుబడిదార్లుగా ఇలా అనేక రూపాల్లో తెలంగాణ ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తున్న వారిని ఎదుర్కోవాలి.
అనేక రూపాల్లో, వివిధ మార్గాల్లో తాము తెలంగాణ శ్రేయోభిలాషులం అని చెబుతూనే ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాహిత్యకారుల గొంతును నొక్కేస్తూ కూడా వీళ్ళు గౌరవింపబడుతున్నారు. మీ కవిత్వంలో ఇమేజ్‌లు లేవు, మీ కథల్లో శిల్పం, శైలి లేదు, భాష ఇబ్బంది కరంగా ఉంది అంటూ తెలంగాణవాళ్ళను తొక్కేస్తున్నారు. ఈ ఆధిపత్యవాదులు వామపక్ష భావజాలం ముసుగులో ఎన్ని అడ్డంకులు కలిగించినా నిలదీయడానికి తెలంగాణ సాహిత్యసమాజం సిద్ధంగా లేదు. ఈ ఆధిపత్యాన్ని మౌనంగా అయినా సరే ఇంకా భరించినట్లయితే భవిష్యత్తెలంగాణ సమాజం క్షమించదు. అందుకే నిజంగా తెలంగాణకు మద్ధతిచ్చే వారెవరో, మద్ధతు ముసుగులో మనల్ని మంటగలిపేందుకు ప్రయత్నిస్తున్నదెవరో తెలుసుకొని మసులుకోవాలి. ప్రజాస్వామిక, న్యాయమైన ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసే కవులను మొహమాటాలు, భేషజాలను పక్కన బెట్టి సాహిత్య సమాజంలో దోషులుగా నిలబెట్టాలి. ఈ పని ఎంత తొందరగా చేస్తే తెలంగాణకు అంత మేలు జరుగుతుంది. వీరు గుర్తించ నిరాకరించిన, నిరాదరణ చేసిన తెలంగాణ సాహితీ ప్రతిభ గుర్తింపుకు ఇది పునాది అవుతుంది.
–సంగిశెట్టి శ్రీనివాస్

 

మీ మాటలు

 1. dasaraju ramarao says:

  సంగిశెట్టి గారూ! మీ ఆవేదనకు, నిక్కచ్చితనానికి వ్యాసం అద్దం పట్టింది. తెలంగాణా సాహిత్యంలో సీమాన్ద్ర సాహిత్యకారుల ద్వంద్వ వైఖరుల పట్ల అడపా దడపా రచనలు వస్తున్నాయి కదా! మీరన్నట్లు బహిరంగంగా ,పూర్తిగా వెలివేసినట్లుగా మనవాళ్ళు వ్యవహరించకపోవడం లో నిజముంది. తెలంగాణా మట్టిలో ఆ కఠినత్వమ్ లేదుగదా ! పల్లకీ మోసినంత మాత్రాన రాజును అన్ని విషయాలలో అంగీకరించవలసిన అవసరం లేదుగదా! అయినా చర్చించాల్సిన అంశమే!

  • sangishetty srinivas says:

   దాసరాజు గారు కఠినంగ ఉండాల్సిన అవసరం లేదు కచితంగా ఉంటె చాలు. రాజు నీతిమంతుడు కాదు అని తేలిన తర్వాత కూడా పల్లకి మోయడం అంటే మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. అది ఈ రోజు చాలామంది వివిధ రూపాల్లో చేస్తున్నారు. ఇక నైన ఈ పద్దతికి స్వస్తి పలకాలనేదే నా కోరిక.

   • buchi reddy gangula says:

    శ్రీనివాస్ గారు
    చాల చక్కగా చెప్పారు —ఎన్ని చెప్పినా , ఎన్ని రాసినా —దోపిడీ కి —
    మోసాల కు — అలవాటు పడ్డ ప్రాణాలు –అంతా –ఈజీ గా మనల్ని
    వదిలి పెట్టారు గా
    నిజాలు ఎప్పుడు చేదు గా నే ఉంటాయి —ఎవరికి అయినా —???
    —————-బుచ్చి రెడ్డి గంగుల

 2. buchi reddy gangula says:

  1969– ఉద్యమం– లో ఆనెస్టీ— సిన్సెరిటీ– ట్రస్ట్‌వర్తీ కానీ నేత చెన్నా రెడ్డి గారు—
  అదంతా వారి రాజకీయ లబ్ది కోసం—గా రీ డి ఆట — చూపించి–మన ఉ ధ్యా మాన్ని
  మట్టి పాలు చేశాడు–అప్పుడు — ఇప్పుడు — మన లో నే మన ప్రాతం వాళ్లే
  మనకు ఆసరా లేకుండా సీమాంధ్ర నేతల తో చేతులు కలుపుతూ— నేతలు న్నారు
  రచయితలున్నారు—ఇపుడు కూడా మన తెలంగాణా ర చ యతలు ధాగుడు మూతలు
  ఆడుతూ—అక్క్దడ ఓ మాట–ఇక్క్డ డా ఓ మాట చెప్పే వాళ్ళు లేకపోలే ధు-
  ( ధయతో ఆంప శయ్య నవీన్ గారి ని తెలంగాణా పై వారి ఒపీనియన్ ను అడుగండి ??? )
  ధాపరికం దేనికి—భయం దేనికి ???
  ఎన్నో హింది మాట్లాడే రాష్ట్రాలు ఉండగా— తెలుగు రోండు రాష్ట్రాలు గా ఉండటం లో
  తప్పు ఏమిటి రచయితులారా ???
  ఎంతకాలం మాకు ఈ బానిసత్వం– ఎప్పుడు మాకు విముక్తి??
  నేటి వరకు నీళ్ళల్లో– నిధుల ల్లో— ఉ ధ్యొగాల్లో—అన్ని రంగాల్లో—మోసం- ధోపీడీ
  ధగా— నిజం కాధా
  చెప్పండి కవులు?? మేధావులు ???
  ఆవేశం లో –ఉధ్యమం లో– ఎవరో నాలుగు శిలా విగ్రహారాల ను కూల్చి వేస్తే
  గాయాలతో — గేయాలు రాసిన కవులారా— ఉద్యమం పేరుతో నేటికి వేయి మంధీ
  ఆత్మ బలి ధానాలు చేసుకుంటే— సీమాంధ్ర కవులు— వీళ్ళ గురించి రాయారేంధుకు???
  వి డి పోతే తప్పేమీ టి ?? ఇచ్చిన — తెలంగాణా ను రాజకీయ ఎత్త్హు గడాల తో—
  డబ్బు తో— అన్ని రాజకీయ పార్ట్ లు ఒకటి అయ్యీ— చేసింధీ మోసం కాధా ??
  ఎప్పుడు మాకు స్వాతంత్రం ?? ఎన్నడు ??
  చివి రీ మాట– నా ఒపీనియన్ లో ఇపుడు శ్రీ శ్రీ గారు ఉంటే– తప్పక
  తెలంగాణా ఉధ్యమాన్ని బ ల పరిచే వాడు అనుకుంటా—
  ఎవరు రా సినా — రాయక పోయినా—ఏ ధో ఒక రోజు తెలంగాణా
  రాక తప్పధు—
  ———————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 3. mohan rushi says:

  రగిలి, రగిలి.
  మసిలి, మసిలి,
  రక్తం కుతకుత ఉడికి,
  ఆవేదన అక్షర రూపం దాలిస్తే..!

