ఛానెల్ 24/7 -13 వ భాగం

sujatha photo

( గత వారం తరువాయి )

ఎంత ఏడ్చినా ఇదే జీవితం, తను ఎంచుకొన్న రంగుల స్వప్నం. డైరెక్టర్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, మేనేజర్, హెల్పర్ ఎవరైనా ఒకటే.. మగవాళ్లే.. అవకాశం దొరికితే ఎంజాయ్ చేద్దామనుకొనేవాళ్లే. ప్రేమలకు, ఆప్యాయతలకు, నమ్మకాలకు … శ్రీజ ఏడుస్తూనే వుంది.

“సారీ..సారీ..” అన్నాడు పూర్ణ లోగొంతుకలో.

ఎవ్వళ్లూ మాట్లాడలేదు.

“సరే పొండి. శ్రీజా కళ్లు తుడుచుకో అమ్మా” అన్నాడు ఎం.డి.

శ్రీధర్, శ్రీకాంత్ ఇద్దరూ కలిసి ఒకళ్ల చెయి ఒకళ్లు పట్టుకొని బయటకు వచ్చేశారు. బయటికి రాగానే నవ్వు మొహం పెట్టింది పి.ఏ.

“బాగా భోంచేశారా?” అన్నది నవ్వుతూ.

ఇప్పుడు నవ్వారు ఇద్దరూ మనస్ఫూర్తిగా.

“ఏరా” అన్నాడు ప్రేమతో శ్రీధర్.

వెనకనుంచి అరిచి చెప్పింది సరిత.

“శ్రీధర్‌గారూ,  మీకోసం అనంతాచార్యులుగారు మీ క్యాబిన్‌లో వెయిట్ చేస్తున్నారు. మీరు రమ్మన్నారట కదా”

శ్రీధర్, శ్రీకాంత్ వైపు చూసి గట్టిగా నవ్వాడు.

“ఏరా. చారిగారు నీ జాతకం మార్చేస్తానన్నారా?” అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్.

“నాది కాదురా. నీ బుద్ధి మార్చాలని రమ్మన్నా” అన్నాడు శ్రీధర్.

ఇద్దరూ ఫస్ట్‌ఫ్లోర్‌లోకి వచ్చారు. శ్రీధర్ కాబిన్‌లో కళ్ళు మూసుకొని కూర్చుని వున్నాడు అనంతాచారి.

“నమస్కారం శ్రీధర్‌గారూ, నా జాతకం ఎప్పుడు చూస్తారు?” అన్నాడు.

శ్రీకాంత్, శ్రీధర్ ఇద్దరూ కూర్చున్నారు.

“కాఫీ తాగుతారా?” అన్నాడు శ్రీధర్.

బాయ్‌ని కాఫీ తెమ్మన్నాడు శ్రీకాంత్.

“సర్. చారీగారూ బావున్నారా?”

“ఏం బాగు శ్రీధర్‌గారూ. ఎండిగారు దయదల్చినా మీరు కళ్లు తెరవలేదు” అన్నాడు చారి.

శ్రీధర్‌కి ఎండిగారి తల పగలకొట్టాలన్న కోరిక చాలా బలంగా కలిగింది.

ఈ చారిని తనపైకి తోలటమేమిటి..? చారికి జాతకం స్లాట్ ఫ్రీగా కావాలి. అందులో గ్రహబలం, జాతకాలు లైవ్‌లో చెపుతానంటాడు. ఉదయం ఐదునుంచి ఆరు వరకూ. ఎండిగారికి ఆ స్లాట్ ఫ్రీగా ఇవ్వటం ఇష్టం లేదు. చారిని డబ్బు అడగటం ఇష్టం లేదు. చారికార్పొరేట్  స్వామీజీ. ఫేమస్ పర్సనాలిటీ. ఇటు రాజకీయరంగం, సినిమా రంగం, వ్యాపారం అన్నింటిలోనూ ఆయన పరిచయాలు ఎక్కువే. ప్రతివాళ్లకీ ఆయనే ముహూర్తం పెట్టాలి. సినిమావాళ్లను లైవ్‌లోకి తెస్తాను. మీకు రేటింగ్ వస్తుంది అంటాడాయన. ఎవ్వళ్లు స్పాన్సర్ చేసినా ఆ డబ్బంతా తనే వుంచుకోవాలని చారి ప్లాన్. అందులో సగమైనా తనకో, చానల్‌కో రావాలని ఎండి ప్లాను. ఇద్దరు  మధ్యలో తనతొ[ ఆడుకుంటున్నారు.

