వీలునామా – 5 వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

సాయంకాలం విందు

 కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రమవుతూండగా ఫ్రాన్సిస్, జేన్ కలిసి రెన్నీ ఇంటికి చేరుకున్నారు. అక్కడందరూ తనని విచిత్రమైన కుతూహలం తో చూస్తారన్న సంగతి తెలిసినా, జేన్ కాసేపు పదిమందితో సరదాగా గడపాలని నిశ్చయించుకొంది.

విందన్న పేరేకానీ, ఎక్కువమంది ఆహూతులున్నట్టు లేదు. ఆడవాళ్ళైతే అసలు తను తప్ప ఇంకెవరూ రాలేదు. రెన్నీ భార్యా, కూతురు మాత్రం వచ్చి పలకరించారు. అనుకోకుండా ధనవంతుడవడంతో ఫ్రాన్సిస్ ని ఈమధ్య అందరూ ఏదో ఒక వంకన భోజనానికి ఆహ్వానించేవారే. అందరూ అతని తెలివితేటలనీ, అభిరుచులనీ కొనియాడేవారే!

రెన్నీ గారమ్మాయి, ఎలీజాకి పంతొమ్మిదేళ్ళు. అమాయకంగా వున్నా సాహిత్యంతో బాగా పరిచయం వున్నట్టు మాట్లాడింది. విధి వైపరీత్యంతో డబ్బంతా పోగొట్టుకున్న ఫ్రాన్సిస్ దూరపు బంధువు ఎలా వుంటుందోనన్న కుతూహలం పట్టలేకుండా వుంది. ఒక వీలునామా కోసం నిజంగా ఫ్రాన్సిస్ ఆ అక్క చెల్లెళ్ళలల్లో ఎవరినీ పెళ్ళాడకుండా వుంటాడా? మొదలైన ప్రశ్నలు ఆమె లేత మనసుని తినేస్తున్నాయి. జేన్ గురించి చెప్పమని తండ్రిని వేధించింది కానీ, రెన్నీ ఏమీ చెప్పలేదు. చాలా తెలివైనది, చాలా విచిత్రమైన అభిప్రాయాలున్న వ్యక్తి అని మాత్రమే చెప్పాడు.

ఆ రోజు విందులో జేన్ కి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన పబ్లిషరూ, ఎడినబరో కి చెందిన ఒక వకీలూ, ఒక పెద్ద వ్యాపారవేత్తా, ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళూ వచ్చారు.

“హ్మ్మ్మ్!! చాలా మామూలుగా వుందీవిడ, కనీసం ఇరవై యేడేళ్ళయినా వుంటాయేమో!” అనుకుని తృప్తిగా నిట్టూర్చింది ఎలీజా జేన్ ని చూడగానే.

“చూడడానికి మామూలుగానే వున్నా, ఏదో ప్రత్యేకత వుందీమెలో,” అనుకున్నారు అక్కడున్న మగవాళ్ళంతా. కథల్లో వుండే ఆడవాళ్ళలా, నాజూగ్గా, అమాయకంగా కాకుండా, ఆరోగ్యంగా, తెలివితేటలూ, లోకఙ్ఞానమూ వుట్టిపడే స్త్రీ మొహాన్ని అంత దగ్గరగా చూడడం ఆ వర్గంలోని మగవాళ్ళకి కొంచెం అరుదే మరి.

నిజానికి ఆరోజు ఆమె ఆత్మ విశ్వాసం దారుణంగా దెబ్బ తిని వుంది. నిరాశా నిస్పృహలతో కృంగి పోతుంది. మనుషుల మీదా వ్యవస్థ మిదా నమ్మకం సడలుతున్నట్టనిపిస్తోందామెకి. కానీ, మొహంలో అదేమీ కనబడకుండా, చిరునవ్వుతో అందరినీ హుందాగా పలకరించింది. ఆమె ప్రవర్తన చూసి రెన్నీ ఆశ్చర్యపోయాడు కూడా!

అతను ఉదయం చూసిన జెన్నీ కోపంగా ఆవేశంగా వుంది. ఇప్పుడు సౌమ్యంగా, తేటపడ్డ మొహంతో, నెమ్మదిగా వుంది. ఎలీజా పియానో మీద వాయించిన పాటను ఓపికగా, శ్రధ్ధతో విన్నది. మిగతా వారి మాటలనూ కుతూహలంతో విన్నది. పబ్లిషరు ప్రజల అభిరుచిని గూర్చి చెప్తూన్నాడు.