 4. Thirmal Reddy Sunkari says:

  మహాకవులు, సాహితీవేత్తలు అని భావించే వారిలో తెలంగాణపై ఇంతటి ద్వేషం ఉందని ఊహించలేకపోయాను. వారిని గుడ్డిగా అభిమానిచడం కాస్త ఆపి, మీరన్నట్టు కచ్చితంగా వ్యవహరించడం నేర్చుకోవాల్సిందే. ఈ వ్యాసం ద్వారా చాలా కొత్త విషయాలు తెలిసాయి. కృతజ్ఞతలు.

 5. kurmanath says:

  అలా అన్న శ్రీశ్రీ ఇలా కూడా అన్నారు. మంచి పరిశోధకుడైన సంగిశెట్టి గారివి చూశారో, లేదో నాని…

  శ్రీ శ్రీ 15-10-1972; గుంటూరు విరసభలో అద్యక్షోపన్యాసం నుంచి,

  ….రెండోది (మొదటిది స్వాతంత్రపు వెండి పండుగ) తెలంగాణా సాయుధ సమరం. దీన్ని మన ఘనత వహించిన ప్రభుత్వం గుర్తించనేలేదు. పైగా రెండువేల మండి కమ్యూనిస్టుల్ని ఊచకోత కోయించిన ప్రకాశం పంతులుగారి శతజయంతిని వైభవంగా జరుపుకుంది. బ్రిటిష్ వారి గుండు దెబ్బలకు గుండెచూపించిన వీరుదంటూ కాంగ్రెస్ వారాయన్ని మెచ్చుకుంటే నా అభ్యంతరం లేదు. విశాలాంధ్ర వాళ్లెందుకీ భానాజలో పాల్గొనాలని నేనడుగుతున్నాను. మద్రాసు నగరం కోసం మొండిపట్టు పట్టి పొట్టి శ్రీరాములు గారి ప్రాణాన్ని బలిపెట్టిన కిరాతకుడుగా ప్రకాశం గారిని నేను గర్హిస్తున్నాను. తెలంగాణా రైతాంగ పోరాటమే నెహ్రూ చేత ఆవడిలో సామ్యవాద మంత్రోచ్ఛారణ చేయించింది. అసంపూర్తిగా వుండిపోయిన ఆనాటి సమరం ఇంకా సాగుతోనే వున్నదనేది విప్లవరచయితల అవగాహన. అలా దేశమంతటా సాగిస్తున్నవారే ఆనాటి పోరాట సంప్రదాయలాకు ఈనాటి వారసులు. ఈ వారసత్వం మాదంటే మాదని చిందులు తొక్కడానికి అన్నదమ్ములు పంచుకునే ఆస్థిహక్కు కాదు. ప్రాణాలనే ఆహుతిగా సమర్పించి సంపాదించుకునే జన్మహక్కు. ఈ విప్లవాపోరాటానికి సంబందించిన సమగ్ర చరిత్ర ఇంకా రాయవలసే వుంది. ఆనాటి సాహిత్యమంతా సమీకరించవలసే వుంది.”

  దీని తర్వాత (18-1-1973) విభజనను వ్యతిరేకిస్తూ విరసం అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఇరవై రోజాల తర్వాత (5-2-1973) తన రాజీనామాని వుపసంహరించుకున్నాడు. రాష్ట్ర విభజనని కోరుతూ విరసం కార్యవర్గం చేసిన తీర్మానానికి అసమ్మతి తెలిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శ్రీశ్రీ, దానిపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొడానికి సమ్మతి తెలిపాడు. “నేను త్రికరణశుద్ధిగా సమైక్యవాదినైనప్పటికీ మెజారిటీ సభ్యత్వం విభజన కోరుతూ తీర్మానిస్తే అందుకు కట్టుబడతాను.” అని ఆంధ్ర పత్రిక (దినపత్రిక) లో 5-2-1973 నా ప్రకటన ఇచ్చాడు.

  ‘నా శాశ్వత చిరునామా విరసం’ అని 23-7-1980 లో ‘ఈనాడు’ లో వార్త: “…..విరసం పుట్టినప్పటి నుండి అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ నేను విరసం సభ్యుడినే. నా శాశ్వత చిరునామా విరసం. అఫ్హానిస్తాన్, అస్సామ్, వామపక్ష సమైక్యం మొదలైన రాజకీయ విషయాలలో నా అభిప్రాయాలన్నీ దుర్భ్రమలేనని గ్రహించాను. అందువల్ల ఇప్పటినుంచీ విరసం రాజకీయాలే నా రాజకీయాలు. సాహిత్యంలో ఎప్పుడూ అతివాదిగా వుంటున్న నేను రాజకీయాలలో మితవాదానికి, ఊగిసలాటకి లోనవుతూవచ్చాను. ఇది పొరపాటేనని ఒప్పుకుంటున్నాను..” అని

 6. ఏశాల శ్రీనివాస్ says:

  కుర్మనాథ్ గారు- 1982 సృజన తెలంగాణా విమోచనోద్యమం ప్రత్యెక సంచిక లో పేజి నెంబర్ 71 ఆరుద్ర త్వమేవాహానికి ఒక టిప్పని రాస్తూ శ్రీ శ్రీ త్వమేవాహం కావ్యానికి కాలమే ప్రదాన వస్తువు తెలంగాణా ఒక అల్ప క్షనముగా మారిపోతుంది”
  ఈదే పుస్తకం పేజి 73 లో ఆరుద్ర త్వమేవాహనికి మెదలు పెట్టిన పేరు తెలంగాణే దీన్ని త్వమేవాహం గా మార్చింది శ్రీ శ్రీ నే.
  విప్లవాలు-వాటిని కీర్తిస్తూ రాసిన వాళ్ళు గా – ప్రజల భుజాల మీద మోస్తున్నారు. మరి అలంటి శ్రీ శ్రీ తెలంగాన అనే పేరు కూడా మర్చి ఒక ఉద్యమాన్ని ” అల్ప క్షనముగా” రాసిన వ్యక్తిని ఎలా ఆరాధిస్తారు ఇక్కడి ప్రజలు

  • kurmanath says:

   Srinivas garu,
   I completely understand and respect your views. my point is, we should put the whole issue in perspective and not quote only parts that are relevant to our arguments.
   శ్రీ శ్రీ మాత్రమె కాదు. ఎవరైనా సరే ఒక ప్రజాస్వామిక డిమాండ్ ని వ్యతిరేకిస్తే నిలదీయాల్సిందే. కానీ మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న మాటని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని అన్నాను.

 7. ఏశాల శ్రీనివాస్ says:

  idea is not born in our mind, it’s part of our personality-Hegel
  మీ మెజారిటి వాదం అనేది సంస్తలకు వర్తిస్తుండ వచ్చు వ్యక్తులకు కాదు

  • kurmanath says:

   Hegel quotation చాలా బాగుంది, శ్రీనివాస్ గారు. చక్కగా చెప్పాడాయన.
   కానీ, హెగెల్ తర్వాత philosophy చాలా అభివృద్ధి చెందింది. Marx-Engels, Lenin, Stalin and Mao వీళ్ళందరూ ఏమన్నారంటే వ్యక్తి సమష్టిలో చేరితేనే, సంస్థలుగా మారితేనే ఆధిపత్యాన్ని ఎదిరించవచ్చని. వాళ్ళవి నిజం చేసి చూపించారు కూడా. వ్యక్తులుగా వుంటే ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుందని కూడా చెప్పారు.