“మీకోసం ఉంగరాలు తెచ్చాను చూడండి. ఇది పూర్తిగా రాయితో మలిచారు. ఇవి హృషికేష్ నుంచి రెండే వచ్చాయి. ఒకటి మీ ఆవిడకు, ఒకటి మీకు” అన్నాడు అవి చేతికిస్తూ.

“ఇంకోటి.. కిందటిసారి మనసు బావుండలేదు. ఇవ్వాళ మీతో మాట్లాడలేనన్నారు కదా. అలా మనసు బావుండటం లేదంటున్నారని… అందుకే మీకోసం త్రివేణీ సంగమంలోని మట్టి తెప్పించాను. ఇది మీ దగ్గర వుంచుకోండి. అన్ని టెన్షన్లు పోతాయి” అంటూ ఒక ప్లాస్టిక్ సంచిలో గుప్పెడూ మట్టి  శ్రీధర్ ముందు ఉంచాడు.

“ఆ ఉంగరం వేలికి పెట్టుకోండి. హెడ్డయిపోతారు” అన్నాడు చారి.

“అంటే ఎండిగారిని పంపేస్తున్నారా మీరిద్దరూ” అన్నాడు వెంటనే నవ్వుతూ శ్రీకాంత్.

చారి ఉలిక్కిపడ్డాడు. చిరాగ్గా శ్రీకాంత్ వైపు మొహం చిట్లించి చూశాడు.

“అది కాదండి నా ఉద్ధేశ్యం. ఈయన మంచి స్థాయిలోకి వెళతారు అని”

శ్రీకాంత్ కొంటెతనానికి శ్రీధర్‌కు ఆపుకోలేనంత నవ్వొచ్చింది.

ఇంకా నయం మట్టి గురించి ఏం వాగలేదు  నయం అనుకొన్నాడు. అతని ఆశ నిరాశే అయింది.

శ్రీధర్ మట్టి సంచి  చేత్తో పట్టుకొని అటూఇటూ తిప్పి చూశాడు.

“ఈ మట్టితో టెన్షన్లు పోతాయా?” అన్నాడు.

చారి మొహం వికసించింది.

“నేను హామీ ఇస్తా. ఇది మూడు నదుల్లోంచి సాగరంలో ఆ పాయలు కలిసిన చోటు నుంచి తీసిన మట్టి. కాళ్లనొప్పులు, టెన్షన్లూ, చెప్పా పెట్టకుండా పారిపోతాయి.”

“ఏరా.. మరి నాలుగు బళ్లమట్టి తెప్పించి నేనో హాస్పిటల్ ఓపెన్ చేయనా? దిక్కుమాలిన తిట్లనుంచి తప్పించుకోవచ్చు. ప్రతివాడు ఉద్యోగం మానేయమనేవాడే. ఏమంటారు?” అన్నాడు చారి వైపు తిరిగి.

చారి పిడుగు పడ్డట్టు అయిపోయాడు.

ఇతను ఖాయంగా ఎగతాళి చేస్తున్నాడు.. కిం కర్తవ్యం”

అతన్ని, శ్రీధర్‌ని తిప్పి తిప్పి చూసి నవ్వాడు చారి.

వచ్చేటప్పుడు టైము, లగ్నం సరిచూసుకునే ఛానల్‌లోకి అడుగుపెట్టాడు తను. మరి ఈ దుష్టగ్రహం శ్రీకాంత్ ఎలా తగిలాడో అర్ధం కాలేదాయనకు.

“మా శ్రీకాంత్ చేయి చూడండి” అన్నాడు శ్రీధర్ నవ్వుతూ.

“మీ పుట్టిన టైమ్ ఖచ్చితంగా కావాలండీ” అన్నాడు చారి.

“మా అమ్మనడగాలి” అన్నాడూ శ్రీకాంత్.

అమ్మ గుర్తొచ్చింది శ్రీకాంత్‌కి.