“మాల్కం! ఇప్పుడు రచనలతో డబ్బు సంపాదించాలంటే మతాన్ని ఎలాగో అలా కథలో జొప్పించాలి. విలన్లందరినీ హేతువాదులుగా, నాస్తికులుగా మార్చు. కథానాయికని నానా కష్టాలూ పెట్టు. ఆమెకొక ప్రేమికుణ్ణివ్వు. ఇద్దరూ క్రిస్టియన్ మతం పుచ్చుకోని భగవంతుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టగానే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్టు రాయి. ఆ పుస్తకం వేలల్లో అమ్ముడుపోకపోతే అప్పుడు నన్నడుగు! డికెన్సూ, థాకరే కంటే నీకెక్కువ పేరు రాకపోతే చూస్కో!”

“నీ మాటలకేమొచ్చెలే గానీ, మా చెల్లెలు, ఆన్, అదేదో పుస్తకం కొనమని ప్రాణాలు తోడుతుంది. అది అయిదు ప్రచురణలయిపోయిందట, నిజమేనా?”

“అవును! ఇప్పుడే ఆరో ప్రచురణ కూడా వేస్తున్నాం! నిజానికి ఆ పుస్తకం ఏమీ బాగుండదు, తెల్సా? అందులోనూ, ఆ అమెరికన్లు మాట్లాడే భాషా, అయ్య బాబోయ్! ఏం చెప్పమంటావు?”

“నిజంగా అమెరికన్లు ఆ పుస్తకాల్లో వున్నంత చెత్త భాష వాడతారంటావా? ఇహ అలాంటి భాష మాట్లాడే అమెరికన్లతో బ్రతకడం ఎలా వుంటుందో! ఊహకే అందదు కదూ? అందుకే నేనెప్పుడు ఇంగ్లీషు వాళ్ళ పుస్తకాలే చదువుతాను!”

ఎలీజా వచ్చి జెన్నీ పక్కన కూర్చుంది.

“మాల్కం కి సాహిత్యంతో చాలా పరిచయం వుంది తెల్సా? ఆయన పత్రికల్లో కూడ బాగా రాస్తారు.”

“చాలా చాలా ధన్యవాదాలు మిస్ రెన్నీ! వింటున్నారా పబ్లిషర్ గారూ! జేన్, ఈ పబ్లిషర్లకి రచయితలంటే ఎంత లోకువ తెలుసా? ఈ దరిద్రుడికి నేను కిందటి వారం పత్రికలో రాసిన వ్యాసం నచ్చలేదట. ”

“లేదు లేదు మాల్కం! నాకే కాదు నాన్న గారికి కూడా చాలా నచ్చింది. పడీ పడీ నవ్వారు!”

“వినవయ్యా పబ్లిషరూ! నీకు నచ్చనివి చాలా మందికి నచ్చుతాయి, తెలుసుకో మరి!”

“నీ హ్యూమరు చాలా ఫాషనబుల్ మాల్కం! కానీ, కొంచెం అతిగా అనిపిస్తుంది నాకు. ఈ మధ్య అసలు విషయం వదిలేసి ఎక్కడెక్కడివో కొటేషన్లు రాయడం, కథకి అవసరం లేని విషయాలని జొప్పించడం కూడా చేస్తున్నారు రచయితలు. పాతకాలం ఆవూ, తాడి చెట్టు వ్యాసాల్ల్లాగా…”

వాళ్ళ సంబాషణొదిలేసి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, జేన్, ఎలీజా!

“జేన్! నాకు రచయితలూ, పబ్లిషర్లతో మాట్లాడడమంటే భలే సరదా! అందులో మాల్కం వున్నాడు చూడు, జీనియస్! అయితే చాలా కరుగ్గా విమర్శిస్తాడనుకో!”

“నువ్వూ రాస్తావా ఎలీజా?” అడిగింది జేన్.

“ఆ, ఏదో కొంచెం కొంచెం. నాకు వచనం కంటే కవిత్వం ఇష్టం. ఏ పత్రికకీ పంపలేదనుకో. మా స్నేహితులకిస్తా చదవమని, అంతే. కొన్ని ఆడవాళ్ళ పత్రికల్లో ‘ఎల్లా’ అనే పేరుతో ఒకటి రెండు కవితలు పడ్డాయనుకో! ‘ఎల్లా’ పేరు బాగుంది కదూ?”

