ఎక్కడికో ఈ నడక!

poornima
ఆలోచనా దారాల వెంట
ఒక్కో పోగు లెక్కేస్తూ
నడుస్తున్నాను….
నడుస్తున్నాను
నిజానికి నాది నడకేనా?
ఎక్కడికో ఈ నడక
ఎడతెరిపిలేని ఆలోచనల నడక
అలా అనంతంలో నేనో
నాలో అనంతమో
ఏమో…చిక్కీ చిక్కని
చిదంబర రహస్యo
అదేదో తెలుసుకోవాలని
ఆశతో ఇంకో రెండడుగులు
ఈ ఆలోచనా సుడులు
నిరంతరం నాలో సంచరిస్తూ
అప్పుడప్పుడు నేను వాటిల్లో సంచలిస్తూ
కదిలే కెరటాలపై కలలధారలు
ఎప్పటికప్పుడు కొత్త నీరుని ఆస్వాదిస్తూ…
నేనే ఒక జాగృత స్వప్నాన్నో
స్వప్నకాల లిప్తావస్థకు సమాధానరూపాన్నో
స్వప్నంతో సంచరిస్తున్నానో
స్వప్నంలోనే చరిస్తున్నానో
ఎంత నడిచినా
అంతూ పొంతూ లేని నడక
నిజానికిది నడకేనా?
అక్కడిక్కడే తిరుగాడే చక్రభ్రమణమా?
చంచలమైన ఆలోచనల
అచంచల గమనమా ఇది!?
అలుపెరుగని ఆత్మశోధనల
ఆగని అంతర్మధనమా ఇది!?
ఏమో..
ఏదో ఒక దరి చేరితే కానీ తెలియదు
నడక ఆగితేకానీ  నిర్ణయం కాదు
నిర్ధారణకొస్తే కానీ నడక ఆగదు…

మీ మాటలు

 1. raghava charya says:

  నిర్ణయం, నిర్ధారణ లేక పోవడం వల్లనే.. నడక మొదలైందని మీ అనుమానమా.?

  ఆలోచన ఎప్పుడూ ఒక అభిప్రాయాన్ని కలిగిస్తుంది. దాన్నే నిర్ణయం అంటారు.
  సినిమా బాగుందనే అభిప్రాయంతో అది మంచి సినిమా అనే నిర్ణయానికి వస్తారు.

  అంటే అభిప్రాయాలు లేనప్పుడు లేదా కలగనప్పుడు మాత్రమే ఆలోచన తెగని దారం అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఆలోచన తన సహజ లక్షణం ప్రకారం అభిప్రాయాన్ని కలిగించినా, దాన్ని నిర్ణయంగా తీసుకుని దానికి మనసు కట్టుబడక పోయినా ….. ఆలోచన తెగదు. అలాగే మన నిర్ణయాలు, మన అనుభవానికి సమాంతరంగా లేకపోయినా ఆలోచన ‘అంతర్మధనం’ అవుతుంది.

  అంటే నిర్ణయం, నిర్ధారణ అనేవి మనకి ఎదురయ్యే జీవితానుభవాల ముందు తేలిపోతున్నట్టు తెలుస్తున్నపుడే “నడక” మొదలవుతుంది.

  ఏది ఏమైనా నడుస్తున్న మీకు బెస్ట్ విషెస్.

 2. Saikiran says:

  స్వప్నకాల లిప్తావస్థ అంటే అర్ధం కాలేదండి. లిప్తకాల స్వప్నావస్థ అని వ్రాయబోయారా?
  “అలుపెరుగని ఆత్మశోధనల / ఆగని అంతర్మధనమా” అన్నది కూడా అర్ధం కాలేదు. ఆత్మశోధనల అంతర్మథనం ఏమిటి?
  W/R-Saikiran

 3. సాయిపద్మ says:

  ఎంత నడిచినా
  అంతూ పొంతూ లేని నడక
  నిజానికిది నడకేనా?
  అక్కడిక్కడే తిరుగాడే చక్రభ్రమణమా?….