   • ఏశాల శ్రీనివాస్ says:

    కుర్మనధ్ గారు – మర్క్సిసం ఆదిపత్యాన్ని ఏక కేంద్రిక్రుతంగానే గుర్తిస్తుంది. నిజానికి ఆధిపత్యం సమాజంలో వికేంద్రికరనగా ఉంది. అవి కులాలుగా, మతాలుగా, కుటుంబంలో ఇంక చాల రకాలుగా ఉంటుంది. వీటిని గుర్తించక పోవడం వల్లనే మర్క్సిసం ఈ శతాబ్దపు విఫల ప్రయేగంగా మారింది.

  • kurmanath says:

   అన్యాయానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనిషి వేలాది సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే వున్నాడు. కొన్ని సార్లు గెలుస్తున్నాడు. చాలా సార్లు ఓడిపోతున్నాడు. తప్పులనుంచి నేర్చుకుని మళ్ళీ పోరాటం చేస్తున్నాడు. వాటిని విఫల ప్రయోగాలు అనరు. 1956 లో, 1969లో మోసానికి గురయిన తెలంగాణా మళ్ళీ రగులుతుంది. మరోసారి మోసానికి గురయ్యే అవకాశం వుంది. కానీ, అది మళ్ళీ లేచి పోరాడుతుంది. విఫల ప్రయోగాలు కావవి.

 8. సంగిశెట్టి శ్రీనివాస్ says:

  చిరకాల మిత్రుడు కూర్మనాథ్‌కు ధన్యవాదాలు..
  శ్రీశ్రీ ఒక్కరే కాదు. సాయుధ పోరాటం (1946-51) గురించి ఎన్నో రచనలు చేసిన ఎందరో సీమాంధ్ర మహామహులు తమ ప్రాంతానికి సంబంధించిన అంశం వచ్చేసరికి ప్రజాస్వామికంగా కాకుండా, పక్షపాత ధోరణితో వ్యవహరించారు. ఇలా వ్యవహరించినవారు అభ్యుదయవాదులుగా ఇప్పటికీ కొనియాడబడుతున్నారు. వీళ్ళే తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకునేందుకు 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని విమర్శించారు. అంతేకాదు వీరి ప్రభావంతో దాశరథి, సి.నారాయణరెడ్డి, మొదట్లో చెరబండరాజు లాంటి వారు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఎక్కడా సంఫీుభావం ప్రకటించలేదు. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమానికి మద్ధతు తెలపని సాహిత్యకారులు కూడా ఈ గడ్డ మీద ఉన్నారు. (బుచ్చిరెడ్డిగారు అంపశయ్య నవీన్‌ గురించి రాశారు కూడా) మీదు మిక్కిలి విశాలాంధ్ర కోసం కవితలల్లిండ్రు. ఒక్క కాళోజి మాత్రమే 1956లో ఆంధ్రప్రదేశ్‌కు మద్ధతిచ్చినప్పటికీ శాసనమండలి సభ్యత్వంతో అసలు విషయాల్ని అంచనా వేయగలిగిండు. ఆనాటి నుంచి ఆఖరి వరకూ ప్రత్యేక తెలంగాణవాదిగానే నిలిచిండు.
  హైదరాబాద్‌లో, తెలంగాణలో శ్రీశ్రీ సంస్మరణ సభలు పెట్టుకోవడం, ప్ర.జ. ద్వారా విరివిగా అభిమానం కురిపించడం, ప్రత్యేక సంచికలు, సంపుటాలు వెలువడరించడం, టాంక్‌బండ్‌పై విగ్రహాన్ని కూలగొట్టకుండా అడ్డుకోవడం ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకూ అన్నీ తెలంగాణ బిడ్డలు ఆయనమీద గౌరవంతోనే చేసిండ్రు. ఇవన్నీ చేసిన వారికి శ్రీశ్రీ విషయంలో ఇప్పటి వరకూ అంతగా వెలుగులోకి రాని విషయాలు తెలిసినట్లయితే ఆయన్ని పునర్‌ అంచనావేయడానికి వీలవుతుంది. దాని వల్ల శ్రీశ్రీకి ఏదో నష్టం జరుగుతుంది అని కాదు. తెలంగాణ సాహిత్యానికి మేలు జరుగుతుంది, జరగాలనేదే ఆశ.
  ఇక రెండో విషయం. తెలంగాణవాదులందరూ మొదటి నుంచీ చెబుతున్నది ఒకటే విషయం. ఆంధ్రప్రదేశ్‌ అవతరణకూ పొట్టి శ్రీరాములుకూ ఎక్కడ సంబంధం లేదు అని. అయితే రాజశేఖరరెడ్డి మొదలు కిరణ్‌ కుమార్‌ రెడ్డి వరకు సమైక్యవాదులందరూ నవంబర్‌ ఒకటి రోజు పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పిస్తూ ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం అమరుడైనట్లుగా చూపిస్తున్నారు. సమైక్య రాష్ట్రవాదులు పొట్టి శ్రీరాముల్ని తమ ప్రతీకగా ప్రదర్శిస్తుండ్రు. పొట్టి శ్రీరాములు విషయంలో శ్రీశ్రీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇకనైనా సమైక్యవాదుల కండ్లు తెరుచుకోవాలి. తమకు ప్రతీక పొట్టి శ్రీరాములు కాదని తెలుసుకోవాలి. తమ ప్రాంతం వాళ్ళే ఆయన్ని పొట్టనబెట్టుకున్నారనే అవగాహన పెంచుకోవాలి.

  • kurmanath says:

   అవును. 5-10 శాతం తప్పితే తెలంగాణాని వ్యతిరేకించే వాళ్ళు ఆంధ్రా ప్రాంతం లో లేరు.

   అంతిమంగా కాజ్ బలపడాలి. బలపడుతుంది

 9. buchi reddy gangula says:

  శ్రీనివాస్ గారు
  గోడ మీద పిల్లులు లా —కిరణ్ గారి తో బొమ్మలు –శాలువలు కప్పించో కోవాడాలు,
  పేస్ బుక్ లో —పెట్టుకుంటూ –తెలంగాణా ఉద్యమానికి మద్దతు తెలుపని
  తెలంగాణా సాహితి మిత్రులు లేకపోలేదు —వాళ్ళ కు కావిలిసింది పేరు — గుర్తింపు
  డబ్బు సంపాదించడం —తెలంగాణా ద్రోహులు
  తెలంగాణా ఫై –కాంగ్రెస్ ప్రకటన చేయనుంది అనగానే—-సీమంధ్ర నేతల హంగామాలు — ముచ్చట్లు
  దోబూచలాట లు ???
  తెలంగాణా ప్రకటిస్తే నేను రాజీనామా చేస్తా — రాయపాటి ప్రకటన ??లగడపాటి కూతలు ఎన్నో
  వింటున్నాము — చూస్తున్నాము –ఎందుకీ యి చిరుతల రామాయాణం ??ఎంతకాలం
  నేటికి నోరు మెదు పని కవుల కు — రచయితుల కు నా మనవి ?? విడి పోదాం — కలిసి
  బ్రతుకుదాం –దయతో స్పందించండి —గళం విప్పండి — రాయండి
  మాకు న్యాయం కావాలి
  మాకు స్వాతంత్రం కావాలి
  మాకు విముక్తి కావాలి —– Nehru గారు అన్నట్లు — యిది క లు వ ని సంసారం
  విడి పోతే తప్పేమిటి ??
  శ్రీనివాస్ గారి ఆర్టికల్స్ ను ప్రచురించిన *** సారంగ సంపాదుల కు ** నా స ల్యు టస్ ****