“అది సరే కానీ, కవితలు పత్రికల్లో వేసుకుంటే డబ్బొస్తుందా?”

“నువ్వు భలే డబ్బు మనిషిలాగున్నావే! అందుకే నువ్వు వ్యాపారం చేస్తే బాగుంటుందన్నారు నాన్న. కవితలు పత్రికలో వేసుకుంటే డబ్బేమీ రాదు, కానీ నేనెప్పుడూ ఆ విషయం ఆలోచించలేదు.”

“అదృష్టవంతురాలివి. డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు.” నిట్టూర్చింది జేన్. పబ్లిషరు వైపు తిరిగింది.

“మీరు కొత్త కొత్త నవలలేకాక కవితల పుస్తకాలూ వేస్తారా?”

“అమ్మో! ఈ ఎడిన్ బరో లో కవితల పుస్తకమా? కొంచెం కష్టమమ్మాయ్! పాత కవితలే మళ్ళీ మళ్ళీ వేస్తాం.”

“అవును మరి, లేకపోతే కాపీరైటు చెల్లింపులకి డబ్బు ఖర్చు కదా!” వేళాకోళం చేసాడు మాల్కం.

ఇంతలో శ్రీమతి రెన్నీగారొచ్చి జేన్ ని ఒక పాటేదైనా పాడమన్నారు. తనకి సంగీతం బొత్తిగా రాదని చెప్పింది జేన్. రెన్నీ గారి మిగతా చిన్నపిల్లలొచ్చి తల్లిని చుట్టు ముట్టారు.

జేన్ మొహమాటంగా వాళ్ళ చదువులూ, ట్యూషన్ మాస్టార్ల గురించీ వాకబు చేసింది.

“ఇక్కడే ఏదైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ట్యూషన్లూ చెప్పుకోవడానికి వీలవుతుందో! ఇంగ్లీషూ, లెక్కలూ బాగా చెప్పగలను!” సాలోచనగా అంది జేన్.

“ట్యూషన్లా? చిన్న పిల్లవి, నీ వల్లేం అవుతుంది చెప్పు? నా మాట విని ఎవరైనా పెద్ద వాళ్ళింట్లో ఆడపిల్లలకి చదువు చెప్పే గవర్నెస్ గా చేరిపో! మీ చెల్లాయిని కూడా అలా ఏదో ఒక ఇంట్లో చేరి పొమ్మను. ఇల్లు అద్దెకు తీసుకోవడమూ, నెలనెలా అద్దెకోసం తడుముకోవడమూ, ఎందుకొచ్చిన బాదరబందీ? లేదా ఏదైనా స్కూల్లో టీచరుగా చేరిపో! నీకు సంగీతం వచ్చా? రాకపోతే నేర్చుకోవచ్చు.”

“ఇప్పుడు నాకు సంగీతమెందుకులెండి. అసలు మా చెల్లాయిని ఒంటరిగా వదిలేసి ఎక్కడికీ వెళ్ళాలని లేదు. అయినా చూద్దాం, ఏమవుతుందో!”

“ఇవాళ పొద్దున్న రెన్నీ గారితో పిచ్చాసుపత్రి మేట్రన్ ఉద్యోగం గురించి మాట్లాడావట గదా? నన్నడిగితే అన్నిటికంటే అదే మంచిది. ఆలస్యం చేయకుండా నీ దరఖాస్తు పంపించేయి. జీతం తక్కువేననుకో. కానీ ఇహ వేరే దారి లేనప్పుడేం చేస్తాం!”

“అవును, నేనూ అదే అనుకుంటున్నాను.”

“రెన్నీ నీ కా ఉద్యోగం వచ్చేలా చేయగలరు. నువు చాలా తెలివైన దానివని అన్నారు నాతో.”

“తెలివితేటలే కాదు, నాకు ధైర్యమూ ఎక్కువే!”

“అన్నట్టు, ఎడిన్ బరో లో ఎక్కడ వుంటున్నావు?”

“ఈ వూళ్ళో నాకెవరూ తెలియదు. డబ్బు కూడా లేదు. అందుకే మా మావయ్య కొడుకు ఫ్రాన్సిస్ ఇంట్లోనే వుంటున్నాను.”

“ఏమిటీ? పెళ్ళి కాని ఆ బ్రహ్మచారి ఇంట్లో, వేరే తోడు లేకుండా వుంటున్నావా? నలుగురూ వింటే ఏమనుకుంటారు? ఏం పని చేసావు జేన్!”

బెదిరిపోయింది జేన్.