“నాన్నా బంగారం. నీకోసం ఎన్ని పూజలు చేశానురా. మన పొలంలో నాగేంద్రుడి పుట్ట వుందా? ఆ పుట్ట చుట్టూ  ప్రదక్షిణలు  చేసేదాన్ని. నేను పుట్ట తడిపి పూజ చేసి ప్రదక్షిణాలు  చేసేదాన్ని. నేను పుట్ట తడిపి పూజ చేసి ప్రదక్షిణాలు చేసేవేళకు ఆ దూరంగా ఒక నెమలి పురివిప్పి ఆడుతుండేదిరా నాన్నా.. ఈ పొద్దుటి పొద్దుటే నెమలి ఆడేవేళకు మన పొలం గట్టుపై గుడిసె వేసుకొన్న సన్నాయి తాత సన్నాయి ఊదేవాడురా. ఆ పాట, నెమలాట, పుట్టలోని సామి దయ నువ్వు పుట్టేవురా శ్రీకాంత్. నీకందుకే పాటలొచ్చు. ఇన్ని మాటలొచ్చు. దేవుడి దయతో పుట్టావు నాన్న. నీకు దేవుడంత మంచి మనసుందిరా. నా తండ్రి పెద్దాడై పెళ్లి చేసుకొని బిడ్డల్ని కనేదాకా నేను కష్టపడగలనురా” అనే తల్లి తనను తడిమిన గరుకు చేతులు గుర్తొచ్చాయి.

పొలం పని చేసి చేసి గరుకు చేసిన చేతులు, కాయకష్టంతో నల్లరూపు పడ్డ మొహం, తన యూనివర్సిటీ చదువు అయ్యేలోపున అర్ధాంతరంగా వెళ్లిపోయిన ఆమె రూపం కళ్లముందు కదలాడింది శ్రీకాంత్‌కి. ఉన్న ఎకరం పొలం గట్టునే పాకలో ఇప్పటికీ కాపురం వుండే తండ్రి గుర్తొచ్చాడు. సన్నాయి తాత మనవరాలు చేసిపెట్టే జొన్నరొట్టె, కారం పచ్చడి ఇష్టంగా తినే తండ్రి తలపుకొచ్చాడు. తనని చూడగానే అమ్మా పాప, అన్నాయికి ఇంకో రొట్టే ఇస్తావా? అన్న తండ్రి గొంతు, ఆ పాప అనిపించుకొన్న పాతికేళ్ల మీనాక్షి మొహం కదలాడింది. అన్నాయికి రొట్టెలెందుకు పెదనాన్నా, నేనింటికి తీసుకుపోతా. ఆడ ఏం తిన్నాడొ ఏమో. నేను మంచిగా వండి పెడతా అంటున్న మీనాక్షిని తను అందరి అమ్మాయిల మొహాల్లో చూడగలడు. మాట్లాడితే ఏడుపులు ఏడ్చి విసిగించే శ్రీజలో తనకు మీనాక్షి కనిపించదా?”

ఊరికి దగ్గరగా వున్న పొలం, పొలం చివర్లో రెండు నిట్టాడి గుడిసెలు, రెండు కాపురాలు.  ఒకదాంట్లో తండ్రి, ఇంకోదాన్లో సన్నాయి తాత కుటుంబం. ఊర్లో ఏ పెళ్లి పేరంటం జరిగినా, సన్నాయి తాత గ్రూపు మేళం. ఆయన కూతురు కూతురు మీనాక్షి. తల్లి పోయాక తాత కుటుంబమే తనకూ, నాన్నకు బంధువులు. సెలవుల్లో ఆ అమ్మాయి చేతి వంట తినే ప్రాణి తను. ఆ అమ్మాయి ఒక్కోసారి తల్లిలాగ, చెల్లెలాగా, తన చిన్న చిన్న బహుమతులకు సంబరపడే పాపలాగా కనిపిస్తూ వుంటుంది. సాయంత్రంవేళ, ఉదయంవేళ పాక బయట మంచంపైన పడుకొంటే సన్నాయితాత పాత, చుట్టూ జొన్నచేల పచ్చదనం, మీనాక్షి కబుర్లు, నాన్న ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఈ కాంక్రీట్ జంగిల్‌లో ఎలా వస్తాయి. తను అటుపోతే ఉద్యోగం ప్రాబ్లం, వాళ్లు ఇటు వస్తే వాళ్ల స్వేచ్చ పోతుంది.

“ఏంటి ఆలోచిస్తున్నారు?” అన్నాడు చారి.