 10. veldandi Sridhar says:

  ఇంత కాలం శ్రీశ్రీని, ఆరుద్రను,కే.వి. రమణ రెడ్డిని తలకెత్తుకుని తిరిగాము. సంగిశెట్టి గారి వ్యాసం చదివాక,సో కాల్డ్ సమైక్య వాద కవుల కవితా వాక్యాలు చదివాక, ఇంకా నిద్ర పుచ్చే కవిత్వాలు చదివి భ్రమల్లో ఉండడం ఇంకా సాగదు. పీడితులవైపు నిలబడి కవిత్వాలు రాస్తున్నామని భ్రమలు కలిగించిన ప్రతి కవిని కాల పరీక్షకు గురిచేయాల్సి ఉంది. ఇప్పుడు తెలంగాణా తనను తానూ తెలుసుకుంటోంది. సంగిశెట్టి లాంటి వారి వ్యాసాలూ ఎంతోమందిని మేల్కొల్పుతున్నాయి. సంగిశెట్టి గారికి, సారంగకు ధన్యవాదాలు. సీమంద్ర కవులు ఈ చారిత్రక సమయంలో తమ కలాల్ని. గళాల్ని వినిపించాల్సి ఉంది. లేక పొతే చేతనత్వం ఉడిగిపోయి కాలగర్భంలో కలసిపోతారు.

  వెల్దండి శ్రీధర్

  • buchi reddy gangula says:

   ఇంకా ప్రకటన చేయక ముందే—ఎన్ని నాటకాలు— రాజీనామాలు—
   డిల్లీ లో లాబియింగ్—- మళ్లీ మనను — –దోచుకున్న డబ్బు తో—తెలంగాణా
   వేర్పడకుండా — ఎంత కై నా ధిగజారి పోతూ—
   శ్రీధర్ గారు–
   మన తెలంగాణా లో నే— ధ్వ౦ ధ వై ఖరి తో—-మనల్ని మంట గలిపె నేతలు–రచయితలు
   ఉన్నారు—
   ప్రాంతం వారే దోపిడీ చేస్తే– ప్రాణం తో నే పా త ర వేస్తాం—***అన్న ప్రజా కవి
   కాళోజీ గారి ని తలుచు కుంటూ–కాలమ్ము రాగానే కాటేసి తీరాలి??
   మార్పు కావాలి
   తెలంగాణా రావాలి———–
   ————————————————
   బుచ్చి రెడ్డి గంగుల

 11. శ్రీనివాస్ గారు,
  ఈ వ్యాసాన్ని చదివిన తర్వాత మిమ్మల్ని హృదయపూర్వకండా హత్తుకోవాలనిపించింది. తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రను అర్ధం చేసుకోవడానికి ఈ వ్యాసం అనేక దారుల్ని చూపిస్తుంది. నిజమైన పరిశోధన కనిపించిందీ వ్యాసంలో. కంగ్రాట్స్.
  దార్ల

 12. వ్సాసం బాగుంది. ఇలాంటి నిజాల్ని వెలికి చెప్పడానికి కూడా మన వాళ్ళుకూడా చాలా మంది సభల్లో వెనుకాడేవారు. శ్రీశ్రీ నిజాం దగ్గర సెక్రటరీ గా కూడా పనిచేశాడని చెబుతారు. సరిగ్గా తేదీలు తెలియవు కానీ, రజాకార్ల ఉద్యమ కాలంలోనో దానికి తర్వాతనో ఆయన పనిచేసినట్లు మానాన్నగారు చెప్పేవారు. సంగిశెట్టికి ఈ విషయం తెలిసే అవకాశం ఉంది.
  సంగిశెట్టికి, అఫ్సర్ కి అభినందనలు.

 13. CHERALA PRAKASH BHOODAN POCHAMPALLY says:

  అన్నా మీరు చెప్పింది అక్షర సత్యం కాకి మన తెలంగాణా అభ్యుదయ భావజాల వ్యాప్తులు దానికి దాసోహం అయిపోయారు. వారు మారాలంటే వ్యక్తిగా మార్పు రావాలి అంతేగాని మీలాంటి వాళ్ళు ఇంకా తెలంగాణ మేధావులు చెప్పిన వారి బుర్రలకు ఎక్కదు.

 14. V SATHI REDDY says:

  you are right,,sreenivadu gaaru

 15. అంబల్ల జనార్దన్ says:

  శ్రీనివాసన్నా! నీకు షెనార్థి. ఎంతో పరిశోధించి గింత మంచి వ్యాసం రాసి, ఆంధ్రోల్ల మూతులు నాకే మన తెలంగాణ కవుల మీద మంచి విమర్శ జేసినవ్. గిట్లనే ఇంకా రాసి మనోల్ల కండ్లు తెరిపించు.

 16. g b sastry says:

  ఇన్ని చెప్పిన వారు సీనారే గారి ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అన్నది కావాలనే మరచారా?

 17. దేవరకొండ says:

  అధికారం, డబ్బు తీరని దాహాలు. సాహిత్యాలు, చట్టుబండలు కాలక్షేపాలు. అధికారం కావాలనుకొన్న వాడు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తాడు. డబ్బుతో చెలిమి చేస్తాడు. సామాన్యుల్ని భ్రమల్లో ముంచి వుంచగల కళలను, సాహిత్యాలను చెప్పుచేతల్లో వుంచుకుంటాడు. వాటికి చైతన్యం రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాడు. ఇవన్నీ అందరికి తెలిసిన, చరిత్ర రుజువు చేసిన సత్యాలు. జరగవలసింది జరిగింది. అధికార పీఠాలు ఏ ఏ కుటుంబాలను మోయాలో మోస్తున్నాయి. వ్యాపారాలు, పెద్ద డబ్బు ఎవరి చేతుల్లో వుండాలో అక్కడే వుంది. శ్రీ శ్రీ, ఆరుద్రలు ఏదో రాస్తే ఏదో జరిగి రాయక పోతే జరక్కపోయి…అంత శక్తి కవులకు, వారి రచనలకు వుందని అనుకోవడం వ్యక్తిగత స్వేచ్చ. వర్గ స్వభావం అర్ధమైనా అప్పుడప్పుడూ వర్గ భ్రమలకు లోనై ఆత్మ విమర్శ చేసుకునే ఒక మంచి ఆచారం కమ్యూనిస్టులకు వుండేది. అది అందరికీ అనుసరణీయమే!