“ఏమోనండి! నాకేమీ తోచలేదు. ఎక్కడో వుండడమెందుకూ, మా ఇంట్లోనే వుండు అన్నాడు ఫ్రాన్సిస్. డబ్బు కలిసొస్తుందని ఒప్పుకున్నాను. మా వూరి మిస్ థాంసన్ ని సలహా అడిగాను కూడా! ఆవిడా పర్వాలేదంది!”

“మీ వూళ్ళో వుండే మిస్ థాంసనా? సరిపోయింది! అడక్కడక్క ఆవిడనే అడిగావా? ఆవిడదంతా ఉలిపికట్టె తీరు.”

“ఆవిడ ఎలాటిదైతే యేం లెండి! మమ్మల్ని చూసి జాలిపడకుండా ధైర్యం చెప్పింది  ఆవిడొక్కర్తే.”

“సరే, పోనీలే! అయిందేదో అయింది. ఇవాళ్టినుంచీ నువ్విక్కడ మాతో నే వుండు. మా అమ్మాయి ఎలీజా గదిలో సర్దుకోవచ్చు నాలుగురోజులు. ఇవాళ నువ్వు ఒంటరిగా ఫ్రాన్సిస్ ఇంట్లో గడిపావంటే లోకం కోడై కూస్తుంది!”

జేన్ ఒక్క క్షణం ఆలోచించింది.

“మీ సూచనకి ధన్యవాదాలు. నామీద ఏవైనా అపవాదులు రేగాల్సి వుంటే అవీ పాటికే పుట్టి వుంటాయి. ఇవాళ నేను కొంచెం సేపు ఒంటరిగా ఆలోచించుకోవాలి. రేపెలాగూ నేనీ వురునించి వెళ్ళేపోతాను.”

“రేపాదివారం. ప్రయాణాలు చేయకూడదు. కాబట్టి, నువ్వనుకున్నట్టే ఇవాళ ఫ్రాన్సిస్ ఇంట్లో వుండి, రేపు పొద్దున్నే ఇక్కడకొచ్చేయి. ఏదో ఒక వంకన ఎల్లుండి వరకూ ఇక్కడే వుండి అప్పుడు వెళ్దువుగాని.”

“అలాగే, శ్రీమతి రెన్నీ గారూ! మీరు నాపైన చూపించిన శ్రధ్ధా, కరుణా ఎప్పటికీ మరచిపోను. ఇవాళ రాత్రి మాత్రం ఒంటరిగా వుండాలని వుంది నాకు. మీరన్నట్టు రేపు ఇక్కడకే వచ్చి వుంటాను. మరి ఇక మేం బయల్దేరతాం!”

అందరికీ చెప్పి ఫ్రాన్సిస్, జేన్ లిద్దరూ ఇంటినించి బయటపడ్డారు.

“ఎలా అనిపించింది జేన్ నీకు వాళ్ళ ఇల్లూ, కంపెనీ? నాకసలు నిన్ను కనిపెట్టి వుండడానికే వీలవలేదు. అసలే కొత్త చోటు , ఏమైనా ఇబ్బంది పడ్డావా?”

“ఇబ్బందేమీ లేదు కానీ, చాలా అలసటగా వుంది. ఇప్పుడిక్కడ ఎల్సీ వుంది వుంటే ఎంత బాగుండేది. నేను మా ఇంటికెళ్ళిపోతా ఫ్రాన్సిస్!”

“అప్పుడేనా? ఇంకొద్ది రోజులుండు. నీ ఉద్యోగం కోసం ఇంకా గట్టిగా ప్రయత్నిద్దాం.”

“ఏమీ లాభం లేదు ఫ్రాన్సిస్! ఆ మేట్రన్ ఉద్యోగానికి ఒక దరఖాస్తు పడేసి నేను ఇంటికెళ్ళిపోతాను. నాకిక ఉద్యోగాల మీద ఆశ పోయింది. పిచ్చాసుపత్రి లో రోగులు బయటి ప్రపంచంలో వాళ్ళకంటే మూర్ఖంగా, కౄరంగా వుండరు కదా!”

“చూద్దాం! సోమవారం కూడా ఆలోచించి, మంగళవారానికి పంపుదాములే. నువ్వు అధైర్య పడకు.”

ఫ్రాన్సిస్ గొంతులో వినిపించిన ఆప్యాయతా, ఆశలతో కొంచెం తేరుకుంది జేన్. ఆయినా ఆ రాత్రి కూర్చుని మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తు రాసుకుంది.