  పూర్ణిమ లెక్కల్లో మరో లెక్క తేలని కవిత ..బాగుంది ..నడక

  • jabalimuni says:

   గమ్యాన్ని నిర్దేసించు కొని నడక సాగిస్తే అది చక్ర భ్రమణముగా మారదు
   జాబాలిముని

 4. బాగుందండీ కవిత! గమ్యము నిర్దేశించుకోవడం, నిర్ణయించుకోవడం ఏ పయనములోనూ ఏ బాటసారికీ సాధ్యం కాదు. ఈ దారులన్నీ రాదారులైనా గోదారులైనా దారి చేసినవాడు, దారి చూపేవాడు వేరే ఒకడు,అసలా మాటకొస్తే నడిచేదికూడా నేనుకాను! పయనం చేయాలనే సంకల్పము, పట్టుదలా సడలకుండా ఉన్నప్పుడే పయనంలోనూ, నయనంలోనూ మదిలోనూ, మనుగడలోనూ సంఘర్షణ మొదలవుతుంది, అంతర్మథనం అంటే అదే! అంతర్మథనం అంటేనే ఒక పరిశీలన, పర్యవేక్షణ, ప్రయత్నము, ఆదిశంకరుడి నుండీ అన్నమయ్యదాకా రామచంద్రుడినుండీ రామదాసు దాకా అందరూ ఇది అనుభవించినవారే! మథనం జరిగితేనే హాలాహలమైనా అమృతమైనా పుట్టేది, పయనం తుదముట్టేది! అయితే ఇంతవరకే ఆగిపోకుండా ముందుకు కొనసాగితే పరిపూర్ణం, పయనమైనా పరిశోధన అయినా! అయితే నడక ఆగితే నిర్ధారణ జరగదు, నిర్ధారణ జరిగితే మీరు ఎంత ప్రయత్నించినా నడక ఆగదు! బాటసారీ! పయనించు.. పయనం కొనసాగించు! అభినందనలు!

  మొదటిసారిగా ఈ సాహిత్య సంచికను చూశాను ఈరోజు, చాలా బాగుంది, చూసిన కొద్దిలోనూ! వృత్తులు వేరైనా ప్రవృత్తి పవిత్రమైనది గా మలుచుకున్న వారికీ, దాన్ని వలచుకున్న వారికీ మనసా అభినందనలు!

 5. Poornima Siri says:

  ఇక్కడ కేవలం ఒక ఘటన గురించో,ఒక విషయం గురించో ప్రస్తావించలేదు…
  నా ఆలోచనలు ఇలా సాగాయి…అది ఋజుమార్గమే అని నేను విశ్వసించి నడిచాను కూడాను…
  కొన్ని ఆలోచనలతో కొన్ని అభిప్రాయాలు,ఎన్నో అభిప్రాయలతో కొన్ని నిర్ధారణలు,ఎన్నో పుంఖాను పుంఖాలు సార్లు గా తేల్చిన వాటివల్ల కొన్ని నిర్ణయాలు,మళ్ళీ వాటితో విభేదించే నిత్య నూతన సవాళ్ళు కొత్త ఆలోచనలు…మళ్ళీ అభిప్రాయాలు,నిర్ధారణలు,నిర్ణయాలు…ఇలా ఈ నడక సాగుతూనే ఉంటున్నట్టు అనిపిస్తూ..మళ్లీ మౌళికంగా అవే అంశాలు ,కేవలం సందర్భాలు వేరు.. అందువల్ల ఈ నడక ఆగదూ..ఎప్పటికప్పుడూ నిర్ధారణలు,నిర్ణయాలు మారుతూనే ఉంటాయి ,ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది,అందుకే అది చక్రభ్రమణం

  ఇక నేను వాడింది స్వప్న కాల లిప్తావస్త అనే పదాన్నే…
  నేను కలలో తేలియాడుతున్నానో…
  కలలో కదలాడే కల్పనకు రూపంగా మిగలనున్నానో
  అని నా భావన

మీ మాటలు

*