 18. దేవరకొండ says:

  ఓ పేరడీ ‘తెలుగు జాతి మనది…’ కి..
  (ఇది ఎవరినీ (బతికున్న, చనిపోయిన) ఉద్దేశించినది కాదు. ఎవరికైనా అలా అనిపిస్తే అది కేవలం యాదృచ్చికమే తప్ప ఉద్దేశ్యపూర్వకం కానే కాదు.)
  తెలుగు జాతి మనది!
  ఒకప్పుడు
  వెలుగు జాతి మనది!
  తెలంగాణా నాది!
  రాయలసీమ నీది!
  సర్కారు ఆమెది! నెల్లూరు ఆయంది!
  అన్నీ పగిలిన, తెలుగు జాతి
  వాడిదో, వీడిదో ఎవడిదోరా! ||తెలుగు||
  సిపాయి కలహం విజృంభించ
  నర సిం హాలై గర్జించారు
  గాంధీ నెహ్రూల పిలుపులందుకొని
  సత్యాగ్రహాలు చేశారు
  స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట
  స్వరాష్ట్రాలు సాధించారు
  దేశభక్తిలో రాష్ట్రభక్తి ఒక
  భాగం కాదనిపించారు! ||తెలుగు||
  ప్రాంతాలు ఏవైనా
  మన కుమ్ములాటలొకటేనన్నా!
  యాసలు అలగలగుంటే
  మన భాష ఒక్కటెట్లన్నా?
  ఒచ్చిండన్నా ఒచ్చాడన్నా
  ఆంద్రా దమాక్కి సమజౌతదన్నా! ||తెలుగు||
  మహాభారతం పుట్టింది
  రాజులు ఏలే కాలంలో!
  భాగవతం వెలిసింది
  నవాబులేలే జమాన్లో!
  గా ముచ్చటంత మాకు తెల్వాదు!
  మీకూ మాకూ రాం రామన్నా! ||తెలుగు||
  ఇంటిలోన అరమరికలు వున్నాయ్,
  ఢిల్లీ వెళ్ళి చాటేశాం!
  కంటిలో నలక తీయకుండనే
  రెండుకళ్ళు గుంజి నూకేశాం!
  పాలు పొంగు మన తెలుగు గడ్డను
  పగల గొట్టి దొబ్బాం!
  నలుగురిలో మన జాతి పేరును
  నవ్వుల పాలు చేసేశాం! ||తెలుగు||
  (సినారె గార్కి క్షమాపణలతో)

  • శ్రీనివాసుడు says:

   ‘‘తెలుగు జాతి మనది, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు ’’ అని వ్రాసినందుకు సినారె ఇప్పటికే తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పేరు దేవరకొండ వారూ! కొన్నేళ్ళ క్రితం బహిరంగంగానే ఆ మాట చెప్పేరు. ఆయనకు ఆ జ్ఞానోదయం కలిగి, వివేకం ఉద్భవించి చాలాకాలమే అయింది. కాబట్టి, మీరు క్రొత్తగా ఆయనకు క్షమాపణ చెప్పవలసిన పని లేదు. పేరడీలో ఇంకొంచెం వ్యంగ్యం దట్టించి తెలుగు బిడ్డలయిన మమ్మల్ని ఆనందపరచనందుకు మాకు క్షమాపణ చెప్పండి.

 19. శ్రీశ్రీ, ఆరుద్ర అప్పుడలా అన్నారంటే ఆ కాలపు పరిస్థితుల్ని బట్టి అన్నారని అర్థం చేసుకోవాలి. వాళ్లే కనుక ఇప్పటికీ బతికుంటే తెలంగాణకు మద్దతిచ్చేవారని నా అభిప్రాయం. దాశరథి, సినారె ఆంధ్రులు సమైక్యంగా ఉండాలని చాటిచెప్పినవాళ్లే. ఎందుకంటే అప్పుడు బలంగా ఉన్నది ‘తెలుగు’ సెంటిమెంట్ కాబట్టి. ‘తెలంగాణ’ సెంటిమెంట్ బలపడ్డాకనే సీమాంధ్రకు చెందిన పలువురు రచయితలు దానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే కదా. కాలం, పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోకపోతే తప్పుడు తీర్మానాలకు ఆస్కారం కలుగుతుంది. విద్వేషాలకు బలం చేకూరుతుంది. కొత్త చరిత్ర రాయాలనుకున్నప్పుడు పాత చరిత్రను దునుమాడాల్సిన పనిలేదు. అందులోని తప్పును ఎత్తి చూపిస్తే చాలు. లేకపోతే ఆ కాలపు వాళ్లు చేసిన తప్పులే మనమూ చేసినవాళ్లమవుతాం.

  • sangishetty srinivas says:

   మూర్తి గారు… నేను చేసిన పని కూడా అదే. తెలంగాణ వాళ్ళు కూడా చరిత్ర తెలియక ఇన్నేండ్లు కొంత భజన చేసిండ్రు. ఆ భజన అవసరం లేదు. మన వాళ్ళు (తెలంగాణ) మస్తు మంది వెలుగులోకి రాకుండా చీకట్లో ఉన్నరు. పాబ్లో నెరుడా లాంటి కవి .. కవిరాజ మూర్తి ఆయన రచనలూ ఏవీ అందుబాటులో లేవు. ఇలాంటి వారు ప్రతి జిల్లాలో ఉన్నరు..వీల్లను మోయడం ఆపితే వాళ్ళను వెతకడం ఈజీ అని నా అభిప్రాయం.. స్పందించిన అందరికి వందనాలు..

 20. ఆంధ్ర పాలకులు తెలంగాణకి అన్యాయం చేశారనే దాని గురించి ఒక వైపు నుంచే చూస్తే తప్పు జరిగినట్టుగానే అనిపిస్తుంది.ఇవ్వాళ గయ్యాళిగా మాట్లాడుతున్న తెలంగాణా కుమేధావుల మాటలు నమ్మితే నిజంగానే మనం సిగ్గుతో తల దించుకోవాలనే అనిపిస్తుంది!యేమంటున్నారు వాళ్ళు,మా వుద్యోగాల్ని దోచుకున్నారు – కావాలంటే గిర్గ్లానీ రిపోర్టు చూడ మన్నారు.చూశాను, ఒక 1పోష్టు గూడా వేశాను, యేముంది అందులో?అన్యాయం జరగడం అంటూ వుంటే అన్ని ప్రాంతాల వారికీ జరిగిందని ఖచ్చితంగా చెప్పాడు.మిగతా యే ప్రాంతాల వారికీ అన్యాయం జరక్కుండానో, లేదా మిగతా అన్ని ప్రాంతాల వారికీ విపరీతంగా లాభం చేకూరి వీళ్ళు ఒక్కరికే అన్యాయం జరిగితే కదా ఆంధ్రావాళ్ళు మా ఉద్యోగాలు దోచుకున్నారనీ,మమ్మల్ని ముంచి బాగుపడ్డారనీ అనాల్సింది?ఒక పత్రికా విలేఖరి మరీ సూటిగా యెవరు నష్ట పోయారు?యెవరు లాభ పడ్డారు అని అడిగితే “అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాళ్ళు బాగు పడ్డారు, వెళ్ళ లేని వాళ్ళు నష్ట పోయారు” – అని అంతకన్నా సూటిగా జవాబు చెప్పాడు. దాని భావ మేమిటో యే తిరుమలేశుణ్ణీ అడగనక్కర్లేదు కదా?చిన్న పిల్లవాడి నడిగినా చెప్తాడు, ఇంకా “అదేంటి?అయితే యెక్కడో వున్న కృష్ణా జిల్లాల వాళ్ళు అంత దూరంలో వున్న హైదరాబాదుకి వెళ్ళి బాగు పడగలిగినప్పుడు, పక్కనే వున్న వాళ్ళు కూడా వెళ్ళి బాగుపడితే బాగుండేది కదా? వెళ్ళగలిగితే బాగు పడతామని తెలిసినప్పుడు వెళ్ళి బాగు పడకుండా యాభయ్యేళ్ళు యేమి చెస్తున్నట్టు?” అని కూడా అడుగుతాడు!నా లాంటి తింగరోడు పక్కనే వుంటే , “బహుశా యాభయ్యేళ్ళయినా వందేళ్ళయినా సరే ఆంధ్రోళ్ళు అక్కడ ఉండగా పోగూడదు ఆంధ్రోళ్ళని అక్కణ్ణించి తరిమి కొట్టాకే వెళ్ళి బాగు పడదాంలే అనుకుంటూ, యే మహానుభావుడు వచ్చి ఆంధ్రోళ్లని తరిమికొడతాడా అని జపతపాలు చేస్తూ కూర్చున్నారేమోలే” అని ఓ వంకర కూత కూస్తాడు