“నా పుట్టినతేదీ రికార్డు చేసేంత చదువు లేదు మా అమ్మానాన్నకి. అటు ఇటూగా ఉదయం ఐదు ఆరూ మధ్య అంటూ వుంటుంది అమ్మ” అన్నాడు శ్రీకాంత్.

“వాడి జాతకం వాడే రాసుకుంటాడు. మనతో పన్లేదు శ్రీకాంత్‌కి” అన్నాడు శ్రీధర్.

“ఏంటండీ అలా గన్నారు? సార్‌కు నేను చెప్పకూడదా జాతకం?” అన్నాడు ముఖం మాడ్చుకున్న చారి శ్రీధర్‌ని చూస్తూ..

“అయ్యో అదేం లేదండీ” అన్నాడు శ్రీధర్.

“చారిగారూ సరదాగా అన్నాను. ఇవ్వాళ మీరు మా అమ్మని గుర్తుకు తెచ్చారు. ఏదో ఒక కోరిక కోరుకోండి  తీర్చేస్తాను” అన్నాడు శ్రీకాంత్.

అతని నవ్వు మొహం చూసి చారి నవ్వేడు.

“నా ఉదయం స్లాట్ గురించి సెటిల్ చేయండి. నేను ఎంత పాపులరో మీకు తెలుసు. చిన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా నన్ను కన్సల్ట్ చేయకుండా వుండరు.” అన్నాడు బ్యాగ్‌లోంచి ఆల్బం తీస్తూ.

“అబ్బే అవన్నీ ఇప్పుడు చూసే టైం లేదు. మీ కోరిక ఇదిగో ఈ శ్రీధర్ మనసుపెట్టి తీర్చాలని  మీ దేవుడ్ని నేనూ ప్రార్ధిస్తా” అన్నాడు శ్రీకాంత్.

“అంటే మీకు దేవుడు లేదా?” అన్నాడు చారి.

“అంటే నా దేవుడికంటే మీ దేవుడికి మీరు క్లోజ్ కదా. రోజూ పూజలు చేస్తూ వుంటారు. ఆయన ఇప్పటికే మెత్తబడి వుంటారు. నేనూ ఇంకో నాలుగు దణ్ణాలు పెట్టి మీ గురించి చెప్పుకొంటాను. అప్పుడు శ్రీధర్ మనసు మెత్తబడి మీ ప్రోగ్రాం ఓకే అయిపోతుంది” అన్నాడు.

చారి మొహం వికసించింది.

“శ్రీధర్‌గారూ మీరు ఓకే అనండి చాలు” అన్నాడు.

శ్రీధర్ కోపంగా చూశాడు శ్రీకాంత్ వైపు.

తను వప్పుకుంటే అయిపోతుందా? ఈ హాఫెనవర్ కమర్షియల్స్ సంగతి సెటిల్ చేయకుండా ఎండి వప్పుకుంటాడా? ఈ ప్రోగ్రాం జనం చూస్తారు. జాతకం, రేపేం జరుగుతుందో ఇవ్వాళే తెలుసుకోవాలనే ఆశ, మనకి ఎప్పుడూ మంచే జరగాలని ఎవరేనా చెప్పాలి లేదా ఆ చెప్పేవాటిలో మనకి నచ్చనివి తీసేసుకుని నచ్చేవే జరగాలంటే సిద్ధాంతిగారి సాయంతో పూజలు హోమాలు జరిపిస్తే సలక్షణంగా బతుకు గడిచిపోతుందనే కాన్సెప్ట్ ఎప్పుడూ వర్కవుట్ అవుతుంది.

దేవుళ్లకి దణ్ణాలు పెడితే, హోమాలు చేయిస్తే , తాయత్తులు కట్టుకుంటే, గ్రహపూజలు చేయిస్తే, గడిపే ప్రతి నిముషంలో మంచి ఘడియని ఒడిసిపట్టుకొని ఆ ఘడియలో తమకు అనుకూలమైన పనులు, లాభం వచ్చే పనులు మొదలుపెట్టి కోట్లు సంపాదించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో అంతెత్తున కూర్చోవాలని ఆశపడే మనుష్యులు ఉన్నంతకాలం చారికి ఢోకా లేదు.

 (సశేషం)

 

 

 

మీ మాటలు

*