ఆ రాత్రి మొదటిసారి మావయ్యని తిట్టుకుంది జేన్! అంతకుముందు ఆయన చూపించిన ఆప్యాయతా, చెప్పించిన చదువూ, అన్నీ గొప్ప అబధ్ధాలుగా అనిపించాయామెకి. అన్నిటికంటే, చెల్లెల్ని ఒంటరిగా ఒదిలి, తనూ దిక్కూ మొక్కూ లేని అనాథలా ఆ ఆస్పత్రిలో పడి వుండాల్సొస్తుందేమో అన్న ఆలోచన చాలా కలవరపెట్టిందామెని.

 ***

 మర్నాడు రెన్నీ కుటుంబంతో కలిసి చర్చి కెళ్ళారు ఫ్రాన్సిస్, జేన్. చర్చి లో ఫాదరు చేసిన బోధన ఒక్క ముక్క కూడా మనసులోకెక్కలేదు జేన్ కి. ఆమె మనసంతా ఆస్పత్రి చూట్టూ, అక్కడ తను చేయబోయే వుద్యోగం చూట్టూ తిరుగుతుంది.

ఆ తర్వాత రెన్నీ గారి ఇంట్లో సంభాషణంతా చర్చిల చుట్టూ, మతం చుట్టూ, మత బోధనల చుట్టూ తిరిగింది. జేన్ కి అవంతా ఎక్కువగా తెలియకపోవడం మూలాన, పెద్దగా పాల్గొనలేకపోయింది.

శ్రీమతి రెన్నీ ఆ రోజు జేన్ ని అక్కడే వుండిపొమ్మంది. జెన్నీ నిరాసక్తంగా ఒప్పుకుంది. ఫ్రాన్సిస్ వెంటనే జెన్నీని తాను ఎప్పుడూ వెళ్ళే చర్చి ఒక్కసారి చూపించి తీసుకొస్తానని అన్నాడు. మాట్లాడకుండా అతన్ని అనుసరించింది జేన్. అసలామెకి చర్చి మీదా, మతం మీదా పెద్ద నమ్మకమే లేదు. ఏదో అతని మాట తోసేయలేక వెళ్ళింది.

కానీ, ఆ రోజు మొదటిసారి ఆమె దేవుణ్ణి తనకు సహాయం చేయమని నిస్సహాయంగా అడిగింది. బయటికొస్తూ, నిస్సహాయ స్థితిలో మనిషి దేవుడి వైపు చూస్తాడు కాబోలు అనుకుంది.

రెన్నీ ఇంటికెళ్తూ దారిలో,

“ఫ్రాన్సిస్, నువ్వన్నట్టు రేపింకొక్కసారి ప్రయత్నిస్తాను. ఎక్కడా ఉద్యోగం దొరకకపోతే ఆస్పత్రికి నా దరఖాస్తు పంపుతాను. దైవ నిర్ణయం ఎలా వుంటే అలా జరుగుతుంది,” అంది.

సోమవారం మళ్ళీ జేన్ ఎడిన్ బరోలో తనకు తెలిసిన మరికొన్ని ఆఫీసులు చుట్టబెట్తింది. శనివారం లాగే, ఆ రోజూ ఆమెకి ఎక్కడా ఉద్యోగం వచ్చే సూచనలు కనిపించలేదు. ఆస్పత్రిలో మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తు పోస్టులో వేసి ఎడిన్ బరో వదిలింది జేన్.

 ***

 ఇంటికెళ్ళి జేన్ ఎల్సీతో తన ఎడిన్ బరో ప్రయాణమూ, ఉద్యోగాలకోసం వేటా, ఆస్పత్రిలో మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తూ, అన్నీ వివరంగా చెప్పింది. ఒకవేళ ఉద్యోగం వస్తే, జేన్ ఎంత దుర్భరమైన జీవితాన్ని గడపాలో తలచుకొని ఎల్సీ హడలిపోయింది.

“వొద్దు జేన్! నూవ్వా ఉద్యోగానికెళ్ళొద్దు. నేను ఎలాగైనా మనిద్దరికీ పొట్టపోసుకునే ఉపాయాలు వెతుకుతాను. నువ్వు మాత్రం ఒంటరిగా యేళ్ళ తరబడి ఆ ఉద్యోగంలో మగ్గి పోవడం నాకిష్టం లేదు!” ఎల్సీ వాపోయింది.

***

మీ మాటలు

*