అమ్మమ్మలు బతికించిన చరిత్ర

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నలుగురు కూచుని నవ్వే వేళల, నా పేరొకపరి తలవండి’ 

గుర్తొచ్చిన ప్రతిసారీ ఈ పంక్తి మాటల కందని మహా విషాదాన్ని మోస్తున్నట్టు, ఆ విషాదాన్ని చుక్క చుక్కలుగా మన గుండెల్లోకి జార్చుతున్నట్టు అనిపిస్తుంది. లోపల ఎక్కడో కలుక్కుమంటుంది. గురజాడవారి పూర్ణమ్మ కథలోని పంక్తి ఇది. తనను ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు మనస్తాపం చెందిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. దుర్గగుడికి వెళ్ళే నెపంతో బయలుదేరుతూ తోబుట్టువులను చుట్టూ కూర్చోబెట్టుకుని అప్పగింతలు చెబుతుంది. ఆ సందర్భంలో పై మాట అంటుంది.

ఏళ్ల తరబడి మన మధ్య గడిపిన రక్తబంధువులు హఠాత్తుగా తిరిగిరాని లోకాలకు తరలిపోయి కనుమరుగు కావడం ఆదిమదశనుంచీ మనిషిలో విషాదాన్ని గిలకొట్టుతూనే వచ్చింది. వారి స్మృతిని సజీవం, చిరంజీవం చేసే ఆలోచనలు అప్పుడే పుట్టాయి. అందులో భాగంగానే పితృదేవతలు అనే భావనా, పితృకర్మలూ విశ్వాసంలో భాగమయ్యాయి. ప్రపంచ పురాణగాథల కెక్కాయి. రక్తబంధువులందరూ ఏకశరీరంగా జీవించిన గణసమాజంలో ఈ విషాదవిశ్వాసాలు మరింత బలీయంగా ఉంటాయి. లిపి ఏర్పడని, లేదా లిఖిత సంప్రదాయం వేళ్లూనుకోని కాలంలో గణబంధువుల జ్ఞాపకాలను, చరిత్రను తరం నుంచి తరానికి అందించే బాధ్యతను మనిషి గళమే నిర్వహించింది. అలా అందించడం ఒక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ఇది ఏ ఒక్కచోటో కాదు, ప్రపంచమంతటా జరిగింది.

పైన పేర్కొన్న గురజాడ పంక్తిలోని విషాదం గణహృదయపు లోతుల్లోంచి పలుకుతున్న విషాదంలా నాకు అనిపిస్తూ ఉంటుంది. గణసమాజపు నుడికారం గురజాడ రచనల్లో ఎక్కువగా కనిపిస్తుందని  రాంభట్ల కృష్ణమూర్తి అనేవారు. కన్యాశుల్కం నుంచి అనేక ఉదాహరణలు ఎత్తి చూపేవారు.

అదలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, నలుగురూ కూర్చుని తమ పూర్వీకులను స్మరించుకునే గణ సంప్రదాయం రూట్స్ రచనలో రెండువందల ఏళ్ల క్రితం నాటి వంశ మూలాలను, మూలస్థానాన్ని కనిపెట్టే ఉత్కంఠభరిత ప్రయత్నానికి దారితీయించింది. స్థూలంగా కథ ఇదీ:  కుంటా కింటే అనే నల్లజాతి యువకుడు పశ్చిమ ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందినవాడు.  అతడు ఓ రోజున గిటార్ లాంటి వాయిద్యాన్ని తయారుచేసుకోడానికి కలప కోసం అడవికి వెళ్ళాడు. హఠాత్తుగా కొంతమంది అతనిపై దాడి చేసి వలేసి పట్టుకుని గొలుసులతో బంధించి ఓడలో అట్లాంటిక్ మీదుగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి తీసుకుపోయారు. అక్కడ మాసా జాన్ వేలర్ అనే తోటల యజమానికి బానిసగా  అమ్మేశారు. అతను కుంటా కింటేకు టోబీ అని పేరుపెట్టాడు. కుంటా కింటే తప్పించుకుని పారిపోవడానికి నాలుగుసార్లు విఫల యత్నం చేశాడు. అతనింక ఆ ప్రయత్నం చేయకుండా ఒక పాదాన్ని నరికేసారు. వైద్యవృత్తిలో ఉన్న వేలర్ సోదరుడు విలియం వేలర్ కొంత మానవత్వం ఉన్నవాడు. అతడు సోదరుడి చర్యను గర్హిస్తూ కుంటా కింటేకు వైద్యం చేసి అతడి ప్రాణాలు కాపాడాడు. సోదరునినుంచి తనే అతణ్ణి కొనుక్కుని గుర్రపు బండి నడపడానికి నియోగించాడు. తను ఏ విధంగానూ తన జన్మస్థానానికి వెళ్లలేనని గ్రహించిన కింటే పరాయి నేలలో ప్రవాసజీవితంతో క్రమంగా రాజీపడ్డాడు.

విలియం ఇంట్లో వంటమనిషిగా ఉన్న మరో బానిస బెల్ ను అతను పెళ్లి చేసుకున్నాడు. వారికి కూతురు పుట్టింది. ఆమెకు కిజ్జీ అని పేరుపెట్టారు. ఆమెకు వయసు వచ్చాక  మాసా లీ అనే మరో బానిస యజమానికి విలియం అమ్మేశాడు. మాసా లీ బలాత్కారంగా తనను అనుభవించడంతో కిజ్జీ గర్భవతి అయింది. ఆమెకు కొడుకు పుట్టాడు. అతని పేరు చికెన్ జార్జి. అతను పెరిగి పెద్దయ్యాక మటిల్డా అనే మరో బానిసను పెళ్లిచేసుకున్నాడు. అతని మూడో కొడుకు టామ్. అతనికి ఇరేన్ అనే అమ్మాయితో పెళ్లయింది. వారి కుమార్తెలలో ఒకరైన సింథియాకు విల్ పామర్ అనే అతనితో  వివాహం జరిగింది. వారి కూతురు బెర్తా, సైమన్ అలెగ్జాండర్ హేలీ అనే అతన్ని పెళ్లిచేసుకుంది. వారి కొడుకే రూట్స్ రచయిత ఎలెక్స్ హేలీ. కుంటా కింటేనుంచి అతనిది ఏడో తరం.

ఏడువందల పుటల ఉద్గ్రంథంలోని కథను పది పదిహేను వాక్యాలలో సంక్షేపించడం నిజానికి ఆ రచనకు తీరని అన్యాయం చేయడమే. సొంత మూలాలనుంచి వేరుపడి ఒక మహా సముద్రానికి ఆవల తమది కాని నేలపై తమది కాని భాషా సంస్కృతుల మధ్య బానిసజీవితం గడిపిన ఒక జాతి దుఃఖ విషాదాలకు అద్దంపట్టే రూట్స్ కు ఒక ఇతిహాసానికి ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి. రెండువందల ఏళ్ళకు విస్తరించిన ఆ కథాగమనంలో అనేక మలుపులున్నాయి, మెరుపులున్నాయి. కరుణ భీభత్స భయానకాది రసాలను ఆవిష్కరించే ఘట్టాలు ఉన్నాయి.  సొంత అస్తిత్వాన్ని కోల్పోయి పరాయి అస్తిత్వంలో అనామకంగా కలిసిపోయిన ఒక జాతి పరిణామచరిత్ర ఉంది. మనిషిని పశువుగా, ఆస్తిగా పరిగణించి అతని పేగు బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంచేసి ఇంకొకరికి అమ్మేసే బానిసవ్యవస్థలో చివరికి యజమానికీ బానిసకూ ఉన్న రక్తసంబంధాన్ని కూడా కాలరాసే కర్కశత్వం ఎంతగా రూపుకట్టిందో రూట్స్ చెబుతుంది. విచిత్రమేమిటంటే, దీని సామ్యాలు బానిసత్వం లేదా అర్థ బానిసత్వం కొనసాగిన మనదేశంతో సహా అనేక దేశాల బానిసవ్యవస్థలలో ఉన్నాయి. ఆసక్తికరమైన ఆ చర్చను మరో సందర్భానికి వాయిదా వేసి ప్రస్తుతానికి వద్దాం.