  తెలంగాణ వాళ్ళ తింగరి వాదనల్ని మొగ్గలోనే తుంచెయ్యని మన వెనకటి తరం నాయకుల అలసత్వం వల్ల ఇదంతా జరిగింది! చెన్నారెడ్డి లాంటి పదవి పోయిన పాత పొలిటీషియన్లు భుజం మీద వేసుకుని గగ్గోలుపెట్టి మళ్ళీ పాప్యులారిటీని సాధించుకోవటానికి తెలంగాణకి జరిగిన అన్యాయం పనికొచ్చేది!అంతకు మించి అక్కడ అందరూ అనుకున్న భీభత్సాలు యేమీ జరగలేదు.పోనీ జరిగాయనే అనుకుందాం, ఇప్పటి పరిస్థితి యేమిటి?కలిసుండటం వల్లనే మా కన్యాయం జరిగిందని విడిపోతే యే న్యాయం వెయ్యి కాంతులతో వికసిస్తుందని వాళ్ళు అంటున్నారో ఇవ్వాళ్టి తెలంగాణా ఆ నమ్మకాన్ని కలిగించేవిధంగా వుందని ఈ మేధావులు చెప్పగలరా?యెన్నికల్లో గెలిచి మంత్రివర్గంలో వున్నవాళ్ళలో గానీ అక్కడ పైస్థాయిలో చక్రం తిప్పుతున్నవాళ్ళలో గానీ కొత్తముఖాలు మీకెక్కడయినా కనబడినాయా?కేసీఆర్ కుటుంబమూ, రెడ్లూ మరియూ వెలమలూ హవాహవాయీ అన్నట్టుగా వున్నారు!కోడి పోయి కత్తి వచ్చె డండండం అన్నట్టు ఆంధ్రారెడ్లు పోయి తెలంగాణారెడ్లు వచ్చె డండండం అనేట్టుగా వున్న కొత్త సీసాలో పాతసారా తంతు కోసమేనా అంతగా అంగలార్చింది?
  విడిపోయి కలిసుందాం అన్నవాళ్ళు ఇవ్వాళ అదేదో సినిమాలో మూగతనం పోయిన శ్రీలక్ష్మి చిన్నప్పుడు పక్కింటివాళ్ళని తిట్టాలనుకునన్ తిట్లని ఇప్పుడు ఎదురుగా ఉన్న మొగుణి తిట్టిన చందంగా ఆంధ్రా కవుల పాత చరిత్రలు ఎత్తుకుని మరీ తిడుతున్నారు,ఎందుకు?
  ఎవరో కవి విస్మృతంగా ఉండిపోవడానికి శ్రీశ్ర్రెకి వచ్చిన పేరు ప్రతిస్ఠలకీ సంబ్నధం యేమిటి?ఆ విస్మృతకవికి ఇప్పుడు కొత్తగా పేరు తీసుకురావాలంటే పాతవళ్ళని తిట్టి బజారుకీద్ఛి లాగిపారెయ్యాలా?తెలంగాణ కవుల్ని పొగడ్డానికి ఆంధ్రా కవుల్ని తెగడ్డానికి యేమిటి సంబంధం?

 21. ప్రాంతీయాభిమానం ఉండటంలో ఏమాత్రమూ తప్పు లేదు!కానీ,పక్షపాతం అనిపించేటట్టు ఉండకూదదు,అవునా?ఈ 1969లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళలో “దాశరధి”ని ఎందుకు వద్లిలేశారు?ఆయన ఆరోగ్యం బాగుండక ఆస్పత్రిలో చేరితే ముందుముందు కోవర్టుగా పనికొస్తాడని ఆంధ్రా పెద్దమనిషి ఒకడు వైద్యం చేయించితే ఆ విశ్వాసంతో యేదో మాట్లాడబోతే కాళోజీ నారాయణ రావు అనే మహామేధావి ఆ కుట్రని బయటపెట్టి నిలదీస్తే గుడ్లనీరు కక్కుకుంటూ జారుకున్న ద్రోహి కదా!”ప్రాంతం వాడు ద్రోహం చేస్తే…” లాజిక్కు ప్రకారం ఆయన్నీ పాతరెయ్యండి – మీరెంత నిష్పక్షపాతంగా ఉండగలరో తెలుస్తుంది.భావజాలం పట్ల నిబద్ధత ఉంది ఉందని చెప్పుకుంటే ఎలా తెలుస్తుంది,చేతల్లో కనబడినప్పుడె మీ నిజాయితీ అందరికీ అర్ధమవుతుంది.ఇప్పటికీ సమయం మించి పోలేదు.”వీళ్ళని మొయ్యడం ఆపితే..” లిస్టులో దాశరధిని కూడ చేరుస్తారు కదూ!
  *
  సిగ్గు లేకపోతే సరి!ఏ ఉద్దేశంతో వ్యతిరేకించారో స్పష్టంగా నాకు తెలియదు గానీ,కలపాలనీ నుకున్నప్పటి నుంచీ ఆంధ్రోళ్ళతో కలవగూడదు,విడిగా ఉండాలి అనుకున్నారు.ఇన్ని దశాబ్దాల తర్వాత సాధించుకున్నారు.గతం గతః అనుకుని ఇప్పుడు తెలంగాణకి ఉన్న సమస్యల్ని ఎట్లా అధిగమించాలి అని భవిష్యత్తు గురించి ఆలోచించటం మానేసి గత చరిత్రలు తవ్వుతున్నారు – చరిత్రలు తవ్వడం మీకు మాత్రమే తెలుసునని పెద్ద అహంకారం!రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు కూడా విడిపోయేటప్పుడు తిట్టుకున్నా,తర్వాత పెళ్ళిళ్ళలో పందగల్లో కలుస్తూ యేదయినా కష్తమొచ్చిందని తెలిస్తే మనస్పూర్తిగా సహాయాలు చేసుకుంటూ పాత ద్వేషాలు మర్చిపోయి ఆప్యాయతల్ని చూపిస్తారు – ఆపాటి మర్యాద కూడా లేదా మీకు?
  *
  ఇన్ని దశాబ్దాల నుంచీ ఆంధ్రోళ్ళు దోచుకోవడం వల్లనే మీ ప్రాంతం వెనకబడ్డాం అనేది నిజమైతే మీ ప్రాంతపు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు?వాళ్ళలో ఎంతమందిని మీరు పాతరెయ్యగలిగారు? వ్యక్తులుగా చూసినా పార్టీలుగా చూసినా మీరు ఆంధ్రా దోపిడీ జరిగింది అనే కాలంలో అధికారంలో ఉన్నవాళ్ళే ఇప్పుడు కూడా గులాబీ కండువాతో దర్సనమిస్తుంటే అర్ధం కావడం లేదా?వీళ్ళు మీ ప్రాంతం వాళ్ళు కాదా!వీళ్ళని పాతరెయ్యనక్కర లేదా?గురివిందల్లాగ ఆంధ్రోళ్ళని తిట్టడం ఆపి మీ తప్పుల్ని తెలుసుకుని బాగుపడండి.
  *
  దసరాబుల్లోడు అనే సరదా సినిమాలో ” దొంగలు దొంగలు చేరి వూళ్ళు పంచుకుంటారు,వాటా కుదరని వాళ్ళూఉ వేరే పార్టీ పెడతారు” అన్నట్టు పైస్థాయిలో ఉన్నవాళ్ళ వెసులుబాటు కోసమే పాకిస్తాన్ ఏర్పడింది, తెలంగాణ కూడా అదే లెక్క ప్రకారం ఏర్పడింది.మీరు నమ్మలేకపోతే అది మీ అమాయకత్వం! చరిత్రలు తవ్వడం ఇక ఆపితే బాగుంటుంది!
  *
  శ్రీశ్రీని ఎవరు తెలంగాణ మీద రుద్దారు?అతను కమ్యునిష్టు భావజాలంతో కవిత్వం రాశాడు.ఆ భావజాలం నచ్చినవాళ్ళు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారు కదా!భావజాలంలో సారూప్యత ఉండియే నిన్నటి రోజున అభిమానించారు,ఇవ్వాళ్టికీ అభిమానిస్తున్నారు,రేపు కూడా అభిమానిస్తారు – తెలంగాణలో కమ్యుఇనిష్టు భావజాలం ఉన్నవాళ్ళు శ్రీశ్రెని పొగిడితే అది ఆంధ్రోళ్లకి వూడిగం చెయ్యడం అయితే ఆంధ్రోళ్ళు పోతన భాగవతం చదవడం అది తెలంగాణకి వూడిగం చెయ్యడం అవదా!
  *
  ఇప్పుడు మీరు సిగ్గుపడటం మొదలుపెడితే సిగ్గుకే సిగ్గేసేటంత సిగ్గులేని తనం ఉంది మీలో! రాష్ట్రాన్ని విడదీసిన వాళ్ళు మీలాంటి నాలాంటి ప్రజల గురించి ఆలోచించి విడదియ్యలేదు – పై స్థాయిలో చేతులు మారే వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులను ఎవరు దక్కించుకోవాలన్న లెక్కలతో కొందరూ,ఒక రాష్ట్రం రెండయితే అదనంగా సృష్టించబడే రాజకీయ పదవుల కోసం కొందరూ – తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు చేశారు.అందుకే మనల్ని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచిన అన్ని పార్టీల వాళ్ళూ ఇప్పుడు పదవుల్ని పంచుకోవడం కోసం వాళ్ళలో వాళ్ళు అంత ఐకమత్యంగా కలిసిపోగలుగుతున్నారు – కళ్ళు తెరుచుకుని చూడండి!ఈ మేకమెడచంటిపాల కోసం ఎంత ఆశపడినా లాభం లేదని త్వరలోనే తేటతెల్ల మవుతుంది ఎల్లరకూ!ఏ మనిషి ఏ దేశంలో ఏ కాలంలో వృద్ధిలోకి వచ్చినా అతని నైపుణ్యమే కారణం.మీలోని నైపుణ్యాన్ని పెంచుకోండి,అది ఆర్జనని పెంచుతుంది,అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది – అప్పుడు ఈ విభేదాలూ ద్వేషాలూ వాటంతటవే మాయమై పోతాయి.ఆ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే అనవసరంగా ఆవేశపడ్డామని పశ్చాత్తాపపడకుండా ఉండటానికయినా ఈరోజున కొంచెం విచక్షణతో ప్రవర్తించండి!
  *
  మనుషుల్ని కలపటానికి పుట్టిన భాషని మనుషుల్ని విడదియ్యటానికి వాడకండి!