యజమాని పెట్టిన పెట్టుడు పేరును నిరాకరించిన కుంటా కింటే తన ఆఫ్రికన్ వారసత్వాన్ని కూతురు కిజ్జీకి అందించడానికి ప్రయత్నిస్తాడు. తన పేరుతోపాటు కొన్ని ఆఫ్రికన్ పదాలను ఆమెకు నేర్పుతాడు. ఉదాహరణకు, వర్జీనియాలో ప్రవహించే మట్టపోని అనే నదిని చూపించి ‘కాంబీ బొలోంగో’ అంటాడు. గిటార్ లాంటి ఒక వాయిద్యాన్ని చూపించి ‘కో’ అంటాడు. ఆ మాటలు రెండువందల ఏళ్లపాటు తరం నుంచి తరానికి అందుతూ ఉంటాయి. కిజ్జీ తన కొడుకు చికెన్ జార్జికి తాత, అమ్మమ్మల పేర్లు; తండ్రి తనకు చెప్పిన ఆఫ్రికన్ పదాలు అందిస్తుంది. తమ కుటుంబంలో బిడ్డ పుట్టిన ప్రతిసారీ కుటుంబ సభ్యులందరూ కూర్చుని కుంటా కింటేను, ఆ వంశం లోని మిగిలినవారిని తలచుకోవడం;  కుంటా కింటే అందించిన ఆఫ్రికన్ పదాలను గుర్తుచేసుకోవడం ఒక ఆనవాయితీగా మారుతుంది. ఇవే పేర్లు, పదాలు ఏడో తరానికి చెందిన రచయిత హేలీకి కూడా అందుతాయి. చిన్నప్పుడు టెన్నేస్సీ రాష్ట్రంలోని హెమ్మింగ్ పట్టణంలో తమ ఇంటి వసారాలో కూర్చుని అమ్మమ్మ సింథియా, మరికొందరు స్త్రీలు చెప్పుకునే  ముచ్చట్లనుంచి ప్రవహించిన ఆ పదాలు అతడు పెద్దయిన తర్వాత కూడా గుర్తుండిపోయాయి.

roots-vol-i-DVDcover

హేలీ తన పదిహేడో ఏట, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యు.ఎస్. తీర రక్షక దళంలో వంటశాలలో సహాయకుడిగా  నియమితుడయ్యాడు. ఓడలో ప్రయాణించేటప్పుడు తీరిక సమయంలో రచనాభ్యాసం చేస్తూ క్రమంగా రచయితగా మారాడు. ఇరవయ్యేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి రచననే పూర్తికాలవృత్తిగా చేసుకున్నాడు. రీడర్స్ డైజెస్ట్ లాంటి మ్యాగజైన్లు అతనికి రాత పనులు అప్పగించాయి. అలాంటి సందర్భంలోనే అతనొకసారి లండన్ వెళ్ళాడు. అక్కడ ప్రతిచోటా కనిపించే చారిత్రక సంపద చూసి ముగ్ధుడయ్యాడు. ఒక రోజు బ్రిటిష్ మ్యూజియంకు వెళ్ళి అక్కడ ‘రొసెట్టా శిల’ ను చూశాడు. ఎందుకో అది నా కళ్లను కట్టి పడేసిందని అతను అంటాడు. అప్పటికప్పుడు మ్యూజియం లైబ్రరీలో దాని గురించి రాసిన పుస్తకం సంపాదించి చదివేశాడు.