 22. sangishetty srinivas says:

  అయ్యా బాబు గారు నేను దాశరధిని ఎక్కడా మోసింది లేదు. ఆ ఉద్దేశం లేదు. నా రచనలు ఫాలో అయితే అది మీకు అర్థమైతది. చరిత్ర వొద్దు అన్న చంద్రబాబుకు మీకు తేడా లేకుండా పోయింది. అయినా ఈ వ్యాసం తెలంగాణ రాక ముందు రాసినది అని లెక్కలోకి తీసుకుంటే మీరు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. మీ దృష్టిలో నేను పక్షపాతంగా ఉన్నాను అనిపిస్తే దయచేసి ఆంధ్రా అద్దాలు తీసేసి మరొక్క సారి చదవండి..

 23. గతచరిత్రలు తవ్వితే రెండువైపులా ఉన్న తప్పులు చాలా బైటికి వస్తాయి.మీరు శ్రీశ్రీని యెత్తిపొడుస్తున్నప్పుడే తెలంగాణ ఏర్పాటును సమర్ధించిన ఆంధ్రప్రాంతపు వాళ్ళూ ఉన్నారు.ఈ రెండుప్రాంతాల్నీ ఒక్కటిగా కలిపింది కాంగ్రెస్!భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నది ఒక సెంటిమెంతల్ ముసుగు,అప్పుడు కూడా పైస్థాయిలో వాటాల పంపకమే ప్రధాన కారణం.నాకీ చరిత్రలన్నీ కొట్టిన పిండి.పెద్దమనుషుల ఒప్పందం అనే బల్లకి అటూ ఇటూ కూర్చున్న పెద్దమనుషులు ఎవరు?అప్పట్లో కాంగ్రెసు పార్టీదే కదా హవా అంతా!దాన్ని తుంగలో తొక్కటం అంటూ జరిగితే వారి వాటయే ఎక్కువ కదా ఆ పాపంలో!
  *
  అసెంబ్లీలో రెండు ప్రాంతాల శాసనసభ్యులూ తమ తమ వాదనలు వినిపించి ఎవరికి రావలసింది వాళ్ళు పంచుకుని మర్యాదగా విడిపోయే పద్ధతిని వ్యతిరేకించి ఆర్టికిల్ 3 ద్వారా పైనుంచి రుద్దడం అనే మొండి పద్ధతికి ఎందుకు వెళ్ళారు?ఉద్యమ కాలంలోనే ధర్మమేవ జయతే బ్లాగులో పాయింట్ల వారీగా 10 రకాలుగా “ఆంధ్రోళ్లని తిట్టి ఏకపక్షంగా పైనుంచి తెచ్చుకునే పద్ధతి” వల్ల తెలంగాణకీ అన్యాయమే జరుగుతుందని చెప్పాను. నా విశ్లేషణ ఇది:”అలా మొండిగా వెళ్ళినప్పుడు ఆంధ్రా పొలిటీషియన్లు వాళ్ళ చాణక్యం వాళ్ళూ చూపిస్తారు,తెగే దాకా లాగి ఆఖరి నిమూహం వర్కూ అడ్డుపడి అవ్స్తుందా రాదా అనే గందరగోళం సృష్టించి విడిపోయాక తెలంగాణకి కావలసిన అదనపు సౌకర్యాల కోసం పట్టూబ్ట్టకుండ వొస్తే చాలుననే విధంగా మిమ్మల్ని కార్నర్ చేస్రారు” అని.ఇవ్వాళ విబాన అలాగే జరిగింది కదా!అదే కాదు,ఫలానాది జరుగుతుంది అని నేను గట్టిగా వేసిన అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు!
  *
  రాష్త్ర శాసనసభకి విలువ ఇవ్వకుండా ఆర్టికిల్3 ద్వారా కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే విడగొట్టటం, అదీ ఒక ప్రాంతం నాయకుల మీద మరో ప్రాంతం నాయకులు వారికన్నా వేగంగా అభివృధ్ధి చెందడమే నేరమన్నట్టు అనరాని మాటలు అనటం, వాటికి జవాబు చెప్పుకోవడానికి చట్టసభలలో యెక్కడా కించిత్తు అవకాశం కూడా ఇవ్వకపోవటం,ఆఖరికి మాతృరాష్ట్రాన్ని కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పదేపదే అవశేషంగా అభివర్ణించటం,మిగిలిన కొంచెపు ముక్కనన్నా ఒక్కటిగా ఉండటం చూడలేనట్టు అట్లా ఉంచకుండా సీమవాసులు అడక్కపోయినా రాయలతెలంగాణా పేరుతో ఆ ప్రాంతాన్ని కూడా అప్పనంగా తెలంగాణాకే దఖలు పర్చాలని ప్రయత్నించటం,రాజధాని కట్టుకోవటానికి నికరమైన నిధులూ లోటు బడ్జెట్టును యెదుర్కోవడానికి తగ్గ యేర్పాట్లు యేవీ అధికారికంగా బిల్లులో ఉంచకపోవడం లాంటి అడ్డగోలు పనులన్నిట్నీ కలిపి చూస్తే ఈ రాష్త్ర విభజనలో తెలంగాణా అనే కొత్త రాష్ట్రాన్ని యేర్పరచడంతో పాటు ఆంధ్ర ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలనే దుర్మార్గపువ్యూహం కూడా వున్నదని నాకు అనుమానం!