ఈజిప్టులో నైలు నదీతీరంలో దొరికిన ఆ శిలపై మూడు వేర్వేరు లిపుల్లో చెక్కిన అక్షరాలు ఉన్నాయి. మొదటివి తెలిసిన గ్రీకు అక్షరాలు . రెండోవి ఒక అజ్ఞాతలిపిలో ఉన్నాయి. మూడోవి ప్రాచీన చిత్రలిపిలో ఉన్నాయి. జీన్ చంపోలియన్  అనే ఒక ఫ్రెంచి పండితుడు తెలిసిన గ్రీకు అక్షరాలతో మిగతా రెండు లిపుల్లోని ఒక్కొక్క అక్షరాన్నే పోల్చి చూసి ఆ మూడు  రకాల అక్షరాలూ ఒకే విషయం చెబుతున్నాయని తేల్చాడు. ఆవిధంగా మానవాళి పురాతన చరిత్రను నమోదు చేసిన చిత్రలిపిని అతను ఛేదించగలిగాడు.

అలా గతం తలుపులు తెరచిన ఆ తాళంచెవి తనను మంత్రముగ్ధం చేసిందనీ, దాంతో తనకు ప్రత్యేక వ్యక్తిగత సంబంధం ఏదో ఉన్నట్టు అనిపించిందనీ, అయితే ఆక్షణంలో అది ఎలాంటిదో పోల్చుకోలేకపోయాననీ హేలీ  అంటాడు. న్యూయార్క్ కు తిరిగివెడుతూ విమానంలో కూర్చుని ఉండగా అతనికి ఒక ఊహ తట్టింది. ఆ ఫ్రెంచి పండితుడు, తెలిసిన గ్రీకు అక్షరాల సాయంతో ఛేదించిన ఆ అజ్ఞాత లిపులకూ; తన చిన్నప్పుడు హెన్నింగ్ లో తమ ఇంటి వసారాలో కూర్చుని అమ్మమ్మ సింథియా, మిగతా ఆడవాళ్ళు చెప్పుకున్న మౌఖికచరిత్రనుంచి దొర్లిన విచిత్ర, అజ్ఞాత ఆఫ్రికన్ పదాలకూ చూచాయగా ఏదో పోలిక కుదిరిందనిపించింది. వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. విమానం న్యూయార్క్ లో దిగబోతూ గాలిలో చక్కర్లు కొడుతున్న సమయానికి ఆ ఆలోచనలకు ఒక స్పష్టత వచ్చింది.   ఆ పదాలు నిర్దిష్టంగా ఏ ఆఫ్రికన్ భాషకు చెందినవి, ఆ భాషను కనిపెట్టగలమా అన్న ప్రశ్నలు అతని ముందు వేళ్లాడసాగాయి.

అక్కడినుంచి హేలీ చేసిన ప్రయత్నాలు అడుగడుగునా ఆసక్తిరేపే అపరాధపరిశోధక నవలను తలపిస్తాయి. చివరికి తన పూర్వీకుడు కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, రెండువందల ఏళ్లక్రితం ఆగిపోయిన అతని పూర్వచరిత్రను ఒక గాథికుని నోట ప్రత్యక్షంగా వినడం ఈ ఉత్కంఠభరిత గాథలో పతాక సన్నివేశం. దాని గురించి తర్వాత.

–కల్లూరి భాస్కరం

 

 

 

మీ మాటలు

  1. chintalapudi venkateswarlu says:

    Bhaskaramgaru !
    mee rachana chadivanu. bagundi. pracheena ganavyavasthaku, gurajadavari poornammaku mudi baga pettaru. idi meeloni prapancha sahityamanta okate, annitikee linkulu unnayane abhiprayaniki balam chekurustondi. mari heli ammamma sinthiya matemiti? asalee padam ekkadidi?

మీ మాటలు

*