చెప్పుకుంటే జనం మెచ్చుకునే గొప్ప సంగతి కాదు గనక ఆ కుట్రలో పాల్గొన్నవాళ్ళు యెవరూ బయటికి చెప్పరు గనక ఇప్పటికిప్పుడు నిర్ధారణగా చెప్పలేము గానీ అరిభీకరంగా చెలరేగిపోతున్న ఉద్యమవీరులు కూడా తెలంగాణా నడిబొడ్దునే ధరావతులు పోగొట్టుకుంటున్న కాలంనుంచీ మొదలు పెట్టి ఇస్తానని చెప్పి తొమ్మిదిన్నరేళ్ళు సాగదీసి తెలంగాణా వాళ్లనీ యేడిపించిన కాలంలో జరిగిన సంఘటనలనన్నిట్నీ కలిపి విభజన బిల్లు పార్లమెంటులో చట్టంగా రూపుదాల్చేవరకూ తేదీల వారీగా వ్యక్తుల ప్రకటనల్నీ పత్రికలవాళ్ళు కూపీలు లాగిన రహస్యసమావేశాలవివరాల్నీ ఒక వరస ప్రకారం అమరిస్తే తేలికగా తెలుసుకోవచ్చు గుండుగుత్తంగా తెలంగాణాకి లాభం చేకూర్చే ఉద్దేశంతో కావాలనే అవన్నీ అట్లా చేశారని, యెందుకో మా మీద అంత పగ!
  *
  పోనీ ఇంతగా అన్నీ తెలంగాణకే దోచిపెట్టినట్టు కనిపిస్తున్నా తెలంగాణకి జరిగిన లాభం ఏంటి?రాష్ట్రంగా మ్యాపులో కనపట్టం తప్పించి విభజన వల్ల నికరంగా ఒనగూడిన మేము ఏదయినా ఉంటే చెప్పండి!మీకిప్పుడు వచ్చింది సమస్యలతో కూడిన తెలంగాణయే,కేసీయార్ ఓరుకున్నది కూడా సమస్యలతో కూడిన తెలంగాణనే!చక్కగా రుపక్షాలూ కూర్చుని ఎవరి వాటాలు వాళ్ళు వేసుకుని సమస్యలు లేకుండా విడిపోయి రేపు పరిపాలనలో ఫెయిలయితే?!ఇప్పుడు మళ్ళీ ఉపయోగించుకోవటానికి “ఆంధ్రోళ్ళు కుట్ర జేసిర్రు.మంచిగ ఇయ్యలె – నేనేం జేస్త!” అని చెప్పుకునే వెసులుబాటు ఉండె గద!
  *
  నేను నా బ్లాగులో రెండు రాష్ట్ర్రాలకి సంబంధించిన విషయాల మీదా పోష్టులు వేస్తూనే ఉన్నాను.ప్రత్యేకించి ఆంధ్రా కళ్ళద్దాలు లేవు అని నాకు నేను చెప్పుకోనక్కర లేదు,మీరు చూసి స్వయంగా తేల్చుకోవచ్చు! విమర్శించాల్సిన పాయింటు ఉంటే చంద్రబాబునీ విమర్శిస్తున్నాను.మెచ్చుకోవాల్సిన పాయైంటు ఉంటే కేసీయారునీ మ్రెచ్చుకుంటున్నాను. తెలంగాణ రాకముందు రాసినది ఇప్పుదు రీపోస్ట్ చేశానంటున్నారు గాబట్టి ఆ వేడి నుంచి బయటపడి చల్లబడాల్సింది మీరే!పోస్టు రాసినా కామెంటు వేసినా రీసెర్చి చెయ్యకుండా సాక్ష్యాలు లేకుండా నేనేదీ రాయను – అర్ధం చేసుకోండి!
  *
  2014లో విడిపోయాం,రెందేళ్ళు గడిచిన ఇప్పుడు 1965లో శ్రీశ్రీ అట్టా అన్నాడు,1950ల్లో పొట్టి శ్రీరాములు అమరుడైంది ఆంధ్రరాష్ట్రం కోసం కాదు,పిజ్జా బర్గర్లు ఇవ్వలేదని చచ్చాడు అనే విశ్లేషణలు ఎందుకు?అప్పుడూ ఇపుడూ విడిపోవటాన్ని సమర్ధించిన వాళ్ళూ వ్యతిరేకించిన వాళ్ళూ అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారు, తమిళుల నుంచి ఆంధ్రావాళ్ళు విడిపోయినప్పుడు కూడా తమిళుల్లో విభజనని సమర్ధించిన వాళ్ళూ ఉన్నారు,ఆంధ్రావాళ్ళలో వ్యతిరేకించిన వాళ్ళూ ఉన్నారు,అవునా కాదా?ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి.మళ్ళీ చెప్తున్నా చరిత్రలు తవ్వడం మొదలుపెడితే మీవైపునుంచి జరిగిన తప్పులూ బైటికి వస్తాయి,ఎందుకొచ్చిన గోల! కవులూ కళాకారులూ అందరివాళ్ళు,వాళ్ళని ప్రాంతాలకి పరిమితం చెయ్యడం అంటే వాళ్ళ రేంజిని తగ్గించి చిన్నబుచ్చడమే!
  *
  P.S:అసెంబ్లీ ద్వారా విడిపోవటం,ఆటికిల్ మూడుకి వెళ్ళడం గురించి కూడా ఇప్పుడు వాదనలు అనవసరం,అలా ఎందుకు వెళ్ళరనే చరిత్రా నాకు తెలిసిందే!మీ ప్రాంతపు సాహిత్యాన్ని వృద్ధి చేస్కోండి,ఎవరు వద్దన్నారు?శ్రీశ్రీ అనే కమ్యునిష్టు కవి ఆ భావజాలంతో కవిత్వం రాయడానికీ,ఆ భావ్జాలం గలవాళ్ళు అభిమానించడానికీ కూడ అతెలంగాణని తొక్కెయ్యాలనే హిడెన్ ఎజెండా ఉన్నట్టు ప్రస్తావిస్తూ మీ వ్యాసం మొదలైంది,అలాంటి ధోరణి ఇంకా మీలో ఉన్నా లేకున్నా నేను చేయగలిగింది లేదు – ఆత్మదీపోభవ!!

మీ మాటలు

*